సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1203వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా కృపతో తొలగిన అనారోగ్య సమస్యలు
2. బాబా కృపను ఎలా అర్థం చేసుకోగలం?
3. ఎల్లప్పుడూ మనతోనే ఉంటూ మనల్ని కన్నతండ్రిలా కాపాడతారు బాబా

బాబా కృపతో తొలగిన అనారోగ్య సమస్యలు


సాయినాథ్ మహారాజ్ కీ జై!!! నా పేరు రవీంద్ర. నేను చాలా సంవత్సరాల నుండి సాయి భక్తుడిని. ఈమధ్య అకస్మాత్తుగా నా గుండెల్లో దడ మొదలై ఎంతకీ తగ్గలేదు. అప్పుడు నేను బాబాని తలుచుకుని, "బాబా! తొందరగా ఈ దడ తగ్గితే, నా అనుభవాన్ని 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను" అని అనుకున్నాను. బాబా దయవల్ల త్వరగానే దడ తగ్గింది.


నాకు అప్పుడప్పుడు గ్యాస్ట్రిక్ నొప్పి వస్తుంటుంది. టాబ్లెట్ వేసుకుంటే తగ్గుతుంది. కానీ ఒకసారి బాగా ఇబ్బందిపెట్టింది. అప్పుడు నేను మందుల షాపుకి వెళ్లి టాబ్లెట్లు తెచ్చుకుని, "బాబా! ఈ నొప్పి తగ్గితే, నా అనుభవం బ్లాగులో పంచుకుంటాన"ని బాబాతో చెప్పుకుని రెండు పూటలా టాబ్లెట్ వేసుకుంటే నొప్పి తగ్గిపోయింది. అలాగే ఇంకోసారి రాత్రి పూట గ్యాస్ట్రిక్ పెయిన్ ఎక్కువగా వచ్చి ఎంతసేపటికీ తగ్గలేదు. అప్పుడు, 'ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః' అని కాసేపు స్మరించుకుని నిద్రలోకి జారుకున్నాను. బాబా దయవలన నొప్పి తగ్గిపోయింది. ఈమద్య మరోసారి తెల్లవారుజామున గ్యాస్ నొప్పి వచ్చి, అప్పుడు కూడా ఎంతకీ తగ్గలేదు. నేను, "బాబా! ఈ నొప్పి తగ్గితే, బ్లాగులో పంచుకుంటాన"ని బాబాకి మ్రొక్కుకున్నాను. వెంటనే నొప్పి తగ్గింది. "ధన్యవాదాలు బాబా. మీ దయతో గ్యాస్ట్రిక్ సమస్య, నాకున్న ఆస్త్మా పూర్తిగా తగ్గిపోవాలని వేడుకుంటున్నాను తండ్రి. అలాగే తొందరగా నాకు ఒక ఉద్యోగాన్ని ప్రసాదించండి బాబా".


ఇంటర్ పరీక్షల సమయంలో మా అమ్మాయికి జలుబు, గొంతునొప్పి వచ్చాయి. పరీక్షల సమయమని నేను కాస్త ఆందోళన చెంది, "బాబా! పాపకి ఎటువంటి సమస్యలు లేకుండా చూడండి. మీ దయతో తనకి మంచి మార్కులు వస్తే, మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను వేడుకున్నాను. బాబా దయవల్ల పాప ఎటువంటి ఇబ్బంది లేకుండా పరీక్షలు చక్కగా వ్రాసి, 86% మార్కులతో పాసు అయింది. "ధన్యవాదాలు బాబా. నేను ఏవైనా అనుభవాలు పంచుకోవడం మర్చిపోయి ఉంటే నన్ను క్షమించండి బాబా. నాకు డబ్బులు రావాల్సి ఉన్నాయని మీకు తెలుసు బాబా. ఆ డబ్బు వచ్చేటట్లు చేయండి బాబా. మాకు చాలా ఆర్థిక సమస్యలున్నాయి. మూడు సంవత్సరాలగా నేను మంచి ఉద్యోగం కోసం వెతుకుతున్నాను. తొందరగా నాకు ఒక ఉద్యోగాన్ని ప్రసాదించండి బాబా". బాబా అనుగ్రహంతో నా డబ్బులు నాకు వస్తే, ఆ అనుభవంతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను.


బాబా కృపను ఎలా అర్థం చేసుకోగలం?


సాయి బంధువులందరికీ మరియు ఈ బ్లాగు నిర్వహిస్తున్న సాయికి నా నమస్కారాలు. నేను ఒక సాయి భక్తురాలిని. నేను ఈమధ్యకాలంలో ఆరోగ్య మరియు ఆర్థిక సమస్యల కారణంగా "గురువారంనాడు ఉపవాసం ఉంటాన"ని బాబాకి మొక్కుకున్నాను. కానీ బాబాకి ఉపవాసం ఉండటం ఇష్టం ఉండదు కదా! సరిగ్గా ఆరోజే ఏదో ఒకరకంగా నా వద్దకు ప్రసాదం రావటం, నేను తినటం జరిగేది. అయితే నేను చిత్తచాంచల్యం వల్ల విసిగిపోయి అయిదేళ్లుగా ఉంటున్న మహాపారాయణ గ్రూపు నుండి బయటకి వచ్చేసాను. ఇంకా పూజలు మానేశాను. తరువాత హోళీ పండగరోజున నా మేనకోడలు శిరిడీ నుండి రెండు బాబా విగ్రహాలు తెచ్చి ఇచ్చింది. అయినా నేను ఆయన్ను పూజించలేదు. ఇంట్లోవాళ్ళే పూజిస్తుండేవాళ్ళు. ఆ విగ్రహాలు వచ్చాక మావారితో గొడవలు, మాటలతో, చేతలతో బాధపెట్టుకోవటం ఎక్కువయ్యాయి. ఇలా ఉండగా ఉగాది ముందురోజు ఇల్లు సర్దుతూ మా చిన్నపాప ఒక బాబా విగ్రహం చేజార్చింది. ఆ ఘటనలో విగ్రహం తల విరిగింది. దాంతో తొమ్మిదేళ్ళ మా పెద్దపాప ఏడుస్తుంటే ఆ విగ్రహం అతికించి పూజలో కాకుండా అలమారలో పెట్టాను. కానీ పండగ ముందురోజు ఇలా అయిందేమిటని నాకు బాధగా అనిపించింది. ఇకపోతే పండగరోజు మావారితో మామూలు రోజుకన్నా ఎక్కువ గొడవ అయింది (ఆయన సహజంగా మంచివారే కానీ, మా బావగారి వల్ల గొడవలు ఎక్కువ అవుతున్నాయి. అవి ఇక్కడ రాయలేనివి). నేను నా బాధను అమ్మకి చెప్పుకుని ఏడ్చాను. అమ్మ ప్రారబ్ధమని ఓదార్చింది. కానీ నేను, 'బాబా తన భక్తుల బాధలు భరిస్తారంటారు. నన్ను మాత్రం పండగపూట ఏడిపిస్తున్నార'ని చాలా ఏడ్చాను.


శ్రీరామనవమి వెళ్ళాక వ్యక్తిగత సమస్యలతోపాటు నా డయాబెటిక్ లెవల్స్ బోర్డరుకు వచ్చాయి. దాంతో డాక్టరు గుండె పరీక్ష చేయించుకోమని చెప్పారు. అయితే బాబా ఎలా అనుగ్రహించారో చూడండి. నేను హాస్పిటల్ నుండి ఇంటికి వస్తుంటే అనుకుకోండా యాక్సిడెంట్ అయి స్కూటీ మీద నుండి కిందపడిపోయాను. నా తలకి దెబ్బ తగిలింది. రక్తం పోయింది, రెండు కుట్లు పడ్డాయి. ఇంకా టెస్టులు చేస్తే రిపోర్టులో షుగర్ లేదు అని వచ్చింది. నా తల పగిలిపోకుండా బాబా తమపైకి తీసుకుని నన్ను ఇంతలా కాపాడారని నాకు అనిపించింది. అయితే ఇప్పటికీ పూర్తిగా నా బాధలు తీరక రోజూ బాబాకి చెప్పుకుంటున్నాను. 2022, మే రెండో వారంలో నేను అడగకుండానే బాబాకి సంబంధించిన గ్రూపు మిత్రులు ఒకరు నన్ను మళ్లీ మహాపారాయణ గ్రూపులో చేర్చారు. తరువాత మే 18న మా అమ్మ నన్ను ఒక రామాయణ పారాయణ, సంస్కృతి గ్రూపులో చేర్చింది. పారాయణ సరిగా చేయగలనా అనుకుంటే మరుసటిరోజు పారాయణలో భాగంగా చదివిన సచ్చరిత్ర 18, 19 అధ్యాయాలలో గురుచరిత్ర, రామనామ పారాయణ విషయంలో బాబా భక్తులను ప్రోత్సహించిన కథలు వచ్చాయి. అవి చదివాక బాబా నా సందేహానికి ఇలా తమ ఆశీస్సులు ఇచ్చారనిపించింది. మా తమ్ముడి ఉపనయనం అనుకుంటున్నాం. కానీ మా ఇంట్లో గొడవలు అలాగే ఉన్నాయి. "మావాళ్ళ మనసులు మారి అంతా సరిగ్గా జరగాలని కోరుకుంటూ అది నెరవేరితే మళ్లీ నా అనుభవం బ్లాగులో పంచుకుంటాను బాబా".


ఎల్లప్పుడూ మనతోనే ఉంటూ మనల్ని కన్నతండ్రిలా కాపాడతారు బాబా


నా పేరు దుర్గ. నా భర్త పేరు బ్రహ్మం. మా పాప నొహితక్షయ. 2022, ఏప్రిల్ 27న మా జీవితంలో ఒక సంఘటన జరిగింది. ఆరోజు మేము ఒక భయంకరమైన ప్రమాదం నుండి బయటపడ్డాము. ఆ రోజు మధ్యాహ్నం నేను, నా భర్త, మా పాప బైక్ మీద వెళ్తుండగా హఠాత్తుగా ఒక కారు వెనుక నుండి చాలా వేగంగా వచ్చింది. తృటిలో ఆ కారు మా బైక్‍ని గుద్దబోతుందనగా మావారు అప్రమత్తులై బైక్‍ను పక్కకు తిప్పి స్లో చేసారు. ఆ కారు మాత్రం మమ్మల్ని ఓవర్ టేక్ చేసి వెళ్ళిపోయింది. తరువాత మేము ఒక రోడ్డులోకి మలుపు తిరిగాము. సరిగ్గా ఆ మలుపులో ముందు మమ్మల్ని ఓవర్ టేక్ చేసి వెళ్లిన అదే కారు ఒక పక్కగా ఆపి ఉంది. మేము ఆ రోడ్డులోకి టర్న్ అవుతూనే హఠాత్తుగా ఆ కారు డోర్ ఓపెన్ అయింది. దాంతో మావారు సడన్ బ్రేక్ వేశారు. మరుక్షణం మేము పడిపోబోతున్నామని గ్రహించిన మావారు ఆసరాకోసం పక్కనే ఉన్న ఒక స్తంభాన్ని పట్టుకున్నారు. దాంతో మేము బైక్ మీద నుండి ఫోర్స్ గా కింద పడకుండా మెల్లగా జారి కాలువలో పడ్డాము. ఆ స్తంభాన్ని కొన్నిరోజుల క్రితమే అక్కడ ఏర్పాటు చేసారు. అక్కడ ఆ స్తంభం లేకున్నా, మావారు దాన్ని పట్టుకోకున్నా సడెన్ బ్రేక్ వేసిన ఫోర్స్ కి మేము వెళ్లి బండరాళ్ల మీద పడేవాళ్ళం‌, దెబ్బలు బాగా తగిలేవి. బాబా దయవల్ల పెద్ద ప్రమాదం నుండి తప్పించుకున్నాము. బాబా ఎల్లప్పుడూ మనతోనే ఉంటూ మనల్ని కాపాడతారనడానికి ఇంతకన్నా సాక్ష్యం వేరే ఏం కావాలి? ఆయనను నమ్మినవారు ఎన్నడూ కష్టపడరు. ఆయన మనల్ని కన్నతండ్రిలా కాపాడతారు. ఈ అనుభవం పంచుకోడానికి సహాయం చేసిన ఈ బ్లాగ్ నిర్వాహకులకు నా కృతజ్ఞతలు. "బాబా! మీకు చాలా చాలా ధన్యవాదాలు".


ఓం శ్రీసాయినాథాయ నమః,

లోకా సమస్త సుఖినోభవంతు!!!


6 comments:

  1. Jaisairam to day is my birthday bless me and for health and wealth. Blessings for me and my brother. Jaisairam

    ReplyDelete
    Replies
    1. హృదయ పూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు సాయిరాం

      Delete
  2. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  3. ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి
    ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి
    ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి
    ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి

    ReplyDelete
  4. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo