సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

శ్రీనానాసాహెబ్ చందోర్కర్ - మొదటి భాగం



శ్రీసాయిబాబా సశరీరులుగా ఉండగా వారిని ప్రత్యక్షంగా దర్శించి సేవించుకున్న భక్తులలో అగ్రగణ్యుడు శ్రీనారాయణ్ గోవింద్ చందోర్కర్ ఉరఫ్ నానాసాహెబ్ చందోర్కర్. ఇతను శ్రీసాయిబాబాకు ఎంతో ప్రీతిపాత్రుడు. తమ భక్తులందరినీ తామే ఎన్నో మిషల ద్వారా తమ వద్దకు రప్పించుకున్నప్పటికీ, బాబా స్వయంగానూ, బాహాటంగానూ తన వద్దకు పిలిపించుకున్న ఏకైక భక్తుడు నానాసాహెబ్ చందోర్కర్. అనేక దశాబ్దాలుగా వ్యాప్తిచెందుతున్న సాయిభక్తి అనే మహావృక్షానికి బీజం మహల్సాపతి అయితే, కాండం చందోర్కర్. శ్రీసాయి వరదహస్తం అతనిపై ఉన్నందున చందోర్కర్ తన జీవితాంతం బాబాకు సేవచేసి 1921, ఆగస్టు 21వ తేదీన శ్రీసాయిలో ఐక్యమయ్యాడు. బాబాతో అతనికున్న అనుబంధం, బాబా అతనిని తీర్చిదిద్దిన విధానం, విద్యావంతులైన భక్తుల అభివృద్ధికి బాబా ఉపయోగించే పద్ధతులు మరియు సమాజం కోసం బాబా చేసిన కృషి గురించి తెలుసుకోవడం ఒక విలక్షణమైన, అత్యంత ఉపయోగకరమైన అధ్యయనం. ఆ వివరాలను నానాసాహెబ్ చందోర్కర్ వర్ధంతి సందర్భంగా ప్రచురించి ఆ సాయిభక్తునికి హృదయపూర్వకంగా నివాళులర్పిస్తున్నాం.

నానాసాహెబ్ చందోర్కర్ క్రీ.శ.1860వ సంవత్సరంలో మకరసంక్రాంతినాడు థానేలో జన్మించాడు. వారిది సమాజంలో గొప్ప గౌరవమర్యాదలున్న సనాతన బ్రాహ్మణ కుటుంబం. అతని తండ్రి శ్రీగోవిందపంత్ చందోర్కర్ ఎంతో ధర్మాత్ముడు, సత్యశీలి, చిత్తశుద్ధిగలవాడు; ఎంతో విరివిగా దానధర్మాలు చేసేవాడు. అతను వ్యక్తిగత సలహాదారుగానూ, డిప్యూటీ కలెక్టరుగానూ పనిచేశాడు. ఆ రోజుల్లో అతనికి దఫ్తర్‌దార్(రికార్డు కీపర్) అనే బిరుదు ఉండేది. అతను థానేలో డిప్యూటీ కలెక్టరుగా పదవీ విరమణ చేసి కళ్యాణ్‌లో కొన్ని అంతస్థుల భవనం నిర్మించాడు. ఇప్పటికీ ప్రజలు ఆ భవనాన్ని ‘దఫ్తర్‌దార్ ప్యాలెస్’ అనీ, ‘చందోర్కర్ వాడా’ అనీ పిలుస్తారు. ఆ భవనంలోనే అతని కుటుంబం నివాసముండేది. వాళ్ళు శాస్త్రాలలో చెప్పబడిన వైశ్వదేవం(అతిథిపూజ)ను శ్రద్ధాభక్తులతో ఆచరిస్తూ తమ శక్త్యానుసారం ప్రతిరోజూ అసంఖ్యాకమైన అతిథులకు అన్నం పెట్టి ఆదరిస్తుండేవారు. కళ్యాణ్ వచ్చే సందర్శకులకోసం వాళ్ళింటి తలుపులు ఎప్పుడూ తెరిచి ఉండేవి.

నానాసాహెబ్ చందోర్కర్ మరాఠీ విద్యాభ్యాసం కళ్యాణ్‌లో జరిగింది. అనంతరం అతను ముంబయిలోని ఎల్ఫిన్‌స్టన్ విద్యాలయం మరియు ఎల్ఫిన్‌స్టన్ మహావిద్యాలయాలలో ఆంగ్ల విద్యను అభ్యసించాడు. తదనంతరం ముంబయి విశ్వవిద్యాలయం నుండి 1883లో బి.ఏ. పట్టభద్రుడయ్యాడు. సంస్కృతం అతనికి ఇష్టమైన పాఠ్యాంశం. కాలేజీలో చదువుతున్నరోజుల్లోనే చందోర్కర్‌కి పద్దెనిమిది సంవత్సరాల వయస్సున్నప్పుడు 1878లో అలీబాగ్ జిల్లాలోని పన్వేల్ తాలూకాలోని పలాస్పే గ్రామానికి చెందిన ప్రముఖ వడ్డీవ్యాపారి మరియు జమీందారు ఓఝా కుటుంబానికి చెందిన వినాయక్‌ సదాశివ్‌ ఓఝా, రాధాబాయి దంపతుల కుమార్తె బాయజాబాయితో వివాహం జరిగింది. చందోర్కర్ దంపతులకి చాలామంది సంతానం కలిగారు. కానీ వారిలో నలుగురు మాత్రమే దీర్ఘాయుష్మంతులయ్యారు. వాసుదేవ్ అలియాస్ బాబూరావు, మహాదేవ్ అలియాస్ బాపూరావు అను ఇద్దరు కుమారులు; మైనతాయి, ద్వారకామాయి అనే ఇద్దరు కుమార్తెలు. పెద్దకుమారుడు వాసుదేవ్ బి.ఏ. పూర్తిచేసి విల్లేపార్లేలోని ఓ ప్రైవేట్ ఆంగ్ల పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడుగా పనిచేసేవాడు. అతని వివాహం గ్వాలియర్‌లోని ప్రముఖ జాగీర్దార్ శ్రీరామారావు కృష్ణ అలియాస్ కాకాసాహెబ్ జఠార్ కుమార్తె ఇందిరతో జరిగింది. చిన్నకుమారుడు మహాదేవ్ పూణేలోని ‘కృషికర్మ’ ఆంగ్ల విద్యాలయంలో వ్యవసాయ విద్యనభ్యసించి తమ స్వంత వ్యవసాయాన్ని చూసుకునేవాడు. అతని వివాహం ధార్వాడ్ న్యాయవాది త్రివిక్రమ్ కాశీనాథ్ అలియాస్ తాత్యాసాహెబ్ పిత్రే కుమార్తె గిరిజాబాయితో జరిగింది. నానా పెద్దకుమార్తె మైనాతాయి వివాహం పూణేకి చెందిన శ్రీకువ్లేకర్‌తోనూ, చిన్నకుమార్తె ద్వారకామాయి వివాహం సతార్‌కు చెందిన శ్రీపెంధార్కర్‌తోనూ జరిగింది.

నానాసాహెబ్ చందోర్కర్ బి.ఏ. పట్టభద్రుడైన తరువాత మొదట సంగమనేరులోని మామల్తదారు కార్యాలయంలో క్లర్కుగా నియమితుడయ్యాడు. కొంతకాలానికి 1890లో అహ్మద్‌నగర్ జిల్లాలోని కోపర్‌గాఁవ్‌లో హెడ్ క్లర్కుగానూ, 1892లో అహ్మద్‌నగర్ జిల్లా కలెక్టరుకు చిట్నిస్(వ్యక్తిగత కార్యదర్శి)గానూ, 1893లో పూణే జిల్లాలోని ఘోడ్‌నది తాలూకా మామల్తదారుగానూ నియమితులయ్యారు. తదుపరి 1894లో అహ్మద్‌నగర్ జిల్లా కలెక్టరు వద్ద చిట్నిస్‌గా తిరిగి నియమితులై 1901 వరకు అక్కడే కొనసాగాడు. తరువాత 1902లో జామ్నేర్ తాలూకా మామల్తదారుగా నియమితులయ్యారు. తరువాత అతనికి నందూర్‌బార్(1905), పండరిపురం(1906) మొదలైన ప్రదేశాలకి బదిలీ అయింది. 1908లో అతనికి జిల్లా డిప్యూటీ కలెక్టర్‌గా పూణేకు బదిలీ అయింది. చివరిగా, 1915లో జిల్లా డిప్యూటీ కలెక్టరుగా అతను పదవీ విరమణ చేశాడు. నానాసాహెబ్ కోపర్‌గాఁవ్‌లో హెడ్ గుమస్తాగా ఉన్నప్పుడు అతని చిన్నబిడ్డ అనారోగ్యం పాలయ్యాడు. ఆ సమయంలో అక్కడ ఆసుపత్రి లేకపోవడంతో సకాలంలో వైద్యం అందక ఆ బిడ్డ మృతిచెందాడు. ఆ దుర్ఘటనతో నానాసాహెబ్ అక్కడి ప్రజలు మందుల కొరతతో చాలా అవస్థలు పడుతున్నారని గ్రహించి తన సొంత వ్యయంతో 1890లో కోపర్‌గాఁవ్‌లో ఒక వైద్యశాలను ప్రారంభించి, 18 సంవత్సరాలపాటు నిర్వహించిన తరువాత దానిని ప్రభుత్వానికి అప్పగించాడు.

ఒక మంచి హిందువులా చందోర్కర్ చక్కటి ప్రవర్తనను, మంచి స్వభావాన్ని, ఆధ్యాత్మిక చింతనను కలిగి ఉండేవాడు. చందోర్కర్ బి.ఏ. చదువుతున్నప్పుడు తత్వశాస్త్రాన్ని(ఫిలాసఫీ) ప్రత్యేక పాఠ్యాంశంగా తీసుకొని, అందులో భాగంగా శంకరభాష్యంతో కూడుకున్న భగవద్గీతను శ్రద్ధగా అధ్యయనం చేశాడు. ఆ విధంగా అతను హిందూధర్మశాస్త్రాల నుండి ఉత్తమమైన విషయాలను గ్రహించి నైతికంగానూ, ఆధ్యాత్మికంగానూ పురోగమించాలని తపనపడుతుండేవాడు. ఆ ప్రయత్నంలో అతనికున్న ప్రాథమిక వనరులు ఎంతో యోగ్యమైనవే అయినప్పటికీ ఆధ్యాత్మికసౌధంలో పైఅంతస్తుకి చేర్చే నిచ్చెనను అధిరోహింపజేసి, తననొక జ్ఞానిగా మలిచేందుకు పరిపూర్ణమైన సద్గురువు యొక్క చేయూత అతనికి కావలసివుంది. అయితే, శిష్యుడు గురువును ఎన్నుకోవడం కాదు, గురువే శిష్యుణ్ని ఎన్నుకుంటాడనే సత్యానికి చందోర్కర్ జీవితం ఒక చక్కని ఉదాహరణగా నిలుస్తుంది. చందోర్కర్‌కి తన పూర్వజన్మల గురించి ఏమీ తెలియదు. కానీ, అతని గురువైన శ్రీసాయిబాబా జ్ఞానసంపన్నులు. భూతభవిష్యద్వర్తమానాలు వారి మనోనేత్రం ముందు సాక్షాత్కరిస్తాయి. గత నాలుగు జన్మలలో తమ శిష్యుడైన చందోర్కర్ తన జీవిత లక్ష్యాన్ని సాధించేవరకు శిష్యునిగా తమతో అనుబంధాన్ని కొనసాగించాలనీ, తద్వారా అతను మరింత ప్రయోజనాన్ని పొందాలనీ శ్రీసాయి సంకల్పించారు. అందుచేత బాబానే స్వయంగా కబురుపెట్టి మరీ అతనిని తమ చెంతకు రప్పించుకున్నారు. (నిజానికి ఉన్నతస్థాయి వ్యక్తులపై బాబాకు ప్రత్యేక ఆదరణ ఏమీ ఉండేదికాదు. ఆయనకి అందరూ సమానమే). సాధారణ పరిస్థితులలో కూడా చందోర్కర్ తన జీవితంలో బాగా వెలుగొంది ఉండేవాడేమోగానీ, సద్గురు సాయి మార్గదర్శకత్వంలో అతను అతిశోభాయమానంగా ప్రకాశించాడు. బాంబే ప్రెసిడెన్సీ అంతటా గొప్ప విజయాలు సాధించిన మహోన్నత వ్యక్తిగా చందోర్కర్ కీర్తి గడించాడు. అంతేకాదు, శ్రీబి.వి.దేవ్ వంటి కొంతమంది ప్రముఖ సాయిభక్తులు చందోర్కర్‌ను గురువుగా గౌరవించేవారు.
 
సంతుల సమాగమం

చందోర్కర్ తండ్రి గోవింద్‌పంత్ తన సహచరుడైన శ్రీశంకరరావు మహాజన్‌తో కలిసి థానే జిల్లా, భివండీ తాలూకాలోని కవాడ్ నివాసి శ్రీ సమర్థ సద్గురు సఖారామ్ మహరాజ్ వద్దకు వెళ్లడం ప్రారంభించాడు. శ్రీసఖారాం మహరాజ్ అనుగ్రహం గోవింద్‌పంత్‌పై ఉండేది. అతనికి మహరాజ్ పట్ల అపారమైన విశ్వాసం, అత్యంత భక్తి. అందువలన తరచూ వారి దర్శనానికి వెళ్తూ హృదయపూర్వకంగా ఆ మహరాజ్ సేవ చేసుకునేవాడు. తండ్రి సంస్కారం చందోర్కర్‌కి కూడా వచ్చింది. చిన్నతనంలో తన తండ్రితో కలిసి కొన్నిసార్లు శ్రీసఖారాం మహరాజ్ దర్శనానికి వెళ్ళాడు. అయితే, చందోర్కర్ ఉద్యోగంలో చేరినప్పటినుంచి వారి దర్శనానికి వెళ్లలేదు. అందుకు కారణం, ఆంగ్లవిద్య ప్రభావం వలన గర్వాంధకారంతో నిండిన నాటి చదువుకున్న పట్టభద్రుల మనసులు సాధుసత్పురుషుల సాంగత్యం వైపు మొగ్గుచూపడం మానేశాయి. అదీకాక, తన తండ్రి సాంగత్యంలో శ్రీసఖారాం మహరాజ్‌తో తనకున్న అనుబంధం నానాసాహెబ్ మనస్సుపై శాశ్వత ప్రభావాన్నేమీ చూపలేదు. అందువలన చందోర్కర్ తన తండ్రివలె ఆ సత్పురుషుని దర్శించకపోయినప్పటికీ, తరువాతి కాలంలో బాబానే స్వయంగా చందోర్కర్‌‌ని తమవైపుకు ఆకర్షించి అతని అంతఃకరణాన్ని పారమార్థిక జీవితం వైపు మళ్లించడంతో, తన తండ్రి సజీవులుగా ఉన్న కాలంలోనే 1892 నుండి తరచూ బాబా వద్దకు వెళ్లడం ప్రారంభించాడు చందోర్కర్.

ఆ రోజుల్లో సంవత్సరానికి ఒకసారి ప్రాంతీయ అధికారి, జిల్లా అధికారుల ఆధ్వర్యంలో తాలూకాల జమాబందీ(ల్యాండ్ రెవెన్యూ సంబంధిత సమస్యల పరిష్కారం) కార్యక్రమం నిర్వహించేవారు. 1892లో అహ్మద్‌నగర్ జిల్లా కలెక్టరుకి చిట్నిస్‌గా చందోర్కర్ ఉన్నాడు. ఆ సంవత్సరం కోపర్‌గాఁవ్‌ తాలూకా జమాబందీ అహ్మద్‌నగర్‌లో జరిగింది. ఆ కార్యక్రమానికి కోపర్‌గాఁవ్‌ తాలూకాలోని అన్ని గ్రామాల కులకర్ణిలు(కరణాలు) హాజరుకావాల్సి ఉండగా, శిరిడీ గ్రామ కరణమైన అప్పాకులకర్ణి మశీదుకి వెళ్లి బాబాకి నమస్కరించి, అహ్మద్‌నగర్ వెళ్ళడానికి అనుమతి కోరాడు. బాబా అతనికి తమ అనుమతినిస్తూ, “కలెక్టరుసాహెబ్ చిట్నిస్ ఎవరు?” అని ఆరాతీశారు. “నానాసాహెబ్ చందోర్కర్” అని బదులిచ్చాడు అప్పాకులకర్ణి. అప్పుడు బాబా అతనితో, “బాబా మిమ్మల్ని పిలుస్తున్నారని అతనితో చెప్పు" అని చెప్పారు. అది విని అప్పాకులకర్ణి ఆశ్చర్యపోయి తనలో తాను, 'అంత పెద్ద ఉద్యోగిని తనవంటి అతి సామాన్యుడు ఆహ్వానించడమేమిటి? పైగా కేవలం పేదభిక్షువైన సాయిఫకీరు రమ్మని పిలుస్తున్నారని నానాసాహెబ్‌తో చెప్పడమెలా?' అని అనుకున్నాడు. అయినప్పటికీ బాబా ఆదేశాన్ని శిరసావహించి వారి వద్ద సెలవు తీసుకొని మరికొంతమందితో కలిసి అహ్మద్‌నగర్‌కు వెళ్ళాడు. జమాబందీ కార్యక్రమం ముగిసిన పిమ్మట అప్పాకులకర్ణి సంకోచిస్తూనే నానాసాహెబ్ చందోర్కర్‌ను సమీపించి, "శిరిడీకి చెందిన ఫకీరు సాయిబాబా తమను శిరిడీ రమ్మన్నారు" అని చెప్పాడు. అది విని నానా ఆశ్చర్యపోతూ, 'ఆ ఫకీరుతో నాకు ఇంతకుముందెన్నడూ పరిచయం లేదు. అలాంటప్పుడు ఆయన నన్నెందుకు రమ్మంటారు? బహుశా తనని శిరిడీ రమ్మని పిలవడంలో ఈ కరణం యొక్క స్వప్రయోజనం ఏదో ఉండివుంటుంద'ని అనుకున్నాడు. అంతేకాదు, సాధువులు, ఫకీర్లు వంటివారిని దర్శించడం అతనికి ఇష్టం లేదు కూడా. అలాంటివారికి దివ్యశక్తులేమీ ఉండవనీ, వాళ్ళు కేవలం మాయోపాయాలతో అమాయక ప్రజలను ఆకర్షించి డబ్బు గుంజుతారనీ అతని నమ్మకం. అందుచేత అప్పాకులకర్ణి ఎంతగా అభ్యర్థించినప్పటికీ చందోర్కర్ నమ్మక, “నేను శిరిడీకి రాను” అని చెప్పి అప్పాకులకర్ణిని పంపించేశాడు. అప్పాకులకర్ణి శిరిడీ చేరి బాబాకు జరిగిందంతా చెప్పాడు. అప్పుడు బాబా అతనితో, “మంచిది. నువ్వు మళ్ళీ వెళ్ళినప్పుడు ఇదే సందేశాన్ని నానాతో చెప్పు” అని అన్నారు. బాబా ఆదేశానుసారం అప్పాకులకర్ణి మళ్ళీ నానాసాహెబ్ వద్దకు వెళ్ళినప్పుడు కూడా సంకోచిస్తూనే నానాతో బాబా ఆహ్వానాన్ని విన్నవించాడు. నానా మునుపటిలాగే చెప్పి అతన్ని పంపేశాడు. అప్పాకులకర్ణి శిరిడీ తిరిగొచ్చి బాబాతో విషయం చెప్పాడు. బాబా అతనితో, ’నానాను మళ్ళీ పిలవమ’న్నారు. అందుకతను సంకోచిస్తున్నప్పటికీ బాబా అతనిని ఒత్తిడి చేశారు. దాంతో అప్పాకులకర్ణి బాబా ఆహ్వానాన్ని చందోర్కర్‌కి మళ్ళీ విన్నవించాడు. అప్పుడు చందోర్కర్ అతనితో, “మాటిమాటికీ అనవసరంగా సాయిబాబా పేరు ఎత్తుతావెందుకు? నీకు నా ద్వారా కావలసిన పనేదైనా వుంటే నిర్భయంగా చెప్పవచ్చు గదా?" అని విసుక్కున్నాడు. అందుకతను, "నిజంగానే బాబా మిమ్మల్ని పిలుస్తున్నార"ని చెప్పాడు. అప్పుడు చందోర్కర్, 'బాబా ఇన్నిసార్లు తనని శిరిడీ రమ్మని పిలుస్తున్నారంటే ఏదో కారణం ఉండే ఉంటుంద'ని తలచి, "సరే, నేను శిరిడీ వస్తాను. అయితే వెంటనే రాలేను. వీలు చూసుకొని వస్తాను" అని అప్పాకులకర్ణికి మాట ఇచ్చాడు. కానీ శిరిడీ వెళ్లడం వృధా శ్రమ అని తలచి చాలారోజులు శిరిడీ వెళ్ళడానికి వెనుకాడాడు. చివరికి ఒకరోజు బాబా వద్దకు వెళ్ళడానికి నిర్ణయించుకుని, తన పాత కోటు ఇమ్మని భార్యను అడిగి, దాన్ని ధరించి శిరిడీకి బయలుదేరాడు. అయితే అతని మనసులో, “నేను ఒక సత్పురుషుని వద్దకు వెళ్తున్నానా? లేక అప్పా మాటలు విని ఒక సాధారణ పేదఫకీరు వద్దకు వెళ్తున్నానా?” అని ఆలోచనలు మొదలయ్యాయి. అటువంటి ఆలోచనలతో అతను శిరిడీ సమీపిస్తుండగా, 'నిజంగా బాబా సత్పురుషులైతే వారికి సమర్పించడానికి నా వద్ద ఏమీ లేవు. శిరిడీ ఒక కుగ్రామం. నేను అక్కడ బాబా కోసం ఏం కొనాలి? ఎక్కడ కొనాలి?' అని ఆందోళన చెందుతూ యథాలాపంగా తన చేతిని కోటు జేబులో పెట్టుకునేసరికి అతని చేతికొక చిన్న పొట్లం తగిలింది. దానిని విప్పి చూస్తే అందులో నాలుగు సీమబాదం పప్పులు, నాలుగు కలకండ పలుకులు వున్నాయి. వాటిని చూసి అతను ఆనందాశ్చర్యాలకు లోనై, 'ఇదేం అద్భుతం? ఇదెలా సాధ్యం? బాబా నిజంగానే సత్పురుషులా?' అని అనుకున్నాడు. అంతలో అతని టాంగా శిరిడీ చేరుకుంది. అతను మశీదుకు వెళ్లి బాబాను దర్శించి, వారికి సాష్టాంగ నమస్కారం చేసి, సీమబాదం పప్పులు, కలకండ పలుకులు ఉన్న పొట్లాన్ని బాబా ముందు ఉంచాడు. వెంటనే బాబా వాటిని అక్కడున్నవారికి పంచిపెట్టారు. చందోర్కర్ బాబా దగ్గర కూర్చుని, "మీరు నన్ను నిజంగానే రమ్మని పిలిచారా?" అని అడిగాడు. అందుకు బాబా, "అవున"ని బదులిచ్చారు. అప్పుడతను, "నన్ను పిలిచిన కారణమేమిటి?" అని అడిగాడు. "అరే, ఈ ప్రపంచంలో ఎంతోమంది ఉండగా నేను నిన్నే పిలిపించానంటే అందుకు ఏదో కారణం ఉంటుంది కదా!" అని బాబా అన్నారు. "నాకు అటువంటి ప్రత్యేక కారణం ఏమీ కనపడటం లేదు" అన్నాడు నానా. అప్పుడు బాబా, "నానా! నాకు, నీకు నాలుగు జన్మల సంబంధం ఉంది. ఆ విషయం నీకు తెలియదు, కానీ నాకు తెలుసు. అందుకే నేను నీకు పదేపదే కబురుపెట్టాను. తీరిక దొరికినప్పుడల్లా వచ్చి పోతూండు!” అని అన్నారు. బాబా మాటలను నానా నమ్మలేకపోయాడు. అయినప్పటికీ ఏదో ముఖస్తుతిగా “అలాగే వస్తాన"ని చెప్పి, బాబాకు నమస్కరించి, వారి అనుమతి తీసుకుని తిరుగు ప్రయాణమయ్యాడు.

బాబాకు నానా సమర్పించిన నాలుగు బాదంపప్పులు, నాలుగు కలకండ పలుకులు అక్కడున్న 25 మందికి సరిపోవడం ఒక అద్భుతం. దాన్ని ‘అన్నపూర్ణసిద్ధి’ అంటారు. అది చూసి కూడా చందోర్కర్‌కి బాబాపట్ల విశ్వాసం కుదరక, ‘ఇక మళ్ళీ శిరిడీ రావలసిన అవసరం లేద’నే అభిప్రాయంతో శిరిడీ విడిచి వెళ్ళిపోయాడు. కానీ బాబా తమ భక్తుణ్ణి తమ వద్దకి రప్పించుకొనే పరిస్థితులు కల్పించినందువల్ల నానా తిరిగి బాబా వద్దకు వచ్చి, బాబా ప్రేమని చవిచూసి, బాబా గురించి ప్రచారం చేసే గొప్ప కార్యాన్ని ప్రారంభించాడు. దాంతో బాబా అవతారకార్యంలో కొత్త దశ ఆరంభమైంది. ఏదేమైనా, బాబా ప్రత్యక్షంగా అతనిని పిలిపించుకున్నట్లు మరే భక్తుణ్ణీ పిలిపించుకున్న దాఖలాలు లేవు. నానా గత నాలుగు జన్మలుగా బాబాతో పెనవేసుకున్న ప్రేమానుబంధం ఎక్కడికి పోతుంది మరి?
 
చందోర్కర్ మొదటిసారి బాబాని దర్శించి వెళ్లిన కొన్నిరోజుల తర్వాత అహ్మద్‌నగర్‌‌‌లో ప్లేగు మహమ్మారి వ్యాపించింది. ఆ కాలంలో తరచూ మహారాష్ట్ర అంతటా ప్లేగు వ్యాధి చెలరేగి ఎందరో ప్రాణాలు కోల్పోతుండేవారు. అందువలన నాటి బ్రిటిష్ ప్రభుత్వం ప్రజల ప్రాణాలు కాపాడేందుకుగానూ ప్రజలందరికీ టీకాలు వేయాలని నిర్ణయించింది. అయితే ఆ కొత్త వైద్యానికి ప్రజలు భయపడి టీకాలు వేయించుకోవడానికి ఇష్టపడలేదు. అందువల్ల ప్రజలకు ధైర్యం కలగజేయడానికి మొదట ప్రభుత్వోద్యోగులందరూ విధిగా ఆ టీకాలు చేయించుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశిస్తూ ముందుగా చందోర్కర్‌ని టీకాలు వేయించుకోమని చెప్పారు. అధికారుల ఒత్తిడికి తలవొగ్గి టీకాలు వేయించుకొంటే ఏ ప్రమాదం వాటిల్లుతుందోనని భయపడి ఆ విషయంలో నిర్ణయం తీసుకోడానికి ఒక వారంరోజుల వ్యవధి కోరాడు చందోర్కర్. కానీ ఆ విషమ పరిస్థితి నుండి బయటపడటమెలాగో అర్థంకాని గందరగోళ స్థితిలో అతనికి బాబా జ్ఞప్తికొచ్చి, ఆలస్యం చేయకుండా వెంటనే బాబా వద్దకు వెళ్ళాడు. బాబాను దర్శించి, తనకొచ్చిన సమస్యను వారికి విన్నవించుకొని ఏం చేయాలో సలహా ఇవ్వమని అర్థించాడు. అప్పుడు బాబా, “అందులో ఏముంది? టీకా వేయించుకో! భయపడాల్సిన పనిలేదు. నీకెట్టి ప్రమాదమూ జరగదు" అని అన్నారు. బాబా సమాధానంతో సంతృప్తి చెందిన చందోర్కర్ టీకా వేయించుకోవడానికి నిశ్చయించుకొని, బాబా వద్ద సెలవు తీసుకొని వెంటనే అహ్మద్‌నగర్‌ వెళ్లి తన నిర్ణయాన్ని కలెక్టరుతో చెప్పి టీకా వేయించుకున్నాడు. అతనికి ఏమీ కాకపోవడంతో కలెక్టరు కార్యాలయంలోని మిగిలిన ఉద్యోగులందరూ కూడా టీకాలు వేయించుకున్నారు. ఆ ప్రేరణతో తరువాత దాదాపు 2, 3 వేలమంది టీకాలు వేయించుకున్నారు. ఎవరికీ ఎట్టి ఇబ్బందీ కలుగలేదు. కలెక్టరు చాలా సంతోషించాడు. ఈ సంఘటనతో చందోర్కర్‌కి బాబా సాధారణ ఫకీరు కాదని అర్థమై, ఆయనపై విశ్వాసం కుదిరి, కొంచెంకొంచెంగా బాబా పట్ల భక్తి పెరగసాగింది.

source: లైఫ్ ఆఫ్ సాయిబాబా(రచన: శ్రీబి.వి.నరసింహస్వామి)
 సాయిలీల మ్యాగజైన్స్  - 1986 మరియు 2009.
సాయిబాబా(రచన: శ్రీసాయి శరణానంద)
బాబాస్ వాణి, బాబాస్ అనురాగ్(రచన: విన్నీ చిట్లురి).

  

 తరువాయి భాగం కోసం బాబా పాదాలు తాకండి.



6 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo