సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 308వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. సచ్చరిత్ర పారాయణతో సుఖప్రసవం
  2. ప్రమాదకరమైన టిబి వ్యాధినుండి కాపాడిన బాబా

సచ్చరిత్ర పారాయణతో సుఖప్రసవం

నేను ఒక సాయి భక్తురాలిని. నేను ఈ బ్లాగులో వచ్చే 'సాయిభక్తుల అనుభవమాలిక'ను ప్రతిరోజూ చదువుతుంటాను. 2002లో నా వివాహం జరిగింది. 2003లో నేను గర్భం దాల్చాను. ఏడవ నెలలో డాక్టరుని సంప్రదించినప్పుడు, "మీకు రక్తం చాలా తక్కువగా (5 యూనిట్లు) ఉంది. పైగా కడుపులోని బిడ్డ బరువు చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి నార్మల్ డెలివరీ అవడం కష్టమ"ని చెప్పారు. దాంతో నేను చాలా ఆందోళన చెందాను. ఒకరోజు నేను బాబా గుడికి వెళ్ళినప్పుడు అక్కడున్న పూజారితో నా పరిస్థితి చెప్పుకున్నాను. అప్పుడాయన, "నువ్వు బాబా మీద భారం వేసి ప్రతిరోజూ సచ్చరిత్రలోని 33వ అధ్యాయం చదువు" అని చెప్పారు. ఆ అధ్యాయంలో నానాసాహెబ్ చందోర్కర్ కుమార్తె మైనతాయి ప్రసవవేదన తీర్చడానికి బాబా ఊదీ పంపగా, ఊదీ మహిమతో ఆమెకు సుఖప్రసవం అయిన లీల ఉంది. పూజారిగారి సలహాననుసరించి నేను బాబాపై విశ్వాసముంచి ఆ అధ్యాయాన్ని చదవడం మొదలుపెట్టాను. బాబా కృపతో 2004, జనవరి 15, గురువారం, సంక్రాంతినాడు నార్మల్ డెలివరీ ద్వారా నాకు పాప పుట్టింది. పాప మూడున్నర కిలోల బరువుతో చాలా ఆరోగ్యంగా పుట్టింది. పాపకి మేము 'సాయి సహస్ర తేజస్వి' అని పేరు పెట్టుకున్నాము.  

2005లో నేను రెండోసారి గర్భవతినయ్యాను. ఈసారి నేను డాక్టర్ దగ్గరకు వెళ్ళలేదు, ఎలాంటి మందులూ వాడలేదు. 'బాబానే నా వైద్యుడు' అని నమ్మి బాబా గుడికే వెళ్ళేదాన్ని, బాబా చరిత్ర చదివేదానిని. 8వ నెలలో శిరిడీ వెళ్లి బాబాను దర్శించుకున్నాను. బాబా దయవలన ఈసారి కూడా గురువారం రోజునే 16 ఫిబ్రవరి 2006లో బాబు పుట్టాడు. బాబుకి 'అత్రి సాయి మహర్షి' అని పేరు పెట్టుకున్నాము. బాబా అనుగ్రహంతో పిల్లలిద్దరూ చాలా చురుకుగా ఉన్నారు. "బాబా! ఈ పిల్లలని నాకు ప్రసాదంగా ఇచ్చావు. వాళ్ళని మంచి మార్గంలో నడిపించు తండ్రీ!" అని రోజూ బాబాని ప్రార్థిస్తుంటాను. వాళ్ళు బాబా పిల్లలని తెలుసు, కానీ తల్లి మనసు కదా, ఆరాటపడుతుంటాను. 

పిల్లలు పుట్టడంలో సమస్యలున్నవారికి నేను సాయిసచ్చరిత్రలోని 33వ అధ్యాయాన్ని చదవమని చెబుతుంటాను. అలా చేయడం ద్వారా బాబా అనుగ్రహంతో వారికి చక్కని సంతానం కలుగుతుందని నా నమ్మకం.

ప్రమాదకరమైన టిబి వ్యాధినుండి కాపాడిన బాబా

నేను ఒక సాయిభక్తురాలిని. నేను మహారాష్ట్ర నివాసిని. భగవంతుడు తన బిడ్డల విషయంలో చాలా దయగలవాడని నా విషయంలో ఋజువైంది. నిజంగా సాయిబాబా గొప్ప రక్షకుడు. మరణం నుండి ఆయన నన్ను రక్షించారు. టిబి ఎంత ప్రమాదకరమైన వ్యాధో మీ అందరికీ తెలుసు. కొన్నాళ్ల క్రితం ఆ వ్యాధితో నేను చాలారోజులు బాధపడ్డాను. మొదట్లో చాలారోజుల వరకు అసలు వ్యాధి ఏమిటో తెలియలేదు. కానీ నేను చాలా అనారోగ్యంతో ఉండేదాన్ని. నా శరీరంలో రోగనిరోధకశక్తి నశించింది. నిరంతరం జ్వరం, జలుబు, తలనొప్పితో బాధపడుతూ ఉండేదాన్ని. ఆ కారణంగా సరిగ్గా తిండి తినలేక నేను చాలా బలహీనురాలినైపోయాను. నేను చాలా ఆసుపత్రులు తిరిగాను. చాలా డబ్బు ఖర్చు అయింది గానీ, నా ఆరోగ్యం మాత్రం కుదుటపడలేదు. తొమ్మిది నుండి పదినెలలు గడిచిపోయినప్పటికీ అసలు నాకొచ్చిన వ్యాధి ఏమిటన్నది వైద్యులెవరూ గుర్తించలేకపోయారు. చివరికి శరీరంలో నడవడానికి కూడా శక్తిలేని స్థితికి చేరుకున్నాను. ఆ సమయంలో మా అంకుల్ సలహా మేరకు ఒక ఆసుపత్రిని సందర్శించినప్పుడు నాకు వచ్చిన వ్యాధి భయంకరమైన టిబి అని తెలిసింది. ఒక్కసారిగా నా గుండె ఆగినంతపనైంది. అప్పటికే దాదాపు నా శరీరమంతా బ్యాక్టీరియా వ్యాపించి మొత్తం ఆరోగ్యాన్ని ప్రభావితం చేసింది. వైద్యులు 9 నెలలపాటు చికిత్స తీసుకోవాలని, వైరల్ ఇన్ఫెక్షన్ కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోమని, ముఖ్యంగా నోటిపై ఎప్పుడూ మాస్క్ ధరించాలని చెప్పారు. మొదట్లో చాలా భయపడిపోయాను కానీ ఆ భయం నన్ను ఎక్కువ ప్రభావితం చేయలేదు. ఎందుకంటే బాబా నాతో ఉన్నారనే ధైర్యం. ప్రతిరోజూ బాబాను ప్రార్థిస్తూ 11 మోతాదుల ఇంజెక్షన్లు తీసుకుంటుండేదాన్ని. 9 నెలల చికిత్స తీసుకోవడం మొదలుపెట్టి దాదాపు 6 నెలలు ముగిసేసరికి మన ప్రియమైన సాయిబాబా దయవల్ల నేను 95% కోలుకున్నాను. భారతదేశంలో రోజుకు 1.25 లక్షల మంది టిబి రోగులు మరణిస్తున్నారు. అలాంటిది నేను కోలుకుంటున్నానంటే అది కేవలం బాబాకృపే. నిజంగా ఆయన నా ప్రార్థన విని ప్రమాదకరమైన వ్యాధినుండి నన్ను రక్షించారు. ఇది నాకొక అద్భుతం. నేను ఎప్పటికీ మర్చిపోలేను. బాబా నాకు క్రొత్త జన్మనిచ్చారు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా!" ఆయన గొప్ప రక్షకుడు. ఆయన తన భక్తులకోసం ఏదైనా అద్భుతం చేయగలరు. చివరగా నేను ఒక్కమాట చెప్పాలనుకుంటున్నాను. మన గురువైన శ్రీసాయిబాబాపై దృఢమైన విశ్వాసం ఉంచండి. ఖచ్చితంగా ఆయన మన ప్రార్థనలను వింటారు, సానుకూల ఫలితాన్ని ఇస్తారు.

source:http://www.shirdisaibabaexperiences.org/2019/10/shirdi-sai-baba-miracles-part-2527.html


3 comments:

  1. Om Sai Ram 🙏🌹🙏
    ఓం శ్రీ సాయినాథాయ నమః 🙏
    ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo