సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్త అనుభవమాలిక 6వ భాగం....


ఈరోజు భాగంలో అనుభవాలు:
  • బాబా ఎప్పుడూ మాకు తోడుగా ఉన్నారు.
  • చిన్ని ప్రార్ధనతో జలుబు నుండి విముక్తి.

బాబా ఎప్పుడూ మాకు తోడుగా ఉన్నారు.
సాయిభక్తురాలు శిరీష తన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు:
ప్రస్తుతం మేము చెన్నైలో నివసిస్తున్నాము. 10 ఏళ్ళ క్రితం మేము యూ.ఏ.ఈ. లో ఉండేవాళ్ళం. నా భర్త ప్రాజెక్ట్ పూర్తి కావడంతో మేము ఇండియా వచ్చేసాము. ఇక్కడకు వచ్చిన తరువాత మావారు చాలా ఉద్యోగప్రయత్నాలు చేసారు, కానీ ప్రయోజనం లేకుండాపోవడంతో మేము చాలా బాధపడ్డాం. అయితే బాబా ఎప్పుడూ మాకు తోడుగా ఉన్నారు. ఆయనే మా సంరక్షకుడు. ఆయనే అంతా చూసుకుంటారని విశ్వాసంతో 'నవ గురువార వ్రతం' మొదలుపెట్టాను. కొద్దిరోజుల్లోనే బాబా ఆశీస్సులతో మావారికి అంతకుముందు పనిచేసిన కంపెనీలోనే ఉద్యోగం వచ్చింది, అయితే ఈసారి ఇండియాలోనే. మా ఆనందానికి అంతేలేదు. ఒకటిన్నర సంవత్సరం పాటు ఆ కంపెనీలో పనిచేసిన తర్వాత కొన్ని కారణాల వలన మావారు ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి మళ్లీ ఉద్యోగప్రయత్నాల్లో పడ్డారు. ఎంతగా ప్రయత్నించినా ఉద్యోగం రాలేదు. మా జీవితంలో చాలా కష్టకాలమది. ఆ సమయంలో కూడా బాబా మాకు తోడుగా ఉన్నారు. ఆరునెలల పాటు ప్రయత్నాలు చేసాక చెన్నై విడిచిపెట్టి మా సొంత ఊరికి వెళ్లిపోయాం. అక్కడినుండి కూడా ఉద్యోగప్రయత్నాలు చేస్తున్నా లాభం లేకుండా పోయింది. నేను పూర్తి విశ్వాసంతో సాయిని ప్రార్థిస్తూ ఉండేదాన్ని. మావారు మళ్ళీ పాత కంపెనీకి దరఖాస్తు చేసుకున్నారు. వెంటనే సాయి మిరాకిల్ చూపించారు. ఒక్కరోజులో అంతా మారిపోయింది. మావారికి అదే కంపెనీలో నాలుగవసారి ఉద్యోగం వచ్చింది. మేము సంతోషంగా మళ్ళీ చెన్నైకి తిరిగి వచ్చాము. మా పాపకి తను అంతకుముందు చదివిన స్కూలులోనే సీటు వచ్చింది. మేము అదివరకు ఉండిన అపార్టుమెంటులోనే ఇల్లు కూడా దొరికింది. ఇదంతా సాయి తండ్రి వలనే సాధ్యమైంది. "థాంక్యూ సో మచ్ బాబా!"

చిన్ని ప్రార్ధనతో జలుబు నుండి విముక్తి:
సాయిభక్తురాలు స్మిత తన అనుభవాన్ని పంచుకుంటున్నారు:
బాబా భక్తురాలినైనందుకు నేనెంతో ధన్యురాలిని. జీవితంలో ఆశ కోల్పోతున్న ప్రతిసారీ ఆయన చూపే లీలలు తిరిగి జీవితంపట్ల ఆశను, నమ్మకాన్ని పెంచుతున్నాయి. సచ్చరిత్రలో చెప్పినట్లు గురువు లేని జీవితం, సరంగు లేని పడవప్రయాణం వంటిది. అక్కడ పడవ ఒడ్డు చేరుతుందనే ఆశలేదు. అలాగే బాబా లేని జీవితం గమ్యంలేని ప్రయాణం లాంటిది. నేనిప్పుడు ఒక చిన్న అనుభవాన్ని పంచుకుంటాను.

నాకెప్పుడు జలుబు చేసినా చాలా చాలా ఇబ్బందిపడతాను. అది నయం కావడానికి  కనీసం ఒక నెలరోజులు పడుతుంది. ఒకసారి నేను మా ఆఫీసులో ట్రైనింగులో ఉండగా నా సహోద్యోగి తీవ్రమైన జలుబుతో బాధపడుతోంది. తను రోజంతా నా పక్కనే కూర్చుని నాతో మాట్లాడుతూ ఉండటంతో ఆ జలుబు నాక్కూడా సోకింది. దాంతో తలనొప్పి, ముక్కుదిబ్బడ కూడా మొదలైంది. ఎప్పటిలాగే అది తీవ్రమవుతుందేమోనని చాలా భయపడ్డాను. ఎందుకంటే తర్వాత కొద్దిరోజుల్లో నేను చేయాల్సిన ఆఫీసు వర్కు చాలా ఉంది. ఆ భయంతో"బాబా! మీరు నా పక్కనే ఉండి జలుబు నుండి కాపాడండి" అని ప్రార్థించాను. అంతే! బాబా లీల చూపించారు. మరుసటిరోజు ఉదయం నేను లేచేసరికి జలుబు ఆనవాళ్ళు కూడా కనిపించలేదు. నేనస్సలు నమ్మలేకపోయాను. తర్వాత సంతోషంగా నా వర్కు విజయవంతంగా పూర్తి చేసుకున్నాను. "ధన్యవాదములు బాబా! మీ భక్తుల చేయి ఎప్పుడూ విడిచిపెట్టకండి. వాళ్ళ చిన్ని చిన్ని కోరికలు సైతం ప్రేమతో నెరవేర్చండి".

సాయిభక్త అనుభవమాలిక 5వ భాగం....


కఠిన సమయంలో ప్రతిక్షణం అండగా నిలిచారు బాబా

సాయిబంధువు సాయిసిరి తన అనుభవాన్ని పంచుకుంటున్నారు. 

2019, ఫిబ్రవరి 21న హఠాత్తుగా మా బాబుకి బాగా జ్వరం రావడంతో హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళాం. డాక్టరు పరీక్షించి కొన్ని మందులు వ్రాసిచ్చారు. ఆ మందులు వాడుతున్న తరువాత కూడా రాత్రి ఒంటిగంటకి బాగా జ్వరం రావడంతో, వెంటనే హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళాము. తెల్లవారుఝామున 3 గంటల వరకు పర్యవేక్షణలో ఉంచి, మందులు మార్చి ఇంటికి పంపారు. మరునాడు కూడా జ్వరం వస్తూపోతూనే ఉంది. ఆరోజు మా బాబు స్కూలులో డాన్స్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అక్కడికి తీసుకుని వెళ్తే కాస్త హుషారవుతాడని మా మామగారు వాడిని స్కూలుకి తీసుకుని వెళ్తానని పట్టుపడితే, ఇక చేసేదిలేక వాడిని స్కూలుకి తీసుకుని వెళ్ళాం. అక్కడ వాడికి బాగా వాంతులయ్యాయి. తరువాత నేను ఎదురుగావున్న నాగసాయి సుబ్రహ్మణ్యేశ్వర మందిరానికి తీసుకుని వెళ్ళాను. బాబా మందిరంలో ఉండే పూజారి బయటకు వచ్చి, "ఈ స్థితిలో బాబునెందుకు తీసుకొచ్చావ్? వెంటనే వాడిని హాస్పిటల్ కి తీసుకొనిపో" అని గట్టిగా అరిచారు. కనీసం బాబా దర్శనం కూడా చేసుకోనివ్వలేదు. మాములుగా ఆ పూజారి ఎప్పుడూ నాతో చాలా సౌమ్యంగా మాట్లాడతారు. కానీ ఆరోజు అలా మాట్లాడేసరికి నాకు బాధగా అనిపించింది. బాబునింక నేరుగా హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళాము. వెళ్తున్నప్పుడు వాడు తన చేయి నొప్పి పెడుతుందని బాగా ఏడ్చాడు. డాక్టర్లు అన్ని పరీక్షలు చేసి, "బ్లడ్ లో ఇన్ఫెక్షన్ ఉంది, నిమోనియా కూడా" అని చెప్పి 5 రోజులు హాస్పిటల్ లో ఉండాలని చెప్పి, బాబుని అడ్మిట్ చేసుకున్నారు. నేను చాలా భయపడుతూ ఉండగా వాట్సాప్ గ్రూపులో, "నేను నీతోనే ఉన్నాను" అని బాబా సందేశమిచ్చారు. అప్పుడు ఆలోచిస్తే బాబానే పూజారి ద్వారా మమ్మల్ని సరైన సమయానికి హాస్పిటల్ కి చేర్పించారనిపించింది. 5 రోజులు తరువాత డాక్టరు, "ఇంకేం ప్రాబ్లం లేదు. కొన్ని మందులిస్తాను, వాడండ"ని చెప్పారు. అయితే ఇంటికి వచ్చాక కూడా జ్వరం వచ్చింది. దాంతో మళ్ళీ డాక్టరు వద్దకు తీసుకుని వెళ్ళగా, "ఇన్ఫెక్షన్ తగ్గింది కానీ, నిమోనియా అలానే ఉంది. బహుశా మళ్ళీ అడ్మిట్ అవ్వాల్సి వస్తుంది. కానీ ఇప్పటికే బాబుకిచ్చిన ఇంజెక్షన్స్ వలన వాడి చేయి బాగా వాపు ఉంది. కాబట్టి మార్చి 4 వ తేదీ వరకు చూద్దామ"ని చెప్పి, యాంటీబయాటిక్స్ ఇచ్చారు. కొత్త మందులు వాడుతున్నా కూడా ప్రతి 8 గంటలకి ఒకసారి జ్వరం వస్తూనే ఉండేది. ఆరోజు రాత్రి కూడా జ్వరం రావడంతో నేను, "బాబా! ఏమిటింకా నా బాబుకి తగ్గట్లేదు? వాడికి తగ్గిపోతుందని ఏదో ఒక రూపంలో నాకు సంకేతమివ్వండి. లేకపోతే వాడి జ్వరం నాకివ్వండి" అని బాగా ఏడ్చి నిద్రపోయాను. మరునాటి ఉదయం మా అమ్మ 'సద్గురులీల' మ్యాగజైన్ వచ్చిందని నా చేతికిచ్చింది. నిజానికి నేనెవరికీ ఆ పత్రిక కోసం డబ్బులు కట్టలేదు, నా అడ్రసు కూడా ఇవ్వలేదు. ఇప్పటికీ అదెలా వచ్చిందో అర్థం కాలేదు. నేను, "వాడికి నయమైపోతుందని ఏదో ఒక రూపంలో హామీ ఇవ్వమ"ని బాబాని అడిగినందుకు బాబా అలా అనుగ్రహించారు.

తరువాత నేను మా ఇంటికి దగ్గరలో ఉన్న 'సాయిపథా'నికి రాత్రి 8 గంటల సమయంలో యాదృచ్ఛికంగా వెళ్ళాను. ఆ సమయంలో అక్కడ ఆరతి ఉంటుందని నాకు తెలియదు. నేను లోపలకి అడుగుపెట్టేసరికి "సాయి రహం నజర్ కరనా" ఆరతి పాట వస్తుంది. ఆ పాట ద్వారా నా బాబు విషయంలో బాబా అభయం ఇస్తునట్టుగా నాకనిపించి కాస్త ధైర్యం చేకూరింది. నేనలా ప్రతిరోజూ సాయిపథానికి వెళ్తూ అక్కడనుండి ఊదీ తెచ్చుకుని ఒక చిన్న డబ్బాలో పోస్తుండేదాన్ని. అలా చేస్తుండగా ఒకరోజు ఊదీ టేబులుపైన పడిపోయింది. ఒక్కక్షణం బాధగా అనిపించినా, క్రిందపడిన ఊదీనంతా తీసి మా బాబు శరీరమంతా పూసేసాను. ఆరోజు నుండి బాబుకి జ్వరం రాలేదు. మళ్ళీ చెకప్ కోసం వెళ్లాల్సిన శివరాత్రినాడు కూడా ఊదీ క్రిందపడిపోయింది. అప్పుడు కూడా బాబు శరీరమంతా ఆ ఊదీ రాసి సాయంత్రం హాస్పిటల్ కి బాబుని తీసుకుని వెళ్ళాను. డాక్టరు పరీక్షలు చేసి, "బాబుకి అంతా తగ్గిపోయింది. రిపోర్ట్స్ అన్నీ నార్మల్ గా ఉన్నాయి" అని చెప్పారు. నేను ఆనందంతో మనసారా, "చాలా చాలా ధన్యవాదాలు బాబా" అని చెప్పుకున్నాను. ఆరోజు ఊదీ క్రిందపడకుండా ఉంటే, నాకు బాబు శరీరానికి ఊదీ రాయాలనే ఆలోచనే వచ్చేది కాదు. బాబాయే ఊదీ క్రిందపడిపోయేలా చేసి, వాడి శరీరానికి రాసేలా ప్రేరణ ఇచ్చారు. "బాబా! నిజంగా ఆ కఠిన సమయంలో మీరే నాకు ప్రతిక్షణం అండగా నిలిచారు. మీ వల్లే నేను ధైర్యంగా ఉండగలిగాను. మీరు ఎప్పటికీ నాకు ఇలాగే తోడుగా ఉండండి".

నా దైవం సాయిబాబా


పేరు వెల్లడించని ఒక సాయిభక్తురాలు తన అనుభవాన్ని పంచుకుంటున్నారు.

నేను గత పది సంవత్సరాలనుండి సాయిబాబా భక్తురాలిని. నా జీవితంలో చాలా సాయి లీలలు చూశాను. నేనిప్పుడు మీతో ఈమధ్య జరిగిన రెండు అనుభవాల్ని పంచుకుంటాను.

మొదటి అనుభవం:

మా 7 నెలల పాప పడుకోవడానికి ఎప్పుడూ ఇబ్బందిపడదు. సాధారణంగా తనకు ఏదైనా నొప్పి కలిగితేగానీ ఏడవదు. అలాంటి పాప ఒకరోజు రాత్రి ఒంటిగంటన్నర సమయంలో ఏడవడం మొదలుపెట్టింది. ఆ సమయంలో ఇంట్లో పెద్దవాళ్లకి కష్టంగా ఉంటుందని చాలా ఆందోళనపడ్డాను. కానీ నేను ఎంతగా ప్రయత్నించినా తనని ఊరుకోబెట్టలేకపోయాను. ఆ అర్థరాత్రివేళ ఎవరినీ సహాయం కోసం పిలవలేని పరిస్థితి. ఇక ఆ నిస్సహాయస్థితిలో,  "బాబా! నా బిడ్డ ఏడవటం ఆపి, తను ప్రశాంతంగా నిద్రపోయేలా చేయండి" అని ప్రార్థించాను. బాబా కృపవలన 30 నిమిషాల్లో తను ప్రశాంతంగా నిద్రపోయింది. అప్పటినుండి తను నిద్రపోయే విషయంలో కొంత ఇబ్బందిపడుతోంది. "బాబా! మీరే తను ప్రశాంతంగా నిద్రపోయేలా అనుగ్రహించండి".

రెండవ అనుభవం:

నేను మా పాప పుట్టకముందు ఉద్యోగం చేసేదాన్ని. నా ప్రెగ్నెన్సీ సమయంలో చికిత్సలకు, డెలివరీకి అవసరమైన డబ్బులకి మావారి ఇన్సూరెన్సు ఉపయోగిస్తూ ఉండేవాళ్లం. అయితే అకస్మాత్తుగా 8 నెలల తర్వాత ఏవో కారణాలచేత కంపెనీ వాళ్ళు అప్పటివరకు చెల్లించిన మొత్తాన్ని తిరస్కరించారు. దాంతో మొత్తం ఎమౌంట్ మేము ఒక్కసారిగా కట్టాల్సి వచ్చింది. ఇక తప్పనిసరి పరిస్థితై ఆ ఎమౌంట్ కట్టడానికి నేను నా పాత ఇన్సూరెన్స్ ఉపయోగించాలని అనుకున్నాను. అయితే పెద్దసమస్య వచ్చి పడింది.  నేను ఆ ఇన్సూరెన్స్ పేరు, దానికి సంబంధించిన మెంబర్ ఐడి మర్చిపోయాను. గుర్తు చేసుకోవడానికి ఎంతగానో ప్రయత్నించాను కానీ గుర్తురాలేదు. మరీ పెద్ద మొత్తం కావడంతో అది తప్ప వేరే దారి కూడా కనిపించలేదు. ఇక, "సాయిబాబా! దయ చూపండి. నాకు కావలసిన ఇన్ఫర్మేషన్ దొరికితే నా అనుభవాన్ని బ్లాగు ద్వారా సాయిభక్తులతో పంచుకుంటాను" అని ప్రార్థించాను. ఆ సమయంలో అనుకోకుండా మహాపారాయణలో ఉన్న ఒక భక్తుని అనుభవం నా కంటపడింది. ఆరోజే అప్లోడ్ చేయబడిన ఆ అనుభవంలో ఆ భక్తుడు/భక్తురాలు ఏదో పోగొట్టుకొన్న సమయంలో తను సాయిబాబా సూచనతో స్తవనమంజరి పారాయణ చేయగా ఆ వస్తువు దొరికిందని చెప్పబడివుంది. అది చదువుతూనే నా శరీరం రోమాంచితం అయింది. అది బాబా సూచనగా భావించి నేను కూడా స్తవనమంజరి పారాయణ చేశాను కానీ, ఫలితం కనిపించలేదు. నేను చాలా నిరాశకు గురై, "దేవా! నేను నీ బిడ్డని కానా? ఎందుకు నా పట్ల పక్షపాతం చూపిస్తున్నావు? నా భక్తి స్వచ్ఛమైనది కాదా?" అని బాబాతో పోట్లాడుతుండేదాన్ని. ఆశ్చర్యం! బాబా అద్భుతం చూపించారు. ఒకరోజు మధ్యాహ్నం నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మాత్రమే కాకుండా, అందుకు అవసరమైన ఇంకా మొత్తం ఇన్ఫర్మేషన్ ని బాబా నా మొబైల్ లోనే చూపించారు. "థాంక్యూ సో మచ్ బాబా! మా పాపని ఆశీర్వదించండి. మా జీవితంలోని దుఃఖం అంతా తొలగించేయండి బాబా!"

భావూ రాజారామ్ అంబిక


భావూ రాజారామ్ అంబిక సతారా జిల్లా, వడుజ్ నివాసి. అతడు వడుజ్ లోని ప్రాథమిక ఆరోగ్యం మరియు ఇమ్యునైజేషన్ శాఖకు సంబంధించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పని చేసేవాడు. ఒకరోజు తనకి నాసిక్ జిల్లాకు బదిలీ అయినట్లుగా ఉత్తర్వులు రావడంతో అతడు చాలా అసంతృప్తి చెందాడు. ఎందుకంటే ఆ రోజుల్లో రవాణా సౌకర్యాలు అంతగా లేనందున అంతదూరం గుర్రపు స్వారీ చేస్తూ ప్రయాణం చేయడం ఎంతో శ్రమతో కూడుకున్నది. పోనీ ఉన్న చోటనే ఉండాలన్నా లేక వేరే ప్రాంతానికి మార్పించుకోవాలన్నా ఇన్ ఛార్జ్ అధికారులు బ్రిటిషు వారైనందున వాళ్ళని అభ్యర్థించినా వాళ్ళు పట్టించుకోరు. అదంతా వృధా ప్రయాస అని భావూ ఏం చెయ్యాలో అర్థంకాని గందరగోళంలో పడ్డాడు. అలాంటి సమయంలో బాబా దైవత్వం, దయ గురించి అతని చెవినపడ్డాయి. వెంటనే శిరిడీ వెళ్లి బాబాకు రెండు పైసల దక్షిణ సమర్పించి తన సమస్యలు విన్నవించుకొని, వాటిని పరిష్కరించమని అడగాలని నిర్ణయించుకున్నాడు.

అనుకున్న ప్రకారం శిరిడీ చేరుకుని ద్వారకామాయిలో ప్రవేశించాడు. బాబా ఒక మూల కూర్చుని ఉన్నారు. ఆయన ముందు కొన్ని భాక్రీలు ఉన్న చిన్న మట్టికుండ(కొలంబా) ఉంది. బాబాతో పాటు రెండు కుక్కలు ఆ మట్టికుండనుండి ఆహారాన్ని తృప్తిగా తింటుండటం చూసి భావూ ఆశ్చర్యపోతూ, "జనులు ఈయనను గొప్ప సత్పురుషుడని అంటున్నారు. కానీ ఇక్కడ ఇతను చొంగ కారుస్తున్న కుక్కలతో కలిసి భోజనం చేస్తున్నాడు. ఎలాగూ ఇప్పుడు నేనిక్కడకు వచ్చాను కాబట్టి, ఒక నమస్కారం చేసుకుని వెళ్ళిపోవడం మంచిది" అని అనుకున్నాడు. అంతలో బాబా భావూ వైపు తిరిగి చూసి, "నా రెండు పైసలు ఇప్పటికిప్పుడే నాకివ్వు" అని అడిగారు. ఆశ్చర్యంతో భావూ రెండు పైసలు బాబాకి ఇవ్వబోతూ తన మనస్సులో, "బాబా నిజంగా గొప్ప మహాత్ముడు. ఆయన సర్వాంతర్యామి. వడుజ్ నుండి బయలుదేరేముందు రెండు పైసల దక్షిణ ఆయనకి ఇవ్వాలని నేను చేసుకున్న సంకల్పాన్ని ఆయన తెలుసుకున్నారు" అని అనుకున్నాడు. అతని మదిలో తలంపు ముగిసేలోపే, అతడేదో ఆ మాటలు బిగ్గరగా బయటికి చెప్పినట్లుగా బాబా, "నేను గొప్ప మహాత్ముడినా, కాదా; నేను చొంగకారుస్తున్న కుక్కలతో తినడం - వీటితో నీకు ఏమిటి సంబంధం? నీవు దర్శనానికి వచ్చావు. దర్శనం కూడా చేసుకున్నావు. ఇదిగో ఈ భాక్రీ ముక్క తీసుకుని బయలుదేరు" అని సమాధానం ఇచ్చారు. బాబా అలా చెప్పి, కొలంబా నుండి ఒక ముక్క భాక్రీ తీసి భావూ మీదకు విసిరారు. అప్పుడు భావూ, "బాబా! మళ్ళీ మీ దర్శనానికి నేనెప్పుడు రావాలి?" అని అడిగాడు. అందుకు బాబా, "నీవు మళ్ళీ ఎందుకు రావాలనుకుంటున్నావు? ఏమైనా దర్శనం చేసుకోవాలనుకుంటే ఇప్పుడే చేసుకో!" అని బదులిచ్చారు. ఇక వేరే దారిలేక భావూ అక్కడనుంచి వెళ్ళిపోయాడు. తన తిరుగు ప్రయాణంలో "బాబా నన్నెందుకు మళ్ళీ రమ్మనలేదు?" అని తీవ్రంగా ఆలోచించాడు. కానీ కారణం అంతుబట్టలేదు. వడుజ్ చేరుకున్నాక తిరిగి తన ఉద్యోగవిధులలో చేరినప్పుడు తనకొక ఆసక్తికరమైన విషయం తెలిసింది. అదేమిటంటే, నాసిక్ కు బదిలీ అయిన ఉత్తర్వులు రద్దు చేసి, వెంటనే వడుజ్ తిరిగి వెళ్ళాలన్న ఉత్తర్వులు కూడా జారీ అయి ఉన్నాయి. అప్పుడు "మళ్ళీ నువ్వెందుకు తిరిగి రావాలనుకుంటున్నావు?" అన్న బాబా మాటలకు అర్థం భావూకు బోధపడింది. ఎందుకంటే అప్పటికే బాబా తన కోరికను అనుగ్రహించేశారు.

బాబా సర్వజ్ఞులు. భావూ ఎందుకు శిరిడీ వచ్చాడో ఆయనకు తెలుసు. సర్వశక్తిమంతుడైన బాబా భావూ బదిలీ పత్రాలను రద్దు చేసారు. బాబా సర్వాంతర్యామి, ఆయన కుక్కలు మొదలగు అన్ని జీవులలో కూడా ఉన్నారు. దురదృష్టవశాత్తు భావూ ఏ సంవత్సరంలో శిరిడీ వెళ్ళిందీ స్పష్టంగా తెలియలేదు.

'ఆయనే భయం, భయానికి కారణం, ఆయనే భయనాశకుడు'. అందుకే బాబాని 'భూతకృత భయనాశనా' అని పిలుస్తారు.

ఆయనకు జరుగుతున్నవన్నీ తెలుసు, ఎందుకంటే అందుకు కారణం ఆయనే కాబట్టి. జరిపించేది ఆయనే. చర్య, దాని ఫలితం ఆయనే.

మూలం: సాయి ప్రసాద్ పత్రిక, వాల్యూమ్ 33, నెంబర్.9 
రచన: శశికాంత్ పి. అంబిక.
Baba’s Divine Manifestations compiled by Vinny Chitluri

సాయితో ట్యూన్ అవ్వండి, సాయి అనుగ్రహం లభిస్తుంది!


కర్ణాటకకు చెందిన బాబా భక్తుడు డాక్టర్ జి.ఆర్.విజయకుమార్ ఇలా చెప్తున్నారు:

నేనిప్పుడే సారంగబాద్‌‌కి చెందిన సాయి సోదరుడు శ్రీ టి.ఏ.శ్రీరామనాథన్ వద్దనుండి ఒక లేఖ అందుకున్నాను. ఆ లేఖ యథాతథంగా క్రింద ఇవ్వబడింది.

"25 ట్యూన్ చేస్తే సిలోన్ రేడియో వస్తుంది - సాయితో ట్యూన్ అయితే సాయి అనుగ్రహం లభిస్తుంది"

ఎంత సత్యం ఈ మాటలు! 1982వ సంవత్సరంలో జరిగిన రెండు సంఘటనల నుండి నేను రక్షింపబడ్డ విషయం గుర్తుకువస్తున్నాయి. ఆ రెండు సందర్భాలలో బాబా అనుగ్రహం సమయానికి అందడం వల్లనే నేను రక్షింపబడ్డాను.

నేను కర్ణాటక మల్నాడ్ పరిసరాలలో పనిచేసేవాడిని. అక్కడ వర్షపాతం ఎక్కువ అన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఆ ప్రాంతంలో ఎటుచూసినా పచ్చదనం, సుందరమైన పర్వతాలు, అందమైన ప్రకృతిదృశ్యాలు ఇట్టే ఆకట్టుకుంటాయి. జూన్, జూలై, ఆగష్టు నెలల్లో వర్షాలతో చాలావరకు సూర్యుడ్ని అసలు చూడలేము.

1982, జులై 7 నా జీవితంలో చాలా అదృష్టవంతమైన రోజు. ఆరోజు నేను నా బుల్లెట్ బైక్ మీద ఎలెమడ్లు ఎస్టేట్ లో ఉన్న మా ఇంటినుండి 4 కిలోమీటర్ల దూరంలోని కరికొండలో ఉన్న ఆసుపత్రికి వెళ్తున్నాను. నేను కొండమీద ఎగుడుదిగుడుగా, వంకరటింకరగా ఉన్న రోడ్డుపై, దట్టమైన అడవి మార్గంగుండా వెళ్తున్నాను. నేను హెల్మెట్, రెయిన్ కోటు ధరించినా కూడా ఎడతెరిపి లేని వర్షంలో దాదాపు పూర్తిగా తడిసిపోయాను. ఉదయం 9 గంటలవుతున్నా ఇంకా మంచుగా కూడా ఉంది. నా పెళ్ళి తరువాత నేను బైకు వేగాన్ని 90 km నుంచి దాదాపు సగానికి తగ్గించాను. కొన్నిసార్లు అంతకన్నా తక్కువ వేగంతో నడుపుతున్నాను. నేను అలా నెమ్మదిగానే బండి నడుపుతుండగా, అకస్మాత్తుగా ఒక పెద్ద శబ్దం వినపడింది - ఒక పొడుగాటి భారీ వృక్షం వేర్లతో సహా పెకిలించబడి పడిపోతోంది. ఆ భయంకర శబ్దానికి నేను నిశ్చేష్ఠుడినై బైకు మీద అదుపు కోల్పోయాను. నన్ను రక్షించే దైవం కోసం 'సాయిరామ్' అని గట్టిగా అరుస్తూ నాకు తెలియకుండానే బ్రేకులు వేసాను. నా పని అయిపోయింది అనుకున్నాను. అదే సమయంలో ఆ చెట్టు పెద్ద శబ్దంతో రోడ్డుకు అడ్డంగా పడింది. నా బైక్ వెళ్ళి ఆ చెట్టుబోదెకు గుద్దుకుని, ఇంజన్ ఆగిపోయింది. నేను బండిమీదనుండి ఎగిరి క్రిందపడి, వెంట్రుకవాసిలో చెట్టుకు గుద్దుకోకుండా బయటపడ్డాను. అంతా క్షణాలలో జరిగిపోయింది. నిదానంగా లేచి చుట్టూ చూసాను. నిజం చెప్పాలంటే నాకు ఏ దెబ్బలూ తగలలేదు, బైకు కూడా కొంచెంగానే దెబ్బ తింది. అది చాలా పాతచెట్టు. వేగంగా గాలి వీచడం వలన, వర్షం వలన అది వేళ్ళతో సహా బయటికి వచ్చినట్లుంది. ఆ చెట్టు కాండము 5 అడుగులకంటే ఎక్కువ వెడల్పు ఉంది. దాన్ని చూస్తూనే నాకు వణుకుపుట్టింది. అదికానీ నా మీద పడి ఉంటే ఏమై ఉండేదో అని ఊహించడానికే భయంగా ఉంది. నాకు ఖచ్చితంగా తెలుసు, ఎల్లప్పుడూ నన్ను కాపాడే సాయి అనుగ్రహం వల్లనే సమయానికి బైక్ అకస్మాత్తుగా ఆగింది. అదే పెద్ద అద్భుతం. ఆ దగ్గరలో ఉన్న షాపుకి తిరిగివచ్చి, ఎస్టేట్ మేనేజరుకి ఫోన్ చేసి రోడ్డుకి అడ్డంగా పడిన చెట్టును తొలగించడానికి రెస్క్యూ టీమ్ ని పంపమన్నాను.

రెండవ అనుభవం:

3 నెలల తరువాత అలాంటి అనుభవమే మళ్ళీ నాకు జరిగింది. 1982 అక్టోబర్ 13న నేను నా మిత్రుడు డాక్టరు G.R.గణేశరావుని కలవాలనుకున్నాను. అతను నేనున్న ప్రదేశం నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న శాంతిగ్రామ్ అనే గ్రామంలో ప్రాక్టీస్ చేస్తున్నారు. నా బైక్ పనిచేయనందున, నేను మా కంపెనీ బైక్ (యజ్డీ) తీసుకుని, నా అసిస్టెంట్ మిస్టర్ మింగేలీ డిసౌజాతో శాంతిగ్రామ్ వెళ్ళాను. డాక్టరు గణేశరావుని కలిసి తిరుగు ప్రయాణమయ్యాను. నేను కొండదిగి, ఒక చిన్న వంతెనను దాటాలి. కొండమీద నుండి క్రిందకి బండి నడుపుతుండగా, అకస్మాత్తుగా బైక్ వంకరటింకరగా పోతోంది. అదృష్టవశాత్తు ఆ సమయంలో ట్రాఫిక్ లేదు. నాకు బైక్ మీద అదుపు తప్పింది. నేను భయంతో ఒళ్ళు తెలియనిస్థితిలో ఉన్నాను. నా అసిస్టెంట్ 'సార్! సార్!' అంటూ పెద్దగా కేకలు పెడుతున్నాడు. కానీ, నాకు ఏదీ వినపడటంలేదు. బండి వెళ్ళి వంతెనకి గుద్దుకుని మేమిద్దరం వెళ్ళి 50 అడుగుల క్రింద ఉన్న నీటి ప్రవాహంలో పడి చనిపోతామేమో అని అనుకున్నాను. బండి మీదనుండి క్రిందపడే లోపల నేను బాబా సహాయం కోసం అరిచాను. బండి వెళ్ళి ఆ వంతెనకి గుద్దుకుంది. మేము వంతెనకు కుడివైపు (రోడ్డువైపుకి) పడ్డాము. సాయినాథుని అనుగ్రహంవల్ల మేమిద్దరం రక్షింపబడ్డాము. అసలు విషయం ఏమిటంటే, బైకు వెనకాల టైరు పంక్చర్ అయినందున బండి అలా అడ్డదిడ్డంగా వెళ్ళింది.

కొంతకాలం తరువాత ఒక ఫారెస్ట్ గార్డు యజ్డీ బైకు మీద వెళ్తుంటే, వెనక టైర్ పంక్చర్ అయ్యి వంతెనకు గుద్దుకుని తక్షణమే చనిపోయాడు.

సాయితో ట్యూన్ అవ్వండి, సాయి అనుగ్రహం లభిస్తుంది!

మూలం: సాయిలీలా పత్రిక, డిసెంబర్ - 1983.

నా పిల్లలపై బాబా ఆశీస్సులు


ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.

నేను చాలా సంవత్సరాలుగా బాబా భక్తురాలిని. ఎప్పుడైనా మనసులో ఆందోళనగా ఉన్నా, మార్గం కనబడకపోయినా, సాటి సాయిభక్తుల అనుభవాలను బ్లాగులో చదవడం వలన తిరిగి మనసులో విశ్వాసం సంతరించుకుంటుంది. బాబా ఉన్నారు, ఆయన సరైన మార్గంలో నడిపిస్తారు అనే ధైర్యం కలుగుతుంది. నేనిప్పుడు రెండు అనుభవాలను మీతో పంచుకుంటాను.

మొదటి అనుభవం:

బాబా కృపవలన మా అమ్మాయి చాలా తెలివైనది. తను సి.ఏ. చేసింది. మొదటి సంవత్సరంలోని సబ్జెక్టులన్నీ మొదటి యత్నంలోనే తను పూర్తి చేసింది. అయితే  చివరి సంవత్సరం కఠినమైనది కావడంతో తను ఒకే సబ్జెక్టులో రెండుసార్లు ఫెయిల్ అయింది. మళ్లీ ఆ పరీక్షల కోసం సిద్ధమవుతున్న సమయంలో తను మహాపారాయణ గ్రూపులో చేరింది. తన పారాయణ 36(3+6=9)వ అధ్యాయంతో మొదలైంది. అదేవారంలో తన హాల్ టికెట్ వచ్చింది. హాల్ టికెట్ నెంబరులోని సంఖ్యల మొత్తం కూడా 9. దాంతో అది బాబా ఇస్తున్న శుభసూచకంగా తను భావించి ఈసారి పరీక్షలో ఉత్తీర్ణురాలిని అవుతానని చాలా సంతోషించింది. తను పరీక్షకు వెళుతున్నప్పుడు కూడా చాలా చోట్ల బాబా దర్శనమిచ్చారు. తను పరీక్షలన్నీ బాగా వ్రాసింది. రేపు పరీక్షా ఫలితాలు వస్తాయనగా ముందురోజు రాత్రి తనకి కలలో బాబా నవ్వుతూ దర్శనమిచ్చారు.  ఆ దర్శనంతో తనలో ఉన్న భయం, ఆందోళన ఎగిరిపోయాయి. కానీ పరీక్షా ఫలితాలు చూసి తన గుండె బద్దలైపోయింది. ఎప్పటిలాగే తను ఆ ఒక్క సబ్జెక్టులోనే మళ్ళీ ఫెయిల్ అయింది. దాంతో బాబా ఇన్ని శుభసంకేతాలిచ్చిన తర్వాత కూడా ఇలా అయిందేమిటని తను చాలా క్రుంగిపోయింది. ఆ సమయంలో బాబా వేరే మార్గం చూపించారు. తను రీ-వాల్యుయేషన్ కి దరఖాస్తు చేసుకుంది. సాధారణంగా రీ-వాల్యుయేషన్ ఫలితాలు రావడానికి నెలరోజులు పడుతుంది. తోటి విద్యార్థులందరికీ వారివారి రీ-వాల్యుయేషన్ రిజల్ట్స్ వస్తున్నప్పటికీ తన విషయంలో మాత్రం చాలా ఆలస్యమైంది. దాదాపు నెల 15 రోజులు గడిచిపోయాయి. ఇక రాదేమో అని తను ఆశ వదులుకుని మళ్లీ పరీక్షకు ప్రిపేర్ అవ్వడం మొదలుపెట్టింది. అయితే బాబా కృప చూపించారు. ఒకరోజు తన ఇన్‌స్టిట్యూట్ నుంచి 'తను అన్ని సబ్జక్టులలో పాస్ అయింద'ని ఫోన్ వచ్చింది. ఇక తన ఆనందానికి అవధుల్లేవు. తరువాత తను మంచి మంచి ఆర్గనైజేషన్లలో జాబ్ కోసం ప్రయత్నించింది. కాల్స్ వస్తున్నా, ఇంటర్వ్యూలు జరుగుతున్నప్పటికీ ఉద్యోగం మాత్రం వచ్చేది కాదు.  ఇలా ఉండగా ఒకరోజు తను ఇంటర్వ్యూకి వెళ్తూ, "బాబా ఈ ఉద్యోగం ఎలాగైనా నాకు రావాల్సిందే" అని ప్రార్థించింది. తన ప్రార్థన బాబా విన్నారు. మంచి శాలరీతో తనకా ఉద్యోగం వచ్చింది.

రెండవ అనుభవం:

ఇక్కడ మా అమ్మాయి పై సమస్యలు ఎదుర్కొంటున్న సమయంలోనే మా అబ్బాయి కూడా కొన్ని సమస్యలను ఎదుర్కొన్నాడు. తను కాన్పూర్ ఐఐటీ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. నాలుగేళ్ల ఉద్యోగ అనుభవంతో యూఎస్ లో మాస్టర్స్ చేయడానికి వెళ్ళాడు. తను ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటుంటే, మొదట్లో అంతా సానుకూలంగా ఉండేది, కానీ చివరకు వచ్చేసరికి ప్రతికూలంగా జరిగేది. తనకన్నా తక్కువ క్వాలిఫికేషన్స్ ఉన్నవాళ్లకి కూడా ఉద్యోగాలు వచ్చి తనకి మాత్రం రాకపోయేసరికి తను చాలా ఆందోళనపడుతుండేవాడు. ఇద్దరు పిల్లల విషయంలో ఇలా జరుగుతుండటంతో నేను బాగా చలించిపోయాను. చాలాసార్లు బాబాపట్ల ఉన్న విశ్వాసం కూడా ఊగిసలాడేది. కానీ మన ప్రియమైన దయగల బాబా నా చేయి విడిచిపెట్టలేదు. బాబాకు నిజాయితీతో కూడుకున్న ప్రార్థన చాలు అని తెలిసినప్పటికీ నేను నా మనఃశాంతి కోసం మహాపారాయణ, స్తవనమంజరి పారాయణ, ప్రేయర్ గ్రూపులతో చేరి, రోజూ, "బాబా! నా పిల్లలపై మీ ఆశీస్సులు కురిపించండి" అని ప్రార్థిస్తూ ఉండేదాన్ని. చివరికి బాబా చల్లని ఆశీస్సులు కురిపించారు. మా అబ్బాయి గ్రాడ్యుయేషన్ పూర్తయ్యే సమయానికి బాబా రెండు ఉద్యోగ అవకాశాలు తన చేతిలో పెట్టారు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా!" మనమంతా సాయి బిడ్డలం. ఆయనెప్పుడూ మనల్ని కంటికి రెప్పలా కాపాడుతూనే ఉంటారు. ఆయనకు ఏదీ అసాధ్యం కాదు. కాబట్టి ఆయన పట్ల పూర్తి విశ్వాసంతో మీ భారాన్ని ఆయనపై వేసి శరణాగతి చెందండి. అంతా ఆయన చూసుకుంటారు.

నా ప్రశ్నలకు Q&A సైటు ద్వారా బాబా సమాధానాలు:


సాయిభక్తురాలు సింధు తన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.

నేను హైదరాబాద్ అమ్మాయిని. 2017 నవంబరు నెలలో బాబా నన్ను తన చెంతకు చేర్చుకున్నారు. బాబా ప్రతి ఒక్కరినీ ప్రేమిస్తుంటారని మనకు తెలుసు. కానీ, ఏదైనా చేస్తానని వాగ్దానం చేసి, దానిని మరచిపోతే మాత్రం ఆయన ఊరుకోరు. ఆయన ఏదో ఒక విధంగా మన మ్రొక్కులు స్వీకరించి మనల్ని ఋణవిముక్తులను చేస్తారు.

కొన్ని సంవత్సరాల క్రితం మా అమ్మ ఒక పని విషయంలో తను అనుకున్నట్లు జరిగితే శిరిడీలో బాబాకు తన మ్రొక్కు చెల్లించుకుంటానని వాగ్దానం చేసింది. తను కోరుకున్నది బాబా ఆశీస్సులతో నెరవేరింది. కానీ, ఆమె తన మ్రొక్కు తీర్చుకోలేదు. కొంతకాలం తరువాత బాబా నా సోదరి కలలో కనిపించి, "నీకు కావలసింది నేను ఇచ్చాను. మరి మీరు వాగ్దానము చేసిన నా బహుమతి ఎక్కడ?" అని అడిగారు. వెంటనే మేము శిరిడీ వెళ్లి మ్రొక్కు తీర్చుకున్నాము. బాబాకు ఏదైనా వాగ్దానం చేస్తే అది మరచిపోకుండా నెరవేర్చండి.

ఒకసారి నేను నాకు కావాల్సిన పని జరిగితే కొంత ఆహారాన్ని దానం చేస్తానని బాబాకు వాగ్దానం చేసాను. బాబా ఆ పనిని చేసారు కాని, నాకు నా వాగ్దానం గుర్తున్నా సోమరితనంతో దాన్ని నెరవేర్చలేదు. కొన్నిరోజులకి నాకు తీవ్రమైన కడుపునొప్పి వచ్చింది. ఎన్ని మందులు వాడినా, ఊదీ వాడినా నొప్పి తగ్గుముఖం పట్టలేదు. అప్పుడు నేను, "నా వాగ్దానాన్ని నెరవేర్చలేదు, అందువలనే నాకీ సమస్య" అని గ్రహించాను. ఆరోజు గురువారం. నేను కొన్ని బిస్కెట్ ప్యాకెట్లను కొనుగోలు చేసి బాబా మందిరానికి బయలుదేరాను. దారిలో ఆ బిస్కెట్లను కుక్కలకు పెట్టి నా వాగ్దానం నెరవేర్చుకోవాలని నేను అనుకున్నాను. నేను ఆటోలో మందిరానికి వెళ్లేసరికి మందిరం మూసివేయబడింది. మందిరం నుండి ఆటోస్టాండ్ వరకు దాదాపు ఒక కిలోమీటరు నడుచుకుంటూ వచ్చాను. కానీ అక్కడకు వచ్చాక, బాబా దర్శనం చేసుకోకుండా ఇంటికి తిరిగి వెళితే బాబా నన్ను తిరస్కరించినట్లుగా భావం కలిగి ఇంటికి వెళ్ళడానికి నా మనస్సు అంగీకరించలేదు. అప్పుడు సమయం 4.30 అయ్యింది. 5.00 గంటలకు గాని మందిరం తెరవరు. కాబట్టి నేను ఆటోలో మందిరానికి వెళ్లినా బయట వేచి ఉండాల్సి ఉంటుందని మళ్ళీ వెనుకకు తిరిగి నడిచి వెళ్ళాను. నేను మందిరం చేరుకునేసరికి 5.00 గంటలైంది. మందిరం కూడా తెరచి ఉంది. ఆశ్చర్యం ఏమిటంటే, నేను మందిరం నుండి ఆటోస్టాండుకి వెళ్లిరావడంలో నా కడుపునొప్పి తగ్గుతూ నన్ను అంతగా ఇబ్బందిపెట్టలేదు. మందిరానికి వెళ్ళే మార్గంలో కనిపించిన కుక్కలకు నేను తీసుకుని వెళ్లిన బిస్కట్లు పెట్టాను. ఆ రాత్రికల్లా కడుపునొప్పి పూర్తిగా తగ్గిపోయింది. అప్పుడు నాకు గుర్తుకొచ్చింది, కొన్ని నెలల క్రితం ఒకసారి నేను ఏదో విషయంగా క్వశ్చన్&ఆన్సర్ సైటులో బాబాని అడిగితే,  "సాయినాథుని ఆశీస్సులకోసం ప్రార్థించకపోతే కడుపునొప్పి తగ్గదు" అని వచ్చింది. ఆ సమయంలో నాకు నొప్పిలేకపోయినందున ఆ మెసేజ్ అర్థం కాలేదు. కానీ ఇప్పుడు అదే నిజమైంది. క్వశ్చన్&ఆన్సర్ సైటులో వచ్చే ఆన్సర్స్ ఖచ్చితంగా నిజం కావడం ఎన్నోసార్లు నా విషయంలో అనుభవమైంది.

కొన్ని ఇతర చిన్న అనుభవాలు:

1)ఒకసారి Q&A సైట్లో, "మీ సన్నిహిత స్నేహితుని నుండి ఒక ముఖ్యమైన సందేశాన్ని అందుకుంటారు" అని వచ్చింది. వెంటనే నా బెస్ట్‌ఫ్రెండ్ సోదరి వివాహం నిశ్చయమైంది అనే మెసేజ్ వచ్చింది.

2) ఒకసారి, 'నీ చేతికి కొత్త వస్తువు వస్తుంద'ని వచ్చింది. అలాగే నాకు కొత్త చార్జర్ వచ్చింది.

3) మేము ప్రతిరోజూ వీధికుక్కలకు ఆహారం పెడుతూ ఉండేవాళ్ళం. వాటిలో ఒక కుక్కపిల్లకు పిచ్చిపట్టి వీధిలో వెళ్లేవారిని, ఇతర కుక్కలను కరుస్తూ ఉండేది. దాంతో అందరూ దానిపై రాళ్ళురువ్వి తరుముతూ ఉండేవారు. పాపం, అది అప్పటికే అనారోగ్యంతో బలహీనంగా ఉంది. పైగా అక్కడక్కడా దాని చర్మం ఊడిపోయి రక్తం కారుతూ ఉండేది. నేను దాని పరిస్థితి చూడలేక కన్నీళ్లతో, "బాబా! దాని బాధను మేము చూడలేకపోతున్నాము. దానిని దూరంగా తీసుకునిపోండి" అని ప్రార్థించి, Q&A సైట్లో కూడా అడిగితే, "మీ సమయం వచ్చింద"ని బాబా సమాధానం వచ్చింది. ఆ రాత్రి 8 గంటలకు ఆ కుక్కపిల్ల మృతిచెందింది. నిజానికి దాని బాధ చూడలేక నేను, "ఈరోజే ఆ కుక్కపిల్ల చనిపోతే 10 కుక్కలకు తిండి పెడతాన"ని కూడా బాబాకు వాగ్దానం చేశాను. అలా జరగడానికి ఇది కూడా ఒక కారణం కావొచ్చు. తరువాత మిగతా కుక్కలకు  ఏ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండాలని ఊదీ పెట్టాను.

4) ఒకరోజు మా తాత ఆరోగ్యం దెబ్బతింది. ఇంట్లో అందరం చాలా బాధపడ్డాము. నేను Q&A సైటులో బాబాను అడిగితే, "నీవు విపత్తును అధిగమిస్తావు" అని సమాధానం వచ్చింది. వెంటనే నేను మా అమ్మతో కొంత ఊదీ పంపాను. దానితో ఆయన పూర్తిగా కోలుకున్నారు.

Q&A సైటులో సమాధానాలు కొన్నిసార్లు 3-4 వాక్యాలుగా వస్తాయి. మొత్తం సమాధానం మనకి సరిపోకపోవచ్చు. అందులో ఏదో ఒకటి మనకి సూటవుతుంది. కొన్నిసార్లు ఆ సమాధానం మనకి సంబంధం లేనట్లుగా ఉంటుంది. అయితే అది భవిష్యత్తులో జరగవచ్చు.

note: వారివారి విశ్వాసాన్ని బట్టి వాళ్ళకి అనుభవం కలుగుతుంది.

బాబా విశ్వానికంతటికీ తల్లి.


UK నుండి ఒక సాయిబంధువు తన అనుభవాన్ని పంచుకుంటున్నారు.

మొదటి అనుభవం:

ఒకరోజు నేను ఆఫీసునుండి కారులో ఇంటికి వెళుతున్నాను. ఆఫీసునుండి మెయిన్ రోడ్డు చేరుకోవడానికి ఒక మలుపు తిరగాల్సి ఉంది. నేను ఏవో ఆలోచనల్లో పడి ఎదురుగా వేగంగా వస్తున్న కారును గమనించకుండా మలుపు తిరిగాను. బాబా కృపవలన అంత వేగంగా వస్తున్నప్పటికీ ఆ కారు డ్రైవ్ చేస్తున్న వ్యక్తి చివరిక్షణంలో కారుని నియంత్రించడంవలన పెద్ద ప్రమాదం తప్పిపోయింది. నిజానికది నా తప్పిదమే. బాబా మాత్రమే ఆ ప్రమాదంనుండి నన్ను కాపాడారు. వెంటనే బాబాకు కృతజ్ఞతలు తెలుపుకున్నాను.  కానీ మనసులో కొంచెం ఆందోళనగా అనిపించి, "నాకు వ్యతిరేకంగా నా నిర్లక్ష్యపు డ్రైవింగ్ గురించి ఎవరూ ఫిర్యాదు చేయకుండా  ఉండేలా చూడండి బాబా! ఇకపై ఎప్పుడూ డ్రైవింగులో ఇంత నిర్లక్ష్యంగా ఉండను" అని ప్రార్థించాను. బాబా దయవలన ఎవరూ నా గురించి వ్యతిరేకంగా ఫిర్యాదు చేయలేదు. బాబా చేసిన సహాయానికి మళ్ళీ నేను బాబాకి కృతజ్ఞతలు చెప్పుకున్నాను.

రెండవ అనుభవం:

ఒకరోజు మా అబ్బాయి హాలిడే క్లబ్‌లో ఉన్నాడు. హఠాత్తుగా తనకు కడుపునొప్పి వచ్చిందని క్లబ్ నుండి ఫోన్ వచ్చింది. నేను వెంటనే గాభరాపడుతూ వెళ్లేసరికి తన పరిస్థితి చాలా దీనంగా ఉంది. వెంటనే నేను తనని డాక్టర్ వద్దకు తీసుకెళ్ళాను. డాక్టర్ చూసి, "అపెండిసైటిస్ లా ఉంది. మీరు త్వరగా హాస్పిటల్‌లో చేర్చండి" అని చెప్పారు.  ఆ మాట వింటూనే నేను భయంతో, "బాబా! అది అపెండిసైటిస్ కాకూడదు. ఆపరేషన్ ఏమీ అవసరంలేకుండా చూడండి" అని ప్రార్థించాను. చాలా సమయం వరకు మా అబ్బాయిని ఎమర్జెన్సీలో ఉంచి తరువాత వార్డులోకి మార్చారు. జూనియర్ డాక్టరు, "సర్జన్ వచ్చి మీ అబ్బాయిని పరీక్షిస్తే గానీ ఏమీ చెప్పలేమ"ని చెప్పారు. నాకేమీ తోచక ఆందోళనపడుతూ, "బాబా, తక్షణమే రండి! నాకు సహాయం చేయండి! ఈ నొప్పి నుండి నా బిడ్డని కాపాడండి" అని దీనంగా ప్రార్థించాను. బ్లడ్ శాంపిల్స్ తీయడంతో మా అబ్బాయి చాలా భయపడిపోయాడు. మళ్లీ తీస్తారేమోనని ఒకటే దిగులుపడుతూ ఉన్నాడు. తననలా చూసి నిస్సహాయంగా ప్రతిక్షణం, "బాబా! మిరాకిల్ చూపించండి. ఆ నొప్పినుండి తనని విముక్తి చేసి, కావాలంటే ఆ నొప్పి నాకివ్వండి" ప్రార్థిస్తూనే ఉన్నాను. అర్థరాత్రి అయ్యాక సర్జన్ వచ్చి తనను పరీక్షించడం మొదలుపెట్టారు. ఆ సమయమంతా 'సాయి, సాయి' అంటూ స్మరిస్తూనే ఉన్నాను. చివరికి సర్జన్, "మీ అబ్బాయికి ప్రాబ్లం ఏమీ లేదు. ఆపరేషన్ అవసరం లేదు" అని చెప్పి, కొన్ని మందులు ఇచ్చి డిశ్చార్జ్ చేసారు. నా సంతోషాన్ని మాటల్లో చెప్పలేను. బాబా నా ప్రార్థనలు మన్నించి మా అబ్బాయిని రక్షించారు. ఒక తల్లికి తన కళ్ళముందే తన బిడ్డ బాధపడుతూ ఉండటం కంటే బాధాకరమైన విషయం ఇంకోటి ఉండదు. మనమంతా బాబా బిడ్డలం. ఆయన ఈ విశ్వానికంతటికీ తల్లి. ఆయన కూడా మనం బాధపడుతుంటే చూడలేరు. "కోటి కోటి ప్రణామాలు బాబా! బాబా, మీ బిడ్డలందరినీ మానసికశాంతితో సంతోషంగా ఉండేలా ఆశీర్వదించండి".
సబ్ కా మాలిక్ ఏక్!

సాయిభక్త అనుభవమాలిక 4వ భాగం....


ఈరోజు భాగంలో అనుభవాలు:
  • బాబా కృపతో నా ఆరోగ్య సమస్య తీరింది. 
  • సాయి నా జీవితంలోకి వచ్చిన తీరు

బాబా కృపతో నా ఆరోగ్య సమస్య తీరింది. 

సాయిభక్తుడు తిరుపతిరావు రాజన్ తన అనుభవాన్ని పంచుకుంటున్నారు.
నేను చిన్ననాటినుండి బాబా భక్తుడిని. నా రోజు బాబా నామంతో మొదలయి, వెబ్ సైట్ లో భక్తుల అనుభవాలు చదవడంతో ముగుస్తుంది. ఒకసారి నా చేతులకి అలర్జీ వస్తే, నేను చాలా మందులు వాడాను. అయితే అది తగ్గడానికి బదులు రోజురోజుకీ పెరగసాగింది. దాంతో నేను ఒక స్కిన్ స్పెషలిస్టుని సంప్రదించాను. అతను, పెద్ద సమస్యలేమీ లేవు అని చెప్పి కొన్ని టాబ్లెట్లు, ఒక ఆయింట్మెంట్, ఒక సబ్బు వ్రాసి ఇచ్చారు. ఆయింట్మెంట్ వ్రాయడం వలన అలర్జీ రోజురోజుకీ తగ్గింది గాని, టాబ్లెట్స్ వేసుకుంటే శరీర ఉష్ణోగ్రత, గుండె వేగం పెరిగి నిద్రపట్టేదికాదు. ఇలా రెండురాత్రులు నిద్ర లేకపోవడంతో ఆ ప్రభావం నా ఉద్యోగ విధుల మీద పడింది. మూడోరోజు కూడా అలాగే జరిగేసరికి నేను ఆ బాధ తట్టుకోలేక, "బాబా! దయచేసి ఈ రాత్రి ప్రశాంతంగా నిద్రపోయేలా అనుగ్రహించండి. మీ దయవలన నేను హాయిగా నిద్రపోగలిగితే నా అనుభవాన్ని సైట్ ద్వారా సాయిబంధువులతో పంచుకుంటాను" అని ప్రార్థించాను. బాబా నా ప్రార్థన విన్నారు. కొద్దిసేపట్లో నిద్రలోకి జారుకుని రాత్రంతా ప్రశాంతంగా నిద్రపోయాను. బాబాకి కృతజ్ఞతలు చెప్పుకుని ఆరోజు నుండి టాబ్లెట్స్ వేసుకోవడం మానేసాను. బాబా కృపతో కేవలం ఆయింట్మెంట్ వలన అలర్జీ పూర్తిగా తగ్గిపోయింది. రోజురోజుకీ బాబా యందు నా విశ్వాసం పెరుగుతూ ఉంది. నేను పూర్తిగా సాయి దివ్యపాదాలకు శరణాగతి చెందాను. ప్రతి గురువారం బాబా మందిరానికి వెళ్తూ ఉంటాను. అక్కడికి వెళ్లిన ప్రతిసారీ మనస్సుకు ఎంతో శాంతిగా ఉంటుంది. "బాబా! మీ బిడ్డలందరినీ ఆశీర్వదించండి".


సాయి నా జీవితంలోకి వచ్చిన తీరు

ఒక అజ్ఞాత సాయిభక్తుడు తన అనుభవాన్ని పంచుకుంటున్నారు.
నాకు 29 సంవత్సరాలు. రెండేళ్ల క్రితం నేను చెన్నైలో ఒక బ్యాంకు ఉద్యోగంలో చేరాను. అక్కడ నేను ఒక అమ్మాయిని చూస్తూనే తను నాకు, మా కుటుంబానికి చక్కగా సూటవుతుందనిపించింది. నేను తనతో నా గురించి, నా కుటుంబం గురించి, నాకు వస్తున్న శాలరీ గురించి అన్నీ ఉన్నది ఉన్నట్లుగా చెప్పాను. నేను కావాలనుకుంటే తనని ఒప్పించడానికి అబద్ధం చెప్పవచ్చు. కానీ ఏ కారణం చేత కూడా ఒక అమ్మాయిని మోసం చేయడం నాకిష్టంలేదు. తను కాస్త పేద కుటుంబానికి చెందిన అమ్మాయి. మాది ఉన్నత తరగతి కుటుంబం. ఈ విషయమే నేను మా అమ్మగారితో చెప్తే తను కూడా ఒప్పుకున్నారు. మా కుటుంబం ఎప్పుడూ డబ్బుల విషయాన్ని సీరియస్గా తీసుకోదు. కొన్నాళ్ల పరిచయం తర్వాత మాటల్లో క్యాస్ట్ విషయం బయటకు వచ్చింది. అది నా ప్రేమకు ముగింపు అవుతుందని నేను అనుకోలేదు. క్యాస్ట్ విషయం తెలిసాక తను, "ఎట్టి పరిస్థితుల్లో నా తల్లిదండ్రులు వేరే క్యాస్ట్ అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోరు" అని చెప్పి, కమ్యూనికేషన్ పరంగా నేను తనని కాంటాక్ట్ కాకుండా అన్నివిధాలా నన్ను బ్లాక్ చేసింది. తనతో మాట్లాడక ఎనిమిది నెలలు గడిచినప్పటికీ ప్రేమ చేసిన గాయం మానిపోలేదు. తను కూడా నన్ను ఇష్టపడిందని నాకు బలంగా తెలుసు.

ఇదిలా ఉండగా 3 నెలల క్రితం హఠాత్తుగా ఆఫీసులో నా సీటు తన సీటుకు కాస్త దగ్గరగా మార్చారు. నేను కూర్చున్న ఆ చోట ఒక చిన్న సాయిబాబా ఫోటో ఉంది. ఆ ఫోటో నా జీవితాన్ని మార్చేసింది. మెల్లగా ఆయన గురించి చదవడం, ఆయన బోధనలను తెలుసుకోవడం, ఆయనను ప్రార్థించడం మొదలైంది. దాంతో ఏదో తెలియని ఆనందం, ప్రశాంతత చేకూరాయి. ఆ ఆనందం అన్ని ఆనందాలకు అతీతమైనది. ఈమధ్యే నేను ప్రేమించిన అమ్మాయి కూడా సాయిభక్తురాలని తెలిసింది. నేను చాలాసార్లు తనతో మాట్లాడడానికి ప్రయత్నించాను కానీ, తను కాల్ కట్ చేసేది. నన్ను చూసేటప్పుడు మాత్రం తను ప్రేమగానే చూసేది. తన మనసులో ఏముందో నాకు అర్థమయ్యేది కాదు. కానీ అంతా బాబాకు విడిచిపెట్టాను. ఆయనే మా ఇద్దర్నీ కలిపారు. ఇప్పుడు ఆయన ఏది నాకు మంచిదో అదే చేస్తారని అనుకుంటున్నాను.

సాయిపై దృఢమైన విశ్వాసం – సమస్యలకి పరిష్కారం


ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్ని పంచుకుంటున్నారు.

ప్రేమస్వరూపులైన సాయిభక్తులందరికీ నా నమస్కారములు. నేను 23 ఏళ్ల అమ్మాయిని. మాది చాలా సాదాసీదా చిన్న కుటుంబం. మేము సాధారణ జీవితం గడుపుతూ ఉండగా, 2017 ఆరంభంలో మా జీవితాలు ఒక్కసారిగా తలక్రిందులయ్యాయి. జనవరి నెలలో ఒకరోజు ఉన్నట్టుండి అకస్మాత్తుగా మా అమ్మ చాలా భయంకరంగా ప్రవర్తించసాగింది. ఆమె, "నేను ఆత్మని, నేను చనిపోతాన"ని బిగ్గరగా అరవడం మొదలుపెట్టింది. మాకు ఎలా ప్రతిస్పందించాలో అర్థంకాక నిశ్చేష్టంగా ఉండిపోయాం. పైగా అర్థరాత్రి, ఎక్కడికీ పోలేని పరిస్థితి. ఆ క్షణంనుండి మొదలైన ఆ పరిస్థితి సుమారు ఒక సంవత్సరం పాటు కొనసాగింది. నేను, నాన్న ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాము. ఆమె అసలు పడుకునేది కాదు. ఎదురుగా ఎవరో ఉన్నట్లు ఆగకుండా మాట్లాడుతూనే ఉండేది. ఆమెను చూస్తూ భయంతో వణికిపోయేవాళ్ళం. మా బంధువులంతా తలా ఒక సలహా ఇవ్వడం మొదలుపెట్టారు. సాధువుల వద్దకు తీసుకెళ్ళమని ఒకరు, తాంత్రికుల వద్దకు తీసుకెళ్ళమని మరొకరు, ఏదైనా గుడికి తీసుకెళ్ళమని ఇంకొకరు... ఇలా రకరకాలుగా చెప్తూ ఉండేవారు. వాళ్లంతా చెప్పేది ఏమిటంటే, అమ్మ పరిస్థితికి కారణం ఆత్మ ప్రభావమని, ఎవరో మంత్రప్రయోగం చేసారని. నేను నాన్నతో ఒక్కటే చెప్పాను, "బాబా వద్దకు తప్ప ఇంకెక్కడికీ అమ్మని తీసుకెళ్ళవద్దు" అని. నేనలా కరాఖండిగా చెప్పడంతో మా బంధువులంతా నన్ను ఒకరకంగా చూడటం మొదలుపెట్టారు. కానీ నేనేమీ పట్టించుకోలేదు. నేను బాబానే నమ్ముకున్నాను. అమ్మకు బాబా ఊదీ ఇస్తూ సాయిని ప్రార్థిస్తూ ఉండేదాన్ని. అమ్మ తను కళ్ళు తెరవకుండా, "మీరంతా నాకు దూరంగా ఉండండి. నన్ను చూడకండి. నన్ను చూస్తే మీక్కూడా ఈ పరిస్థితి వస్తుంద"ని అరుస్తూ ఉండేది. నేనేమీ పట్టించుకోకుండా, బాబాని తలుచుకుంటూ ఆమెను గట్టిగా హత్తుకునేదాన్ని. నేను, "బాబా! ఈ ప్రపంచాన్ని సృష్టించింది మీరు. మీ ఆధీనంలో లేనిదంటూ ఏమీలేదు. మీ శక్తిని మించి ఏదీ లేదు. అలాంటప్పుడు ఈ ఆత్మలు, మంత్రవిద్యలు మీ భక్తులకు హాని కలిగిస్తాయా? అమ్మని కాపాడండి బాబా!" అని ప్రార్థిస్తూ అమ్మకి మందులతోపాటు ఊదీ ఇస్తూ సహనంతో వేచివుండేవాళ్ళం. ఏది ఏమైనా నా చేయి సాయి విడిచిపెట్టరు, ఆయన అమ్మని కాపాడుతారని నా నమ్మకం.

అమ్మ పరిస్థితి ఇలా ఉంటే, ఫిబ్రవరి నెలలో మరో సమస్య చుట్టుముట్టింది. మాకు దూరంగా బెంగళూరులో ఉద్యోగం చేస్తున్న మా అక్క అనారోగ్యం పాలై సెలవు తీసుకుని ఇంటికి వచ్చింది. అమ్మ పరిస్థితి చూసి తను, తన పరిస్థితి చూసి అమ్మ ఇద్దరూ ఒకటే ఏడుపు. ఇద్దరినీ ఓదార్చలేకపోయాం. డాక్టరు వద్దకు వెళ్తే అది మామూలు జ్వరమని కొన్ని మందులు ఇచ్చారు. ఆ మందులు వాడుతుంటే పరిస్థితి ఇంకా దిగజారిపోయింది. ఇంతలో ఆమె సెలవులు పూర్తవడంతో తప్పనిసరై ఆ పరిస్థితిలోనే వెళ్లి ఉద్యోగంలో చేరింది. కొన్నిరోజుల తర్వాత ఫోన్ చేసి, "ఇప్పటికే నేను పది కేజీల బరువు తగ్గిపోయాను. సమస్య ఏమిటో అర్థం కావట్లేద"ని ఏడవడం మొదలుపెట్టింది. ఇక అక్కని చూసుకోవడానికి నాన్న తత్కాల్ టికెట్ తీసుకుని బెంగళూరు వెళ్లారు. ఇక్కడ నేను అమ్మను చూసుకుంటూ ఉండేదాన్ని. మేము విశ్వాసాన్ని కోల్పోకుండా, "బాబా! మాకు మార్గం చూపించండి. సమస్య ఏమిటో బయటపడేలా చూడండి" అని ప్రార్థించాము. అలా ప్రార్థించిన తరువాత బాబా కృపవలన తన ఊపిరితిత్తులలో ఒక లీటర్ ద్రవం చేరిందనీ, అందువల్లనే సమస్యలనీ బయటపడింది. ఆ సమస్యలతో తనకి ఊపిరి తీసుకోవడం చాలా కష్టంగా ఉండేది. తను నిద్రపోలేకపోయేది, కనీసం కూర్చోలేకపోయేది, తిండి తినలేకపోయేది. కొంచెం తిన్నా వాంతి అవుతుండేది. చివరికి తను ఒక అస్థిపంజరంలా తయారైంది. తను పూర్తిగా శారీరకంగా, మానసికంగా చాలా బలహీనపడిపోయింది. తను ఫోనులో ఏడుస్తుంటే తట్టుకోలేక నాకు ఏడుపు వచ్చేసేది. అంత దారుణమైన పరిస్థితుల్లో బాబాకే శరణు అన్నాము. అక్క విషయంలో పరిష్కారం చూపమని క్వశ్చన్ అండ్ ఆన్సర్ సైటులో బాబాను అడిగితే, 'చిలుము సమర్పించమ'ని వచ్చింది. నేను చిలుము తీసుకుని వెళ్లి బాబా పాదాలవద్ద పెట్టి, అక్కని కాపాడమని ప్రార్థించాను. శ్రీసాయిసచ్చరిత్ర 50వ అధ్యాయంలో దురంధర్ ఆస్తమా వ్యాధిని బాబా చిలుముతోనే నయం చేశారు. తరువాత డాక్టరు, "సర్జరీ చేసి ఆ ద్రవాన్ని తొలగించాలి, అది చాలా నొప్పితో కూడుకున్నది" అని అన్నారు. నేను, "బాబా! ఆ నొప్పినుండి తనని మీరే కాపాడండి" అని ప్రార్థించాను. బాబా కృపతో డాక్టర్ సర్జరీ లేకుండా మందులిచ్చారు.

ఒకవైపు అమ్మ, మరోవైపు అక్క. ఆ పరిస్థితుల్లో జీవితం నరకంలా ఉండేది. కానీ ప్రతి చీకటిరాత్రి తర్వాత పగలు ఉంటుందనే ఆశతో, బాబాపై విశ్వాసంతో ఎదురుచూస్తూ ఉండేవాళ్ళం. ఇలా రోజులు, వారాలు, నెలలు గడిచాయి. "బాబా! మీరు ఏదైనా చేయగలరు" అని నిత్యం ప్రార్థిస్తూ ఉండేవాళ్ళం. దాదాపు రెండు, మూడు నెలలకి అక్క ఉపిరితిత్తులలోని ద్రవం ఎండిపోవడం మొదలుపెట్టింది. కొంచెం కోలుకోవడంతో నాన్న, అక్క ఇద్దరూ ఇంటికి వచ్చారు. అమ్మని, అక్కని ఇద్దరినీ సంతోషంగా ఉండేలా జాగ్రత్తగా చూసుకుంటూ, ఊదీతోపాటు మందులిస్తూ బాబాను ప్రార్థిస్తూ ఉండేవాళ్ళం. దాదాపు ఆరేడు నెలల తర్వాత 'మహాపారాయణ' మా జీవితాలలో కొత్త ఆశలు తీసుకొచ్చింది. అక్క ఊపిరితిత్తులలోని ద్రవం 70% ఎండిపోయింది. నిదానంగా మునుపటివలె తను బరువు సంతరించుకుంది. మళ్ళీ తననలా ఆరోగ్యంగా చూసిన ఆనందంలో నాకు కన్నీళ్లు వచ్చేసాయి. పరిమితికి మించిన సెలవులవలన దాదాపు తన ఉద్యోగం పోయిందనే అనుకున్నాం. కానీ, బాబా ఏదైనా మనకి ఇవ్వాలనుకుంటే ఇంకే ఆటంకాలు అడ్డురావు. తను మళ్ళీ ఉద్యోగంలో చేరింది. ఇప్పుడు తనకి టీం లీడ్ గా ప్రమోషన్ కూడా వచ్చింది. అంతా బాబా అనుగ్రహం.

మరోవైపు అమ్మ కూడా క్రమంగా సాధారణస్థితికి వచ్చింది. దాదాపు సంవత్సరం కష్టకాలం తరువాత అమ్మ ముఖంపై నవ్వు చూసాము. ఆ సమయంలో నేను పొందిన ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. మనసారా బాబాకు కృతజ్ఞతలు తెలుపుకున్నాను. అమ్మ ఇప్పటికీ మందులు వాడుతోంది, అయినప్పటికీ తన పరిస్థితి ఎంతో మెరుగ్గా ఉంది.  ఇప్పుడు తను కూడా 'మహాపారాయణ'లో భాగమై పారాయణ చేస్తోంది.

సమస్యలు పెద్దవే కావచ్చు, కానీ మన బాబా కన్నా అవేమీ పెద్దవి కావు. సైన్సు ఎప్పుడైతే ఆగిపోతుందో అప్పుడు బాబా ప్రవేశించి అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తారు. సమస్యల్లో ఉన్న మనల్ని బాబా ఎప్పుడూ విడిచిపెట్టరు. ఆయన ఎప్పుడూ తన భక్తులను మధ్యలో విడిచిపెట్టనని మాట ఇచ్చారు. ఆయన అన్ని విషయాలను జాగ్రత్తగా చూసుకుంటారు. ఒక్కోసారి చాలా ఆలస్యమైనట్టు కనబడుతున్నప్పటికీ ఆయన తప్పక కరుణిస్తారు. కష్టాలను ఎదుర్కొనే శక్తిని బాబా ఇచ్చి మనల్ని ముందుకు నడిపిస్తారు. నాలుకపై ఆయన శక్తివంతమైన నామం సమస్యలను దూరం చేస్తుంది. "కష్టసమయంలో మీరు తోడుగా ఉండి, సమస్యలనుండి బయటపడేసినందుకు థాంక్యూ సో మచ్ బాబా!"

భావుసాహెబ్ అర్నాల్కర్.


భావుసాహెబ్ అర్నాల్కర్ న్యాయవాది వృత్తి చేస్తూ ముంబాయిలో నివసిస్తుండేవాడు. ఆ సమయంలో అతని మిత్రులు తరచూ పండరీపురం దర్శిస్తుండేవారు. దాదాపుగా బాబా గురించి ఎవరికీ తెలియదు. అయితే న్యాయవాది అయిన అర్నాల్కర్ తరచూ దభోల్కర్‌ను, మామల్తదారైన దేవును కలుస్తుండటం వలన వారి మధ్య స్నేహం అభివృద్ధి చెందింది. ఆ సమయంలో దభోల్కర్ బాబా సచ్చరిత్ర వ్రాయటంకోసం లీలలను, ముఖ్యమైన విషయాలను సేకరిస్తూ, తరచూ దేవుతో కలిసి శిరిడీ సందర్శిస్తుండేవారు. వాళ్ళిద్దరూ బాబా అద్భుతమైన లీలలను భావుసాహెబ్‌తో చెప్తుండేవారు. పర్యవసానంగా అతను కూడా బాబా భక్తుడై ఎప్పుడెప్పుడు శిరిడీ వెళ్తానా అని ఆశగా ఎదురుచూస్తుండేవాడు.

అప్పట్లో చాలామంది బాబాను ముస్లిం ఫకీరని అనుకునేవారు. కానీ అర్నాల్కరుకు ఎలాంటి సందేహమూ లేదు. ఆయనకి బాబా భగవంతుని అవతారం. భక్తుడు తాను నమ్ముకున్న దైవం దగ్గర అన్ని విషయాలు తేలికగా మనస్సు విప్పి చెప్పుకోవచ్చన్నది అతని అభిప్రాయం. నిత్యావసరాలకు కూడా పైకం లేనంత క్లిష్టమైన ఆర్ధిక పరిస్థితులు ఎదుర్కొంటున్న సమయంలో అతని శిరిడీ ప్రయాణం నిశ్చయమైంది. అతను తన ప్రయాణానికి ముందు మనస్సులో, "శిరిడీ వెళ్ళి, నా దైవమైన బాబా పాదాలను శరణు పొందాలి. తరువాత ఆయనతో ఏమి చెప్పాలి? ఎలా చెప్పాలి?" అని పదేపదే ఆలోచించుకుంటూ, "భక్తుడు తన సమస్యలను, బాధలను భగవంతునికి తానే చెప్పుకోకపోతే, ఇంకెవరు వాటిగురించి చెప్తారు?" అని పరిపరివిధాల నెమరువేసుకుంటూ మొత్తానికి శిరిడీ ప్రయాణమయ్యాడు.

శిరిడీ చేరుకున్న తరువాత ద్వారకామాయికి వెళ్ళి, ఎంతో భక్తితో బాబా ముందర సాష్టాంగపడ్డాడు. మూడురోజులపాటు తరచూ ద్వారకామాయికి వెళ్ళివస్తూండేవాడు. అతను వెళ్ళిన ప్రతిసారీ బాబా చుట్టూ చాలామంది భక్తులు ఉండేవారు. ఒక్కసారి కూడా బాబా ఒంటరిగా ఉండకపోవడంతో తాను అనుకున్నది బాబాకు చెప్పలేకపోయాడు. అందరిముందు తన సమస్యలను బాబాకు చెప్పుకోవడానికి సిగ్గుపడ్డాడు. 4వ రోజు బాబా అతన్ని పిలిపించి, తమ దగ్గరగా కుర్చోబెట్టుకొని, "ఇప్పుడు నీవు బయలుదేరాలి. నీకు కుటుంబం, బంధువులు ఉన్నారు కదా?" అని అన్నారు. వెంటనే అతడు తన శిరస్సును బాబా పాదాలపై ఉంచి, భావోద్వేగాలకు లోనయ్యాడు. ఇక ఏమీ మాట్లాడలేకపోయాడు. మౌనంగా తన మనస్సులో, "బాబా వెళ్లిపొమ్మని చెప్పిన తరువాత ఎవరూ ఇక్కడ ఒక్కనిమిషం కూడా ఉండరు, ఇది శిరిడీ ఆచారం. కానీ నా సమస్యలు బాబాకు చెప్పాలి, కానీ చెప్పలేకపోయాను. ఏది ఏమైనా ఇక నేను బయలుదేరడం మంచిది" అని అనుకుని నిరాశతో ద్వారకామాయి నుండి బయటకు వెళ్ళబోయాడు. ఇంతలో బాబా అతనిని పిలిచి, "భావూ! నీ దగ్గర ఎన్ని డబ్బులున్నాయి?" అని అడిగారు. భావుకు ప్రాణం లేచివచ్చినట్లు అనిపించి తన మనస్సులో, "బాబా ఎంత గొప్పవారు! స్వయంగా ఆయనే డబ్బు విషయం ప్రస్తావిస్తున్నారు" అని అనుకుంటూ బాబాతో, "నా వద్ద మూడు రూపాయలు, కొన్ని అణాలున్నాయి. అవి నా తిరుగుప్రయాణానికి సరిపోతాయి" అని చెప్పాడు. అప్పుడు బాబా, "అరె! ఆ మొత్తం పైకం నాకివ్వు. ఫకీరుకు కూడా డబ్బులు అవసరమే" అని అన్నారు. దానితో భావు మౌనంగా బాబాకు డబ్బు ఇచ్చేసాడు. వెంటనే బాబా, "టాంగా నీకోసం బయట వేచివుంది. తొందరగా వెళ్ళు!" అని అన్నారు. నిరాశతో భావు వేచివున్న టాంగా వద్దకు వెళ్ళాడు. టాంగావాడు భావుకి పరిచయస్తుడై ఉండటంతో, టాంగా నిండుగా ఉన్నప్పటికీ అతనికి స్థలం సర్దుబాటు చేసాడు. నిండుగా ప్రయాణికులు ఉన్నందున టాంగావాడు అతనివద్ద డబ్బులు కూడా తీసుకోలేదు. "ఇప్పుడు ముంబాయి ఎలా వెళ్ళాలి? టికెట్ లేకుండా ప్రయాణం చేయడం నేరం" అని ఆలోచిస్తూ ప్లాట్‌ఫారమ్ మీద వేచి ఉన్నాడు. ఇంతలో ముంబాయి వెళ్ళే రైలు వచ్చి ఆగింది. తనకి ఎదురుగా ఉన్న బోగిలోనుంచి ఎవరో, "వకీల్ సాహెబ్, ఈ బోగీలోకి రండి!" అని పిలవడం వినిపించింది. అది రెండవతరగతి బోగీ. ఒక మరమనిషిలా భావు బోగీలోకి ఎక్కి చూస్తే, ఆ పిలిచిన వ్యక్తి ఎవరో కాదు, ఇతని పాత స్నేహితుడైన రైల్వే అధికారి. భావు తన దగ్గర టిక్కెట్ లేదని తెలియజేయగా, ఆ స్నేహితుడు, "నేను నీతో ముంబాయికి ప్రయాణం చేస్తుండగా నీకెందుకు చింత? బాబా కృపవలన చాలా నెలల తరువాత మనం కలిసాం" అని అన్నాడు. భావు ఆశ్చర్యానందాలకు లోనయ్యాడు. ఇద్దరూ కలిసి సుఖంగా ప్రయాణం చేసి ముంబాయి చేరుకున్నారు.

ముంబాయిలో దిగిన తరువాత అతని స్నేహితుడు ఎక్కడికో వెళ్లిపోయాడు. బయటకు వెళ్ళే ద్వారంవద్ద రైల్వే అధికారి టికెట్లు పరిశీలిస్తున్నాడు. అందువలన అతడు బయటకు వెళ్లలేక అక్కడే నిల్చొని చూస్తున్నాడు. అంతలో ఇద్దరు మొరటుగా వున్న పల్లెటూరి వ్యక్తులు స్టేషన్ లోపలికి ప్రవేశిస్తూ ఆ అధికారిని దారినుంచి పక్కకు నెట్టుకుంటూ నేరుగా భావు దగ్గరకు వెళ్లి, ఒక సంచి అతని చేతిలో పెట్టారు. అందులో 300/- రూపాయలు ఉన్నాయి. వాళ్లలో ఒక మనిషి, "వకీల్ సాహెబ్, నేను నా స్నేహితుడైన ఇతన్ని కలవడానికి ఇక్కడికి వచ్చాను. కానీ బాబా కృపవలన నేనిక్కడ మిమ్మల్ని కలిసాను. మూడురోజుల తరువాత నా కేసు మొదలు కాబోతోంది. కాబట్టి దయచేసి ఈ డబ్బులు తీసుకోండి. మీరిప్పుడు తీసుకోకపోతే ఇదే పనిమీద మీకు ఫీజు ఇవ్వడానికి అంతదూరంలో ఉన్న వసయికి రావాలి" అని చెప్పాడు. ఆ మాటలు వింటున్న భావుకి, బాబా తన సమస్యకి నిశ్శబ్దంగా తగిన నివారణ చేసారని అర్థమై నోటమాట రాలేదు.

భావుసాహెబ్ అర్నాల్కర్‌లా మనకి కూడా బాబాను చేరుకునే ఆధ్యాత్మిక ప్రయాణంలో ఎన్నో సమస్యలు వస్తాయి. అయితే బాబా మూలాలతో సహా ఆ సమస్యలను/అడ్డంకులను తొలగించి మనలను పరిశుద్ధం చేస్తారు. ఒకసారి మనల్ని పరిశుద్ధం చేసిన తరువాత, మన పురోగతికి అవసరమైన ఏర్పాట్లు చేస్తారు. మన బాధ్యత ఏమంటే, ఆయన చెప్పినవి ఒక మరమనిషిలా అనుసరించడం. ఒకసారి అనుసరించడం మొదలుపెట్టాక, మన పురోగతికి, అభివృద్ధికి అవసరమైన త్రిగుణాలను నిర్వహించే శక్తిని అనుగ్రహిస్తారు.


Ref: శ్రీసాయిలీల పత్రిక, అక్టోబర్ 1979.


సోర్స్: Baba's Divine Manifestations by Vinni Chitluri.

బాబా ప్రేమను చూడండి! ఆయన నన్నెప్పుడూ పస్తు ఉండనివ్వలేదు.

సాయిభక్తుడు శరణ్ తన అనుభవాలను మనతో పంచుకుంటున్నారు:

సాయిబంధువులందరికీ నమస్కారం. ఆన్లైన్‌లో భక్తుల అనుభవాలు చదువుతుండటం వలన బాబాపై నా భక్తివిశ్వాసాలు రెట్టింపు అవుతున్నాయి. బ్లాగులు నిర్వహిస్తున్న నిర్వాహకులకు నా ధన్యవాదములు. 2015 నుండి నేను సాయి భక్తుడిని. అంతకుముందు కూడా నేను బాబాని ప్రార్థించేవాడిని, కానీ ఆయన గురించి నాకు అంతగా ఏమీ తెలియదు. ప్రతిరోజూ నా బాబా నాకు తోడుగా ఉండి నన్ను శ్రద్ధగా చూసుకుంటున్నారు. నాకే సమస్య ఎదురైనా నేను బాబానే ప్రార్థిస్తాను, ఆయన వెంటనే నాకు పరిష్కారం చూపిస్తూ ఉంటారు. ఇక నా అనుభవానికి వస్తే..

నా వయసు 37 సంవత్సరాలు. నా జీవితం ఫ్రెండ్స్, పార్టీలు, నా గర్ల్‌ఫ్రెండ్ చుట్టూ తిరుగుతూ సంతోషంగా గడిచిపోయేది. అలాంటి నా జీవితంలో ఉన్నట్టుండి 'గౌట్& రుమటాయిడ్ అర్థరైటిస్' వ్యాధి(వాత రక్తం -  రక్తంలో ఏర్పడిన అధికమైన యూరిక్ యాసిడ్ కిడ్నీ ద్వారా బయటికి వెళ్లిపోవాలి. అలా జరగకుండా కీళ్ల మధ్య ఉండిపోవడం వల్ల అక్కడ నొప్పి, వాపు ఉంటాయి) సోకింది. దానితో నా వేళ్ళలో, కాళ్లలో కదలిక  పరిమితమైంది. ఆ బాధ ఏమిటో అనుభవించేవారికే తెలుస్తుంది. ఇదొక సమస్యైతే, 2014లో నా పై అధికారి నా స్థానంలో తక్కువ శాలరీ తీసుకునే ఇంకొక వ్యక్తిని తీసుకోవాలనే ఉద్దేశ్యంతో సంవత్సరానికి ఒకసారి ఇచ్చే రేటింగును తక్కువగా చూపిస్తూ ఉండేవాడు. ఉద్యోగంలో సమన్వయం లేకపోవడంతో, అటువంటిచోట ఉద్యోగం చేయడం అనవసరం అనిపించి 2014, డిసెంబరులో ఉద్యోగాన్ని వదిలేశాను. తర్వాత సొంతంగా ఒక బిజినెస్ పెట్టాలనుకున్నాను. కానీ సరిపడా డబ్బులు లేకపోవడంతో అది కార్యరూపం దాల్చలేదు. దాంతో మళ్లీ ఉద్యోగప్రయత్నాలు మొదలుపెట్టాను. అయితే ఇంటర్వ్యూలో నేను చాలా ఆందోళనకు గురవుతూ  ఉండటంవలన అది కూడా సరిగ్గా చేయలేకపోయాను. ఇక పూర్తిగా నిరాశపడిపోయాను. ఆ సమయంలో ఒక స్నేహితుడిని కలిసాను. అతను గొప్ప బాబా భక్తుడు, తరచూ శిరిడీ దర్శిస్తూ ఉండేవాడు. తనతో మాట్లాడిన తర్వాత నాకు బాబా గుడికి వెళ్ళాలనిపించి, మా ఇంటికి దగ్గరలో ఉన్న బాబా గుడికి వెళ్ళడం మొదలుపెట్టాను. 

రోజూ బాబా దర్శనం చేసుకుని, మందిర ప్రాంగణంలో కూర్చుని మొబైల్‌లో సచ్చరిత్ర చదువుతూ ఉండేవాడిని. ఒకరోజు నేను చదువుకుంటూ ఉండగా ఒకామె వచ్చి నా ముందు నిలుచుంది. నేను ఆమెను గమనించకుండా చదువుకుంటూ ఉంటే, పక్కనున్న భక్తుడు, 'చూడు!' అంటూ నన్ను తట్టాడు. నేను చూస్తే, ఆమె 'నవ గురువార వ్రతం' పుస్తకం, అరటిపండు, తాంబూలం నా చేతిలో పెట్టింది. ఆమె వెళ్ళిపోతూ ఉంటే ఆమె పాదాలను తాకి, నన్ను ఆశీర్వదించమని అడిగాను. వ్రత విధానం తెలియకపోయినా, నాకు తోచిన విధంగా వ్రతం చేస్తూ బాబాని ప్రార్థిస్తూ ఉండేవాడిని. తొమ్మిది వారాల వ్రతం పూర్తైన తర్వాత ఒకరోజు నేను మందిరానికి వెళ్ళి బాబా దర్శనం చేసుకుని తిరిగి వచ్చేయబోతుండగా పూజారి నన్ను పిలిచి, "సాయంత్రం నాలుగు గంటలకి వస్తే బాబాకి అభిషేకము, స్నానం  చేయించడంలో పాల్గొనవచ్చు" అని చెప్పారు. ఈ రోజుల్లో పూజారులు దేవుడి పేరు పెట్టి డబ్బులు గుంజుతూ ఉంటారు. కానీ నా దగ్గర అంత డబ్బులు ఏమీలేవు. కాబట్టి బాబాని ప్రార్థించి, ఒకవేళ పూజారి అడిగితే ఇవ్వొచ్చని 50 రూపాయలు జేబులో పెట్టుకుని సాయంత్రం నాలుగు గంటలకు గుడికి వెళ్లాను. పూజారిగారు అభిషేకానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తూ నన్ను చూసి గర్భగుడిలోకి రమ్మని పిలిచారు. అక్కడ నేను తప్ప అందరూ ఆడవాళ్లే ఉన్నారు. బాబా వస్త్రాలు, మాలలు తీసి పక్కన పెట్టారు. తెల్లని పాలరాతి బాబా అందాన్ని చూస్తూ నేను మైమరిచిపోయాను. కుంకుమ నీళ్లు, ఊదీ నీళ్లు, చందనములతో అభిషేకించి తరువాత మంచినీటితో బాబాకి స్నానం చేయించాం. నా భాగ్యానికి నేనెంతో మురిసిపోయాను. ఎప్పటినుంచో ఉన్న భక్తులు సైతం ఆ కార్యక్రమంలో పాల్గొనాలని ఎదురుచూస్తుంటారు. అలాంటిది ఈమధ్యనే బాబా భక్తుడినైన నాకు అంత గొప్ప అవకాశం రావడం నా మహద్భాగ్యం. తర్వాత నేను ఇంటికి వచ్చేముందు పూజారిగారి చేతిలో 50 రూపాయలు పెట్టాను. కానీ అతను తీసుకోవడానికి నిరాకరిస్తూ, "డొనేషన్స్ బాక్సులో వేయమ"ని చెప్పి, "నీకు సంతోషమే కదా?" అని అడిగారు. నేను, "ఈరోజు నా జీవితంలోనే చాలా ప్రత్యేకమైన రోజు. నేను పొందిన ఆనందాన్ని ఏమని చెప్పగలను? ఈ అవకాశమిచ్చిన మీకు చాలా చాలా కృతజ్ఞతలు" అని చెప్పాను.

నేను ఉద్యోగాన్ని వదిలిపెట్టి, ఒంటరిగానే అపార్ట్‌మెంటులో ఉంటూ ఉండేవాడిని. ఇంటి అద్దె కట్టడానికి, తిండి తినడానికి నా దగ్గర డబ్బులు ఉండేవి కావు. కానీ బాబా ప్రేమను చూడండి! ఒక్కరోజు కూడా ఆయన నాకు భోజనం చేయకుండా పడుకునేరోజు ఇవ్వలేదు. ప్రతిరోజూ ఎవరో ఒకరు నాకు ఆహారాన్ని అందించేవారు. నెలాఖరు వచ్చేసరికి ఇంటి అద్దె కట్టేందుకు డబ్బులు కావాలని బాబాని ప్రార్థించేవాడిని. అద్భుతాలలోకే అద్భుతం! ఆ డబ్బులు ఏదో ఒకవిధంగా బాబా ఏర్పాటు చేసేవారు. ఇప్పటికి ఉద్యోగం లేకుండా మూడేళ్ళు అవుతున్నా బాబా నన్ను ఎంతో శ్రద్ధగా, నా ప్రతి అవసరాన్నీ తీరుస్తున్నారు. చాలాకాలంగా కొన్ని కారణాల వలన నేను ఉపయోగించుకోలేకపోతున్న నా ప్రావిడెంట్ ఫండ్‌ని కూడా బాబాయే ఇటీవల నాకు అందేలా చేశారు. "చాలా చాలా కృతజ్ఞతలు బాబా!"

బాబాని ప్రార్థిస్తూ, సచ్చరిత్ర చదవడం మొదలుపెట్టిన తర్వాత నిదానంగా నేను బాబా బోధనలను ఆచరించడం మొదలుపెట్టాను. అవి నాకెంతగానో సహాయం చేస్తున్నాయి. నేను ఇతరులను అసహ్యించుకోవడం, వారిపై కోపం తెచ్చుకోవడం, వాళ్ళ వెనక చాడీలు మాట్లాడటం, ఒకరిపట్ల అసూయచెందడం మొదలైనవి మానుకున్నాను. ఇవన్నీ బాబాకి దగ్గరవడంలో నాకెంతగానో సహాయపడుతున్నాయి. చాలామంది సాయిభక్తులు బాబా తమ బాధను వినిపించుకోవడం లేదని, సాయం అందించడం లేదని అనుకుంటూ ఉంటారు. వాళ్ళకి నేను చెప్పేది ఒక్కటే, ఎప్పుడూ ఆశని వదులుకోకండి. బాబా మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉంటారు. మీకు ఏది మంచిదో ఆయనకు తెలుసు. ఆయన తప్పకుండా సరైన సమయంలో వాటిని మీకు అందిస్తారు. ఆయన ఆలోచన ఎప్పుడూ ఉన్నతంగా ఉంటుంది. ఎవరితోనూ అబద్ధం చెప్పకండి, ఎవరిపట్ల అసూయ చెందకండి, చెడుగా మాట్లాడకండి, మీ మాటలతో ఇతరులను గాయపరచకండి. వీలైనంత సాటిజీవులకు ఆహారాన్ని అందించండి, మన కర్మలు కొంతైనా తొలగిపోతాయి. "ఐ లవ్ యు సాయి! ప్లీజ్! ఎప్పుడూ తోడుగా ఉంటూ నన్ను, నా కుటుంబాన్ని, మీ భక్తులను రక్షిస్తూ, ఆశీర్వదిస్తూ ఉండండి".

బాబా ఎప్పుడూ మనకు తోడుగా ఉంటారు, అవసరంలో ఆదుకుంటారు.


అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్ని పంచుకుంటున్నారు:

2018లో హోలీ పండుగకి నేను, నా బాయ్‌ఫ్రెండ్ హరిద్వార్ వెళ్ళాలని అనుకున్నాం. హరిద్వార్‌లో ఆరతి చూడాలని నా కోరిక. మా మేనేజరుని రెండురోజులు సెలవు అడిగితే, వెంటనే ఇచ్చారు. నేను రూముకు వెళ్ళి, లగేజ్ తీసుకుని న్యూఢిల్లీ స్టేషనుకి వెళ్ళి, టికెట్ కౌంటరులో ఉన్న వ్యక్తిని హరిద్వార్‌కి టికెట్ అడిగితే, "హరిద్వార్‌కి ట్రైన్స్ లేవ"ని చెప్పారు. నేను ఆశ వదులుకోలేక వెంటనే అక్కడినుండి ఓల్డ్ ఢిల్లీ రైల్వేస్టేషనుకి వెళ్ళాను. అక్కడినుండి రాత్రి 11 గంటలకు ట్రైన్ ఉంది. ముందుగా టికెట్లు బుక్ చేసుకోనందున జనరల్ టికెట్ తీసుకున్నాను. హోలీ పండుగ ఉండటంతో జనం బాగా ఉన్నారు. మూడు గంటలు వేచివున్న తర్వాత 11 గంటలకు ట్రైన్ ఎక్కి కూర్చున్నాను. జనరల్ కంపార్టుమెంట్ ఎలా ఉంటుందనేది మొదటిసారి చూశాను. మొదటిసారి నేను ఒంటరిగా ప్రయాణం చేస్తుండటంతో కాస్త ఆందోళనగానే ఉంది. నా భయానికి తగ్గట్టే ఇద్దరు వ్యక్తులు నన్నే తీక్షణంగా చూస్తున్నారు. సమస్యల్లో పడ్డానేమోనని భయమేసి, "బాబా! నన్ను రక్షించండి" అని ప్రార్థించాను. వేరే చోటుకి వెళ్దామంటే అడుగు తీసి అడుగు వేయడానికి ఖాళీ లేదు. బాబా ఒక్కరే నన్ను ఆ స్థితిలో కాపాడగలరని బాబానే తలుచుకుంటూ ఉన్నాను. ఒక స్టేషన్ దాటిన తర్వాత దాదాపు 28 ఏళ్ల వయసున్న ఒక వ్యక్తి వచ్చి నా ఎదురుగా కూర్చున్నాడు. అతడు నాతో మాట్లాడుతూ ఉంటే, నాకెందుకో అతని పట్ల నమ్మకం కలిగి, "ఇక్కడ నాకు సురక్షితంగా అనిపించడం లేదు, మీరు ఏసి కోచ్ వరకు నాకు తోడుగా వస్తారా?" అని అడిగాను. అతను నవ్వి, "నీ సంరక్షణ నా బాధ్యత. ఎందుకు ఒంటరిగా వచ్చావు? ఇంత అజాగ్రత్తగా ఎందుకున్నావు?" అని మందలించారు. రాత్రి ఒంటిగంటన్నర సమయంలో ఒక స్టేషనులో ట్రైన్ ఆగింది. మేమిద్దరం దిగి 600 మీటర్ల దూరంలో ఉన్న ఏసి కోచ్ కి వెళ్ళాం. అక్కడవరకు అతను నాకు తోడుగా వచ్చి, "నేను కోరుకున్నది ఇదే. నువ్వు సురక్షితంగా నీ గమ్యం చేరుకోవాలి. ఎప్పుడూ నన్ను మర్చిపోకు" అని చెప్పి వెళ్లిపోయారు. ఆ తర్వాత రాత్రంతా అదే విషయం నా మదిలో మెదిలింది. చాలాసేపు ఆలోచించిన తరువాత "ఆయన మరెవరో కాదు, నా సాయే!" అని నాకర్థమైంది. అప్పుడు నేను, "బాబా! మీరు నాతోనే ఉన్నారా? ఈ ప్రయాణం అంతా నాకు తోడుగా వస్తున్నారా? ప్లీజ్! సమాధానం ఇవ్వండి" అని అడిగాను. ఉదయం నేను హరిద్వార్ చేరుకునేసరికి నా బాయ్‌ఫ్రెండ్ కూడా లక్నో నుండి హరిద్వార్ చేరుకున్నాడు. ఇద్దరం కలిసి హోటల్ కి బయలుదేరాం. నా మనసులో రాత్రి జరిగినదాని గురించి ఆలోచనలు సాగుతున్నాయి. మేము హోటల్లో అడుగుపెడుతూనే దాదాపు గోడలో సగభాగం ఆవరించి ఉన్న పెద్ద ఫోటో రూపంలో బాబా దర్శనమిచ్చారు. బాబాను చూడగానే, 'నాకు తోడుగా ఉన్నా'నని ఆయన సమాధానమిచ్చారని నాకర్థమైంది. బాబా ఎప్పుడూ మనకు తోడుగా ఉంటారు, అవసరంలో ఆదుకుంటారు.

సాయి ప్రేమను మించినదేదీ లేదు


అందరికీ సాయిరాం! నా పేరు భాను. నిజామాబాదు నివాసిని. ఇదివరకు రెండుసార్లు నా అనుభవాలను బ్లాగు ద్వారా మీతో పంచుకున్నాను. ఇప్పుడు మరికొన్ని అనుభవాలను మీతో పంచుకోవడం ఆనందంగా ఉంది.

మా నాన్నగారు నా చిన్నప్పుడే చనిపోయారు. నాకు ఒక అన్న, ఒక అక్క ఉన్నారు. నా చిన్నతనంలోనే వాళ్ళ వివాహాలు జరిగిపోయాయి. నా చిన్ననాటినుండి నేను హాస్టల్లోనే ఉండేదాన్ని. మా అమ్మ అన్న దగ్గర ఉండేది. మా అన్న ఎప్పుడూ త్రాగి ఇంట్లో గొడవ చేస్తూ ఉండేవాడు. నేను సెలవులకి ఇంటికి వెళ్ళినప్పుడు అన్న చేసే గొడవల గురించి అమ్మ నాతో చెప్పుకునేది. నన్ను కూడా మా అన్న తిట్టి గొడవ చేస్తుండేవాడు. అందువలన హాస్టల్లోని వారంతా సెలవలు ఎప్పుడు వస్తాయా, ఇంటికి ఎప్పుడు వెళ్తామా అని ఎదురుచూస్తుంటే, నేను మాత్రం సెలవులు వస్తున్నాయంటే చాలు భయపడిపోయేదాన్ని. చిన్ననాటినుండి బాబా భక్తురాలినైన నేను ప్రతి విషయంలో బాబాపైనే ఆధారపడుతుండేదాన్ని.

మొదటి అనుభవం:

2012వ సంవత్సరంలో నేను డిగ్రీ చదువుతున్నప్పుడు చాలా రోజుల పాటు కుడి ఉదరభాగంలో బాగా నొప్పి వస్తుండడంతో ఒకరోజు మా అమ్మ, అక్క నన్ను హాస్పిటల్ కి తీసుకెళ్ళారు. డాక్టరు కొన్ని పరీక్షలు చేసి, స్కానింగ్ చేయించమన్నారు. స్కానింగ్ రిపోర్ట్ చూసి డాక్టరు, "కిడ్నీలో రాయి ఉంది. పైగా కుడి కిడ్నీ వాచింది. చిన్న వయసే కాబట్టి ఖచ్చితంగా నయమవుతుంది. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే నెఫ్రాలజీ డాక్టరుని సంప్రదించండి" అని చెప్పారు. దాంతో అమ్మ, అక్క చాలా భయపడిపోయారు. అక్క, "ఎప్పుడూ దేవుడిని అతిగా నమ్ముతావు కదా! ఇప్పుడు నిన్నే దేవుడు ఆదుకోలేకపోయాడు" అని పెద్దగా ఏడ్చేసింది. నేను మాత్రం బాబాయే దిక్కు అని ధైర్యంగా ఉన్నాను. ఆ రాత్రి నేను, "బాబా! రేపు స్కానింగులో ఏ సమస్యా చూపించకూడదు. నన్ను నువ్వే కాపాడాలి" అని ప్రార్థించాను. మరుసటిరోజు నెఫ్రాలజీ డాక్టరుని సంప్రదిస్తే, అతను ఇంజక్షన్ ఇచ్చి స్కాన్ చేసారు. బాబా చేసిన చమత్కారం చూడండి! కిడ్నీలో ఎటువంటి సమస్యా లేదు, అంతా బాగానే ఉందని రిపోర్ట్ వచ్చింది. ఆ కష్టసమయంలో నన్ను ఆదుకున్న నా సాయినాథునికి నేను సదా కృతజ్ఞురాలినై ఉంటాను. 

రెండవ అనుభవం:

2013వ సంవత్సరంలో ఒకరోజు, నాకు బాబా అంటే చాలా ఇష్టమని, మా హాస్టల్లో ఉండే ఒక చెల్లి నన్ను బాబా మందిరానికి తీసుకెళ్ళింది. ఆ మందిరం మెయిన్ రోడ్డు నుండి బాగా లోపలకి ఉండడం వలన అక్కడొక మందిరం ఉందని చాలామందికి తెలియదు. అక్కడ బాబా విగ్రహం నుండి తేనె వస్తుందని చెప్తారు కానీ, నేను వాటిని నమ్మలేదు. కేవలం బాబా దర్శనం కోసం మందిరానికి వెళ్లి ఆనందపడేదాన్ని. ఆ తరువాత ప్రతిగురువారం వేకువనే 4 గంటలకి లేచి హమల్ వాడి బాబా మందిరానికి నడిచి వెళ్తుండేదాన్ని. ఎక్కడ బాబా మందిరం ఉందన్నా వెళ్లి చూడాలని నాకు చాలా ఆత్రంగా ఉంటుంది. అందువలన నేను చాలా మందిరాలు దర్శించాను. 3 సంవత్సరాలు గడిచాక ఒకరోజు రాత్రి నేను మొదటిసారి వెళ్ళిన తేనె సాయిబాబా మందిరం స్వప్నంలో కనిపించింది. ఆ మందిరం ఎందుకు కలలో కనిపించిందో నాకు అర్థం కాలేదు కానీ, మరుసటిరోజు ఆ మందిరానికి వెళ్లి బాబా దర్శనం చేసుకున్నాను. బాబా విగ్రహాన్ని చూస్తుండగా పక్కనే ఉన్న ద్వారకామాయి సాయి ఫోటో మీద నా దృష్టి పడింది. ఆ ఫొటోలో బాబా చాలా ఆకర్షణీయంగా కనిపించారు. ఎన్నో మందిరాలు దర్శించినప్పటికీ ఈ మందిరంలోనే బాబాకి చామరం వీచే అవకాశం నాకు వచ్చింది. తరువాత మందిర ప్రాంగణంలో ఉన్న చెట్ల ఆకులు రాలిపడి అక్కడంతా చెత్తగా ఉండటం చూసి నా మనస్సుకు బాధగా అనిపించి, ఎవరినీ అడగకుండా చీపురు తీసుకుని ఆ ఆవరణ అంతా శుభ్రం చేసాను. అక్కడే ఎక్కువ సమయముంటే పూజారిగారు తిడతారేమోనని మొదట్లో భయపడేదాన్ని. కానీ బాబా కృపవలన అతనేమీ అనలేదు. అతను ఇతర పూజార్ల వలె దక్షిణలు వంటివి ఏమీ తీసుకోకుండా అందరితో కలుపుగోలుగా ఉండేవారు. అక్కడి పద్ధతులన్నీ నచ్చి ప్రతిరోజూ మందిరానికి వెళ్లి ఎక్కడా చెత్త లేకుండా శుభ్రంగా చూసుకునేదాన్ని. ఎక్కువ సమయం మందిరంలోనే కూర్చుని బాబా విగ్రహాన్ని చూస్తూ ఉండేదాన్ని. ఒకరోజు మధ్యాహ్న ఆరతి అయ్యాక కూర్చుని బాబాను చూస్తుంటే పూజారిగారు నా దగ్గరకి వచ్చి, "అమ్మా, గుడికి తాళం వెయ్యాలి. కానీ నువ్వు బాబాని చూస్తూ కూర్చున్నావు. అందుకే ఈరోజు నీకోసం తాళం వెయ్యను. సాధారణంగా అయితే తాళాలు వేసే వెళ్తాను. నువ్వు బాబాను చూసుకున్నంతసేపు చూసుకుని, తాళం వేసి, నేను ఒక చోటు చూపిస్తాను, ఎవ్వరూ చూడని సమయంలో అక్కడ తాళం చెవి పెట్టి వెళ్ళు. నీకు కాబట్టి ఆ రహస్యం చెప్పాను, వేరే ఎవరికీ చెప్పము" అని చెప్పారు. అప్పటినుండి నేను ప్రతిరోజూ నాకు నచ్చినంతసేపు బాబాని చూసుకుంటూ ఉండేదాన్ని. బాబా వస్త్రాలు తీయగానే ఉతికి ఆరవేసేదాన్ని. ఆరతుల సమయానికి అన్నీ సిద్ధం చేసేదాన్ని. ఆరతి పూర్తైన తరువాత బాబా కోసం భక్తులు తెచ్చిన భోజనం, చపాతీలు, పండ్లు బాబాకి నైవేద్యం పెట్టి, తరువాత వాటిని నాకిచ్చేవారు. అక్కడే తిని అక్కడే పడుకునేదాన్ని. నాకెప్పుడూ భయం అనిపించలేదు. అలా హాస్టల్లో కంటే బాబా మందిరంలోనే ఎక్కువ సమయం గడిపేదాన్ని, బాబా దగ్గరే నా రోజంతా గడిచిపోయేది. నా భక్తిని చూసి పూజారిగారు, "ఇంత చిన్నవయసులో నీకింత భక్తి ఎలా వచ్చిందమ్మా” అని ఎంతో సంతోషపడేవారు. మందిరానికి వచ్చేవారంతా నన్ను వారి కూతురిలా చూసుకునేవారు. నాకు ఉండడానికి చోటు లేక బాధపడుతున్న సమయంలో బాబా నా కలలోకి వచ్చి నన్ను తన దగ్గరకి తీసుకున్నారు. బాబా మందిరమే నాకు ఆశ్రయం అయింది. బాబాకి వచ్చిన భోజనం నా కడుపు నింపింది. ఒకప్పుడు ఏడుస్తూ గడిపిన నా జీవితానికి బాబా ఆనందం తీసుకుని వచ్చారు. నా జీవితంలో బాబా చేసిన సహాయం నేనెప్పటికీ మరిచిపోలేను. నిజంగా బాబా తోడు లేకుండా నేను బ్రతకలేను. ఆయనిచ్చిన జీవితమే నాది. బాబాతో నాకు ఎన్నోజన్మల ఋణానుబంధం ఉందేమోనని నాకు అనిపిస్తూ ఉంటుంది. అందుకే తండ్రిలేని నన్ను తండ్రిలా అక్కున చేర్చుకున్నారు.

తన బిడ్డలు బాధలో ఉంటే బాబా చూడలేరు.


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ  -  సబూరి

యు.ఎస్.ఏ నుండి ఒక సాయిభక్తురాలు తన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.

నేను గత కొన్ని సంవత్సరాలుగా బాబా భక్తురాలిని. నా వైవాహిక జీవితంలో చాలా సమస్యలతో సతమతమవుతున్న సమయంలో బాబా నా జీవితంలోకి వచ్చారు. ఆయన రాకతో నాకు శాంతి చేకూరి, నా జీవితం పూర్తిగా మారిపోయింది. ఆయన చిన్నా, పెద్దా అని తేడా లేకుండా ప్రతి సమస్యను పరిష్కరించారు. ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను. ఆయన నా ప్రార్థనను మన్నించి ఒక తల్లిలా నన్ను రక్షించారు. ఒక తండ్రిలా, గురువులా సలహాలు, సూచనలిస్తూ నన్ను నడిపిస్తున్నారు. "బాబా! ఈ జన్మలోనే కాదు, ప్రతి జన్మలోనూ నాకు తోడుగా ఉండండి. ఎప్పుడూ నా చెయ్యి వదిలిపెట్టకండి. మీరు లేని జీవితాన్ని నేను ఊహించుకోలేను".

నేను నా భర్తతో యు.ఎస్.ఏ లో ఉంటున్నాను. బాబా అనుగ్రహంతో నేను ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు, కాన్పు సమయంలో నాకు సహాయంగా ఉండటం కోసం యు.ఎస్.ఏ రావడానికి మా అమ్మకి టికెట్స్ బుక్ చేసాం. అయితే ఆమె ప్రయాణానికి ఒక వారం ఉందనగా మా అమ్మావాళ్ల ఇంటి పక్కింటి వాళ్ళు మా ఇంటికి, వాళ్ల ఇంటికి మధ్యలో ఉన్న ఉమ్మడి కాంపౌండ్ గోడకి సంబంధించిన ఒక సమస్య తెచ్చిపెట్టారు. వాళ్లు అనేది ఏమిటంటే, ఆ గోడ ద్వారా వాళ్ళ ఇంటిలోకి నీళ్లు వచ్చేస్తున్నాయని. వాళ్లు ఫిర్యాదు చేస్తూ, మొత్తం తప్పంతా మా వాళ్ల మీద తోసేసారు. దాంతో మా వాళ్ళు ఆందోళనపడ్డారు. ఎందుకంటే,  పునర్నిర్మాణం చేయడానికి సమయం తక్కువగా ఉంది, పైగా డబ్బులు అందుబాటులో లేవు. అప్పుడు నేను, "బాబా! ఆ సమస్య పరిష్కరింపబడి, అమ్మ ప్రశాంతంగా ఇక్కడకు వచ్చేలా చూడండి. అలా జరిగితే ఆ అనుభవాన్ని బ్లాగు ద్వారా సాయిభక్తులతో పంచుకుంటాను" అని ప్రార్థించాను. ఈ విషయమై నేను క్వశ్చన్ & ఆన్సర్ సైటులో బాబాని అడిగితే, "ఒక వ్యక్తి మీ ఇంటికి వస్తాడు. అతని సహకారంతో మీ సమస్య పరిష్కరించబడుతుంది" అని వచ్చింది. ఆ మరుసటిరోజే భవన నిర్మాణానికి సంబంధించిన ఒక వ్యక్తి అమ్మా వాళ్ళ ఇంటికి వచ్చాడు. అతను అంతా పరిశీలించి, సింకు వద్ద ఒక డమ్మీ పైపు పెట్టాడు. అంతే! సమస్య తీరిపోయింది. మా వాళ్ల ద్వారా ఆ మాట వింటూనే నాకు చాలా సంతోషంగా అనిపించి, "బాబా! మీరు నా ప్రార్థనలు విన్నారు. మీకు చాలా చాలా ధన్యవాదాలు!" అని చెప్పుకున్నాను.

మరో అనుభవం:

ఒకసారి నేను ఆరోగ్య సమస్యలతో ఇబ్బందిపడుతూ, "ఈమధ్య నేను బాబాను సరిగ్గా గుర్తుచేసుకోవట్లేదు. కనీసం పూజ కూడా చేయలేకపోతున్నాను. నేను బాబాకి దగ్గరగా లేను, ఆయన నాతో లేరు" అని చాలా చాలా దిగులుపడ్డాను. కొద్దిసేపటికే ఒక సాయిబాబా వాట్సాప్ గ్రూపులో ఎవరో క్రింది మెసేజ్ పెట్టారు.

"నాకు దూరం అవుతున్నానని ఎప్పుడూ దిగులుపడకు. ఒక్కసారి నేను నా భక్తుల జీవితంలోకి వచ్చానంటే, ఇక నేనెప్పటికీ ఆ భక్తులని విడిచిపెట్టను. వాళ్లతో నేనెప్పుడూ ఉంటాను" -  సాయిబాబా.

ఆ మెసేజ్ చూస్తూనే నాకు కన్నీళ్ళు వచ్చేసాయి. నా సంతోషానికి అవధుల్లేవు. ఈ అనుభవంద్వారా తన బిడ్డలు బాధలో ఉంటే బాబా చూడలేరని నేను తెలుసుకున్నాను. "బాబా! నా ప్రార్థనలు వింటున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు. థాంక్స్ అన్న మాట చాలా చిన్నది. నిజంగా మీరు నాకు తల్లి‌,తండ్రి కన్నా ఎక్కువ రక్షణ ఇస్తున్నారు. తప్పులేవైనా వ్రాసి ఉంటే క్షమించండి బాబా".

పిలుపుతో ప్రమేయం లేకుండా ప్రేమ కురిపించే బాబా




భగవంతుని అవతారమైన సాయిబాబాకు నేను ఒక చిన్న భక్తురాలిని. నాలుగేళ్ళక్రితం నా జీవితం అంధకారమయంగా ఉన్న సమయంలో బాబా నా జీవితంలోకి ప్రవేశించారు. బాబా కృపతో మన జీవితంలోకి కర్మానుసారం ఎందరో వస్తారు, వెళ్తారు. కానీ బాబా ఒక్కరే ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎప్పటికీ మనల్ని విడిచిపెట్టరు. జీవితంలోని అతిదారుణమైన పరిస్థితుల్లో కూడా ఆయన మనతో ఉన్నానని తమ ఉనికిని తెలియజేస్తూ ఉంటారు. నేను బాబానే నా గురువుగా ఎంచుకున్నాను. నేనిప్పుడు మీతో ఒక చిన్న అనుభవాన్ని పంచుకుంటాను.

ఒకరోజు ఉదయాన అనుకోకుండా మా ఇంట్లోని మేడమెట్ల అంచులకు నా తల గుద్దుకుని విపరీతమైన నొప్పితో విలవిల్లాడిపోయాను. అంచు చాలా కోసుగా వుండడం, పైగా గుద్దుకున్నప్పుడు చాలా గట్టి శబ్దం రావడంతో తల భాగంలో చిట్లిందేమో, కుట్లు పడతాయేమోనని నేను చాలా భయపడిపోయాను. పెద్దగా వాపు కూడా వచ్చింది. వెంటనే మా దాదీ (అమ్మమ్మ/నానమ్మ) నన్ను వాష్ బేసిన్ దగ్గరకు తీసుకెళ్ళి దెబ్బ తగిలిన భాగంపై నీళ్లు చల్లింది. అలా చేయడంవల్ల వాపు తగ్గుతుంది. తర్వాత నేను బాధపడుతూ ఉండటంతో దాదీ గాయత్రి మంత్రం స్మరించడం మొదలుపెట్టింది. తను ఆ మంత్రాన్ని రెండుసార్లు స్మరించిందో, లేదో, అంతలోనే ఆమె ఒక దృశ్యాన్ని చూసింది. సాయిబాబా వచ్చి నాకు ఏ భాగంలో అయితే దెబ్బ తగిలిందో అక్కడ తమ అమృత హస్తాన్ని ఉంచి ఆశీర్వదించినట్లుగా తనకి కనిపించింది. వెంటనే ఆమె నాతో, "నువ్వు చాలా అదృష్టవంతురాలివి బేటా! నీకు చికిత్స జరిగిపోయింది. ఇంక దిగులుపడకు. బాబా నీకోసం ఉన్నారు, ఆయన నిన్ను ఆశీర్వదించారు" అని చెప్పింది. ఆ మాట నా మనసుకెంతో ఆనందాన్ని ఇచ్చింది. కానీ నొప్పి మాత్రం తీవ్రంగా నన్ను బాధిస్తోంది. అది భరించలేక ఏడుస్తూ ఉంటే తను నా దగ్గరకొచ్చి, "నువ్వు చాలా చాలా అదృష్టవంతురాలివి. నిన్ను ఆశీర్వదించడానికి బాబా స్వయంగా వచ్చారు. ఆయన రావడం నేను చూసాను" అని నమ్మకంగా చెప్పి, "కొంచెం ఓర్చుకో, కాసేపట్లో నొప్పి తగ్గిపోతుంది" అని చెప్పింది. ఆ తరువాత ఒకటి, రెండు గంటల్లో నొప్పి పూర్తిగా తగ్గిపోయింది. పైభాగంలో చిట్లనందున కుట్లు వేయాల్సిన అవసరం కూడా రాలేదు. అన్ని పరిస్థితులందు బాబా మనతో ఉన్నారు. ఆయన మననుండి ఏమీ ఆశించకుండా ప్రేమిస్తారు. ఎప్పుడైనా మనకి మానసికంగా గాని, శారీరకంగా గాని బాధ కలిగితే ఆయన ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటారు. ఆయన ప్రేమ స్వచ్ఛమైనది, సత్యమైనది. మనమంతా ఎప్పుడూ ఆయన చల్లని నీడలో ఉందాం. మనల్ని జాగ్రత్తగా కాపాడటానికి మన పిలుపుతో ప్రమేయం లేకుండా ఆయన ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. ఆయన ఉనికిని అనుభూతి చెందగలగడమే మనం చేయాల్సింది. "సాయిబాబా! దయచేసి మీ చిన్ని చిన్ని బిడ్డలందరినీ ఆశీర్వదించండి".

బాబా ఆశీస్సులతో శిరిడీ ప్రయాణం.


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ  -  సబూరి

తమిళనాడు నుండి సాయిభక్తుడు మధు తన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు:

నేను చిన్ననాటినుండి బాబా భక్తుడిని. బాబా నా జీవితంలో ఉన్నందుకు నేనెంతగానో సంతోషిస్తున్నాను. చాలా రోజులుగా నేను శిరిడీ ప్రయాణం ప్లాన్ చేస్తున్నాను కానీ, ప్రతిసారీ నిరాశే మిగిలేది. కొన్నాళ్ల క్రితం నేను టికెట్స్ బుక్ చేస్తే, తీరా మేము వెళ్ళవలసిన సమయం వచ్చేసరికి మా సిస్టర్ కి ఒంట్లో బాగోలేక హాస్పిటల్లో చేర్చాల్సి వచ్చింది. దాంతో నేను బాధగా మా ప్రయాణం రద్దు చేసుకోవాల్సి వచ్చింది. తర్వాత కూడా నేను శిరిడీ ప్రయాణం పెట్టుకున్నప్పటికీ ఏదో ఒక కారణంతో ఆగిపోవాల్సి వచ్చింది. నేను ఎంతో ఆత్రంగా ఎప్పుడు శిరిడీ వెళ్తానా అని ఎదురు చూస్తూ, "బాబా! మీ ఆశీస్సులతో నేను శిరిడీ రాగలిగితే నా అనుభవాన్ని బ్లాగు ద్వారా సాయిభక్తులతో పంచుకుంటాను" అని ప్రార్థించేవాడిని. చివరికి 2018 జూన్ లో బాబా ఆశీస్సులతో ఆరోజు వచ్చింది.

శిరిడీలో నేను మొట్టమొదటిసారి బాబా కూర్చున్న చెట్టును చూశాను. నిజంగా ఆ చెట్టు నీడన బాబా కూర్చుని ఉన్న అనుభూతి కలిగింది. ఆ చెట్టు చుట్టూ కంచె వేసి ఉన్నారు. అందువలన ఆకులకోసం అందరూ తమతమ పాట్లు పడుతున్నారు. కొందరైతే ఆ ఆకులకోసం అక్కడున్న సెక్యూరిటీ గార్డుకి డబ్బులు ఇవ్వడం కూడా నేను చూశాను. కానీ అలా చేయడానికి నా మనసు అంగీకరించలేదు. నేను, "బాబా! నాపై మీకు నిజంగా ప్రేమ ఉన్నట్లయితే, ఈ ఆకునిచ్చి నన్ను ఆశీర్వదించండి" అని ప్రార్థించి 10 ప్రదక్షిణలు చేద్దామనే ఉద్దేశ్యంతో మొదలుపెట్టాను. ప్రదక్షిణలు చేస్తున్నంతసేపు ఆగకుండా "బాబా! నన్ను ఆశీర్వదించండి" అని ప్రార్థిస్తూనే ఉన్నాను. తొమ్మిది ప్రదక్షిణలు పూర్తైనప్పటికీ ఆకు లభించలేదు. చివరి ప్రదక్షిణ చేస్తూ ఉండగా, అకస్మాత్తుగా రెండు ఆకులు నా ముందు రాలుతూ ఉండటం చూశాను. పట్టరాని ఆనందం నా మనస్సును కమ్మివేయగా, 'బాబా నన్ను ఆశీర్వదించార'ని సంతోషంగా ఆకులు తీసుకున్నాను. ఇది నాకొక అద్భుతమైన అనుభవం. బాబా ఉనికిని పూర్తిగా అనుభవించాను. ఇప్పుడు నా పేరెంట్స్ నాకు పెళ్ళి సంబంధాలు చూస్తున్నారు. నా గురించి అంతా తెలిసిన బాబా నాకు సరైన తోడునిస్తారని ఆశిస్తున్నాను. బాబా ఎప్పుడూ మనకు తోడుగా ఉంటారు. "లవ్ యు బాబా!"

బాబా భికాజీని ఆశీర్వదించిన లీల.


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ  -  సబూరి

బాబా భికాజీని ఆశీర్వదించిన లీల.

బాబా అనుగ్రహం భికాజీ హరి రిస్బూద్ మీద ఎంత గొప్పగా ఉందంటే, బాబా యొక్క ఈ మాటలను బట్టి అంచనా వేయవచ్చు: "అరే అన్నా! నేను మీ ఇంటికి వచ్చి ఉంటాను".

ఆసక్తికరమైన ఆ లీలను ముంబాయిలో నివసిస్తున్న భికాజీ మనుమడు అనిల్ నారాయణ్ రిస్బూద్ ఇలా వివరించారు:

"మా తాతగారు ఆధ్యాత్మిక వైద్యులు (వైద్), రాయగఢ్ జిల్లాలోని 'పేణ్' లో నివాసం ఉండేవారు. ఆయన ఆర్థిక పరిస్థితి అస్థిరంగా ఉండటంతో తరచూ రోగుల చికిత్స నిమిత్తం ముంబాయి వెళ్తుండేవారు. దాదాపు ప్రతినెలా అక్కడికి వెళ్ళి, వారం, అంతకన్నా ఎక్కువ రోజులు అక్కడే ఉండేవారు. అలా ముంబాయి వెళ్ళినప్పుడే ఆయన బాబా దైవత్వం గురించి విని, 1916వ సంవత్సరంలో శిరిడీ వెళ్లి, బాబా దర్శనం చేసుకుని, పేదరికంవల్ల తను పడుతున్న దురవస్థను విన్నవించుకోవాలని అనుకున్నాడు. అనుకున్నట్లుగానే శిరిడీ చేరి, బాబా దర్శనం కోసం ద్వారకామాయికి వెళ్ళాడు. ఆ సమయంలో బాబా భయంకరమైన కోపంతో ఉన్నారు. బాబా శాంతించిన తరువాత ఆయన పాదాలమీద పడాలని భికాజీ అనుకుని ధర్మశాలకు తిరిగివచ్చి, భోజనం చేసి నిద్రపోయాడు. కాసేపటికి బాబా కలలో దర్శనమిచ్చి, "నీవు నిద్రపోవడానికి ఇక్కడకు వచ్చావా? లేక నన్ను కలవడానికా?" అని అడిగారు. అందుకు భికాజీ, "దేవా! మిమల్ని కలవడానికి నేను వచ్చినప్పుడు మీరు కోపంగా ఉన్నారు. అందువలన నేను భయపడి తిరిగి వచ్చేసాను" అని చెప్పాడు. మళ్ళీ బాబా, "నేను నీ పేరు పెట్టి నిన్ను ఏమైనా అన్నానా?" అని అన్నారు. తక్షణమే భికాజీకి మెలకువ వచ్చి, బాబా వద్దకు వెళ్ళి ఆయన ముందు సాగిలపడ్డాడు. కొన్ని క్షణాల తరువాత బాబా, "అరె అన్నా! నేను నీ బిడ్డగా మీ ఇంటికి వచ్చి ఉంటాను. ఈ మాట గుర్తుపెట్టుకో అన్నా!  నాకు శ్రీపాద అని పేరు పెట్టు!" అని అద్భుతమైన పదాలు పలికారు. ఆ సమయంలో భికాజీ భార్య 6 నెలల గర్భవతి. ఆ మరుసటిరోజే భికాజీ తిరిగి ఇల్లు చేరుకున్నాడు.

తరువాత భికాజీ భార్య ఒక గురువారంనాటి ఉదయం సుమారు 7 గంటల సమయంలో ఒక బిడ్డకు జన్మనిచ్చింది. ఆమె ప్రసవిస్తున్న సమయంలో భికాజీ తన ఇంటి గుమ్మం వద్ద నిల్చొని ఉండగా, ఒక ఫకీరు వీధిలో వెళ్తూ ఉన్నారు. ఆ ఫకీరు తీక్షణంగా అతని ఇంటివైపు చూస్తున్నాడు, కాని భికాజీ ఫకీరును అంతగా గమనించలేదు. బాబా సూచించిన ప్రకారమే మగబిడ్డ పుట్టాడు. బిడ్డకు శ్రీపాద అని పేరు పెట్టారు. అయితే ఆ పిల్లవాడికి మెడమీద ఒక విశేషమైన పుట్టుమచ్చ ఉంది. అది మూడు పోగుల గొలుసులాగా ఉండి, మధ్యలో తులసి ఆకు ఆకారంలో లాకెట్టు ఉన్నట్లుగా ఉంది.

శ్రీపాద అందంగా ఉండేవాడు. 5 సం౹౹ వయస్సు వచ్చేసరికి తల్లిదండ్రులు ఉపనయనం చేయాలని నిర్ణయించారు. ఆరోజు రాత్రి బాబా భికాజీకి కలలో కనిపించి పదే పదే ఇలా చెప్పారు: "ఇక నేను వెళ్ళిపోతున్నాను, నీ నుంచి నాకేమీ అక్కరలేదు" అని. అప్పడు భికాజీ, "నేను మా ఇంటికి రమ్మని పిలవడానికి మీ దగ్గరకు వచ్చానా? మరి అలాంటప్పుడు మీరు రావడం, పోవడం అన్న ప్రశ్న ఎలా వస్తుంది?" అని అడిగాడు. బహుశా ఉపనయనం చేయాలన్న ఆలోచనను బాబా ఆమోదించలేదేమో, ఎందుకంటే అతడు స్వామి దత్తాత్రేయుని అవతారం, ఏ కారణం చేతనో ఉపనయనం ఆగిపోయింది. మళ్ళీ ఆ కుర్రవాడికి 8 సంవత్సరాల వయస్సున్నప్పుడు ఉపనయనం విషయం తలెత్తింది. అప్పడు కూడా ఏవో కారణాలతో తండ్రి కొంతకాలం తరువాత చేద్దామని నిర్ణయించాడు.

తరువాత ఒకసారి శ్రీపాద అడవిలోకి వెళ్ళినప్పుడు ఒక ముల్లు అతని పాదంలో గుచ్చుకుని ధనుర్వాతానికి దారితీసింది. వైద్యులు చికిత్స చేసినా గుణం కనపడలేదు. ఒక గురువారంనాటి తెల్లవారుఝామున భికాజీకి కలలో బాబా కనిపించి, "నేనిప్పుడు వెళ్ళిపోతున్నాను. ఇక మీదట నేనుండలేను. అల్లా నిన్ను అనుగ్రహిస్తాడు" అని చెప్పారు. వెంటనే భికాజీ మంచం మీద నుంచి దిగి, ఇంటి గుమ్మం వద్ద నిలుచున్నాడు. ఆ క్షణాన ఒక ఫకీరు తీక్షణంగా ఇంటివైపు చూస్తూ వెళ్ళిపోతున్నాడు. అకస్మాత్తుగా భికాజీకి శ్రీపాద పుట్టినప్పుడు ఇదే ఫకీరు ఇంటిముందు నడుచుకుంటూ వెళ్ళిన సంగతి గుర్తుకువచ్చింది. వెంటనే భికాజీ పరిగెత్తుకుంటూ శ్రీపాద నిద్రిస్తున్న చోటుకు వెళ్లి చూసాడు. కానీ పాపం అప్పటికే అతను మరణించాడు​. శ్రీపాద ప్రపంచంలోకి వచ్చింది గురువారం ఉదయం 7 గం||లకు, మళ్ళీ అదే గురువారం అదే సమయానికి చనిపోయాడు. పైగా అతను పుట్టేటప్పుడు, చనిపోయేటప్పుడు అదే ఫకీరు ఇంటివైపు తీక్షణంగా చూస్తూ నడుచుకుంటూ వెళ్ళాడు. ఈ రెండింటికి సంబంధం ఏమిటనేది అగోచరమైన విషయం. ఆ ఫకీరు ఆ తరువాత ఎవ్వరికీ, ఎక్కడా కనపడలేదు".

చివరిగా అనిల్ నారాయణ రిస్బూద్, "బాబా మా ఇంటిలోకి శ్రీపాద రూపంలో వచ్చారు, మా ఇంటిని పవిత్రం చేసారు. తరువాత కూడా ఆయన అనుగ్రహం, దయ మా మీద కురిపిస్తూనే ఉన్నారు" అని చెప్పారు.

సోర్స్: శ్రీ సాయిలీల పత్రిక, డిసెంబర్ 1989.
Baba's Divine Manifestations. రచన: విన్నీ చిట్లూరి.

నమ్మకముంటే బాబా అనుగ్రహానికి లేదు కొదవ!


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ  -  సబూరి

ముంబాయినుండి ఒక అజ్ఞాత సాయిభక్తుడు తన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.

సాయిభక్తులందరికీ ఓం సాయిరాం! సాయి కృపతో నాకు చాలా అనుభవాలున్నాయి. వాటిలో ఒకదానిని నేనిప్పుడు మీతో పంచుకుంటాను.

నేను ముంబాయిలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాను. సాయి కృపతో నా వ్యక్తిగత జీవితం, వృత్తిపరమైన జీవితం సాఫీగా సాగుతున్న సమయంలో హఠాత్తుగా కొన్ని సమస్యలు నా వృత్తి జీవితంలో తలెత్తాయి. నేనెప్పుడూ నా పనిని కష్టపడి క్లయింట్ కి నచ్చేవిధంగా చేస్తూ ఉండేవాడిని. అలా నేను చాలా ప్రాజెక్ట్స్ విజయవంతంగా పూర్తి చేశాను. ప్రాజెక్టుకి సంబంధించిన అన్ని బాధ్యతలు నా మీదే ఉన్నా, నేను అది నా ఉద్యోగధర్మంగా భావించి శ్రమ అనుకోకుండా పనిచేస్తుండేవాడిని. అయితే అనుకోకుండా కంపెనీ వైపు నుండి చాలా ఒత్తిడి నా మీద పడింది. వాళ్ళు పరిమితికి మించి నా మీద పనిభారం వేస్తుండేవారు. అదేవిషయం నేను మేనేజ్‌మెంటుకి తెలియజేసినా, అన్ని కంపెనీల మాదిరిగానే వాళ్లు కూడా వర్క్‌ని స్టాఫ్‌కి పంపిణీ చేస్తామని చెప్పేవారు. కానీ సమయం గడుస్తున్నా అలా ఏం జరగలేదు. దానితో నేను ఆ ఒత్తడి తట్టుకోలేక ఉద్యోగానికి రాజీనామా చేయాలని పెద్ద నిర్ణయం తీసుకున్నాను. నాకున్న నమ్మకం బాబా. ఆయన నన్నెప్పుడూ విడిచిపెట్టరని నాకు పూర్తి నమ్మకం. ఆ నమ్మకంతోనే నేను జాబ్ వదిలేశాను. తరువాత ఏ కంపెనీ నుండి ఇంటర్వ్యూ కాల్స్ కూడా వచ్చేవికావు. ఉద్యోగం లేకుండా ఎనిమిది నెలలు గడిచిపోయాయి. కానీ, "బాబా నాకు మంచి చేస్తారని, సరైన మార్గంలో నడిపిస్తార"ని నా మనసు చెప్తూ ఉండేది.

ఇక నేను ఉద్యోగ ప్రయత్నాలేవీ ఫలించడం లేదని, ఉద్యోగ ప్రయత్నాలను వదిలేసి పూర్తి భారం బాబా మీద వేశాను. నాకు భార్య, పిల్లలతో కూడిన చక్కటి కుటుంబం ఉంది. నా భార్య గృహిణి, పిల్లలు చదువుకుంటున్నారు. ఒక మెట్రోపాలిటన్ సిటీలో కుటుంబంతో ఉద్యోగం లేకుండా గడపడం ఎంత కష్టమో ఎవరైనా ఊహించగలరు. కానీ అటువంటి పరిస్థితిలో కూడా డబ్బులకి సంబంధించి అన్నీ సక్రమంగా జరుగుతుండేవి. అంతా బాబాయే నడిపిస్తుండేవారు. అస్సలు నేను ఊహించని విధంగా డబ్బులు అందుతూ ఉండేవి. అలా ఎనిమిది నెలలు గడిచిన తర్వాత, ఏదో మామూలుగా నా స్నేహితుడు తను పనిచేస్తున్న మల్టీనేషనల్ సాఫ్ట్‌వేర్ కంపెనీలో నా ఉద్యోగానికి సిఫార్సు చేశాడు. అయితే నేను సిద్ధంగా లేనందున ఇంటర్వ్యూకి వెళ్లడానికి కూడా నాకు ఆసక్తి లేదు. పైగా నేను విసుగుచెంది, ఐటీ కంపెనీలో ఉద్యోగం చేయకూడదన్న స్థితిలో ఉన్నాను. ఇలా ఉండగా ఒకరోజు నా స్నేహితుడు సిఫార్సు చేసిన కంపెనీనుండి ముఖాముఖి ఇంటర్వ్యూకి హాజరుకమ్మని ఫోన్ వస్తే వెళ్ళాను. ఇక బాబా మిరాకిల్ మొదలయింది. నన్ను ఇంటర్వ్యూ చేయడానికి అక్కడున్న వ్యక్తి మరెవరో కాదు, నా స్నేహితుడే. ఇదివరకు మేమిద్దరం ఒకే సంస్థలో కలిసి పనిచేశాం. నిజానికి నన్ను ఇంటర్వ్యూ చేయవలసిన వ్యక్తి అతను కాదు. అసలు వ్యక్తికి ఏదో అత్యవసరమైన పని ఉండటం వలన ఇంటర్వ్యూ తీసుకోవడానికి నా స్నేహితుడు కూర్చున్నాడు. మీరే ఊహించండి, నిజంగా ఇది ఎంత పెద్ద మిరాకిలో! నా ఇంటర్వ్యూ కేవలం నామమాత్రమే అయ్యింది. తర్వాత మేనేజ్‌మెంట్ రౌండ్ కూడా నేను శ్రమపడకుండానే పూర్తిచేయగలిగాను. అలా నేను ఆ ఉద్యోగానికి ఎంపికయ్యాను. 8 నెలల గ్యాప్ తరువాత, ముందు చేసిన కంపెనీలో నేను అందుకున్న జీతం కంటే అధిక జీతం వచ్చేలా బాబా అనుగ్రహించారు. మన సాయి ఎలా ప్రతి ఒక్కరి జీవితాన్ని మలుస్తారో చూడండి! నేను ప్రతి సాయిభక్తుడికి చెప్పేది ఒక్కటే - "ప్రతి వారి జీవితంలో సమస్యలు వస్తాయి, అయితే మన దైవం పట్ల నమ్మకాన్ని ఎప్పుడూ ఉంచుకోవాలి. ఇకపై నేను ఎంత పెద్ద సమస్య ఎదురైనా భయపడను, నాకు తెలుసు, నా సాయి అన్నీ జాగ్రత్తగా చూసుకుంటారు. ప్లీజ్.. ప్లీజ్.. నమ్మకం ఉంచండి మన సాయి యందు. ఆయన భౌతిక శరీరంతో లేకపోయివుండొచ్చు కానీ, ఆయన ఆశీస్సులు అందరిపైనా ఉన్నాయి".

అమ్మ కాన్సర్ నియంత్రణలోకి వచ్చేలా బాబా అనుగ్రహించారు.


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ  -  సబూరి

ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు:

నేనొక సాధారణమైన బాబా భక్తురాలిని. ముందుగా, "బాబా! మీకు నా కృతజ్ఞతలు. ప్రతి చిన్న విషయంలోనూ మీ సహాయాన్ని మాకు అందిస్తున్నారు".

తెలిసి, తెలియక చిన్న చిన్న విషయాలను కూడా మనం బాబాని అడుగుతాం, తర్వాత వాటి సంగతే మర్చిపోతాం. కానీ బాబా అవి చిన్నవైనా పెద్దవైనా మర్చిపోకుండా వాటిని నెరవేరుస్తూ ఉంటారు. నేనిప్పుడు చెప్పబోయే అనుభవం మా జీవితంలో పెద్ద మిరాకిల్.

కొన్నినెలలక్రితం హఠాత్తుగా మా అమ్మకి క్యాన్సర్ వ్యాధి సోకిందని తెలిసింది. అది తెలిసి మేమంతా కుప్పకూలిపోయాము. డాక్టర్లు, "వ్యాధి తొలిదశలో ఉంది" అని చెప్పారు. రిపోర్ట్స్ వచ్చిన దగ్గరనుండి నేను బాబాని నిరంతరం ప్రార్థిస్తూ ఉండేదాన్ని. అయితే  అది నియంత్రణలో ఉందా, లేదా అని ప్రతినెలా పరీక్ష చేయిస్తుండేవాళ్ళం. నేను, "బాబా! దయచేసి అమ్మ క్యాన్సర్ నియంత్రణలో ఉండేలా చేసి, త్వరలోనే పూర్తిగా నయమయ్యేలా చేయండి" అని ప్రార్థించేదాన్ని. ఇలా కొన్నినెలలు గడిచిపోయినా నేను నా ప్రార్థనలను మాత్రం ఆపలేదు. ఇలా ఉండగా, ఒకరోజు స్పెషల్ పరీక్షలు చేయించాం.  రిపోర్ట్స్ చూసి డాక్టర్లు, "ఆమె వ్యాధి చాలావరకు నియంత్రణలోకి వచ్చింది. ఇప్పుడిక రోజుకు ఒక టాబ్లెట్ మాత్రం తన జీవితాంతం తీసుకుంటే సరిపోతుంది" అని చెప్పారు. ఈ అద్భుతాన్ని బాబాయే చేసి, తను మాతో ఉన్నానని, మా ప్రార్థనలను వింటున్నానని తెలియజేశారు. ఆయనకు కృతజ్ఞతలు చెప్పుకోడానికి నా దగ్గర పదాలు లేవు. బాబా ఆశీస్సులు తోడుగా ఉంటే అసాధ్యమన్నది లేదు. మనము ఊహించరానిది కూడా  ఊహించవచ్చు.

మరో అనుభవం:

నేను తరచూ ఆఫీసుకి క్యాబ్ లో వెళ్తూ ఉంటాను. ఇటీవల ఒకరోజు రాత్రి, "బాబా! రేపు మీరు నాతో రండి" అని ప్రార్థించాను. మరుసటిరోజు ఉదయం నా సాధారణ అలవాటు ప్రకారం క్యాబ్ బుక్ చేశాను. క్యాబ్ లో అడుగుపెడుతూనే కారు మిర్రర్ కి తగిలించి ఉన్న బాబా ఫోటో చూసి ఆశ్చర్యపోతూ, సంతోషంగా నవ్వుతూ, "బాబా! ఈరోజు నన్ను తీసుకెళ్లడానికి మీరు వచ్చారా!" అని అనుకున్నాను. ఎన్నో క్యాబ్‌లు ఉన్నా, బాబా ఉన్న క్యాబ్ నాకోసం వచ్చింది. జీవితంలో ఏదీ యాదృచ్ఛికంగా జరిగేది కాదు, అంతా భగవంతుని సంకల్పమే. బాబా అతి నిరాడంబరమైన దేవుడు. ఆయనకు కావలసింది స్వచ్ఛమైన ప్రేమ, ఆయన పట్ల విశ్వాసం అంతే! భక్తులు ప్రపంచంలో ఎక్కడున్నా ఆయన పరిగెత్తుకుంటూ వస్తారు. మనము కొండంత నమ్మకాన్ని పెట్టుకుంటే చాలు.  ఒక్కోసారి పరిస్థితులు క్లిష్టంగా అనిపిస్తాయి, అయితే బాబా వాటిద్వారా మనకు ఏదో మంచి చేయాలని అనుకుంటున్నారని అర్థం. కేవలం బాధపడుతూ ఉండకుండా ప్రార్థిస్తూనే ఉంటే ఆయన అనుగ్రహం లభిస్తుంది. ఎవరూ తోడురాని సమయంలో మన సాయి వస్తారు. మనం కష్టంలో ఉన్న ప్రతిసారీ ఆదుకోవడానికి ఆయన వస్తారు.

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo