సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

అబ్దుల్ రహీం శంషుద్దీన్ రంగారీ


థానా నివాసి అబ్దుల్ రహీం శంషుద్దీన్ రంగారీ 1913వ సంవత్సరంలో మొదటిసారిగా సాయిబాబాను కలుసుకున్నాడు. ఆసమయంలో అతని భార్య ఏదో తెలియని వ్యాధితో బాధపడుతూ వుంది. ఆమె గొంతు మరియు దవడల వాపుతో ఏమీ తినలేకపోయేది. వైద్య సహాయం ఏమాత్రం ఉపశమనం కలిగించలేదు. కాబట్టి, తన భార్య వ్యాధి నివారణ కోసం, అతను ఒక స్థానిక న్యాయవాది ఆర్.జె గుప్తా సలహా మేరకు అనారోగ్యంతో బాధపడుతున్న తన భార్యను తీసుకుని ఎంతో ఆశతో బాబా దర్శనానికి వెళ్లాడు. 

ప్రయాణం ప్రారంభించినప్పుడు ఆమె ఏమీ తినలేని పరిస్థితిలో వుంది. కానీ వారు ఇగత్పురికి వెళ్ళినప్పుడు, ఆమె తేనీరు సేవించగలిగింది. నాసిక్ లో కొంచెం ఆహారం తీసుకోగలిగింది. షిర్డీ చేరేసరికి ఆమె పరిస్థితి బాగా మెరుగుపడింది. వారు షిర్డీ చేరాక, అతను మాత్రమే మశీదు లోనికి వెళ్లి బాబాకు నమస్కరించాడు. 

అప్పుడు బాబా “నీవు ఎందుకు వచ్చావు? నీకు ఏం కావాలి?”  అని అడిగారు. అతను “నా భార్య గొంతులో వాపుతో బాధపడుతుంది” అని సమాధానమిచ్చాడు. "ఆమెను లోపలి రమ్మను" అని బాబా అన్నారు. అప్పుడు ఆమె మశీదు లోపలికి వచ్చి బాబా పాదాలకు నమస్కరించింది. బాబా ఆమె తలపై చేయివేసి, 'ఖుదా అచ్ఛా కరేగా' అని అన్నారు. అప్పుడు రంగారీ బాబాకు దక్షిణ సమర్పించుకున్నాడు. బాబా దానిని స్వీకరించి అతనికి ఊదీ ఇచ్చారు. వారు రెండు గంటల సమయం అక్కడే బాబా సన్నిధిలో ఉన్నారు. అతడు అక్కడున్న రెండు గంటల కాలంలో బాబాతో మాట్లాడింది చాలా తక్కువ. అతడు బాబా నుదుట చందనం అద్ది ఉండడం గమనించి, “ముస్లింలు అలా గంధం పూసుకోరు కదా! మరి మీరు ఇవన్నీ ఎలా ధరించారు?” అని బాబాను అడిగాడు. అప్పుడు బాబా, “జైసా దేశ్, వైసా వేష్(దేశమెలా ఉంటే వేషమలా ఉండాలి). ఇక్కడి వాళ్ళు వారి దేవతలను అర్థించక నన్ను దైవంగా కొలిచి అర్థిస్తున్నారు. వారిని అసంతృప్తి పరచడమెందుకు? నా వరకూ నేను భగవంతుని బానిసనే” అన్నారు. ఆయనే మళ్ళీ “నీవు నిన్న వచ్చి ఉంటే బాగుండేది. ఇక్కడ సంగీతకచ్చేరి జరిగింది. నేను రాత్రంతా దుఃఖిస్తూనే ఉన్నాను. వీళ్ళంతా నన్ను ‘తిట్టారు’” అన్నారు. అతడు “వాళ్ళు మిమ్మల్ని ఎందుకు తిట్టారు?” అనడిగితే, బాబా, “నేను ‘తిట్టారు’ అంటే ఇక్కడి వాళ్ళకు అర్థం కాదు, కానీ నీకర్థమవుతుంది” అన్నారు.

నిజానికి ‘తిట్టారు’ అన్నమాటకు సూఫీ పరిభాషలో ‘వినోద పరిచారు’ అని అర్థమని అతనికి తెలుసుగనుక, భగవంతుని స్తుతిస్తుంటే భక్తులు దుఃఖిస్తారు, నవ్వుతారు, లేదా నృత్యం చేస్తారు” అని అతను బాబాతో అన్నాడు. బాబా “అంతే! సరిగా చెప్పావు. నీ గురువు నీకున్నారు కదా!” అన్నారు. అందుకు అతడు “అవును ఉన్నారు. హబీబ్ ఆలీషా చిస్తీ నిజామీ” అని చెప్పారు. అందుకే “నీకు అర్థం అయ్యింది” అన్నారు బాబా.

రెండు గంటలు గడిచిన తరువాత ఆమె వాపు ఉపశమనం చెందుతూ ఉండటంతో అక్కడి నుండి బయలుదేరాలని అనుకున్నాడు రంగారీ. కాని బాబా వారిని అక్కడే ఉండమన్నారు. కాని రంగారీ,  అతని భార్య రెండేళ్ళ కొడుకుతో కొత్త ప్రదేశంలో ఉండటం ఇష్టంలేక బాబా అనుమతి లేకుండా ఇంటికి బయలుదేరారు. వారు అందుకు పరిహారం చెల్లించవలసి వచ్చింది.

వారు వెళ్తున్న టాంగా రాత్రి 10 గంటలకు ప్రయాణం మధ్యలో విరిగిపోయింది. అక్కడ మరి ఏ ఇతర సౌకర్యాలు అందుబాటులో లేవు. అతను, అతని భార్య మరియు బిడ్డ ఆరాత్రి వేళ అన్ని మైళ్ళ దూరం అటు వెనకకు నడవలేరు, అలా అని ముందుకు వెళ్ళలేని పరిస్థితులలో చిక్కుకున్నారు. అది ఒక నిర్మానుష్యమయిన రహదారి మరియు వాతావరణం కూడా బాగాలేదు. తలదాచుకునేందుకు చోటు లేక చలిలో వణుకుతూ రెండు గంటలు గడిపారు. ఏమి చేయాలనేది అతనికి తోచలేదు. బాబా అనుమతి లేకుండా బయలుదేరినందుకు అతను పశ్చాత్తాపపడ్డాడు.

అర్ధరాత్రి దాటిన తరువాత ఏదో బండి వస్తున్న చప్పుడు వినిపించింది. “థానావాలా, థానావాలా” అని బండితోలే వ్యక్తి అరుచుకుంటూ వస్తున్నాడు. టాంగా దగ్గరకు రాగానే రంగారీ టాంగాను ఆపి, “నేనే ఆ థానావాలా” అని చెప్పాడు. అప్పుడు ఆ టాంగావాడు “బాబా మిమ్మల్ని తీసుకొని రమ్మని పంపించారు” అని చెప్పాడు. అప్పుడు వాళ్ళు టాంగా ఎక్కి రాత్రి 2 గంటలకు షిర్డీ చేరుకున్నారు. వాళ్ళని చూస్తూనే బాబా, “మీరు అనుమతి లేకుండానే వెళ్ళారు. కాబట్టి, మీకు ఈ విధంగా జరిగింది” అన్నారు. వెంటనే రంగారీ తాను చేసిన తప్పుకు బాబాను క్షమాభిక్ష కోరారు. అప్పుడు బాబా, 'ఉదయం వరకు వేచి ఉండండి'  అని చెప్పారు.

ఉదయం బాబా భిక్ష నుండి తిరిగి వచ్చిన తరువాత కొంత రొట్టె మరియు కూర తినమని వారికి ఇచ్చారు. బాబా ఇచ్చిన రొట్టెను అతని భార్య తినగలిగింది. తరువాత బాబా అతనితో, 'నీవు వెళ్ళవచ్చు' అన్నారు. అతను వెళ్లి టాంగా కోసం చూశాడు, కాని ఎక్కడ టాంగా కనిపించక బాబా వద్దకు తిరిగి వచ్చాడు. బాబా “నీవు ఇప్పుడు వెళ్ళవచ్చు, టాంగా అక్కడ ఉంది చూడు” అన్నారు. అతడు చూస్తే టాంగా ఉంది. అంతవరకు కనిపించని టాంగా అంతలోనే అకస్మాత్తుగా ఎలా వచ్చిందో అని అతను చాలా ఆశ్చర్యపోయాడు.

అతను షిర్డీ వెళ్ళినది ఆ ఒక్కసారే కాని తొలిసారి బాబా దర్శనంతోనే అతనికి బాబాపై స్థిరమైన విశ్వాసమేర్పడింది. అతడు రోజూ నిద్రించేముందు బాబాని తలుచుకొనేవాడు. అతను ఆర్తిగా బాబాని తలుచుకున్నప్పుడు బాబా అతనికి దర్శనమిచ్చేవారు.

(Source: Life of Saibaba Volume 3. by Sri.B.V.Narasimha Swamiji)

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo