సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తురాలు శ్రీమతి రంగూతాయి



సాయిబాబా ప్రసాదాలయంలో సుమారు 35 సంవత్సరాలపాటు వంట చేసిన గొప్ప సాయిభక్తురాలు శ్రీమతి రంగూతాయి. శిరిడీలో శ్రీసాయిబాబా భౌతికదేహంతో ఉన్న కాలంలో ఆయనను ప్రత్యక్షంగా దర్శించిన భాగ్యశాలి ఆమె. శ్రీసాయిబాబా గురించి మనకు తెలియని ఎన్నో వాస్తవాలను, తన మదిలో నిక్షిప్తం చేసుకున్న ఎన్నో అద్భుత జ్ఞాపకాలను ఆమె సాటి సాయిభక్తులతో పంచుకుంటూ ఉండేది. శిరిడీ గ్రామస్తులు, శిరిడీ సందర్శించే సాయిభక్తులు ఆమెని ప్రేమ, ఆప్యాయతలతో 'తాయీ' అని పిలిచేవారు. రంగూతాయి కూడా అంతే ప్రేమతో వాళ్ళను ఆదరించేది, అందరినీ సమానంగా చూసేది. ఆమె ప్రతి ఒక్కరినీ తన సొంత బిడ్డల్లా చూసుకునేది. ఆమె నారాయణరావు కులకర్ణి గారి భార్య. ఆమెకు అతి చిన్న వయస్సులోనే, అంటే పదవ ఏటనే వివాహమైంది. ఆమెకు ఇద్దరు పిల్లలు - కేశవ్ మరియు రంగనాథ్. రంగనాథ్ కులకర్ణి శ్రీసాయిబాబా సంస్థాన్ ట్రస్టులో ఉద్యోగిగా పనిచేస్తున్నారు.

శ్రీమతి రంగూతాయి తన జీవితమంతా శ్రీసాయి సేవకు అంకితం చేసిన గొప్ప సేవాతత్పరురాలు. ఆమె నినాదం ఒక్కటే - "పని అంటే నిస్వార్థ సేవ". ఆమె మొదటి ఐదారు సంవత్సరాలు ఎటువంటి జీతం తీసుకోకుండానే ప్రసాదాలయంలో శ్రీసాయిబాబా కోసం మహానైవేద్యం తయారుచేసేది. ఆమె సాయంత్రం పూట తరచూ ఝుంకా భాకరి తయారుచేసి శ్రీసాయిబాబాకు నైవేద్యంగా సమర్పించేది. అది చాలా రుచికరంగా ఉండేది. అదే ఝుంకా భాకరి ఇంటిలో తయారుచేస్తే ఏమాత్రం రుచి ఉండేది కాదు. కేవలం ప్రసాదాలయంలో, అదికూడా రంగూతాయి చేతులమీదుగా తయారుచేసిన ఆహారమే రుచికరంగా ఉండేది. అది ఒక అద్భుతం.

మరో అద్భుతం ఏమిటంటే, వృద్ధాప్యం వచ్చాక శ్రీమతి రంగూతాయికి తీవ్రంగా ఒళ్ళునొప్పులు ఉండేవి. కాళ్ళు, చేతులు అనే కాకుండా మొత్తం ఒళ్ళంతా నొప్పులుండేవి. కానీ బాబా కోసం మహానైవేద్యం తయారుచేయడం మొదలుపెట్టిన సమయాల్లో ఆమె తన ఒంటిలో ఏదో తెలియని శక్తిని అనుభూతి చెందుతుండేది. దాంతో నొప్పులు తెలిసేవికావు. ఆ శక్తినిచ్చేది ఎవరో కాదు, శ్రీ సాయిబాబానే. ఆశ్చర్యంగా, వంట పూర్తిచేసి ఇంటికి వెళుతూనే ఆమె మళ్ళీ విపరీతమైన ఒళ్ళునొప్పులతో బాధపడుతుండేది. ఇది అందరికీ వింతగా ఉండేది. ఆమెతో పాటు పనిచేస్తున్న శ్రీమతి కృష్ణాబాయి గురావ్ కూడా అది చూసి ఆశ్చర్యపోతుండేది. ఆమె రంగూతాయిని తన సొంత తల్లిలా భావించేది. 

రంగూతాయికి ఒకసారి బాబా స్వప్నసాక్షాత్కారం ఇచ్చారు. గురుస్థాన్‌కి ఎదురుగా ఆమెకు ఒక స్థలం ఉండేది. సంస్థాన్ కోసం స్థలాలు సేకరించే క్రమంలో చాలామంది భక్తులు ఆ స్థలం కోసం ఆ కుటుంబీకులను సంప్రదించారు. కానీ ఆ స్థలంలోని కొద్దిభాగాన్ని ఇవ్వడానికి కూడా వాళ్ళు నిరాకరించారు. శ్రీమంతుడైన కేశవరావు బుట్టీ తన సంపదనంతా వెచ్చించి ఆ భూమిని ఖరీదు చేసి సంస్థాన్‌కి విరాళంగా ఇవ్వదలిచాడు. కానీ ప్రయోజనం లేకపోయింది. 1941లో రంగూతాయి భర్త నారాయణరావు మరణించాడు. 1942వ సంవత్సరం నుండి శిరిడీ వచ్చే భక్తుల సంఖ్య పెరగజొచ్చింది. వారికోసం వసతి గృహాలు నిర్మించాలని సంస్థాన్ సంకల్పించింది. అందుకోసం సంస్థాన్ వారు ఆ భూమికోసం మళ్ళీ వాళ్ళని సంప్రదించారు. అయితే కులకర్ణి కుటుంబం ఆ స్థలాన్ని అమ్మడానికి ఒప్పుకోలేదు. ఎన్నో ఏళ్లుగా తమకు భక్తులైన ఆ కుటుంబం మరియు సంస్థాన్ ఇరువురూ సంతోషపడేలా ఏదో ఒకటి చెయ్యాలని శ్రీసాయిబాబా సంకల్పించారు కాబోలు! 1944లోని శుభప్రదమైన శ్రావణమాసంలో ఒక గురువారంనాడు రంగూతాయికి స్వప్నంలో శ్రీసాయిబాబా దర్శనమిచ్చి, "ఆ స్థలాన్ని సంస్థాన్‌కి అమ్ము" అని చెప్పారు. మర్నాడు ఉదయం ఆమె తన కుమారుడు కేశవరావుకి తనకి వచ్చిన కల గురించి చెప్పి, ఆ భూమిని సంస్థాన్‌కి అమ్మమని చెప్పింది. శ్రీసాయిబాబా సూచన మేరకు ఆ భూమిని సంస్థాన్‌కే మంచి ధరకు అమ్మారు. శ్రీసాయిబాబా కృపతో సంస్థాన్ వారు ఆ భూమిని 1957-1959 ప్రాంతంలో స్వాధీనం చేసుకున్నారు. దస్తావేజులపై సాక్షిగా కేశవరావు సంతకం తీసుకున్నారు. అప్పట్లో ఉన్న శాంతినివాసం భవనం, ఇప్పుడున్న వాటర్ ఫౌంటేన్, లెండీబాగ్ కొంతభాగం ఈ స్థలంలోని భాగమే.

మొదట్లో ఆ భూమిలో స్మశానవాటిక ఉండేది. ఆ ప్రదేశం ఆరోగ్యానికి చాలా హానికరంగా ఉండేది. అందువలన రంగూతాయి కుమారుడు కేశవరావు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అక్కడినుండి స్మశానవాటికను తొలగించడానికి ఎంతో కృషి చేశాడు. చివరికి శ్రీసాయిబాబా కృపవలన అతని ప్రయత్నాలు ఫలించి, గౌరవనీయులైన అహ్మద్‌నగర్ కలెక్టర్ ఆర్డర్ నెంబర్ 165/17.8.59 కింద ఆ స్మశానవాటికను తొలగించారు.

సేవాతత్పరురాలైన శ్రీమతి రంగూతాయి 1978లో శ్రీసాయిబాబా సంస్థాన్ సేవల నుండి నిష్క్రమించింది. ఆమె 76 ఏళ్ళ వయస్సులో 1979, నవంబర్ 6, బుధవారం, పవిత్రమైన చతుర్థినాడు, సాయంత్రం 6 గంటలకి తుదిశ్వాస విడిచింది. ఆమె చివరిక్షణాల్లో తనకు బాబా ఊదీ, తీర్థం ఇవ్వమని అడిగింది. ఆమె వాటిని సేవించిన తరువాత 'సాయిబాబా' నామస్మరణ చేస్తూ దేహాన్ని వీడి ఆద్యంతరహితమైన శ్రీసాయిబాబా దివ్యచరణాలలో ఐక్యమైపోయింది. ఆరోజు శిరిడీ గ్రామమంతా దుఃఖంలో మునిగిపోయింది. ఆరోజు వాతావరణం కూడా దుఃఖభారంతో ఉన్నట్లు మేఘావృతమైంది.

శ్రీమతి రంగూతాయి వారసులంతా శ్రీసాయిబాబా ఆశీస్సులతో ఆనందంగా ప్రశాంతమైన జీవనాన్ని సాగిస్తున్నారు. ఈరోజుకీ శ్రీసాయిబాబా కోసం మహానైవేద్యాన్ని రంగూతాయి కోడలు శ్రీమతి ఉషాతాయి కులకర్ణియే తీసుకొస్తారు. ఇప్పటికీ శ్రీసాయిబాబా అనుగ్రహం ఆ కుటుంబంపై ఉన్నదనడానికి ఇదే నిదర్శనం.

source: Source: Article published in Shri Sai Leela Magazine, Year 1980. Translated from Marathi to English by Shri.Gaurav Shirke, Kalyan, Maharashtra)
http://www.saiamrithadhara.com/mahabhakthas/rangutai_narayana_kulkarni.html

4 comments:

  1. Om Sai
    Sri Sai
    Jaya Jaya Sai
    🙏🙏🙏

    ReplyDelete
  2. 🙏🌹🙏 ఓం సాయిరాం 🙏🌹🙏
    సర్వే జనా సుఖినోభవంతు.
    సర్వే సుజనా సుఖినోభవంతు.
    🙏🌹🙏 ఓం సాయిరాం 🙏🌹🙏
    ఓం శాంతి శాంతి శాంతిః!!

    ReplyDelete
  3. Om srisairam om srisairam om srisairam thankyou sister.

    ReplyDelete
  4. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo