సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

రజబ్అలీ మహమ్మద్ ఖోజా


సాయిభక్తుడు రజబ్అలీ మహమ్మద్ ఖోజా ఒక కాంట్రాక్టర్. అతడు ముంబై, బాంద్రా, టర్నర్ రోడ్డులో నివాసముండేవాడు. అతడు సెప్టెంబరు 27, 1936న శ్రీ సాయిబాబాతో తనకు గల అనుభవాలను దివంగత శ్రీబి.వి.నరసింహస్వామిగారికి ఈ క్రింది విధంగా తెలియజేశాడు.

బాబా మహాసమాధి చెందడానికి సుమారు ఎనిమిది సంవత్సరాల ముందు ఒకసారి వ్యాపార నిమిత్తం నాకు రావలసిన సరుకు(కొన్ని బండ్ల చెట్లబెరడు) రావడంలో జాప్యం జరుగుతున్నందున నేను నాసిక్ వెళ్ళాను. నేను అక్కడికి వెళ్ళాక కూడా పని ఆలస్యం అవసాగింది. నాసిక్‌లో నాకు వేరే ఏ పని లేనందున అక్కడే ఉండి కాలాన్ని వ్యర్థంగా గడపడం నాకు ఇష్టంలేదు. అప్పటికే నేను ముంబాయి ప్రజల ద్వారా సాయిబాబా గురించి గొప్పగా విని ఉన్నందున శిరిడీ వెళ్లి సాయిబాబా దర్శనం చేసుకొని ఆయన సన్నిధిలో నా సమయాన్ని సద్వినియోగ పరచుకోవాలని నిర్ణయించుకున్నాను.

వెంటనే ఆలస్యం చేయకుండా నేను శిరిడీ చేరి బాబా దర్శనం చేసుకున్నాను. నేను వారికి టెంకాయ, కలకండ సమర్పించాను. ఆయన నన్ను దక్షిణను అడగలేదు. నేను కూడా ఆయనకు సమర్పించలేదు. తరువాత నేను, "ఈరోజు లేదా రేపు తెల్లవారుఝామున తిరుగు ప్రయాణమవ్వడానికి అనుమతినివ్వమ"ని బాబాను అడిగాను. అందుకాయన, "ఆ వ్యక్తి నీ సరుకు నీకు అందజేయడానికి ఇంకా సిద్ధంగా లేడు" అని అన్నారు. నాకు నాసిక్‌లో ఎక్కువ సమయం వృథా చేసుకోవడం ఇష్టంలేనందున రెండు, మూడురోజులు శిరిడీలో బాబా సన్నిధిలోనే గడిపాను. ప్రత్యేకించి బాబాను అడిగేందుకు నాకే కోరికలు లేనందున,  "ఆయనపై నాకున్న విశ్వాసం ఎన్నోరెట్లు దృఢమయ్యేలా అనుగ్రహించమ"ని మాత్రమే నేను కోరుకున్నాను. ఆయనపై పూర్తి విశ్వాసంతో నేను మరణిస్తే నాకు సద్గతి లభిస్తుందన్న ఉద్దేశ్యంతో మనసులోనే దానికొరకు వారిని ప్రార్థించి, నన్ను ఆశీర్వదించమని అడిగాను. బాబా తమ హస్తాన్ని నా తలపై ఉంచి నన్ను ఆశీర్వదించారు. ఆ క్షణం నుండి ఆయన ఆశీర్వాదం ఫలించి, ఆయనపై నాకు విశ్వాసం క్రమేణా వృద్ధి పొందింది.

బాబాపైన, ఆయన ఊదీపైన నాకు చాలా నమ్మకం. నేను ప్రతిరోజూ ఊదీని నా ఛాతీకి, కళ్ళకి, నుదుటికి రాసుకొని బాబాను ధ్యానిస్తాను. ఇలా చేయడం వలన నా కష్టాలన్నీ తీరిపోయాయి. ఐదు సంవత్సరాల క్రితం నా గేదె ఒకటి ఈనలేక చాలా అవస్థపడింది. దాని బాధ చూడలేక నేను పశువుల డాక్టరును పిలిపించాను. నేను మునిసిపాలిటీలో శానిటరీ కమిటీ ఛైర్మన్‌గా ఉన్నందున అతడు వెంటనే వచ్చి తన వంతు ప్రయత్నమంతా చేశాడు. కానీ ప్రయోజనం లేకపోయింది. అప్పుడు నాకు బాబా ఊదీ గుర్తుకొచ్చి కొంత ఊదీ తీసుకొని, బాబాను ప్రార్థించి గేదె నుదుటిపై రాశాను. బాబా దయతో దానికి సహాయం చేస్తారని నేను ఆశించాను. నా నమ్మకం వమ్ము కాలేదు. కేవలం పదినిమిషాల్లో ఎటువంటి కష్టం లేకుండా ఆ గేదె  ఈనింది. ఆపై ఆ గేదెకు ఇంకే కష్టం లేదు. నేను బాబా ఊదీని ఉపయోగించిన సందర్భాలు చాలా ఉన్నాయి. ప్రతిసారీ ఊదీ సత్ఫలితాలనిచ్చింది.

శ్రీసాయిబాబా నిస్సందేహంగా గొప్పశక్తులు గల సిద్ధపురుషులు. ఇస్లామిక్ సంప్రదాయాలననుసరించి "సాధు సత్పురుషులు ఎప్పటికీ మరణించరు, వాళ్ళు కేవలం ఒక స్థితి నుండి మరో స్థితిలోకి వెళ్తారంతే!" నేను సాయిబాబాను అద్భుతశక్తులు కలిగిన ఒక గొప్ప మహాత్ముడిగా భావిస్తాను. ఆత్మజ్ఞానం ఉన్నవారికి మాత్రమే అద్భుతమైన శక్తులు సాధ్యమవుతాయి.

"విడిగా వంద ప్రార్థనలు చేయడం కన్నా ఒక మహాత్ముని సన్నిధిలో గడపడం ఎంతో ఉత్తమం" అనే ప్రసిద్ధ నానుడిని నేను దృఢంగా నమ్ముతాను. నేను ఎందరో మహాత్ముల సమాధులను మరియు సశరీరులుగా ఉన్న నాగ్‌పూర్‌కు చెందిన తాజుద్దీన్ బాబా, పూణేకు చెందిన బాబాజాన్‌ మొదలైన మహాత్ములను సందర్శించాను. ఈ మహాత్ములతో నాకు చాలా అనుభవాలున్నాయి. వాళ్ళ దర్శనం నాకు సద్గతిపట్ల విశ్వాసాన్ని పెంపొందించడమే కాకుండా, ప్రాపంచిక ప్రయోజనాన్ని కూడా చేకూర్చాయి.

మా ఇంటిలో సాయిబాబా పింగాణీ విగ్రహము, బాబా చిత్రపటము ఉన్నాయి. ప్రతి గురువారం బాబా ముందు అగరుబత్తి వెలిగిస్తాము.

సమాప్తం.

Source: Devotees' Experiences of Sri SaiBaba Part II by Sri.B.V.Narasimha Swamiji

3 comments:

  1. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI. OM SAI RAM

    ReplyDelete
  2. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo