సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1217వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. భవిష్యత్తు నాశనమైపోకుండా బాబా చేసిన అద్భుతం
2. ఎక్కడున్నా బాబా అనుగ్రహానికి లోటు లేదు

భవిష్యత్తు నాశనమైపోకుండా బాబా చేసిన అద్భుతం


ఓం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై!!!


"సాయినాథా! మీకు శతకోటి వందనాలు". ఈ బ్లాగు నిర్వహిస్తున్న సాయికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. సాయి భక్తులందరికీ నమస్కారాలు. నేను చిన్నప్పటినుండి శ్రీసాయిబాబా భక్తురాలిని. నాకు ఊహ తెలిసాక నేను కొలిచిన మొట్టమొదటి దైవం శ్రీసాయిబాబా. నేను ఇంతకముందు బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలు మీతో పంచుకున్నాను. ఇప్పుడు మరో అనుభవం పంచుకుంటున్నాను. కానీ ఎలా మొదలుపెట్టాలో తెలియట్లేదు. ఎందుకంటే, నా జీవితంలో ఆరోజు మరుజన్మ లాంటిది. స్వయంగా బాబానే వచ్చి నన్ను ఈ గండం నుండి బయట పడేసారనిపించింది. ఎంత పెద్ద  మిరాకిల్ జరిగిందో చదివితే సాయి భక్తులందరూ చాలా సంతోషిస్తారు. "బాబా! నాకు మంచి వాక్చాతుర్యం లేదు. అందుకే నేను వ్రాస్తున్న ఈ అనుభవాన్ని తోటి భక్తులు చదివి ఆనందించేలా, మీ మీద వాళ్లకున్న భక్తి మరింత పెరిగేలా చేయి తండ్రి".


2022, మే 16, సోమవారం. ఆ రోజు నేను ఆఫీసులో నా అలమారా చెక్ చేస్తుండగా అకస్మాత్తుగా ఎందుకో ఆఫీసర్ సర్వీస్ రిజిస్టర్(SR) బుక్ కోసం చూస్తే, అది కనిపించలేదు. ఒకటికి మూడుసార్లు బీరువా అంతా వెతికినా ఆ రిజిస్టర్ దొరకలేదు. ఇక అంతే నా కాళ్ళుచేతులు వణకడం మొదలైంది. మనసంతా ఆందోళనతో ఒకటే దుఃఖం తన్నుకొస్తుంటే, "బాబా! మొత్తమంతా వెతికినా ఆఫీసర్ గారి సర్వీస్ రిజిస్టర్ కనిపించటం లేదు. దాన్ని నేను ఎక్కడైనా పొరపాటున పెట్టి మర్చిపోయానా అంటే, అలా జరగలేదు. మరి ఎవరు దాన్ని తీసి ఉంటారు సాయి? ఎవరైనా పగతో కావాలని SR బుక్ దాచిపెట్టి నన్ను ఇబ్బందిపెట్టాలని చూస్తున్నారా? అదే జరిగితే, నా జీవితం, నా కెరీర్, భవిష్యత్తు అంతా నాశనమైపోతుంది. ఇప్పటికే చేయని తప్పుకి శిక్ష అనుభవిస్తున్నాను. ఎంతో నిజాయితీగా కష్టపడి పని చేస్తున్నా కూడా చివరికి నేను ఏమీ చెయ్యనిదానికిందికే వచ్చేసింది. ఆఫీసులో నాపై చాలా ఒత్తిడి ఉంటుంది. అయినా అన్ని పనులు సక్రమంగా నిర్వర్తిస్తూ  పోతున్నా కూడా నాకు ఎదురు దెబ్బలే తగిలాయి సాయి. ఎంతోమంది తరపున నిలిచి వాళ్ళకి మంచే చేసాను. కానీ నా వరకు వచ్చేసరికి ఏ ఒక్కరూ ముందుకి రాలేదు సాయి. అయినా నేను నా ధర్మాన్ని విడవలేదు. ఆఖరికి శత్రువుకి నా సహాయం అవసరం ఉందన్నా అన్ని మర్చిపోయి సహాయం చేస్తాను. ఎందుకంటే, నాకు మీ భయం ఎక్కువ. మీ మాట (నీతి, ధర్మం) వినట్లేదని నా మీద మీకు కోపం వస్తుందేమో, మీరు నాపై అలుగుతారేమో అని. కానీ ఈరోజు నాకు ఎందుకిలా జరిగింది సాయి? సర్వీస్ రిజిస్టర్ పోతే నా జీవితం నాశనమైపోతుందని మీకు తెలుసు కదా! మరి నన్ను ఈ గండం నుండి ఎలా బయటపడేస్తావు తండ్రి. ఎవరైనా ఆ రిజిస్టర్ తీసుంటే మాత్రం వాళ్ళ మనసు మార్చి, మళ్లీ ఆ బుక్ అక్కడే పెట్టేసేలా అనుగ్రహించండి తండ్రి. ఇక నా భారం అంతా మీదే బాబా" అని మనసులోనే బాబాను వేడుకున్నాను. 16, 17 తేదీలలో అల్మారాను మళ్ళీ మళ్ళీ వెతికాను కానీ, ఆ రిజిస్టర్ దొరకలేదు. అప్పుడే, "చింతించకు అంతా నేను చూసుకుంటాను" అన్న బాబా మెసేజ్ ఒకటి వచ్చింది. బాబా ఏదో ఒకటి చేస్తారని అనుకున్నాను.


మే 18వ తేది నుండి 22 వరకు సెలవులో ఉన్న నేను రోజూ 'ఓం శ్రీసాయి సూక్ష్మాయ నమః' అని స్మరిస్తూ, ఆ నామాన్ని 108 సార్లు వ్రాసాను కూడా. 23వ తేదీన నేను తిరిగి డ్యూటీలో జాయిన్ అయి ఆ రోజంతా కూడా సర్వీస్ రిజిస్టర్ కోసం వెతికాను కానీ, దొరకలేదు. టెన్షన్ తట్టుకోలేక 24వ తేది నుండి 30 వరకు మొత్తం 6 రోజులు సెలవు పెట్టేసాను. మొత్తం 15 రోజులు నాకు ఆనందమన్నది లేదు. రోజూ రాత్రిళ్ళు నిద్ర ఉండేది కాదు. ఎప్పుడూ ఏడుస్తూనే ఉండేదాన్ని. ఉన్నట్టుండి గుండెల్లో ఎదో పెద్ద రాయి పడినట్టు హార్ట్ బీట్ పెరిగిపోతుండేది. నేను మానసికంగా చాలా కృంగిపోయాను. బాబాకి మ్రొక్కని మొక్కులేదు. ఒకటే టెన్షన్‍తో సెలవు పూర్తయింది. 30వ తేది రానే వచ్చింది. నేను ఆరోజు డ్యూటీలో తిరిగి జాయిన్ అవ్వాలి. అంతేకాదు, ఆరోజు ఎలాగైనా SR బుక్ గురించి బయటపడాలి. నేను, 'బాబా మీద భారం వేసాను కదా, అంతా తాము చూసుకుంటామని బాబా చెప్పారు కదా' అని అనుకుంటూ ఆఫీసుకి వెళ్ళాను. మనసులో, "బాబా!  నాకు ఈరోజు మర్చిపోలేని రోజు అవ్వాలి. సంతోషంతో ఉబ్బితబ్బిబ్బు అయిపోవాలి. మిరాకిల్ జరగాలి" అనుకుంటూ బీరువా తెరిచాను. అంతే! మొట్టమొదటగా పోయిందనుకున్న ఆఫీసరు సర్వీస్ రిజిస్టర్ నా కంటపడింది. నన్ను నేను నమ్మలేకపోయాను. మళ్లీ మళ్లీ చూసాను. అది ఆఫీసర్ రిజిస్టర్ పుస్తకమే. నా శరీరమంతా షేక్ అయిపోతుంటే ఆనందం పట్టలేక ఏడ్చేసాను. ఎంత వెతికినా దొరకని బుక్ బీరువాలో పైనే ఉండటం ఎంత అద్భుతం!!


"థాంక్యూ సో మచ్ బాబా. నీ బిడ్డను కాపాడి మరో జీవితాన్ని ప్రసాదించావు. ఇంతమంచి అనుభవాన్ని ప్రసాదించినందుకు కృతజ్ఞతగా వెంటనే నా అనుభవాన్ని రాస్తున్నాను తండ్రి. నేను తెలిసీతెలియక తప్పులు చేస్తే, మనస్ఫూర్తిగా క్షమించి మీ పాదాల చెంత నాకు కొంచెం చోటు ఇవ్వు తండ్రి. నాకు ఎప్పుడూ మంచి ఆలోచనలే ఇచ్చి నీతినిజాయతీలతో ధర్మంగా జీవించేలా అనుగ్రహించు సాయి. నాకు ఎప్పుడు సమయం దొరికినా నేను మీ నామస్మరణే చేస్తూ ఉండాలి. నాకు కొంచెం  కోపం ఎక్కువ. దాన్ని నియంత్రించుకోలేక నోరు జారుతున్నాను. దయచేసి నా కోపాన్ని అదుపులో ఉండనివ్వండి. నాకు మాట్లాడడం సరిగ్గా రాదు. నా మాట తీరుతో ఎదుటివాళ్ళని అస్సలు ఆకట్టుకోలేకపోతున్నాను. నా మాటతీరు పూర్తిగా మారిపోయింది. నా భావాలు, బాధలు సరిగ్గా మీ ముందు ఉంచలేకపోతున్నాను సాయి. ప్రధానమైన నా సమస్యలు రెండు(నిజామాబాద్‍కి బదిలీ, ప్రమోషన్) మీ పాదాల చెంత ఉన్నాయి. ఈ రెండూ 2015 నుండి అలాగే ఉండిపోయాయి. 10 సంవత్సరాల నుండి నాకు నిజామాబాద్‍కి పోస్టింగ్ ఇవ్వట్లేదు సాయి. ప్లీజ్ ఒక్కసారి దాని గురించి ఆలోచించండి సాయి.  ఇకపోతే కావాలనే నాకు ప్రమోషన్ ఇవ్వట్లేదు సాయి. ఒకవేళ ధర్మంగా, న్యాయంగా ప్రమోషన్ నాకు రాసిపెట్టి ఉంటే వస్తుంది. అంతా మీ మీదే భారం వేసాను బాబా. నాకు న్యాయం జరిగేలా చూడు తండ్రి సాయి".


ఎక్కడున్నా బాబా అనుగ్రహానికి లోటు లేదు


ఓం శ్రీసాయినాథాయ నమః!!! నా పేరు సుబ్బారావు. నేను హైదరాబాదులో ఉంటున్నాను. ముందుగా మన గురువు, దైవం, మార్గిదర్శి అయిన శ్రీ సాయిబాబాకు నా ప్రణామాలు. ఈ బ్లాగు నిర్వహిస్తున్నవారికి, అనుభవాలు చదువుతున్న భక్తులకు నా నమస్కారాలు. 'మన అనుభవాలను బ్లాగులో పంచుకుంటామ'ని బాబాకి మ్రొక్కుకుంటే, ఆయన మన కర్మలను తొలగించి మన కోరికలను తీరుస్తున్నారు. నేనిప్పుడు ఒక బాబా అనుగ్రహాన్ని మీ అందరితో పంచుకుంటున్నాను. నా స్నేహితుడు ఒకరు హైదరాబాద్‌లో ఉంటున్నారు. అస్సాంలోని దుబ్రిలో అతని తల్లి ఉంటుంది. 2022, మే 16వ తేదీ రాత్రి అకస్మాత్తుగా ఆమెకి లో-బిపి వచ్చి, పల్స్ రేటు బాగా తగ్గిపోయింది. ఆ విషయం తెలిసిన నా స్నేహితుడు దాదాపు ఆశలు వదులుకుని ఉన్నపళంగా తన తల్లి దగ్గరకి వెళ్ళలేనని భయాందోళనలకు గురయ్యాడు. అప్పుడు నేను, "బాబా! ఎలాగైనా ఆమెను రక్షించండి. మీరు అనుగ్రహిస్తే, నేను మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను. మీ కృపకు నిదర్శనంగా నాకు ఫోటో రూపంలో దర్శనమిస్తే, నేను నా స్నేహితునికి తన తల్లికి ఏమీ కాదన్న విశ్వాసం ఇవ్వగలను" అని బాబాను ప్రార్థించాను. అప్పుడు నేను బస్సులో ప్రయాణిస్తున్నాను. ఆ సమయంలో బాబా నాకు దర్శనమిచ్చే అవకాశం లేదు. కానీ బాబా చేసిన అద్భుతాన్ని చూడండి. నేను కాసేపటికే నిద్రపోయాను. బాబా నాకు కలలో దర్శనమిచ్చి 'అంతా బాగుంటుంద'ని సూచించారు. నా స్నేహితుడు కలకత్తా, గౌహతిల మీదుగా మరుసటిరోజు సాయంత్రానికి దుబ్రి చేరుకున్నాడు. బాబా దయవల్ల అతని తల్లి బాగానే ఉంది. వెంటనే నా స్నేహితుడు ఆమెను డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాడు. అన్ని పరీక్షలు చేసిన మీదట డాక్టరు ఆమెకు గుండెకు సంబంధించిన సమస్య ఉన్నట్లు గుర్తించి, "వెంటనే ఆమెను గౌహతికి తీసుకుని వెళ్లి, తప్పనిసరిగా స్టెంట్ వేయించాల"ని చెప్పారు. ఇప్పుడు ఇంకో సమస్య ఏమిటంటే, చికిత్స మరియు ఇతరత్రా ఖర్చులకు దాదాపు 3 లక్షల రూపాయలు అవసరమవుతాయి. కానీ ఆ డబ్బు ఏవిధంగానూ సమకూరని పరిస్థితి. అయితే బాబా మళ్ళీ అద్భుతం చేసారు. మా జీతాలు ICICI బ్యాంక్‌లో క్రెడిట్ చేయబడ్డాయి. సరిగా ఆ రోజే మా మొబైల్‌ నుండి నేరుగా పర్సనల్ లోన్ పొందే సదుపాయాన్ని బ్యాంకు కొత్తగా ప్రవేశపెట్టింది. ఇది నిజంగా అద్భుతం. బాబా అనుగ్రహం తప్ప మరొకటి కాదు. బాబా దయవల్ల ఆమెకి విజయవంతంగా స్టెంట్ వేశారు డాక్టర్లు. ఒక వారం తర్వాత ఆమెను దుబ్రికి తరలించారు. ఇదంతా కేవలం బాబా అనుగ్రహం వల్లనే జరిగింది. ధన్యవాదాలు బాబా.


సాయిభక్తుల అనుభవమాలిక 1216వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. ఆరోగ్యాన్ని ఒసగిన బాబా
2. బాబాను నమ్ముకుంటే, తప్పకుండా మంచి జరుగుతుంది
3. బాబా దయతో అందిన డబ్బులు - తగ్గిన నొప్పి

ఆరోగ్యాన్ని ఒసగిన బాబా


నేను ఒక సాయి భక్తురాలిని. ముందుగా నా అనుభవాలను ఈరోజు మీ అందరితో పంచుకునే అవకాశమిచ్చిన సాయినాథునికి పాదాభివందనాలు. సాయి బంధువులకు నమస్కారం. భయం వేయగానే బాబా తరపు వారధిలా ధైర్యాన్నిస్తున్న మరియు కోరికలు తీరిన వెంటనే మా అనుభవాలను ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగానైనా అందరితో పంచుకునే అవకాశం కల్పిస్తున్న బ్లాగు నిర్వాహకులకు అనేకానేక ధన్యవాదాలు. నిజానికి బ్లాగును ఇంత బాగా నడిపిస్తున్న మీకు ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. ఇక నా అనుభవాల విషయానికి వస్తే...  


2022, మే నెల చివరి వారంలో మా అమ్మాయి మెడకి కాస్త పక్కగా చిన్న గడ్డలా వచ్చింది. ముందు మేము దాన్ని మామూలు సెగ్గడ్డ అనే అనుకున్నాం. కానీ అది తగ్గలేదు. పైగా ఏదో ఒక బిళ్ళలా అయి కొంచెం గట్టిగా ఉండేసరికి నాకు భయం వేసింది. వెంటనే మావారు పాపని హాస్పిటల్‍కి తీసుకెళ్లారు. నేను, "బాబా! ఆ గడ్డ తగ్గడానికి మందులు ఇప్పించి, దానివల్ల సమస్య ఉండదు అనేలా చూడండి. నేను నా అనుభవాన్ని తోటి భక్తులతో పంచుకుంటాను" అని బాబాకి దణ్ణం పెట్టుకున్నాను. డాక్టర్ ఆ గడ్డని చూసి, "ఇది సేబాషియస్ తిత్తి(రసికారు గడ్డ) దీనివల్ల సమస్య ఉండదు. దీనికి ఇవ్వడానికి మందులు ఉండవు. ఒకవేళ ఇది పెరిగినా, నొప్పిగా ఉన్నా లేదా రంగు మారినా కట్ చేసి తీసేయాలి" అని అన్నారు. మావారు ఇంటికి వచ్చాక ఇటువంటి గడ్డకు హోమియోపతిలో మందు ఉంటుందని తెలుసుకుని డాక్టరుని అడిగితే, ఆమె మందు ఇచ్చారు. ఆ మందు వాడాక ఆ గడ్డ కొంచం తగ్గి ఇప్పుడు పాపకి బాగుంది. అంతా బాబా దయ. నాకు చాలా సంతోషంగా ఉంది. 'సమర్థ సద్గురు శ్రీసాయినాథ్ మహరాజ్ కీ జై'!!!


2022, మే నెల చివరి వారం మొదలు నుండి నాకు విపరీతమైన గొంతునొప్పి ఉంటే అజిత్రోమైసిన్ టాబ్లెట్లు వేసుకున్నాను. కానీ నొప్పి నుండి నాకు ఉపశమనం రాలేదు. అయినా ఎక్కువగా యాంటిబయోటిక్స్ తీసుకోకూడదని టాబ్లెట్లు వేసుకోవడం ఆపేసాను. ఒక రెండు రోజులు బాగున్నట్లే అనిపించి తరువాత మళ్ళీ నొప్పిగా అనిపించింది. అసలే నాకు సైనస్ ప్రాబ్లం ఉంది. పైగా ఇక్కడ దుబాయ్‍లో ఇసుక తుఫాన్లు వస్తుంటాయి. అందువల్లే ఇబ్బందేమో అనుకుని హోమియోపతి మందులు వాడటం మొదలుపెట్టాను. అయినా పెద్దగా ఉపశమనం కనిపించలేదు. ఇలా ఉండగా ఆదివారంనాడు మావారు తన స్నేహితుల కుటుంబాలను లంచ్‍కి పిలిచారు. ఆ మరుసటిరోజు వాళ్లలో ఒకరికి ఒంట్లో బాగోలేక టెస్టు చేయించుకుంటే, కోవిడ్ పాజిటివ్ వచ్చింది. ఇంకో రెండు రోజులకి ఇంకొకరు కూడా అలాగే ఒంట్లో బాగోలేక టెస్టుకి వెళ్తే, తనకి కూడా కోవిడ్ పాజిటివ్ వచ్చింది. అది తెలిసి మాకు చాలా భయమేసింది. నేను, "ఇలా అయింది ఏమిటి బాబా?" అని అనుకుని ఒకవేళ నావల్ల వాళ్ళు కోవిడ్‍తో బాధపడుతున్నారా అన్న అనుమానంతో టెస్టుకి వెళ్తే, నాకు నెగిటివ్ వచ్చింది. కానీ, "బ్లడ్‍లో ఇన్ఫెక్షన్ ఉండటం వల్ల నొప్పి వస్తుంద"ని చెప్పి డాక్టర్ నాకు మందులు ఇచ్చారు. తరువాత మావారికి కూడా గొంతులో కొంచెం తేడాగా, అలాగే కొంచం ఒళ్లునొప్పులుగా అనిపిస్తే, టెస్టుకి ఇచ్చారు. ఆయనకి కూడా కోవిడ్ పాజిటివ్ వచ్చింది. నేను బాబా దగ్గర, "వాళ్లందరికీ నా వాళ్లే కోవిడ్ వచ్చిందో లేక ఇంకా ఎక్కడ నుండైనా వచ్చిందో అర్థం కావట్లేదు బాబా. తొందరగా అందరికీ తగ్గేలా చూడు తండ్రి. ఈ అనుభవాన్ని కూడా బ్లాగులో పంచుకుంటాను" అని చెప్పుకుని బాధపడ్డాను. బాబా దయవల్ల మావారి స్నేహితుల్లో ఒకరికి ముందు నెగిటివ్ వచ్చింది. మా వారికి, ఇంకో ఆయనకి ఆరోగ్యం మామూలుగానే ఉండటంతో వాళ్ళకి కూడా నెగిటివ్ వస్తుందనే ధైర్యంతో ఉండగా వాళ్ళకి కూడా నెగిటివ్ వచ్చింది. బాబా దయవల్ల ఇప్పుడు అందరూ బాగున్నారు. ఇలా బాబా మమ్మల్ని కరోనా నుండి రెండుసార్లు కాపాడారు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!


బాబాను నమ్ముకుంటే, తప్పకుండా మంచి జరుగుతుంది


నేను గత 22 సంవత్సరాలుగా బాబా భక్తురాలిని. నా జీవితంలో బాబా అడుగడుగునా ఉంటూ నాకు ఎన్నో అనుభవాలు ప్రసాదించారు. వాటిలో నుంచి మీతో పంచుకుంటానని బాబాకి మాటిచ్చిన కొన్ని అనుభవాలను నేనిప్పుడు మీతో పంచుకుంటాను. 2022లో  ఒకరోజు హఠాత్తుగా మా అమ్మకి తీవ్రమైన జ్వరం వచ్చింది. అసలే అమ్మ ఆరు సంవత్సరాలుగా మంచానికి పరిమితమై ఉంది. అందువలన మేము చాలా భయపడ్డాము. హాస్పిటల్‍కి తీసుకుని వెళితే బిపి చెక్ చేసి, "190 ఉంది" అని అన్నారు. ఇంకా సిటీ స్కాన్ చేసి, "కిడ్నీలో రాళ్లు ఉన్నాయి. కానీ ఈ స్థితిలో ఆమెకు ఆపరేషన్ చేయడం ప్రమాదమ"ని డాక్టర్లు చెప్పారు. నేను బాబాకు దణ్ణం పెట్టుకుని, “బాబా! అమ్మని ఇబ్బందిపెట్టకు. తనకి తొందరగా నయమయ్యేలా చేయండి. మీ కృపతో తనకి నయమైతే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని వేడుకున్నాను. బాబా దయవలన అమ్మ ఇప్పుడు కొంచంకొంచంగా కోలుకుంటున్నారు. "ధన్యవాదాలు బాబా. ఏమి చేసినా మీ ఋణం తీర్చుకోలేము. నాన్నగారి 75 సంవత్సరాల పుట్టినరోజు వేడుకలు చేయాలని అనుకుంటున్నాము బాబా. దానికి ఏ ఇబ్బంది లేకుండా ఉండేలా మీ ఆశీస్సులు కావాలని మిమ్మల్ని వేడుకుంటున్నాను తండ్రి".


2022, జనవరిలో నాకు, నా పిల్లలకి జ్వరం వచ్చింది. కోవిడ్ టెస్టు చేయిస్తే, 'పాజిటివ్' అని చెప్పారు. నాకు చాలా భయమేసి, "బాబా! మీ దయతో మేము తొందరగా కోలుకుంటే, బ్లాగులో పంచుకుంటాన"ని బాబాకు చెప్పుకున్నాను. బాబా దయవల్ల ఒక్క వారంలో మాకు నెగిటివ్ వచ్చింది. అంతేకాదు బాబా ఆశీస్సులతో పిల్లల పుట్టినరోజు వేడుకలు బాగా జరుపుకున్నాము.


మాకు కొన్ని ఆర్థిక సమస్యలొచ్చి, వాటినుండి బయటపడటానికి నేను కర్నూలులో మాకున్న ప్లాట్లు అమ్మాలనుకున్నాను. ఆ విషయంలో బాబా నాకు ఎంతో సహాయం చేసారు. ఇవి కాకుండా నాకు చాలా ఆర్థిక, శారీరక, మానసిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి వాటినన్నిటినీ నేను ధైర్యంతో సహిస్తూ, "మా సమస్యలను పరిష్కరించమ"ని శ్రీసాయిబాబాను ప్రార్థిస్తూ సాయిచరిత్ర పారాయణాలు చేశాను, చేస్తూనే ఉన్నాను. నవ గురువార వ్రతం కూడా చేశాను. బాబా ఎంతో కరుణతో మా సమస్యలన్నిటినీ తీరుస్తున్నారు. బాబాను నమ్ముకుంటే, మనకు తప్పకుండా మంచి జరుగుతుందని అనటానికి ఇవే పూర్తి నిదర్శనాలు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా! పెద్ద అబ్బాయి ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు మంచిగా వ్రాసేలా దీవించావు తండ్రి. ఇలాగే తను రెండవ సంవత్సరం కూడా శ్రద్ధగా చదివి మంచి మార్కులతో ఉత్తీర్ణుడయ్యేలా ఆశీర్వదించండీ బాబా. ఇంకా నీట్‍లో మంచి ర్యాంకు సాధించేలా తనకి మార్గనిర్దేశం చేయండి బాబా. మాకున్న రెండు ప్లాట్లలో కొన్నిరోజులుగా కొన్ని సమస్యలు వస్తున్నాయి. మీ దయవల్ల తొందరగా అవి పరిష్కారమవ్వాలని మిమ్మల్ని వేడుకుంటున్నాను తండ్రి. ఇంకా నేను ఒక చోట ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాను. దయచేసి తొందరగా అక్కడున్న సమస్యలు తొలగించి నా కోరిక తీరేలా ఆశీర్వదించండి బాబా".


సర్వం శ్రీసాయినాథార్పణమస్తు!!!


బాబా దయతో అందిన డబ్బులు - తగ్గిన నొప్పి


శ్రీసాయినాథ్ మహరాజ్ కీ జై!!! నా పేరు రవీంద్ర. నేను చాలా సంవత్సరాల నుండి సాయి భక్తుడిని. నేను చేసిన పనికి గానూ నాకు కొంత డబ్బు రావాల్సి ఉండగా, "బాబా! నాకు రావాల్సిన డబ్బు వచ్చేటట్లు చేయండి. మీ అనుగ్రహంతో నా డబ్బులు నాకు వస్తే, ఆ అనుభవం బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి మ్రొక్కుకున్నాను. బాబా దయవలన నా డబ్బులు నాకు వచ్చాయి.


2022, జూన్ 2 రాత్రి నా ఛాతి పైభాగంలో నొప్పి వస్తే, "బాబా! మీ దయవలన నొప్పి తగ్గితే, బ్లాగులో పంచుకుంటాను" అని మ్రొక్కుకుని నొప్పి ఉన్న చోట బాబా ఊదీ రాసుకుని, మరికొంత ఊదీ నీళ్లలో కలుపుకుని త్రాగి పడుకున్నాను. బాబా దయవలన నొప్పి తగ్గిపోయింది. మర్నాడు ఉదయం కొద్దిగా కండరం నొప్పిగా అనిపించినప్పటికీ బాబా దయతో అది కూడా తగ్గిపోయింది. "ధన్యవాదాలు బాబా. మూడు సంవత్సరాలుగా నేను ఉదోగ్యం కోసం ఎదురు చూస్తున్నాను. మీ దయవలన ఉదోగ్యం వస్తే నా అనుభవం బ్లాగులో పంచుకుంటాను. భక్తులందరికీ మీ ఆశీస్సులు ఉండాలని వేడుకుంటున్నాను తండ్రి"


సాయిభక్తుల అనుభవమాలిక 1215వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. పునర్జన్మను ప్రసాదించిన గొప్ప దేవుడు శ్రీశిరిడీ సాయిబాబా
2. బాబా ఉండగా మనకు చింత ఏల?
3. శరణువేడితే అండగా నిలబడతారు బాబా

పునర్జన్మను ప్రసాదించిన గొప్ప దేవుడు శ్రీశిరిడీ సాయిబాబా


నా పేరు సాయి రాజ్‍‍కుమార్. మాది వరంగల్ జిల్లా. నా చిన్నప్పుడే మా అమ్మ చనిపోయింది. నా పద్దెనిమిదో ఏట అంటే సరిగ్గా 24 సంవత్సరాల క్రితం శ్రీ శిరిడీ సాయినాథుని దివ్య ఆశీస్సుల వలన ఒక అత్తమ్మగారి ఇంట్లో నాకు బాబా దివ్య దర్శనమైంది. నేను ప్రప్రధమంగా ఆశీర్వదిస్తూ ఉన్న నిలువెత్తు  సాయిబాబా ఫోటోను వారింట్లో చూశాను. అప్పుడు అత్తమ్మ, "బిడ్డా! నీ జీవితం బాగుపడితే, బాబాను దైవంగా కొలుచుకుంటానని, మంచిగా ఉంటానని బాబాకి మ్రొక్కుకో" అని అన్నారు. అప్పటినుండి నేను భక్తి, శ్రద్ధలతో సాయిబాబాని నిత్యం పూజిస్తూ వారి స్మరణలో ఉంటున్నాను. వారి దివ్య ఆశీస్సులతో నేను ఎన్నో మహిమలు, అనుభవాలను చవిచూశాను. గతంలో నేను మన ఈ బ్లాగు ద్వారా కొన్ని అనుభవాలు పంచుకున్నాను. ఇప్పుడు బాబా నాకు పునర్జన్మను ప్రసాదించిన గొప్ప అనుభవం పంచుకుంటున్నాను.


2010వ సంవత్సరం జూన్ నెల 30వ తేదీన వరంగల్-ఖమ్మం రహదారిలోని మామునూరు ప్రధాన రహదారి పక్కన ఉన్న నన్ను, నాతోపాటు ఉన్న మరో ఇద్దరిని ఒక కారు ఢీకొట్టింది. మేము దూరంగా రోడ్డు పక్కకి ఎగిరిపడ్డాము. అందరూ నేను చనిపోయానని అనుకునేంతలో నేను 'సాయి సాయి' అన్న నామస్మరణ చేశాను. నా దైవం సాయిబాబా నా దగ్గరకొచ్చి నా తల మీద స్పృశించి దీవించిన అనుభూతి నాకు కలిగింది. అయితే తలకి బాగా దెబ్బలు తగలడం వల్ల నేను కోమాలోకి వెళ్ళిపోయాను. కోమా నుంచి బయటికి వచ్చేసరికి హాస్పిటల్‍లో ఉన్నాను. అంటే, నేను కోమాలోకి వెళ్ళిపోయిన తరువాత పోలీసులు వచ్చి, నన్ను 108లో మా అన్నయ్య రాజు హాస్పిటల్‍కి తీసుకుని వెళ్లారు. కోమా నుండి బయటకి వచ్చిన నేను నా శరీరంలో అవయవాలేమైనా పోయాయేమోనన్న భయంతో కళ్ళు తెరవడానికి భయపడ్డాను. కానీ అలాంటిదేమీ జరగలేదు. నాకు తెలిసిన వాళ్ళందరూ "నీ సాయిబాబా నీ ప్రాణాలు పోకుండా పెద్ద ప్రమాదం నుంచి కాపాడారు. పునర్జన్మను ప్రసాదించారు. ఆయన నిజంగా దేవుడు" అని అన్నారు. నేను 'సాయిరామ్ సాయిరామ్' అని సాయి నామస్మరణ చేసుకుంటూ ఆయన మీద నమ్మకంతో ఉండసాగాను. ఐదు రోజులు తరువాత నేను క్షేమంగా హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చాను. బాబా లేకుంటే నేను బ్రతికే వాడినే కాదు. దయతో ఆయన తమ చేతి స్పర్శ ద్వారా దివ్యాశీస్సులిచ్చి నాకైన గాయాలను అదృశ్యం చేసి పెద్ద సమస్యలేమీ లేకుండా చేసారు. అలా నా ప్రాణాలు కాపాడిన సాయికి కృతజ్ఞతలు తెలుపుకోవడానికి నేను నా కుటుంబంతో అదే నెలలో బాబా దర్శనం కోసం శిరిడీ వెళ్ళాను. అక్కడ తెల్లని వస్త్రాలు ధరించి, తెల్లని గడ్డం ఉన్న ఒక వయసు పైబడిన పెద్దాయన కలిసి "బాబా దయవలన పెద్ద ప్రాణాపాయ పరిస్థితి నుంచి బయటపడ్డ అదృష్టవంతుడివి నువ్వు" అని అన్నారు. నేను ఆయనతో ఓ రెండు నిమిషాలు మాట్లాడిన తర్వాత హఠాత్తుగా ఆయన ఎటు వెళ్లిపోయారో మరి కనిపించలేదు. అంతా బాబా దయ. "సాయినాథా! మాపై ఎనలేని కరుణాకటాక్షాలు కురిపిస్తున్న మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తండ్రి. 'సాయి సాయి' అంటే ఎనలేని మహిమలు చూపే దైవం మీరు. మీరు మా జీవితంలో ఉండటం మా పూర్వజన్మ సుకృతం, ఎన్నో జన్మల అనుబంధం. సాయీ శరణం. మీరు కలరు. మీరు తప్ప ఈ లోకంలో మాకెవ్వరూ లేరు. మీరే మాకు తల్లి, తండ్రి, సర్వమూ. ఎల్లప్పుడూ మమ్మల్ని ఇలాగే దీవిస్తూ ఉండండి సాయినాథ. మీకు వేలకోట్ల ప్రణామాలు, సాష్టాంగ నమస్కారాలు. తప్పులుంటే మన్నించు, తప్పక దర్శనం ఇప్పించు శ్రీ శిరిడీ సాయీశ్వరా".


ఓం శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!

సర్వం శ్రీసాయినాథార్పణమస్తు!!!

శుభం భవతు!!!


బాబా ఉండగా మనకు చింత ఏల?


అందరికీ నమస్తే. ఇలాంటి బ్లాగుని మాకు అందించిన మీకు ఎంతో ధన్యవాదాలు సాయి. నా పేరు అరుణ. నేను ఇంతకుముందు కొన్ని అనుభవాలు మీతో పంచుకున్నాను. ఇప్పుడు మరో రెండు అనుభవాలు పంచుకుంటున్నాను. మా నాన్నగారికి 64 సంవత్సరాల వయస్సు ఉంటుంది. ఆయనకి ఈమధ్య హఠాత్తుగా కడుపునొప్పి ఎక్కువగా వస్తుంది. ఆ కారణంగా ఆయన రాత్రంతా నిద్రలేక ఇబ్బందిపడుతున్నారు. మందులు వాడినా పూర్తిగా తగ్గట్లేదు. ఒకసారి కడుపునొప్పి బాగా ఎక్కువగా ఉండటంతో నాన్న స్కాన్ చేయించుకుందామని డాక్టరు దగ్గరకి వెళ్లారు. అక్కడ స్కాన్ చేసాక డాక్టరు, "రిపోర్టులో స్పష్టంగా ఏమీ తెలియడం లేదు. ఒక గంట తరవాత మళ్ళీ స్కాన్ చేద్దాం" అని అన్నారు. ఆ విషయం నాన్న ఫోన్ చేసి ఇంట్లో చెప్పారు. ఇక ఇంట్లో అందరూ 'ఏం ప్రాబ్లెమ్ ఉంటుందో!' అని చాలా టెన్షన్ పడ్డారు. నేను బాబా మీద భారం వేసి, "బాబా! నాన్న రిపోర్టు నార్మల్ రావాలి. అలా వస్తే, ఈ అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాతో చెప్పుకున్నాను. బాబా దయవల్ల రెండు గంటల తర్వాత నాన్న ఫోన్ చేసి, "రిపోర్టు నార్మల్" అని చెప్పారు. అది విన్న నా మనసు చాలా ప్రశాంతించింది. నా బాబా నా చేయి ఎప్పుడూ వదలరు. ఆ నమ్మకం నాకు ఉంది. సాయి భక్తులందరూ కూడా నమ్మకంతో బాబాను ప్రార్థించండి. ఎలాంటి కష్టాన్నైనా ఆయన తరిమికొడుతారు.


మేము ఉండే చోటు నుండి చాలా దూరంలో మా అమ్మానాన్న ఉంటున్నారు. నాన్న కొంతమందికి డబ్బులు అప్పుగా వడ్డీకి ఇచ్చారు. వాళ్ళు ఆ డబ్బులు తిరిగి ఇవ్వకపోగా ఈరోజు మాకు శత్రువులుగా తయారయ్యారు. 64 ఏళ్ళ వయసులో నాన్న తన డబ్బులకోసం రోజూ వాళ్ళ చుట్టూ తిరుగుతున్నారు. చూడటానికి చాలా బాధగా ఉంటుంది. ఒకరోజు నాన్న తాను అప్పుగా డబ్బులిచ్చిన వాళ్ళ ఇంటికి వెళ్లి చాలాసేపైనా తిరిగి రాలేదు. ఫోన్ చేస్తే, స్విచ్ ఆఫ్ వస్తుంది. ఆయన వెళ్లిన చోటు అమ్మవాళ్ళు ఉన్న ఊరికి దగ్గరలోనే ఉంటుంది. కానీ రాత్రి పది గంటలవుతున్నా నాన్న రాకపోయేసరికి ఇంట్లో ఒక్కతే ఉన్న అమ్మ టెన్షన్ పడుతూ మాకు ఫోన్ చేసి విషయం చెప్పింది. వెంటనే నేను నాన్నకి ఫోన్ చేశాను. కానీ స్విచ్ ఆఫ్ వచ్చింది. దాంతో నేను టెన్షన్ పడుతూనే బాబాని తలుచుకుని, "బాబా! నాన్న క్షేమంగా ఇంటికి రావాలి" అని చెప్పుకుని ఆయన మీద భారం వేసాను. బాబా దయవల్ల నాన్న ఒక అరగంటలో ఇంటికి వచ్చేసారు. నాన్న తన ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందని చూసుకోలేదంట. ఏదేమైనా బాబా ఉండగా మనకు చింత ఏల? అన్ని ఆయనే చూసుకుంటారు. ఇలా నాకు సాయితో ఎన్నో అనుభవాలున్నాయి. కొన్ని మాత్రమే పంచుకున్నాను. ఆ సాయిబాబా కృప నా మీద ఉండాలని నా జీవితంలో ఎన్నో అనుభవాలు జరగాలని, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. "ధన్యవాదాలు బాబా. అన్నిటికీ మాకు మీరు ఉన్నారు. మేము మిమ్మల్నే నమ్ముకున్నాము సాయితండ్రి. మీ ఆశీస్సులు ఎప్పుడూ ఇలానే ఉండాలి. ప్రస్తుతం కుటుంబమంతా పెద్ద టెన్షన్‍లో ఉన్నాము బాబా. ఆ సమస్యను కూడా తొలగించండి. అదే జరిగితే ఆ అనుభవం కూడా బ్లాగులో పంచుకుంటాను. నాన్నవాళ్ళు తొందరగా మేము ఉండే చోటుకి వచ్చి స్థిరపడేలా చేయండి బాబా. ఇంకా ఎప్పటినుంచో నేను రెండు కోరికలు కోరుతున్నాను. అవి జరిగేలా చూడండి బాబా".


శరణువేడితే అండగా నిలబడతారు బాబా


ముందుగా బాబా మాకు ప్రసాదించే అమూల్యమైన అనుభవాలను తోటి భక్తులతో పంచుకునే అవకాశాన్నిస్తున్న ఈ బ్లాగు నిర్వాహకులకు నా ధన్యవాదాలు. నా పేరు శివకుమార్. మాది పాలకొల్లు ప్రక్కన చిన్న గ్రామం. నేను ఇంతకు మునుపు కొన్ని అనుభవాలు బ్లాగులో పంచుకున్నాను. ఇప్పుడు మరో అనుభవం పంచుకుంటున్నాను. నా భార్య రెండోసారి గర్భవతిగా ఉన్నప్పుడు కాన్పుకి నెల రోజులు ముందు తన ఒంట్లో రక్తం శాతం తక్కువ ఉందని రెండు ఇంజెక్షన్లు చేసారు. అయితే రక్త శాతం పెరగలేదు. కాన్పుకి ఐదు రోజులు ముందు కూడా రక్తం తక్కువగానే ఉంది. దాంతో డాక్టరు ఎవరైనా రక్తదానం చేసే వాళ్ళని చూసుకోమని చెప్పారు. నాకు చాలా భయమేసి బాబాని శరణువేడి, "బాబా! రక్తానికి ఇబ్బంది లేకుండా, అలాగే ఆపరేషన్ సక్రమంగా జరిగి తల్లి, బిడ్డ క్షేమంగా ఉండేలా అనుగ్రహించండి. అదే జరిగితే మీ అనుగ్రహాన్ని 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను" అని వేడుకున్నాను. ఆపరేషన్ జరిగే రోజు నేను, మా తమ్ముడు హాస్పిటల్లో ఉన్నాము. బాబా దయవల్ల ఆపరేషన్ సక్రమంగా, సురక్షితంగా జరిగింది. రక్తం అవసరం అస్సలు రాలేదు. ఇంత మేలు చేసిన బాబాకు నా ధన్యవాదాలు. నీవే దిక్కని శరణువేడితే, అండగా నిలబడతారు బాబా. 


ఓం సద్గురు శ్రీ సాయినాథాయ నమః!!!


సాయిభక్తుల అనుభవమాలిక 1214వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. శ్రీసాయి అనుగ్రహం
2. అంతా సవ్యంగా జరిపించిన బాబా
3. "నువ్వేమీ భయపడొద్దు. నా దగ్గరకి రా" అన్న సందేశంతో శిరిడీ దర్శనాన్ని అనుగ్రహించిన బాబా 

శ్రీసాయి అనుగ్రహం


బ్లాగు నడుపుతున్న సాయికి నా ప్రణామాలు. నేను ఒక సాయి భక్తుడిని. నేను ఇప్పుడు సాయి నాకు ప్రసాదించిన అనుభవాలు కొన్ని మీతో పంచుకుంటాను. ముందుగా ఆలస్యమైనందుకు బాబాకి క్షమాపణలు చెప్పుకుంటున్నాను. ఈమధ్య మేము ఒక ఇల్లు కట్టించుకున్నాము. కొంచెం పనులు మిగిలి ఉన్నప్పటికీ అద్దెకున్న ఇల్లు సరిగా లేదని గృహప్రవేశం చేసుకున్నాం. బాబా అనుగ్రహ సూచకంగా ఆ ముందురోజే మాకు శిరిడీ  నుంచి ఊదీ అందింది. ఇది మాకు మరువలేని అనుభూతి.


మేము ఆర్థిక ఇబ్బందుల వలన ఇంటి ముందు మెట్లు తరువాత పెట్టుకుందాంలే అని వదిలేసాము. అయితే పునాది ఎత్తుగా ఉండటం వల్ల అమ్మ ఒకరోజు కింద పడిపోయింది. ఆ దుర్ఘటనలో అమ్మ కాలు బెణికి చాలా లావుగా వాచి పోయింది. డాక్టరు దగ్గరకి వెళ్లొచ్చాక కొంచెం తగ్గినట్టే తగ్గి తరువాత ఇంకా ఎక్కువైంది. ఇక డాక్టరు చుట్టూ తిరగడానికే మాకు సరిపోయింది. కానీ అమ్మ తన కాలి వాపు తగ్గక చాలా వేదన అనుభవించింది. నేను ఈ బ్లాగులోని తోటి భక్తుల అనుభవాలు చదివి అందులో చెప్పినట్లుగా బాబా ఊదీ కొంచెం తీసుకుని స్ప్రేతో కలిపి అమ్మ కాలిపై మర్థించి, "అమ్మకు నయమైతే బ్లాగులో పంచుకుంటాన"ని సాయిని ప్రార్థించాను. సాయి నా మొరను ఆలకించారు. అమ్మ కాలు వాపు కొంచెం కొంచెంగా తగ్గుతూ ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయింది. "సాయీ! మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తండ్రి".


మా బంధువులలో నాకు కూతురు వరసయ్యే ఒక అమ్మాయి ఉంది. తనకి పెళ్ళై రెండు సంవత్సరాలే అయింది. కానీ తన తరువాత పెళ్లి చేసుకున్న వాళ్ళకి కూడా పిల్లలు పుట్టేస్తుంటే ఆ అమ్మాయి తను మాత్రమే గర్భవతిని కావడం లేదని చాలా బాధపడుతుండేది. నేను తన బాధ చూడలేక, "తండ్రీ! తనేమీ కోరకూడనిది కోరడం లేదు, తన కోరికలో నిజాయితీ ఉంది కదా! తనకి సహాయం చేయండి. మీ కృపతో తనకి సంతానం కలిగితే, 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాన"ని సాయిని ప్రార్థించాను. సంబంధం లేని ఇతరులు గురించి నేను ప్రార్థన చేయడం అదే మొదటిసారి. నేను ఇలా సాయిని ప్రార్థించిన విషయం తనకు చెప్పలేదు. సాయికి మాత్రమే చెప్పుకుని ఊరుకున్నాను. బాబా నా మొర ఆలకించారు. తనకి ఇప్పుడు కూతురు పుట్టింది. "సాయీ! మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తండ్రి".


నేను ఒక ముఖ్యమైన పని పూర్తవ్వాలని ఎదురు చూస్తున్నాను. దానికి సంబంధించి 'క్వశ్చన్&ఆన్సర్' వైబ్సైట్‍లో బాబా సమాధానం సానుకూలంగా వస్తుంది. కానీ నాకు ఏం ఫలితం కనిపించడం లేదు. అయినా నేను రాబోయే రెండు నెలల్లో నా సమస్య పరిష్కరిస్తారని నా సాయితండ్రి మీద ధృఢమైన నమ్మకంతో ఉన్నాను. నా వస్తువు దొరికినంతనే మరింత వివరంగా మీ ముందుకు వస్తాను. "సాయీ! ఈ ప్రాణం మీ వలనే ఇంకా ఈ భూమి మీద ఉందని మీకు గుర్తు చేస్తున్నాను. దయచేసి నాకు సహాయం చేయమని మిమ్మల్ని అర్థిస్తున్నాను తండ్రి".


ఓం సమర్ధ సద్గురు శ్రీసాయినాథాయ నమః!!!

ఓం సాయి సూక్ష్మాయ నమః!!!


అంతా సవ్యంగా జరిపించిన బాబా

 

ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి. సాయినాథుని పాదపద్మములకు నా ప్రణామాలు. ఈ బ్లాగు నిర్వహిస్తున్న వారికి, తోటి సాయి భక్తులకు నా నమస్కారాలు. నా పేరు ఉష. 2022, మే 30 ఉదయం శివునికి అభిషేకం చేయిద్దామని నేను, ప్రదక్షణాలు చేసి మొక్కు తీర్చుకుందామని నా చిన్నకొడుకు గుడికి వెళ్ళాము. నా కొడుకు ప్రదక్షణలు చేస్తుండగా నేను లైన్‍లో నిలుచుని జరుగుతున్న అభిషేకం చూస్తున్నాను. అభిషేకం పూర్తి కావస్తుందనగా ఒక్కసారిగా నాకు కళ్ళు తిరగటం, ఇంకా వాంతి వస్తున్న అనుభూతి కలగడంతో తట్టుకోలేక లైన్‍లో నుండి బయటకు వచ్చేసాను. దైవ దర్శనం కాకుండానే హాస్పిటల్‍కి వెళ్ళాల్సి వస్తున్నట్లుందని నాకు అనిపించింది. ఒక పక్క నా పరిస్థితి ఇలా ఉంటే, అవతల నా కొడుకు ఏమీ తినకుండా ప్రదక్షిణలు చేస్తున్నాడు. అసలే తను బరువు తగ్గాలని ఆహారం తీసుకోవడం తగ్గించి, బాగా నీరసించిపోయి ఉన్నాడు. అందువలన తను మొత్తం ప్రదక్షణాలన్నీ పూర్తి చేయగలడో, లేదో అని దిగులుపడ్డాను. వెంటనే నేను బాబాని, శివుణ్ణి తలుచుకుని, "తండ్రీ! నువ్వే సాయివి, శివునివి. నా దృష్టిలో అన్ని రూపాలు మీరే. మీ దయతో ఏ ఇబ్బంది లేకుండా నేను మీకు అభిషేకం, అనంతరం మీ దర్శనం చేసుకోవాలి, అలాగే నా కొడుకు మీకు ప్రదక్షణలు సవ్యంగా చేసుకోవాలి. ఆపై మేము మా ఇంటికి జాగ్రత్తగా చేరుకుంటే, నా అనుభవాన్ని ఈరోజే మీ బ్లాగుకి పంపుతాను" అని మ్రొక్కుకున్నాను. అలా మ్రొక్కుకున్నంతనే బాబా దయతో నాకు కలిగిన ఇబ్బందిని తమ చేతితో తీసి వేసినట్లుగా అనిపించింది. అంతే మళ్ళీ లోపలికి వెళ్ళి ప్రశాంతంగా స్వామి దర్మరం చేసుకుని బయటకు వచ్చాను. నా కొడుకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రదక్షణలు పూర్తిచేసి శివున్ని దర్శించుకుని వచ్చాడు. ఇద్దరమూ స్వామి ఆశీస్సులతో క్షేమంగా ఇంటికి చేరామంటే అది బాబా దయే. "ధన్యవాదాలు సాయితండ్రీ. నాకు కొన్ని సమస్యలున్నాయి. వాటినన్నిటిని పరిష్కరించి శిరిడీలో మీ దర్శన భాగ్యాన్ని మాకందరికీ ప్రాప్తింపజేయండి నాయనా. నాకు ఎన్నాళ్ళనుంచో నా కుటుంబంతో మిమ్మల్ని శిరిడీలో దర్శించుకోవాలని ఉంది తండ్రి. శిరిడీలో ఆనందంగా మీ దర్శనం చేసుకుని తర్వాత కూడ అదే ఆనందంలో మేము ఉండేలా అనుగ్రహించు తండ్రి. మనస్సు స్థిమితంగా ఉండక చెడు ఆలోచనలు(అశుభకరమైన ఆలోచనలు) వస్తున్నాయి. వాటిని తొలగించి సంతోషంగా ఉండేలా చూడు నాయనా".


శ్రీసాయినాథ్ మహరాజ్ కీ జై!!!


"నువ్వేమీ భయపడొద్దు. నా దగ్గరకి రా" అన్న సందేశంతో శిరిడీ దర్శనాన్ని అనుగ్రహించిన బాబా 


ముందుగా శ్రీసాయినాథునికి నా నమస్కారాలు. ఈ బ్లాగు నిర్వహిస్తున్న సాయి బృందానికి కృతజ్ఞతలు. నాపేరు లక్ష్మీ. నేను బెంగుళూరు నివాసిని. నేను ఇంతకుముందు కొన్ని అనుభవాలను సాయి బంధువులతో పంచుకున్నాను. 2022, ఏప్రిల్ మొదటివారంలో నేను మా చిన్నబ్బాయి కుటుంబంతో కారులో శిరిడీ వెళ్లాలని అనుకున్నాను. కానీ కొన్ని ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నందున 'నేను అంత దూరప్రయాణం చేయగలనా?' అని నాకు అనిపించింది. సరిగా అప్పుడే, "నువ్వేమీ భయపడొద్దు. నా దగ్గరకి రా" అన్న బాబా సందేశం వచ్చింది. ఆ సందేశం చూసాక చాలా ఆనందంగా అనిపించి నా సాయినాథుని దర్శనానికి బయలుదేరాను. ఆ సద్గురు సాయినాథుని దయవలన ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆయన సన్నిధి శిరిడీకి చేరుకున్నాము. మాకు కరివేన అన్నదాన సత్రంలో వసతి దొరికింది. అందరం ఫ్రెషప్ అయ్యాక నన్ను వీల్ చైర్లో దర్శనానికి తీసుకుని వెళ్లారు. నాతో ఒక్క అటెండెంట్‍ను మాత్రమే పంపుతామని చెప్పినప్పటికీ బాబా కరుణవలన మొత్తం అందరినీ నేరుగా సమాధి మందిరంలోని బాబా దర్శనానికి పంపారు. 10 సంవత్సరాల తర్వాత బాబా దర్శనం చేసుకున్న నేను పట్టలేని ఆనందాన్ని పొందాను. హృదయపూర్వకంగా బాబాకు దణ్ణం పెట్టుకుని, కన్నులనిండా ఆయన రూపాన్ని నింపుకుని సంతోషంగా బయటకి వచ్చాను. నేను ఎప్పుడో బాబాకు మ్రొక్కుకుని రాత్రిపూట అన్నం తినడం మానేసాను. అందుకని నేను ద్వారకామాయి దగ్గర అందరికి పెరుగన్నం పంచిపెట్టాను. వీల్ చైర్ వాళ్లని ఆరతికి అనుమతించరని అన్నందున నా కొడుకు, కోడలు ఆరతికి లోపలకి వెళ్లగా, నేను ద్వారకామాయి దగ్గర టీవీలో బాబా అరతి వీక్షించాను. మరునాడు ఉదయాన్నే మేము ఆనందంగా శిరిడీ నుండి బయలుదేరి బెంగుళూరుకు వచ్చేసాము. "ధన్యవాదాలు బాబా. ఈ అనుభవాన్ని పంపించడానికి ఆలస్యం చేసినందుకు నన్ను క్షమించండి బాబా. నాకున్న ఆరోగ్య సమస్యలను దయతో తొలగించమని మిమ్మల్ని వేడుకుంటున్నాను సాయితండ్రి".


సాయిభక్తుల అనుభవమాలిక 1213వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. మనవరాలు అడిగింది - తాత(బాబా)గారు తీర్చేశారు అంతే!
2. బాబా మేజిక్ - దొరికిన డైమండ్ ఉంగరం

ఓం శ్రీసాయినాథాయనమః!!!

అద్భుతానంత చర్యాయ నమః!!!


సాయి బంధువులందరికీ నమస్కారం. 'ఆధునిక సాయి సచ్చరిత్ర' - 'సాయి మహారాజ్  సన్నిధి' బ్లాగు నిర్వాహకులకు ధన్యవాదాలు. మ్రొక్కులు మ్రొక్కుకోవడం, ముడుపులు కట్టడం, అంతటితో సమస్యలు తీరడం చిన్నప్పటినుండి నాకు తెలుసు. అయితే ఈమధ్య ఏ సమస్య ఉన్నా, "శ్రీ'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగుకు నా అనుభవాన్ని వ్రాసి పంపిస్తాను బాబా" అని చెప్పుకోగానే ప్రతి సమస్య తీరిపోవడం అత్యంత ఆశ్చర్యకరం. ఆ దృష్ట్యా ఈ బ్లాగు పూర్తిగా బాబా అనుగ్రహంతో, వారి సంకల్పంతో నడుస్తున్న అభినవ డిజిటల్ 'సాయి సచ్చరిత్ర' అనటంలో సందేహమే లేదు. నా పేరు మీనాక్షి. నేనిప్పుడు అడుగడుగునా మన సమస్యలను వింటూ, పిలిచినంతనే పలుగుతూ, నేను నీతోనే ఉన్నానని నిదర్శనమిస్తూ తమపట్ల మరింత నమ్మకాన్ని, ప్రేమను పెంచుతున్న బాబా నాకు ఈ మధ్యకాలంలో ప్రసాదించిన అనుభవాలను మీతో పంచుకుంటున్నాను.


మనవరాలు అడిగింది - తాత(బాబా)గారు తీర్చేశారు అంతే!


కొద్దిరోజుల క్రిందట మేము 8 సంవత్సరాల మా పాప పుట్టినరోజు సందర్భంగా తనకి తను ఎప్పటినుండో కోరుకుంటున్న కొన్ని ఖరీదైన బొమ్మల సెట్ కొని కానుకగా ఇచ్చాము. కరోనా సమయం వల్ల గత రెండు సంవత్సరాలుగా పిల్లలు కలిసి ఆడుకోవడం లేదు. అందుచేత ఈ వేసవి సెలవుల్లో కొందరు కొత్త ఫ్రెండ్స్ దొరికేసరికి మాపాప అందరితో కలిసి ఇంటి ముందరే కూర్చుని ఆడుకోవడం మొదలుపెట్టింది. తనకి ఫ్రెండ్స్ అంటే చాలా ఇష్టం. వాళ్లతో స్నేహంగా ఉంటూ తన బొమ్మలన్నీ వాళ్ళతో షేర్ చేసుకుని సంతోషంగా ఆడుకుంటుంది. అయితే ఒకరోజు ఆడుకుని లోపలికి వచ్చిన కాసేపటికి తన బొమ్మలన్నీ సర్దుకుని చాలా డల్‍గా అయిపోయింది పాప. చాలాసేపటివరకు తను సైలెంట్‍గా ఉండటం గమనించిన నేను, "ఏమైంది? ఎందుకు డల్‍గా ఉన్నావు?" అని ఎంతలా అడిగినా తను నోరు విప్పలేదు. తను లోలోపలే ఎందుకో బాధపడుతోందని నాకు అర్ధమైంది. రాత్రి పడుకునే సమయంలో తనని దగ్గరకు తీసుకుని, "ఎందుకు అలా ఉన్నావు, ఏమైంది తల్లీ?" అని అన్ని విధాలా సముదాయిస్తూ అడిగితే 'ఎస్', 'నో' అన్న సమాధానాలయ్యాక చివరికి నేను కొనిపెట్టిన బొమ్మల సెట్‍లో కొన్ని బొమ్మలు కనిపించటం లేదని, ఆ విషయం నాతో చెప్పడానికి తను భయపడుతోందని నాకు అర్ధం అయింది. ఆ కనపడకుండా పోయిన బొమ్మల వల్లనే ఆ మొత్తం సెట్‍కి విలువ. అందుకే తను లోపల లోపల బెంగపెట్టుకుంది. ఎందుకంటే, తన సంతోషం కోసం కొంచం ఖరీదు ఎక్కువైనా, వాటిని కొని ఇవ్వాల్సి వచ్చిందన్న విషయం తనకు తెలుసు. అదలా ఉంచితే, ఆరోజు సాయంత్రం నేను ఫోన్ వస్తే మాట్లాడుతూ పిల్లలను గమనించినప్పుడు పిల్లలందరూ టాయ్స్ చాలా కొత్తగా ఉన్నాయని ఆ సెట్‍లోని కొన్ని వస్తువులు తీసి ఆడుకోవడం నేను చూసాను. అయితే మా పాప ఎవరినీ తప్పు పట్టడం లేదు. పైగా వాళ్ళందరూ తన ఫ్రెండ్స్ అని, అందరూ చాలా మంచివాళ్ళు అని, నేనంటే వాళ్ళకి చాలా ఇష్టమని, వాళ్ళెవరూ అలా చేయరని చెప్తోంది. నేను తనతో, "సరే, వాళ్ళు కావాలని తీసుకుని ఉండకపోవచ్చు. కానీ బాగున్నాయని ఆడుకుంటూ తీసుకువెళ్లి తిరిగివ్వలేదేమో, అడుగుదాం" అని అంటే, అందుకు తను 'వద్దు, వాళ్ళు ఫీల్ అవుతారు. అడగవద్దు, వాళ్ళు తీసుకోవడం నేను చూడలేదు. అడిగితే, వాళ్ళు అనుమానిస్తున్నామని తప్పుగా తీసుకుంటారేమో, స్నేహం చెడిపోతుందేమో' అని భయపడుతోంది. 'ఏ ఒకరో తీసుకున్న దానికి మిగతా వాళ్ళు అందరూ ఫీల్ అవుతారు కదా!' అని ఆలోచిస్తోంది. తనకి అన్ని రకాలుగా నచ్చచెప్పి అడుగుతూ పోతే, చివరికి ఒక ఫ్రెండ్ మీద కొంచెం అనుమానంగా అనిపించింది మా ఇద్దరికీ. కానీ, అడిగితే ఒప్పుకుని, ఇస్తారన్న నమ్మకం లేదు. పైగా వాళ్ళ పేరెంట్స్ తప్పుగా తీసుకుంటారు, ఫ్రెండ్స్ ఫీల్ అవుతారేమో అని లోపల అణిచిపెట్టుకున్న దుఃఖమంతా ఒక్కసారిగా బయటకు వచ్చి పాప ఏడ్చేసింది. అంతేకాదు, "అందరితో మంచిగా ఉండటం తప్పా? మంచివాళ్లని నమ్మాను. ఫ్రెండ్స్ తో ఆడుకునేప్పుడు షేర్ చేసుకోవాలి అని నువ్వు చెప్తావు కాబట్టి వాళ్ళకి నా బొమ్మలు ఇచ్చాను. మరి వాళ్ళెందుకు ఇలా చేశారు? నువ్వు నాకు చెప్పినట్టు వాళ్ళ అమ్మలు వాళ్ళకి చెప్పారా? ఇదంతా బాడ్ పేరెంటింగ్ కదా అమ్మా. నమ్మి బొమ్మలు ఇస్తే, వాళ్ళు తీసేసుకుని నన్ను చీట్ చేయకూడదు కదా? పైగా నువ్వు ఎప్పుడూ బాబాకి ఇలా ఉంటే ఇష్టం, బాబా అలా చెప్పారు, ఇలా చెప్పారు అంటావు కదా! నేను అలానే ఉన్నాను, మరి ఎందుకు నాకు ఇలా అయింది" అని బాబాను కూడా ఇన్వాల్వ్ చేసి మరీ నన్ను నిలదీసింది. 8 సంవత్సరాల పాప అడిగిన ఈ ప్రశ్నలకు నా దగ్గర సమాధానం లేకపోయినా, "మనం జాగ్రత్తగా ఉండకపోవడం మన తప్పు, అందర్నీ గుడ్డిగా నమ్మకూడదు. నీ వస్తువులను జాగ్రత్త పెట్టుకోవాల్సిన బాధ్యత నువ్వు నేర్చుకోవాలని నీకు ఇదొక పాఠం" అని నాకు తోచిన బుద్ధులు చెప్పాను. అయినా పాప ఏడుస్తూ అవే ప్రశ్నలు అడుగుతుంటే, ఎలా ఊరుకోబెట్టాలో నాకు అర్ధం కాలేదు. అంతలో తను ఒక మాట అంది, "అందరికోసం బాబాకు ప్రేయర్ పెట్టిస్తావు కదా, బొమ్మలకోసం కూడా ప్రేయర్ చేయిస్తే, దొరుకుతాయా అమ్మా?" అని.


'సిల్లిగా బొమ్మలకోసం ప్రేయర్ పెట్టించడమేంటి?' అని నాకు ఒక పక్క నవ్వు వచ్చినా తను ఫీల్ అవకూడదని కవర్ చేసుకుని, "ఎవరో ఎందుకు ప్రేయర్ చేయడం? బాబాకు మనస్ఫూర్తిగా నీ బాధని చెప్పుకో, నీ ప్రశ్నలన్నీ ఆయననే అడుగు, నీలాంటి మంచి పిల్లలు అంటే బాబాకు చాలా ఇష్టం. ఆయన చెప్పినట్టు మనం కరెక్టుగా ఉంటే మనకు ఏ కష్టం వచ్చినా ఆయనే తీరుస్తారు. కాబట్టి ఇప్పుడు నువ్వు బాబాకు నీ బాధ చెప్పుకో, వెంటనే నీ ప్రాబ్లెమ్ క్లియర్ చేస్తారు. కానీ ఒక షరతు, నువ్వు హృదయపూర్వకంగా, 100% నమ్మకంతో మాత్రమే బాబాకు చెప్పాలి. అప్పుడే నీకు సహాయం చేస్తారు" అని చెప్పాను. అప్పుడు తను, "నాకు అడగటం రాదేమో! నువ్వు కూడా చెప్పవా?" అని నా సహాయం కూడా అడిగింది. వెంటనే నా ఫోన్ స్క్రీన్ మీద ఉన్న బాబా ఫోటో చూపించి, "ముందు నువ్వు నీ బాధ చెప్పుకో" అన్నాను. అంతే, తను జరిగినదంతా బాబాకి చెప్పుకుని తన ప్రశ్నల వర్షం కురిపించేసింది. తరువాత నేను కూడా బాబాను గట్టిగా ప్రార్తించాను. "బాబా! చిన్నపిల్ల బాగా హర్ట్ అయింది. అమాయకంగా అడుగుతోంది. తనని మీతో కనెక్ట్ చేయటానికి నాకు ఇది మంచి అవకాశం. ఒక్కసారి తనకి నమ్మకం కుదిరితే, ఇక తను మిమ్మల్ని వదలదు. నాకు దిగులుండదు. తన మంచి, చెడులు అన్నీ మీరే చూసుకుంటారని నేను ధైర్యంగా ఉంటాను. తన బాధను తీర్చండి బాబా. ఈ అనుభవం బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి దణ్ణం పెట్టుకున్నాను.


మర్నాడు ఉదయం నేను పని మీద బయటకు వెళ్తుంటే, మా పాప ఫ్రెండ్ వాళ్ల అమ్మగారు కనిపించారు. ఆవిడ ఫ్రెండ్లీగా నన్ను పలకరించి ఏదో అడుగుతున్నారు. నేను మాటల్లో "మా పాప రాత్రంతా బాధపడుతూనే ఉంది. తన బొమ్మల సెట్‍లోని కొన్ని బొమ్మలు మిస్ అయ్యాయని బెంగతో నిద్రపోలేదు. ఎవరినీ అడగటం తనకు ఇష్టం లేదు. ఎందుకంటే, వాళ్ళు హర్ట్ అవుతారని. బొమ్మలు పోవటం కన్నా ముఖ్యంగా నేను నా ఫ్రెండ్స్ ను ఇంత నమ్మాను, వాళ్లకోసం చాలామంచి గిఫ్ట్స్, చాక్లెట్స్ ఇస్తాను, అన్నీ షేర్ చేసుకుంటాను. మరి వాళ్ళు ఇలా ఎందుకు చేశారు అని బాధపడుతోంది" అని చెప్పి, నాకు ఆలస్యమవుతుంది అంటూ నా పని మీద నేను వెళ్ళిపోయాను. ఒక అరగంటలో తిరిగి ఇంటికి వచ్చేసరికి హాల్లో ఏదో కవర్, అందులో కనిపించకుండా పోయిన బొమ్మలు ఉన్నాయి. మా అమ్మాయి గది తలుపు తీసి చూస్తే, తన ముఖం 1000 వాట్స్ బల్బులా వెలిగిపోతుంది. నేను తనని, "ఏమైందేమిటి, ఈ కవర్ ఎలా వచ్చింది" అని చాలా కుతూహలంగా అడిగాను. తను ఆనందంగా, "బాబా నా బొమ్మలు నాకు ఇప్పించేశారు అమ్మా. అయినా అలా ఎలా అయింది అమ్మా?" అని అంది. "సరే, ఇంతకీ ఇవి ఎలా వచ్చాయి" అని అసలు విషయం అడిగితే, తన ఫ్రెండ్ (ఆ పాప నాకు దారిలో కనిపించి నాతో మాట్లాడిన ఆవిడ కూతురు) వచ్చి, వాటిని ఇచ్చిందని చెప్పింది. అప్పుడు నేను తనతో, "చూశావా! నువ్వు బాబాకు నచ్చినట్టుగా ఉంటూ నిజమైన నమ్మకంతో నీ బాధను చెప్పుకున్నావు. కాబట్టి నీకు బాబా సహాయం చేశారు. ఇకపై నీ జాగ్రత్తలో, బాధ్యతగా ఉండాలి. లేకుంటే, నన్ను అడగకు. ఇంతకీ బాబాకి థాంక్స్ చెప్పావా మరి?" అని అడిగాను. "వెంటనే చెప్పేసాను అమ్మా. అయినా అలా ఎలా, ఏం మేజిక్ చేశారు అమ్మా? ఆన్ బిలీవబుల్ కదా అమ్మా!" అని తను ఆనందంతో ఉప్పొంగిపోతుంటే నాకు చాలా ముచ్చటగా, సంతోషంగా అనిపించింది. వెంటనే కొన్ని చాక్లెట్ ప్యాకెట్స్ ఒక కవరులో వేసి తన చితికిచ్చి, "వీటిని నీ ఫ్రెండ్‍కిచ్చి, నాకోసం బొమ్మలు వెతికి పెట్టినందుకు ధన్యవాదాలు అని చెప్పు. పొరపాటున కూడా తను గిల్ట్ ఫీల్ అయేట్టు ఏమి అనకు. ఎప్పటిలాగే మీరిద్దరూ మంచి ఫ్రెండ్స్ లా ఉండాలి. అంతేగాని మీ మధ్యలో బాధించే ఏ భావాలు ఉండకూడదు. నీవల్ల నేను ఈరోజు సంతోషంగా ఉన్నాను. చాలా చాలా థాంక్స్ అని చెప్పిరా" అని చెప్పి పంపించాను. బాబా దయవల్ల ఆ పాప, వాళ్ళ అమ్మ సానుకూలంగా స్పందించారు. ప్రస్తుతం పిల్లలిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్,. ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం. అసలు సమస్య ఎక్కడ ఉందో, ఎవరి వల్ల పరిష్కారం రావాలో ఆ మనిషినే బాబా నాకు తారసపడేలా చేసి పాప బాధ తీర్చారు బాబా. ఈ అనుభవం ద్వారా మా అమ్మాయికి బాబా మీద బాగా గురి కుదిరింది.


2022, మేలో వరసగా 10 రోజులు మేము ఉండే ప్రాంతంలో ఎడతెరిపి లేని వర్షాలు కురిసాయి. ఇంకొక 10 రోజులు తుఫాను అని హెచ్చరికలు కూడా ఉన్నాయి. ఎప్పటినుంచో మా అమ్మాయి ఔటింగ్(బయట)కి వెళ్ళాలనుకుంటుంది. కానీ ప్రతిసారీ హఠాత్తుగా వర్షం పడటం, నిరాశతో పాప ఏడుస్తూ కూర్చోడం, నా దగ్గర ఒకటే నస పెట్టడం జరుగుతున్నాయి. అలాటింది ఈసారి కూడా వర్షాలు ఉండటంతో పాప బాబాను, "వర్షం వల్ల ఎప్పుడు అనుకున్న బయటకి వెళ్లడం కుదరట్లేదు. ఒక రెండు రోజులు వర్షం వద్దు. మేము బయటికి వెళ్ళాలి" అని అడిగింది. ఆశ్చర్యంగా ఆ వారాంతంలో వర్షం కాదుకదా, కనీసం వర్షం వచ్చే ఛాయలు కూడా లేవు. మనవరాలు అడిగింది - తాతగారు తీర్చేశారు అంతే. విచిత్రం ఏమిటంటే, ఒక వారం పాటు ఉరుములు, పిడుగులతో భారీ వర్షాలు కురుస్తాయిని వెదర్ ఫోర్ కాస్ట్ చూపిస్తుంది. అలాగే ఆ రెండు రోజులు మినహా మళ్లీ వర్షాలు, మబ్బులు. ఏది, ఎందుకు, ఏమిటి, ఎలా అని తెలుసుకునే ప్రయత్నం చేయాల్సిన అవసరమే లేదు. ఎప్పుడు ఏం చేయాలి, ఎలా చేయాలో నిర్ణయించగల ఒక మెజీషియన్, ఒక గైడ్ మన బాబా మనతో ఉన్నారు. స్వచ్చమైన నమ్మకం, ప్రేమ ఉంటే ఏదైనా సాధ్యమే అని అడుగడుగునా చూపించే నా తల్లి, తండ్రి, గురువు, దైవం అయిన నా బాబాకు కోటికోటి ప్రేమపూర్వక ప్రాణామాలు.


బాబా మేజిక్ - దొరికిన డైమండ్ ఉంగరం


ఒకరోజు పొద్దున్న ఎన్నో సంవత్సరాలుగా నావేలికి ఉండే డైమండ్ ఉంగరం కనిపించలేదు. అది ఆభరణంగా కాక, జాతకరిత్యా పెట్టుకోవాల్సి వచ్చిన ఉంగరం. సోమవారం రాత్రి వరకు చేతికున్న ఆ ఉంగరం మంగళవారం పొద్దున లేచి స్నానం చేసి వచ్చాక కనిపించలేదు. అది నా చేతికి లూజుగా లేదు, నేను బాత్రూమ్, బెడ్రూంలో తప్ప వేరెక్కడ తిరిగింది కూడా లేదు. అయినా బాత్రూమ్, ఇంకా ఇల్లంతా వెతికినా ఆ ఉంగరం కనిపించలేదు. అప్పుడు నేను, "బాబా! నేను ఏ మాత్రమూ అజాగ్రత్తగా లేను. కానీ ఆ ఉంగరం పోయింది. అది 100% ఇంట్లోనే ఉంటుంది కానీ, ఎక్కడన్నది అర్ధం కావట్లేదు. అందరం అన్ని చోట్లా అణువణువున గాలించేసాం. మా వంతు ప్రయత్నం అయిపోయింది. ఇక మీరే దిక్కు. మీరే ఆ ఉంగరం దొరికేట్టు చెయ్యండి. ఉంగరం దొరికితే, ఈ అనుభవం బ్లాగులో పంచుకుంటాను" అని బాబాతో చెప్పుకున్నాను. తరువాత నాకు ఆరోజు ప్రయాణం ఉండటంతో బాధగానే ఇంటినుండి బయల్దేరి దారిలో కూడా బాబాను ప్రార్తిస్తూ, "ఉంగరం దొరికే అవకాశం ఉందా బాబా? ఆరుగురం ఇంటిల్లిపాదీ డస్ట్ బిన్స్ తో సహా అణువణువు వెతికాము, కానీ ఉంగరం ఎక్కడా కనపడలేదు. పనమ్మాయి రాలేదు. నేను ఆ గది దాటి బయటకు వెళ్ళలేదు. నాకు తెలీకుండా జారి బాత్రూం కమోడ్ లో పడిపోయిందేమో అని అందరూ అంటున్నారు. నాకేమి అర్ధం కావట్లేదు. ఏదైనా టైం బాడ్‍గా నడుస్తుందేమోనని భయంగా ఉంది" అని బాబాను పరిపరి విధాలుగా అడుగుతూ, "బాబా! అది పోవాలని రాసి ఉంటే వదిలేస్తాను. లేదు దొరుకుతుంది అని మీరు నాకు ఆశ కల్పిస్తే నమ్మకం పెట్టుకుంటాను తప్ప ఈ త్రిశంకు స్వర్గంలో బాధపడలేను బాబా" అని గట్టిగా దణ్ణం పెట్టుకున్నాను. ఆ క్షణం నుండి బాబా నాకు ఎన్నో విధాలా సానుకూల  సంకేతాలు ఇవ్వసాగారు. వెంటనే ఇంట్లో అందరికీ, మా అక్కలందరికీ గ్రూపులో, 'బాబా ఉంగరం దొరుకుతుందని చెప్తున్నారు. అది ఎలానో నాకు తెలీదు కానీ, దొరుకుతుంది. అది బాబా చెప్తున్నారు. చూద్దాం, వేచి ఉండటం తప్ప మన చేతిలో ఏమీ లేదు. ఇక బాబాకే వదిలేసాను' అని మెసేజ్ పెట్టి అంతటితో ఆ విషయం వదిలేసాను. తరువాత గురువారం మధ్యాహ్నం బాబా దర్శనానికి మందిరానికి వెళ్ళాను. ఆరతి అయ్యాక మామూలుగా బాబాకి దణ్ణం పెట్టుకుని అన్ని విషయాలు చెప్పుకుని, చివరిలో "అసలే కష్ట సమయం నడుస్తోంది. చింతలు పెరిగిపోయాయి. పైగా నేను ఎంతో సెంటిమెంట్‍గా భావించే ఉంగరం పోయింది బాబా. అది ఇంకా దొరకలేదు. వేలు ఖాళీగా కనిపిస్తున్న ప్రతిసారీ బాధగా అనిపిస్తోంది" అని చెప్పుకుంటుంటే కళ్ళలో నీళ్ళు వచ్చేసాయి. ఆ రోజు సాయంత్రం 4-4.30గంటల సమయంలో మాపాప బాత్రూంకి వెళ్లి 'టిష్యూ పేపర్ రోల్ అయిపోయింది. ఎవరూ పెట్టట్లేదు' అని కొత్తది తెచ్చి రాడ్‍కి పెడుతుంటే, ఆ రాడ్‍కి వేలాడుతూ నా ఉంగరం తనకి కనిపించింది. అంతే, పాప అరుచుకుంటూ వచ్చి ఉంగరం దొరికింది అని చెప్పేసరికి ఇంట్లో అందరూ ఆశ్చర్యపోయారు. వెంటనే నాకు ఆ ఉంగరం ఫోటో తీసి పెట్టారు. నేను ఎంత సంతోషించానో మాటల్లో చెప్పలేను. ఎందుకంటే, బిడ్డ కళ్ళలో నీళ్ళు రాగానే తల్లి, తండ్రి ఎలా అయితే బాధను తీర్చాలని పరితపిస్తారో, నా కళ్ళలో నీళ్ళు రాగానే బాబా 3-4 గంటలలోనే నాకు నిదర్శనం చూపించారు. ఒకవేళ ఆ ఉంగరం సబ్బు తగిలి జారిపడితే కమోడ్‍లో పడే అవకాశం ఉంటుంది తప్ప అంత చిన్నగా ఉన్న టవల్ రాడ్‍కి ఎలా పట్టుకుంటుంది అనేది ఇప్పటికీ మా అందరికీ అంతుబట్టని విషయం. పోనీ ఆ రాడ్‍కే ఆ ఉంగరం పట్టుకుని ఉందనుకున్నా ఆ రెండు రోజుల్లో ఇంట్లో అందరూ ఆ బాత్రూం వాడుతున్న వాళ్లే. మరి ఒక్కరూ ఆ ఉంగరాన్ని గమనించకపోవడమేమి విచిత్రమో! పాపకి పేపర్ రోల్ పెట్టాలన్న ఆలోచన రావటం, ఉంగరం కనిపించటం ఇది బాబా మేజిక్ తప్ప ఇంకొకటి కాదు. అడుగడుగునా, తోడుగా నీడగా వెన్నంటి ఉండే ఆ సాయినాధునికి జన్మ జన్మలకూ ఋణపడి ఉంటాను. ఏ జన్మలో ఎలా పుట్టినా సరే బాబా చేతిని గట్టిగా పట్టుకుని ఉండాలి, సర్వకాల, సర్వావస్థల్లోనూ బాబా నాకు, నా కుటుంబానికి ఎల్లప్పుడూ తోడుగా వెన్నంటి ఉండాలని ఆ సాయినాధున్ని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. ప్రేమ స్వరూపుడు, దయార్ద్ర హృదయుడు, సర్వాంతర్యామి అయిన శ్రీసాయినాథునికి శతకోటి ధన్యవాదాలు, ఆనంతకోటి సాష్టాంగ నమస్కారాలు.


సాయిభక్తుల అనుభవమాలిక 1212వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. శ్రీసాయి అనుగ్రహ జల్లులు
2. కడుపునొప్పి తగ్గించిన బాబా
3.  బాబా బ్లెస్సింగ్స్

శ్రీసాయి అనుగ్రహ జల్లులు


అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీసచ్చిదానంద సమర్ధ సద్గురు సాయినాథ్ మహరాజ్ కి జై!!!


ముందుగా ఈ బ్లాగు నిర్వహిస్తున్న సాయికి నా నమస్కారాలు. ఈ బ్లాగు - 'ఆధునిక సచ్చరిత్ర'. దీనిని చదవడం ద్వారా 'మాయ'లో పడకుండా  నిత్యమూ తమ సన్నిధిలో ఉండేలా అనుగ్రహిస్తూ బాబా మనల్ని రక్షిస్తున్నారు. నాపేరు చైతన్య. మనం రోజూ బాబా అనుగ్రహాన్ని ఎన్నో అనుభవాల రూపంలో అనుభవిస్తూ ఉంటాము. ప్రత్యేకించి ఇది అనుభవం అని చెప్పడానికి లేదు. అంతా బాబాకు మనపై గల ప్రేమకు నిదర్శనం. ఆయన మన సమస్యలను పరిష్కరిస్తూ, కోరికలను తీరుస్తూ మనల్ని ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. నేను ఇదివరకు కొన్ని అనుభవాలు మీతో పంచుకున్నాను. ఇప్పుడు మరికొన్ని అనుభవాలు పంచుకుంటున్నాను.


ఒకరోజు నాకు బాగా నడుము నొప్పి, కడుపు నొప్పి వచ్చాయి. హాస్పిటల్‍కి వెళ్తే డాక్టరు ఆల్ట్రాసౌండ్ స్కాన్ చేసారు. రిపోర్టులో చిన్న 'సిస్ట్స్' (తిత్తులు)  ఉన్నాయి అని వచ్చింది. దాంతో డాక్టరు సర్జరీ చేయాలన్నారు. మేము మాకు తెలిసిన డాక్టరుకి ఆ రిపోర్టులు చూపించి, వారి అభిప్రాయం కూడా తెలుసుకుందామని అనుకున్నాము. అయితే ఆ డాక్టరు దగ్గరకి వెళ్ళేముందు నేను, "బాబా! హాస్పిటల్‍కి వెళ్తున్నాను. డాక్టరు రిపోర్టులు చూసి సర్జరీ అవసరం లేదని చెప్పేలా అనుగ్రహించండి" అని బాబాను వేడుకున్నాను. బాబా దయవలన డాక్టరు, "సర్జరీ ఏమీ అవసరం లేదు" అని చెప్పారు. "థాంక్యూ సో మచ్ బాబా".


ఒకరోజు మా చిన్నబాబుకి బ్రీతింగ్ సమస్య వచ్చి శ్వాస తీసుకోడానికి చాలా కష్టపడ్డాడు. మాకు చాలా భయమేసి బాబుని ENT డాక్టరు దగ్గరకి తీసుకుని వెళ్తే, డాక్టరు బాబుని పరిశీలించి, "గుండె సమస్య ఏమీ లేదు" అని చెప్పి ముక్కులో వేసుకునే నాసల్ డ్రాప్స్ ఇచ్చారు. బాబా దయవల్లే చిన్నదానితో సమస్య పరిష్కారమైంది. ఇకపోతే మేము మా బాబుని స్కూలు మారుద్దామని అనుకున్నాము. కాని మేము కోరుకున్న స్కూల్లో సీట్ రావడం చాలా కష్టం. అలాంటిది బాబా దయవల్ల మా బాబుకి ఆ స్కూల్లో సీటు వచ్చింది. "ధన్యవాదాలు బాబా! మా పిల్లలకి మంచి బుద్ధిని, జ్ఞానాన్ని, సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించి ఎల్లప్పుడూ మీ నామస్మరణ చేసేలా అనుగ్రహించండి. మమ్మల్ని అందరినీ కూడా రక్షిస్తూ ఉండండి బాబా". 


మా మామయ్యగారికి చాలారోజులు నుంచి ఆగకుండా ఎక్కిళ్ళు వస్తుంటే నేను, "బాబా! మామయ్యగారికి ఎక్కిళ్ళు తగ్గేలా చూడండి. మీ దయతో ఆయనకి ఎక్కిళ్ళు తగ్గితే ఈ అనుభవాన్ని 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను వేడుకున్నాను. బాబా దయవల్ల మామయ్యగారికి ఎక్కిళ్ళు ఆగిపోయి ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నారు. "ధన్యవాదాలు బాబా. మామయ్యగారికి ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా దీవించండి బాబా".


బాబా ఇచ్చే అనుభవాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఇప్పుడు పంచుకోబోయే అనుభవం ఈ మధ్యనే జరిగింది. మా చెల్లివాళ్ళ బాబుకి నూతన వస్త్రాలంకరణ చేద్దామనుకున్నాము. కాని అందరూ, "ఎండలు బాగా ఉన్నాయి. ఈ ఎండల్లో పిలిచిన వాళ్ళందరూ ఎలా వస్తారు? మరోసారి ఎప్పుడైనా పెట్టుకోవాల్సింది" అని అన్నారు. మా చెల్లి 'సాయి సచ్చరిత్ర' సప్తాహ పారాయణ చేసి, "బాబా! మా అబ్బాయి ఫంక్షన్‍కి అందరూ వచ్చేలా చూడండి" అని వేడుకుంది. మే 12న ఫంక్షన్ అనగా సరిగా అదే సమయంలో తుఫాను ఉందని వార్త వచ్చింది. అది వినగానే మాకు చాలా భయమేసింది. నేను, "బాబా! ఫంక్షన్ ఏ ఇబ్బంది లేకుండా జరగాలి. ఇంకా అందరూ ఫంక్షన్‍కి వచ్చేలా చూడండి. అదే జరిగితే నేను ఈ అనుభవాన్ని 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను" అని అనుకున్నాను. బాబా చేసిన అద్భుతం చూడండి. ముందురోజు అంతా వర్షం పడినప్పటికీ ఫంక్షన్ రోజు ఎండ, వాన రెండూ లేవు. ఆరోజు వాతావరణం చాలా ఆహ్లాదంగా ఉంది. మేము అనుకున్నదానికంటే ఫంక్షన్ చాలా బాగా జరిగింది. అందరూ వచ్చి బాబుని ఆశీర్వదించారు. "థాంక్యూ బాబా. మీరు కూడా ఎదో ఒక రూపంలో ఫంక్షన్‍కి వచ్చి, అబ్బాయిని ఆశీర్వదించి ఉంటారు. మమ్మల్ని ఎప్పుడూ ఇలాగే అనుగ్రహిస్తూ ఉండండి. మా అందరి మీద మీ కృప సదా ఉండేలా దీవించండి బాబా".


కడుపునొప్పి తగ్గించిన బాబా


అందరికీ నమస్కారం. మన ఈ 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు నిజంగా చాలా పెద్ద అద్భుతం. ప్రతి ఒక్కరికీ తమ అనుభవాలను తోటి భక్తులతో పంచుకునే అదృష్టాన్ని కల్పించిన బ్లాగు నిర్వహిస్తున్న సాయికి మరియు బృందానికి చాలా చాలా ధన్యవాదాలు. నేను బాబాను వారి ఆశీస్సులు మీకు ఎప్పటికీ ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. నేను ఒక సాయి భక్తురాలిని. బాబా నన్ను ఇదివరకు కొన్ని అనుభవాలను ఈ బ్లాగులో పంచుకునేలా ఆశీర్వదించారు. ఇప్పుడు వారి కృపతో మరో అనుభవం పంచుకుంటున్నాను. ఒకరోజు సాయంత్రం నేను బాబా చరిత్ర పారాయణ చేస్తున్న సమయంలో మావారు, "హఠాత్తుగా కళ్ళు తిరుగుతున్నాయి, కాసేపు విశ్రాంతి తీసుకుంటాను" అని అన్నారు. ఆయన అలా చెప్పేసరికి నాకు కొంచం టెన్షన్‍గా అనిపించినప్పటికీ, "సరేన"ని చెప్పి పారాయణ కొనసాగించాను. కాసేపటికి మావారు, "కాస్త కడుపునొప్పిగా ఉంద"ని చెప్పారు. ఇంకాసేపటికి ఆయనకి వాంతి కూడా అయింది. నేను, "బాబా! నువ్వే కాపాడు తండ్రి" అని చెప్పుకుని బాబా నామస్మరణ చేశాను. తరువాత మావారు తనకి "కడుపునొప్పి వస్తూ, తగ్గుతూ ఉంద"ని చెప్తే, బాబా ఊదీ ఆయనకి పెట్టాను. కానీ మనసులో కొంచం టెన్షన్‍గా అనిపించి బాబా నామస్మరణ చేస్తూ ఉన్నాను. మావారు మొత్తం 3 సార్లు వాంతి చేసుకుని, "సమయం గడిచేకొద్ది నొప్పి ఎక్కువ అవుతుంద"ని చెప్పారు. నిజానికి మావారికి ముందునుంచి కడుపునొప్పి ఉంది. అందుకోసం ఆయన హోమియో డాక్టరు చెప్పిన మందులు వాడుతున్నారు. ఆ డాక్టరు ఏదైనా ఇబ్బంది ఉంటే వేసుకోమని వేరే టాబ్లెట్స్ కూడా ఇచ్చి ఉన్నారు. నేను ఆ టాబ్లెట్లు మావారికి వేసినప్పటికీ నొప్పి తగ్గట్లేదు. పోనీ హాస్పిటల్‍కి వెళ్దామంటే, మావారు వద్దన్నారు. దాంతో నేను మళ్ళీ మావారికి బాబా ఊదీ పెట్టాను. తరువాత ఆయన 4వ సారి వాంతి చేసుకుంటునప్పుడు ఆయన పడుతున్న భాద చూసి నేను, "బాబా! నువ్వే  కాపాడు తండ్రి. మీరు పిలిస్తే పలికే దైవం కదా బాబా. దయచేసి వెంటనే ఈయనకి నొప్పి, వాంతులు తగ్గేలా అనుగ్రహించు బాబా. నువ్వు తప్ప వేరే ఎవరూ కాపాడలేరు బాబా. మీ దయతో కడుపునొప్పి, వాంతులు తగ్గితే, 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో ఈ అనుభవాన్ని పంచుకుంటాను బాబా" అని బాబాను వేడుకున్నాను. అలా బాబాను వేడుకున్న కాసేపటికే మావారికి కాస్త నిద్రపట్టింది. ఇంక మళ్ళీ మావారికి వాంతులు కాలేదు. కడుపునొప్పి కూడా తగ్గింది. బాబా దయుంటే ఎటువంటి ఇబ్బంది నుంచి అయిన మనం గట్టెక్కుతాము. "బాబా! మీకు శతకోటి నమస్కారాలు. మావారి కడుపునొప్పిని పూర్తిగా తొలగించండి. మిమ్మల్నే పూర్తిగా నమ్ముకుని భారమంతా మీపై వేస్తున్నాను తండ్రి. మీ ఆశీర్వాదం ఎప్పటికీ మావారి మీద ఉండాలి తండ్రి. ఇంకా అందరినీ సదా కాపాడు తండ్రి. ఎల్లప్పుడూ మీ నామస్మరణ చేస్తూ ఎప్పటికీ మీ పాదాలను మరువకుండా ఉండే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికీ ప్రసాదించండి. అలాగే ఎల్లవేళలా మీ ఆలోచనలు తప్ప వేరే ధ్యాస లేకుండా మమ్మల్ని అనుగ్రహిస్తూ మీ ప్రేమను ఎల్లవేళలా మా అందరి మీద వర్షించనీయండి తండ్రి. చివరిగా అన్నయ్యని చాలా పెద్ద కష్టం నుంచి కాపాడినందుకు ధన్యవాదాలు తండ్రి. ఏమైనా తప్పులుంటే క్షమించండి సాయి". బాబా ప్రసాదించిన ఈ అనుభవాన్ని చదివిన అందరికీ  ధన్యవాదాలు.


ఓం సాయి రక్షక శరణం దేవా!!!

లోకాసమస్తా సుఖినోభవంతు!!!


బాబా బ్లెస్సింగ్స్


నేను ఒక సాయి భక్తురాలిని. నేను చాలాకాలంగా బాబాని ఒక గురువుగా, దైవంగా పూజిస్తున్నాను. బాబా నాకు ప్రసాదించిన అనుభవాలు కోకొల్లలు. ఈ  బ్లాగులోని భక్తుల అనుభవాల అనుగ్రహప్రసాదాన్ని చదువుతుంటే మనసు పులకరించిపోతుంది. చెప్పాలంటే, నా అనుభవానుసారం ఈ బ్లాగుని స్వయంగా బాబానే నిర్వహిస్తున్నారు. బాబా ఆశీస్సులు సర్వకాల, సర్వావస్థల్లోనూ ఈ బ్లాగు నిర్వాహకులకు ఉంటాయి. ఇక నా అనుభవానికి వస్తే..  ఒకరోజు వెహికిల్ రిజిస్ట్రేషన్ కార్డు అవసరం చాలా ఉండి నేను దానికోసం వెతకటం మొదలుపెట్టాను. నేను సాధారణంగా పెట్టే అన్ని చోట్లా వెతికినప్పటికీ అది కనపడలేదు. ఆధార్, పాన్ కార్డ్ వంటి మిగతా ముఖ్యమైన కార్డులన్నీ ఉన్నాయి కాని, అది మాత్రమే లేదు. దానికోసం వెతికివెతికి విసుగు వచ్చింది. ఇంక చేసేది లేక డూప్లికేట్ కార్డుకోసం దరఖాస్తు చేయాలని నిర్ణయించుకున్నాను. కానీ ఆ విధి విధానం చాలా కష్టంతో కూడుకున్నది, పైగా టైమ్ టేకింగ్ ప్రాసెస్ కూడా. అందుచేత నేను చివరిగా బాబా కృపాకటాక్షాల కోసం వారిని అర్థించి, "కార్డు దొరికితే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాతో చెప్పుకుని కాసేపు ధ్యానం చేసి పడుకున్నాను. నిద్రలేస్తూనే, 'ఫలానా చోట వెతుకు, దొరుకుతుంది' అన్న స్ఫురణను మనసులో కలిగించారు బాబా. వెంటనే బాబా స్ఫురణ కలిగించిన చోట వెతికాను. ఆశ్చర్యంగా ఆ కార్డు అక్కడే ఉంది. ఆనందంతో బాబాకి హృయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పుకున్నాను.


సాయిభక్తుల అనుభవమాలిక 1211వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా ప్రసాదించిన ఉద్యోగం
2. మరోసారి కరుణ చూపిన బాబా
3. ఉద్యోగం ప్రసాదించిన బాబా 

బాబా ప్రసాదించిన ఉద్యోగం


సాయి బంధువులకు నమస్కారం. నా పేరు సాహిత్య. మేము విజయవాడలో ఉంటున్నాము. ఈ బ్లాగును నడిపిస్తున్న విధానం చాలా బాగుంది. ఎంతో విలువైన పని చేస్తున్నారు బ్లాగు నిర్వాహకులు. సాయి మిమ్మల్ని తగినంతగా అనుగ్రహించాలని కోరుకుంటున్నాను. నేను ఇపుడు ఇక్కడ పంచుకోబోయే బాబా అనుగ్రహం చాలా ప్రత్యేకమైనది. నా జీవితంలో అతి ముఖ్యమైన మరియు చాలా పెద్ద మార్పు తీసుకొచ్చిన అనుభవం. అనుభవమని చెప్పటం కన్నా బాబా నాకు ఇచ్చిన గొప్ప ఆశీర్వాదం అనటం సమంజసం. ఈ ఆశీర్వాదాన్ని కూడా బ్లాగులో ప్రచురిస్తారని ఆశిస్తూ బ్లాగు నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.


నేను మహిళలు ఆర్థికంగా బలంగా ఉండాలని నమ్ముతాను. అందుచేత ఉద్యోగం చేస్తూ ఒకరిపై ఆధారపడకుండా నా కాళ్ళ  మీద నేను నిలబడి జీవనం సాగించాలన్నది నా  కోరిక. మా అమ్మగారి ఆశ కూడా అదే. ఆమె నన్ను ఒక మంచి పొజిషన్‍లో చూడాలనుకునేది. నేను డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ఎన్నో ఉద్యోగాలకి ప్రయత్నించాను. కానీ కేవలం నాకున్న డిగ్రీ మీద ఎంత ప్రయత్నించినా ఉద్యోగం రాలేదు. ఇలా ఉండగా కొన్ని కుటుంబ పరిస్థితులు మమ్మల్ని చాలా సమస్యలలోకి తీసుకెళ్లిపోయాయి. ఆర్థిక స్థోమత లేకపోవడం, భవిష్యత్తు అంతా గందరగోళంగా కనిపించడంతో ఏవిధంగానూ మాకు ధైర్యం లేకుండా పోయింది. నేను చాలా నిరాశకు లోనయ్యాను. అలాంటి స్థితిలో నేను ఒంటరిగా ఉన్నప్పుడు నా బాధను బాబాతో చెప్పుకుంటూ ఉండేదాన్ని. ఆయన ప్రేరణో ఏమోగాని, 'డిగ్రీతో చదువు ఆపకూడదని, ఇంకా పై చదువులు చదువుతూ క్యాంపస్ ప్లేస్‍మెంట్స్ లో ఉద్యోగాన్ని పొందాలి' అన్న దృఢ సంకల్పం నాలో కలిగింది. దాంతో నాకు ఉద్యోగం వస్తే నా కుటుంబం ధైర్యంగా ఉంటుంది, అమ్మ సంతోషంగా ఉంటుందని నేను ఏం.బి.ఏలో జాయిన్ అయ్యాను. ఏం.బి.ఏ కాలేజీ రోజులు మంచి స్నేహితులనిచ్చి, మంచి గురువులను చూపించి, నాకు చాలా నేర్పించి నన్ను ఒక కొత్త వ్యక్తిగా తీర్చిదిద్దాయి. అంతేకాదు నా చదువు నాలో విశ్వాసం పెంచింది, తెలివితేటలను ఎలా ఉపయోగించుకోవాలో తెలియజేసింది. అన్ని సెమిస్టర్లలో నాకు మంచి మార్కులు వచ్చాయి. వీటన్నింటి వెనకాల మా అమ్మ కృషి చాలా ఉంది. ఆమె మా ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా అప్పు చేసి నన్ను ఏం.బి.ఏలో చేర్పించింది. ఏ లోటు లేకుండా నన్ను నా చదువు మీద దృష్టి పెట్టేలా చూసుకుంది. నేను కూడా లెక్చరర్లు, ప్రొఫెసర్లు దగ్గర చాలా మంచి పేరు తెచ్చుకుంటూ చాలా సాధించాను. అసలు అంతటికి కారణం సాయి కృప, ఆయన ప్రేమ. కాలేజీలో నాకు ఎప్పుడు ఏ ఛాలెంజ్ ఎదురైనా, ఏ కష్టం వచ్చినా 'సాయి సాయి సాయి' అని అనుకుంటూ ఉండేదాన్ని. వెంటనే ఆ సమస్యకి బాబా పరిష్కారం చూపించేవారు. ఆయనకి ఏమిచ్చి ఋణం తీర్చుకోగలం?


బాబా దయవల్ల ప్లేస్‍మెంట్స్ ప్రక్రియ మొదలయ్యాక నేను ఒక రెండు కంపెనీలలో సెలెక్ట్ అయ్యాను. కానీ కొన్ని కారణాల వల్ల ఆ కంపెనీల నుండి ఏ రెస్పాన్స్ రాలేదు. అటువంటి స్థితిలో నేను మళ్ళీ బాగా నిరాశకు గురయ్యాను. దేనికోసమైతే నేను ఇదంతా మొదలుపెట్టానో అది జరగటం కష్టమేమో, ఏం.బి.ఏ చదవటానికి ఇంత ఖర్చు అయిందే,  ఇప్పుడు ఉద్యోగం రాకుంటే నేను చేసినదానికి అర్థం లేకుండా పోతుందమోనని నాకు వేటి మీద ఆసక్తి లేకుండా పోవటం మొదలైంది. ఒక్కోసారి రాత్రి నిద్రపోకుండా, "బాబా! ఎందుకు ఇలా జరుగుతుంది?" అని ఏడ్చేదాన్ని. ఇలా ఉండగా మా అమ్మ నాకు తెలియకుండా, "నా బిడ్డకి ప్లేస్‍మెంట్‍లో ఉద్యోగం రావాలి బాబా" అని బాబాతో చెప్పుకుని 11 గురువారాలు 'సాయి దివ్యపూజ' చేస్తానని సంకల్పం చేసుకుని పూజ మొదలుపెట్టింది. కొన్ని ఆటంకాలు ఎదురైనా అమ్మ తన పూజ కొనసాగించింది. బాబా నా జీవితంలో పూజ జరుగుతున్న ఒక్కో వారంలో ఒక్కో  మార్పు తెచ్చుకుంటూ వచ్చారు. ఆ క్రమంలో ఒక పెద్ద కంపెనీ ప్లేస్‍మెంట్స్ కోసం మా కాలేజీకి వచ్చి సెలక్షన్స్ లో భాగంగా ముందుగా వ్రాతపరీక్ష పెట్టింది. ఆ ఉద్యోగం పూర్తిగా ఏం.బి.ఏలో ఫైనాన్స్ స్పెషలైజేషన్ ఉన్నవాళ్లకే. అందువల్ల నేను 'నాకు ఈ ఉద్యోగం రాదు' అని అనుకున్నాను. అయినప్పటికీ పరీక్ష మాత్రం శ్రద్ధగా వ్రాసాను. కాదు, బాబా నా చేత అలా వ్రాయించారు. ఒక వారంలో వచ్చిన రిజల్ట్స్ లో నేను పాస్ అయి, నెక్స్ట్ రౌండ్ ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయ్యాను. నాకు చాలా ఆనందం కలిగింది. సాయి నా జీవితంలో ఒక కొత్త మార్పు తేవటానికే నన్ను ఇన్నాళ్లు నిరీక్షింపజేశారా అనిపించింది. ఎందుకంటే, మంచి కెరీర్ గ్రోత్ ఉన్న కంపెనీ అది. పైగా నేను ఉండే లొకేషన్‍లోనే ఉద్యోగం, కాబట్టి మా అమ్మకి దగ్గరగా ఉండొచ్చు.


సరే, అందరం నెక్స్ట్ రౌండ్స్ కి ఇంటర్వ్యూకోసం ఆ కంపెనీ ఆఫీసుకి వెళ్ళాము. నేను ఎప్పటినుంచో ఎలాంటి కంపెనీలో అయితే ఉద్యోగం చేయాలని ఆశ పడుతుండేదాన్నో అచ్చం అలానే ఉంది ఆ ఆఫీసు. ఇంటర్వ్యూ అంతా చాలా బాగా జరిగింది. ఒకానొక సమయంలో మాత్రం నా ఏం.బి.ఏ స్పెషలైజేషన్ లేకపోవడం కొంత సమస్య అన్నట్లు కొంచెం అటుఇటుగా మాట్లాడారు. నేను బాబాని తల్చుకుంటూ కూర్చున్నాను. మరునిమిషంలో హెచ్.ఆర్ నన్ను పిలిచి, "మీరు శ్రద్ధగా ట్రైనింగ్ తీస్కోండి. మీరు ఈ ఉద్యోగం చేయగలరు. అల్ ది బెస్ట్" అని చెప్పారు. ఆంటే, నాకు ఉద్యోగం కంఫర్మ్ అయింది. నన్ను నేనే నమ్మలేకపోయాను. నాకు చాలా సంతోషమేసింది. మేము 27 మందిమి వెళ్తే, 17 మందిమి సెలెక్ట్  అయ్యాం. అందులో నేను ఒకదాన్ని. అంతా బాబా కృప. యన లేనిదే నేను ఇంత దూరం వచ్చేదాన్ని కాదసలు. ఇంటికి వచ్చి అమ్మతో నాకు ఉద్యోగం వచ్చిందని చెప్పగానే, ఆమె చాలా చాలా సంతోషించింది. అందరికీ ఆనందంగా "నా కూతురికి ఉద్యోగం వచ్చింద"ని చెప్పుకుంది. అది అమ్మ దివ్యపూజ చేసిన 9వ వారం. 11వ వారం దివ్యపూజ అయ్యేసరికి "ఆగస్టులో జాయిన్ అవ్వమ"ని వచ్చింది. ఇద్దరు అమ్మలు(సాయిబాబా & మా అమ్మ) తన కూతురుకోసం చేసిన సంకల్పం ఎలా ఫెయిల్ అవుతుంది? బాబా అనుగ్రహం పూర్తిగా లభించినంతనే అమ్మ నాతో, "ఈ సాయి ఆశీర్వాదాన్ని 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాననుకున్నాన"ని చెప్పింది. అమ్మ కోరిక మేరకు ఇలా బాబా ఆశీర్వాదాన్ని మీ అందరితో పంచుకున్నాను. నేను ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను. ఈ అనుభవం ద్వారా బాబా నా జీవితాన్ని చాలా చక్కగా నడిపిస్తారన్న నమ్మకం నాకు మరింత పెరిగింది. ఇకపై నా భవిష్యత్తులో కూడా నేను చేసే ప్రతి పనిలో బాబాని తలుచుకుంటూ చేసుకుంటాను. చివరిగా "సాయితండ్రీ! మీకు చాలా చాలా కృతజ్ఞతలు".


మరోసారి కరుణ చూపిన బాబా


ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి!!! 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు వ్యవస్థాపకులైన సాయికి ప్రత్యేక ధన్యవాదాలు. సాయి భక్తులందరూ, వారి కుటుంబాలతో సహా సంతోషంగా ఉండాలని, వారందరికీ శ్రీసాయినాథుడు అండగా ఉండాలని కోరుకుంటూ బాబా పాదాల చెంత సర్వస్య శరణాగతి వేడుతున్నాను. "ఓ సాయిదేవా! నీవే నాకు దిక్కు. నా అనుభవం పంచుకోడానికి కొంచెం ఆలస్యం చేసినందుకు నన్ను క్షమించు తండ్రి". నా పేరు నిరంజన్ రెడ్డి. మాది కర్నూలు జిల్లా, ఆలూరు తాలూకా మూసనపల్లి గ్రామం. నేనిప్పుడు నాలుగోసారి నా అనుభవం మీ అందరితో పంచుకుంటున్నాను. నేను సెక్యూరిటీగా పని చేస్తున్నాను. సాఫ్ట్ వేర్ కంపెనీలో సెక్యూరిటీ పని గౌరవంగా ఉంటుంది. అక్కడుండే ప్రతి ఒక్కరూ మంచి మాటలతో మాకు సహకరిస్తారు. రోజుకు 8 గంటల చొప్పున 26 రోజులకి 15000/- జీతం వస్తుంది. ఇక అసలు విషయానికి వస్తే, కరోనా సమయంలో కూడా సాఫ్ట్ వేర్ కంపెనీవాళ్ళు మమ్మల్ని కంపెనీలోనే ఉండాలని చెప్పారు. అయితే కుటుంబ సమస్యల వల్ల స్టాండర్డ్ ఏజెన్సీలేవీ అందుకు ఒప్పుకోలేదు. దాంతో దాదాపు ఐదు నెలలకు పైగా డ్యూటీలకు వెళ్ళక మేం చాలా ఇబ్బందిపడ్డాము. పోనీ ఐదు నెలల తరువాత డ్యూటీకి వెళదామంటే, కంపెనీలు సెక్యూరిటీ మ్యాన్ పవర్‍ని తగ్గించాయి. అదివరకు దాదాపు 28 మందిమి ఉంటే తొమ్మిది మందికి మాత్రమే డ్యూటీ ఇచ్చి మిగతా 19 మందిని తొలగించారు. తరువాత కొన్నాళ్ళకి 2022, ఏప్రిల్ నెలలో మళ్ళీ మ్యాన్ పవర్‍ను పెంచారు. కానీ పాతవాళ్ళను తీసుకోవద్దని, కొత్తవాళ్ళనే తీసుకోమని కంపెనీలు ఆదేశాలిచ్చాయి. దాంతో నేను పాతవాళ్లను తీసుకోరని చాలాసార్లు ఆవేదన చెందాను. అటువంటి స్థితిలో నా ఫ్రెండ్ ఒకరు నాకు ఫోన్ చేసి, "ఒకసారి ప్రయత్నించి చూడు" అని చెప్పాడు. బాబాను తలుచుకుని ఆయన మీద నమ్మకముంచి 'ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి' అని స్మరణ చేస్తూ ఆఫీసుకు పోయి ఆ సాఫ్ట్ వేర్ కంపెనీ అడ్మిన్‍ని కలిసాను. బాబా దయవల్ల అడ్మిన్ సార్ నాకు మంచి సపోర్ట్ ఇచ్చి, "డ్యూటీకి వచ్చి, ఇబ్బందిపడకుండా నీ విధులు నిర్వర్తించుకో" అని నాకు ధైర్యం చెప్పారు. నేను ఆ అడ్మిన్‍కు మనసారా ధన్యవాదాలు చెప్పుకుని బాబాను స్మరించుకుంటూ ఆనందంగా ఇంటికి వచ్చేసాను. తరువాత డ్యూటీలో చేరాల్సిన రోజు బాబాను స్మరించుకుంటూ ఆఫీస్‍కి వెళ్లి డ్యూటీలో చేరాను. అలా 'Happiest Mind IT' అనే సాఫ్ట్ వేర్ కంపెనీలో చేర్చి మరోసారి నా మీద కరుణ చూపించారు బాబా. "బాబా! తల్లివి నీవే, తండ్రివి నీవే, గురువు నీవే, దైవం నీవే. నీవు సర్వాంతర్యామివి. నీవు నీ భక్తుల హృదయాలలో ఉంటావు. కరుణతో సదా వారి వెంటుండి కష్ఠాల నుండి కాపాడుతావు. నీ దయవల్ల నేను మరోసారి ఉద్యోగంలో చేరాను. అందుకు నీకు చాలా చాలా ధన్యవాదాలు బాబా. నీ మేలును ఎన్ని జన్మలైనా నేను మర్చిపోలేను. నేను నీ భక్తుడినైనందుకు చాలా సంతోషిస్తున్నాను. నువ్వు ప్రతి కష్టంలో నాకు అండగా నిలుస్తున్నావు. కానీ నేను కొన్ని సమస్యల వల్ల నిష్ఠతో ఉండలేకపోతున్నాను. నా సమస్య మీకు తెలుసు బాబా. అందుకే నా వెంట నువ్వు ఉన్నావు. అలాగే 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులోని భక్తులందరికీ నువ్వు అండగా ఉండాలి. మేము బ్లాగులోని ప్రతి భక్తుని అనుభవాలు చదువుకుంటూ మీ అనుగ్రహానికి పరవశిస్తూ 'శ్రీసాయినాథుడు అందరి దేవుడయ్యా' అని కీర్తిస్తూ, మీ నామస్మరణ చేసుకుంటూ కాలం గడుపుతాము. ఎన్ని జన్మలైనా మీ భక్తుడిగా పుట్టాలని మేం కోరుకుంటాం బాబా".


సర్వేజనా సుఖినోభవంతు!!!


ఉద్యోగం ప్రసాదించిన బాబా 


అందరికీ నమస్కారం. నా పేరు నళిని. నేను బాబా భక్తురాలిని. నేను ఎప్పుడు కష్టాల్లో ఉన్నా బాబా ఏదో ఒక రూపంలో నాకు సహాయం అందిస్తున్నారు. బాబా నాకు ప్రసాదించిన ఒక అనుభవం నేనిప్పుడు మీ అందరితో పంచుకుంటాను.  ఈ మధ్యకాలంలో ఉద్యోగం లేక నేను చాలా ఇబ్బందిపడ్డాను. బాధతో "నాకు ఎందుకు బాబా, ఇలాంటి పరిస్థితి, నాకెప్పుడు ఉద్యోగం వస్తుంది?" అని అడుగుతుండేదాన్ని. బాబా ఏదో ఒక ఫోటో రూపంలో లేదా క్వశ్చన్&ఆన్సర్ సైటు ద్వారా, "శ్రద్ధ, సబూరీతో ఉండమ"ని చెప్తుండేవారు. 'ఆలస్యం జరుగుతుందంటే బాబా ఏదో గొప్ప సహాయం చేస్తార'ని అర్థం. అందుచేత నేను సహనంతో ఆయననే తలుచుకుంటూ ఉండేదాన్ని. ఇంకా బాబా దయతో నేను 11 వారాల సాయి దివ్యపూజ మొదలుపెట్టాను. 11 వారాల పూజ పూర్తవుతూనే నాకు ఉద్యోగం వచ్చింది. "ధన్యవాదాలు బాబా. ఇలాగే మీరెప్పుడూ నాకు తోడుగా ఉంటారని ఆశిస్తున్నాను".


సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo