సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుడు దాజీసాహెబ్ పట్వర్ధన్


1914 నాటికి బాబా కీర్తి నలుమూలలా వ్యాపించింది. ఒక్క మహారాష్ట్రలోనే ఆయనకు అసంఖ్యాక భక్తులున్నారు. అదేవిధంగా ఆయనను సందేహించేవారు కూడా ఉన్నారు. అలాంటి వారిలో దాజీసాహెబ్ పట్వర్ధన్ ఒకరు. అతనొక పెద్ద అనుమాన పిశాచి. అటువంటి అతను బాబాకు అంకితభక్తునిగా ఎలా మార్పు చెందారో మనమిప్పుడు తెలుసుకుందాం.

దాజీ పూర్వీకులు సంగ్లీ జిల్లాలోని మీరజ్ లో నివాసముండేవారు. రాజకీయంగా మంచి పలుకుబడి ఉన్న కారణంగా వారికి 'సర్కార్' అనే బిరుదు ప్రదానం చేయబడింది. వాళ్ళది బాగా ధనిక కుటుంబం. విస్తారమైన వ్యవసాయ భూములు, ఒక పెద్ద వాడా కూడా ఉన్నాయి. ఆ వాడాలోనే వాళ్ల కుటుంబమంతా నివాసముండేది. దాజీ తాతగారైన హల్‌బాత్‌బాబా పట్వర్ధన్ గొప్ప సాధు సత్పురుషులు. ఆ కుటుంబమంతా గణేశుడిని పూజించేవారు. దాజీ కూడా గణేశుని అంకిత భక్తుడు. అతడు బాగా పుస్తకాలు చదువుతుండేవాడు. ఆ కాలానికి చెందిన మహాత్ముల చరిత్రలన్నీ చదివాడు. అయితే వాటిని భక్తి విశ్వాసాలతో కాకుండా కేవలం విశ్లేషణాత్మక దృష్టితో చదివేవాడు. "వాటిలో ఉన్న లీలలు నిజంగా జరిగాయా?" అని ఆశ్చర్యపడుతుండేవాడు. ఒకసారి అతని సన్నిహిత స్నేహితుడు, గొప్ప మహాత్ములైన సాయిబాబా దర్శనం చేసుకోవాలని తనకు ఉందని, కావున తనకి తోడుగా తనతోపాటు శిరిడీ రమ్మని దాజీని పిలిచాడు. బాబా ఒక ముస్లిం ఫకీరని, ఎంతోమంది హిందువులు ఆయనను అనుసరిస్తారని, వాళ్లలో కూడా ఎక్కువమంది బ్రాహ్మణులని, బాబా ఏదో మాయ చేసి వాళ్ళని తమవైపు తిప్పుకున్నారని, శిధిలమైన మసీదులో ఉంటారని, భిక్ష చేస్తారని, మసీదులో తులసిమొక్కను కూడా నాటారని దాజీ విని ఉండటం వలన శిరిడీ వెళ్ళడానికి విముఖత చూపాడు. ముఖ్యంగా అతన్ని ఎక్కువ చికాకు పెట్టింది, అందరూ నిజమని నమ్మే బాబా నీళ్లతో దీపాలు వెలిగించిన లీల. అయితే తానే స్వయంగా వెళ్లి బాబాని పరీక్షించి, ఆయనొక గారడీలమారి అని నిరూపించాలని నిర్ణయించుకున్నాడు.

ఆ ఆలోచన ప్రకారం 1914, మే నెలలో దాజీ శిరిడీ ప్రయాణమయ్యాడు. ఈరోజుల్లోలాగా ఆరోజుల్లో శిరిడీ వెళ్లడం అంత సులువైన విషయమేమీ కాదు. అదొక సుదీర్ఘమైన దుర్భర ప్రయాణం. దాజీ మిరాజ్ నుంచి రైలులో పూణే వరకు ప్రయాణం చేసి, అక్కడ ఇంకొక రైలు పట్టుకుని మన్మాడ్ చేరి, అక్కడనుంచి కోపర్‌గాఁవ్ ప్రయాణమయ్యాడు. కోపర్‌గాఁవ్‌లో దిగాక చివరిగా టాంగాలో శిరిడీ వెళ్లాల్సి ఉంది. అప్పటికే అతడు సుదీర్ఘమైన, ప్రయాసకరమైన ప్రయాణంతో బాగా అలసిపోయి, బట్టలు మురికిపట్టిపోయి చాలా చికాకుగా ఉన్నాడు. అందువలన స్నానం చేసి బట్టలు మార్చుకుంటే కాస్తైనా ఉపశమనంగా ఉంటుందని ఆలోచిస్తూ రైల్వేస్టేషన్ బయటకు వచ్చాడు.

స్టేషన్ సమీపంలోనే  దాదాపు 60 అడుగుల లోతున్న ఒక పెద్ద బావి ఉంది. దాజీ బావి దగ్గరకి వెళ్లి లోపలకి చూసాడు. లోపల స్వచ్ఛమైన చల్లని నీళ్లు చాలా ఆకర్షణీయంగా కనిపించాయి. అప్పుడు దాజీ వయస్సు 20 సంవత్సరాలు. బలమైన యువకుడు, పైగా ఈతలో మంచి నైపుణ్యం కలవాడు కావడంతో ఎక్కువ ఆలోచించకుండా బావిలోకి దూకేసాడు. అది చూసిన గ్రామస్తులు ఆశ్చర్యంతో, "ఆ బ్రాహ్మణుడు తన ప్రాణాలు తీసుకోవడానికి బావిలో దూకేసాడు" అంటూ కేకలు పెట్టారు. బావిలో పడ్డ దాజీకి తాను మునిగిపోతున్నానని అర్థమై, నిస్సహాయతతో చేతులు ఊపసాగాడు. కానీ తాను ఎంతగా ప్రయత్నించినా ఇంకా ఇంకా లోతుకి మునుగిపోతున్నాడు. నీటి లోపలనుండి పైకి రావడానికి, ఊపిరి తీసుకోవడానికి నిర్విరామంగా పోరాడాడు కానీ, ప్రయోజనం లేకపోయింది. ఇక కొద్దిక్షణాల్లో పూర్తిగా మునిగిపోయి తన ప్రాణాలు కోల్పోతానని అతను గ్రహించాడు. ఆ క్షణంలో అతనికి బాబా జ్ఞప్తికి వచ్చారు. వెంటనే, "బాబా! నిన్ను పరీక్షించడానికి అంతదూరంనుండి వచ్చాను. మీరు నాకు గొప్ప గుణపాఠం నేర్పారు. మిమ్మల్ని కలవకుండానే నన్నిప్పుడు స్వర్గానికి పంపుతున్నారు. నాకు ఈమధ్యనే వివాహమైంది. ఇంకా పిల్లలు కూడా లేరు. నా భార్య యుక్తవయస్సులోనే విధవరాలవుతుంది. దీన్నైనా దృష్టిలో పెట్టుకుని నా ప్రాణాన్ని కాపాడండి. మీరు నన్ను కాపాడితే, మిగిలిన నా జీవితమంతా మిమ్మల్ని భక్తితో పూజిస్తాను" అని మనస్సులోనే బాబాని ప్రార్థించాడు. మరుక్షణం ఒక రాయి కొన తన కాళ్లకు తగలడంతో దానిపై నిలుచున్నాడు. ఆ రాయి ఇంకా లోతుకు మునిగిపోకుండా అతనిని ఆపింది. తరువాత బావి అంచు గోడ పట్టుకొని నిదానంగా పైకి వచ్చే ప్రయత్నం చేసాడు. అప్పటికే అక్కడికి గుంపుగా చేరి ఉన్న గ్రామస్తులు అతనికి సహాయం అందించి సురక్షితంగా బయటికి లాగారు. దాజీ ప్రమాదంనుండి బయటపడుతూనే చేతులు జోడించి, తన ప్రాణాలు కాపాడినందుకు బాబాకు కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. తరువాత ఒక టాంగా తీసుకుని శిరిడీ ప్రయాణమయ్యాడు. దాజీ ద్వారకామాయిలోకి ప్రవేశించిన వెంటనే బాబా, "అరే బ్రాహ్మణుడా! కనీసం ఇప్పుడైనా నమ్మకం వచ్చిందా?" అని పలకరించారు. దాజీ ముందుకు వెళ్లి సాష్టాంగపడి బాబా పాదాలు పట్టుకున్నాడు. అప్పటినుండి అతను బాబాకు అంకిత భక్తుడయ్యాడు. ప్రతిరోజూ ఉదయాన లేస్తూనే, "ఈ జీవితం బాబా ఇచ్చిన ప్రసాదమ"ని భావించేవాడు.

మనలో ప్రతి ఒక్కరు కూడా అద్భుతంగా గొప్పగా ఈ కష్టాలనే సముద్రాన్ని ఈది దాటగలమనుకుంటాము. నిజం చెప్పాలంటే మనం మునిగిపోతాం. అయితే సద్గురువుని ప్రార్థించి, శరణు పొందిన తరువాత ఆయన దయతో బయటికి లాగబడి సురక్షితంగా ఒడ్డుకు చేరుకుంటాము. ఒకసారి రక్షింపబడ్డాక, నిజంగా మనం ఎవరమన్న దానిమీద శ్రద్ధ పెట్టి, ఆత్మసాక్షాత్కారం కోసం ప్రయత్నించాలి. అందుకే బాబా, భావూని 'బ్రాహ్మణుడా' అని సంబోధించారు.


Ref: శ్రీసాయి సాగర్ మ్యాగజైన్, వాల్యూం 3, జనవరి - మార్చ్ 2013.
సోర్స్: Baba's divine manifestations by విన్నీ చిట్లూరి.

8 comments:

  1. Om Sai Ram 🙏🌹🙏
    ఓం శ్రీసాయి ఆరోగ్య క్షేమదాయ నమః'

    ReplyDelete
  2. ఓం సాయిరాం...🌹🙏🌹

    ReplyDelete
  3. జై సాయిరాం! జై గురుదత్త!

    ReplyDelete
  4. ఓం సాయిరామ్🙏💐🙏

    ReplyDelete
  5. Om Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🕉🙏😊❤😃🌺🥰🌸🤗🌹😀🌼

    ReplyDelete
  6. Om Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🕉🙏😊❤🤗🌹🥰🌼😃🌸😀🌺👪💕

    ReplyDelete
  7. Na bidda jabbuni elanti surgery/operation jaraganeeyakunda mandhulathone nayam chesi dheergayuvuni prasadinchandi baba. OM SREE SACHIDHANANDHA SAMARDHA SADGURU SAI NADHAYA NAMAHA 🕉🙏😊❤🤗🌹🥰🌼😃🌸😀🌺👪💕 ma thappulannintiki Kshamapana korutunnanu.

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo