సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

ముక్తారాం


కొంతమంది సాయిభక్తులు వారి జీవితాన్నంతా భక్తితో బాబాకు సమర్పించుకున్నారు. అటువంటి ఒక భక్తుని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ముక్తారాం అనే సాయిభక్తుడు ఖాందేశ్‌కు చెందినవాడు. అతని ఇల్లు రావేర్ నుండి సుమారు ఒకటిన్నర మైళ్ళ దూరంలో ఉండేది. అతను మొదటిసారి 1910-11 ప్రాంతంలో శిరిడీ సందర్శించాడు. బాబా సన్నిధి సుఖాన్ని అనుభవించిన అతను 1914-15లో తన ఆస్తిపాస్తులను, తల్లిని, భార్యాబిడ్డలను, సమస్తాన్ని విడిచిపెట్టి శాశ్వతంగా బాబా సన్నిధిలో గడపాలని శిరిడీ వచ్చేశాడు. బాబా అతనిని 'ముక్తారాం' అనే పిలిచేవారు.

ఆ సమయంలో పూర్తి విరక్తి మార్గంలో నడిచే మరో భక్తుడు శిరిడీలో ఉండేవాడు. అతని పేరు బాలారాం అలియాస్ బాలక్‌ రాం మాన్కర్. ముక్తారాం ఎక్కువ సమయాన్ని ఈ బాలారాం సాహచర్యంలో గడుపుతుండేవాడు. బాబా ఈ ఇద్దరి భక్తుల ఆధ్యాత్మిక పురోగతి విషయంలో ఎంతో శ్రద్ధ తీసుకుంటుండేవారు. వీరిని కేవలం శిరిడీలో కూర్చోనివ్వకుండా వివిధ ప్రాంతాలకు పంపుతుండేవారు. కానీ వీరెక్కడెక్కడ తిరిగినా తిరిగి శిరిడీ చేరుకుంటుండేవారు. అంటే శిరిడీ వీరి ముఖ్యకేంద్రంగా ఉండేది. అలా బాబా వారిని శిరిడీకి తిరిగి రప్పించడంలో వారికి ఆధ్యాత్మిక మార్గనిర్ధేశం చేయడంతోపాటు వారు ఆత్మవికాసం సాధించాలనేది ఆయన ఉద్దేశ్యం.

ముక్తారాం శాశ్వతంగా శిరిడీని తన నివాసంగా చేసుకున్నప్పటినుండి సమయమంతా బాబా సన్నిధిలోనే గడిపేవాడు. అతనెప్పుడూ మసీదులో ధుని దగ్గర కూర్చునేవాడు. ఉదయాన్నే మశీదుకు చేరుకుని మధ్యాహ్న ఆరతి పూర్తయ్యేవరకూ అక్కడే గడిపేవాడు. అతను బాబాతో కలిసి అల్పాహారం, భోజనం తీసుకునేవాడు. ఆయన తనకిచ్చిన ఆహారంతోనే అతను జీవనాన్ని సాగిస్తుండేవాడు. భోజనానంతరం బాబా ఆదేశానుసారం దీక్షిత్ వాడాకు ప్రక్కనున్న ఒక చిన్న రేకుల షెడ్డుకు వెళ్ళేవాడు. అక్కడ అతనొక ధుని ఏర్పాటు చేశాడు. బాబా సూచననుసరించి అతను ఆ ధునికి సమీపంలో కూర్చుని ఉండేవాడు. మళ్ళీ బాబా తనని బయటకు రమ్మని చెప్పేంతవరకు అలాగే కూర్చుని ఉండేవాడు. వేసవికాలంలోని వడగాల్పులలో సైతం అతను ఆ రేకుల షెడ్డులో ధుని వద్ద గంటల తరబడి కూర్చుని ఉండేవాడు. అది చూసి చుట్టూ ఉన్న జనం అతడెలా ఆ వేడిని తట్టుకోగలుగుతున్నాడని ఆశ్చర్యపోతుండేవారు. అయితే దానికి కారణం అతని నిశ్చలమైన భక్తి. అతను తన బాహ్యాంతరాలను సర్వశక్తిమంతుడైన భగవంతుని వైపు మళ్లించడానికి నిరంతరం ప్రయత్నిస్తుండేవాడు. అతని ఏకైక జీవితలక్ష్యం - సద్గురువు చూపిన మార్గంలో నడవడమే.

శ్రీ ముక్తారాం గురించి ప్రస్తావించదగిన కొన్ని సంఘటనలు:

1) అన్నాసాహెబ్ దభోల్కర్ ఎప్పుడు శిరిడీ సందర్శించినా దీక్షిత్ వాడాలోని పైఅంతస్తులో బస చేసేవాడు. అతని పడక కిటికీ సమీపంలో ఉండేది. ఒకసారి ఆ కిటికీ రంధ్రం గుండా ఒక పాము లోపలికి ప్రవేశించి దభోల్కర్ పరుపులో దూరింది. అది గమనించిన కొందరు దానిని చంపడానికి కర్రలు చేతపట్టుకుని సిద్ధమయ్యారు. ఒక వ్యక్తి దానిని చంపబోయాడు కూడా. కానీ అది తప్పించుకుని, వచ్చిన దారినే వెళ్ళిపోయింది. అప్పుడక్కడున్న ముక్తారాం, “దొరికుంటే పాపం దాని ప్రాణాలు కోల్పోయేది. తప్పించుకోవడం వలన మంచే జరిగింది” అన్నాడు. అందుకు హేమాడ్‌పంత్ ఒప్పుకొనక, "పామును చంపటమే మంచిద"ని అన్నాడు. ఆ వాగ్వివాదం చాలాసేపు జరిగింది. కానీ ఏదీ తేలకుండానే ఆ చర్చ ముగిసింది. మరుసటిరోజు ఆ అంశాన్ని బాబా తమంతట తాముగా లేవనెత్తుతూ, "నిన్న ఏం జరిగింది?" అని అడిగారు. దభోల్కర్ జరిగినదంతా చెప్పి, "అటువంటి పరిస్థితుల్లో పామును చంపవచ్చా?" అని అడిగాడు. అప్పుడు బాబా, “భగవంతుడు మనుషులతోపాటు పాము, తేలు మొదలైన అన్ని జీవులలో ఉన్నాడు. ఆయన ఆజ్ఞానుసారం జీవులన్నీ ప్రవర్తిస్తాయి" అన్నారు. బాబా బోధించిన దానినే ముక్తారాం చెప్పాడు. బాబా అతను చెప్పినదానికి పూర్తి మద్దతునిచ్చారు. పై సంఘటనను బట్టి  ముక్తారాం స్వభావం చాలా భిన్నంగా ఉండేదని తెలుస్తుంది.

శ్రీసాయిబాబా ముక్తారాంని మాధ్యమంగా చేసుకుని హార్దాలో తమ సంస్థానాన్ని ఎలా స్థాపింపచేసుకున్నారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. 

హార్దా నగరంలో శ్రీ సదాశివ్ ఘండిరాజ్ నాయక్ అలియాస్ సాధూభయ్యాకు 1915, ఫిబ్రవరి 5న శ్రీ కాకాసాహెబ్ దీక్షిత్ ఒక ఉత్తరాన్ని వ్రాశారు. అందులోని సారాంశం క్రింది విధంగా ఉంది.

“రవేరా నుండి ఒకటిన్నర మైలు దూరంలో శ్రీ ముక్తారాం స్వగ్రామం ఉంది. అక్కడ అతని ఇంట శ్రీ సమర్థ సాయిబాబా వారి పెద్ద ఫోటో ఉంది. ఆ ఫోటోను మీకు అందజేయాలనే ప్రేరణ అతనికి కలిగింది. అందువలన బాలక్ రాం, ముక్తారాంలు ఇరువురూ 1915, ఫిబ్రవరి 8, సోమవారంనాడు ఇక్కడినుండి బయలుదేరుతున్నారు. అదేరోజు సాయంకాలం సుమారు 5 గంటలకు హార్దా చేరుకుంటారు. కావున బండి వచ్చే సమయానికి తెలిసిన మనుషులను పంపే ఏర్పాట్లు చేయండి”.

ఇదిలా ఉంటే, అదే సమయంలో హార్దా నివాసి గౌరవ మేజిస్ట్రేట్ అయిన ఛోటూభాయి పరులేకర్‌కి కలలో బాబా కనిపించి, "నేను సాధూభయ్యా ఇంటికి వస్తున్నాను. నువ్వు అక్కడికి వచ్చి నా దర్శనం చేసుకో" అని చెప్పారు.

కాకాసాహెబ్ ఉత్తరం ద్వారా విషయం తెలుసుకున్న సాధూభయ్యా బాబాను ఆహ్వానించడానికి తానే స్వయంగా స్టేషన్‌కి వెళ్ళాడు. అతను ఒక రైలు బోగీనందు మధ్యలో బాబా ఫోటో పెట్టుకుని కూర్చున్న బాలక్‌రాం, ముక్తారాంలను చూసి ఆ బోగీ లోపలికి వెళ్ళాడు. ముందుగా అతను ఫోటోలోని, బాబా చరణాలపై శిరస్సునుంచి నమస్కరించుకున్నాడు. తరువాత బాలక్‌రాం, ముక్తారాంలను సాదరంగా ఆహ్వానించి తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు. ఆరోజు దాసనవమి. ఒక పెద్దపీటపై ఒక శాలువాను పరచి, దానిపై బాబా ఫోటోను ఉంచి, సాయంకాల ఆరతి ఇచ్చారు. ఆరతి సమయానికి చాలామంది వచ్చారు. బాలక్‌రాం, ముక్తారాంల సూచనల మేరకు బాబా ప్రసాదించిన పాదుకలకు రుద్రాభిషేకం చేసి, బాబా ఫోటోకు పూజచేసి ఆ ఫోటోను సింహాసనంపై కూర్చోబెట్టారు. తరువాత ఆరతి మరియు మంత్రపుష్పం ఎంతో ఉచ్ఛస్వరంతో జరిగాయి.

బాబా పాదుకలకు అభిషేకం జరుగుతున్నప్పుడు ముక్తారాం జెండా ఎగరవేయడానికి ఇంటి పైఅంతస్తుకు వెళ్లి, అక్కడినుండి ఇంటి పైకప్పు మీదకి ఎక్కాడు. జెండా ఎగురవేసే ఆ ప్రదేశం ఎంతో ప్రమాదకరమైనది. ఏ మాత్రం కాలుజారినా క్రిందపడి ప్రాణం కోల్పోయే పరిస్థితి. అలాంటిది అందరూ చూస్తుండగా అతడు రెప్పపాటుకాలంలో జెండాను ఎగురవేసి క్రిందికి దిగివచ్చాడు. అతడు జెండా ఎగురవేసే సమయంలో అక్కడ శిరిడీలోని మశీదులో ఉన్న బాబా చేయి తీవ్రంగా నొప్పిపుట్టింది. ఫకీరుబాబా ఆయన చేతిని మర్దన చేస్తుండగా బాబా, “పేదలకు భగవంతుడే యజమాని, అతనిని మించి ఎవరూ లేరు (గరీబోం కో అల్లామాలిక్ వలీ హై. అల్లాసే బడా కోయీ నహీ)” అని అన్నారు.

సాధూభయ్యా ఇంట బాబా ఫోటో ప్రతిష్ఠించబడిన రాత్రి జలగాఁవ్‌లో ఉన్న అతని భార్యకి, సోదరుడు(కజిన్) శ్రీనారాయణ్ దాదాజీలకి రెండు కలలు వచ్చాయి. అతని భార్యకు వచ్చిన కలలో మాధవరావు దేశ్‌పాండే అమెకొక కొబ్బరికాయ, రవిక గుడ్డ, పసుపు-కుంకుమ ఇచ్చి, "వీటిని బాబా మీకు పంపారు" అని చెప్పాడు. 

ఇకపోతే శ్రీనారాయణ్ దాదాజీకి వచ్చిన కలలో బాబా అతని ఎదుట నిలబడి, "మేము హార్దా వెళ్తున్నాము. నీవు కూడా మాతో రా!" అని అన్నారు. తరువాత వారిద్దరూ గోదావరి నది ఒడ్డున నిలబడి ఉన్నారు. నదిలో నీటిప్రవాహం సాధారణ స్థాయి కంటే ఎక్కువగా ఉంది. వారు నిలిచిన ప్రదేశానికి సమీపంలో రెండు గోనెసంచులతో గోధుమలున్నాయి. బాబా అతనితో, "ఇప్పుడు మనం ఎలా నదిని దాటబోతున్నాం?" అని అడిగారు. అంతలో హఠాత్తుగా పది ఎద్దులు బరువు మోసుకెళ్తూ కనిపించాయి. దానితోపాటు ఒక చక్కటి రహదారి కూడా కనిపించింది. బాబా, దాదాజీలతోపాటు ఎద్దులు కూడా హార్దాలో సాధూభయ్యా (జెండా కట్టబడిన) ఇంటివరకు వచ్చాక బాబాతోపాటు ఆ ఎద్దులు అదృశ్యమయ్యాయి. ఆ విధంగా బాబా హార్దాలో తమ సంస్థానాన్ని స్థాపించారు. ఈ కార్యానికి ముక్తారాంను మాధ్యమంగా చేసుకున్నారు బాబా.

బాబా ముక్తారాంకి ఒక కఫ్నీని మరియు ఒక తలగుడ్డను ఇచ్చారు. అదే అతని రోజువారీ వస్త్రధారణ. అతని జీవన విధానంలో, మాట, హావభావాలలో బాబాతో పోలికలుండేవి. అందువలన కొంతమంది అతడు బాబాను అనుకరించడానికి ప్రయత్నిస్తున్నాడని భావిస్తుండేవారు. ఆ కారణంగా ముక్తారాం పట్ల ఉన్న గౌరవం స్థానే వాళ్లలో క్రమంగా అపార్థం, ద్వేషం చోటుచేసుకున్నాయి. అందువలనే కొన్ని వ్యాసాలలో ముక్తారాం గురించి ప్రతికూల కథనాలు వెలువడ్డాయి. అటువంటి కొన్ని కథనాలను ఇప్పుడు పరిశీలిద్దాం.

ముక్తారాం మరణానికి ముందు జరిగినట్లుగా రెండు విభిన్న కథనాలు వెలువడ్డాయి. వాటిలో ఒకటి అతని గురించి చెడు కోణాన్ని చూపిస్తే, రెండోది ఆ మచ్చని తొలగించేది. మొదటి రకానికి సంబంధించిన కథనాలు శ్రీసాయి సచ్చరిత్రలో, 'శ్రీసాయినాథ ప్రభ' అనే పత్రికలో వెలువడ్డాయి. 'శ్రీసాయినాథ ప్రభ' పత్రిక ప్రచురణ 1916లో పూణే నుండి ప్రారంభమైంది. శ్రీ సుందర్రావు నారాయణ్ దాని సంపాదకుడు. ఆ పత్రికను రావుబహదూర్ హరి వినాయక్ సాఠే స్థాపించిన దక్షిణ భిక్ష సంస్థ నిర్వహిస్తుండేది.

(1) 'శ్రీసాయినాథ ప్రభ' పత్రిక నుండి వెలువడిన కథనం:

ముక్తారాం బాబా ప్రవర్తనను అనుకరిస్తుండేవాడు. బాబా సమాధి చెందిన తరువాత, ఆయన స్థానాన్ని ఆక్రమించాలని అతడు తలపోశాడు. నెమ్మదిగా అతనిలో మార్పు చోటుచేసుకుంది. ఒకరోజు అతను నేరుగా వెళ్లి బాబా ఆసనంపై కూర్చున్నాడు. చాలామంది సన్నిహిత సాయిభక్తులు అందుకు నిరసన వ్యక్తం చేశారు. కానీ అతను, "బాబా స్వయంగా నన్ను ఈ ఆసనంపై కూర్చోమని చెప్పారు. నేను ఆయన వారసుడిని” అని చెప్పాడు. అయితే, కొద్దిసేపట్లో అతనికి క్రింద నుండి సూదులు గుచ్చుతున్నట్లుగా అనిపించి, రక్తం కారసాగింది. వెంటనే అతను ఆసనాన్ని ఖాళీ చేశాడు. కానీ, సూదులు గుచ్చుకుంటున్నట్లు ఉండటం, రక్తం కారడం ఆగలేదు. సుమారు 7-8 రోజులలో అతను శ్రీసాయిని క్షమాపణ వేడుకుని భరించలేని బాధను అనుభవిస్తూ మరణించాడు.

2) శ్రీ సాయి సచ్చరిత్ర (ముందు రెండు మాటలు)లో ఇవ్వబడిన కథనం:

శ్రీసాయినాథులు సమాధి చెందిన రెండవరోజు ముక్తారాం అనే భక్తుడు అక్కడి ప్రజలతో, "శ్రీసాయిబాబా ద్వారకామాయిలో తమ స్థలంలో నన్నే కూర్చోమని ఆజ్ఞాపించారు, నేనే వారి వారసుణ్ణి" అని చెప్పాడు. తాత్యాపాటిల్, శ్రీ రామచంద్రపాటిల్ మొదలగువారు అలా చేయవద్దని ఎంతగా నచ్చచెప్పినప్పటికీ అతడు ఎవరి మాటా వినకుండా వెళ్లి ద్వారకామయిలో బాబా గద్దెపై కూర్చున్నాడు. కాసేపటికి అతనికి క్రింద నుండి సూదులు గ్రుచ్చుకుని రక్తం కారసాగింది. అతనిని తన నివాసమైన దీక్షిత్ వాడాకి తీసుకువెళ్లారు. చివరికి 7-8 రోజుల్లో అతడు భయంకరమైన స్థితిలో శ్రీసాయిని క్షమాభిక్ష వేడుకుని ప్రాణం విడిచాడు. ఇట్లే అధికారాన్ని చాటుకునే మరో ముగ్గురు, నలుగురు గృహస్తులు ముక్తారాంకి జరిగినది చూచి వేరే చోటుకి వెళ్ళిపోయారు. ఇలా ఎవరైనా తాను ఏదో గొప్ప మహారాజు అనుకుని పెత్తనం చలాయించబోతే, 'నా సమానంగా ప్రవర్తించాలని చూస్తావా?' అని శ్రీసాయి తగిన శాస్తి చేసేవారు. అయినా ఈనాడు కొందరు, "శ్రీసాయియే నాలో అవతరించారు" అని ప్రజలను మోసపుచ్చి తమ పాదాలపై పడేలా చేసుకుంటున్నారు. సద్గురువుతో సమానంగా ఉండాలన్న సాహసం చేసిన వారి పరిస్థితి చివరికి ఏమవుతుందో అని తెలియజేయడానికి ముక్తారాంకి జరిగిన సంఘటనే ఉదాహరణ.

ఇలాంటిదే మరో కథనం:

ముక్తారాం సమర్థ సాయినాథుని ఆసనాన్ని తాకిన క్షణాన అతని కడుపులో భరించలేని నొప్పి పుట్టింది. మందులు, నివారణోపాయాలేవీ అతనికి సహాయపడలేదు. దాంతో అతను క్షమించమని సాయినాథుని ఆసనం ముందు ప్రార్థించాడు కానీ, ప్రయోజనం లేకపోయింది. రెండురోజుల తరువాత అతి దారుణమైన స్థితిలో అతను మరణించాడు.

ఈ విధమైన కథనాలు చదివిన తర్వాత ముక్తారాంపై ఎవరికైనా చెడు అభిప్రాయం కలగడం సహజం. కానీ అందులో నిజానిజాలెంతో ఇప్పుడు తెలుసుకుందాం.

'శ్రీ సాయినాథ ప్రభ' పత్రికలో ప్రచురింపబడిన కథనాన్ని చదివిన ఒక సాయిభక్తుడు ముక్తారాం వంటి గొప్ప భక్తునిపై ఇటువంటి అపవాదు రావడాన్ని తట్టుకోలేకపోయాడు. ఆ కథనంలోని అవాస్తవికతను తెలియజేస్తూ అతను వివరణాత్మకంగా పత్రిక యాజమాన్యానికి 'మిత్ర' అనే కలం పేరుతో ఒక లేఖ వ్రాశాడు. అది ఇలా ఉంది:

'శ్రీ సాయినాథ్ మహరాజాంచ్యా ఆఖ్యాయిక’(శ్రీ సాయినాథ్ మహారాజ్ యొక్క ఇతిహాసాలు) అనే వ్యాసం చదివిన తరువాత నేను మీతో కొన్ని విషయాలు చెప్పాల్సిన అవసరం ఉందని భావించాను. అందువల్ల ఈ లేఖను మీకు పంపుతున్నాను".

"ముక్తారాం అనే భక్తుని మరణానికి సంబంధించి మీరు ప్రచురించిన కథ వాస్తవం కాదు. శ్రీసాయి సమాధి చెందడానికి మూడునెలల ముందునుండే ముక్తారాం దగ్గు, జ్వరంతో బాధపడుతుండేవాడు. ఆ అనారోగ్యంతో అతడు తన గదిలోనే ఉంటుండేవాడు. శ్రీసాయి సమాధి చెందిన 8-9 రోజుల తర్వాత అతను మసీదుకు వెళ్ళాడు. 24 గంటలలోపే అతడు తన గదికి తిరిగి వెళ్ళిపోయాడు. అతడసలు బాబా గద్దె మీద కూర్చోలేదు, కనీసం సాధారణంగా బాబా తమ చేయివేసుకునే అడ్డచెక్కను కూడా తాకలేదు. అతను ఎక్కడో మధ్యలో ఉన్న ఒక స్తంభం వద్ద అంకెం మీద కూర్చున్నాడు. ఆ సమయంలో కొందరు బాబా గద్దెపై అతడు కూర్చోవాలని ప్రణాళిక చేస్తున్నాడని అనుకున్నారు. మీరు ప్రచురించిన కథనాన్ని రచించిన రచయిత కూడా అలాంటి వ్యక్తులలో ఒకరై ఉంటారు. కానీ ముక్తారాం అక్కడినుండి తన గదికి వెళ్లిపోవడంతో అక్కడున్న వారి సందేహాలన్నీ తీరిపోయాయి. ముక్తారాం తన గదికి తిరిగి వచ్చిన తరువాత నేనతనితో, "మీరెందుకు మశీదుకు వెళ్లి, త్వరగా తిరిగి వచ్చారు?" అని ప్రశ్నించాను. దానికతను, "నాకేమీ బాగోలేదు. నేను చాలా బాధపడుతూ ఉన్నాను. మశీదుకెళ్ళి కూర్చుని శ్రీసమర్థుని ప్రార్థించినట్లైతే కొంత ఉపశమనం పొందుతానని అనుకున్నాను. కానీ ఎక్కువ సమయం కూర్చోవడం నాకు సాధ్యపడే పనికాదు. ఎందుకంటే నా జబ్బు కారణంగా నేను పదేపదే కఫం ఉమ్మి వేయాల్సి వస్తుంది. కనుకనే నేను తిరిగి నా గదికి వచ్చేశాను" అని చెప్పాడు. అప్పటినుండి అతని ఆరోగ్యం త్వరితగతిన క్షీణించసాగింది. సుమారు రెండు, రెండున్నర నెలల తరువాత 1919, జనవరి నెలలో అతడు టి.బి. కారణంగా మరణించాడు".

"ఇకపోతే రెండవ విషయం, మీ పత్రికలో ప్రచురించబడిన వ్యాసం శ్రీసాయి సమర్థులకి వాత్సల్యం లేదని, ఆయన క్రూరులనే అభిప్రాయాన్ని సృష్టించే అవకాశం ఉంది. కానీ ఈ రచయిత(నేను), అనేక ఇతర భక్తులు అందుకు విరుద్ధంగా ఆయన వద్ద అనుభూతి పొందాము. శ్రీసాయి సమర్థులు దయకు, క్షమకు నిలయం. ఆయన తన భక్తులను సొంత బిడ్డల్లా చూసుకున్నారు. తప్పు చేసిన వ్యక్తికి శిక్ష అనేది చాలా స్వల్పంగా ఉండేది".

తరువాత శ్రీసాయినాథ్ ప్రభ పత్రిక సంపాదకుడు తమ పత్రికలో పై లేఖను ప్రచురించి, దానితోపాటు ఈవిధంగా సవరణ ఇచ్చారు: -

"మేము మా మునుపటి సంచికలో శ్రీ ముక్తారాం మరణం గురించి ఒక కథనాన్ని ప్రచురించాము. దానిని శిరిడీకి చెందిన ఒక సీనియర్ భక్తుడు వ్రాశారు. మేము దానిని ప్రచురించడానికి ఒక మాధ్యమం మాత్రమే. మాకు ముక్తారాంకి సంబంధించిన పూర్వాపరాలేవీ తెలియవు. మా స్నేహితుడు(పై లేఖ వ్రాసిన వ్యక్తి) సరైన సమాచారాన్ని అందించారు. అతనికి మేము కృతజ్ఞులమై ఉంటాము."

ఆ లేఖను శ్రీసాయిలీలా పత్రికలో కూడా ప్రచురించి, ఆ పత్రిక సంపాదకుడు ఇలా పేర్కొన్నాడు: -

"బాబా సమాధి అనంతరం శిరిడీ సందర్శించే క్రొత్త భక్తులు అప్పటి భక్తుల గురించి, అప్పట్లో జరిగిన సంఘటనల గురించి వింటూ ఉంటారు. నోటి మాట ద్వారా వినే అటువంటి కథలలోని విశ్వసనీయతకు సంబంధించి భక్తులు సొంతంగా ఆలోచించి నిర్థారించుకోవడం అవసరం. ఆ కారణం చేతనే పై లేఖను ప్రచురించాము".

పై మూడు కథల గురించి కొంత ఆలోచన చేసినట్లయితే, అందులో ఎన్ని అసత్యాలు దాగి ఉన్నాయో తెలిసే అవకాశం ఉంది.

శ్రీ ముక్తారాం ఖచ్చితంగా ఏరోజు మసీదుకు వెళ్ళాడు అన్న దాంట్లో కొంత గందరగోళం ఉంది. మొదటి కథలో ‘ఒకరోజు’ అని ప్రస్తావించగా, రెండవ, మూడవ కథలలో 'బాబా సమాధి చెందిన తర్వాత రెండవరోజు’ అని ప్రస్తావించాయి. అతడు వెళ్ళిన ఖచ్చితమైన రోజు ఏదన్న స్పష్టత లేదు.

మొదటి, రెండవ కథలలో ముక్తారాం శ్రీసాయి ఆసనంపై కూర్చున్న తరువాత క్రింద నుండి సూదులు గుచ్చుకోవడంతో రక్తం కారడం మొదలైందని, ఆ బాధతో అతడు మరణించినట్లు ఉంది. కానీ మూడవ కథలో అతను భరించలేని కడుపునొప్పితో మరణించినట్లు చెప్పబడింది. ఇలా అతని మరణానికి విరుద్ధమైన కారణాలను చూపుతున్నాయి ఈ కథలు.

ఇకపోతే అతి ముఖ్యమైన విషయం అతని మరణించిన సమయానికి సంబంధించినది. మొదటి రెండు కథలు "అతను 7-8 రోజుల తరువాత చనిపోయాడు" అని చెప్పబడింది. మూడవ కథలో "అతను రెండు రోజుల తరువాత మరణించాడు" అని చెప్పబడింది. ఈ రెండిటిలో ఏది నిజమైనా, అతడు 1918, అక్టోబరు నెలలోనే మరణించి ఉండాలి. కానీ ముక్తారాం టి.బి. వ్యాధితో బాధపడుతూ 1919, జనవరి నెలలో మరణించాడన్న విషయం వాస్తవం. ముఖ్యంగా ఈ విషయంలో చెప్పుకోవాల్సింది పై లేఖ వ్రాసిన వ్యక్తి గురించే, అతనీ విషయంలో ప్రత్యక్ష సాక్షి. ఎందుకంటే బాబా మహాసమాధి అనంతరం 8 లేదా 9వ రోజు ముక్తారాం మశీదుకు వెళ్లి తిరిగి తన గదికి వచ్చిన తర్వాత ఇతడు ప్రత్యక్షంగా ముక్తారాంతో మాట్లాడాడు.

సంక్షిప్తంగా చెప్పాలంటే ముక్తారాం బాబాకు అంకిత భక్తుడు. వైరాగ్యం మెండుగా ఉన్న వ్యక్తి. అతను కుటుంబ జీవితాన్ని పూర్తిగా వదులుకుని తన జీవితాన్ని బాబా పాదాల వద్ద సమర్పించుకున్నాడు. తన తుదిశ్వాస వరకూ పవిత్రమైన బాబా సన్నిధిలో గడిపి బాబాలో ఐక్యమైపోయాడు. అతని సమాధి లెండీబాగ్‌లో ఉంది. మొదట్లో అతనిని విమర్శించినవాళ్లే తరువాత అతని సమాధికి నివాళులు అర్పించడం ప్రారంభించారు. అలా జరగాలన్నది బాబా సంకల్పమే అయివుంటుంది, ఎందుకంటే బాబా సంకల్పం లేకుండా ఏదీ సాధ్యం కాదు కదా!

 sourse : “In Sai's Proximity - Muktaram” by Mugdha Divakar. Vide Sai Leela Sep-Oct 2008. Pub. Shri Saibaba Sansthan Trust, Shirdi.

5 comments:

  1. Om sai sri sai Jaya Jaya sai, om sai sri sai Jaya Jaya sai, om sai sri sai Jaya Jaya sai, om sai sri sai Jaya jaya sai🙏🙏🙏🙏

    ReplyDelete
  2. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo