సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

బాలకృష్ణ వామన్ వైద్య



బాలకృష్ణ వామన్ వైద్య బాంద్రా నివాసి. అతను దభోల్కర్ ఇంటికి సమీపంలో నివసిస్తుండేవాడు. అందరూ దభోల్కర్‌ని 'కాకా' అని పిలిచేవారు. కాబట్టి వైద్య కూడా దభోల్కర్‌ని 'కాకా' అనే పిలుస్తుండేవాడు. ఒకసారి దభోల్కర్ కీర్తనలు చేసే నిమిత్తం దాసగణు మహారాజ్‌ను తన ఇంటికి ఆహ్వానించాడు. ఆ కార్యక్రమానికి వైద్యను, అతని కుటుంబాన్ని కూడా ఆహ్వానించారు. దాసగణు తన కీర్తనలో భాగంగా బాబా దైవత్వం గురించి, వారి లీలల గురించి గొప్పగా వర్ణిస్తూ అద్భుతంగా ఉపన్యసించాడు. బాబా లీలలను ఎంతో శ్రద్ధగా వింటున్న వైద్య భక్తిపారవశ్యంతో బాబా ప్రేమలో మునిగిపోయాడు.

తరువాత కొంతకాలానికి వైద్య మొలల వ్యాధితో బాధపడుతూ చాలా నొప్పిని అనుభవించాడు. అతను ఎంతోమంది వైద్యులను సంప్రదించి, వాళ్ళు సూచించిన రకరకాల నివారణోపాయాలు, చికిత్సలు ప్రయత్నించినప్పటికీ తన స్థితిలో ఎటువంటి మెరుగుదల కనపడలేదు. అటువంటి స్థితిలో ఒకరోజు అతను తన సమస్యను దభోల్కర్‌కి తెలియజేసి సలహా కోరాడు. అప్పుడు దభోల్కర్, "జీవితంలో అన్ని అనారోగ్య సమస్యలకి ఒకే ఒక్క పరిష్కారం - శిరిడీ శ్రీసాయిబాబా. శిరిడీ వెళ్లి వారి దర్శనం చేసుకో. ఆయన నీకు ఖచ్చితంగా నయం చేస్తారు" అని చెప్పాడు. వైద్య యొక్క ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే అయినప్పటికీ ఎలాగైనా శిరిడీ వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అతను రైల్వే ఉద్యోగి అయినందున ఉచిత పాస్ లభ్యం కావడంతో శిరిడీ ప్రయాణమయ్యాడు.

వైద్య శిరిడీ చేరుకున్నంతనే ఆలస్యం చేయకుండా బాబా దర్శనానికి మసీదుకు వెళ్ళాడు. బాబా అతన్ని చూస్తూనే, "రా భావూ! నువ్వు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఇక్కడ ఉండగా నువ్వెందుకు భయపడతావు? ఇక చింతించకు, నీ మొలల వ్యాధి నయమవుతుంది" అని అన్నారు. తన రాకకు కారణం చెప్పకముందే బాబా అలా చెప్పడంతో వారి సర్వజ్ఞత్వానికి వైద్య ఆశ్చర్యపోతూ బాబాకు నమస్కరించాడు. తరువాత సభామండపంలోకి వెళ్లి కూర్చొని ఇతర భక్తులతో మాటల్లో పడ్డాడు. అంతలో అనుకోకుండా ఒక భక్తుడు అతని చేయి మీద అడుగు వేసి తొక్కడంతో అతను తీవ్రమైన నొప్పితో, "బాబా! నన్ను రక్షించండి" అని అరిచాడు. దానికి బాబా, "నేను నీకు ముందే చెప్పాను, కొద్దిసేపు వేచి ఉండు, నీకు నయమవుతుంది" అని బదులిచ్చారు. ఆ క్షణం నుండి అతని మొలల బాధ నివారణ అయ్యింది. జీవితంలో మళ్ళీ ఎప్పుడూ మొలల వ్యాధి అతనిని బాధపెట్టలేదు. అతను తరచూ సాటి భక్తులతో, "వైద్యులందరూ నాకు నయం చేయలేమని ఆశ వదిలేసినప్పుడు బాబా తమ దైవకృపతో అత్యంత బాధాకరమైన నా సమస్యను నయం చేశార"ని చెప్తుండేవాడు.

రెఫ్: శ్రీసాయి ప్రసాద్ పత్రిక 1988 (దీపావళి ఇష్యూ).
సోర్స్: బాబా'స్ డివైన్ సింఫనీ బై విన్నీ చిట్లూరి,

2 comments:

  1. Om Sai
    Sri sai
    Jaya Jaya Sai
    🙏🙏🙏

    ReplyDelete
  2. Om Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🕉🙏❤😊😀

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo