సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయి అనుగ్రహసుమాలు - 356వ భాగం


ఖపర్డే డైరీ - నలభైఒకటవ భాగం

తరువాతి కాలంలో దాదాసాహెబ్‌గా వ్యవహరించబడ్డ గణేష్ ఎల్ఫిన్‌స్టన్ కాలేజీలో మొదట జూనియర్ టీచర్‌గానూ, తరువాత సీనియర్ టీచర్‌గానూ సంస్కృతాన్ని, ఇంగ్లీషుని బోధించాడు. ఈ భాషలతో పాటు గుజరాతీలాంటి ఇతర భాషల్లో కూడా అతడు ప్రావీణ్యతను కలిగి ఉండి అనర్గళంగా మాట్లాడటం గమనిస్తే అతను జన్మతః బహుభాషాకోవిదుడని చెప్పక తప్పదు. గ్రాడ్యుయేషన్ పూర్తయిన తరువాత, 1884లో న్యాయవాద పట్టా పొంది, వెంటనే లీగల్ ప్రాక్టీసు ప్రారంభించాడు. 1885 నుంచి 1889 వరకు మున్సిఫ్‌గా(జడ్జి) పనిచేసి, తరువాత బార్ కౌన్సిల్‌కు తిరిగి వచ్చి అనతికాలంలోనే ప్రఖ్యాత న్యాయవాదిగా పేరు గడించాడు. 1890 నుంచి అతను సామాజిక జీవనంలో కూడా పాల్గొని, జిల్లా కౌన్సిల్ ప్రెసిడెంటుగా ఎన్నుకోబడ్డాడు. ఆమ్రావతిలో 1897 భారత జాతీయ కాంగ్రెసు మీటింగులు జరిగినప్పుడు అతను రాష్ట్రీయ జీవనంలో ఒక గొప్ప వ్యక్తిగా గుర్తించబడి రిసెప్షన్ కమిటీకి ఛైర్మన్‌గా ఎన్నుకోబడ్డాడు. 

ఇప్పుడు మనం కాలంలో కాస్త వెనక్కి ప్రయాణించి, దాదాసాహెబ్ తన నిత్యజీవితంలోని విశేషాలతో ఎప్పటినుంచి డైరీ రాయటం ప్రారంభించాడో, అలాంటి డైరీలు ఎన్ని అందుబాటులో ఉన్నాయో తెలుసుకుందాం. 1879లో దాదాసాహెబ్ ఖపర్డే రాసిన పాకెట్ డైరీ లభించింది. అందులో కొన్ని ముఖ్యమైన విషయాలున్నప్పటికీ, కొన్ని కాగితాల్లోని వాక్యాలు అసందర్భోచితంగానూ, చాలా కాగితాలు ఖాళీగానూ ఉన్నాయి. దాదాసాహెబ్ ఖపర్డే తన స్వదస్తూరీతో 1894 నుండి 1938 వరకు రాసిన 45 డైరీలు లభ్యమయ్యాయి. మొత్తం 46 డైరీలూ ఇప్పటికీ నేషనల్ ఆర్కైవ్స్‌లో జాగ్రత్తగా భద్రపరచబడి ఉన్నాయి.

1879 ముందుగానీ లేదా 1880-1893 మధ్యకాలంలోగానీ ఆయన డైరీలు భద్రపరచిన ఆనవాళ్లు లేవు. 1894 నుంచి 1938 వరకు ఉన్న డైరీలలో, 1938వ సంవత్సరపు డైరీ మాత్రం భారతదేశంలోనే తయారుచేయబడిన 'నేషనల్ డైరీ'. మిగిలినవన్నీ విదేశాల్లో తయారుకాబడిన డైరీలే. వాటిలో నాలుగు డైరీలు 'కోలిన్స్ డైరీలు', మిగతావి 'లేట్స్ డైరీలు'. మొదటి ప్రపంచ యుద్ధకాలంలో 'లేట్స్ డైరీలు' లభ్యమయ్యేవి కావు. కనుకనే అతను కోలిన్స్ డైరీలు వాడవలసి వచ్చింది. ప్రతీ డైరీ 12.5" పొడుగూ, 8" వెడల్పూ, 4 పౌండ్ల 26 తులాల బరువూ కలిగివుండి, దినచర్య రాసుకోవటానికి వీలుగా ఒక్కొక్క రోజుకి ఒక్కో పేజీ కేటాయించబడివుండేది. దాదాసాహెబ్ ప్రయాణాల్లో తనతో పాటు డైరీని తీసుకువెళ్ళేవాడు. ప్రతిరోజూ రాత్రి పడుకోబోయేముందు ఆరోజులో జరిగిన విషయాలను విడమరచి రాసుకోవటం అతనికలవాటు. అతను ఈ నియమాన్ని శ్రద్ధగా పాటించేవాడు. ఎన్నోసార్లు తన దినచర్యను అర్థరాత్రి ఒంటిగంట, రెండుగంటలప్పుడు కూడా రైల్వే వెయిటింగ్ రూములో తను నిద్రపోబోయేముందు వ్రాసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. తరువాతి సంవత్సరాల్లో, రోజువారీ సంఘటనలు రాత్రి పడుకోబోయేముందు రాసుకోవటం ఇబ్బందిగా అనిపించడంతో అతను ముందురోజు జరిగిన సంఘటనలను మరుసటిరోజు ఉదయం రాయటం ప్రారంభించాడు. అందుకనే వాటిలో తనకొచ్చే స్వప్నాలూ, గాఢనిద్రల గురించిన ప్రస్తావనలున్నాయి. జరిగిన సంఘటన చిన్నదైనా, ముఖ్యమైనదైనా, నిత్యమూ వాటి గురించి రాసుకునేవాడు. తనని చూడటానికి వచ్చిన వారి పేర్లూ, వారి సంభాషణలోని సారాంశమూ, ముఖ్యమైన వ్యక్తులయితే వారి మాటలూ, ప్రశ్నోత్తరాల రూపంలో, వివరంగా, నిజాయితీగా, ధైర్యంగా, శుభ్రంగా, స్పష్టమైన చేవ్రాలుతో, ఎటువంటి కొట్టివేతలూ లేకుండా వ్రాయబడి ఉంది. అతను అనారోగ్యంగా ఉన్నా డైరీ రాయటంలో మాత్రం విఫలం కాలేదు. కేవలం తాను మరణించేరోజు, అంటే 1938 జులై ఒకటవ తారీఖునాడూ, అంతకుముందురోజు మాత్రం అతను డైరీ రాయలేదు. అతను చివరిసారిగా డైరీ రాసింది 1938 జూన్ 29న.

తరువాయి భాగం రేపు ......

source:  "దేవుడున్నాడు లేడంటావేం!" బై విమలాశర్మ.

2 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo