సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

మేఘశ్యామ్


విరమ్‌గాఁవ్‌లో మేఘ అనే సాధారణ బ్రాహ్మణ భక్తుడుండేవాడు. అతని పూర్తి పేరు మేఘశ్యామ్. అతనెప్పుడూ 'ఓం నమఃశివాయ' అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూండేవాడు. అతనికి గాయత్రి, సంధ్య మంత్రం, బ్రహ్మయజ్ఞం, వైశ్వదేవం, రుద్రం మొదలైన బ్రాహ్మణ విధుల గురించి తెలియదు. అతనికి డిప్యూటీ కలెక్టరుగా పనిచేస్తున్న హరి వినాయక్ సాఠేతో పరిచయం ఏర్పడింది. సాఠే అతని శ్రేయస్సు కోరి అతనికి బ్రాహ్మణ విధుల గురించి వివరించి గాయత్రి మంత్రాన్ని, సంధ్య వార్చడాన్ని బోధించాడు. అంతేకాదు, ఖర్చులకు 8 రూపాయలిచ్చి, బ్రోచ్ అనే ఊరికి పంపి అక్కడ రోజువారీ శివపూజలో నియమించాడు. మేఘ ఎల్లప్పుడూ ఒంటికాలుపై నిలబడి శివుణ్ణి ఆరాధిస్తుండేవాడు.

క్రమంగా సాఠే, మేఘలిరువురి మధ్య పరస్పర అభిమానం పెరిగింది. సాఠేను మేఘ తన మార్గదర్శకునిలా భావిస్తుండేవాడు. కొన్నిరోజుల తరువాత సాఠే భావోద్వేగంతో తన సద్గురువైన సాయిబాబా గొప్పతనం గురించి మేఘకు వివరించి, "శివుని అవతారమైన నా గురువును మతాచారాలతో, గంగాజలంతో అభిషేకించాలని నా అభిలాష. నీ భక్తిశ్రద్ధలు చూసి నేను ఎంతో సంతోషిస్తున్నాను. అదృష్టముంటే, నీవు కూడా నా గురువైన సాయిబాబాను దర్శించి, ఆయన ఆశీస్సులు పొందాలని నేను కోరుకుంటున్నాను. అది నీ ఆధ్యాత్మికాభివృద్ధికి ఎంతో దోహదం చేస్తుంది" అని అన్నాడు. అప్పుడు మేఘ, "మీ గురువు ఏ కులానికి చెందినవారు?" అని అడిగాడు. అందుకు సాఠే, "ఆయన కులమేమిటో నాకు తెలియదు. హిందువులు, ముస్లింలు ఇరువురూ ఆయనను తమవారని చెప్పుకుంటారు. మసీదు ఆయన నివాసం. ఆయన ముందు నిరంతరం ధుని వెలుగుతూ ఉంటుంది. అందులోని అగ్నికి ఆయన తాము తెచ్చుకున్న భిక్షను అర్పిస్తారు" అని చెప్పాడు. ఆ మాటలు వింటూనే మేఘ స్తంభించిపోయాడు. కాసేపటికి తేరుకుని, "ఆయన నివాసం మసీదు అయినప్పుడు, ముస్లింలు ఆయనను తమవానిగా పరిగణించినప్పుడు ఆయన ముస్లిమే అయివుండాలి. ఒక యవనుడు ఎప్పుడైనా గురువు కాగలడా? లేదు, అలా ఎన్నటికీ జరగదు" అని అన్నాడు. సాఠేకు ఏమి చెప్పాలో తెలియలేదు. అయినప్పటికీ సాఠే చాలా ఒత్తిడి చేయడంతో మేఘ శిరిడీ వెళ్లి సాయిబాబాను దర్శించడానికి అంగీకరించాడు. అయితే బ్రోచ్ రైల్వేస్టేషనులో సాయిబాబా మహమ్మదీయుడని విని నిష్కపటి, ఆచారపరుడు అయిన మేఘ తానొక ముసల్మానుకు నమస్కరించాలా అని తీవ్రంగా కలతచెందాడు. తనను శిరిడీకి పంపవద్దని సాఠేని వేడుకున్నాడు. కానీ సాఠే పట్టుబట్టి, అతనిని సాయిబాబాకు పరిచయం చేయమని తన మామగారైన దాదాకేల్కర్‌కు ఒక లేఖ వ్రాసి అతనికిచ్చి శిరిడీ పంపాడు.

మేఘ శిరిడీ చేరుకుని మసీదులోకి ప్రవేశించగానే బాబా కోపంతో ఉగ్రరూపం దాల్చారు. చేతిలో రాయి పట్టుకుని, "నువ్వు లోపలికి అడుగుపెట్టకు. నేను తక్కువ జాతికి చెందిన యవనుణ్ణి. నువ్వు ఉన్నత తరగతికి చెందిన బ్రాహ్మణుడివి. నన్ను తాకినట్లయితే నువ్వు అపవిత్రమైపోతావు. పో, ఇక్కడి నుండి వెళ్ళిపో" అని అరిచారు. అది విన్న అతడు 'ఇక్కడినుండి ఎంతో దూర ప్రదేశంలో తనకు సాఠేకు మధ్య జరిగిన సంభాషణ సాయిబాబాకు ఎలా తెలుసున'ని నివ్వెరపోయాడు. కానీ ఆలోచించేంత సమయం లేదు. బాబా అతన్ని మసీదు నుండి తరిమేశారు. ఆయన కోపానికి భయపడి అతడు బయటకు పరుగుతీశాడు. అయినా బాబా కోపం చల్లారలేదు. అటువంటి మూర్ఖుణ్ణి తమ వద్దకు పంపినందుకు సాఠే మీద కూడా కోప్పడ్డారు. కొద్దిసేపటికి బాబా శాంతించారు. మేఘ మసీదు లోపలికి వెళ్లి బాబాకు నమస్కరించుకున్నాడు. ఈసారి బాబా అతనిని ఏమీ అనలేదు. మేఘ కొన్నిరోజులపాటు శిరిడీలో ఉంటూ బాబాకు సేవ చేసుకున్నాడు. బాబా శక్తులను, జీవన విధానాన్ని నిశితంగా గమనించాడు. కానీ బాబాపట్ల అతనికి దృఢమైన విశ్వాసం కుదరలేదు. అందువలన అతను తిరిగి వెళ్ళిపోయాడు.

శిరిడీ విడిచి వెళ్లిపోయిన మేఘ త్రయంబకం వెళ్ళి అక్కడ గంగాద్వార్‌లో ఒకటిన్నర సంవత్సరంపాటు శివుని ఆరాధనలో గడిపాడు. ఆ సమయంలో అతనొకసారి తీవ్రమైన పొత్తికడుపు నొప్పితో బాధపడుతూ మంచం పట్టాడు. అంత బాధలోనూ ఒకరోజు తన దైవమైన శివుని దర్శనార్థం ఆలయానికి వెళ్ళాడు. ఆశ్చర్యం! శివలింగం స్థానంలో అతడు సాయిబాబాను దర్శించాడు. అంతే! తిరిగి శిరిడీ వెళ్లాలని అతని మనస్సు ఉవ్విళ్ళూరింది. ఎప్పుడెప్పుడు శిరిడీ వెళ్ళి బాబాను దర్శించుకుంటానా అని ఆరాటపడ్డాడు. అనారోగ్యం నుండి కోలుకున్న వెంటనే క్షణమాత్రం ఆలస్యం చేయకుండా శిరిడీకి ప్రయాణమయ్యాడు. అలా 1910లో తిరిగి శిరిడీ చేరిన మేఘ తన చివరి క్షణం వరకు బాబాను సేవించుకుంటూ శిరిడీలోనే ఉండిపోయాడు. బాబా అతనిని గాయత్రీ మంత్రం పునశ్చరణ చేయమని చెప్పారు.

సాయిబాబాకు పూజ - ఆరతులు

ప్రారంభంలో సాయిబాబా తమని పూజించడానికి ఎవరినీ అనుమతించేవారు కాదు. పూజాసామగ్రితో ఎవరైనా తమ వద్దకు వస్తే కోపగించుకునేవారు. కానీ మహల్సాపతి భక్తికి మెచ్చి మొదటిసారి అతని చేతుల మీదుగా పూజను స్వీకరించారు శ్రీసాయిబాబా. తరువాత నానాసాహెబ్ చందోర్కర్ కుమారుడు మహాదేవ్, ఆ తరువాత మిగతా భక్తులందరూ బాబాను పూజించడం ప్రారంభించారు. రెండవసారి శిరిడీ వచ్చిన మేఘ శిరిడీలో తన జీవితాన్ని ఆనందించడమే కాదు, సాయిబాబా శివుని అవతారమేనని పూర్తి విశ్వాసంతో ఆయనను ఆరాధించడం మొదలుపెట్టాడు. శివుని ఆరాధనకు బిల్వపత్రాలు ఎంతో ప్రశస్తమైనవి. అవి శిరిడీలో లభ్యమయ్యేవి కావు. అందువలన మేఘ రోజూ ఒకటిన్నర మైళ్ళ దూరం నడుచుకుంటూ వెళ్లి వాటిని తీసుకుని వచ్చేవాడు. కొంతకాలానికి చావడిలో కాకడ ఆరతి, శేజ్ ఆరతి మొదలయ్యాయి. ఆ తరువాత మసీదులో బాబాకు మధ్యాహ్న ఆరతి ఇవ్వడం ప్రారంభించారు. ఈ ఆరతులు పండరీపురానికి చెందిన రిటైర్డ్ జడ్జి తాత్యాసాహెబ్ నూల్కర్ నిర్వహిస్తూ ఉండేవాడు. 1911, మార్చిలో నూల్కర్ మరణానంతరం ద్వారకామాయిలో బాబాకు రోజువారీ ఆరాధనను మేఘ ప్రారంభించాడు. అతడు ఒంటికాలి మీద నిలబడి ఏకాగ్రతతో, ఎంతో భక్తి శ్రద్ధలతో బాబాకు ఆరతి చేసేవాడు.

నిత్యక్రమం

మేఘ ప్రతిరోజూ గ్రామంలోని దేవతలందరినీ ఆరాధించి, తరువాత మసీదుకు వచ్చి బాబా ఆసనానికి నమస్కరించి, బాబాను ఆరాధించేవాడు. బాబా పాదాలు కడిగి, ఆ నీటిని తీర్థంగా త్రాగేవాడు. ఒకసారి ఈ నియమం తప్పింది. ఆరోజు ఖండోబా మినహా అన్ని గ్రామదేవతల పూజ పూర్తయింది. ఖండోబా ఆలయ తలుపులు మూసి ఉన్నందున అతను నేరుగా మసీదుకు వచ్చి బాబాను పూజించబోయాడు. బాబా తమను పూజించడానికి ఒప్పుకోకుండా, "నీ నిత్యక్రమంలో అంతరాయం ఏర్పడింది. వెళ్లి గ్రామదేవతలందరి పూజ పూర్తిచేసి ఇక్కడకు రా" అన్నారు. దానికతను, "బాబా! ఖండోబా ఆలయం తలుపులు మూసి ఉన్నాయి. కాబట్టి నేను ఖండోబాను పూజించలేను" అని అన్నాడు. అప్పుడు బాబా, “మళ్ళీ వెళ్ళు, ఇప్పుడు తలుపులు తెరచి ఉన్నాయి. మిగిలిన ఆ పూజను పూర్తిచేసి రా. ఆపై మామూలుగా ఇక్కడ పూజ, ఆరతులు చేసుకోవచ్చు” అని అన్నారు. అతను వెళ్లేసరికి బాబా చెప్పినట్లే ఖండోబా ఆలయం తలుపులు తెరచి ఉన్నాయి. ఖండోబా పూజ పూర్తిచేసి అతను మశీదుకు తిరిగి వచ్చాడు. ఆ తర్వాత సాయిబాబాకి పూజ, ఆరతులు యథావిధిగా జరిగాయి. ఇలాంటి అనుభవాలు బాబా పట్ల మేఘ విశ్వాసాన్ని ఇంకా ఇంకా బలపరిచాయి.

గంగాస్నానం

ఒక మకర సంక్రాంతి పర్వదినాన మేఘ సాయిబాబాను గోదావరి నదీజలంతో అభిషేకించాలి అనుకున్నాడు. బాబా మొదట అలా చేయటానికి ఇష్టపడలేదు. కానీ మేఘ పదేపదే అభ్యర్థించిన మీదట ఒప్పుకున్నారు. సంక్రాంతి రోజున మేఘ ఉదయాన్నే లేచి, రానూపోనూ 8 మైళ్ళ దూరం నడిచి గోదావరి నీటిని తీసుకొచ్చాడు. స్నానానికి సిద్ధంకమ్మని మేఘ ఎంత బ్రతిమిలాడినా బాబా తమ ఆసనం మీద నుండి లేవలేదు. మధ్యాహ్న ఆరతి పూర్తయి భక్తులంతా తమ తమ ఇళ్లకు వెళ్లిపోయారు. అప్పుడు మేఘ, "బాబా! మధ్యాహ్నం అయ్యింది. కనీసం ఇప్పుడైనా మీరు స్నానానికి సిద్ధంకండి" అని అన్నాడు. అందుకు బాబా, "నాలాంటి ఫకీరుకు గంగాజలంతో (బాబా ఎప్పుడూ గోదావరిని 'గంగ' అని సంబోధించేవారు) స్నానం ఎందుకు?" అని అన్నారు. మేఘ తన పట్టు విడవకుండా, "నాకు తెలిసింది ఒకటే, శివుడు గంగాస్నానంతో ప్రసన్నుడవుతాడు. ఈరోజు సంక్రాంతి. కావున ఈ పవిత్రమైన రోజున నేను శివుణ్ణి గంగాజలంతో అభిషేకించాలి. నా శివుడు మీరే కాబట్టి అభిషేకానికి మీరు ఒప్పుకుని తీరాలి" అని అన్నాడు. బాబా "సరే"నని తమ ఆసనం మీద నుంచి దిగి ఒక పీటపై కూర్చుని‌, తలగుడ్డని తొలగించి, తలను ముందుకు చాచి, "నువ్వు మొండిపట్టు పడుతున్నావు కాబట్టి ఒప్పుకుంటున్నాను. శరీరానికి శిరస్సు ప్రధానం. నా తలపై కొద్దిగా నీళ్ళు పోయి, దాంతో మొత్తం శరీరానికి స్నానం చేయించినట్లవుతుంది" అని అన్నారు. బాబా మాటలకు అంగీకరించిన మేఘ నెమ్మదిగా బాబా శిరస్సుపై నీళ్ళు పోస్తూ బాబాపట్ల ప్రేమ ఉప్పొంగగా 'హరగంగే' అంటూ మొత్తం పాత్రలోని నీళ్లు బాబా తలపై కుమ్మరించాడు. మొత్తానికి తన శివునికి స్నానం చేయించానని మేఘ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. అంతలోనే అతనొక అద్భుత దృశ్యాన్ని చూసి ఆశ్చర్యచకితుడయ్యాడు. పాత్రలోని నీటిని మొత్తం కుమ్మరించినప్పటికీ బాబా తల మాత్రమే తడిసి, మిగతా శరీరమంతా పొడిగా ఉంది. ఆయన కఫ్నీ మీద ఒక్క నీటిబొట్టు కూడా లేదు. అతడు పదేపదే ఆ అద్భుతాన్ని గుర్తుచేసుకుంటూ, "సాయిబాబా విశిష్ట లక్షణం గలవారు. ఆయన నన్ను సంతోషపెట్టడమే కాకుండా గురు ఆదేశాన్ని ఉల్లంఘించిన నింద రాకుండా నన్ను రక్షించారు" అని ఆనందపరవశుడయ్యేవాడు.

శివలింగం

మేఘకు శ్రీసాయిబాబా మరో సాటిలేని అనుభవాన్ని ప్రసాదించి అతనిని పూర్తిగా తన వశం చేసుకున్నారు. సాయిబాబాకు సేవ చేయడం ప్రారంభించిన సుమారు సంవత్సరం తరువాత ఒక తెల్లవారుఝామున మేఘ మంచంపై పడుకొని ఉన్నాడు. కళ్ళు మూసుకుని ఉన్నప్పటికీ అతడు మెలకువగానే ఉన్నాడు. హఠాత్తుగా బాబా అతని ముందు ప్రత్యక్షమై అతనిపై అక్షింతలు చల్లి, “మేఘా, త్రిశూలం గీయి” అని చెప్పి అదృశ్యమయ్యారు. అతను కళ్ళు తెరచి చూస్తే అక్కడెవరూ లేరు. గది తలుపులు మూసివున్నాయి, పెట్టిన గడియ పెట్టినట్లే ఉంది. పక్కమీద అక్షింతలు మాత్రం ఉన్నాయి. అతడాశ్చర్యంతో మసీదుకు వెళ్లి, తన అనుభవాన్ని బాబాతో చెప్పి, "ఈ దృష్టాంతాన్ని అనుసరించి వాడాలో మీ చిత్రపటం దగ్గర త్రిశూలాన్ని గీయమంటారా?" అని అడిగాడు. అందుకు బాబా, "దృష్టాంతమేమిటి, నువ్వు నా గొంతు గుర్తుపట్టలేదా?" అన్నారు. అప్పుడతడు, "మొదట నేను కూడా అలానే అనుకున్నాను. కానీ నా గది తలుపులు లోపలినుండి గడియ పెట్టి ఉండటంతో నేనది దృష్టాంతమనుకున్నాను" అని అన్నాడు. అప్పుడు బాబా, "నేను ప్రవేశించడానికి తలుపులు అవసరం లేదు. నాకు రూపము లేదు, నేను సర్వవ్యాపకుడిని" అని అన్నారు. అదేరోజు వాడాలో తన గదిలో ఉన్న బాబా చిత్రపటానికి కుడివైపున బాబా చెప్పినట్లుగా ఎరుపురంగుతో త్రిశూలాన్ని గీశాడు మేఘ. మరుసటిరోజు పూణే నుండి ఒక రామదాసి శిరిడీ వచ్చి బాబాకు ఒక శివలింగాన్ని సమర్పించాడు. సరిగ్గా ఆ సమయానికి మేఘ అక్కడకు వచ్చాడు. బాబా మేఘతో, "చూడు, శంకరుడు వచ్చాడు. అతనిని జాగ్రత్తగా చూసుకో" అన్నారు. తాను త్రిశూలం గీసిన వెంటనే అనుకోకుండా శివలింగం రావటంతో మేఘ ఆశ్చర్యచకితుడయ్యాడు. మరోవంక ఆ శివలింగాన్ని చూస్తూ ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. 

అదే సమయంలో వాడాలో ఉన్న కాకాసాహెబ్ దీక్షిత్ స్నానం చేసి తలపై తువ్వాలు వేసుకుని నిలబడి సాయిని ధ్యానిస్తుండగా అతని మనోదృష్టికి ఒక శివలింగం గోచరించింది. దానిగురించి అతడు ఆలోచిస్తూ ఉండగా బాబా తనకి ప్రసాదించిన శివలింగాన్ని తీసుకొచ్చి అతనికి చూపించాడు మేఘ. ఆ శివలింగం, కొన్ని నిమిషాల ముందు తన మనోదృష్టికి గోచరించిన శివలింగం ఒకేలా ఉండటంతో దీక్షిత్ ఆనందభరితుడయ్యాడు. మేఘ తాను గీసిన త్రిశూలం పక్కనే ఆ శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించసాగాడు.

ఇలా చాలాకాలం శిరిడీలో ఉంటూ బాబాకు వినయ విధేయతలతో సేవ చేసుకున్న మేఘ తీక్షణమైన చూపులు, చక్కటి ముఖవర్ఛస్సు, దృఢమైన ఆరోగ్యం కలిగి చాలా సాదాసీదాగా ఉండేవాడు. ముక్కుసూటి మనిషి, ఇతరులతో పెద్దగా కలిసేవాడు కాదు. పగలు, రాత్రి శివనామస్మరణ చేస్తూ ఉండేవాడు. అతని ముఖంలో ఎప్పుడూ ఆనందం తాండవిస్తూ ఉండేది. బాబా ప్రసాదించిన అద్భుతమైన అనుభవాలతో అతడు బాబాకు అంకిత భక్తునిగా మారిపోయాడు. బాబా వాచా బోధించకపోయినా క్రమేణా అతని అంతరంగంలో గొప్ప పరివర్తన తీసుకొచ్చారు. ఆ మార్పు అతనికి ఎంతో ఆధ్యాత్మిక లబ్దిని చేకూర్చింది. తన సద్గురువైన సాయినాథుడు సాక్షాత్తూ శంకరుడే అనడంలో అతనికి ఎలాంటి సందేహాలూ లేవు. బాబాకు సేవ చేసే అవకాశం లభించినందుకు తానెంతో ధన్యతనొందినట్లు తలచేవాడు.

1912, జనవరి 3న గాయత్రి పునశ్చరణ పూర్తయిన సందర్భంగా మేఘ కొంతమంది బ్రాహ్మణులకు సాఠేవాడాలో విందు ఏర్పాటు చేశాడు. దాదాసాహెబ్ ఖపర్దే ఆ విందుకు హాజరయ్యాడు.
నిర్యాణం

1912, జనవరి 16న మేఘ తన అలవాటు ప్రకారం బాబాకు ఆరతి ఇచ్చాడు. ఆ సమయంలో బాబా అక్కడున్న భక్తులతో, "ఇదే ఇతనిచ్చే చివరి ఆరతి" అని అన్నారు. ఆ తరువాత మేఘ అనారోగ్యం పాలయ్యాడు. అందువలన జనవరి 17న బాబాకు జోగ్ ఆరతి ఇచ్చాడు. జనవరి 18 సాయంకాలం జోగ్ ఆరతి ఇస్తుండగా మేఘ మరణం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు బాబా. ఎప్పటిలాగే బాబా మాట సత్యమైంది. 1912, జనవరి 19వ తేదీన తెల్లవారుఝామున 4 గంటలకు మేఘ తుదిశ్వాస విడిచాడు. బాబా తమ దివ్యహస్తాలతో అతని దేహాన్ని నిమురుతూ, "ఇతను నా నిజమైన భక్తుడు" అని అన్నారు. మేఘ దేహాన్ని స్మశానానికి తీసుకుపోతుంటే బాబా కూడా కొంతదూరం వరకు వెళ్లి అతని దేహంపై పూలు చల్లి ఎంతగానో శోకించారు. తరువాత తామే స్వయంగా డబ్బులిచ్చి అందరికీ విందు ఏర్పాటు చేయమని ఆదేశించారు. కాకాసాహెబ్ దీక్షిత్ బాబా ఆజ్ఞను నెరవేర్చాడు. ఆ తరువాత బాబా మేఘకిచ్చిన శివలింగాన్ని గురుస్థాన్‌లో ప్రతిష్ఠించారు.

సమాప్తం.

   source:  Shri Saibaba by Sharanaananda
 http://www.saiamrithadhara.com/mahabhakthas/megha.html
devotees experiences of saibaba by b.v. narasimha swamy.

4 comments:

  1. Om sai sri sai Jaya Jaya sai, om sai sri sai Jaya Jaya sai, om sai sri sai Jaya Jaya sai, om sai sri sai Jaya jaya sai🙏🙏🙏🙏

    ReplyDelete
  2. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete
  3. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo