సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

భావూ రాజారామ్ అంబిక


భావూ రాజారామ్ అంబిక సతారా జిల్లా, వడుజ్ నివాసి. అతడు వడుజ్ లోని ప్రాథమిక ఆరోగ్యం మరియు ఇమ్యునైజేషన్ శాఖకు సంబంధించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పని చేసేవాడు. ఒకరోజు తనకి నాసిక్ జిల్లాకు బదిలీ అయినట్లుగా ఉత్తర్వులు రావడంతో అతడు చాలా అసంతృప్తి చెందాడు. ఎందుకంటే ఆ రోజుల్లో రవాణా సౌకర్యాలు అంతగా లేనందున అంతదూరం గుర్రపు స్వారీ చేస్తూ ప్రయాణం చేయడం ఎంతో శ్రమతో కూడుకున్నది. పోనీ ఉన్న చోటనే ఉండాలన్నా లేక వేరే ప్రాంతానికి మార్పించుకోవాలన్నా ఇన్ ఛార్జ్ అధికారులు బ్రిటిషు వారైనందున వాళ్ళని అభ్యర్థించినా వాళ్ళు పట్టించుకోరు. అదంతా వృధా ప్రయాస అని భావూ ఏం చెయ్యాలో అర్థంకాని గందరగోళంలో పడ్డాడు. అలాంటి సమయంలో బాబా దైవత్వం, దయ గురించి అతని చెవినపడ్డాయి. వెంటనే శిరిడీ వెళ్లి బాబాకు రెండు పైసల దక్షిణ సమర్పించి తన సమస్యలు విన్నవించుకొని, వాటిని పరిష్కరించమని అడగాలని నిర్ణయించుకున్నాడు.

అనుకున్న ప్రకారం శిరిడీ చేరుకుని ద్వారకామాయిలో ప్రవేశించాడు. బాబా ఒక మూల కూర్చుని ఉన్నారు. ఆయన ముందు కొన్ని భాక్రీలు ఉన్న చిన్న మట్టికుండ(కొలంబా) ఉంది. బాబాతో పాటు రెండు కుక్కలు ఆ మట్టికుండనుండి ఆహారాన్ని తృప్తిగా తింటుండటం చూసి భావూ ఆశ్చర్యపోతూ, "జనులు ఈయనను గొప్ప సత్పురుషుడని అంటున్నారు. కానీ ఇక్కడ ఇతను చొంగ కారుస్తున్న కుక్కలతో కలిసి భోజనం చేస్తున్నాడు. ఎలాగూ ఇప్పుడు నేనిక్కడకు వచ్చాను కాబట్టి, ఒక నమస్కారం చేసుకుని వెళ్ళిపోవడం మంచిది" అని అనుకున్నాడు. అంతలో బాబా భావూ వైపు తిరిగి చూసి, "నా రెండు పైసలు ఇప్పటికిప్పుడే నాకివ్వు" అని అడిగారు. ఆశ్చర్యంతో భావూ రెండు పైసలు బాబాకి ఇవ్వబోతూ తన మనస్సులో, "బాబా నిజంగా గొప్ప మహాత్ముడు. ఆయన సర్వాంతర్యామి. వడుజ్ నుండి బయలుదేరేముందు రెండు పైసల దక్షిణ ఆయనకి ఇవ్వాలని నేను చేసుకున్న సంకల్పాన్ని ఆయన తెలుసుకున్నారు" అని అనుకున్నాడు. అతని మదిలో తలంపు ముగిసేలోపే, అతడేదో ఆ మాటలు బిగ్గరగా బయటికి చెప్పినట్లుగా బాబా, "నేను గొప్ప మహాత్ముడినా, కాదా; నేను చొంగకారుస్తున్న కుక్కలతో తినడం - వీటితో నీకు ఏమిటి సంబంధం? నీవు దర్శనానికి వచ్చావు. దర్శనం కూడా చేసుకున్నావు. ఇదిగో ఈ భాక్రీ ముక్క తీసుకుని బయలుదేరు" అని సమాధానం ఇచ్చారు. బాబా అలా చెప్పి, కొలంబా నుండి ఒక ముక్క భాక్రీ తీసి భావూ మీదకు విసిరారు. అప్పుడు భావూ, "బాబా! మళ్ళీ మీ దర్శనానికి నేనెప్పుడు రావాలి?" అని అడిగాడు. అందుకు బాబా, "నీవు మళ్ళీ ఎందుకు రావాలనుకుంటున్నావు? ఏమైనా దర్శనం చేసుకోవాలనుకుంటే ఇప్పుడే చేసుకో!" అని బదులిచ్చారు. ఇక వేరే దారిలేక భావూ అక్కడనుంచి వెళ్ళిపోయాడు. తన తిరుగు ప్రయాణంలో "బాబా నన్నెందుకు మళ్ళీ రమ్మనలేదు?" అని తీవ్రంగా ఆలోచించాడు. కానీ కారణం అంతుబట్టలేదు. వడుజ్ చేరుకున్నాక తిరిగి తన ఉద్యోగవిధులలో చేరినప్పుడు తనకొక ఆసక్తికరమైన విషయం తెలిసింది. అదేమిటంటే, నాసిక్ కు బదిలీ అయిన ఉత్తర్వులు రద్దు చేసి, వెంటనే వడుజ్ తిరిగి వెళ్ళాలన్న ఉత్తర్వులు కూడా జారీ అయి ఉన్నాయి. అప్పుడు "మళ్ళీ నువ్వెందుకు తిరిగి రావాలనుకుంటున్నావు?" అన్న బాబా మాటలకు అర్థం భావూకు బోధపడింది. ఎందుకంటే అప్పటికే బాబా తన కోరికను అనుగ్రహించేశారు.

బాబా సర్వజ్ఞులు. భావూ ఎందుకు శిరిడీ వచ్చాడో ఆయనకు తెలుసు. సర్వశక్తిమంతుడైన బాబా భావూ బదిలీ పత్రాలను రద్దు చేసారు. బాబా సర్వాంతర్యామి, ఆయన కుక్కలు మొదలగు అన్ని జీవులలో కూడా ఉన్నారు. దురదృష్టవశాత్తు భావూ ఏ సంవత్సరంలో శిరిడీ వెళ్ళిందీ స్పష్టంగా తెలియలేదు.

'ఆయనే భయం, భయానికి కారణం, ఆయనే భయనాశకుడు'. అందుకే బాబాని 'భూతకృత భయనాశనా' అని పిలుస్తారు.

ఆయనకు జరుగుతున్నవన్నీ తెలుసు, ఎందుకంటే అందుకు కారణం ఆయనే కాబట్టి. జరిపించేది ఆయనే. చర్య, దాని ఫలితం ఆయనే.

మూలం: సాయి ప్రసాద్ పత్రిక, వాల్యూమ్ 33, నెంబర్.9 
రచన: శశికాంత్ పి. అంబిక.
Baba’s Divine Manifestations compiled by Vinny Chitluri

3 comments:

  1. Om Sai Ram 🙏🌹🙏
    ఓం శ్రీసాయి ఆరోగ్య క్షేమదాయ నమః'

    ReplyDelete
  2. Om Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🕉🙏😀😊❤

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo