సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 595వ భాగం....



ఈ భాగంలో అనుభవం:

  • మంచి జీవితాన్ని ప్రసాదించిన బాబా


నెల్లూరు నుండి సాయిభక్తురాలు శ్రీమతి సుమ తనకు బాబా ప్రసాదించిన అనుభవాలను మనతో పంచుకుంటున్నారు.

ముందుగా అందరికీ సాయిరాం! నా పేరు సుమ. మాది నెల్లూరు. ఈ బ్లాగ్ నిర్వహిస్తూ సాయిమహిమను అందరికీ మరింతగా తెలియజేస్తున్న బ్లాగ్ నిర్వాహకులకు బాబా ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. నేను ఇదివరకు కొన్ని అనుభవాలను మీతో పంచుకున్నాను. ఈరోజు బాబా ప్రసాదించిన మరో అనుభవాన్ని సాటి సాయిబంధువులతో పంచుకోవాలని అనుకుంటున్నాను.

నా చదువు పూర్తి చేశాక నేను కొన్ని నెలలు ఉద్యోగం చేశాను. తరువాత కొన్ని కారణాల వల్ల నేను ఉద్యోగం చేయటం మానేశాను. ఇంట్లో నాకు పెళ్ళి సంబంధాలు చూడసాగారు. అందరి ఆడపిల్లలలాగే నాక్కూడా నాకు కాబోయే భర్త విషయంలో కొన్ని ఇష్టాలు ఉండేవి. అందువల్ల నేను తొందరపడి ఏ సంబంధమూ ఒప్పుకునేదాన్నికాదు. “బాబా ఎప్పటికైనా నా కోసం మంచి సంబంధం తీసుకొస్తారు, నాకు ఖచ్చితంగా మంచి చేస్తారు” అని బాబాపై నమ్మకంతో ఎదురుచూసేదాన్ని. ఇలాంటి పరిస్థితిలో కూడా నా కుటుంబం ఏరోజూ నన్ను బాధపెట్టలేదు. కానీ, మాది మధ్యతరగతి కుటుంబం కావటం, నాకు ఉద్యోగం లేకపోవటం, పెళ్ళి కూడా కుదరకపోవటంతో మాకు తెలిసినవాళ్ళు కొందరు, “కాస్త రాజీపడి, వచ్చిన పెళ్ళి సంబంధాల్లో ఏదో ఒక సంబంధం చేసుకో, లేకపోతే ఉద్యోగం చెయ్యి” అంటూ నన్ను ఒత్తిడి చేస్తుండేవారు. బయటివాళ్ళు నా పెళ్ళి విషయంలో అలా మాట్లాడిన ప్రతిసారీ నా మనసుకు ఎంతో బాధకలిగినప్పటికీ నేను తిరిగి మాట్లాడకుండా బాబాకు చెప్పుకుని బాధపడేదాన్ని. అలా బాధపడిన ప్రతిసారీ బాబా నాకు స్వప్నదర్శనం ప్రసాదించటమో, లేదా క్వశ్చన్&ఆన్సర్ వెబ్‌సైట్ ద్వారా సానుకూలమైన సమాధానం ఇవ్వడమో చేసి నా మనసుకు ఓదార్పునిచ్చేవారు.

ఒకసారి నేను 11 వారాలు బాబా దివ్యపూజ చేశాను. 11 వారాలు పూర్తయిన రెండు నెలలకి మా నాన్నకు తెలిసిన ఒక అంకుల్ ద్వారా ఒక పెళ్ళి సంబంధం వచ్చింది. ఆ అంకుల్ మరో ఇద్దరితో కలిసి మా ఇంటికి వచ్చారు. ఆరోజు పెద్దవాళ్ళు కూర్చుని సంబంధం గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. నేను బాబా ఫోటో వైపు చూస్తూ, “బాబా! ఇది నీ నిర్ణయమేనా? ఈ సంబంధం నీకు సమ్మతమేనా?” అని మనసులోనే అనుకుంటున్నాను. అప్పుడు ఆ ముగ్గురిలో ఒకరు, “నీకు నేను గ్యారంటీ, నీ జీవితం ఆనందంగా ఉంటుంది. మంచి కుటుంబం, మంచి అబ్బాయి. ఈ పెళ్ళి చేసుకో, పూర్తి బాధ్యత నాది” అని చెప్పారు. ఆ మాట నాకు బాబా ఇచ్చిన సమాధానంలా అనిపించింది. నిజానకి వారు ముగ్గురూ నాకు పెళ్ళి చేయటం కోసం వచ్చిన బ్రహ్మ, విష్ణు, మహేశ్వర రూపాలే అనిపించింది. అంటే సాక్షాత్తూ సాయిదత్తాత్రేయులని అనిపించింది.

ఆ తరువాత అబ్బాయివాళ్ళతో మాట్లాడి, ఇంటికి రమ్మని ఆహ్వానించడానికి మా అమ్మ, నాన్న, మా తాతయ్య వాళ్ళు అబ్బాయివాళ్ళ ఇంటికి వెళదామనుకున్నారు. మా తాతయ్యవాళ్ళు పండ్లు తీసుకుని వెళదామని వాళ్ళింట్లో కవర్ కోసం వెతికితే ఏ కవరూ దొరకలేదు. అప్పుడు మా తాతయ్యవాళ్ళ అమ్మాయి, సాయిభక్తురాలైన మా శ్రావణి అక్క తను శిరిడీ నుండి తెచ్చుకున్న కవరుని వాళ్ళకు ఇచ్చింది. ఆ కవర్ పైన బాబా ఫోటో ఉంటుంది. మా తాతయ్యవాళ్ళు ఆ బాబా కవర్లో పండ్లు పెట్టుకుని మా ఇంటికి తీసుకొచ్చారు. బాబాను చూడగానే నాకు ఎంతో ఆనందంగా అనిపించింది. ఆ విధంగా ఆరోజు మొదటిసారి అబ్బాయివాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు బాబానే పెళ్ళిపెద్దగా వెళ్ళారు.

ఆ తరువాత రెండు రోజులకు అబ్బాయివాళ్లు నన్ను పెళ్ళిచూపులు చూడటానికి మా ఇంటికి వచ్చారు. ఆరోజు ప్రొద్దున నేను బాబా గుడిలో ప్రదక్షిణలు చేస్తూ, “బాబా! నిజంగా ఈ అబ్బాయినేనా మీరు నాకు నిశ్చయించింది? నా వైవాహిక జీవితం బాగుంటుందిగా?” అని మనసులోనే అనుకుంటున్నాను. సరిగ్గా అదే సమయంలో బాబా మందిరంలోనుండి, “సందేహించకుమమ్మా! రఘురాము ప్రేమను సీతమ్మా!” అని లవకుశ సినిమాలోని పాట వినిపించింది. శ్రీరాముని విషయంలో సీతమ్మ బాధపడుతుంటే, ‘రాముని సందేహింపకు’ అని వాల్మీకి మహర్షి సీతమ్మకు నచ్చజెబుతున్న సందర్భంలోని పాట అది. ఆ బాబా మందిరంలో నేను ఇదివరకెప్పుడూ ఆ పాట వినలేదు. నాకు చాలా ఆనందం, ఆశ్చర్యం కలిగాయి. “పెళ్లికొడుకు విషయంలో ఏ సందేహమూ పెట్టుకోవద్దు, అంతా బాగుంటుంది” అని బాబానే నాకు చెప్తున్నట్టు అనిపించింది. ఎంతో సంతోషంతో మనసారా బాబాకు కృతజ్ఞతలు తెలుపుకుని ఇంటికి వెళ్ళాను. పెళ్ళిచూపుల్లో ఆ అబ్బాయికి మా కుటుంబ పరిస్థితి, ఆర్థిక స్థోమత చెప్పారు. ఆయన చాలా మంచివారు. అన్నిటికీ ఒప్పుకున్నారు. నిజానికి నాకు కాబోయే భర్తకు ఎలాంటి లక్షణాలు ఉండాలనుకున్నానో ఆయన అలాగే ఉన్నారు. పెళ్ళి విషయంలో నేను ఇన్ని రోజులు ఎదురుచూసినందుకు నిజంగా బాబా నాకు చాలా మంచి భర్తను, మంచి కుటుంబాన్ని ఇచ్చారు. “థాంక్యూ బాబా!”

కరోనా కారణం చేత మా నిశ్చితార్థం సుబ్రహ్మణ్యస్వామి గుడిలో బంధువుల మధ్య సంతోషంగా జరిగింది. మేము పూలదండలు మార్చుకునే సందర్భంలో మేళం వాయించేవాళ్ళు బాబా పాటను వాయించారు. అది నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. సాధారణంగా మేళంవాళ్ళు ఎప్పుడూ మనం మామూలుగా వినే పాటలే వాయిస్తారు. కానీ ఆరోజు సరిగ్గా ఆ సందర్భంలో బాబా పాటను వాయించడం నాకు చాలా ఆనందాన్నిచ్చింది.

మావారి పేరు అనిల్ కుమార్. తన పేరులో ‘సాయి’ అని ఉంటే బాగుండు అనుకునేదాన్ని. రెండు నెలల తరువాత మావారు మాటల సందర్భంలో, తనకు చిన్నప్పుడు పెట్టిన పేరు ‘దిలీప్ సాయి అనిల్ కుమార్’ అని చెప్పారు. దాంతో నా ఆనందానికి అవధులు లేవు. బాబా తన బిడ్డల చిన్న చిన్న కోరికలు కూడా తప్పకుండా తీర్చి వారిని సంతోషపెడతారు.

నిశ్చితార్థం అయ్యాక తెలిసిన అంకుల్ నాకు ‘సాయిలీలామృతం’ పుస్తకం తెచ్చిచ్చారు. చాలా రోజులుగా ఆ పుస్తకం కొనుక్కుని చదువుకోవాలని నాకు ఉండేది. కానీ ఎందుకో కుదరలేదు. పెళ్ళికి ముందు బాబానే ఆ అంకుల్ ద్వారా ఆ పుస్తకాన్ని పంపించి నాతో ఒక్కరోజులో పారాయణ పూర్తి చేయించారు. మావారు కూడా బాబాను నమ్ముతారు. ఆయన ప్రతి  గురువారం సాయి మూలబీజ మంత్రాక్షర స్తోత్రం చదువుతారట. “నువ్వు కూడా ప్రతి గురువారం సాయి మూలబీజ స్తోత్రం చదువుకో, బాగుంటుంది” అని ఒకసారి నాతో చెప్పారు. నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే, ఈ సంబంధం రావడానికి ఒక రెండు వారాల ముందు నేను కూడా సాయి మూలబీజ స్తోత్రం చదివాను. ఆయన ఎప్పుడూ చదివే సాయి మూలబీజ స్తోత్రాన్ని తనను కలవకముందే బాబా నా చేత కూడా చదివించి మమ్మల్ని ఇలా ఆశీర్వదించారని అర్థమై ఎంతో ఆనందించాను.

పెళ్ళి ఇంకో వారం ఉందనగా, మావారు ఉద్యోగం చేసే బ్యాంకులో కరోనా పాజిటివ్ కేసులు రావడంతో అందరూ కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని నిబంధన విధించారు. ఈయనకి జలుబు, ఒళ్ళునొప్పులు ఉండటంతో తనకు ఖచ్చితంగా పాజిటివ్ వస్తుందని ఈయన అనుకున్నారు. మరో వారంలో పెళ్ళి పెట్టుకుని పాజిటివ్ వస్తే ఖచ్చితంగా పెళ్ళి వాయిదా పడుతుంది. దాంతో మళ్ళీ రెండువైపులా ఆందోళన మొదలైంది. నేను ఈయనతో, “బాబా మీద భారం వేసి కోవిడ్ పరీక్ష చేయించుకోండి, ఖచ్చితంగా మీకు నెగిటివే వస్తుంది” అని ధైర్యం చెప్పాను. మావారు కూడా తనకు కరోనా నెగిటివ్ వస్తే బాబాకి పల్లకి సేవ చేయిస్తామని మ్రొక్కుకున్నారు. బాబా దయతో ఆయనకి నెగిటివ్ వచ్చింది.

నిశ్చితార్థానికి, వివాహానికి మధ్య సమయం చాలా తక్కువ ఉండటంతో పెళ్ళికి పర్మిషన్ తీసుకోవటం, కోవిడ్ నిబంధనల కారణంగా పెళ్ళికి కొద్దిమంది అతిథులు మాత్రమే రావాలి కాబట్టి ఎవరెవర్ని ఆహ్వానించాలి, MRO పర్మిషన్ లెటర్ ఉండాలి వంటి విషయాలలో కాస్త ఆందోళనపడ్డాము. అయినప్పటికీ బాబా దయతో పెళ్లికి పర్మిషన్ వచ్చింది. కొద్దిమంది బంధువుల సమక్షంలో, బాబా ఆశీస్సులతో మా పెళ్ళి చాలా సంతోషంగా జరిగింది. పెళ్ళికి బాబా వెండిపటం రూపంలో వచ్చి ఆయన ఆశీస్సులు ప్రసాదించి మమ్మల్ని ఎంతో సంతోషపెట్టారు.

పెళ్ళయిన తరువాత మేము బాబా పల్లకిసేవకి డబ్బులు కడదామని బాబా గుడిలో కనుక్కుంటే, “కరోనా కారణంగా క్రొత్తగా పల్లకిసేవకి డబ్బులు కట్టించుకోవడం లేదు. నవంబరు తరువాతనే డబ్బులు కట్టించుకుంటాము. అప్పటివరకు కొందరు కట్టినవి ఉన్నాయి, అవి మాత్రమే చేస్తాము” అని చెప్పారు. అందువల్ల మేము ఒకేసారి నవంబరులో పల్లకిసేవకి డబ్బులు కడదామని అనుకున్నాము. అయితే ఈలోపే మేము ఒకసారి అనుకోకుండా బాబా గుడికి వెళ్ళాము. ఆరోజు, ముందరే డబ్బులు కట్టినవాళ్ళ పేరున బాబా పల్లకిసేవ జరుగుతోంది. కానీ, పల్లకిసేవకి డబ్బులు కట్టినవాళ్ళు రాకపోవటంతో ఆ పూజారి నన్ను, మావారిని పిలిచి మాకు బాబా పల్లకిసేవ చేసుకునే భాగ్యాన్ని కల్పించారు. “థాంక్యూ సో మచ్ బాబా!”

పెళ్ళయిన తరువాత ఒకరోజు మావారు నాతో తన ప్రమోషన్ గురించి మాట్లాడుతూ, “ప్రతిసారీ ప్రమోషన్ వచ్చినట్టే వచ్చి ఏదో ఒక కారణం చేత వెనక్కు వెళుతోంది” అని బాధపడ్డారు. ప్రతిభ, అర్హత, అనుభవం ఇవన్నీ ఉన్నప్పటికీ ఆయనకి ప్రమోషన్ రావటం లేదు. ఈ విషయంలో ఒకరోజు తను చాలా బాధపడుతున్నారు. ఆరోజు మేమిద్దరం బంధువుల ఇంటికి బైక్ మీద వెళుతున్నప్పుడు, “ఈసారి కూడా పైనుంచి పదోన్నతి ఉత్తర్వులు వచ్చాయి. కానీ, అందులో నా పేరు లేదు” అని నాతో చెప్తూ బాధపడ్డారు. నాకు చాలా బాధకలిగి, “ఎందుకు బాబా ఇలా జరుగుతోంది? ఆయనకి ప్రమోషన్ వచ్చేలా చూడండి. నేను 5 వారాలు దివ్యపూజ చేస్తాను” అని బైక్ మీద వెళుతుండగానే బాబాకు మ్రొక్కుకున్నాను. మేము మా బంధువుల ఇంటికి వెళ్ళిన కొద్దిసేపటికి మావారికి ఫోన్ వచ్చింది. మావారి మేనేజర్ మాట్లాడుతూ, “నిన్ను ప్రమోట్ చేస్తున్నాను, వచ్చే నెలలో అధికారికంగా ఉత్తర్వులు  వస్తాయి” అని చెప్పారు. మావారు ఎంతో ఆనందించారు. నా ఆనందానికైతే అవధులు లేవు. అడిగినంతనే కోరిక తీర్చే సాయి మన చెంత ఉన్నప్పుడు మనం ధైర్యంగా ఉండొచ్చు. బాబా దయతో త్వరలోనే పదోన్నతికి సంబంధించిన ఉత్తర్వులు రావాలని బాబాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

ఆరోజు బాబాకు మ్రొక్కుకున్నట్లుగా సాయి దివ్యపూజ ప్రారంభించాను. దివ్యపూజ చేస్తున్న సమయంలో, ‘ఒక్క వారమైనా 108 జాజిపువ్వులతో బాబాకు పూజ చేద్దామ’ని అనిపించింది. కానీ, రెండు వారాలు ప్రయత్నించినా జాజిపువ్వులు దొరకలేదు. చివరివారం మాత్రం ఒక తెలిసిన ఆంటీ నా దివ్యపూజ కోసమని మా అత్తయ్యగారికి సన్నజాజి పువ్వులు పంపించారు. ఆ విధంగా బాబా ఆ కోరిక కూడా తీర్చి ఎంతో సంతోషాన్నిచ్చారు.

మా వివాహ సమయంలో నా స్నేహితురాలు కొంత డబ్బు ఇచ్చి, ‘బాబా వెండి విగ్రహం కొనుక్కోమ’ని చెప్పింది. చాలా రోజులుగా బాబా విగ్రహం కొనుక్కుందామని అనుకుంటున్నప్పటికీ కుదరలేదు. కానీ సెప్టెంబరు 1వ తేదీ, గురువారంరోజున బాబా దయతో వెండి విగ్రహం తెచ్చుకున్నాము. ఆరోజు అధిక ఆశ్వయుజ పౌర్ణమి, చాలా మంచిరోజట. గత సంవత్సరం అదే రోజు చంద్రుడిలో బాబా కనిపించారు. అలాంటి మంచిరోజునే బాబా మా ఇంటికి రావటం నిజంగా బాబా లీలే.

ఒకరోజు నా మనసెందుకో ఏవో ఆలోచనలతో అలజడిగా ఉంది. ఆ సమయంలో మన సాయి మెసేజెస్ గ్రూపులో ఒక మెసేజ్ వచ్చింది. అందులో, “ఆందోళన చెందకు, అంతా సవ్యంగా జరుగుతుంది. నేను నీతో ఉంటాను. ఈరోజు మీ ఇంటికి వస్తాను” అని ఉంది. ‘బాబా ఏ రూపంలో వస్తారో’నని నేను ఎదురుచూడసాగాను. ఆరోజు సాయంత్రం అనుకోకుండా నేను, మావారు మా అమ్మావాళ్ళింటికి వెళ్ళాము. ఉన్నట్టుండి అమ్మ నాకు ఒక గిఫ్ట్ బాక్స్ ఇచ్చి, “శ్రావణి అక్క నీకిమ్మని ఇచ్చింది” అని చెప్పింది. ఆ బాక్స్ తెరచి చూస్తే, అందులో నాకు ఎంతో ఇష్టమైన భంగిమలో, ఇష్టమైన రంగు దుస్తుల్లో ఉన్న బాబా ఫోటో ఉంది. ఆ ఫోటో చూడగానే నాకు ఎంతో ఆనందం కలిగింది. బాబా అన్నట్టే మా ఇంటికి ఫోటో రూపంలో వచ్చారు. ఆ బాబా ఫోటోని మా ఇంట్లో మా గదిలో పెట్టుకున్నాను.

బాబా ఎల్లప్పుడూ తన బిడ్డలను ప్రేమిస్తుంటారు. బాబా దయవుంటే అన్నీ ఉన్నట్లే. నేను ఈరోజు ఆనందంగా ఉన్నానంటే అది కేవలం బాబా దయవల్లే. ఇంత మంచి జీవితాన్ని ప్రసాదించిన బాబాకు శతకోటి ప్రణామాలు. ఎవరైతే పెళ్ళి విషయంలో బాధపడుతున్నారో వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, పూర్తి విశ్వాసంతో బాబాను నమ్మండి. బాబా తప్పక మంచి చేస్తారు. తన బిడ్డలకు ఎప్పుడు ఏమి ఇవ్వాలో బాబాకు బాగా తెలుసు. మనం సహనంగా వేచివుండాలి. ఆ సహనశక్తి కూడా ఆ సాయిమహరాజే మనకు ఇవ్వాలి. “బాబా! మీరు నా బాధలెన్నో దూరం చేసి నాకు సంతోషాలు ఇచ్చారు. కొన్ని అనుభవాలను పంచుకోలేకపోతున్నాను, క్షమించండి బాబా. మీ దయ లేనిదే నేను లేను. ఏ బిడ్డ బాధపడ్డా తక్షణమే పలికి సంతోషపెట్టే సాయిమహరాజు మీరు. ఈ అనుభవం పంచుకోవటంలో ఆలస్యం చేశాను, క్షమించండి బాబా. మీ బిడ్డలందరి మీద మీ కృప ఎల్లప్పుడూ ఉండేలా అనుగ్రహించండి బాబా!”

అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!



14 comments:

  1. very very nice babas leelas.she expressed her leelas by baba very nice.i liked neration.

    ReplyDelete
  2. అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!

    ReplyDelete
  3. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  4. Sai Ram..
    Chala baga chepav suma. Baba dhaya unte antha manche jaruguthundhi

    ReplyDelete
  5. 🌷🌺🌷🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🌷🌺🌷

    ReplyDelete
  6. 🌺🌷🌺🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🌺🌷🌺

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo