సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1401వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. ఎలాంటి ఇబ్బందినైనా దూరం చేస్తున్న బాబా
2. కావాల్సిన లాకెట్‍ను నా దగ్గరకే పంపిన బాబా

ఎలాంటి ఇబ్బందినైనా దూరం చేస్తున్న బాబా


ఓం శ్రీసాయి శరణాగతవత్సలాయ నమః!!! ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి!!! సాయి బంధువులకు నా నమస్కారాలు. ఈ బ్లాగు నిర్వహిస్తున్న వారికి నా కృతజ్ఞతలు. నేను ఒక సాయి భక్తురాలిని. నాపేరు స్రవంతి. 2022, నవంబర్ 11న నేను, మా అమ్మ యాదగిరిగుట్ట వెళ్లాలనుకున్నాము. కానీ మా అమ్మ, "ఇద్దరము ఆడవాళ్ళమే, ఇప్పుడు వెళ్ళొద్దులే. మీ నాన్నగారు (ఆయన సౌదీలో ఉంటారు) వచ్చినప్పుడు వెళదాము" అని అంది. నేను, "అమ్మా! నువ్వేం భయపడకు. మనతో శ్రీసాయిబాబా తోడుగా వస్తారు. మనతోపాటు ఒక చిన్న బాబా ఫోటో తీసుకుని వెళదాం" అని అన్నాను. ఇంకా అమ్మ, "సరే, వెళదాము" అంటే ఇద్దరం శ్రీయాదగిరిగుట్ట వెళ్ళాము. బాబా దయవల్ల మాకు 10 నిమిషాల్లోనే శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి దర్శనం అయింది. అమ్మ శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి కళ్యాణం జరిపించింది. తరువాత మేము ప్రసాదం కొనడానికి వెళితే, అక్కడ బాబా విగ్రహ రూపంలో మాకు దర్శనమిచ్చారు. నేను చాలా సంతోషించాను. నాకు, మా అమ్మకు బస్సు ప్రయాణం అస్సలు పడదు, వాంతులు అవుతాయి. అలాంటిది మేము ఇంటి నుండి బయలుదేరి యాదగిరిగుట్ట వెళ్లి, తిరిగి ఇంటికి వచ్చేంతవరకు ఒక్కసారి కూడా మాకు వాంతి కాలేదు. అలా బాబా మాకు ప్రయాణంలో ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకుని, స్వామి దర్శనం చేయించి క్షేమంగా తిరిగి మా ఇంటికి చేర్చారు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".


2022, నవంబర్ 21న మామయ్య వరసయ్యే మా బంధువు ఆరోగ్యం బాలేదని, అతనిని చూడటానికి మా అమ్మ, మామయ్య, అత్తయ్య బైక్ మీద హాస్పిటల్‍కి వెళ్లారు. రాత్రి 7 గంటలప్పుడు వాళ్ళు తిరిగి ఇంటికి వస్తుంటే దారిలో కుక్క అడ్డం రావడంతో ఆక్సిడెంట్ అయింది. మామయ్యకి, అత్తయ్యకి చిన్నచిన్న దెబ్బలు తగిలాయి కానీ మా అమ్మకి కొంచెం తీవ్రంగానే తగిలాయి. కానీ వాళ్ళు సిటీకి వెళ్లి హాస్పిటల్లో చూపించుకోకుండా గ్రామంలోని ఆర్.ఎమ్.పి డాక్టర్ దగ్గర చికిత్స చేయించుకుని ఇంటికి వచ్చారు. నేను 'వాళ్ళు ముగ్గురూ ఆరోగ్యంగా ఉండాల'ని ఆ రాత్రంతా బాబా చాలీసా, శ్రీసాయిసచ్చరిత్ర చదువుతూ బాబాను ప్రార్థించాను. మరుసటిరోజు ఉదయం అమ్మని సిటీలోని హాస్పిటల్‍కి తీసుకెళ్తే, స్కాన్ చేయాలని అన్నారు. అమ్మని స్కానింగ్ చేయడానికి తీసుకుని వెళ్ళినప్పుడు నేను నా చేతిలో బాబా ఫోటో, ఊదీ పట్టుకుని, "బాబా! రిపోర్టులన్నీ నార్మల్‌గా రావాలి" అని బాబాను ప్రార్థించాను. బాబా నా ప్రార్ధనలకు సమాధానమిచ్చారు. మా అమ్మకి చేసిన పెద్ద స్కానింగ్‍లో అమ్మకి అంతా నార్మల్ అని వచ్చింది. నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. "చాలా ధన్యవాదాలు బాబా". కానీ మా అమ్మ ముఖమంతా ఉబ్బిపోయింది, ఒకటే నొప్పులు, ఒక కన్ను సరిగా కనిపించట్లేదు, పళ్ళు ఊడిపోయాయి. డాక్టర్లు అన్నం పెట్టొద్దు అన్నారు. కేవలం జ్యూసులు ఇస్తున్నాము. దయచేసి శ్రీసాయి భక్తులందరూ మా అమ్మ తొందరగా కోలుకోవాలని, ఆమె ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థించండి ప్లీజ్.


2022, నవంబర్ 23న నేను రూట్ కెనాల్ చికిత్స కోసం మా అమ్మని హాస్పిటల్‍కి తీసుకెళ్తూ, "బాబా! మీరు కూడా మాతోపాటు హాస్పిటల్‍కి రండి. అమ్మకి ఎలాంటి నొప్పులు లేకుండా చికిత్స బాగా జరిగేలా అనుగ్రహించండి" అని వేడుకున్నాను. మేము హాస్పిటల్‍కి వెళ్ళగానే ఫోటో రూపంలో బాబా మాకు దర్శనమిచ్చారు. అమ్మకి ట్రీట్మెంట్ చాలా బాగా జరిగింది. "థాంక్యూ సో మచ్ సాయిబాబా".


ఒకరోజు రాత్రి మా అమ్మకి చెస్ట్ లో పెయిన్ వచ్చింది. నేను బాబా ఫోటో ముందుకెళ్ళి సాయిబాబా ఊదీ మంత్రం, అలానే 'ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః' అనే నామాన్ని 9సార్లు జపించి, ఊదీ బాబా చేతికి తాకించి ఆ ఊదీ అమ్మ చెస్ట్ కి రాసి, అమ్మ చెస్ట్ పెయిన్ బాబా తగ్గిస్తారని పూర్తి నమ్మకం ఆయన యందు ఉంచాను. ఉదయం లేచేసరికి అమ్మకి పెయిన్ తగ్గింది. "థాంక్యూ సో మచ్ సాయి".


ఒకరోజు రాత్రి నాకు విపరీతమైన వెన్నునొప్పి వచ్చింది. అప్పుడు నేను బాబా ఊదీ తీసుకుని 'ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః' అని అనుకుంటూ నొప్పి ఉన్న చోట రాసాను. బాబా దయవల్ల కొద్దిసేపట్లో నొప్పి పూర్తిగా తగ్గిపోయింది. "థాంక్యూ సో మచ్ బాబా".


చివరిగా మరో చిన్న అనుభవం: 2022, నవంబర్ 12న మా ఆంటీవాళ్ళు శిరిడీ వెళ్లారు. వాళ్ళు శిరిడీలో ఉన్నప్పుడు నేను వాళ్లకు ఫోన్ చేసి ఒక్క చిన్న బాబా విగ్రహం తెమ్మని చెప్పాలనుకున్నాను. కానీ తెస్తారో, లేదో అనిపించి నేను వాళ్లకు కాల్ చేయలేదు. వాళ్ళు శిరిడీ నుంచి వచ్చిన ఒక వారం తర్వాత ఆంటీవాళ్ళ అబ్బాయి మా ఇంటికి వచ్చి శిరిడీ ప్రసాదం, ఒక బాబా విగ్రహం  నా చేతిలో పెట్టాడు. బాబాని చూడగానే నాకు చాలా చాలా ఆనందం కలిగింది. ఇప్పుడు ఈ అనుభవం పంచుకుంటుంటే కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. "థాంక్యూ సో మచ్ బాబా".


కావాల్సిన లాకెట్‍ను నా దగ్గరకే పంపిన బాబా


ఓం శ్రీసాయీశ్వరాయ నమ:!!!


ముందుగా శ్రీసాయినాథుని మార్గంలో 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగును నిర్వహిస్తున్న సాయి అన్నయ్యకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. సాయిభక్తజనులకు నా నమస్కారాలు. నా పేరు చండీశివప్రియ. నేను ఇదివరకు కలలు కన్న ఉద్యోగం ఇచ్చిన బాబా, పుట్టిన రోజున బాబా అనుగ్రహం అన్న టైటిల్స్ తో రెండుసార్లు నా అనుభవాలు ఈ బ్లాగు ద్వారా మీ అందరితో పంచుకున్నాను. ఆసక్తి ఉన్నవారు పైన బ్లూ లెటర్స్ ఉన్న ఆ టైటిల్స్ పై టచ్ చేసి చదువుకోవచ్చు. ఇక ఇప్పుడు నేను నా శిరిడీయాత్ర గురించి తెలియజేయాలనుకుంటున్నాను. బాబా నాకు ఉద్యోగం ప్రసాదించాక మొదటి నెల జీతం ఆయనకి సమర్పించుకోవాలని మా తమ్ముడితో కలిసి నేను శిరిడీ వెళ్ళాను. బాబాను దర్శించి డొనేషన్ కౌంటరులో నా జీతాన్ని డొనేట్ చేసి నా మొక్కు తీర్చుకున్నాను. సంస్థాన్ ట్రస్ట్ వాళ్ళు నాకు ఒక సచ్చరిత్ర పుస్తకంతోపాటు ఆరతికి హాజరయ్యే అవకాశం కల్పించారు. మేము ఎంతో సంతోషంగా ఆరతిలో పాల్గొన్నాము. తరువాత ప్రసాదాలయం వెళ్లి బాబా ప్రసాదం స్వీకరించాము. తరువాత మేమిద్దరం మాకోసం, స్నేహితులకోసం బాబా విగ్రహాలను, బాబా కంకణాలు, రేవడి(నువ్వుల జీడిలు), దూద్ పేడా, లడ్డూలు అందరికీ ప్రసాదంగా ఇవ్వడానికి తీసుకున్నాము. కొన్ని కార్లలో చూసిన బాబా లాకెట్లు కూడా కొనాలని అనుకున్నాను. కానీ అవి ఎక్కడా కనిపించలేదు. అంతలో మా తిరుగు ప్రయాణానికి సమయం అవ్వడంతో బస్సెక్కి మా సీట్లలో కూర్చున్నాం. నాది విండో సీటు. అందులో నుండి బయటకు చూస్తే బాబా కనిపించారు(ఫోటో కింద జతపరుస్తున్నాను). ఆయన దగ్గరుండి నన్ను సాగనంపుతున్నట్లు అనిపించి ఒక్కసారిగా నా కళ్ళ నుండి నీళ్లు వచ్చాయి. ఎంతటి ప్రేమ? ఆయన నన్ను సాగనంపడానికి మాత్రమే కాదు, నేను కొనాలనుకున్న లాకెట్లు కూడా కనపడేలా అనుగ్రహించారు. ఒకతను బస్సు ఎక్కి మరీ వాటిని అమ్ముతున్నాడు. ఒక లాకెట్ కొనుక్కొని చాలా సంతోషించాను. 'మరోసారి నీ దర్శన భాగ్యమివ్వు సాయినాథా' అని అనుకుంటూ, బాబా పాటలు వింటూ మా ఊరికి చేరుకున్నాను. కొన్నిరోజులకి బాబా నా స్నేహితుల ద్వారా శిరిడీ నుండి తమ విగ్రహాన్ని, హృదయరూపంలో ఉండే లాకెట్, ప్రసాదం పంపించారు. బాబా ప్రేమ అటువంటింది. ఆయనలా నన్ను ఎవరూ చూసుకోరేమో అనిపిస్తుంది. ఆయనే నన్ను బాగా చూసుకుంటారని నాకు చాలా నమ్మకం. "ధన్యవాదాలు బాబా. నేను చేస్తున్న ఉద్యోగంలో మంచి పేరు తెచ్చుకుని ఇంకా మంచి పొజిషన్ పొందేలా దీవించు తండ్రి. ఇంకా నాకున్న సమ్యసలు మీకు తెలుసు. వాటిని మీరు తప్పక తీరుస్తారని నమ్మకంతో, సబూరీతో ఎదురుచూస్తున్నాను తండ్రి. మీ దయవల్ల నా సమస్యలన్నిటికీ పరిష్కారం లభించాక మరోసారి మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను". బాబాని నమ్మండి. సచ్చరిత్ర చదవండి. బాబా తప్పక అందరి కోరికలు తీరుస్తారు.


సాయిభక్తుల అనుభవమాలిక 1400వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. ఊహకందని బాబా అనుగ్రహం
2. బాబాతో చెప్పుకున్నంతనే తీరిన సమస్యలు
3. భయపడాల్సిన పని లేకుండా అనుగ్రహించిన బాబా

ఊహకందని బాబా అనుగ్రహం


‘సాయి మహరాజ్ సన్నిధి’ బ్లాగ్ ద్వారా భక్తుల భక్తిని మరింత దృఢపరుస్తూ, సమస్యలకు పరిష్కారం సూచిస్తూ, మమ్ములను సతతం రక్షిస్తున్న అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు ఆ సద్గురు సాయినాథుని పాదకమలాలకు కోటానుకోట్ల నమస్కారములు. ఈ బ్లాగును నిర్వహిస్తున్న సాయికి నా ధన్యవాదాలు. నా పేరు శ్రీదేవి. మేము విశాఖపట్నంలో ఉంటున్నాము. ఈమధ్యకాలంలో ఆ సాయినాథుని కృపను మేము ఏవిధంగా పొందామో ఇప్పుడు మీతో పంచుకుంటాను. నేను ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్‌తోనూ, డయాబెటిస్‌తోనూ బాధపడుతున్నాను. నాకున్న ఈ వ్యాధుల నివారణ కోసం ఇటీవల నేను ఒక ఆయుర్వేద వైద్యుని సంప్రదించి, ఆయన సూచించిన మందులు వాడటం మొదలుపెట్టాను. అంతకు రెండువారాల ముందు నాకు ఒక సమస్య వచ్చింది. దానంతట అదే తగ్గుతుందేమోనని ఒక వారంరోజులు ఎదురుచూసి, తరువాత ఒక అల్లోపతి డాక్టర్ (ఇంగ్లీష్ డాక్టర్) దగ్గరకు వెళ్ళాను. ఆయన నా సమస్యకి మందులు వ్రాస్తూ, “డయాబెటిస్‌కి మీరు వాడుతున్న మందులు మీ షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్‌లో ఉంచడం లేదు. నేను వ్రాసిన మందులు వాడండి” అని డయాబెటిస్‌కి కూడా మందులు వ్రాశారు. సరేనని నేను ఆ మందులు కొని వాడటం మొదలుపెట్టాను. తర్వాత ఆయుర్వేద మందులు కూడా వాడటం మొదలుపెట్టాను. ఒక 4 రోజుల తర్వాత కాళ్ళు విపరీతంగా వాచిపోయి, ఒళ్ళునొప్పులు, నీరసం మొదలైంది. ఇదంతా ఆయుర్వేద మందుల ప్రభావం అనుకొని ఆయుర్వేద డాక్టరుకి వాట్సాప్ మెసేజ్ ద్వారా నా సమస్యను తెలియజేశాను. కానీ ఆయన వద్దనుండి ఏ సమాధానమూ లేదు. సంకోచిస్తూనే ఆయుర్వేద మందులు వాడసాగాను. 3 రోజుల తరువాత మళ్లీ ఆయుర్వేద డాక్టరుతో మాట్లాడదామని రెండు మూడుసార్లు ఫోన్ ద్వారా ప్రయత్నిస్తే ఒక్కసారి ఫోన్లో మాట్లాడే అవకాశం వచ్చింది. నా సమస్యనంతా విని, “ఆ కాళ్ళవాపులు ఆయుర్వేద మందు ప్రభావం వల్ల కాదు” అన్నారాయన. అయినప్పటికీ, నేను క్రొత్తగా వాడుతున్నది ఈ ఆయుర్వేద మందులే కాబట్టి అవే నా కాళ్ళవాపుకి కారణమనుకుని వాటిని వాడటం మానేశాను. అయినా పాదాలవాపు, కాళ్ళవాపు కొంచెం కూడా తగ్గలేదు. కాళ్ళంతా నీరు పట్టి బరువెక్కి బాధపెడుతుండేవి. ఇలాఉండగ, వృత్తిరీత్యా ఒకరోజు నేను తిరుగు ప్రయాణంలో నిద్రపోయాను. అప్పుడు ఉన్నట్టుండి “ఏం, ఆయుర్వేద మెడిసిన్ అని ఎందుకు అనుకోవాలి? నువ్వు ఈమధ్యకాలంలో మార్చిన ఇంగ్లీష్ మెడిసిన్ అని ఎందుకు అనుకోకూడదు?” అని ఒక ఇన్నర్ వాయిస్ (అంతర్వాణి) నన్ను నిద్రలేచేలా చేసింది. అది బాబానే అనడంలో సందేహమే లేదు. ఎందుకంటే, “బాబా! నా తండ్రీ! నాకేంటి ఈ పరిస్థితి?” అని నేను అంతకుముందే బాబాను ఆర్తిగా ప్రార్థిస్తూ ఉన్నాను. బాబా అలా చెప్పడంతో, ఇంటికి రాగానే కొత్త మందులను పక్కన పెట్టి, డయాబెటిస్‌కి నేను వాడే పాత మందులనే తెప్పించుకుని వాటిని వేసుకోవడం మొదలుపెట్టాను. మూడు నాలుగు రోజుల్లో పూర్తిగా నార్మల్ అయిపోయాను. బాబా తప్ప ఇంకెవరు నాకు ఆ ఆలోచన వచ్చేలా చేసి నన్ను రక్షించారో చెప్పండి? సాక్షాత్తూ ఆ సాయితండ్రే నన్ను ఆ సమస్య నుండి బయటపడేశారు. అలాగే, ఇటీవల మావారు ప్రయాణిస్తున్న బైక్ ప్రమాదానికి గురికాకుండా బాబా చివరిక్షణంలో రక్షించారు. చివరిక్షణంలో మావారు అప్రమత్తమయ్యేలా చేసి బాబానే ప్రమాదం బారిన పడకుండా తనను రక్షించారు. “బాబా! మా ప్రయాణంలో నిరంతరం మాకు తోడుగా ఉండి రక్షించండి తండ్రీ” అని రోజూ బాబాను ప్రార్థిస్తూ ఉండటమే అందుకు కారణం.


బాబా భక్తురాలైన నా స్నేహితురాలికి ఒకసారి ఒంట్లో బాగలేనప్పుడు తనకేమౌతుందోనన్న భయంతో తను బాబాను ప్రార్థించింది. బాబా తనకి అభయం ఇవ్వడంతో పాటు, “నిన్ను విమానంలో కూర్చోబెట్టుకుని తీసుకుని వెళ్తాను” అని మాట ఇస్తూ మెసేజ్ ఇచ్చారు. అది చూసి, ‘తాను చనిపోతానేమోన’ని నా స్నేహితురాలు భయపడింది. తనకు సమస్యలను ఎదుర్కొనే ధైర్యం ఇస్తూ తనని రక్షించారు మన సాయితండ్రి. మరుసటి నెల మేము కొంతమంది స్నేహితులం కలిసి శిరిడీకి విమానం టికెట్లు బుక్ చేసుకుంటూ అనుకోకుండా నా స్నేహితురాలిని అడగటం, తన భర్త తనని శిరిడీ వెళ్ళమని ప్రోత్సహిస్తూ పర్మిషన్ ఇవ్వడం, తనకి కూడా విమానం టికెట్ తీసుకోవడం జరిగింది. తనకి ఇదే మొదటిసారి విమాన ప్రయాణం చేయడం. “బాబా, ఇదా తండ్రీ నీ మాటలకి అర్థం? నన్ను విమానంలో తీసుకెళ్ళి నీ దర్శనం ఇప్పిస్తున్నావా తండ్రీ? అది నాకు ముందే చెప్పావా నాయనా?” అని తను ఆనందభాష్పాలు పెడుతుంటే అనుకోకుండా అదే సమయంలో నేను తనకి ఫోన్ చేసి, “అనితా, నీకు సాయితండ్రి ముందే చెప్పారుగా విమానంలో కూర్చుండబట్టి తీసుకువెళ్తానని. ఎలా నిజం చేశారో చూడు!” అని చెప్పాను. నా మాట విని తను ఆనందం పట్టలేక, “ఇప్పుడు నేను కూడా అదే ఆలోచనలో ఉండి బాబా పట్ల భక్తిభావంతో కన్నీళ్ళు పెట్టుకుంటున్నాను” అని చెప్పింది. ఇలా ఇద్దరికీ ఒకేసారి ‘ఇది బాబా మహాత్మ్యం’ అని స్ఫురించడం బాబా దయే కాక ఇంకేమిటి?


దాదాపు 20 సంవత్సరాల క్రితం ఒకసారి నేను స్కూలునుండి తిరిగి వచ్చే క్రమంలో నేను ఎక్కాల్సిన బస్సును డ్రైవర్ కాస్త ముందుకు తీసుకువెళ్ళి ఆపాడు. దాంతో నేను వెనుక డోర్ నుండి బస్సు ఎక్కి వెనుకనున్న మూడు ఖాళీ సీట్లలో ఒకదానిలో కూర్చున్నాను. కొంత దూరం వెళ్ళాక ఒకాయన బస్సులో ఎక్కి నా ప్రక్కసీటులో కూర్చుని నన్ను పలకరించి నాతో మాట్లాడసాగారు. నేను ఆయనకి మర్యాదగా సమాధానం ఇస్తున్నాను. ఉన్నట్టుండి ఆయన తన బ్యాగులోంచి ఒక చిన్న కార్డు తీసి, “ఇందులో ‘సాయిబాబా కష్టనివారణ మంత్రం’ ఉంది. ప్రతిరోజూ భోజనానికి ముందు ఇది చదువుకోమ్మా” అని చెప్పారు. నేను ఆ కార్డులో ఉన్న మంత్రం చదివి తల తిప్పి చూస్తే ఆయన కనపడలేదు. ఈలోపల వచ్చిన బస్టాపులో దిగిపోయినట్లున్నారు. మహాఅయితే నేను ఆయనతో బస్సులో 4 కిలోమీటర్లు ప్రయాణించి ఉంటాను. ఈలోపే ఆయన నాకు ఆ కార్డు ఇచ్చి బాబా మంత్రంపై దిశానిర్దేశం చేసి దిగిపోయారు. ఇది నిజంగా నాకు ఇప్పటికీ వింతగానే ఉంటుంది. పరిచయంలేని వ్యక్తి ఈవిధంగా బాబా గురించి చెప్పడం కేవలం బాబా ప్రేరణే. ఇలా చెప్పుకుంటే ఎన్నో, ఎన్నెన్నో అనుభవాలు. “మా అమ్మగారిని, మమ్మల్ని, మా పిల్లలను అందరినీ క్షేమంగా, ఆరోగ్యంగా, మనశ్శాంతిగా ఉండేలా అనుగ్రహించండి బాబా. స్థిరపడలేని జీవితాలను స్థిరపరచండి బాబా. అందరి కష్టాలను తొలగించండి. మా మనస్సులోని బాధలు, కోరికలు మీకు తెలుసు. దయచేసి అనుగ్రహించండి బాబా. ఇంకా ఏమైనా అనుభవాలు మర్చిపోయివుంటే గుర్తొచ్చేలా చేసి బ్లాగులో పంచుకునేలా అనుగ్రహించండి సాయితండ్రీ. మీకు శతసహస్ర పాదాభివందనాలు”.


బాబాతో చెప్పుకున్నంతనే తీరిన సమస్యలు


అందరికీ నమస్కారం. నేను ఒక సాయి భక్తురాలిని. నా పేరు విజయలక్ష్మి. నేనిప్పుడు బాబా నాకు ప్రసాదించిన మూడు అనుభవాలు మీతో పంచుకుంటాను. 2022, అక్టోబర్ 18న నాకు పాప పుట్టింది. అదివరకే మాకు ఒక బాబు ఉన్నాడు. బాబు పుట్టినపుడు నాకు పాలు సరిగా రాలేదు. అందువల్ల బాబుకి డబ్బా పాలు తాగించాము. ఇప్పుడు పాప విషయంలో కూడా అలా కాకూడదని నేను, "బాబా! మీ దయతో పాలు మంచిగా వచ్చి, పాప ఇబ్బంది లేకుండా తాగితే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి మ్రొక్కుకున్నాను. ఆ తండ్రి దయవల్ల నాకు పాలు మంచిగా వచ్చి పాప సంతుష్టిగా తాగుతుంది. కానీ తీరిక లేక నేను నా అనుభవం పంచుకోలేదు. హాస్పిటల్ నుండి ఇంటికి వెళ్ళాక మా బాబుకి బాగా జ్వరం వచ్చింది. అప్పుడు నేను, "బాబా! మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటానని ఇంకా పంచుకోలేదు. నేను ఆ విషయం మార్చిపోలేదు. కానీ క్షణం తీరిక ఉండట్లేదు. నా పరిస్థితి మీకు తెలుసు. దయచేసి మీ బిడ్డకు సహాయం చేయండి" అని బాబాను వేడుకున్నాను. బాబా దయ చూపారు. బాబుకి జ్వరం తగ్గింది.


ఒకరోజు నాకు బాగా తలనొప్పి వచ్చింది. ఆ కారణంగా రాత్రి నిద్ర కూడా పట్టలేదు. అప్పుడు నేను బాబాకి దణ్ణం పెట్టుకుని, 'ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః' అని అనుకుంటూ పడుకున్నాను. తలనొప్పి ఎప్పుడు తగ్గిపోయిందో కానీ, కొద్దిసేపట్లో నాకు బాగా నిద్రపట్టేసింది.


ఇంకోసారి జలుబు వల్ల మావారికి బాగా తలనొప్పి వచ్చింది. ఆయన నాలుగైదు రోజులు నొప్పితో బాగా ఇబ్బందిపడ్డారు. అప్పుడు నేను, "బాబా! ఈరోజు సాయంత్రం కల్లా మావారికి తలనొప్పి తగ్గితే, మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి మ్రొక్కుకున్నాను. కొద్దిసేపటికి మావారు, "ఇప్పుడు నొప్పి తగ్గింది" అని అన్నారు. నేను మనసులోనే బాబాకి కృతఙ్ఞతలు చెప్పుకున్నాను. "నా ఆరోగ్యం మరియు ఇద్దరు చిన్న పిల్లల వల్ల నా అనుభవాలు పంచుకోవడం అలస్యమైంది. నన్ను క్షమించండి బాబా. నా జీవిత లక్ష్యాన్ని నేరవేర్చి నన్ను ఎప్పుడు శిరిడీకి రప్పించుకుంటారా అని వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నాను తండ్రి. మాకు మీరే దిక్కు బాబా. మాపై దయ ఉంచండి తండ్రి".


భయపడాల్సిన పని లేకుండా అనుగ్రహించిన బాబా


సాయి భక్తులకు నమస్కారం. నేను ఒక సాయి భక్తురాలిని. మా బంధువులలో ఒకరు గొంతులో వాపుతో చాలా బాధపడ్డారు. మందులు వాడినా తగ్గలేదు. డాక్టరు దగ్గరకి వెళితే, స్కాన్ చేయాలి అన్నారు. స్కాన్ రిపోర్టులో ఏదో సమస్య ఉందని రావడంతో డాక్టరు, "ఇంకో టెస్టు చేయాలి. ఆ రిపోర్టు వస్తేగాని ఏమీ చెప్పలేం. రిపోర్టులో ఏదైనా రావచ్చు" అని అన్నారు. మాకు చాలా భయమేసి బాబాకి దణ్ణం పెట్టుకున్నాము. బాబా దయవలన రిపోర్టు మూమూలుగా వచ్చింది. డాక్టరు, "భయపడాల్సిన పని లేదు" అని చెప్పారు. "బాబా! మీకు కృతజ్ఞతలు తండ్రి. నేను ఈ బ్లాగులో నా అనుభవం పంచుకోవడం ఇదే మొదటిసారి. తప్పులుంటే క్షమించండి బాబా".


సాయిభక్తుల అనుభవమాలిక 1399వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. ఎటువంటి టెన్షన్లు అయినా ఇట్టె తీసేస్తారు బాబా
2. బాబా ఆశీస్సులు ఉంటే ఏదీ అసాధ్యం కాదు
3. కోరుకున్న దానికంటే మించి సహాయం చేసిన బాబా

ఎటువంటి టెన్షన్లు అయినా ఇట్టె తీసేస్తారు బాబా


సాయిబంధువులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేనొక సాయిభక్తురాలిని. నా పేరు హేమ. మేము విజయవాడలో ఉంటాము. నేను నా చిన్నప్పటినుండే బాబాను పూజిస్తూ ఉన్నాను. నా జీవితంలో ఏది జరిగినా అది సాయినాథుని కృపాకటాక్షాలే. నేను ఇంతకుముందు ఈ బ్లాగులో నా అనుభవాలు కొన్ని షేర్ చేసుకున్నాను. మళ్ళీ మరికొన్ని అనుభవాలను మీతో షేర్ చేసుకోవాలని మీ ముందుకు వచ్చాను. కొంతకాలం క్రితం మావారి మేనకోడలు గర్భవతిగా ఉన్నప్పుడు డాక్టర్లు తనకి 2022, జులై 13న డెలివరీ డేట్ ఇచ్చారు. సరిగ్గా ఆరోజు విశాఖ నక్షత్రం ఉంది. విశాఖ నక్షత్రంలో బిడ్డ పుడితే ఆ ప్రభావం వల్ల తల్లికి, మేనమామకి(అంటే, మావారికి) ప్రాణగండం ఉంటుంది. అంతకుముందు ఇలాంటి రెండు సంఘటనలు నేను మా ఇంట్లోనే చూసి ఉన్నందువల్ల చాలా టెన్షన్ పడ్డాను. ఎంతగా టెన్షన్ పడ్డానంటే, ఏ గుడికి వెళ్ళినా దీనిగురించే నా ప్రార్థన. ఈ విషయం గురించి పదేపదే ప్రార్థిస్తూ బాబాను కూడా చాలా విసిగించాననే చెప్పాలి. ఒకరోజు ఈ విషయం గురించి నాకు చాలా భయమేసింది. బాబా తన బిడ్డలకి ఎలాంటి కష్టమూ రానివ్వరని తెలుసుగానీ, మనసులో ఏదో భయం, టెన్షన్. నిజంగా ఆ సమయంలో నేను పడిన టెన్షన్ ఆ సాయినాథునికే తెలుసు. అప్పుడు నేను బాబాకు నమస్కరించుకుని, “బాబా, డాక్టర్లు ఇచ్చిన సమయానికన్నా ముందే మావారి మేనకోడలికి డెలివరీ అయ్యేలా చూడు స్వామీ. మావారికి ఎలాంటి సమస్యా రాకుండా ఉంటే నా అనుభవాన్ని బ్లాగులో సాటి సాయిబంధువులందరితో షేర్ చేసుకుంటాను. అలాగే, ‘సాయికోటి’ కూడా రాస్తాను” అని చెప్పుకున్నాను. దయగల నా సాయితండ్రి నన్ను చాలా బాగా కరుణించారు. బాబా దయవల్ల మావారికి ఎలాంటి సమస్యా రాకుండా తన మేనకోడలికి జులై 1వ తేదీనే డెలివరీ అయింది. బాబా నా టెన్షన్ మొత్తం ఒక్కసారిగా తీసేశారు. చాలా చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను. నా ఆనందాన్ని నేను మాటల్లో చెప్పలేను. అది ఆ సాయితండ్రికే తెలుసు. “చాలా చాలా థాంక్స్, థాంక్యూ సో మచ్ బాబా”. 


ఇంకొక అనుభవం: ఒకసారి మా అన్నయ్యకి ఉన్నట్టుండి వెన్నునొప్పి వచ్చింది. గుంటూరులోని ఒక డాక్టరుకి చూపిస్తే, “ఆపరేషన్ చెయ్యాలి, రెండు లక్షల వరకు ఖర్చవుతుంది. ఒక నెలరోజులు పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకోవాలి” అని చెప్పారు. “ఇక్కడ విజయవాడలో డాక్టరుకి చూపిద్దాం, ఇక్కడికి రా” అని నేను చెప్తే తను మా వద్దకు వచ్చాడు. అన్నయ్య డాక్టర్ వద్దకు వెళ్లేముందు నేను బాబాకు నమస్కరించుకుని, “బాబా, అన్నయ్యకి టెస్ట్ రిపోర్టులో ప్రాబ్లమ్ ఏమీ ఉండకూడదు. తన వెన్నునొప్పి టాబ్లెట్లతో తగ్గిపోతుందని డాక్టర్ చెప్పాలి. అలా జరిగితే నా అనుభవాన్ని బ్లాగులో సాటి సాటిబంధువులందరితో షేర్ చేసుకుంటాను” అని చెప్పుకున్నాను. బాబా మాపై అపారమైన దయ కురిపించారు. మా అన్నయ్యని పరీక్షించిన ఇక్కడి డాక్టర్, “ఆపరేషన్ అవసరం లేదు, మందులతో నయమవుతుంది” అని చెప్పి, కొన్ని మందులు రాసిచ్చారు. డాక్టర్ ఇచ్చిన మందులను మా అన్నయ్య రెండు మూడు నెలలు వాడారు. అంతే, బాబా దయవల్ల అన్నయ్యకి వెన్నునొప్పి పూర్తిగా తగ్గిపోయింది. అసలు నిలబడటానికే ఇబ్బందిపడేంత నొప్పితో బాధపడే అన్నయ్య ఇప్పుడు నొప్పి లేకుండా ఆనందంగా ఉన్నాడు. ఇది మన బాబా చేసిన అద్భుతంకాక ఇంకేమిటి? “చాలా చాలా థాంక్స్ బాబా. నా అనుభవాన్ని షేర్ చేసుకోవడం ఆలస్యమైనందుకు నన్ను క్షమించండి బాబా. మా పాప ఉద్యోగం విషయంలో ఎందుకో మీరు ఆలస్యం చేస్తున్నారు. మీరు అలా చేస్తున్నారంటే తనకి ఇంకా మంచి ఉద్యోగం ఇప్పిస్తారనే నేను అనుకుంటున్నాను బాబా. కారణం లేకుండా మీరు ఏదీ చెయ్యరు. అలాగే, మా తమ్ముడి ఆరోగ్యం కూడా బాగాలేదు బాబా. డాక్టర్లు తనకి ఆపరేషన్ చెయ్యాలని అంటున్నారు. ఆపరేషన్ లేకుండా తమ్ముడి ప్రాబ్లమ్ క్లియర్ అయ్యేలా చూడండి బాబా. లేకపోతే, తమ్ముడిని ఆపరేషన్‌కి ఒప్పించండి బాబా. బాబా, మీ కృపాకటాక్షాలు అందరిపైనా ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలనీ, నాకు, నా కుటుంబానికి ఎల్లప్పుడూ మీరు తోడునీడగా ఉండాలని కోరుకుంటున్నాను స్వామీ”.


ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!!!

అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!


బాబా ఆశీస్సులు ఉంటే ఏదీ అసాధ్యం కాదు


నా పేరు విజయ. మేము ఢిల్లీలో ఉంటాము. బాబా నాకు ప్రసాదించిన అనుభవాలను సాయి బంధువులందరితో పంచుకుంటున్నాను. నా కజిన్ సిస్టర్ కూతురికి 30 ఏళ్లు పైబడినా పెళ్లి కాలేదు. తగిన సంబంధం కోసం వెతుకుతున్నప్పటికీ అమ్మాయి కోరుకునే లక్షణాలు ఉండే సంబంధం దొరకక నా సోదరి నాతో చెప్పుకుని తన కుమార్తె వివాహం గురించి ఎప్పుడూ చింతిస్తూ ఉండేది. నేను ఆమెతో "ఖచ్చితంగా అమ్మాయికి మంచి అబ్బాయి దొరుకుతాడు. శ్రీసాయికి సంపూర్ణ శరణాగతి చెందండి" అని చెప్తూ ఉండేదాన్ని. ఇలా సమయం గడుస్తుండగా గత సంవత్సరం(2021) నవంబర్‌లో హాంకాంగ్‌లో ఉన్న నా బంధువు ఒకరు నాకు ఫోన్ చేసి, తన తోడికోడలు కొడుకు యుఎస్‍లో పనిచేస్తున్నడని, తనకి మంచి కుటుంబ నేపథ్యం ఉన్న తగిన అమ్మాయి కోసం వెతుకుతున్నారని చెప్పింది. నేను ఆమెతో నా కజిన్ సిస్టర్ కుమార్తె గురించి చెప్పి, ఆ అమ్మాయి వివరాలు పంపాను. ఆమె ఆ అబ్బాయి వివరాలు నాకు పంపింది. నేను వెంటనే వాటిని నా కజిన్‌ సిస్టర్‍కి పంపాను. ఆ వివరాలు ఇరు కుటుంబాలకు నచ్చాయి. జాతకాలు కూడా కలవడంతో మిగతా అన్ని విషయాలు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. బాబా ఆశీస్సులతో ఇప్పుడు ఆ సంబంధం నిశ్చయమై త్వరలోనే వాళ్ళ వివాహం జరగనుంది. "బాబా! మీ అనుగ్రహానికి ధన్యవాదాలు. ఎల్లప్పుడూ మాకు తోడుగా ఉండి ఇలాగే మమ్మల్ని అనుగ్రహించండి. మేము మా సర్వస్వం మీ పాదపద్మాలకు సమర్పిస్తున్నాము".


నా కజిన్ సిస్టర్ కుమార్తె డబ్బులు కట్టి యుఎస్‍లో రీసెర్చ్ సీటు సంపాదించింది. తన వీసా గురించి అందరం ఆందోళన చెందాం. ఎందుకంటే, కరోనా కారణంగా యుఎస్ ఎంబసీ ఎవరికీ వీసాలు జారీ చేయడం లేదు. ఆ అమ్మాయి వీసా ఇంటర్వ్యూ స్లాట్ కోసం చాలాకాలం ప్రయత్నిచింది. కానీ తన ప్రయత్నాలు ఫలించలేదు. ఇటువంటి స్థితిలో నేను మన జీవితాల్లో తక్షణమే అద్భుతం చేయగలిగేది బాబా ఒక్కరే కాబట్టి, ఆయనను ప్రార్థించాలనుకుని అలాగే చేశాను. బాబా ఆశీస్సులు ఉంటే ఏదీ అసాధ్యం కాదు. ఆయన అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ ఆగస్టులో ఆ అమ్మాయికి వీసా ఇంటర్వ్యూ స్లాట్ ఇచ్చి, ఎంబసీ వీసా జారీ చేసేలా అనుగ్రహించారు. ఇప్పుడు ఆమె పని చేస్తూ రీసెర్చ్ చేస్తోంది. బాబా ఆశీస్సులతో ఇది సాధ్యమైంది. "ధన్యవాదాలు బాబా. ఈ అనుభవాలను సాయి కుటుంబంతో చాలా ఆలస్యంగా పంచుకున్నందుకు క్షమించండి. నన్ను, నా కుటుంబానికి సంబంధించి ప్రతిదీ చూసుకుంటున్న మీకు ధన్యవాదాలు. దయచేసి నాకు మంచి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, మనశ్శాంతిని ప్రసాదించండి. ఆ అనుగ్రహాన్ని కూడా పంచుకుంటాను". 


సర్వేజన సుఖీనోభవంతు!!!

సర్వం శ్రీసాయినాథార్పణమస్తు!!!


కోరుకున్న దానికంటే మించి సహాయం చేసిన బాబా


ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి!!! నా పేరు శ్రేయ. నేను ఒక సాయి భక్తురాలిని. 2022, నవంబరు నెల చివరి వారంలో మా కాలేజీలో ల్యాబ్ పరీక్షలు జరిగాయి. నేను ఆ పరీక్షలు బాగా వ్రాస్తే, ఈ బ్లాగులో పంచుకుంటానని అనుకున్నాను. బాబా దయవల్ల నేను చదివిన ప్రశ్నలే రావడంతో అన్ని పరీక్షలు బాగా రాశాను. ఇకపోతే మేము మా కాలేజీలో టీచర్లని ఎన్నుకోవాలి. కొంతమంది టీచర్లు కఠినంగా పేపర్లు దిద్దుతారు, కొంతమంది సరళంగా దిద్దుతారు. నేను అన్ని సబ్జెక్టులకి సరళంగా పేపరు దిద్దే టీచర్లను ఎన్నుకోగలిగాను. అంతా సాయి కృప. ఆయన దయతో నేను బాగా చదివి మంచి మార్కులతో ఉత్తీర్ణురాలిని అవుతానని ఆశిస్తున్నాను. "ధన్యవాదాలు బాబా. నా మీద ఎల్లప్పుడూ మీ కృప ఇలాగే ఉండాలి తండ్రి".


అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు శ్రీసాయినాథ్ మహరాజ్ కీ జై!!!


సాయిభక్తుల అనుభవమాలిక 1398వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా చల్లని కృప
2. సమర్పించాలనుకున్న పట్టుపంచెను బాబా స్వీకరించిన వైనం

బాబా చల్లని కృప


ఓం శ్రీ సాయినాథాయ నమః!!! అందరికీ నమస్కారం. ఎంతో చక్కగా బ్లాగు నిర్వహిస్తున్న సాయికి ధన్యవాదాలు. మీపై బాబా చల్లని చూపు, ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని బాబాను ప్రార్థిస్తున్నాను. నేను రోజూ క్రమం తప్పకుండా ఈ బ్లాగులోని భక్తుల అనుభవాలు చదువుతాను. ఒకవేళ ఏ రోజైనా వీలుకాకపోతే మరుసటిరోజు ఒకేసారి రెండు రోజులవి చదువుతాను. అంతేగానీ బాబా లీలలు చదవకుండా ఉండను. నేనిప్పుడు బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలు పంచుకుంటాను. నేను నా వృత్తిరీత్యా రోజూ రానుపోను బస్సులో ప్రయాణిస్తుంటాను. ఆ కారణంగా సమయానికి తినకపోవడం వల్లనో లేక పని ఒత్తిడి, కుటుంబ సమస్యలు, పిల్లల టెన్షన్లు వంటి వాటి వల్లనో ఏమోగానీ నా దవడ నుండి చెస్ట్‌లో ఎడమవైపు వరకు నొప్పి వస్తుండేది, మంట కూడా ఉంటుండేది. ఒకరోజు బస్సులో కూర్చుని, "బాబా! చెస్ట్‌లో నొప్పికి చాలా భయమేస్తుంది. టెన్షన్స్ వల్ల, తిండి తినకపోవడం వల్ల కావచ్చు. కానీ ఇంత చిన్న వయసులో నాకేమైనా అయితే నా పిల్లల పరిస్థితి ఏంటి బాబా? నా జీవితంలో నేను సుఖపడింది ఏముంది బాబా? చిన్నప్పటినుండి అన్నీ కష్టాలే, బాధలే. ఎప్పుడూ నా విషయంలో అన్యాయమే జరుగుతుంది. ఎంత నిజాయితీగా పనిచేస్తున్నా కూడా ఫలితం ఉండట్లేదు. ప్లీజ్ బాబా, సాయంత్రంలోగా నొప్పి తగ్గిపోతే, మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని మనసులోనే బాబాకి మ్రొక్కుకున్నాను. బాబా దయవల్ల నాకు చాలా ఉపశమనం కలిగింది. ఆ తర్వాత చాలారోజుల వరకు నొప్పి రాలేదు. కానీ ఈమధ్య మళ్లీ కొంచెం నొప్పి మొదలైంది. హాస్పిటల్‌కి వెళ్లి డాక్టరు సలహామేరకు థైరాయిడ్, ఈసీజీ, షుగర్, బ్లడ్ మొదలైన అన్ని టెస్టులు చేయించుకుని, "రిపోర్టులన్నీ నార్మల్ రావాలి బాబా. అలా వస్తే మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి మ్రొక్కుకున్నాను. బాబా దయతో థైరాయిడ్, ఈసీజీ, బ్లడ్ రిపోర్టులు నార్మల్ వచ్చాయికానీ, షుగర్ బోర్డర్‌లో ఉందని వచ్చింది. డాక్టర్ నాతో, "షుగర్ లేదనిగానీ, ఉందనిగానీ చెప్పలేము. ఏదేమైనా షుగర్ లెవెల్స్ పెరిగాయి. కంట్రోల్లో ఉండండి" అని చెప్పారు. "ధన్యవాదాలు బాబా. మీకు మాటిచ్చినట్టు నా అనుభవాన్ని బ్లాగులో పంచుకున్నాను. కానీ షుగర్ విషయంలో భయమేస్తోంది. ఇంకో 3 నెలల తర్వాత మళ్లీ టెస్ట్ చేయించుకుంటాను. అప్పుడు 'షుగర్ అదుపులోనే ఉంది, షుగర్ లేద'ని రిపోర్టు రావాలి బాబా. ఇంత చిన్న వయసులోనే నాకు షుగర్ వస్తే నా పరిస్థితి ఏంటి బాబా? దయచేసి మీ ఈ బిడ్డను కాపాడు తండ్రీ. నాకు మీరు తప్ప ఎవరూ లేరు".


ఒకసారి నా మొబైల్లో ఫోటోలు చూస్తున్నప్పుడు కొన్ని ఫోటోలు కనిపించలేదు. ఎంత ప్రయత్నించినా అవి ఎక్కడ సేవ్ అయ్యాయో తెలియలేదు. పిల్లలు నా ఫోన్‌లో బాగా ఆడుతుంటారు. వాళ్ళే ఆ ఫోటోలు డిలీట్ చేసేసుంటారని చాలా ఆందోళన చెందాను. ఎందుకంటే, నా ఫోన్‌లోనే నావి, నా పిల్లలవి మంచి మంచి ఫొటోలున్నాయి. నా భర్త ఫోన్‌లో కొన్ని ఫోటోలు లేవు. అందుచేత 'ఇప్పుడెలా?' అని కన్నీళ్లు పెట్టుకున్నాను. వెంటనే, "బాబా! నేను నా ఫోన్ రీస్టార్ట్ చేస్తాను. నా ఫోటోలన్నీ గ్యాలరీలో కనిపించాలి. అలా అయితే మీ దయను బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి మ్రొక్కుకున్నాను. వెంటనే కనిపించకుండాపోయిన ఫొటోలు SD మెమరీ కార్డులో ఉన్నాయేమో అని ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన రాగానే ఫైల్ మేనేజర్ ఓపెన్ చేస్తే SD కార్డు స్టోరేజ్ కనిపించలేదు. అప్పుడు ఫోన్‌లో ఉన్న సిమ్ మరియు మెమరీ కార్డులు ఓపెన్ చేస్తే మెమరీ కార్డు సరిగా పెట్టిలేదు. దాన్ని సరిగా పెట్టి ఫోన్ ఆన్ చేస్తే ఫోటోలన్నీ వచ్చాయి. నేను అనుకున్నట్లు పిల్లలు ఆ ఫోటోలు డిలీట్ చేసి ఉంటే, ఇక అవి నాకు దక్కేవి కావు. కానీ బాబాని ప్రార్థించగానే నాకు ఆ ఆలోచననిచ్చి నన్ను ఆ టెన్షన్ నుండి బయటపడేశారు. "థాంక్యూ సో మచ్ బాబా".


2022, ఆగస్టు నెల సెలవుల్లో మేము హైదరాబాద్ వెళ్ళాలనుకున్నాము. అందుకోసం మావారు మమ్మల్ని తీసుకెళ్లడానికి హైదరాబాద్ నుండి కారులో నిజామాబాద్ వచ్చారు. ఆయన వచ్చేసరికి రాత్రి 8.30 అయింది. మేము తయారై తిరిగి బయలుదేరేసరికి 9.30 అయింది. ఆ రాత్రివేళ మొదటిసారి అంత దూరప్రయాణం, అదీకాక మావారు డ్రైవింగ్‌లో అంత పర్ఫెక్ట్ కాకపోవడం వల్ల చాలా భయమేసింది. అయినా బాబా మీద నమ్మకంతో 'సాయిరామ్' అనుకుంటూ కారులో 'శ్రీసాయి సచ్చరిత్ర' వింటూ మా ఇద్దరు చిన్నపిల్లలతో బయల్దేరాము. మధ్యలో నాకు బాగా నిద్ర వచ్చి కళ్ళు మూసుకుపోసాగాయి. 'డ్రైవింగ్ చేస్తున్న మావారితో మాట్లాడేవారు లేరు. నాలాగే తనకి కూడా నిద్ర వస్తే ఎలా?' అని భయపడ్డప్పటికీ, బాబా మీద భారమేసి, ఆయన దయతో మేము క్షేమంగా హైదరాబాద్ చేరుకుంటామన్న నమ్మకంతో పిల్లలిద్దరినీ నా ఒళ్ళో పడుకోబెట్టుకుని ప్రయాణం సాగించాను. బాబా దయవల్ల రాత్రి ఒంటిగంటకు మేము సురక్షితంగా హైదరాబాద్ చేరుకున్నాం. అలాగే తిరుగు ప్రయాణమప్పుడు కూడా రాత్రే బయలుదేరి మునుపటిలాగే సచ్చరిత్ర వింటూ ప్రయాణం సాగించి రాత్రి 12 గంటలకి నిజామాబాద్ చేరుకున్నాం. మాకెలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకుని మమ్మల్ని క్షేమంగా ఇంటికి చేర్చారు బాబా. "థాంక్యూ సో మచ్ బాబా".


2021, జూన్ నెల కరోనా సమయంలో నేను, "బాబా! నా పిల్లలకు 6 నెలల వరకు, అంటే డిసెంబర్ ముగిసేవరకు ఎలాంటి జ్వరం, జలుబు, దగ్గు రాకుండా, హాస్పిటల్లో చేరే అవసరం రాకుండా చూడు తండ్రీ. నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను వేడుకున్నాను. ఎందుకంటే, కరోనా రెండో వేవ్ చాలా ప్రమాదకరంగా ఉండింది. నా భర్త ఉద్యోగరీత్యా దూరంగా ఉంటారు. నా పిల్లలు నెలకోసారి హాస్పిటల్ పాలవుతుంటారు. అందుకే నేను నా పిల్లలకోసం మ్రొక్కుకున్నాను. బాబా దయవల్ల పిల్లలైతే హాస్పిటల్లో అడ్మిట్ కాలేదు కానీ, చాలాసార్లు అనారోగ్యం పాలయ్యారు. అర్థరాత్రివేళ బాబు జ్వరం, దగ్గుతో ఇబ్బందిపడుతుంటే నేను విలవిలలాడిపోయేదాన్ని. బాధతో బాబాకి మ్రొక్కుకుని, బాబుకి ఊదీ పెట్టి, కొద్దిగా ఊదీని నీళ్లలో కలిపి త్రాగించి, వెంటనే తగ్గిపోవాలని రాత్రంతా 'ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః' అని అనుకుంటూ ఉండేదాన్ని. బ్లాగులో సాటి భక్తుల అనుభవాలలో వాళ్ళు మొక్కుకోగానే బాబా వాళ్ళను ఎలా అనుగ్రహించారో చదివిన నేను నా చిన్నపిల్లల విషయంలో కూడా బాబా అలా అనుగ్రహిస్తారని చాలా నమ్మకంతో ఉండేదాన్ని. కానీ బాబా నా విషయంలో చాలా ఆలస్యంగా స్పందించేవారు. అందువల్ల నేను అనుకున్నది జరగలేదని, పిల్లలు అనారోగ్యం పాలయ్యారని, ఒక్క ఆరునెలల వరకు నా పిల్లలు అనారోగ్యం పాలుకాకుండా కాపాడలేరా అని హర్ట్ అయ్యాను. అందుకే ఇప్పటివరకు నా అనుభవాన్ని బ్లాగులో పంచుకోలేదు. "క్షమించు సాయీ. నా వల్ల ఏమైనా పొరపాటు జరిగితే నన్ను బాధపెట్టుగానీ చిన్న పిల్లల విషయంలో ఎందుకింత అలస్యం? నా చిన్నబాబు ఏం తప్పు చేశాడని తను ఆ బాధ అంతకాలం అనుభవించాలి? ఏదైనా పొరపాటు జరిగితే శిక్ష నేను అనుభవించాలిగానీ నా పిల్లలు కాదని నా ఉద్దేశ్యం. అంతే తప్ప మీమీద కోపం కాదు బాబా. బ్లాగులో ఒక్కొక్క భక్తుని అనుభవం చదువుతుంటే కళ్ళల్లోంచి నీళ్లు వస్తున్నాయి. మీరు అసాధ్యం అనుకున్న పనిని కూడా సాధ్యమయ్యేలా చేస్తున్నారు. మరి నా విషయంలో ఎందుకింత అలస్యం బాబా?"


సమర్పించాలనుకున్న పట్టుపంచెను బాబా స్వీకరించిన వైనం


సాయిబంధువులందరికీ నమస్కారం. నా పేరు శిరీష. నేను ఇదివరకు పంచుకున్న ఒక అనుభవంలో బాబాను, 'మీ దయతో కనపడకుండాపోయిన నా చీర దొరికితే, మీకు ఒక పట్టుపంచె సమర్పించుకుంటాను' అని మ్రొక్కుకున్నాననీ, అయన దయతో చీర దొరికిందనీ పంచుకున్నాను. ఇప్పుడు నేను సమర్పించాలనుకున్న పట్టుపంచెను బాబా ఎలా స్వీకరించి నన్ను ఆశీర్వదించారో మీతో పంచుకుంటాను. చీర దొరికినప్పటినుండి నేను, 'బాబాకు పట్టుపంచె ఎక్కడ, ఎలా సమర్పించాలి?' అని అప్పుడప్పుడు ఆలోచిస్తూ ఉండేదాన్ని. కానీ ఏ నిర్ణయానికి రాలేకపోయేదాన్ని. చివరికి, "మీరే నిర్ణయించండి బాబా" అని భారం ఆయన మీద వేసి నేను ఇంకేమీ ఆలోచించలేదు. వెంటనే నా భర్త, "పిల్లల్ని బయటకి తీసుకెళ్లి చాలా రోజులైంది కదా! వచ్చే ఆదివారం హైదరాబాద్ వెళ్దాం" అని అన్నారు. మరుక్షణం నాకు పంజాగుట్ట శ్రీసాయిబాబా మందిరం గుర్తుకు వచ్చింది. 2018లో మా నాన్నగారి సర్జరీ కోసం నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఆ గుడికి వెళ్లాను. అప్పుడు బాబా నన్ను ఎలా ఆశీర్వదించి, ఆనందింపజేశారో నేను ఇదివరకు మీతో పంచుకున్నాను. కానీ ఆ గుడికి వెళదామంటే మా పిల్లలు, నా భర్త ఒప్పుకుంటారో, లేదో అనుకున్నాను. ఎందుకంటే, వాళ్లు దేవుణ్ణి నమ్మరు. పైగా మేము ఉండే ఒక్కరోజులో వాళ్లు చాలా పనులు ప్లాన్ చేసుకున్నారు. అయినా నేను శనివారంనాడు బాబాకి పంచె, కండువా తెప్పించాను. వాటిని తెచ్చిన అబ్బాయి వాటికి సంబంధించిన బిల్లును నా భర్తకిచ్చాడు. ఆయనకి అవెందుకో తెలియకపోయినా బిల్లు చెల్లించి, "ఇవి ఎందుకు?" అని నన్ను అడిగారు. నేను విషయం చెప్పాను. ఆ రాత్రే మేము హైదరాబాదు వెళ్ళాము. అక్కడ డిన్నర్ చేస్తున్నప్పుడు నేను, "రేపు ఉదయం గుడికి వెళదామనుకుంటున్నాను. ఎవరైనా నాతో తోడుగా వస్తారా?" అని అన్నాను. వెంటనే నా భర్త, "నేను వస్తానులే. పిల్లలు ఆలస్యంగా నిద్రలేస్తారు కాబట్టి మనం తెల్లవారే వెళ్ళొద్దాము" అని అన్నారు. పిల్లలు కూడా, "మేము రాము" అన్నారు. అయితే మేమున్న హోటల్ నుండి పంజాగుట్ట బాబా గుడికి ఎలా వెళ్లాలో మాకు దారి తెలియదు. డ్రైవరుకి కూడా హైదరాబాదు క్రొత్త. బాబా ఆ సమస్యను ఎలా పరిష్కరించి మమ్మల్ని తమ దరికి ఎలా చేర్చుకున్నారో చూడండి. మేము మరుసటిరోజు(దీపావళి ముందురోజు) ఉదయం తయారై గూగుల్ మ్యాప్‍లో చూసుకుంటూ వెళ్ళాము. దాదాపు గుడి ఉన్న ప్రాంతంలోకి వెళ్ళాక మావారు, "ఇక్కడ చాలా సాయిబాబా టెంపుల్స్ ఉన్నాయని మ్యాప్ చూపిస్తోంది. నువ్వు వెళ్ళాలనుకునే బాబా టెంపుల్ ఏదో తెలియదు కదా! ఏదో ఒక గుడికి వెళదాం" అన్నారు. నేను సరే అన్నాను. అంతలో బాబా విగ్రహం, బాబా ఫోటో ఉన్న ఒక వాహనం(ప్రచార రథం అనుకుంటా) కనిపించింది. బాబా తమ దగ్గరకి నన్ను ఇలా ఆహ్వానిస్తున్నారనిపించి చాలా సంతోషమేసింది. మరుక్షణంలో మా డ్రైవర్ పక్క సందులోకి కారు తిప్పి నేను వెళ్లాలనుకున్న బాబా గుడి దగ్గరే ఆపాడు. నాకు చాలా చాలా సంతోషంగా అనిపించింది. కొబ్బరికాయ తీసుకుందామని షాపుకు వెళ్తే, అక్కడ గులాబీమాల అందంగా కనిపించింది. దాన్ని బాబాకి అలంకరిస్తే బాగుంటుందని అది కూడా తీసుకున్నాను. గుడి లోపలికి వెళ్ళాక బాబాను దర్శించుకుని నేను తీసుకెళ్లిన పంచె, కండువా పూజారిగారికి ఇచ్చాను. అప్పటికే బాబాకి వస్త్రాలంకరణ పూర్తయినందున పూజారిగారు, "రేపు అలంకరిస్తాము" అన్నారు. నేను, "మాది వేరే ఊరండీ. మేము మళ్ళీ రేపు రాలేమండీ" అని అన్నాను. అప్పుడు ఆ పూజారి, "కొబ్బరికాయ కొట్టి, తీసుకునిరండి" అని అన్నారు. నేను సరేనని వెళ్లొచ్చేసరికి ఇంకో పూజారి నేను ఇచ్చిన పంచె, కండువా బాబా మెడలో వేశారు. 'పూర్తిగా బాబాకి అలంకరిస్తే బాగుండేది' అని నాకనిపించింది. కానీ, ఇదివరకే బాబాని అలంకరించారు కదా అనుకున్నాను. ఇంతలో పెద్ద పూజారిగారు లేచి పంచెను తీసి బాబాకి పూర్తిగా అలంకరించి నా చేత గులాబీమాల బాబాకు వేయించారు. నాకు అమితానందంగా అనిపించింది. అది అనుభవించేవాళ్ళకి అర్థమవుతుంది అనుకుంటున్నాను. అలా నేను మ్రొక్కుకున్న పంచె‌, కండువాలను చాలా అందంగా ఒక లీలలా స్వీకరించి, బదులుగా నాకు చాలా ఆనందాన్నిచ్చారు బాబా. "థాంక్యూ బాబా". ఆరోజు నేను సమర్పించిన పంచె, కండువాల అలంకరణలో ఉన్న బాబా ఫోటోను కింద జతపరుస్తున్నాను. మీరు కూడా బాబాను దర్శించి ఆనందించండి. అనుభవం చాలా చిన్నగా వ్రాద్దామనుకున్నాను. కానీ, బాబా చాలా పెద్దగా వ్రాయించినట్లున్నారు. ఓపికగా చదివి బాబా ప్రేమలో మీరు కూడా తడిసినందుకు ధన్యవాదాలు.


సాయిభక్తుల అనుభవమాలిక 1397వ భాగం....


ఈ భాగంలో అనుభవం:
  • అంతులేని శ్రీసాయి అనురాగం - మూడవ భాగం

నిన్నటి తరువాయి భాగం..


శ్రీమతి రమాదేవిగారు మరికొన్ని అనుభవాలను ఇలా పంచుకుంటున్నారు.


అప్పటివరకు తన లీలల ద్వారా తనపైన నాకున్న నమ్మకాన్ని పెంచుతూ వచ్చిన బాబా నా నమ్మకాన్ని పరీక్షించడానికి అన్నట్లు నాకు ఒక సమస్యని ఇచ్చారు. నేను 2009 అమెరికాలో ఉన్నప్పుడు నా మూత్రం ఎందుకో తెల్లగా చిక్కని మజ్జిగలాగా వచ్చేది. అసలే పిల్లలు బాధలో ఉన్నారు, ఈ విషయం చెప్పి ఇంకా వాళ్ళ మనసులను కలతపెట్టడం ఇష్టంలేక వాళ్ళతో నేనేమీ చెప్పలేదు. మా వియ్యంకులు అమెరికా వచ్చాక నేను సెప్టెంబరులో ఇండియాకి వచ్చేశాను. ఇంటికి వచ్చాక మావారితో విషయం చెప్పాను. ఈ సమస్యకి అసలు కారణం ఏమిటో తెలుసుకుందామని మావారు డాక్టరుతో మాట్లాడారు. డాక్టర్ మావారికి కారణం చెప్పి, కొన్ని మందులు సూచించి, “ఇవి వాడి చూడండి. వీటితో నయం కాకపోతే చిన్న ఆపరేషన్ లాంటిది చేద్దాము” అన్నారు. ఒకసారి మావారికి విషయం చెప్పి, ఆయన డాక్టరుతో మాట్లాడి మందులు తీసుకొచ్చాక నేను వాడకపోతే తను బాధపడతారని నేను ఆ మందులు వేసుకున్నాను. మందులు వేసుకున్నప్పుడు మూత్రంలోని చిక్కదనం కొద్దిగా తగ్గినా, మందులు మానేశాక మళ్ళీ సమస్య మామూలే. దాంతో నేనే మావారితో, “ఫరవాలేదులెండి, కొద్దిరోజులు చూద్దాము. సమస్య తగ్గకపోతే చెప్తానులెండి” అన్నాను. కానీ, సమస్య అలాగే ఉందన్న విషయం ఆయనకు చెప్పలేదు. నా సమస్య నివారణ కోసం బాబా ఊదీనే వాడుతూ వచ్చాను. కానీ నాలో నేనే భయపడుతూ ఉండేదాన్ని. సబూరి అనేది సంతోషంతో కూడిన ఓర్పు కదా! అదే కదా విశ్వాసం అంటే. అందుకని అలాగే రోజలు గడుపుతూ ఉండేదాన్ని. కానీ నన్ను బాబా రెండు సంవత్సరాలు ఆ సమస్యతో ఉంచారు. ఒకవైపు భయపడుతూనే ఉన్నప్పటికీ బాబాపై భారం వేసి మందులు వేసుకోనందుకేమో, నా విశ్వాసంలో పరిపూర్ణత లేకపోయినా వేరే పెద్ద సమస్యకు దారితీయకుండా కరుణ చూపించి, రెండు సంవత్సరాల తరువాత నా ఆరోగ్యాన్ని కుదుటపరిచారు బాబా. మూత్రంలోని చిక్కదనం తగ్గి నార్మల్ అయింది.


2011 తర్వాత నాకు చాలా డెంటల్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. నొప్పి ఉన్నప్పటికీ, బాబా ఊదీపై నమ్మకం ఉంటే డెంటిస్ట్ దగ్గరకు వెళ్ళకపోయినా తప్పకుండా ఆ నొప్పి కూడా తగ్గిపోయివుండేదేమో! కానీ, బాబా నాకు చక్కటి అనుభవాలు ఎన్నో ఇచ్చినా, ఆయన నాకు పెట్టిన పరీక్షలో ఓడిపోయాను. నేను డెంటిస్ట్‌ను సంప్రదించాను. ‘రూట్ కెనాల్ తప్పనిసరిగా చేయాలి, లేకపోతే ఇన్ఫెక్షన్ వస్తుందని’ గట్టిగా చెప్పారు డాక్టర్. మందులు వాడటం కూడా తప్పనిసరి అయింది. ఇంకోసారి రాత్రిపూట విపరీతమైన కడుపునొప్పితో పాటు ఆగకుండా నీళ్ళవిరేచనాలు అవ్వసాగాయి. మావారు నా బాధ చూడలేక, “మందులు వేసుకో, లేకపోతే రేపు సెలైన్ ఎక్కించాల్సి వుంటుంది” అన్నారు. అప్పుడు కూడా తన మాట విని మందులు వేసుకున్నాను. ఇలా నా విషయానికి వచ్చేసరికి బాబాపై నమ్మకంలో జారిపోతూ వచ్చాను. మనస్సంతా ఎంతో వెలితిగా అనిపించేది.


అన్నింటికంటే పెద్ద పరీక్ష ఇప్పుడే మొదలైంది. 2009లో నాకు వచ్చిన మూత్రసమస్య గురించి నేను భయపడ్డప్పటికీ, మందులు వేసుకోకుండా ఉన్నందుకు ఆ మూత్రసమస్యను తగ్గించారో, ఇప్పుడు అవసరం వచ్చినప్పుడల్లా మందులు వేసుకుంటున్నాను కాబట్టి మళ్ళీ పరీక్ష పెట్టారో తెలియదుగానీ 2022, మే నెలలో మూత్రసమస్య మళ్ళీ మొదలైంది. అయితే, ఈసారి మజ్జిగలాగా తెల్లగా కాదు, ఎర్రగా! అంటే రక్తం తప్ప మూత్రంలో ఇంకేమీ లేదు. అది కూడా గడ్డలు గడ్డలుగా. కానీ ఈసారి ఈ సమస్య గురించి నేను ఎవ్వరికీ చెప్పలేదు, మావారికి కూడా. బాబాపై భారం వెయ్యాలనిపించింది. జూన్ నెలలో బెంగళూరులో ఉన్న మా పిల్లల దగ్గరికి వెళ్ళాల్సి వచ్చి వెళ్ళాను. జూన్ నెలంతా కూడా ఆ సమస్య అలాగే ఉంది. నా శరీరబరువు బాగా తగ్గసాగింది. ఈసారి ఎందుకో నాకు భయం చాలా ఎక్కువగా ఉండేది. ఆ కారణంగా బాబా ఊదీ అసాధ్యాలను సుసాధ్యాలుగానూ, మృతజీవులను కూడా సజీవులుగానూ చేయగల మహిమాన్వితమైనదన్న సత్యం నాకు తెలుసున్నప్పటికీ ఆ సత్యానికి ప్రయోజనం లేకపోయింది. నమ్మకం-అపనమ్మకాల మధ్య, సహనం-అసహనాల (శ్రద్ధ, సబూరీల) మధ్య మనస్సు ఊగిసలాడటం మొదలుపెట్టింది. అప్పుడు నాకు అర్థమైంది ఒక్కటే – 'బాబాపై పూర్తిగా ఆధారపడి ఆయనకు పగ్గాలు అప్పగించాలంటే (అంటే, ఆయనకి పరిపూర్ణ శరణాగతి చేసుకోవాలంటే) ఎంతో సాధన కావాలి, ఎన్నో జన్మల పుణ్యఫలం కావాలి. అటువంటివారు ధన్యజీవులు, పుణ్యాత్ములు. అవి నాలో లేవు' అని. కానీ, సాయి దయామయుడు కదా! నా ఆర్తిని ఆయనకి కాక ఇంకెవరికి విన్నవించుకోనని ఒక లేఖ ద్వారా నా బాధను విన్నవించుకున్నాను. బాబా నా బాధను అర్థం చేసుకున్నారు. మా సాయిబంధువు ద్వారానే నా సమస్యకు సమాధానం పంపించారు, “అమ్మా! ఈ సృష్టి అంతా బాబా రచనే కదా? అటువంటప్పుడు ఊదీలో ఉన్నా, మందులలో ఉన్నా అంతా ఆయన కరుణయే!” అని. నిజమే, బాబా సంకల్పం లేకుండా, కరుణ లేకుండా ఏదీ జరగదు. ఈ సమాధానం నాకు ఎంతో సాంత్వన ఇచ్చింది. నా భర్తకి విషయం చెప్పాను. మూత్రం చూసి ఆయన చాలా ఆందోళన చెందారు. వెంటనే డాక్టరుతో మాట్లాడారు. డాక్టర్ చెప్పిన మొదటి విషయం – ‘ముందు క్యాన్సర్‌కి సంబంధించిన టెస్టులు చేయించండి’ అని. నాకు తెలుసు, ఆరోజు రాత్రి మావారు నిద్రపోలేదని. కానీ మా అమ్మాయి వాళ్ళ నాన్నకి బాగా ధైర్యం చెప్పింది. మా పెద్దబ్బాయి కుటుంబం బెంగళూరులోనే ఉన్నా, అబ్బాయి ఎక్కువగా ఆఫీసు పనులతో ముంబాయిలోనే ఉంటాడు. తను మా దగ్గరకు వస్తానంటే, ‘అవసరమైతే చెప్తాములే’ అన్నాము. ఇంక మా అమ్మాయి తన కారుని, డ్రైవరుని మాకే ఇచ్చింది. తను ఆఫీసులో ‘వర్క్ ఫ్రం హోమ్‌’కి పర్మిషన్ తీసుకుంది.  మరుసటిరోజు హాస్పిటల్‌కి టెస్టుల కోసమని వెళ్ళాము. మా అమ్మాయి, మా కోడలు ఇద్దరూ మాతో వచ్చారు. హాస్పిటల్‌కి వెళుతుంటే దారిలో ఎదురుగా వ్యాన్ పైన బాబా నవ్వుతూ కనిపించారు. బాబాను చూడగానే, ‘నాతో ఉన్నావు కదూ బాబా’ అనుకున్నాను. ఆ రోజంతా అన్ని టెస్టులూ చేశారు. బాబా ఉన్నారు కదా! రిపోర్టులు చూసిన డాక్టర్లు, ‘క్యాన్సర్‌కి సంబంధించినవేవీ లేవ’న్నారు. కానీ అక్కడితో సమస్య తీరలేదు. “మూత్రసంచి (బ్లాడర్) పూర్తిగా రక్తంతో నిండివుంది. రేపు చిన్న ఆపరేషన్ (సిస్టోస్కోపీ) చేసి, అది క్లియర్ చేసి బయాప్సీకి పంపిద్దాము, అప్పుడుగానీ సమస్యేమిటో మనకు స్పష్టంగా తెలీదు” అన్నారు. అంటే, మళ్ళీ ఇంకొక పరీక్ష. మా అమ్మాయి, మా కోడలు మావారిని ఒంటరిగా వదిలిపెట్టలేదు. మరుసటిరోజు జూలై 13, గురుపూర్ణిమ. బాబా ఆరోజు కోసమే అలా ప్లాన్ చేశారేమో! ఆరోజు సిస్టోస్కోపీ కోసం మళ్ళీ హాస్పిటల్‌కి వెళుతుంటే, ‘నేనున్నాను’ అని ఆటోపై బాబా దర్శనమిచ్చారు. “చాలు బాబా, ఇంత దయ చాలు తండ్రీ!” అని అనుకున్నాను. ఆరోజు ఆపరేషన్ పూర్తయ్యాక డాక్టరు మావారితో, “బయాప్సీ అవసరం లేదు, భయపడాల్సింది ఏమీ లేదు” అన్నారు. ఇక మావారి హృదయం పూర్తిగా తేలికపడింది. ఇంతటితో సమస్య పూర్తిగా పోలేదు. “రక్తం మూత్రసంచిలోకి ఎలా, ఎక్కణ్ణించి వస్తోందో తెలియటంలేదు. కాబట్టి ఇంకో ఆపరేషన్ ద్వారా మూత్రనాళాల నుండి కిడ్నీ వరకు ట్యూబులు పెట్టి 3 రోజుల పాటు ప్రతిరోజూ ఇన్ఫెక్షన్ తగ్గటానికి ఇంజెక్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంద”ని అన్నారు. ఈసారి ఆపరేషన్‌కి నాకు అస్సలు ధైర్యం లేదు. ఎందుకంటే, ఈసారి రెండు ట్యూబులు అమర్చుతారు. ఒకటి మూత్రం బయటికి రావడానికి, రెండోది ఇంజెక్షన్ ఇవ్వడానికి. ‘చాలా (painful procedure) బాధగా ఉంటుంది’ అని వాళ్లే చెప్పారు. నేను ఒప్పుకోలేదు. కానీ నా భర్త, పిల్లలు, డాక్టర్ అందరూ ‘సమస్యను ఎప్పటికైనా పూర్తిగా నివారించాలి’ అని వివరించి నాకు ధైర్యం చెప్పారు. సరే, ఇక ఒప్పుకోక తప్పలేదు. మొదటి ఆపరేషన్ జూలై 13 గురుపూర్ణిమ బుధవారంనాడు అయితే రెండవ ఆపరేషన్ 14వ తేదీ గురువారంనాడు అయింది. చిత్రంగా ఆ 3, 4 రోజులు బాబా నాకు తోడుగా ఉన్నారనిపించింది. ఎందుకో తెలుసా? ఎంతో బాధగా ఉంటుందని భయపడ్డాను కదా! బాబా కేవలం నేను ఓర్చుకునే నొప్పినే నాకు ఇచ్చారు. అంతగా బాధ తెలియలేదు. హాస్పిటల్లో ఉన్నన్ని రోజులూ పగలంతా మా అమ్మాయి మాతోనే ఉంటూ అక్కడే ఆఫీస్ పని చేసుకునేది. రాత్రిపూట మా కోడలు మాకు తోడుగా ఉండేది. మా అబ్బాయిలిద్దరూ ఉదయం, సాయంకాలం ఫోన్లు చేస్తూ మాకు ధైర్యం చెబుతుండేవారు. ఇక మా అల్లుడు నాకు ఇంకో కొడుకు. ఆ అబ్బాయి సహకార సహాయాలే కదా మా అమ్మాయికి ముఖ్యం. వీళ్లందరూ బాబా నాకిచ్చిన వరాలు. ఇకపోతే, ఇంటికి వచ్చాక వారంరోజుల్లోనే నేను కోలుకున్నాను. నా సమస్య తీరింది. ఇప్పుడు నా సాయితండ్రి కృపవల్ల నా ఆరోగ్యం కుదుటపడింది. అయితే అంత జరిగినా నా మనస్సులో ఒక వెలితి మాత్రం అలాగే ఉంది, 'ఎన్నెన్నో అమూల్యమైన అనుభవాలు(వ్రాయనివి ఎన్నో) నా సాయితండ్రి నాకు ప్రసాదించినా, ఆయన కోరిన దక్షిణను ఆయనకు ఇవ్వలేకపోయాన'ని. అందుకే బాబానే ప్రార్థిస్తూ యాచిస్తున్నాను – ‘ఎప్పటికైనా, ఏ జన్మకైనా పరిపూర్ణ శరణాగతి చేసే భాగ్యాన్ని, ఆయన కోసం తపించే ప్రేమని, ఆయన కోరిన దక్షిణను సమర్పించుకునే యోగ్యతని నాకు ప్రసాదించమ’ని. “ఇక నీ చిత్తం – నా భాగ్యం స్వామీ!”.


నా మూత్రం సమస్య, ఆపరేషన్ గురించి, బాబా కరుణల గురించి మీకు వివరంగా చెప్పాను కదా. ఆదే సమయంలో మా అమ్మాయి తన గర్భసంచి ఆపరేషన్ గురించి ఆలోచిస్తుండేది. అప్పటికే సంవత్సరం నుంచి తను గర్భసంచికి సంబంధించిన సమస్యతో కష్టపడుతోంది. ఎలాగో మందులతోనే కాలం గడుపుతోంది. కానీ ఈసారి ఆపరేషన్ తప్పనిసరి అన్నారు డాక్టర్లు. అసలు మేము బెంగళూరు రావటానికి గల ముఖ్య కారణం కూడా తనే. అయితే అంతలోనే నా మూత్ర సమస్యతో అందరూ చాలా కంగారుపడ్డారు. “ముందు నీ సమస్య తీరనీ అమ్మా. ఇన్ని రోజులు ఆగినదాన్ని, ఇంకొక 2 వారాలు ఆగలేనా?” అన్నది మా అమ్మాయి. తనది గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్. తనకి బాగా రెస్ట్ కావాలి. కానీ తనకి ఆఫీస్ పనులు చాలా ఉంటాయి. ఎక్కువ సెలవులు తీసుకోవడానికి కూడా ఉండదు. “ఇటువంటి పరిస్థితుల్లో దానికి నేనేం చెయ్యగలను సాయీ?” అని చాలా బాధపడుతూ ఉండేదాన్ని. బాబా దయవల్ల ఒక వారంరోజుల్లోనే నేను కోలుకున్నాను. తరువాత వారంరోజులకు మా అమ్మాయి ఆపరేషన్ అనుకున్నాము. నేను కోలుకున్న వెంటనే మా అమ్మాయి ఆపరేషనుకు ముందే బాబా గుడికి వెళ్లి, నాకు తోడుగా ఉండి, ఆపరేషన్ విజయవంతంగా జరిపించి, నన్ను త్వరగా కోలుకునేలా చేసినందుకు సంతోషంగా బాబాకు కృతజ్ఞతలు చెప్పుకున్నాను. ఆ తర్వాత, “అమ్మాయికి కూడా తోడుగా ఉంటావు కదా బాబా?” అని బాబాను అడిగాను. “ఉంటాను” అనడానికి బాబా ఎంత చక్కని నిదర్శనం ఇచ్చారో చూడండి! అన్నదానానికి డబ్బులు కట్టాలని గుడి ఆఫీసుకి వెళ్ళాను. డబ్బులు కట్టిన తరువాత అక్కడున్న కార్యదర్శి రశీదుతో పాటు బాబా క్యాలెండరు నా చేతికి ఇచ్చారు. పెద్ద క్యాలండరు, ఒక్కొక్క నెలలో ఒక్కొక్క బాబా ఫోటో. బాబాను చూడగానే కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. మా అమ్మాయి ఇంట్లో పూజలో బాబా విగ్రహం ఉంది, కానీ బాబా ఫోటోలు లేవు. ‘ఒక్కటైనా బాబా ఫోటో ఉంటే బాగుండేది’ అని నాకు అనిపించేది. ఇలా ఆ కొరత తీరింది. అంతేకాదు, బాబా నాతోపాటు ఇంటికి వచ్చి తోడుగా ఉంటానని ధైర్యం ఇచ్చారు. ఇక ఆపరేషన్ టైంలో మా అమ్మాయికి తోడుగా ఉన్నారని బాబా నాకు ఎలా చెప్పారో చూడండి...


ఆపరేషన్ రోజు నేను ఇంట్లో పూజ చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటున్నాను. మావారు, అల్లుడు హాస్పిటల్లో ఉన్నారు. ‘8 గంటలకు అమ్మాయిని ఆపరేషన్ కోసం ఆపరేషన్ థియేటర్‌కి తీసుకెళ్ళారనీ, రెండు గంటల్లో ఆపరేషన్ అయిపోతుంద’నీ వాళ్ళు నాకు ఫోన్ చేశారు. కానీ సమయం 11 గంటలవుతున్నా వాళ్ళనించి నాకు ఫోన్ రాలేదు. దాంతో నేనే వాళ్ళకు ఫోన్ చేస్తే, “ఇంకా అమ్మాయి ఆపరేషన్ థియేటర్ నుంచి బయటికి రాలేదు. డాక్టర్లు కూడా ఎవ్వరూ బయటికి రాలేదు. మాకు కూడా కంగారుగానే ఉంది” అన్నారు. అరగంట తర్వాత ఫోన్ చేసి, “ఆపరేషన్ అయిపోయింది. అమ్మాయి అబ్జర్వేషన్ రూములో ఉంది, బాగానే ఉంది” అని చెప్పారు. ఆ సాయంకాలం నేను హాస్పిటల్‌కి వెళ్తే తెలిసింది, ఆపరేషన్ చేసేటప్పుడు కొన్ని కాంప్లికేషన్స్ వచ్చినందువల్ల ఆపరేషన్ కష్టం అయిందని. ఆ సమయంలో మా అమ్మాయిని బాబా కాకపోతే ఎవరు కాపాడివుంటారు చెప్పండి? 4 రోజుల తర్వాత అమ్మాయిని ఇంటికి పంపించారు. నాకంటే తన భర్తే తనని చాలా బాగా చూసుకున్నారు. అంతటి మంచి భర్తని మా అమ్మాయికి ప్రసాదించినందుకు బాబాకి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. మా అమ్మాయి త్వరలోనే బాబా దయవల్ల కోలుకుంది. ఇంటిపనులు, ఆఫీసు పనులు అన్నీ మామూలుగా చేసుకుంటోంది. “సాయీ! ఎప్పటికీ ఇలాగే మాకు తోడునీడగా ఉంటూ మమ్మల్ని నీ దయామయ దృష్టితో చల్లగా కాపాడు తండ్రీ!”.


ఇటీవల జరిగిన మరో చిన్న అనుభవాన్ని ఇప్పుడు మీతో పంచుకుంటాను. అనుభవం సామాన్యమైనదే అయినా కేవలం నా తలపును, నా నమ్మకాన్ని బాబా ఎలా కాపాడిందీ పంచుకుంటాను. ఇది 2022, డిసెంబర్ నెలలో జరిగింది. నేను ఒక మండలం రోజులు సాయినాథుని చాలీసాను రోజుకు 108 సార్లు పఠించాలని సంకల్పించుకున్నాను. తప్పు, ఆ తండ్రే నాకు ఆ సంకల్పం ఇచ్చారు. దాన్ని నేను డిసెంబరులో మొదలుపెట్టాను. నేను రోజూ తెల్లవారక ముందే నిద్రలేచి, స్నానం చేసి పూజ చేసుకుంటాను. అలాగే ఒకరోజు స్నానం చేసేటప్పుడు ముఖం రుద్దుకుంటుంటే నా ఎడమచెవి ఖాళీగా ఉన్నట్లు గమనించాను. అంటే, చెవికి ఉండాల్సిన కమ్మ, మాటీ (చెవి రంధ్రం జారిందని మాటీ పెట్టుకుంటాను), మర ఏవీ లేవు. ఒక్కక్షణం నాకేమీ తోచలేదు. బాత్రూం అంతా చూశానుగానీ, ఏవీ కనిపించలేదు. 'సరే, నిద్రలో పక్కమీద పడివుంటాయేమో' అనుకొని స్నానం చేసి బయటకు వస్తూనే ముందు పక్కమీద చూశాను. బాబా దయవల్ల కమ్మ అయితే కనిపించిందిగానీ మిగిలినవి కనిపించలేదు. సరే, ముందు పూజ ముగించుకొద్దామని వెళ్లి పూజ చేసుకున్నాను. ఈలోపల తెల్లవారింది. మావారు నిద్రలేస్తే విషయం చెప్పి, 'ఒకసారి పక్క బాగా విదిలించి చూడమ'ని అన్నాను. అయన అలాగే చేశారు. కానీ, అవి కనిపించలేదు. నేను బాత్రూంలోకి వెళ్లి విప్పిన చీర బాగా విదిలించి చూశాను. కానీ ప్రయోజనం కనిపించలేదు. అప్పుడు ఇలా అనుకున్నాను: “బాబా! 'బంగారం, ఫైల్స్ ఏవైనా కనిపించకపోతే నీ బ్లాగులో పంచుకుంటామనుకోగానే అవి దొరికాయ'ని బ్లాగులో భక్తుల అనుభవాలలో చదివాను. వెంకటేశ్వరస్వామిని ఆపదమొక్కులవాడనీ, ఆయనకు మొక్కుకుంటే ఏ ఆపద నుంచి అయినా గట్టెక్కిస్తారనీ అంటారు. కానీ, నీకు పెద్ద పెద్ద మొక్కులేవీ అవసరం లేదు తండ్రీ. కేవలం ‘బ్లాగులో పంచుకుంటే చాల’ని భక్తుల అనుభవాలు చెప్తున్నాయి. నాకూ మాటీ, మర దొరికితే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను సాయీ” అని. అలా అనుకుని మరోసారి బాత్రూంలోకి వెళ్లాను. అదివరకు ఎన్నిసార్లు, ఎంత జాగ్రత్తగా చూసినా కనిపించని మాటీ అక్కడే ఒక మూలన గోడకు ఆనుకొని కనిపించింది. ఆశ్చర్యంతో ‘ఇక మర మిగిలింది’ అని అనుకున్నాను. మా పనమ్మాయి వస్తే విషయం చెప్పి, "కొంచెం జాగ్రత్తగా చిమ్ము. మర చిన్నది కదా! కనిపిస్తుందేమో చూడు" అని అన్నాను. తను జాగ్రత్తగా చిమ్మి, "నాకు కనిపించలేదమ్మా" అని అంది. మావారు, "ఇంక ఆ విషయం మర్చిపో! మరే కదా, కొత్తది కొందాం" అన్నారు. అప్పుడు నా మనసులో ఎందుకో ఒక తలపు వచ్చింది, 'మర చిన్నది కదా! అది కనిపిస్తే మటుకు అది నీ అద్భుతమే సాయీ' అని. మరి అలా అనుకుంటే సాయి అద్భుతం చూపించకుండా ఉంటారా? బాత్రూంలో చీర ఉతికి, చీపురుతో బాత్రూం కడుగుతుంటే తలుపు వేసే చోట మూల నుండి మర బయటికి వచ్చింది. ఆనందంతో నా కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. మర దొరికినందుకు కాదు, బాబా చూపిన అద్భుతానికి. "ధన్యవాదాలు బాబా. నీవు నీ పిల్లల మీద చూపించే కృప మాటలకు అందనిది తండ్రీ. ఈ అనుభవాన్ని పంచుకునే క్రమంలో ఏమైనా తప్పులుంటే క్షమించు సాయీ. నీ దయ, క్షమ, ప్రేమ మాకు జీవనాధారం ప్రభూ". చివరిగా, ఈ బ్లాగుననుసరించే సాయిబంధువులకు, బ్లాగును నిర్వహిస్తున్న సాయికి, సాయి బృందానికి సాయితండ్రి సంపూర్ణ కరుణాకటాక్షాలు ఉండాలని కోరుకుంటూ... 


సాయి పాదదాసి.

  ముందు భాగం కోసం బాబా పాదుకలు తాకండి. 


సాయిభక్తుల అనుభవమాలిక 1396వ భాగం....


ఈ భాగంలో అనుభవం:

  • అంతులేని శ్రీసాయి అనురాగం - రెండవ  భాగం
  • 'సాయి మహరాజ్ బ్లెస్సింగ్స్' వాట్సాప్ గ్రూపు ఏర్పాటు విషయంలో బాబా అనుగ్రహం 

నిన్నటి తరువాయి భాగం..


శ్రీమతి రమాదేవిగారు మరికొన్ని అనుభవాలను ఇలా పంచుకుంటున్నారు.


ఇంతవరకు మా అబ్బాయిల్ని బాబా ఎలా కాపాడారో చెప్పాను. ఇప్పుడు మా అమ్మాయి విషయంలో బాబా ఎంత పరీక్ష పెట్టారో చెప్తాను. మా అమ్మాయి ‘లా’ చదివేరోజుల్లో తనతోపాటు ‘లా’ చదివే అబ్బాయిని ఇష్టపడింది. ఆ అబ్బాయి కూడా మా అమ్మాయి పట్ల అంతే ఇష్టంగా ఉండేవాడు. ఆ అబ్బాయి ఉత్తర భారతదేశానికి (నార్త్ ఇండియాకి) చెందినవాడు. వాళ్ళ కుటుంబమంతా నిష్ఠాచారపరులు. ఆ అబ్బాయికి ఇద్దరు అన్నయ్యలు, ఒక అక్కయ్య ఉన్నారు. అందరూ వాళ్ళ బంధువుల్లోనే వివాహం చేసుకున్నారు. అక్కయ్య పెళ్ళిచేసుకుని అమెరికా వెళ్ళిపోయింది. అబ్బాయి తండ్రి చిన్నవయస్సులోనే మరణించారు. తల్లికి ఇటు అత్తింటివైపు బావగార్లు, మరుదులు, అటు పుట్టింటివైపు తన తమ్ముళ్ళ బలగం బాగా ఉంది. అందువల్ల ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆవిడ ఈ పెళ్ళికి ఒప్పుకోరు. ఎందుకంటే, బంధువుల్లో అవమానమన్న భయం. కానీ మావైపు మాత్రం, ‘అబ్బాయి బుద్ధిమంతుడు, అమ్మాయిని బాగా చూసుకుంటాడ’నే నమ్మకంతో మా అత్తగారు, మామగారు అందరూ ఈ పెళ్ళికి అంగీకరించారు. అసలు సమస్య ఇప్పుడే మొదలైంది. 2001లో ఇద్దరూ ‘లా’ ముగించి ఉద్యోగాల్లో చేరారు. ఆ సంవత్సరంలోనే మా పెద్దబ్బాయి పెళ్ళి కూడా తను ఇష్టపడిన అమ్మాయితోనే ఆ అమ్మాయి తల్లిదండ్రుల ఆమోదంతో సంతోషంగా, ఎంతో ఘనంగా జరిగింది. అప్పుడు మా అమ్మాయి ప్రేమించిన ఆ అబ్బాయిని వాళ్ళిద్దరి పెళ్ళి గురించి అడిగితే, “మా అమ్మని ఒప్పించి పెళ్ళి చేసుకుంటాను” అన్నాడు. కానీ ఎన్నిరోజులైనా తన నుండి ఎటువంటి అంగీకార సూచనా మాకు అందలేదు. ఎప్పుడు దీనిగురించి అడిగినా అదే మాట. “ఎంతకాలం ఇలా? ఒక టైం లిమిట్ చెప్పు” అని అంటే, “అమ్మని ఒప్పించడం కష్టం, అయినా ఒప్పిస్తాను” అని అంటాడు. పోనీ మా అమ్మాయితో, “నీకు మనవాళ్ళలోనే వేరే సంబంధాలు చూద్దాము. ఈ లోపల మంచి సంబంధం దొరికితే చేసుకో, ఎంత కాలమని ఇలా వెయిట్ (సంగతి తెలియక) చేద్దాము?” అంటే తను ఏడ్చేది. 2001 నుండి 2004 వరకు ఇలా సమయం గడిచిపోయింది. మాకు మనశ్శాంతి కరువైంది. “ఏంటి బాబా ఇలా అవుతోంది? ఆ అబ్బాయికి బలవంతంగా వేరే పెళ్ళి చేస్తే మా అమ్మాయి గతేంటి?” అని బాబా దగ్గర కూర్చుని బాధపడనిరోజు లేదు. బాబా కరుణ చూపించారు. ఆ అబ్బాయి పట్టుదల జయించింది. ఏ విధంగా, ఎలా ఒప్పించాడో, వాళ్ళెలా ఒప్పుకున్నారో అంతా బాబా మహిమ, అంతే. 2004, నవంబరులో మా అమ్మాయి వివాహం తను ప్రేమించిన ఆ అబ్బాయితో చాలా ఘనంగా జరిగింది. అబ్బాయి తరఫువాళ్ళంతా కూడా చాలా సంతోషించారు. ఇది బాబా కరుణతోనే జరిగింది అనటానికి నిదర్శనం ఇప్పుడు చెప్తాను. మా అమ్మాయి వివాహం జరిగిన తరువాత ఒకరోజు నేను నిశ్చింతగా, తృప్తిగా నిద్రపోతున్నాను. కలలో సాయిదేవుడు దర్శనమిచ్చారు. ఈసారి కలలో బాబా నాతో స్పష్టంగా, “ఏంటీ, అమ్మాయి పెళ్ళైందా? ఇప్పుడు సంతోషమేనా?” అని అన్నారు. నేను, “ఆఁ, బాబా, నీకెలా కృతజ్ఞతలు చెప్పాలి?” అన్నాను. “అది సరే, మరి నాకేం ఇస్తావు?” అన్నారు బాబా. “నీకు నేనేం ఇవ్వగలను బాబా?” అని నేను అంటే, “ఒక పని చెయ్యి. అమ్మాయి ఫోటోని నా దగ్గరే పెట్టు” అన్నారు బాబా. అంతే, ఆ తరువాత నాకు మెలకువ వచ్చింది. ఉదయం నిద్రలేచిన వెంటనే మా అమ్మాయి ఫోటోని బాబా ఫోటో దగ్గర పెట్టి జాగ్రత్తగా అలాగే ఉంచాను. బాబా ఇలా ఎందుకన్నారో ఇప్పటికీ నాకు తెలియదు. కానీ నా మనసుకు ఒక్కటే తోచింది, ‘అమ్మాయి ఫోటో బాబా దగ్గర ఉంది అంటే అమ్మాయి బాబా సంరక్షణలో ఉన్నట్లే. ఇక అమ్మాయి భారం, బాధ్యత అంతా బాబాదే' అని. మా అమ్మాయి ఒక్కతే తన అత్తవారింట్లోకి వేరే ఇంటినుండి వెళ్ళింది. అందువల్ల వాళ్లంతా తనను ఎలా చూసుకుంటారో అని నేను చాలా భయపడ్డాను. కానీ ఆ భయమేమీ లేకుండా బాబా దయవల్ల తన అత్తగారు, వాళ్ళవాళ్ళంతా కూడా అమ్మాయిని బాగా చూసుకుంటున్నారు. మా అల్లుడైతే మా అమ్మాయిని కంటికి రెప్పలాగా, ప్రాణంగా చూసుకుంటాడు. వివాహమైన సంవత్సరంలోపే మా అమ్మాయి పండంటి బాబుకి జన్మనిచ్చింది.  “ధన్యవాదాలు బాబా! అంతా నీ దయ, నీ దీవెన తండ్రీ.”


ఇప్పుడు, సాయిబాబా మావారిని ఎంత పెద్ద ప్రమాదం నుండి కాపాడారో చెప్తాను. ఇది 2017 నాటి మాట. మాకు బాగా దగ్గరి బంధువు ఒకాయన మెహబూబ్‌నగర్ జిల్లాలోని కొల్లాపురంలో ఉంటారు. ఒకరోజు ఆయన మరణించిన వార్త మాకు తెలిసింది. వారి భార్యని పలకరించి వద్దామని ఉదయాన్నే నేను, మావారు కారులో బయలుదేరి వెళ్ళాము. హైదరాబాద్ నుండి ఆ ఊరికి కారులో వెళ్ళడానికి మూడున్నర గంటల సమయం పడుతుంది. అక్కడికి చేరుకుని, జరగాల్సిన కార్యక్రమాలన్నీ ముగిసిన తరువాత మళ్ళీ అక్కణ్ణించి సాయంత్రం 4 గంటలకు ఇంటికి బయలుదేరాము. ఈసారి మాతోపాటు మావారి పెద్దమ్మ కొడుకు వచ్చాడు. ఆ అబ్బాయి ముందు సీటులో కూర్చున్నాడు. మావారు డ్రైవ్ చేస్తున్నారు. వాళ్ళిద్దరూ ఏదో మాటల్లో పడ్డారు. మాటల్లో పడి ఆ అబ్బాయి సీట్ బెల్ట్ పెట్టుకోలేదు. రోడ్డు చాలా బాగుండటంతో స్పీడుగా డ్రైవ్ చేస్తున్న మావారు ఉన్నట్టుండి ఎదురుగా రోడ్డుపై ఒక పెద్ద గుంతని చూశారు. ఆ స్పీడులో కారు ఆ గుంతలో పడితే కారు బోల్తా కొడుతుంది. అందువల్ల, ఆ గుంతని తప్పించే ప్రయత్నంలో కారుని ప్రక్కకి తిప్పాలని ప్రయత్నించేసరికి ఆ స్పీడుకి కారు బ్యాలెన్స్ తప్పి, అదే స్పీడులో రోడ్డుకి మరోవైపున్న పెద్ద మైలురాయికి గుద్దుకుని ఆగిపోయింది. అసలు ఏం జరుగుతోందో నాకేమీ అర్థం కాలేదు. ‘సాయీ, సాయీ’ అంటున్నాను. కారు ముందుభాగం మొత్తం ఇంజనుతో సహా నుగ్గునుగ్గు అయిపోయింది. ఇక్కడే బాబా తన కరుణామృతాన్ని మాపై వర్షించారు. అదెలా అంటే.. అంత పెద్ద ప్రమాదంలో కూడా సీట్ బెల్ట్ పెట్టుకోని ఆ అబ్బాయికిగానీ, డ్రైవ్ చేస్తున్న మావారికిగానీ ఎక్కడా ఏమాత్రం దెబ్బలు తగల్లేదు. అంతేకాదు, కారు పూర్తిగా బ్యాలెన్స్ తప్పి అటు ఇటు తిరుగుతూ రోడ్డుకి ఇవతలివైపుకి వచ్చినప్పుడు, ముందునుంచి గానీ, వెనకనుంచి గానీ ఏదైనా బండి వచ్చుంటే ఆ పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోవటానికే భయంగా ఉంది. జరిగిన ప్రమాదం కారణంగా కారు ఇక నడిపే పరిస్థితుల్లో లేదు. మేము ఆగిన ప్రదేశం నుండి 30, 40 నిమిషాల ప్రయాణ దూరం వరకు ఏ చిన్న ఊరు కూడా లేదు. ఎటూ తోచని పరిస్థితి. మళ్ళీ బాబా ‘నేనున్నాను’ అన్నారు. హైదరాబాద్ నుండి ఈ కార్యక్రమానికి వచ్చిన వేరే బంధువుల కార్లు వెనకాలే వచ్చాయి. మా కారుని చూసి వాళ్ళు ఆగిపోయారు. ముందుగా, ఒక కారులో స్థలముంటే అందులో నన్ను హైదరాబాదుకు పంపించారు. తర్వాత మావారు హైదరాబాదులోని మా కారు కంపెనీవాళ్ళని ఫోన్ ద్వారా కాంటాక్ట్ చేయాలని ప్రయత్నిస్తుంటే ఎంతకీ సిగ్నల్స్ దొరకలేదు. అతికష్టం మీద సిగ్నల్స్ దొరికిన తర్వాత వాళ్ళతో మాట్లాడి విషయం వివరించారు. వాళ్ళు హైదరాబాద్ నుండి వచ్చి, మా కారుని వాళ్ళ వెహికల్‌కి తాడుతో కట్టి హైదరాబాదులోని కంపెనీ షెడ్డుకి తీసుకెళ్ళారు. ఆ తరువాత మావాళ్ళు ఇంటికి చేరుకునేసరికి సమయం రాత్రి 11 గంటలయింది. అంతవరకు ఆ అబ్బాయి మావారికి తోడుగా ఉన్నాడు. కారు డ్యామేజ్ అయినప్పటికీ ఎవరికీ ఏ ప్రమాదం లేకుండా బాబా చల్లగా కాపాడారు, అంతే చాలు. “నీకు శతకోటి వందనాలు దయాసముద్రా!”


మీకు ఇంతకుముందు మా చిన్నబ్బాయి ఇంజనీరింగ్ సెలవులకు వచ్చినప్పటి యాక్సిడెంట్ గురించి చెప్పాను. ఇప్పుడు ఆ సాయితండ్రి మా చిన్నబ్బాయిని మరో పెద్ద సమస్య నుంచి ఎలా రక్షించారో చెప్తాను. మా చిన్నబ్బాయి 2001లో ఇంజనీరింగ్ పూర్తిచేసి, ఎమ్.ఎస్ చేయడానికి అమెరికా వెళ్ళి అక్కడే సెటిలయ్యాడు. 2004లో మా అబ్బాయి పెళ్ళి, మా అమ్మాయి పెళ్ళి ఒక్కసారే 5 రోజుల వ్యవధిలో చేశాము. మా కోడలు 2008లో గర్భవతి అయింది. తనకి 2009 జులైకి డెలివరీ డేట్ ఇచ్చారు డాక్టర్లు. మా కోడలి అమ్మానాన్నలు డెలివరీ టైమ్‌కి అమెరికా వెళితే, వాళ్ళు వచ్చిన తరువాత నేను వెళదామనీ, అలా అయితే అమెరికాలో ఉన్నవాళ్ళకి ఎక్కువ కాలం సహాయంగా ఉన్నట్లు ఉంటుందనీ అనుకున్నాను. మా వియ్యంకులు వీసాకి అప్లై చేసుకున్నారు. అప్పటికి ఇంకా వీసా రాలేదు. అక్కడ అమెరికాలో మా కోడలు ఎప్పుడు చెకప్‌కి వెళ్ళినా, ‘అంతా బాగానే ఉంది, కానీ లోపల బేబీ ఎదుగుదల సరిగ్గా లేదు’ అని డాక్టర్ అనేవారు. వీళ్ళు ఆందోళనపడుతుంటే, ‘భయపడాల్సింది ఏదీ లేదు’ అనేవారు. ఈ లోపల ఊహించని సంఘటన జరిగింది. సరిగ్గా పాపకి 6 నెలలప్పుడు ఏప్రిల్ నెలలో మా కోడలి ఆరోగ్యం బాగా విషమించింది. దాంతో తనను ఎమర్జన్సీలో చేర్చుకుని, ఆపరేషన్ చేసి బేబీని బయటికి తీసి ఇంక్యుబేటర్‌లో ఉంచారు డాక్టర్లు. తల్లిని ఐ.సి.యులో ఉంచారు. మా అబ్బాయికి కాళ్ళు చేతులు ఆడలేదు. విషయం తెలిశాక ఇక్కడ మా పరిస్థితీ అంతే. భగవంతుడి దయవల్ల 2007లో నేను మా పెద్దకోడలి డెలివరీ కోసమని (ఆ సమయంలో వాళ్ళు అమెరికాలో ఉన్నారు.) అమెరికా వెళ్ళివచ్చాను. నాకు 10 సంవత్సరాల అమెరికా వీసా ఉంది. అందువల్ల, ఇంకేమీ ఆలోచించకుండా వెంటనే నేను మా చిన్నబ్బాయి వద్దకు వెళ్ళిపోయాను. నన్ను చూడగానే మా అబ్బాయి ముఖంలో సంతోషం కనిపించింది. నేను వెళ్ళేటప్పటికి మా కోడలు కొద్దిగా కోలుకుంది. కానీ పాప పరిస్థితి మాత్రం ఆందోళనకరంగానే ఉంది. అటువంటి పరిస్థితుల్లో కూడా పాప ఫోటో ఒకదాన్ని వాళ్ళింట్లో ఉన్న పెద్ద బాబా ఫోటో పాదాల దగ్గర పెట్టాడు మా అబ్బాయి. అది చూసి నాకెందుకు అనిపించిందో తెలీదు, ‘పాప చేరవలసిన చోటుకే చేరింది. ఇంక అంతా బాబానే చూసుకుంటారు’ అని. మా కోడలు, మా వియ్యంకులు కూడా బాబాకి చాలా మంచి భక్తులు. పాప పూర్తిగా 3 నెలలపాటు ఇంక్యుబేటర్, వెంటిలేటర్ మీదే పెరిగింది. డాక్టర్లు మాత్రం పాప కోలుకుంటుందనిగానీ, కోలుకున్నా ఆరోగ్యంగా, మామూలుగా ఉంటుందనిగానీ మాకు ధైర్యం చెప్పలేదు. ఆ మూడు నెలలు ఎలా గడిచాయో తెలియదు. బాబాపై భారం వేసి, రోజుకి 108 సార్లు చొప్పున 40 రోజులు సాయిచాలీసా పారాయణ చేయాలనుకుని పారాయణ మొదలుపెట్టాను. సరిగ్గా 40వ రోజున ఆ సంవత్సరం గురుపూర్ణిమ వచ్చింది. బాబా కరుణ కురిపించారు. జూలై 22కి పాప ఇంటికి వచ్చింది. మొదట్లో కొన్ని సమస్యలు వచ్చాయి, కానీ బాబా దయవల్ల అవి కూడా సమసిపోయాయి. ఈ లోపల మా వియ్యంకులు కూడా అమెరికా వచ్చేశారు. తర్వాత నెమ్మదిగా పాప పూర్తిగా కోలుకుంది. ఇప్పుడు పాప చాలా చక్కగా, ఆరోగ్యంగా ఉంది. అమెరికాలో 8వ తరగతి చదువుకుంటోంది. పాప ఫోటోని బాబా దగ్గర చూసినప్పుడు నాకు కలిగిన ఆ తలంపును బాబా నిజమని నిరూపించారు. మా అందరికీ, ముఖ్యంగా మా అబ్బాయికి, కోడలికి ఎంతటి చింతను తొలగించి మనశ్శాంతిని బాబా ప్రసాదించారో కదా! “బాబా, నీ ప్రేమకు కొలత ఎక్కడిది తండ్రీ? నిరుపమానమైన ఈ నీ ప్రేమను, కరుణను ఎంతని పొగడను స్వామీ?”.


ఇంతవరకు బాబా తన లీలల ద్వారా తనపైన నాకున్న నమ్మకాన్ని పెంచుతూ వచ్చారు. తరువాత నా నమ్మకాన్ని పరీక్షించడానికి అన్నట్లు నాకు ఒక సమస్యని ఇచ్చారు. దాని గురించి రేపటి భాగంలో పంచుకుంటాను.


'సాయి మహరాజ్ బ్లెస్సింగ్స్' వాట్సాప్ గ్రూపు ఏర్పాటు విషయంలో బాబా అనుగ్రహం

సాయిభక్తులకు బాబా ఆశీస్సులు సదా ఉండాలని కోరుకుంటూ ఒక స్వీయ అనుభవాన్ని పంచుకుంటున్నాను. బాబా ప్రేమ అనంతం. సదా మనకు తోడుగా ఉంటూ చిన్న, పెద్ద కోరికలను తీరుస్తూ, మనకొచ్చే సమస్యలను పరిష్కరిస్తూ, కష్టాలను గట్టెక్కిస్తూ ఆయన మనపై చూపే ప్రేమ అపారమైనది. ఆ ప్రేమను పొంది మనం మాత్రమే ఆస్వాదిస్తూ ఉండలేము. తోటి భక్తులతో పంచుకుని మరింత ఆనందాన్ని పొందుతుంటాము. అందుకోసంగా బాబా ఆశీస్సులతో ఏర్పడినదే ఈ 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగ్. ఎందరో భక్తులు తాము పొందిన బాబా ప్రేమను ఈ బ్లాగ్ ద్వారా తోటి భక్తులకు పంచుతున్నారు. వాళ్లందరికీ మా అందరి తరఫున ధన్యవాదాలు. ఇకపోతే, మిగతా భక్తులకు కూడా తమ అనుభవాలను పంచుకోవాలని ఉన్నా చిన్న అనుభవమేనన్న సంకోచంతో ఆగిపోతూ ఉండొచ్చు. కానీ అనుభవం చిన్నదైనా, పెద్దదైనా అది బాబా ప్రేమ. ఆ ప్రేమను పంచుకోవాలనే ఆరాటమైతే దాదాపుగా భక్తులందరికీ ఖచ్చితంగా ఉంటుంది. కనీసం ఒక్కరితోనైనా పంచుకుని ఆనందపడతారు. అందుకే పెద్ద పెద్ద అనుభవాలను, కొంచెం వివరంగా ఉండే అనుభవాలను బ్లాగులో ప్రచురించడం ద్వారా అందరితో పంచుకుంటున్నట్లుగానే చిన్న చిన్న అనుభవాలను పంచుకునేందుకు అనువుగా ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేయాలని నాకనిపించింది. అంతేకాదు, బాబా ప్రేమను(అనుభవాలను) వివరంగా వ్రాయకుండా, 'బ్లాగులో పంచుకుంటే, తమ కోరిక నెరవేరింది' అని ఈమధ్య వస్తున్న సంక్షిప్త అనుభవాలను కూడా ఆ గ్రూపులో భక్తులు నేరుగా పంచుకోవచ్చు, తద్వారా ఆ భక్తుల మ్రొక్కులూ తీరుతాయి, వాటిని బ్లాగులో ప్రచురించలేకపోతున్నామన్న అపరాధభావం మాకూ ఉండదని కూడా నాకు అనిపించింది. అయితే, 'ఆ ఆలోచన సరైనదా, కాదా? దాన్ని ఆచరణలో పెడితే నేను తప్పు చేసిన వాడినవుతానా?' అన్న సందిగ్ధంలో పడ్డాను. అందువల్ల, "గ్రూపు ఏర్పాటు చేయాలో, వద్దో తెలియజేయమ"ని బాబానే అడిగాను. మరుసటిరోజు ఉదయం, "నువ్వు ఎటువంటి ఆందోళన చెందకుండా నీకు సంతోషాన్నిచ్చే పనిని చేస్తూ ఉండు. దైవం నీ పట్ల ఎంతో దయగా ఉంటాడు. అల్లా భలా కరేగా!" అని బాబా వచనం వచ్చింది. దానిని బట్టి నేను అనుకున్నది చేయమని బాబా చెప్తున్నట్లు అనిపించినప్పటికీ, బాబా సందేశాన్ని సరిగానే తీసుకుంటున్నానా అన్న సందేహం కలిగింది. అందువల్ల, "మీ సందేశాన్ని సరిగానే తీసుకున్నానని స్పష్టంగా తెలియజేయండి బాబా" అని అనుకున్నాను. తర్వాత ఒక ఇంగ్లీషు బ్లాగులో సాయిభక్తుల అనుభవాలు చదువుతుంటే అక్కడ ఒక భక్తురాలు ఒక విషయం గురించి బాబాను అడిగాననీ, ఆ తర్వాత శిరిడీ లైవ్ దర్శనం చూస్తుంటే బాబా పాదాల చెంత ఒక పువ్వు కనిపించిందనీ, అంతకుముందు అక్కడ లేని పువ్వు అప్పుడు కనిపించడం తనడిగిన విషయానికి బాబా ఇచ్చిన శుభాశీస్సులనీ పంచుకున్నారు. అది చదివిన నేను, "బాబా! నాకు కూడా అలా సమాధానమిస్తారా?" అని అనుకున్నాను. అయితే, అలా ఏదో యథాలాపంగా  అనుకున్నానేగానీ తరువాత దాని గురించి పెద్దగా ఆలోచించలేదు. అంతటితో ఆ విషయాన్ని మర్చిపోయాను. కానీ బాబా మర్చిపోరుగా! అదేరోజు రాత్రి నేను శిరిడీ లైవ్ ఓపెన్ చేస్తే, అప్పుడు అక్కడున్న పూజారులు మారుతున్నారు. సాధారణంగా అలా పూజారులు మారే సమయంలో అప్పటివరకు అక్కడున్న పూజారి, కొత్తగా వచ్చిన పూజారి బాబా పాదాలకు, సమాధికి తమ శిరస్సునానించి నమస్కరించుకుంటారు. అది నాకు ఎంతో ఇష్టమైన సన్నివేశం. ఆ పూజారుల స్థానంలో నన్ను ఊహించుకుంటూ బాబాకు నమస్కరించి వారి అనుగ్రహాన్ని అమితంగా ఆస్వాదిస్తాను. ఆరోజు కూడా ఆ సన్నివేశాన్ని ఆస్వాదిస్తుండగా కొత్తగా వచ్చిన పూజారి బాబా పాదాలకు నమస్కరించిన మీదట బాబా పాదాలపై ఒక ఎర్ర గులాబీపువ్వు ఉంచారు(అంతకుముందు అది లేదక్కడ). ఆ దృశ్యాన్ని చూస్తూనే, ఉదయం నేను చదివిన ఆ భక్తురాలి అనుభవం, 'నాకు కూడా అలా ఇస్తారా బాబా?' అని అనుకోవడం గుర్తొచ్చింది. అలాగే వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేయడంలో ఉదయం బాబా ఇచ్చిన సందేశం కూడా సరిగా తీసుకున్నాను అని అర్థమై అమితానందభరితుడనయ్యాను. ఇంక బాబా అనుమతితో నా ఆలోచనకు రూపాన్నిస్తూ 'Sai Maharaj Blessings' పేరుతో వాట్సాప్ గ్రూపు క్రియేట్ చేశాను. ఈ గ్రూపులో భక్తులు బాబా తమకి ప్రసాదించిన (కేవలం) చిన్న చిన్న అనుభవాలను (బాబా ప్రేమను) ఎప్పుడు కావాలంటే అప్పుడు తోటి భక్తులతో పంచుకోవచ్చు. అలాగే, వివరంగా వ్రాయలేక కేవలం బ్లాగులో పంచుకుంటే కోరిక నెరవేరిందని క్లుప్తంగా చెప్పే అనుభవాలను కూడా ఈ గ్రూపులో పంచుకోవచ్చు.

  • పెద్ద పెద్ద అనుభవాలను, వివరంగా వ్రాసే అనుభవాలను మాత్రం నా పర్సనల్ వాట్సాప్  నెంబరు: 7842156057కి పంపండి. వాటి వాక్యనిర్మాణాలు, అక్షరదోషాలు సరిచేసి బ్లాగులో ప్రచురిస్తాము. అలా బాబా ప్రేమను తోటి భక్తులకు అందుబాటులో ఎప్పటికీ ఉంచుదాం.

  • ఈ గ్రూపులో కేవలం చిన్ని చిన్ని అనుభవాలనే పంచుకోవాలని, ఇతరత్రా విషయాలను షేర్ చేసి తోటి భక్తులను ఇబ్బందిపెట్టవద్దని సవినయంగా మనవి చేసుకుంటున్నాము.
గ్రూపులో జాయిన్ అయేందుకు క్రింద లింక్ ఇస్తున్నాను. ఆసక్తి ఉన్నవారు జాయిన్ అవ్వవలసిందిగా మనవి. 

'Sai Maharaj Blessings' వాట్సాప్ గ్రూపు లింక్: https://chat.whatsapp.com/KT31TRFUZhUEy8JqF0RPNi



సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo