సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1197వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. మనల్ని చూసుకోవడానికి బాబా ఉన్నారు
2. మనసులో నలుగుతున్న ప్రశ్నకు సమాధానమిచ్చిన బాబా
3. వర్షం తగ్గించి పరీక్షకు ఆటంకం లేకుండా చూసిన బాబా

మనల్ని చూసుకోవడానికి బాబా ఉన్నారు 

నేను ఒక సాయి భక్తురాలిని. మేము యు.ఎస్.ఏలో నివాసముంటున్నాము. ముందుగా సాయి బిడ్డలందరికీ నమస్కారం. మన అనుభవాలను పంచుకోవడానికి మరియు తోటి భక్తుల అనుభవాలను చదువుకోవడానికి అనువుగా అందమైన ఈ బ్లాగును మనకు అందించి తద్వారా బాబా ప్రేమను ఆస్వాదింపజేస్తున్న అన్నయ్యకు ధన్యవాదాలు. ఈ బ్లాగు ద్వారా బాబా మనతో మాట్లాడుతున్నారని, మార్గనిర్దేశం చేస్తున్నారని నేను ధృఢంగా నమ్ముతున్నాను. ఇది నా అనుభవం, 100 శాతం నిజం కూడా. ఇకపోతే బాబా మాపై చూపిన అనుగ్రహాన్ని మీ అందరితో పంచుకుంటున్నందుకు నాకు సంతోషంగా ఉంది. నేను ఇటీవల నా దంతాలను క్లీన్ చేయించుకోవడానికి ఒక డెంటిస్ట్ ను సందర్శించాను. అతను నా దంతాలను పరిశీలించి, "ఒక దంతానికి క్యాప్ వేయాలి. రూట్ కెనాల్ కూడా అవసరం కావచ్చు. కానీ ఆ విషయం పన్ను ఓపెన్ చేసి చూస్తేగానీ చెప్పలేము" అన్నారు. అది విని నేను చాలా ఆందోళన చెందాను. ఎందుకంటే, రూట్ కెనాల్ చాలా భాధాకరమైనది, యు.ఎస్.ఏలో దానికి దాదాపు 2000 డాలర్లు వరకు ఖర్చు అవుతుంది. అసలే గత కొన్నినెలలుగా మాకు చాలా ఇబ్బందిగా ఉంది. దానికి తోడు ఈ అదనపు ఖర్చు. అటువంటి స్థితిలో నేను ఎప్పటిలాగే నా సమస్యను సాయి పాదాల దగ్గర ఉంచాను. తరువాత డాక్టరు అపాయింట్‌మెంట్ రేపనగా ముందురోజు రాత్రి అంటే 2022, మే 10న మన బ్లాగులో ప్రచురించబడిన సాయి భక్తుల అనుభవాలను చదివాను. అందులో ఒక భక్తురాలు తనకి క్యావిటీ సమస్య ఉందని, కోవిడ్ కారణంగా చాలాకాలం నుండి తను డాక్టర్ వద్దకు వెళ్ళలేకపోయానని, చివరికి ఇటీవల ఒక డాక్టరుని సందర్శించే ముందు 'తనకి రూట్ కెనాల్ చేయాల్సిన అవసరం ఉండకూడద'ని సాయిని ప్రార్థించి, 'సాయి రక్షక శరణం' అని జపించానని, తరువాత తను డాక్టరుని కలిసినప్పుడు 'రూట్ కెనాల్ అవసరం లేద'ని డాక్టర్ చెప్పారని ఆమె తన అనుభవం పంచుకున్నారు. తద్వారా 'నాకు కూడా రూట్ కెనాల్ అవసరం ఉండబోద'ని సాయి నాతో చెపుతున్నారని నాకు చాలా స్పష్టంగా అనిపించింది. మరుసటిరోజు మే 11న నేను నా పంటికి ఊదీ రాసుకుని, 'సాయి రక్షక శరణం' అని జపిస్తూ డాక్టరు దగ్గరకి వెళ్ళాను. అతను, "మీకు క్యావిటీ ఉంది. దాన్ని ఒకసారి తెరిచి చూస్తే, రూట్ కెనాల్ అవసరమా, లేదా అన్నది మనకి తెలుస్తుంది" అని అన్నారు. నేను 'సాయి రక్షక శరణం' అని జపిస్తూ ఉండగా అతను పరిశీలించి కొన్ని నిమిషాల తర్వాత "మీకు రూట్ కెనాల్ అవసరం లేద"ని చెప్పారు. ఆనందంతో నాకు కన్నీళ్లు రాగా నా సాయితండ్రికి ఎలా కృతజ్ఞతలు చెప్పాలో నాకు తెలియలేదు. నేను బాబాతో "నేను ఈరోజే నా అనుభవాన్ని తోటి భక్తలతో పంచుకుంటాన"ని చెప్పి మాటిచ్చాను. ఆ మాటనిలా నెరవేర్చుకున్నాను. ఈ అనుభవం ద్వారా సాయి ఒక భక్తుని సమస్యకి మరొకరి అనుభవం ద్వారా పలుకుతున్నారని నేను గ్రహించాను. దయచేసి అందరూ నన్ను నమ్మండి, సాయి ఈ బ్లాగ్ ద్వారా మన కోరికలను తీర్చడమే కాదు, మనందరితో మాట్లాడుతూ మన సమస్యలకు సమాధానాలు ఇస్తున్నారు. ఇది మరో సాయి ప్రశ్నావళి పుస్తకం. ఇందులో మన ప్రశ్నలన్నింటికీ సమాధానాలు ఉన్నాయి. ఈ బ్లాగును ఏర్పాటు చేసి మాకు సహాయం చేస్తున్న అన్నయ్య మీకు మరోసారి చాలా చాలా ధన్యవాదాలు.

2022, మే నెల రెండో వారంలో నా పెద్దకొడుకుని స్కూల్లో తన తోటి పిల్లలు అనుకోకుండా తోసివేయడంతో తను కిందపడిపోయాడు. డాక్టరు, "బాబుకి ఫ్రాక్చర్ అయింది. తనని కట్టుకట్టే డిపార్ట్మెంట్(యు.ఎస్.ఏలో ప్రతి విషయానికి వేర్వేరు డిపార్ట్మెంట్లు ఉంటాయి)కి తీసుకుని వెళ్ళండి" అని చెప్పారు. నా జీవితంలో మొట్టమొదటసారి నా కొడుకుకి కట్టు వేయాలని డాక్టరు ద్వారా తెలుసుకున్న నేను అస్సలు చింతించలేదు. ఎందుకంటే, సాయి గత జన్మ కర్మ నాశనం చేస్తున్నారని నాకు తెలుసు. అందుచేత నేను చాలా ప్రశాంతంగా, ఎమీ జరగనట్టు చాలా మూమూలుగా కూర్చున్నాను. అది చూసి నా భర్త కూడా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే, నేను సాధారణంగా పిల్లలకి ఏమైనా అయితే కన్నీళ్లు పెట్టుకుంటాను. అలాంటిది ఈసారి 'అది విధిరాత అయితే అలాగేకానీ, సాయిని దాటి అది నా దగ్గరకు వచ్చింది కాబట్టి చింతించనవసరం లేదు. చూసుకోవడానికి ఆయన ఉన్నారు' అని అనుకున్నాను. నా భర్త బాబుని కట్టుకట్టే డిపార్ట్మెంట్ కి తీసుకుని వెళితే, అక్కడి డాక్టర్ చూసి, "బాబుకి కేవలం వెంట్రుక అంత చిన్న ఫ్యాక్చర్ అయినందువల్ల చింతించాల్సిన అవసరం లేదని, తనకి కట్టు వేయాల్సిన అవసరం కూడా లేదని, కేవలం బ్రాస్స్ వేస్తే సరిపోతుంది" అని అన్నారు. నా భర్త ఆ విషయం నాకు ఫోన్ చేసి చెప్పారు. నేను సాయి అనుగ్రహానికి చాలా సంతోషించాను. ఈ అనుభవం ద్వారా నేను మొదటిసారి "మీ భారాన్ని నాపై వేయండి" అని సాయి చెప్పిన మాటను అనుభూతి చెందాను. అలా చేయడం వల్ల నేను చాలా ప్రశాంతంగా ఉండగలిగాను. "సాయీ! పెద్ద సమస్యను చిన్నదిగా చేసి నా పెద్ద కొడుకును ఒక పెద్ద సమస్య నుండి కాపాడినందుకు మీకు ధన్యవాదాలు. మీకు తెలుసు మేము చాలా ఒడిదుడుకులలో ఉన్నాము. కానీ నేను భయపడకుండా మీరు వాటిని ఏవిధంగా పరిష్కరించనున్నారో అని వేచి చూస్తున్నాను తండ్రి. మేము వచ్చే నెలలో భారతదేశానికి వెళ్లాలని ప్లాన్ చేస్తున్నామని మీకు తెలుసు బాబా. దయచేసి ప్రయాణంలో ఎటువంటి టెన్షన్స్, అవాంతరాలు లేకుండా చూడండి. అలాగే మేము ఎప్పుడూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉండేలా చూడండి బాబా. దయచేసి నన్ను ఇతర విషయాల నుండి కూడా విడిపించి నా అనుభవాన్ని నా సాయి కుటుంబసభ్యులతో మరొకసారి పంచుకునేలా త్వరగా నన్ను ఆశీర్వదించండి సాయి".

మనసులో నలుగుతున్న ప్రశ్నకు సమాధానమిచ్చిన బాబా

ఓం శ్రీసాయినాథాయ నమః!!! ముందుగా 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు నిర్వాహకులకు మరియు సాయి బంధువులందరికీ సాయితండ్రి ఆశీస్సులు ఎల్లవేళలా పరిపూర్ణంగా ఉండాలని బాబాను ప్రార్థిస్తున్నాను. నేను ఒక సాయి భక్తురాలిని. బాబా నాకు ప్రసాదించిన ఒక చిన్న అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటున్నాను. ఇటీవల నా కూతురుకి పదవ తరగతి పరీక్షలు జరుగుతున్నప్పుడు ఒకరోజు తను తన కళ్లద్దాలు ఎక్కడో పెట్టి మరిచిపోయింది. అవి లేకపోవడం వల్ల తను చదవడానికి ఇబ్బంది పడుతుంటే నేను బాబాని తలచుకుంటూ 2, 3 సార్లు ఇల్లంతా కళ్ళజోడు కోసం వెతికాను. కానీ అవి దొరకలేదు. నేను మరోసారి వెతకదలచి ముందుగా బాబాను, "బాబా! నాకు ఆ కళ్ళజోడు దొరికినా లేదా తను ఇబ్బందిపడకుండా చదువుకోగలిగినా నా అనుభవాన్ని తోటి భక్తులతో పంచుకుంటాను" అని ప్రార్థించాను. అలా బాబాను ప్రార్థించిన కొద్ది సెకన్లలో సోఫా క్రింద కళ్లద్దాలు కనిపించడం నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. అంతేకాదు ఈ సంఘటన ద్వారా సాయిబాబా నాలో రోజు జరిగే సంఘర్షణకు జవాబు తెలిపారని అర్దం అయింది.

విషయమేమిటంటే, నేను ప్రతిరోజూ ఈ బ్లాగులో సాయినాథుని లీలలు చదువుతూ ఉంటాను. చాలా అనుభవాలలో “నా అనుభవాన్ని 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను అని బాబాను వేడుకున్నాను. బాబా దయవల్ల తొందర్లోనే నా సమస్య తీరింది” అని ఉండటం చూసి, 'బ్లాగ్‌లో అనుభవాలను పంచుకోమని సాయి ఎందుకు చెబుతున్నారు?' అని నా మనస్సులో ఒక ప్రశ్న నలుగుతూ ఉండేది. పై అనుభవం వల్ల ఆ ప్రశ్నకు సమాధానం నాకు దొరికింది. సచ్చరిత్ర అంటే భక్తుల అనుభవాల సమాహారం. ఈ బ్లాగ్ చదువుతున్నప్పుడు సాయి సచ్చరిత్ర చదువుతున్న అనుభూతిని, ఆనందాన్ని మనం పొందుతాము. మరి ఇతరుల అనుభవాలను చదివి ఆనందిస్తున్న నేను ఈ బ్లాగు చదివేవారికి ఆ ఆనందాన్ని తిరిగి ఇవ్వాలి కదా! అందుకే ఇకనుంచి నా అనుభవాలను పంచుకోవాలని నేను నిర్ణయించుకున్నాను. ఇలా మొదటిసారి నా అనుభవం పంచుకుంటున్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".

వర్షం తగ్గించి పరీక్షకు ఆటంకం లేకుండా చూసిన బాబా

ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి!!! సాయి బంధువులందరికీ నా నమస్కారాలు. నేను ఒక సాయి భక్తురాలిని. నేనిప్పుడు బాబా నాకు ప్రసాదించిన ఒక అనుభవాన్ని మీతో పంచుకుంటున్నాను. 2021, మే 16, ఉదయం 9 గంటలకి నా డిగ్రీ పరీక్ష ఉండగా బాగా వర్షం పడసాగింది. అసలే మా ఊరు నుండి పొద్దున్నే బస్సులు, ఆటోలు ఉండవు. పైగా నేను ఒంటరిగా ఉన్నాను. ఒక పక్క వర్షం, మరోపక్క పరీక్ష ఎలా వ్రాస్తానని టెన్షన్ పడుతూ, "ప్లీజ్ బాబా, పది నిమిషాల్లో వర్షం తగ్గిపోయేలా చేయండి. అదే జరిగితే నేను పరీక్ష వ్రాసి వచ్చాక నా అనుభవాన్ని తోటి భక్తులతో పంచుకోవడానికి బ్లాగుకి పంపుతాను" అని బాబాను ప్రార్థించాను. అంతే, బాబా వర్షం తగ్గించారు. ఆయన దయవల్ల నేను పరీక్ష కూడా బాగా వ్రాసాను. నాకు చాలా సంతోషంగా ఉంది. "బిడ్డా! నేనెప్పుడూ మీతోనే ఉంటాన"ని బాబా చెప్తూ ఉంటారు. అది నిజం. "థాంక్యూ సో మచ్ బాబా. ఐ లవ్ యు బాబా. మీకు చాలా చాలా ధన్యవాదాలు సాయి".

3 comments:

  1. Om sai ram i am suffering from negative thoughts towards future life.with that thoughts my thinking also changed.No. Human beings think like that.please baba save from negitive to positive thoughts.

    ReplyDelete
  2. Om Sairam
    Sai Always be with me

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo