సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1339వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా దయతో పరిష్కారమైన సమస్యలు
2. ప్రాజెక్ట్ నుండి తప్పించి టెన్షన్ తొలగించిన బాబా
3. దయతో అబ్బాయిని ఇంటికి చేర్చిన బాబా

బాబా దయతో పరిష్కారమైన సమస్యలు

సాయిభక్తులందరికీ నా నమస్కారాలు. ఈ బ్లాగ్ నడుపుతున్న సాయికి ధన్యవాదాలు. ఈ బ్లాగులో సాయిభక్తులు తమ అనుభవాలు పంచుకోవడం వల్ల వాటిని చదివిన మాకు బాబాపై నమ్మకం మరింత పెరుగుతోంది. నా పేరు విజయ. మాది పూణే. మాకు, మా కుటుంబానికి తల్లి, తండ్రి అన్నీ బాబానే. బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలు ఇప్పుడు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. 'ఏమైనా తప్పులు ఉంటే క్షమించమ'ని ముందుగా బాబాకి చెప్పుకుంటున్నాను. మా అబ్బాయి ఇంటర్ చదువుతున్నప్పుడు 'IMUN(International Model United Nations)' అనే ఒక ఇన్‌స్టిట్యూట్ నిర్వహించిన డిబేట్ కాంపిటీషన్‌లో పాల్గొన్నాడు. ఆ ఇన్‌స్టిట్యూట్‌లోనే తను సర్టిఫికెట్ కోసం ఇంటర్న్‌షిప్ చెయ్యాలని అనుకున్నాడు. దానికోసం తను ఒక 11మందిని జాయిన్ చేయిస్తే, ఆ ఇన్‌స్టిట్యూట్ వాళ్ళు తనను అంబాసిడర్‌గా ప్రకటించి సర్టిఫికెట్(ప్రశంసాపత్రం) ఇస్తారు. ఆ సర్టిఫికెట్ భవిష్యత్తులో ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్‌గా తనకి ఉయోగపడుతుంది. అయితే, ఆ ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ చేయించడానికి మా అబ్బాయికి పదిమంది మాత్రమే దొరికారు. పదకొండో వ్యక్తి దొరకలేదు. అప్పుడు నేను, "బాబా! మీ దయతో మా అబ్బాయికి 11 మంది దొరకాలి. అలా దొరికితే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను వేడుకున్నాను. బాబా ఎంతో దయతో మా అబ్బాయికి 13 మంది దొరికేలా చేశారు. "థాంక్యూ సో మచ్ బాబా".

ఈమధ్య మా అబ్బాయి ఒక విషయంగా మా మాట వినకపోతుంటే నేను బాబా దగ్గర చాలా బాధపడి, "బాబా! మేము చెప్పేది మా అబ్బాయి ప్రశాంతంగా అర్థం చేసుకునేలా అనుగ్రహించండి" అని వేడుకున్నాను. బాబా దయచూపారు. అదేరోజు సాయంత్రం మా అబ్బాయి తన అభిప్రాయాన్ని మార్చుకుని మేము చెప్పేది శాంతంగా విన్నాడు.

బాబా దయవల్ల మా అబ్బాయికి ఒక మంచి కాలేజీలో బి.టెక్ అడ్మిషన్ దొరికింది. కాలేజీవాళ్ళు, 'ఫలానా తేదీలోగా హాస్టల్ బుక్ చేసుకోమ'ని ప్రకటించారు. కానీ క్లోజింగ్ డేట్ రాకుండానే రూమ్స్ అన్నీ బుక్ అయిపోయాయి. మాకు ఏమి చేయాలో తోచలేదు. అప్పుడు నేను, "బాబా! బాబుని అంత దూరం పంపుతున్నాము. తనకి కాలేజీ హాస్టల్లో రూమ్ దొరికేలా అనుగ్రహించండి బాబా, ప్లీజ్. ఈరోజు సాయంత్రానికి బాబుకి హాస్టల్ గది దొరికితే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను వేడుకున్నాను. అదేరోజు సాయంత్రం మావారు కాలేజీ డైరెక్టర్‌తో మాట్లాడితే, బాబా దయవల్ల ఆయన మా అబ్బాయికి రూమ్ కన్ఫర్మ్ చేస్తానని చెప్పారు. మరుసటిరోజు ఆయన రూమ్ ఎలాట్ చేయడం, మావారు ఫీజు చెల్లించడం కూడా చకచకా జరిగిపోయాయి. ఇది కేవలం నా సాయితండ్రి చేసిన సహాయం మాత్రమే. బాబాకి మాటిచ్చినట్లు నా అనుభవాన్ని మీ అందరితో పంచుకోగలిగినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. "ధన్యవాదాలు బాబా. మాకు దూరంగా వెళ్తున్న మా అబ్బాయికి, మాకు మీరు ఎప్పుడూ తోడుగా ఉండండి బాబా. అలాగే, మమ్మల్ని మీ మార్గంలో నడిచేలా ఆశీర్వదించండి బాబా. నన్ను, నా కుటుంబాన్ని, మీ భక్తులందరినీ సదా చల్లగా చూడండి బాబా".

ప్రాజెక్ట్ నుండి తప్పించి టెన్షన్ తొలగించిన బాబా

నేను ఒక సాయిభక్తురాలిని. నేను 2015వ సంవత్సరంలో 'ఎంసీఏ' పూర్తిచేశాను. తరువాత నేను నాన్-ఐటీ ఉద్యోగంలో చేరాను. కానీ ఐటీ ఉద్యోగం చేయాలన్న కోరికతో కొన్ని కోర్సులు నేర్చుకోవడం మొదలుపెట్టాను. కానీ ఆర్థిక సమస్యల వల్ల ప్రతిసారీ మధ్యలోనే ఆపేసేదాన్ని. 2020లో నాకు పెళ్లయ్యాక నా భర్త మద్దతునివ్వడంతో నేను మళ్ళీ ఒక కోర్సు నేర్చుకోవడం మొదలుపెట్టాను. మధ్యలో నేను గర్భవతినని తెలిసింది. అయినా ఈసారి మధ్యలో ఆపేయొద్దని బాబాపై భారం వేసి కోర్సు పూర్తిచేశాను. బాబా దయవల్ల నాకు నేను కోరుకున్న ఐటీ ఉద్యోగం వచ్చింది. మూడు నెలలకి నన్ను ప్రాజెక్టులో వేశారు. అయితే అప్పుడు నేను ఆరో నెల గర్భవతిగా ఉన్నాను. నాకు అదివరకు ఐటీ వర్క్ అనుభవం లేనందున, వర్క్ చేయడానికి రాక మేనేజ్ చేసుకోలేకపోయేదాన్ని. దాంతో నాకు టెన్షన్ ఎక్కువై నిద్రపోయేదాన్ని కాదు. ప్రతిరోజూ రాత్రి బాబాని తలచుకుని, "బాబా! ఎలా అయినా నా ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని కంపెనీవాళ్లే నన్ను ఈ ప్రాజెక్టు నుండి తీసేలా చేయండి" అని ప్రార్థించి కన్నీళ్లు పెట్టుకునేదాన్ని. ఏదైనా విషయంలో బాబా దగ్గర చీటీలు వేయడం నాకలవాటు. అలా ప్రస్తుత సమస్య విషయంలో చీటీలు వేసినప్పుడల్లా, 'వాళ్లే ప్రాజెక్టు నుండి తీసేస్తారు. నీ ఉద్యోగానికి ఏం కాదు' అని వచ్చేది. అంతలో నాకు ఏడవ నెల వచ్చింది. ఇంట్లోవాళ్ళు, "చాలా జాగ్రత్తగా ఉండాలి. టెన్షన్ వద్దు" అనేవారు. కానీ బాబా చీటీల ద్వారా చెప్పినట్లు జరిగేది కాదు. ఇలా ఉండగా హఠాత్తుగా మా మేనేజర్ ఫోన్ చేసి, "నిన్ను ప్రాజెక్ట్ నుండి తీసేస్తున్నాము. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకో!" అని అన్నారు. చివరికి బాబా నా ఆరోగ్యాన్ని, నా బిడ్డ ఆరోగ్యాన్ని కాపాడారని నేను ఆశ్చర్యానందాలకు లోనయ్యాను. "ధన్యవాదాలు బాబా! ఇప్పుడు నాకు తొమ్మిదో నెల తండ్రీ. నాకు సుఖప్రసవమై నేను, నా బిడ్డ ఆరోగ్యంగా ఉండేలా ఆశీర్వదించండి బాబా. అలానే కాన్పు అనంతరం నేను మళ్ళీ ఉద్యోగంలో చేరాలి. మీరు తోడుగా ఉండి వర్క్ నేర్పించి నా ఉద్యోగాన్ని పర్మినెంట్ చేయించాలి బాబా".

దయతో అబ్బాయిని ఇంటికి చేర్చిన బాబా

సద‌్గురు శ్రీసాయినాథ్ మహరాజ్ కీ జై!!! 

శ్రీసాయి బంధువులందరికీ నా నమస్కారాలు. ఈ బ్లాగును నిర‌్వహిస‌్తున‌్న సాయికి నా కృతజ్ఞతలు. నేను ఒక సాయిభక‌్తుడిని. నా పేరు చంద్రశేఖర్. మాది పాతర‌్లగడ‌్డ (కాకినాడ రూరల్). నేను మొదటిసారి ఈ బ్లాగులో సాయిబాబా నాకు చేసిన ఒక మేలును పంచుకుంటున‌్నాను. ఈమధ్య, అనగా 2022, సెప‌్టెంబరు 6వ తేదీన మా తమ్ముడి కొడుకు తను పనిచేసే కంపెనీ దగ‌్గర ఏదో తప‌్పు చేశాడని తెలిసి మా తమ్ముడు తనకి ఫోన్ చేసి తిట్టాడు. ఆ అబ్బాయి తండ్రి తిట‌్టాడని చెప‌్పి ఆరోజు సాయంత్రం ఇంటికి రాకుండా ఎక‌్కడికో వెళ‌్లిపోయాడు. నాకు విషయం తెలిసి నేను, "బాబా! అబ్బాయి ఎక‌్కడ ఉన‌్నా ఇంటికి తిరిగి వచ‌్చేలా చేయి తండ్రీ. వాడు ఇంటికి తిరిగి వస‌్తే, మీ అనుగ్రహాన్ని నేను మీ బ‌్లాగులో పంచుకుంటాను" అని బాబాకి మ్రొక‌్కుకున‌్నాను. బాబా దయవలన అబ్బాయి మరుసటిరోజు సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చాడు. "బాబా! మాకు ఎంతో మేలు చేశావు తండ్రీ. మీకు చాలా చాలా ధన్యవాదాలు. మీ కృపతో నాకున్న రెండు కోర‌్కెలు నెరవేరితే, మళ్లీ మీ బ‌్లాగులో పంచుకుంటాను బాబా".

సద‌్గురు శ్రీసాయినాథ్ మహరాజ్ కీ జై!!!
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!!!


సాయిభక్తుల అనుభవమాలిక 1338వ భాగం....


ఈ భాగంలో అనుభవం:

  •  శ్రీసాయి అనుగ్రహ లీలలు - పదవ భాగం

సాయిబాబుగారు తమకు బాబా ప్రసాదించిన కొన్ని అనుభవాలు గతవారం పంచుకున్నారు. ఇప్పుడు మరికొన్ని అనుభవాలు పంచుకుంటున్నారు.


‘బాబా’ అనే రెండు అక్షరాలలో ప్రపంచమే ఉంది. ఆయనని మనస్ఫూర్తిగా ధ్యానిస్తే, ఆయన మన దగ్గరకు వస్తాడు, మన సమస్యలు పరిష్కరిస్తాడు. దైవచింతన ఎంత దృఢంగా ఉంటుందో, మన సమస్యల పరిష్కారం అంత సుళువుగా, తేలికగా ఉంటుంది. ఒకసారి దసరా సెలవుల్లో నేను, నా భార్య బాబా అనుమతి తీసుకుని రాములవారి దర్శనం కోసం భద్రాచలం వెళ్ళాము. అక్కడ మూడు రోజులుండి, చూడవలసిన ప్రదేశాలు చూసి మూడవరోజు సాయంత్రం 6 గంటలకు భద్రాచలం బస్టాండుకు వెళ్ళాము. తీరా చూస్తే, నా జేబులో 198 రూపాయలు మాత్రమే ఉన్నాయి. నా దగ్గర డబ్బులున్నాయని నా భార్య, ఆమె దగ్గర ఉన్నాయని నేను ప్రసాదాలకు, ఇతరత్రా ఖర్చులకు ఖర్చుపెట్టేశాము. ఆ రోజుల్లో సెల్‍ఫోన్లు, ఏటిఎమ్‍లు లేవు. 'ఉన్న డబ్బులు ఇంటికి వెళ్ళడానికి సరిపోవు, ఇప్పుడెలా? కనీసం విజయవాడ వరకైనా చేరుకుంటే, అక్కడ స్నేహితుల ఇంటికి వెళ్ళొచ్చు. కానీ వాళ్ళు అందుబాటులో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మరి అప్పుడెలా? ఏమి చేయాలి? ఎవరినీ అడగలేము' అని మా మదిలో ఎన్నో ఆలోచనలు. ఈ ఆలోచనలతో సమయం 7 గంటలయ్యింది. ఒకప్రక్క బాగా చీకటి పడుతోందనే కంగారు. అంతలో విజయవాడ బస్సు వచ్చింది. బస్సు ఎక్కబోతుండగా ఎవరో తుమ్మారు. బహుశా ఆ బస్సు ఎక్కవద్దని బాబా నిర్ణయం కాబోలునని మేము ఆ బస్సు ఎక్కలేదు. అరగంట తర్వాత గుంటూరు బస్సు వచ్చింది. మా దగ్గరున్న 198 రూపాయలతో ఇద్దరమూ గుంటూరు చేరుకోవచ్చని, ఆ బస్సులో ఎక్కి కూర్చున్నాము. కానీ మనసులో, 'బస్సు తెల్లవారుఝామున మూడు గంటలకు గుంటూరు చేరుతుంది. కానీ అక్కడినుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న నారాకోడూరులోని మా ఇంటికి ఎలా చేరుకోవాలి? తెల్లవారితే గురువారం. ఇంట్లో పూజ చేసుకోవాలి' అన్న ఆలోచనల మధ్య బస్సు బయలుదేరింది. నేను రాత్రి 11 గంటల సమయంలో తలవంచుకుని ఆలోచిస్తూ, "ఈ సమస్య నుండి గట్టెక్కించండి" అని బాబాను ప్రార్థిస్తూ అప్రయత్నంగా తల పక్కకి త్రిప్పి చూశాను. నా ప్రక్కనే నడివయస్కుడైన ఒక వ్యక్తి నిల్చొని ఉన్నారు. ఆయన భుజాల చుట్టూ కప్పుకుని ఉన్న శాలువా అంచుబారున 'సాయి సేవక్, సాయి సేవక్' అని తెలుగులోనూ, ఇంగ్లీషులోనూ అచ్చువేసిన అక్షరాలు కన్పించాయి. అవి చూడగానే నాకు ప్రాణం లేచి వచ్చినట్లయింది. నేను నా సీటులో నుండి పైకి లేచి నిలబడి, "మీరు సాయిభక్తులా?" అని ఆయనను అడిగాను. అందుకాయన, “అవును, నేను సాయి సేవకుడను” అని జవాబిచ్చారు. అప్పుడు నేను ఆయనతో మా ఇబ్బంది చెప్పి, “మా ఇంటికి చేరటానికి అవసరమైన పైకం ఇవ్వండి. ఆ పైకాన్ని మేము  ఇంటికి చేరిన తర్వాత బాబా మందిరంలోని హుండీలో వేస్తాము" అని చెప్పాను. ఆయన 'అలాగే'నని అన్నారు. ఒక అరగంట తర్వాత ఆయన ఒక ప్రదేశంలో బస్సు ఆపమని, నాకు 10 రూపాయల నోటు ఇచ్చి బస్సు దిగారు. నేను ఆయనకు కృతజ్ఞతలు చెప్పాను. తర్వాత మేము ఆయనకు లడ్డు ప్రసాదం ఇద్దామని, బస్సు కిటికీ గ్లాసు తెరిచి చూస్తే, చుట్టూ చీకటి, పొలాలు తప్ప ఇళ్ళు లేవు. అలా చూస్తూనే ఉన్నాము. ఆయన ఆ పొలాల్లో ఒక నిమిషం నడిచి అదృశ్యమైపోయారు. ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్న మమ్మల్ని అలా తమ సేవకుడిని పంపి ఆదుకున్నారు బాబా. వెంటనే మాకు శ్రీసాయిసచ్చరిత్రలోని 'జామ్నేరు లీల' గుర్తుకు వచ్చింది. తెల్లవారుఝామున 4 గంటలకు మేము మా ఇంటికి చేరుకున్నాము. బాబా పూజ అయ్యాక, గుడికి వెళ్లి, బాబా దర్శనం చేసుకుని 10/- రూపాయలు హుండీలో సమర్పించాము. మరుసటిరోజు ఊరికి తీసికెళ్ళిన బట్టలను బ్యాగులో నుండి తీసి సర్దుతుంటే, బ్యాగు అడుగున 500 రూపాయల నోటు కన్పించేసరికి మేము ఆశ్చర్యపోయాము. అప్పటివరకూ ఆ 500/- జాగ్రత్తగా అడుగున పెట్టిన విషయం మాకు గుర్తురాలేదంటే బాబా లీల జరగడానికేనేమో అనిపించింది! ఎందుకంటే, మేము ఆ నోటు బయటికి తీసి చిల్లర మార్చుకుని ఇంటికి వచ్చినట్లయితే ఈ లీల జరగడానికి ఆస్కారం ఉండేది కాదు. ఏదేమైనా అద్భుతమైన బాబా లీల గనుక ఇన్ని సంవత్సరాలైనా మా మనస్సులో చిరస్మరణీయంగా ఉండిపోయింది.


ఒకసారి నేను, నా భార్య గుంటూరులో ఉన్న మా బంధువుల ఇంటికి వెళ్ళాం. బాబా గురించి మాట్లాడుతూ సమయం చూసుకోలేదు. తీరా చూసుకునేసరికి రాత్రి 11 గంటలైపోయింది. ఆ సమయంలో నేను, నా భార్య మా కారులో నారాకోడూరులో ఉన్న మా ఇంటికి బయలుదేరాం. బాగా దాహమేస్తుంటే, 'కూల్‌డ్రింక్స్ త్రాగము కాబట్టి, ఎక్కడైనా చెఱకురసం స్టాల్ కనిపిస్తే దాహం తీర్చుకోవచ్చు' అనుకున్నాం. మళ్ళీ అంతలోనే, 'ఈ సమయంలో ఏ చెఱకురసం స్టాల్ తెరచి ఉండదు కదా!” అని కూడా అనుకున్నాం. కానీ బాబా చెఱకురసంతోనే మా దాహం తీర్చారు. ఎలాగంటే, మా కారు గుంటూరు స్టేడియం వద్ద మలుపు తిరగ్గానే, ఎదురుగా చెఱకురసం స్టాల్, అందులోనూ పెద్ద బ్యానరు మీద బాబా ముఖచిత్రం కన్పించింది. మేం కారు ఆపి చెఱకురసం త్రాగాము. మేము  ఆ షాపతనిని,  “నువ్వు బాబా భక్తుడివా? షాపులో బాబా ఫోటో పెట్టుకున్నావు” అని అడిగాము.  అందుకతను, “అలాగే అనుకోండి” అని అన్నాడు. మేము, “నీ వ్యాపారం బాగా జరగాలంటే, రోజూ మొదట తీసిన ఒక గ్లాసుడు చెఱకురసం ముసలివాళ్ళకెవరికైనా ఉచితంగా ఇవ్వు” అని చెప్పాము. అతను, “ఒకరికి కాదు. నేను మొదటి ఒక గ్లాసు చెఱకురసం తీసి దేవునికి నివేదించి, దాన్ని తిరిగి మిగిలిన చెఱకురసం గిన్నెలో పోసి అంతా కలిపి అందరికీ ఇవ్వటం మొదలుపెడతాను” అని అన్నాడు. మేము ఇంటికొచ్చాక ఆ సంఘటనను జ్ఞాపకం చేసుకున్నప్పుడు, 'ప్రత్యక్షంగా డబ్బు రూపంలో ఆ స్టాల్ అతనికి, పరోక్షంగా ప్రసాదరూపంలో భక్తులను అనుగ్రహిస్తుంది బాబానే కదా!' అనిపించి, ఏదేమైనా వేళకానివేళలో అనుకోగానే చెఱకురసంతో బాబానే స్వయంగా మా దాహం తీర్చారనుకున్నాం.


2001, మే నెలలో ఒకరోజు మధ్యాహ్నం 3 గంటలవుతుండగా, 'సెలవులు కదా! వైజాగ్ చూడాలని ఉంది. వెళ్ళాలా? వద్దా?' అని బాబాను అడిగాను. బాబా వెళ్ళమని అనుమతినిచ్చారు. ఆ రాత్రి 9 గంటలకు గుంటూరు స్టేషనుకి వెళ్ళాము. రైలు చాలా రద్దీగా ఉంది. చిన్నప్పటినుంచి రిజర్వేషన్ లేకుండా వెళ్లడం అలవాటు లేకపోయినప్పటికీ ఎలాగోలా ఆ రైలు ఎక్కి మరుసటిరోజు ఉదయం 6 గంటలకు వైజాగ్ చేరుకున్నాము. వెంటనే ప్రక్క ఫ్లాట్‌ఫారం మీద ఉన్న మరో రైలు ఎక్కి మధ్యాహ్నం 3, 4 గంటల ప్రాంతంలో అరకులో దిగాము. అక్కడ మాకు ఏమీ తెలీదని అనుకుంటున్నంతలో 16, 17 సంవత్సరాల వయస్సున్న ఒక కుర్రాడు మా వద్దకు వచ్చి, మాకు ఒక రూము ఇప్పించి, అక్కడ చూడవలసిన ప్రదేశాల గురించి వివరంగా చెప్పి వెళ్ళాడు. మేము ఒక్కరోజులో అవన్నీ చూసి, మరుసటిరోజు ఉదయం బస్సులో బొర్రాగుహలు చూడటానికి బయలుదేరాము. ఆ దారిలో శ్రీఆంజనేయస్వామి విగ్రహం ఒకటి ఉంది. అక్కడ మేము కొబ్బరికాయ కొట్టి మొక్కు తీర్చుకోవాల్సి ఉంది. ఆ విషయం కండక్టరుతో చెపితే, "అక్కడ ఒక్క నిమిషం బస్సు ఆపుతాను. వెళ్లి, కొబ్బరికాయ కొట్టి రండి” అని అన్నాడు. మాకేమో ఒక 10, 15 నిమిషాలైనా ఆ గుడి వద్ద గడపాలని ఉంది. అయితే శ్రీఆంజనేయస్వామి గుడి పది గజాల దూరంలో ఉందనగా బస్సు టైరు పంక్చరు అయి, టైరు మార్చటానికి ఒక గంట సమయం పట్టింది. ఈ లోపల మేము ఆనందంగా కొబ్బరికాయ కొట్టి, చాలాసేపు అక్కడ గడిపాము. ఒకానొక సందర్భంలో నా భార్య ఆ ఆంజనేయస్వామికి "కొబ్బరికాయ కొడతాన"ని మొక్కుకుంది. దానిని తీర్చటానికి బాబా చేసిన లీల ఇది. తరువాత మేము బొర్రాగుహలు చూసి వైజాగ్ వెళ్ళడానికి రైలు ఎక్కాము. మా ప్రక్కన కూర్చునవాళ్ళని అడిగితే, "వైజాగ్ స్టేషన్ వరకు వెళ్లకుండా, ముందొచ్చే స్టేషన్లో దిగి సింహాచలం వెళ్ళటం తేలిక” అని చెప్పారు. అప్పుడు రాత్రి తొమ్మిది గంటలైంది. 'వాళ్ళు చెప్పిన చోట దిగాలా, వద్దా?' అని బాబాని అడిగితే, 'వద్దు' అని జవాబు వచ్చింది. అందువలన మేం సరాసరి వైజాగ్ వెళ్ళిపోయాము.  మరుసటిరోజు ఉదయాన్నే బస్సులో ఒకరోజు యాత్ర అని వైజాగ్ సిటీతోపాటు సింహాచలం దర్శించేలా బాబా అనుగ్రహించారు.


మూడు రోజుల తర్వాత రాత్రి 9 గంటలకి తిరుగు ప్రయాణం కోసం వైజాగ్ రైల్వేస్టేషన్ చేరుకున్నాము. రైలు బయలుదేరటానికి సిద్ధంగా ఉంది. కానీ కాలు పెట్టడానికి కూడా వీలులేనంత రద్దీగా ఉంది. ఖాళీగా ఉన్నది రైలు గార్డు రూము మాత్రమే. మేము, "అందులో ఎక్కవచ్చా?" అని అడిగితే, “గార్డు ఉద్యోగం పోతుంది. అందువలన పర్మిషన్ ఇవ్వరు" అని అన్నారు. మాకు ఏం చేయాలో పాలుపోక బాబాని అడిగితే, “మీరు గార్డు రూములోనే ప్రయాణిస్తారు" అని సమాధానం వచ్చింది. ఇంక బాబా మీద భారమేసి గార్డు రూము దగ్గరే వేచివుండమని మావాళ్లతో చెప్పి, నేను మాత్రం అతి కష్టం మీద జనరల్ బోగీలో ఎక్కాను. అంతలో గార్డు వచ్చి, మావాళ్ళని, “మీరు ఇక్కడ ఎందుకు వేచి ఉన్నార"ని అడిగాడు. నా భార్య, “రైలు చాలా రద్దీగా ఉంది. మమ్మల్ని ఈ గార్డు రూములో ప్రయాణం చేయనివ్వండి" అని ఆయన్ని రిక్వెస్ట్ చేసింది. ఆయన ఇంకేమీ ఆలోచించకుండా, “దానికేముంది, మీరు నిరభ్యంతరంగా మాతోపాటు ప్రయాణం చేయొచ్చు” అని తన గార్డు రూములో ఎక్కించుకున్నాడు. ఆ గార్డు ఎంత మంచి వ్యక్తంటే, మధ్యలో రైలు ఆగినప్పుడు నాకోసం వెతికి టీ పంపించాడు. ఆ టీ నా వద్దకు చేరటానికి ఆ బోగీలో 10 మంది చేతులు మారాల్సి వచ్చింది. అంత రద్దీగా ఉంది ఆ రైలు. ఆ గార్డు నన్ను కూడా తన రూముకే రమ్మన్నాడు. కానీ నేను బయటకు దిగటానికి వీలులేకపోయింది. మేము తెల్లవారి 5 గంటలకి విజయవాడ చేరుకుని ఆ గార్డుకి కృతజ్ఞతలు చెప్పి, ఒక కప్పు కాఫీ ఇప్పించాము. ఆయన స్టేషను బయట వరకూ వచ్చి మమ్మల్ని సాగనంపారు. ఆయన చేసిన మేలు, కాదు..కాదు, ఆయన ద్వారా బాబా చేసిన సహాయం మరువలేనిది.


ఒకరోజు ఉదయం 9 గంటలకు నేను, నా భార్య బెంగళూరు నుండి విజయవాడ వెళ్లేందుకు రైలు ఎక్కాము. అది సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు అయినందున నెల్లూరు తర్వాత విజయవాడలోనే ఆగుతుంది. విజయవాడ చేరుకునేసరికి రాత్రి రెండు గంటలవుతుంది. అయితే ఒంగోలు దాటిన తర్వాత తోటి ప్రయాణీకులు, "ట్రైన్ తెనాలిలో బాగా స్లో అవుతుంది. దిగిపోండి" అని అన్నారు. అప్పుడు మేము బాబాని అడిగితే, "నిడుబ్రోలులో దిగండి" అని చెప్పారు. నిడుబ్రోలు నుండి మా ఊరికి 40 నిమిషాల ప్రయాణం మాత్రమే. కానీ 'నిడుబ్రోలులో సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆగవు. అయినప్పటికీ 'బాబా చెప్పారు కాబట్టి అంతా ఆయన చూసుకుంటార'ని మేము వేచి ఉన్నాము. రాత్రి ఏడు గంటలు అవుతుండగా రైలు 'నిడుబ్రోలు' స్టేషను ఔటరులో ఆగింది. చుట్టూ చీకటి, ఏమీ కనిపించట్లేదు. బాబాని, “ఇక్కడ దిగాలా?" అని అడిగితే, “వద్దు” అని సమాధానం వచ్చింది. అంతలో రైలు కదిలి నెమ్మదిగా వెళ్తూ 'నిడుబ్రోలు' స్టేషనుకి వెళ్లి ఆగింది. బాబా మాట అక్షర సత్యమైంది. మేము హాయిగా, సంతోషంగా రైలు దిగి రాత్రి 8 గంటలకల్లా ఇల్లు చేరుకున్నాము. అలా జరగకుంటే మేము విజయవాడ వరకు వెళ్లి, అర్థరాత్రి 2 గంటలకి విజయవాడలో దిగేవాళ్ళం. అక్కడినుండి వెనక్కి 2 గంటలు ప్రయాణం చేస్తే మరుసటిరోజు ఉదయానికి ఇంటికి చేరేవాళ్ళము. అలాంటిది బాబా మాకోసం రైలుని నిడుబ్రోలులో ఆపి, తక్కువ సమయంలోనే మమ్మల్ని ఇంటికి చేర్చారు. మేము ఇల్లు చేరుకున్న తరువాత రాత్రి 9 గంటలకు మా అల్లుడు ఫోన్ చేసి, “ఏ స్టేషన్ దాటారు?” అని అడిగితే, "మేము గంట క్రితమే ఇల్లు చేరామ"ని చెప్పాము. అది విని మా అల్లుడు, “నిజమా!” అని ఆశ్చర్యపోయాడు.


2018, దసరా సెలవుల్లో బెంగళూరులో ఉన్న మా మనవడు 'సాయీష్'ను మా ఇంటికి తీసుకు రావాలని నేను బాబాని అనుమతి అడిగితే, బెంగళూరు వెళ్ళడానికి బాబా అనుమతి ఇవ్వలేదు. నాకు, 'ఏదో కారణం ఉండే ఉంటుంది. అందుకే బాబా అనుమతి ఇవ్వలేదు' అనిపించింది. ఒక వారం గడిచిన తరువాత హఠాత్తుగా మా అమ్మాయివాళ్లే  బెంగళూరు నుండి గుంటూరు వచ్చి సెలవులు గడిపి వెళ్లారు. వాళ్ల రాక గురించి బాబాకి తెలుసు గనకే బెంగళూరు వెళ్లడానికి నాకు అనుమతినివ్వలేదు. అయినా నేను వెళ్లుంటే, మనవడిని మాత్రమే తీసుకొచ్చేవాడిని. కానీ బాబా మొత్తం కుటుంబాన్ని మా వద్దకు పంపారు.


చిన్నవైనా, పెద్దవైనా వస్తువులు కొనే విషయంలో కూడా మేము బాబా నిర్ణయం ప్రకారమే వాటిని తీసుకుంటాము. సరైన ధరకు మంచివి ఇప్పిస్తారు బాబా. 2010లో ఒకరోజు నాలుగు బర్నర్లు ఉన్న గ్యాస్ స్టవ్ కొందామని నేను, నా భార్య, మా అమ్మాయి బెంగళూరులోని బిగ్‍బజారుకు వెళ్ళాము. లోపలికి వెళ్ళేముందు, 'పని అవుతుందా?' అని బాబాని అడిగితే, 'అవుతుంద'ని చెప్పారు. సరేనని, లోపలికి వెళ్ళి చూస్తే, రేట్లు వేలల్లో ఉన్నాయి. అంత డబ్బు మేము తీసుకెళ్లలేదు. అయినా మూడు గంటలసేపు వెతికాము. కానీ మాకు కావాల్సిన రేటులో స్టవ్ దొరకలేదు. ఏం చేయాలో తెలియక మళ్ళీ బాబాని అడిగితే, 'ఇక్కడే ఉంది' అని సమాధానం వచ్చింది. కానీ మాకు కనపడట్లేదు. వెతికి వెతికి చివరికి, "తిరిగి వెళ్ళిపోదామని” మా అమ్మాయి అంది. కానీ, ‘బాబా చెప్తే, అది ఖచ్చితంగా ఉంటుంద’ని మాకు గట్టి నమ్మకం. నా భార్య బాబా మీద విశ్వాసంతో వెతుకుతూ ఉండగా ఒక మూల చిందరవందరగా పడేసి ఉన్న అట్టపెట్టెల మధ్య ఒక బాక్స్ ఆమె కంటపడింది. అందులో ఏముందని బయటికి లాగి చూస్తే, అదే మాకు కావలసిన గ్యాస్ స్టవ్. బాబాని అడిగితే, దాన్ని తీసుకోమన్నారు. బిల్ వేస్తే కేవలం 1200 రూపాయలే అయింది. చూశారా! బాబా వేలల్లో ఉన్న స్టవ్‍ను, వందల్లోనే ఎలా మాకు ఇప్పించారో! సహనం ముఖ్యం.


2010లోనే ఒకసారి మేము మా మనుమడికి ఒక చిన్న సైకిల్ కొనిద్దామని బెంగళూరులోని ఒక షోరూమ్‍కి వెళ్లి ధర అడిగితే, 4000 రూపాయలు చెప్పారు. 'చిన్న సైకిల్ అంత రేటా?' అని మేము నిరుత్సాహపడ్డాము. బాబా కూడా అనుమతి ఇవ్వలేదు. మేము వెనక్కి తిరిగి వచ్చేశాము. వారంరోజుల తర్వాత బెంగళూరులోని ‘ఫినిక్స్' మాల్‍లో ఉన్న బిగ్‍బజారులో అలాంటి సైకిలే మాకు కన్పించింది. దాని వెల మూడువేల రూపాయలు ఉంది. బాబాని అడిగితే 'కొనమని' చెప్పారు. బాబా చెప్పారు కనుక అది మూడువేలు అయినా, పదివేలు అయినా తీసుకోక తప్పదు. కానీ బాబా మనల్ని నష్టపోనివ్వరు కదా! సైకిల్ తీసుకుని బిల్ వేయించాక చూస్తే, కేవలం 1800 రూపాయలే బిల్‍లో ఉంది. బిల్లు వేస్తే ఎంత పడుతుందో అది బాబాకే తెలుసు. మాకు తెలియదు కదా! అందుకే మేము ఏదైనా బాబా నిర్ణయం ప్రకారం నడుచుకుంటాము.


2018, మే నెలలో సుమారు 47 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతతో ఎండలు మండిపోతుండేవి. స్నానం చేసినట్టు ఒళ్ళంతా చెమటలు కారిపోతుండేవి. ఆపరేషన్ జరిగిన నా భార్య ఆ వేడిని అస్సలు తట్టుకోలేకపోతుండేది. ఏసీ తీసుకుందామని షోరూంకు వెళ్లి అంతా మాట్లాడుకున్న తర్వాత, "తీసుకోమంటారా?” అని బాబాని అడిగితే, “వద్దు” అని సమాధానమిచ్చారు. దాంతో చేసేదిలేక ఇంటికి తిరిగి వచ్చాము. ఇరవైరోజుల తర్వాత ఒక ముఖ్యమైన ఫంక్షనుకు వెళ్ళి, తిరిగొస్తూ మళ్ళీ అదే షోరూంకు వెళ్ళి, "ఇప్పుడైనా అనుమతిస్తారా బాబా?" అని బాబాని అడిగితే, మళ్ళీ “వద్దు” అని బాబా సమాధానమిచ్చారు. "బాబా మన మంచికోసం ఏదైనా చేస్తుంటారు" అని నేను, నా భార్య ఇంటికి తిరిగి వచ్చేసాము. ఇంట్లో కూలర్ ఉంటే దాన్ని శుభ్రం చేసి అదే వాడుకుంటుండేవాళ్ళము. అలా నాలుగైదు రోజులు గడిచాక ఒకరోజు మిట్టమధ్యాహ్నం నా ఫోన్‍కి ఏదో మెసేజ్ వచ్చిన శబ్దం వచ్చింది. నేను రోజూ వచ్చే ఏదో మెసేజై ఉంటుందిలే అనుకున్నాను. కానీ ఎందుకో ఒకసారి చూద్దామని ఫోన్ చేతిలోకి తీసుకుని మెసేజ్ చదివితే, “డబ్బులు అందాయి, రెండు రోజుల్లో ఏసీ డెలివరీ అవుతుంది” అని ఉంది. అది ఫ్లిఫ్ కార్ట్ నుండి వచ్చిన మెసేజ్. అందులో ఏసీ కంపెనీ పేరు మొదలైన వివరాలు కూడా ఉన్నాయి. ఒక్క నిమిషం నన్ను నేను నమ్మలేకపోయాను. వెంటనే బాబా ఫోటో వైపు చూసి, “మీరే ఏదో లీల చేసుంటారు" అని అనుకుంటుండగా నా కళ్ళల్లో నీళ్ళొచ్చాయి. అసలు విషయమేమిటంటే, బెంగుళూరులో ఉన్న మా అమ్మాయికి ఒక ఎయిర్ కూలర్ కొని మాకు ఇవ్వాలనిపించింది. కానీ బాబాను అడిగితే, ఏసీ ఇవ్వమని చెప్పారు. అంతే, తను ఫ్లిప్ కార్ట్ లో ఆర్డర్ పెట్టింది. రెండుసార్లు షోరూంకి వెళ్లి కూడా బాబా నిర్ణయానికి కట్టుబడి వెనక్కి తిరిగి వచ్చినందుకు ఆ ఏసీ ఆయన ఇచ్చిన బహుమతిలా మాకు అనిపించింది. "ధ్యాంక్యూ బాబా".


ఆకాశంలో ఎగిరే రెండిటిలో మనకు తెలిసినవి ఒకటి పక్షి, రెండవది విమానం. ఆ విమానంలో ఒకసారైనా ప్రయాణం చేయాలని ఎవరికి ఉండదు! బాబా ఆ కోరికను ఎలా తీర్చారో ఇప్పుడు చెప్తాను. 2014, ఆగష్టులో నా పుట్టినరోజున మేము బాబా మాకు బహుమతిగా ఇచ్చిన కారులో విజయవాడ వెళ్ళాము. విజయవాడ చేరిన తర్వాత ఎందుకో తలవని తలంపుగా గన్నవరం విమానాశ్రయం చూడాలనిపించి బాబాని అడిగితే, “వెళ్ళమ”ని సమాధానం వచ్చింది. సరే అని విమానాశ్రయానికి వెళ్లి, కారు పార్క్ చేసి, లాంజ్ వైపు వెళ్తుంటే ఒక సెక్యూరిటీ గార్డు మమ్మల్ని చూసి, “పేపర్లో ఆఫర్ చూసి వచ్చారా?" అని అడిగాడు. నిజానికి మాకు ఏ ఆఫర్ గురించి తెలీదు. కానీ చాలామంది అదేదో ఆఫర్ చూసి ఎయిర్ పోర్టుకు వచ్చి, అది తప్పుడు సమాచారమని తెలుసుకుని తిరిగి వెళ్లిపోతున్నారు. మేము 'స్పైస్ జెట్' కౌంటర్ వద్దకు వెళితే, అక్కడున్న ఆఫీసరు, “ప్రస్తుతానికి ఆఫర్ ఏమీ లేదు. హైదరాబాదు వెళ్ళడానికి ఒక్కరికి నాలుగువేల రూపాయలు అవుతుంది. ఈ రోజే వెళ్లాలంటే పదివేలు అవుతుంద"ని చెప్పాడు. మేము కొంచెం సేపు అక్కడే వేచి ఉండి ఆయనకు కృతజ్ఞతలు చెప్పి తిరిగి వచ్చేస్తుంటే ఆయన మాతో “ఒక నిమిషం” అని, తన ఫోన్లో ఉన్న ఎవరిదో ఒక నెంబర్ పేపర్ మీద వ్రాసి, పేరు, అడ్రస్ చెప్పి, “అక్కడికి వెళ్ళి విచారించండి. మీ అదృష్టం” అని చెప్పి, తనే ఆ వ్యక్తికి ఫోన్ చేసి, మేము వస్తున్నట్లు చెప్పి, సహాయం చేయమన్నారు. సరేనని మేము ఆ అడ్రసుకు వెళ్తే, అక్కడున్న అతను పది రోజుల తర్వాత హైదరాబాద్ వెళ్లడానికి టిక్కెట్లున్నాయని, నాకు, నా భార్యకు, మా అత్తగారికి మూడు టికెట్లు ఆఫర్ మీద చాలా తక్కువ ధరకి రిజర్వేషను చేసిచ్చాడు. దూరం నుండి చూసి వచ్చేద్దామని వెళ్ళిన మమ్మల్ని బాబా ఏకంగా విమానమే ఎక్కించే ఏర్పాటు చేశారు. ఇదంతా ఆయన వాత్సల్యం కాక మరేమిటి? ఇకపోతే, హైదరాబాద్‍లో నా భార్య చిన్ననాటి స్నేహితురాళ్ళు, బంధువులు చాలామంది ఉన్నారు. 'ఎవరిని ఎయిర్ పోర్టుకు కారు తీసుకురమ్మని చెప్పాలి? ముందు ఎవరింటికి వెళ్ళాలి? ఎవరు పనుల్లో బిజీగా ఉన్నారో, ఎవరు ఖాళీగా ఉన్నారో తెలుపమ'ని బాబాను అడిగితే, ఆయన ఒకరి పేరు సూచించారు. వాళ్ళకి విషయం చెబుదామని ఫోన్ చేస్తే రింగ్ అవ్వలేదు. వేరే ఎవరికైనా ఫోన్ చేద్దామంటే, బాబా వాళ్ళ పేరు చెప్పలేదు. అందువల్ల మేము బాబా సూచించిన వాళ్ళకే ఫోన్ చేస్తుండేవాళ్ళము. కానీ ఎన్నిసార్లు చేసినా ఆ ఫోన్ రింగ్ అయ్యేది కాదు. మేము 'ఎలా ఎలా' అనుకుంటూ విషయం వాళ్ళకి తెలియజేయకుండానే రోజులు గడిచిపోయాయి. ఆశ్చర్యం! ఇంకా రేపే ప్రయాణమనగా ఆ ముందురోజు రాత్రి వాళ్లే మాకు ఫోన్ చేశారు. చూశారా! మేము ఎన్నోసార్లు వాళ్ళకి ఫోన్ చేసి, ఆ ఫోన్ రింగు అవ్వకపోయినా వేరే స్నేహితులకు చెప్పకుండా బాబా మాట మీద గురితో పది రోజులు ఓపిక పట్టినందుకు బాబానే ఆ వ్యక్తితో ఫోన్ చేయించారు. మేము వాళ్లతో, "రేపు ఉదయం పది గంటలకు ఎయిర్‌ పోర్టుకు వచ్చి మమ్మల్ని రిసీవ్ చేసుకోవాల"ని చెప్పాము. వాళ్ళు సరేనని వచ్చి, మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు. వారం రోజులు స్నేహితులందర్ని కలిసి ఆనందంగా గడిపి వచ్చాము. ఆ సమయంలో వినాయక నిమజ్జనం జరుగుతున్నా మా ప్రయాణానికి ఏ ఆటంకం లేకుండా చూసుకున్నారు బాబా. అలా జీవితంలో మొదటిసారి విమాన ప్రయాణం చేశాము. అలా నా భార్యను, అమ్మను విమానం ఎక్కించాలని నాకు ఎప్పటినుండో ఉన్న కోరిక తీరింది. 


తరువాయి భాగం వచ్చేవారం...

 


ముందు భాగం కోసం
బాబా పాదుకలు తాకండి.




 


 


తరువాయి భాగం కోసం
బాబా పాదాలు తాకండి.

 


సాయిభక్తుల అనుభవమాలిక 1337వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా మహిమ
2. 'తలసేమియా' లేకుండా అనుగ్రహించిన బాబా

బాబా మహిమ


సాయిబాబా చరణం - సర్వదా శరణం శరణం|

సాయి నామస్మరణం - సర్వరోగహరణం, సర్వపాపహరణం||


ముందుగా, అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు, రాజాధిరాజు, యోగిరాజు, పరబ్రహ్మ అయిన శ్రీశ్రీశ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ మహరాజుకి పాదాభివందనాలు. బాబా ఆశీస్సులతో సమర్థవతంగా ఈ బ్లాగును నిర్వహిస్తున్న సాయికి ధన్యవాదాలు. నా పేరు జగదీశ్వర్. నేను ఆర్టీసీలో డిపో మేనేజరుగా పనిచేసి పదవీవిరమణ చేశాను. బాబా నా జీవితంలో ఇప్పటివరకు ఎన్నో అద్భుతాలు చూపించినప్పటికీ, శ్రీసాయిసచ్చరిత్రలో 'గుడ్డపీలికలు దొంగిలించరాదు, ఏదైనా స్వయంగా వచ్చి తెలుసుకోవాలి' అని చెప్పినందువల్ల నేను ఈమధ్యకాలం వరకు నా అనుభవాలను పంచుకోలేదు. కానీ, ఇటీవల ఒకరోజు నేను ప్రశాంతంగా కళ్ళు మూసుకుని బాబాను ప్రార్థించి, "బాబా! 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగులో నా అనుభవాలు పంచుకోవచ్చునా?" అని అడిగితే, "పంచుకోవచ్చు" అని బాబా సమాధానం వచ్చింది. అందుచేత నేను బాబా నాకు ప్రసాదించిన అనుభవాలను ఒక్కొక్కటిగా మీతో పంచుకోవడం మొదలుపెట్టాను. గతంలో కొన్ని అనుభవాలు మీతో పంచుకున్నాను. ఇప్పుడు మరికొన్ని అనుభవాలు పంచుకుంటాను.


బాబా దయతో నేను ఆర్టీసీలో సూపర్‌వైజరుగా చేరినప్పటినుంచి రిటైరయ్యేవరకు ఒక రెండుసార్లు మినహా ఎప్పుడూ కోరుకున్న ఊర్లలోనే నాకు పోస్టింగులు వచ్చాయి. ఆ రెండు సందర్భాలలో కూడా బాబా ఎలా అనుగ్రహించారో ఇప్పుడు పంచుకుంటాను. ఒకప్పుడు నేను నిజామాబాద్‍లో కొద్దిరోజులు డ్యూటీ చేశాక నన్ను కరీంనగర్‌కి బదిలీ చేశారు. అయితే కరీంనగర్‌లో నాకిచ్చిన పోస్టులో అప్పటికే ఒకతను ఉన్నాడు. అతనిని బదిలీ చేయకుండానే నన్ను అక్కడికి బదిలీ చేయడంతో నేను అదనంగా అక్కడ ఉండాల్సి వచ్చింది. దాదాపు 3 నెలలు అవసరమైనప్పుడల్లా నాతో పని చేయించుకున్నాక ఒకరోజు నా పైఅధికారి నన్ను పిలిచి, "డిపోలో పోస్టింగ్ ఇస్తాం. వెళ్లి చేసుకో" అని అన్నారు. అప్పుడు నేను, "చెకింగ్ ఇన్‌ఛార్జిగా పోస్టు ఇవ్వండి" అని అడిగాను. అందుకాయన, "అదెలా ఇస్తాం? అక్కడ ఇదివరకే ఒక వ్యక్తి చెకింగ్ ఇన్‌ఛార్జిగా ఉన్నాడు. కాబట్టి నువ్వు నేను చెప్పినట్లు చేయి" అని అన్నారు. అప్పుడు జరిగిన అద్భుతం చూడండి. ఆ మరుసటిరోజే చెకింగ్ ఇన్‌ఛార్జిగా ఉన్న అతనికి ప్రమోషన్ మీద మంచిర్యాలకి పోస్టింగ్ ఇచ్చినట్లు హైదరాబాద్ నుండి ఉత్తర్వులు వచ్చాయి. అలా నేను కోరుకున్న చెకింగ్ ఇన్‌ఛార్జి పోస్టు ఖాళీ అవడంతో అదనంగా ఉన్న నాకు ఆ పోస్టు ఇచ్చారు. అదీ బాబా మహిమ.


మరోసారి నేను కరంనగర్‌లో డీ.ఎం.గా చేస్తున్నప్పుడు 'అధికారులు స్వంత జిల్లాలో పనిచేయరాదు' అన్న నిబంధన తీసుకొచ్చి నన్ను భూపాల్‍పల్లికి బదిలీ చేశారు. అయితే కరీంనగర్‌లోనే జోనల్ లెవల్ పోస్టింగులో ఉన్న ఒకతను నెలరోజుల్లో పదవీవిరమణ చేస్తున్నందున నేను ఒక నెలరోజులకు సిక్ లీవ్‍కి అప్లై చేసి భూపాల్‍పల్లి వెళ్ళలేదు. ఆ నెలరోజుల్లో నేను కరీనగర్ జోనల్ పోస్ట్ కోసం చాలా ప్రయత్నించాను. కానీ ఏదీ సఫలం కాలేదు. ఈలోగా వేరేవాళ్ళని భూపాల్‍పల్లికి, కరీంనగర్‌కి పోస్టింగ్ ఇచ్చారు. నా నెలరోజుల సిక్ లీవ్ కూడా పూర్తయింది. దాంతో నేను తప్పనిసరి పరిస్థితుల్లో చేసేదేమీలేక 'ఎక్కడన్నా పోస్టింగ్ రానీ, ఎలా జరగాల్సి ఉంటే అలా జరుగుతుంద'ని బాబాపై భారమేసి హైదరాబాదులోని హెడ్ ఆఫీసుకి వెళ్ళాను. ఇంకో పది నిమిషాల్లో నేను సంబంధిత అధికారికి రిపోర్టు చేస్తాననగా బాబా ప్రేరణతో మా బ్రదర్ చేసిన ప్రయత్నం వల్ల సంబంధిత అధికారికి, 'నన్ను కరీంనగర్ జోనల్ లెవల్ పోస్టింగ్ ఇవ్వమ'ని ఆదేశాలు వచ్చాయి. దాంతో నేను సంతోషంగా కరీంనగర్‌లోనే జోనల్ లెవల్ పోస్టింగ్ ఉత్తర్వులు తీసుకుని ఆ పోస్టులో జాయినయ్యాను. ఇదంతా బాబా కరుణాకటాక్షాల వల్లనే సాధ్యమైంది. "ధన్యవాదాలు బాబా. మా బ్రదర్‌కి ఈ మధ్య చెస్ట్ పెయిన్ వస్తే, హార్ట్‌లో స్టెంట్ వేశారు. తను త్వరగా కోలుకోవాలి,  అలాగే ముందు ముందు తనకి ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా కాపాడండి ప్రభూ".


ప్రస్తుతం మా అబ్బాయి ఉన్నత చదువు కోసం యు.ఎస్.ఏ వెళ్ళబోతున్నాడు. తను వెళ్ళేముందు ఒకసారి బాబా దర్శనం చేసుకుని వద్దామని నేను, మా అబ్బాయి 2022, జూలై 26న బయలుదేరి శిరిడీ వెళ్ళాము. బాబా అనుగ్రహంతో వారి దర్శనం మాకు బాగా జరిగింది. మేము 27, 28 తేదీలలో మధ్యాహ్న ఆరతిలో పాల్గొన్నాము. అదేరోజు, అంటే 28వ తేదీ సాయంత్రం బయలుదేరి మన్మాడ్ స్టేషన్‌కి వచ్చాము. అక్కడ ప్లాట్‍ఫాం నెంబర్ 5లో ట్రైన్ కోసం వేచివున్న సమయంలో అక్కడున్న విపరీతమైన దోమల కాట్లకు మేము గురయ్యాము. మరుసటిరోజు ఉదయం కరీంనగర్ చేరుకున్నాము. ఆరోజు ఏమీ ఇబ్బంది లేదుగానీ, 30వ తేదీ ఉదయం నుండి నాకు కాళ్ళనొప్పులు, తలనొప్పి ఎక్కువైపోయి దాదాపు రోజంతా మంచంపైనే పడుకుని ఉన్నాను. మలేరియానో, డెంగ్యూనో అయుంటుందన్న ఆందోళనతో యాంటీబయోటిక్ టాబ్లెట్ వేసుకుని, రెండుసార్లు బాబా ఊదీ నీళ్లలో కలుపుకుని తాగి, "బాబా! రేపు ఉదయానికి నార్మల్ అయ్యేలా దయచూపండి" అని బాబాను వేడుకున్నాను. బాబా దయవల్ల మరుసటిరోజుకి కొద్దిగా నీరసంగా ఉన్నప్పటికీ కాళ్లనొప్పులు, తలనొప్పి తగ్గి దాదాపు నార్మల్ అయిపోయాను. అంతా బాబా దయ. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".


చివరిగా మరో చిన్న అనుభవం: 2022, సెప్టెంబర్ 12న మా ఆవిడ హైదరాబాద్ వెళ్లేందుకు తయారై తన డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, పాన్ కార్డు, కారు ఆర్.సి  కార్డు ఉన్న కార్డు హోల్డర్ కోసం వెతికితే, అది ఎక్కడా దొరకలేదు. మామూలుగా డ్రెస్సింగ్ టేబుల్ అద్దం వెనుక ఉన్న రాక్‍లో ఉండాలి. కానీ నేను, నా శ్రీమతి రాక్ అంతా వెతికినా ఆ కార్డు హోల్డర్ కనబడలేదు. దాంతో మాకు టెన్షన్ పెరిగిపోయింది. ఆ క్షణంలో నేను బాబాకి దణ్ణం పెట్టుకుని, "బాబా! కార్డు హోల్డర్ ఎక్కడున్నా తొందరగా దొరికేలా చేయి స్వామీ. మీ అనుగ్రహంతో అవి దొరికితే వెంటనే 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగులో ఈ అనుభవాన్ని పంచుకుంటాన"ని మొక్కుకున్నాను. కేవలం ఒకేఒక్క నిమిషంలో డ్రెస్సింగ్ టేబుల్ అద్దం వెనక ఉన్న అదే రాక్‍లో పాస్‌బుక్ పక్కనే ఆ కార్డు హోల్డర్ కనబడింది. అంతకుముందు అదేచోట ఇద్దరమూ ఎంత వెతికినా దొరకనివి బాబాకి దణ్ణం పెట్టుకున్న వెంటనే దొరకడం నిజంగా మహాద్భుతం! "ధన్యవాదాలు బాబా"


'తలసేమియా' లేకుండా అనుగ్రహించిన బాబా  


ఓం శ్రీ సాయినాథాయ నమః!!! నా పేరు రాజేశ్వరి. నేను ఒక సాయిభక్తురాలిని. మేము 25 సంవత్సరాల నుండి బాబాను నమ్ముకున్నాము. ఒకనొకప్పుడు నేను, మావారు, మా ముగ్గురు పిల్లలు ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాం. అలాంటి మమ్మల్ని బాబానే కాపాడారు. అంతేకాదు, ఆయన ఎన్నో సమస్యల నుంచి మమ్మల్ని బయటపడేశారు. మా ముగ్గురు పిల్లలకి పెళ్లిళ్లు అయి పిల్లలు కలిగారు. అందరికీ సాయి పేరు కలిపి పేర్లు పెట్టుకుని ఆ తండ్రికి మా కృతజ్ఞతలు తెలుపుకున్నాము. ఈ బ్లాగును నిర్వహిస్తున్నవారికి మా ధన్యవాదాలు. ఈ బ్లాగులోని అందరి అనుభవాలు చదివి చాలా సంతోషిస్తున్న నాకు ఇప్పటికి మా అనుభవాలు పంచుకునే అవకాశం వచ్చినందుకు అమితానందంగా ఉంది.  ఇక నా అనుభవానికి వస్తే...


మా పెద్దమ్మాయికి పెళ్లయిన సంవత్సరానికి బాబు పుట్టాడు. ఆ బాబుకి తొమ్మిదో నెలలో 'తలసేమియా' (ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి నిలిచిపోవడాన్ని 'తలసేమియా' వ్యాధి అంటారు) అనే జబ్బు వచ్చింది. ఆ జబ్బు కారణంగా మూడు నెలలకు ఒకసారి బాబుకి రక్తం ఎక్కిస్తూ ఉండేవాళ్ళము. ఆ బాబు ఏడు సంవత్సరాల వయసు వచ్చాక మూడేళ్ళ క్రితం చనిపోయాడు. మేము బాబాను, "అమ్మాయికి మళ్ళీ సంతానాన్ని ప్రసాదించండి బాబా" అని వేడుకున్నాం. బాబా దయవల్ల 2022, ఏప్రిల్ 22న మా అమ్మాయికి పాప పుట్టింది. తలసేమియా జన్యు సంబంధమైన వ్యాధి. అది పాపకి కూడా వస్తుందేమోనని మేము భయపడ్డాము. బాబా దయవల్ల పాపకి నాలుగో నెల వచ్చాక ఆగస్టులో టెస్ట్ చేసి, "తలసేమియా లేదు. కానీ 6వ నెలలో మళ్లీ టెస్ట్ చేసి పూర్తిగా నిర్ధారిస్తాము" అని డాక్టరు చెప్పారు. ఈ బాబా అనుగ్రహాన్ని బ్లాగుకి ఎలా పంపించాలో తెలియక నేను ఎంతో బాధపడుతుంటే అనుకోకుండా బాబా దయవల్ల ఈ బ్లాగ్ వాట్సాప్ నెంబర్ నాకు లభించింది. "బాబా! మీకు వేలవేల ధన్యవాదాలు. మీ దయ అందరిమీదా ఎల్లవేళలా ఉండాలని ప్రార్థిస్తున్నాను తండ్రీ. ఆరవ నెలలో చేసే టెస్టులో కూడా పాపకి ఏ సమస్యా ఉండకూడదు. అదే జరిగితే, మళ్ళీ నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను. నా తప్పులు ఏవైనా ఉంటే క్షమించండి బాబా".



సాయిభక్తుల అనుభవమాలిక 1336వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. అనుకోకుండా శిరిడీకి బాబా పిలుపు
2. ప్రార్థనతో సమస్యలను తొలగించిన బాబా
3. ఇంటి డాక్యుమెంట్లు దొరికేలా అనుగ్రహించిన బాబా

అనుకోకుండా శిరిడీకి బాబా పిలుపు


ఓం శ్రీసాయినాథాయ నమః!!! సాయి బంధువులకు నమస్కారం. నేను ఒక సాయి భక్తురాలిని. నేను ఇప్పుడు అనుకోకుండా జరిగిన మా శిరిడీ యాత్ర గురించి పంచుకోబోతున్నాను. మేము 2022, ఫిబ్రవరిలో మా పెళ్లి రోజున శిరిడీ వెళ్లి సాయిని దర్శించుకున్నాము. తరువాత మళ్ళీ అక్టోబర్‌లో మా కుటుంబమంతా ఒక 10 మందిమి శిరిడీ వెళ్ళడానికి టికెట్లు బుక్ చేసుకున్నాము. అయితే ఆ లోపలే బాబా తమ దర్శన భాగ్యాన్ని నాకు ప్రసాదించారు. అదెలా అంటే, గతంలో నా ఫ్రెండ్ ఒకరు, 'మా ఊర్లో ఒకతను కొంతమందిని పోగు చేసి శిరిడీ తీసుకెళ్ళి, ఒక వారం రోజులు అక్కడ చుట్టుపక్కల ప్రదేశాలన్నీ చూపిస్తార'ని చెప్పారు. అప్పట్లో వాళ్ళు ఒకసారి వెళ్ళారు కూడా. ఆ తరువాత కోవిడ్ కారణంగా వాళ్ళు అలాంటి ట్రిప్‌లు మానేశారు. మేము కూడా ఇల్లు మారడం వల్ల మా ఫ్రెండ్‌తో రెగ్యులర్‌గా మాట్లాడలేదు. సుమారు ఒక 6 నెలల తరువాత ఈమధ్య నేను ఊరికే ఆ ఫ్రెండ్‌కి ఫోన్ చేస్తే, మాటల్లో తను, "మేము సెప్టెంబర్ 7వ తేదీన శిరిడీ వెళ్తున్నాం" అని చెప్పారు. నేను సరదాగా, "అయ్యో! నాకు చెప్పలేదే, నేనూ వచ్చేదాన్నిగా" అని అంటే, తను కూడా సరదాగా, "ఇప్పుడు మాత్రం ఏమైంది, వచ్చేయండి" అని అన్నారు. కానీ నాకు 6వ తేదీకి నెలసరి సమయం. అది ఒకవేళ ముందుగా వస్తే, ఆలోచిద్దాంలే అనుకున్నాను. అయితే, ఆ మర్నాడే నాకు నెలసరి వచ్చింది. దాంతో నాకు, 'బాబా నన్ను శిరిడీకి పిలుస్తున్నారు' అనిపించింది. కానీ ఇంట్లో మా అత్తగారు ఉన్నారు. మామూలుగా అయితే ఆవిడ పని చేసుకోగలిగేవారే కానీ, ఈ మధ్య ఆవిడ ఆరోగ్యం అంతగా బాగుండటం లేదు. అందువలన నేను శిరిడీ వెళ్లి, వచ్చేవరకు పగటిపూట మా అత్తగారికి తోడుగా ఉండమని పనిమనిషిని అడిగితే, ఆమె సరేనంది. వెంటనే నేను టిక్కెట్లు బుక్ చేసుకున్నాను. అదృష్టం కొద్దీ అతి తక్కువ వ్యవధిలో టిక్కెట్లు, హారతి మొదలైనవన్నీ బుక్ చేసుకోవడం చకచకా జరిగిపోయాయి. అంతలో ఊరికి వెళ్ళిపోతుందనుకున్న మా అమ్మాయి కూడా ప్రయాణం వాయిదా వేసుకుంది. కాబట్టి మా అత్తగారికి తోడుగా పనిమనిషి ఉండకపోయినా ఇక పర్లేదు. ఇక ఏ అడ్డంకి లేకుండా నా ప్రయాణం మొదలైంది. రైల్వేస్టేషన్‌లో కూర్చుని ఈ అనుభవం పంచుకుంటున్నాను. బాబా దయతో ఈ వారం ట్రిప్ అంతా బాగా జరగాలని,  ప్రతిరోజూ బాబా దర్శనాలు అవ్వాలని, అన్ని ప్రదేశాలు చూసి క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చేలా బాబా దీవించాలని ఆశిస్తూ... సెలవు తీసుకుంటున్నాను.


ప్రార్థనతో సమస్యలను తొలగించిన బాబా


ఓం శ్రీసాయినాథాయ నమః!!! ముందుగా సాయితండ్రికి అనేక నమస్కారాలు. ఈ బ్లాగు నిర్వహిస్తున్న సాయి బృందానికి బాబా తండ్రి ఎల్లవేళలా శుభాశీస్సులు ఇవ్వాలని కోరుకుంటున్నాను. నేను ఒక సాయి భక్తుడిని. నేను ఇంతకముందు ఒకసారి నా అనుభవాన్ని మీతో పంచుకున్నాను. ఇప్పుడు ఇటీవల జరిగిన మరికొన్ని అనుభవాలు పంచుకుంటున్నాను. ఈ మధ్యకాలంలో నేను అనేక సమస్యలతో చాలా ఇబ్బందులు పడ్డాను. ఒకసారి పొట్ట ఉబ్బరం, చెమటలు పెట్టడం, ముఖ్యంగా ఆహారం తీసుకోలేక అవస్థ పడటం వంటి సమస్యలతో నేను తీవ్ర అనారోగ్య పరిస్థితులు ఎదురుకున్నాను. 2022, ఆగస్టు 18, గురువారంనాడు నేను మహాపారాయణ ముగించుకుని విజయవాడలోని ఆసుపత్రికి వెళితే, అక్కడ అన్ని పరీక్షలు చేసారు. నేను నిరంతరాయంగా 'ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః' అనే మంత్రాన్ని మననం చేస్తూ ఉండగా సాయంత్రానికి రిపోర్టులు వచ్చాయి. డాక్టరు, "ఎక్కడా ఏ లోపం లేదు" అని చెప్పారు. వెంటనే నేను సాయితండ్రికి మనసారా ధన్యవాదాలు తెలుపుకున్నాను. తరువాత మా ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు ప్రయాణంలో అడుగడుగునా సాయితండ్రి ఫోటో రూపంలో దర్శనం ఇచ్చారు


హైదరాబాద్‌లో ఉన్న మా పెద్దబ్బాయి ఒకరోజు రాత్రి 10.30 గంటలకి తప్పనిసరై ద్విచక్ర వాహనంపై దాదాపు 300 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వచ్చింది. నేను చాలా ఆందోళనకి గురై, "బాబా! పిల్లవాడు క్షేమంగా గమ్యం చేరుకుంటే, మీ అనుగ్రహాన్ని తోటి సాయి బంధువులతో పంచుకుంటాను" అని బాబాకి విన్నవించుకున్నాను. బాబా దయవల్ల పిల్లవాడు ఎటువంటి ఆటంకాలు లేకుండా క్షేమంగా ఇల్లు చేరాడు. అలాగే మా చిన్నబ్బాయి ఉన్న ఉద్యోగం వదులుకుని ఇంటి వద్ద ఖాళీగా ఉంటే నేను బాబా తండ్రిని వేడుకున్నాను. ఆ తండ్రి దయవలన అనతి కాలంలోనే పిల్లవాడికి ఉద్యోగం వచ్చింది. "ధన్యవాదాలు సాయితండ్రి. మీకు శతకోటి వందనాలు. నేను మరో కోరికను మీ ముందు ఉంచాను తండ్రి. దాన్ని అనుగ్రహించినంతనే నా అనుభవాన్ని సాయి బంధువులతో పంచుకుంటాను తండ్రి".


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కి జై!!!


ఇంటి డాక్యుమెంట్లు దొరికేలా అనుగ్రహించిన బాబా


సాయి బందువులందరికీ నమస్కారం. సదా వెన్నంటి ఉండి మనల్ని నడిపే బాబా పాదపద్మాలకు శిరసా ప్రణామాలు. నా పేరు గంగాభవాని. మాది వైజాగ్. నేను చిన్నప్పటి నుంచి సాయి భక్తురాలిని. బాబా నా జీవితంలో అడుగడుగునా తోడుగా ఉండి ముందుకి నడిపి ఈ రోజున నన్ను ఉన్నత స్థానంలో ఉంచారు. ఆయన ప్రేమకు సృష్టిలో మరేదీ సాటిలేదు. ఆయన పాదాలందు నమ్మకం ఉంచడమే మనం చేయాల్సింది. ఇక నా అనుభవానికి వస్తే... ఈ మధ్య మేము లోన్‌కి అప్లై చేద్దామనుకుంటే మా ఇంటి డాక్యుమెంట్లు కనపడలేదు. ఎంత వెతికినా అవి  దొరకలేదు. వాటిని ఎక్కడ పెట్టానో నాకు అస్సలు గుర్తులేదు. అప్పటికే లోన్ పెట్టడానికి నాలుగు నెలలు ఆలస్యమైనందున చివరి ప్రయత్నంగా, "డాక్యుమెంట్లు దొరికితే, కోవా నివేదిస్తాను" అని బాబాకి దణ్ణం పెట్టుకుని మరోసారి వెతికాను. గిల్లి, బుజ్జగించడం ఆయనకు అలవాటే, కాస్త ఏడిపించాక చేతిలో బెల్లం పెడతారు. అప్పుడే బెల్లం విలువ మనకి తెలుస్తుంది కదా! ఏదేమైనా మన అశ్రద్దకి బాబా బాధ్యత వహిస్తారు. ఆయన దయవల్ల అరగంటలో ముందు వెతికిన చోటే ఆ డాక్యుమెంట్లు దొరికాయి. "ధన్యవాదాలు బాబా. మీరు ఉండబోయే ఇల్లు ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తయ్యేలా, తొందరలోనే మనం ఆ ఇంటికి వెళ్లి, అక్కడ ప్రతిరోజూ కబుర్లు చెప్పుకునేలా, అలాగే ఆ ఇంట్లో అందరూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండేలా ఆశీర్వదించండి బాబా. సదా మీ చరణాలకు నా నమస్కారాలు బాబా".


సాయిభక్తుల అనుభవమాలిక 1335వ భాగం....


ఈ భాగంలో అనుభవం:

  • తిరిగి దరికి చేర్చుకుని, సమాధానపరచిన బాబా 

ముందుగా ఈ బ్లాగును నిర్వహిస్తున్నవారికి చాలా కృతజ్ఞతలు. నేను ఒక చిన్న సాయిభక్తురాలిని. నేను ఇటీవలే MBBS పూర్తిచేశాను. బాబా దయవల్ల నేను 2022, సెప్టెంబర్ మొదటివారం నుండి ఈ బ్లాగులోని భక్తుల అనుభవాలు చదువుతున్నాను. ఈ బ్లాగు వల్ల భక్తుల భక్తి, విశ్వాసాలు రెట్టింపు అవుతున్నాయి. నేను ఏ బాధలో ఉన్నా ఈ బ్లాగు ఓపెన్ చేయగానే నా సమస్యకి తగ్గట్టు బాబా తమ భక్తుల అనుభవాలను చూపించి నాకు ధైర్యాన్ని ఇస్తున్నారు. ఆ బాబానే ఈ బ్లాగును నడుపుతున్నారు. ఆ తండ్రి పాదాలకు విన్నవించుకుంటున్న భావనతో నేనిప్పుడు నా అనుభవాలు మీతో పంచుకుంటాను. నేను చిన్నవయస్సులోనే మా అమ్మతో బాబా గుడికి వెళ్తుండేదాన్ని. కానీ బాబా లీలల గురించి ఏమీ తెలీదు. పెద్దయ్యేకొద్దీ నేను బాబాకి కొంచెం దూరమయ్యాను. కానీ బాబా తన భక్తులను ఏదో ఒక విధంగా తమ దగ్గరకు తెచ్చుకుంటారు కదా! నా విషయంలో కూడా అదే జరిగింది. ఇంటర్ చదివేటప్పటినుండి నేను నేనుగా లేను. ఎన్ని బాధలు పడ్డానో బాబాకే తెలుసు. ఆ బాధల కారణంగా నాకు దేవుడిపై కోపం వచ్చి, దైవం పట్ల నమ్మకం, భక్తి సన్నగిల్లాయి. 2018లో మా అమ్మ నేను పడే బాధని చూడలేక ఒక జ్యోతిష్యుని దగ్గరకు నన్ను తీసుకువెళ్ళింది. అతను మా అమ్మవాళ్ళని బయటకు పంపి, నన్ను అమ్మవారి గర్భగుడిలో కూర్చోబెట్టి నా గురించి చాలా ప్రతికూలంగా మాట్లాడాడు. నేను ఇష్టమైన వ్యక్తిని పెళ్లి చేసుకోకూడదని, రాముడు నా దగ్గర ఉండలేడని, ఇంకా చాలా మాటలు అమ్మవారి మీద ఒట్టు వేసి మరీ అన్నాడు. సున్నిత మనస్కురాలినైన నేను ఆ మాటలన్నీ విని మానసికంగా కృంగిపోయాను. అమ్మావాళ్లు బాధపడతారని అతను చెప్పిన విషయాలేవీ నేను వాళ్లతో చెప్పలేదు. కానీ నేను ఆరోజు నుండి జాతకాల పిచ్చిలో పడిపోయి, 'జ్యోతిష్యం ఉన్నప్పుడు, దేవుడు ఉండి ఏం లాభం? నా జీవితాన్ని గ్రహాలు నడిపిస్తుంటే, నేను బ్రతికి ఏం లాభం? ఎన్ని పూజలు, హోమాలు చేసినా అదే కర్మను అనుభవిస్తుంటే, పూజల వలన ఏం లాభం? నా జీవితం ఇలానే ఉంటుందని, ఫలానా సమయానికి ఇలానే అవుతుందని జ్యోతిష్యం చెపుతుంటే, అదంతా తెలిసి జీవించి ఏం లాభం?' ఇలా నా మనసులో ఎన్నో సందేహాలు. అలా కొన్ని నెలలు గడిచాక బాబాకి అపార భక్తులైన మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ శిరిడీ వెళదాం, రమ్మంటే ఎటువంటి ఆశ లేకుండా నేను వాళ్లతో శిరిడీ వెళ్ళాను. మా ఆంటీ బాబా తనకి ప్రసాదించిన అనుభవాలను ప్రయాణ సమయమంతా పంచుకుంటుంటే దైవం మీద భక్తి కోల్పోయిన నేను అదంతా ఆవిడ వెర్రితనం అనుకున్నాను. కానీ సమాధిమందిరంలోకి అడుగుపెట్టి బాబాని చూస్తూనే నాకు కన్నీళ్లు ఆగలేదు. ఎందుకో తెలీదుగానీ గుండెల్లో ఉన్న భారమంతా ఒక్కసారిగా పోయింది. బాబానే మా ఆంటీ ద్వారా నన్ను తమ చెంతకు రప్పించుకున్నారని అనిపించింది. తరువాత ఆంటీ నన్ను పారాయణ హాల్లోకి తీసుకుని వెళ్లి, శ్రీసాయిసచ్చరిత్ర పుస్తకం నా చేతికిచ్చి నాకున్న ప్రశ్నలను బాబాని అడగమని చెప్పింది. నేను, 'ఈ ఒక్క పుస్తకంలో నాకు కావాల్సిన సమాధానాలన్నీ ఎలా దొరుకుతాయి?' అన్న అనుమానంతోనే బాబాను ప్రశ్న అడిగి పుస్తకం తెరిచి అక్కడున్నది చదివాను. నా కళ్ళల్లో నీళ్ళు ఆగలేదు. జాతకరీత్యా పిల్లలు పుట్టరన్న దామూఅన్నాకు సంతానాన్ని అనుగ్రహించిన తమ లీలను బాబా నా చేత చదివించారు. తద్వారా 'జాతకాలను నమ్మవద్ద'ని తెలియజేసి నా మానసికవ్యధను, అనుమానాలన్నిటినీ చిటికెలో మాయం చేశారు బాబా. సర్వమూ ఆ సాయే అయినప్పుడు ఆ గ్రహాలు కూడా ఆయనే కదా! ఈ లోకాన్ని నడిపిస్తున్న ఆ సాయికి సాధ్యం కానిది ఏమీ లేదు. కాబట్టి సాయిభక్తులమైన మనం ఏ జాతకదోషాలకు భయపడవలసిన అవసరం లేదు. భక్తితో బాబాని నమ్ముకుంటే అంతా ఆయనే చూసుకుంటారు. ఆయన నాకు అంత గొప్ప అనుభూతినిచ్చినందుకు నేను ధన్యురాలిని.


ఇకపోతే, 'తమకి ఉపవాసం, పూజలు అక్కర్లేదని, జాతకాలను నమ్మి పూజలు చేసుకుంటూ సమయాన్ని వృథా చేసుకోవద్ద'ని వేరొక ప్రశ్నకు బాబా సమాధానం ఇచ్చారు. రెండవరోజు వేరొక విషయం గురించి తెలుసుకోవాలని పారాయణ హాల్లోకి వెళ్లి, "ఎంతో మంచి చేస్తూ, ఎవరికీ ఏ హాని చేయకుండా ఉండేవాళ్ళకి ఎప్పుడూ కష్టాలే ఎందుకు? అనేక పాపాలు చేసి, ధర్మానికి, దైవానికి భయపడకుండా ఉండేవాళ్ళకి అంతా మంచే ఎందుకు జరుగుతోంది?" అని బాబాను ప్రశ్నించాను. అప్పుడు సచ్చరిత్రలోని ఈ క్రింది వివరణ వచ్చింది.


శ్రీసాయిబోధనకు ప్రత్యేక స్థలముగానీ, ప్రత్యేక సమయముగానీ అక్కరలేదు. సందర్భావసరములను బట్టి వారి ప్రబోధము నిరంతరము జరుగుచుండెను. ఒకనాడొక భక్తుడు ఇంకొక భక్తుని గురించి పరోక్షమున ఇతరుల ముందు నిందించుచుండెను. ఒప్పులు విడిచి భక్తసోదరుడు చేసిన తప్పులనే ఎన్నుచుండెను. మిక్కిలి హీనమైన అతని దూషణలు విన్నవారు విసిగిరి. అనవసరముగా ఇతరులను నిందించుటచే అసూయ, దురభిప్రాయము మొదలగునవి కలుగును. యోగులు నిందలను ఇంకొక విధంగా భావించెదరు. మలినమును పోగొట్టుటకు అనేక మార్గములు కలవు. సబ్బుతో మాలిన్యమును కడుగవచ్చును. పరులను నిందించువాని మార్గము వేరు. ఇతరుల మలినములను వాడు తన నాలుకతో శుభ్రపరచును. ఒక విధముగా, వాడు నిందించువానికి సేవ చేయుచున్నాడు. ఎట్లన, వాని మలినమును వీడు తన నాలుకతో శుభ్రపరచుచున్నాడు. కావున, తిట్టబడినవాడు తిట్టినవానికి కృతజ్ఞతలు తెలుపవలెను. అట్లు పరనిందకు పాల్పడినవానిని బాబా సరిదిద్దిన పద్ధతి విశిష్టమైనది. నిందించువాడు చేసిన అపరాధమును సర్వజ్ఞుడైన బాబా గ్రహించిరి. మిట్టమధ్యాహ్నము బాబా లెండీతోటకు పోవునప్పుడు వాడు బాబాను దర్శించెను. బాబా వానికొక ఒక పందిని చూపి ఇట్లనెను: “చూడుము! ఈ పంది అమేథ్యమును ఎంత రుచిగా తినుచున్నదో! నీ స్వభావము కూడా అట్టిదే! ఎంత ఆనందముగా నీ సాటి సోదరుడిని తిట్టుచున్నావు! ఎంతో పుణ్యము చేయగా నీకు ఈ మానవజన్మ లభించినది. ఇట్లు చేసినచో శిరిడీ దర్శనము నీకు తోడ్పడునా?” బాబా మాటల భావమును గ్రహించిన ఆ భక్తుడు తను చేసిన తప్పుని తెలుసుకొని బాబాను క్షమాపణ వేడుకొనెను. ఈ విధముగా బాబా సమయము వచ్చినప్పుడల్లా ఉపదేశించుచుండెడివారు. ఈ ఉపదేశములను మనస్సునందుంచుకొని పాటించినచో ఆత్మసాక్షాత్కారము దూరము కాదు.


అది చదివాక, 'ఈ లోకంలో ఏది మంచో, ఏది చెడో నిర్దేశించడానికి మనమెవరం? అంతా ఆ భగవంతునికి తెలుసు. మనం మంచి చేశామని, వాళ్లు చెడు చేశారని అనుకోవడం వల్ల మనసులో అశాంతి చోటు చేసుకోవడం తప్ప ఏ ప్రయోజనం ఉండదు. 'మనకి బాబా ఉన్నారు. మనం ఎలా ప్రవర్తిస్తున్నాం?' అని చూసుకుంటే చాలు, ప్రశాంతంగా ఉంటాం. ప్రశాంతంగా ఉంటే దైవానికి సులువుగా చేరువవుతాము' అని నాకు అనిపించింది. అప్పటినుంచి 'ఎవరు మంచి/చెడు చేస్తున్నారు' అన్నది పట్టించుకోవడం మానేశాను. దానివల్ల నా జీవితంలో ప్రశాంతత వచ్చింది.


బాబా మన సందేహాలను తీర్చి సన్మార్గంలో నడిపించే గురువు, కోరికలను తీర్చే దైవం, మంచి స్నేహితుడు. సమయానుసారం ఆయన మనల్ని కనిపెట్టుకుని ఉంటారు. ఆయన నాకు ఆధ్యాత్మికంగా సహాయం చేసి నన్ను మంచి మార్గంలో నడిపిస్తున్నారు. నేను మానసికంగా చాలా బాధలు పడ్డాను. వాటిని బాబాకి తప్ప ఎవరికీ చెప్పుకోలేను. బాబా లేకుంటే నేను MBBS అంత తేలికగా పూర్తిచేయగలిగేదాన్ని కాదు. "ధన్యవాదాలు బాబా! నేను ఇంకా ఒక సమస్యతో బాధపడుతున్నాను. అందరిలా నేను యుక్తవయస్సును అనుభవించలేకపోతున్నాను. నేను చాలా కోల్పోయాను. ఇప్పుడు కూడా నాకు ఇష్టమైనది వదిలేసుకోవాలని అనకండి బాబా, తట్టుకోలేను. దయచేసి నా సమస్యను నాకు అనుకూలంగా పరిష్కరిస్తారని మిమ్మల్ని వేడుకుంటున్నాను బాబా. మీరు త్వరగా అనుగ్రహిస్తే, ఆ అనుభవాన్ని ఈ బ్లాగు ద్వారా తోటి భక్తులందరితో పంచుకుంటాను. దయచేసి త్వరగా పరిష్కరించరా బాబా...?"


చివరిగా ఇంకో చిన్న అనుభవం: ఇటీవల నాకు విపరీతమైన తలనొప్పి వచ్చి టాబ్లెట్స్ వేసుకున్నా తగ్గలేదు. అప్పుడు నేను బాబాని తలచుకుంటే, వెంటనే నొప్పి తగ్గి, మళ్ళీ రాలేదు. "ధన్యవాదాలు సాయీ. నేను అడగకుండానే ఇంతకాలం నాకు మీరు చాలా సహాయం చేశారు. ఇకమీదట కూడా అలానే తోడుగా ఉంటారని ఆశిస్తున్నాను సాయీ". ఇంతవరకు ఓపికగా సాయి నాకు ప్రసాదించిన అనుభవాలను చదివిన మీకు ధన్యవాదాలు. మరెన్నో అనుభవాలు మీతో పంచుకునేలా బాబా నన్ను అనుగ్రహిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.


సాయిభక్తుల అనుభవమాలిక 1334వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. కోరుకుంటే నిరాశపరచరు బాబా
2. కాలువలో పడేసిన బంగారు హారాన్ని తిరిగి దొరికేలా అనుగ్రహించిన బాబా 
3. కోరుకున్నట్లు గొడవలు లేకుండా పెళ్లి జరిపించిన బాబా 

కోరుకుంటే నిరాశపరచరు బాబా


ఓం శ్రీ సాయినాథాయ నమః!!! నేను ఒక సాయిభక్తురాలిని. ఇటీవల బాబా నాకు ప్రసాదించిన ఒక చిన్న అనుభవాన్ని మీతో పంచుకుంటున్నాను. ఈమధ్య మా అబ్బాయికి కొడుకు పుట్టాడని నేను నా గత అనుభవంలో పంచుకున్నాను. మా మనవడు ప్రస్తుతం మా కోడలి కన్నవారి ఇంట్లో ఉన్నాడు. వాడు నా మొదటి మనవడు అయినందున వాడు అంటే నాకు చాలా ప్రేమ, వాడిని చూడకుండా నేను ఉండలేను. రోజూ రాత్రి వీడియో కాల్‍లో వాడిని చూశాకనే నేను నిద్రపోతాను. నా కొడుకు శని, ఆదివారాలు తన అత్తవారింటిలో ఉంటాడు. ఆ సమయంలో నేను ఉదయం కూడా వీడియో కాల్ చేసి మనవడితో ఫోన్‍లోనే ఆనందంగా కాస్త సమయం గడుపుతాను. ఈ విషయంగా నా కోడలు నా కొడుకుతో, "మీ అమ్మ మిమ్మల్ని, మీ తమ్ముడిని ఎంతగా ప్రేమిస్తుందో అంతకన్నా ఎక్కువ ప్రేమను మనవడి మీద చూపిస్తోంది. అది సంతోషమే అయినా, ఇలా ఉంటే ఇబ్బంది అవుతుంది" అని అంది. ఆ మాటలకి మా అబ్బాయికి చాలా కోపమొచ్చి తనపై కోప్పడ్డాడు. అదేమీ తెలియని నేను, 'అబ్బాయి ఆఫీసుకి వెళ్ళిపోతాడు, ఈలోగా మనవడిని చూద్దామ'ని మళ్ళీ వీడియో కాల్ చేస్తే మా అబ్బాయి, "అమ్మా! ఒకరోజు నీ కోడలు ఫోన్ లిఫ్ట్ చేయకపోతే, తన తమ్ముడికి కాల్ చేశావట. మరీ అంత ప్రేమ చూపిస్తే, ముందుముందు ఇబ్బంది అవుతుందేమోనని నీ కోడలు అంటోంది. అయినా నువ్వు తన తమ్ముడికి ఎందుకు ఫోన్ చేశావు?" అని కాస్త కోపంగా అన్నాడు. దాంతో నేను, "సరేలే, ఇప్పటినుండి కాల్ చేయను" అని ఫోన్ పెట్టేశాను. వెంటనే తను నాకు మళ్లీ వీడియో కాల్ చేశాడు. కానీ నేను వీడియో కాల్ లిఫ్ట్ చేయకుండా, నార్మల్ కాల్ చేసి, "నేను కూడా అలవాటు చేసుకోవాలి" అని అన్నాను. నా మాటలను లౌడ్‌స్పీకరులో తన భార్యకి వినిపించి, "మీవాళ్ళలాగానే కదా మా అమ్మావాళ్ళు. తను నిన్ను ఎంత మంచిగా చూసుకుంటుంది! అలాంటి అమ్మ నీ మాటల వలన బాధపడుతోంది" అని కాస్త కోపంగా తన ఆఫీసుకి వెళ్ళిపోయాడు. అయితే, మా అబ్బాయికి తన భార్య మీద నాకు కోపం ఉందని తెలుసు. అందుకే తన భార్య మీద కోపం పోవడానికి తను నాతో, "నువ్వు ఫోన్ చేస్తే, మేము కాల్ లిఫ్ట్ చేయకపోతే టెన్షన్ పడతావు కదా, అలాగే 'నేను కూడా ఫోన్ ఎత్తకపోతే అత్తమ్మ టెన్షన్ పడుతుంద'ని నీ కోడలు నీ గురించే ఆలోచిస్తుంది" అని చెప్పి నాకు సంజాయిషీ ఇచ్చాడు. కానీ, తన మనసులో ఉన్న కోపం వల్ల తను తన భార్యకి ఫోన్ చేయలేదు. ఆమె కూడా తనకి ఫోన్ చేయలేదు. ఆ విషయం నాకు చెప్పినప్పుడు నేను బాబా ఫోటోకేసి చూస్తూ, "బాబా! వాళ్ళ మనసులో కోపాన్ని తొలగించి ఇద్దరూ మాట్లాడుకునేటట్లు చేస్తే, మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను. శనివారం సాయంత్రానికల్లా వాళ్లిద్దరూ మాట్లాడుకోవాలి" అని అనుకున్నాను. విచిత్రం! సెప్టెంబర్ 6, మంగళవారం సాయంత్రం 6 గంటలకి మా కోడలు ఫోన్ చేసి, "ఇంట్లో అందరూ బాగున్నారా అత్తమ్మా?" అని అడిగి, "కిరణ్(మా అబ్బాయి) ఇప్పుడే కాల్ చేశాడు" అని చెప్పింది. నాకు చాలా సంతోషమేసింది. ఎప్పుడైనా నేను బాబాను ఏదైనా కోరుకుంటే, ఆ తండ్రి నన్ను నిరాశపరచరు. "ధన్యవాదాలు సాయీ. మా కుటుంబాన్ని, మా పిల్లల భవిష్యత్తుని చల్లగా చూడు సాయీ. మాది, మా పిల్లల దాంపత్య జీవితాలు చల్లగా చూడు సాయి". 


ఓం శ్రీ సాయీశ్వరాయనమః!!!


కాలువలో పడేసిన బంగారు హారాన్ని తిరిగి దొరికేలా అనుగ్రహించిన బాబా


నేను ఒక సాయిభక్తురాలిని. మేము కొంతమంది భక్తులం ప్రతి గురువారం సాయంత్రం గుడిలో బాబా ఆరతి పాడి, భజన చేసుకుంటాం. మాలో ప్రసన్న అనే భక్తురాలు శ్రీవినాయకచవితినాడు వినాయకవ్రతం చేసుకుంది. ఆ సమయంలో ఆమె తన బంగారు లక్ష్మీహారాన్ని వినాయకుని విగ్రహానికి వేసి చక్కగా అలంకరించింది. సాయంత్రం ఆమె ఆ వినాయక విగ్రహాన్ని పెద్ద కాలువలో నిమజ్జనం చేయడానికి తన కుమారునికి ఇచ్చి పంపించింది. ఆ అబ్బాయి మరికొంతమంది స్నేహితులతో కలిసి వెళ్లి కాలువలో వినాయకుని నిమజ్జనం చేసి వచ్చాడు. అది సాయంత్రం 4.30కి జరిగింది. ఆ తరువాత సాయంత్రం 6.30 సమయంలో ఆమెకి వినాయకుడి మెడలో వేసిన బంగారు హారాన్ని తీసి జాగ్రత్తపరచలేదని గుర్తుకొచ్చింది. దాంతో ఆమె ఆ హారంతోనే వినాయకుడ్ని నిమజ్జనం చేసేశామని బాబా ఫోటో ముందు కన్నీళ్లు పెట్టుకుంది. తరువాత ఆమె తన భర్తతో విషయం చెప్పి, "ఒకసారి కాలువకెళ్లి చూసి రండి" అని చెప్పింది. అతను ఆమెను తిట్టి, "అది ఎప్పుడో నీటిప్రవాహంలో కొట్టుకుపోయి ఉంటుంది. అనుభవించు" అన్నాడు. కానీ ఆమె అతనిని బ్రతిమాలి పంపించింది. ఆమె ఇంట్లో బాబా ఫోటో వద్ద  కన్నీళ్ళతో ప్రార్థన చేస్తూ ఉంది. ఆశ్చర్యం! ఆమె భర్త కాలువ దగ్గరకి వెళ్లి చూస్తే, శ్రీవినాయకుని విగ్రహం అక్కడే పొదలో చిక్కుకుని కనిపించింది. వినాయకుని మెడలోని బంగారు హారం కూడా అలానే ఉంది. అతను ఆ హారాన్ని తీసుకుని ఇంటికి వచ్చాడు. భార్యభర్తలిద్దరూ బాబాకు అనేక కృతజ్ఞతలు తెలుపుకున్నారు. తరువాత ఆమె బాబా అనుగ్రహాన్ని మా భక్తులందరితో చెప్పి, "బాబా చేసిన మేలు నా జీవితాంతం మరువలేనిది. ఆయన నన్ను, నా కుటుంబాన్ని అనేకవిధాల కాపాడుతున్నారు" అని అంది. మేమందరమూ కూడా బాబా దయకు, ప్రేమకు ప్రణామాలు అర్పించుకున్నాము. "ధన్యవాదాలు బాబా!"


కోరుకున్నట్లు గొడవలు లేకుండా పెళ్లి జరిపించిన బాబా


ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!!! ఈ బ్లాగును నిర్వహిస్తున్నవారికి, సాయిభక్తులకు నమస్కారాలు. నేను ఒక సాయిభక్తురాలిని. నేను ఏ పని చేసినా బాబా నామస్మరణ చేసుకుంటూనే చేస్తాను. బాబా ఎల్లప్పుడూ తోడుగా ఉండి నన్ను నడిపిస్తారు. నేను రోజూ ఈ బ్లాగులోని భక్తుల అనుభవాలు చదువుతాను. వాటిని చదువుతుంటే బాబా నాతోనే ఉన్నట్లుంటుంది. ఆయన దయవల్ల నేను అనుకున్నవన్నీ జరిగాయి. నాకు పెళ్లి నిశ్చయమయ్యాక మా మావయ్యవాళ్ళు కన్యాదానం చేయాలని నేను ఆశపడ్డాను. ఎందుకంటే, నేను చిన్నప్పటినుండి వాళ్ళ దగ్గరే పెరిగాను. కానీ నా చిన్నప్పటినుండి మా నాన్నవాళ్ళకి, మావయ్యవాళ్ళకి మధ్య కొన్ని చిన్న చిన్న సమస్యలున్నాయి. అందువల్ల కన్యాదానం మావయ్యవాళ్ళని చేయమంటే గొడవ జరుగుతుందేమో అని నేను భయపడ్డాను. అప్పుడు, "బాబా! ఏ సమస్యా లేకుండా అంతా మంచిగా జరిగేలా చూడు తండ్రీ. అలా జరిగితే, మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని ఆర్తిగా బాబాను వేడుకున్నాను. బాబా దయవల్ల ఏ సమస్యా లేకుండా నా పెళ్లి జరిగింది. నేను కోరుకున్నట్లే మావయ్యవాళ్ళు నాకు కన్యాదానం చేశారు. "ధన్యవాదాలు బాబా. ఈ అనుభవాన్ని ఆలస్యంగా పంచుకున్నందుకు క్షమించండి బాబా. నా ట్యూషన్లు బాగా జరిగేలా అనుగ్రహించు తండ్రీ".


ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!!!



సాయిభక్తుల అనుభవమాలిక 1333వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. ఎంతటి సమస్యనైనా ఇట్టే తీర్చేసే బాబా  
2. దయతో ఎన్నో సమస్యల నుండి బయటపడేసిన బాబా

ఎంతటి సమస్యనైనా ఇట్టే తీర్చేసే బాబా  


శ్రీ సచ్చిదానంద సద్గురు శ్రీసాయినాథ్ మహరాజ్ కీ జై!!!


'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు నిర్వాహకులకు మరియు బ్లాగులో ప్రచురితమయ్యే భక్తుల అనుభవాలను పఠించే సాయి భక్తులకు నా హృదయపూర్వక నమస్కారాలు. నేను ఒక సాయి భక్తురాలిని. నేను ఇదివరకు నాలుగుసార్లు నా అనుభవాలు ఈ బ్లాగులో పంచుకున్నాను. ఇప్పుడు మరికొన్ని అనుభవాలు పంచుకోబోతున్నాను. నేను ఒక్కటిన్నర సంవత్సరంగా ఒక సమస్య విషయంగా ఆందోళన పడుతున్నాను. నిజానికి ఆ సమస్య నాకు సంబంధించినది కాదు. అది నా తమ్ముడి సమస్య. దాని గురించి నాకు, తమ్ముడికి తప్ప ఎవరికీ తెలీదు. ఒకవేళ తెలిస్తే, అందరూ తనని తప్పుపట్టి నిందిస్తారు. అందుకు భయపడే తను నాకు తప్ప ఎవరికీ దాని గురించి చెప్పలేదు. అయితే అదేమంత పెద్ద సమస్య కాదు. అందుకే నేను ఆ సమస్య గురించి అందరితో చెప్పమని తమ్ముడితో చెప్పాను. కానీ తను చెప్తే, ఉన్న సమస్యలు మరింత పెద్దవి అవుతాయని ఎవ్వరికీ చెప్పలేదు. నేను కూడా బలవంతపెట్టలేదు. కానీ విషయం అందరికీ తెలిసాక దాచిపెట్టినందుకు తమ్ముడిని, నన్ను కలిపి నిందిస్తారని నాకు చాలా భయంగా ఉండేది. ఈ ఒకటిన్నర సంవత్సర కాలంలో నేను ఆ విషయం గురించి ఆందోళన చెందని రోజంటూ లేదు. ప్రతిరోజూ నేను, "బాబా! అందరికీ తెలియకముందే తమ్ముడు ఆ సమస్య నుండి బయటపడాలి" అని బాబాకి దణ్ణం పెట్టుకుంటూ ఉండేదాన్ని. 2022, ఆగస్టులో తమ్ముడు ఆ సమస్యను ఎదుర్కోవాల్సిన సమయం వస్తుందనగా నా భయాందోళనలు మరింత ఎక్కువయ్యాయి. నేను బాబాకి గట్టిగా దణ్ణం పెట్టుకుని 'సాయి దివ్యపూజ' చేసి, "తమ్ముడు గనక ఎటువంటి అపనిందల పాలుకాకుండా ఆ సమస్య నుండి బయటపడితే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని అనుకున్నాను. బాబా కృపతో ఆగస్టు నెలలో ఆ సమస్యని ఎదుర్కొనే సమయం వచ్చినపుడు తమ్ముడికి అంత సవ్యంగా జరిగింది. ఆ సమస్య నడిచినన్ని రోజులూ తనకి ఏ ఇబ్బంది రాలేదు. అసలు ఆ సమస్య గురించి తనని ఎవ్వరూ ఒక్క మాట కూడా అడగలేదు. నాకు ఎంతో ఆశ్చర్యమేసింది. సమస్య ఇంకా కొంచెం తేలాల్సి ఉంది. బాబా అనుగ్రహంతో అది కూడా సమసిపోతుందని నమ్మకంతో ఉన్నాను.


మా తమ్ముడు పక్క ఊరిలో ఉండే కాలేజీలో 'లా' చదువుతున్నాడు. తన ఉద్యోగరిత్యా ఆ కాలేజీలో అటెండెన్స్ తప్పనిసరి కాదు అన్నందున తను అక్కడ చేరి అప్పుడప్పుడు కాలేజీకి వెళ్లి పరీక్షలు వ్రాస్తూండేవాడు. అయితే, ఆఖరి సెమిస్టర్‍కి వచ్చేసరికి యూనివర్సిటీ హాజరు తప్పనిసరి చేసింది. దాంతో ఏం చేయాలో అర్థంకాని పరిస్థితి ఏర్పడింది. సహాయం కోసం సంప్రదించిన వాళ్ళందరూ ఈ విషయంలో ఏ సహాయం చేయలేమన్నారు. ఇక తన చదువు పూర్తికాదేమో అని తమ్ముడు చాలా బాధపడ్డాడు. ఎందుకంటే, ఆ 'లా' చదువు మీద వాడికి చాలా ఆశలున్నాయి. నేను కూడా ఆందోళన చెంది బాబాకి దణ్ణం పెట్టుకున్నాను. ఆ సెమిస్టర్‍కి హాజరు తప్పనిసరి అయినప్పటికి ఆఖరిలో పరీక్షలు వ్రాయడానికి ఎవరూ అడ్డు చెప్పలేదు. ఇది కేవలం బాబా అనుగ్రహం తప్ప మరేమీ కాదు.


ఒకరోజు మా అమ్మ, "కుడి చేయి చాలా నొప్పిగా ఉంటుంది" అని అంది. నేను బాబాకి దణ్ణం పెట్టుకుని, 'అమ్మ చేయి నొప్పి తగ్గితే, బ్లాగులో పంచుకుంటాను" అని అనుకున్నాను. కానీ అమ్మకి ఆ చేయినొప్పి చాలా నెలల నుండి ఉంది కాబట్టి అంత తేలికగా తగ్గదని నాకు తెలుసు. అందువల్ల  ఖచ్చితంగా హాస్పిటల్‍కి వెళ్ళాలనుకున్నాను. అయితే ఆ రోజు సాయంత్రం ఏదో మామూలుగా అమ్మని, "చేయి నొప్పి ఎలా ఉంది?" అని అడిగితే, "నొప్పి తగ్గింది. ఇప్పుడు అంతగా లేదు" అని అంది. అది విని ఆమె నుండి అటువంటి సమాధానాన్ని అస్సలు ఊహంచని నేను ఆశ్చర్యపోయాను. అది నా తండ్రి బాబా కృపకాక మరేంటి? కోరిక కోరిన నేను మార్చిపోతానేమోగాని, వాటిని తీర్చే కల్పతరువు, పిలిస్తే పలికే దైవం అయిన ఆ సాయినాథుడు మార్చిపోడు. "మీరు మాపై చూపే ప్రతీ అనుగ్రహానికి ధన్యవాదాలు బాబా".


అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!

సర్వం శ్రీసాయినాథార్పణమస్తు!!


దయతో ఎన్నో సమస్యల నుండి బయటపడేసిన బాబా


నేను ఒక సాయి భక్తురాలిని. శ్రీసాయిబాబాకు అనంతవేల నమస్కారాలు. ఈ బ్లాగ్ నిర్వహిస్తున్న వారికి కృతజ్ఞతలు. ఈ బ్లాగు ద్వారా నా సమస్యలెన్నింటికో పరిష్కారం లభించింది. బాబా ప్రసాదించిన అనుభవాలను ఈ బ్లాగు ద్వారా పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. నేను గతంలో కొన్ని అనుభవాలు పంచుకున్నాను. బాబా దయతో ఇప్పుడు మరికొన్ని అనుభవాలు పంచుకుంటున్నాను. ఒకరోజు మా నాన్నగారికి జలుబు చేసి తరువాత జ్వరం కూడా వచ్చింది. మరుసటిరోజుకి బాగా దగ్గు రావడం మొదలై రెండు రోజులైనా తగ్గలేదు. నాన్న చాలా ఇబ్బందిపడ్డారు. అప్పుడు నేను నా మనసులో, "బాబా! మీ దయతో నాన్నకు దగ్గు తగ్గితే, 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాన"ని మొక్కుకొని, 'ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః' అనే నామాన్ని 108సార్లు స్మరించి, బాబా ఊదీ నీళ్లలో కలిపి నాన్నకి ఇచ్చాను. బాబా దయవల్ల ఆ రోజు సాయంత్రం నుండి నాన్నకి దగ్గు తగ్గింది. అదే సమయంలో మా అమ్మకి కూడా వైరల్ ఫీవర్ వచ్చింది. అయితే అమ్మ అంతగా ఇబ్బంది పడలేదు. బాబా దయవల్ల తొందరగానే తగ్గిపోయింది. అప్పుడే మా బాబుకి కూడా వైరల్ ఫీవర్ వచ్చి జలుబు, ముక్కు కారడం వల్ల ఇబ్బంది పడ్డాడు. నేను చాలా భయపడి, "బాబా! మీ దయతో బాబుకి తొందరగా నయమైతే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను వేడుకున్నాను. ఆ తండ్రి దయవల్ల ఆ రాత్రికి బాబుకి తగ్గిపోయింది. ఆ తరువాత మా బాబుకి విరోచనాలైనప్పుడు కూడా నేను బాబానే ఆశ్రయించాను. ఆయన దయతో తనకి విరోచనాలు తగ్గిపోయాయి. 


ఒకసారి మా పక్కింటివాళ్ళ టిఫిన్ బాక్స్ కనిపించలేదు. ఎంత వెతికిన 15 రోజుల వరకు అది దొరకలేదు. అప్పుడు నేను, "బాబా! మీ దయతో టిఫిన్ బాక్స్ దొరికితే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి మొక్కుకున్నాను. ఆయన దయవలన వెంటనే ఆ బాక్స్ దొరికింది.


ఒకసారి మా బాబు నా మొబైల్ నీటిలో పడేసాడు. ఐదురోజులు వరకు మొబైల్ పనిచేయలేదు. అప్పుడు నేను మొబైల్‍కి బాబా ఊదీ పెట్టాను. ఆయన దయవల్ల మొబైల్‍ను ఏ షాపుకి తీసుకెళ్ళకుండానే, ఏ రిపేరు లేకుండానే అది పని చేసింది. "ధన్యవాదాలు బాబా. నేను గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతున్నాను తండ్రి. మీ దయతో నేను కోరుకున్న డిప్యూటీ కలెక్టర్ పోస్టు నాకు వస్తే, మళ్ళీ నా అనుభవం బ్లాగులో పంచుకుంటాను బాబా".



సాయిభక్తుల అనుభవమాలిక 1332వ భాగం....


ఈ భాగంలో అనుభవం:

    •  శ్రీసాయి అనుగ్రహ లీలలు - తొమ్మిదవ భాగం

    సాయిబాబుగారు తమకు బాబా ప్రసాదించిన కొన్ని అనుభవాలు గతవారం పంచుకున్నారు. ఇప్పుడు మరికొన్ని అనుభవాలు పంచుకుంటున్నారు.


    2019, మార్చి 4, మహాశివరాత్రి. ఆరోజు ఇంట్లో పూజయ్యక, "ఇంట్లోనే ఉండి నామం చెప్పుకోవాలా? గుడికి వెళ్ళి దర్శనం చేసుకోవాలా?" అని. బాబాను అడిగితే, “గుడికి వెళ్ళమ"ని బాబా సమాధానం వచ్చింది. అయితే, 'ఏ గుడికి వెళ్ళాలి? ఎక్కడ గుడికి వెళ్ళాలి?' అని ఆలోచిస్తుంటే, ముందురోజు టీవీలో, 'పదివేల శివలింగాలకు మీరే స్వయంగా అభిషేకం చేయవచ్చు' అని మేము చూసిన ఒక యాడ్ గుర్తొచ్చింది. అక్కడికి వెళ్ళమని బాబా సంకల్పమేమో అని మాకు అనిపించింది. అయితే ఆ యాడ్ ఒకేఒక్క నిమిషం కనిపించినందువల్ల మేము 'వేమవరం' అన్న ఊరి పేరు మాత్రమే చూసాము, ఫోన్ నెంబర్ చూడలేకపోయాము. అయినా ఆ ఊరి పేరు ఆధారంగా వెళదామని ఇంటి నుండి బయలుదేరాము. కొంత దూరం వెళ్ళాక ఓ చోట నా భార్య అక్కడున్న ఒక వ్యక్తిని “వేమవరం వెళ్లాలంటే, ఎలా వెళ్ళాలి”. అని అడిగింది. అందుకతను, “నాకు తెలియదు” అని చెప్పాడు. నా భార్య నిరాశగా ఒకడుగు వెనక్కి వేసింది. ఇంతలో పక్కనే ఉన్న ఒక కుర్రాడు వేమవరం ఎలా వెళ్ళాలో చెప్పాడు. బాబానే ఆ కుర్రాడితో చెప్పించారని భావించి కృతజ్ఞతలు చెప్పుకుని ఆ కుర్రాడు చెప్పిన రూటులో వెళ్ళాము. ఇరవై నిమిషాల తర్వాత అక్కడికి చేరుకున్నాము. అక్కడ పదివేల శివలింగాలను చూడగానే మాకు ఎంతో ఆనందం కలిగింది. శివరాత్రి రోజున అన్ని పాలరాతి శివలింగాలను దర్శించుకోవడం శుభసూచకంగా భావించాము. ఎదురుగా ఉన్న శివలింగానికి స్వయంగా మేము తీసుకుని వెళ్ళిన కొబ్బరిబోండం తదితర సామగ్రితో స్వయంగా అభిషేకం చేసుకున్నాము. పూజారి తృప్తిగా శివలింగానికి పూజ చేసి అడగకుండానే రెండు అరటిపళ్ళు, గులాబీపూలు, పెద్ద పువ్వు ఉన్న కొబ్బరి చిప్పను ప్రసాదంగా నా భార్య చేతికి ఇచ్చారు. అంతలో ఒక పెద్దాయన చేతిలో మారేడు దళాలతో అక్కడికి వచ్చారు. నా భార్య అతనిని, "రెండు దళాలు ఇస్తారా?" అని అడిగింది. అతను, “తప్పకుండా” అని ఆ మారేడు దళాలు ఇచ్చాడు. నా భార్య వాటిని పూజారికి ఇచ్చింది. ఆయన వాటిని శివలింగం మీద ఉంచారు. మాకు చాలా సంతోషంగా అనిపించి మమ్మల్ని గుడికి వెళ్ళమని ప్రేరేపించి, దారిలో అడ్రసు చెప్పించి, మారేడు దళాలు అందించి తృప్తిగా శివయ్యకు పూజ చేసుకునేలా చేసిన బాబాకి శతకోటి వందనాలు చెప్పుకున్నాము. ఇంకా ఆ రోజు మేము ప్రపంచంలోనే రెండవ పెద్ద స్పటిక లింగాన్ని కూడా దర్శించుకుని ఆ రాత్రి చేబ్రోలులోని శివాలయంలో జరుగుతున్న శివపార్వతుల కళ్యాణాన్ని వీక్షించాలని వెళ్ళాము. అక్కడ “ఎదురుకోలు” ఉత్సవంలో భాగంగా పార్వతీదేవి అమ్మవారి తరుపువాళ్ళు అమ్మవారికి చీర సారె పెట్టి పూజానంతరం వచ్చిన భక్తులకు లడ్డు ప్యాకెట్, పులిహోర, పానకం ఇచ్చారు. తర్వాత అందరం శివాలయానికి బయలుదేరాము. చివరగా నేను, నా భార్య నడుస్తున్నాము. ఓ చోట వీధి మధ్యలో ఒక లడ్డు ప్రసాదం ప్యాకెట్టు పడి ఉండడం మేము చూసి, "ఎవరి ప్రసాదమో జారిపోయి ఉంటుంది. ఏ కుక్కో, ఎలుకో తింటాయిలే" అని ఆ ప్రసాదాన్ని అలాగే వదలి వచ్చేసాము. తరువాత ఆదిదంపతుల కళ్యాణ అక్షింతలు, ఆశీర్వచనాలు తీసుకుని ఆనందంగా మా ఇంటికి చేరుకున్నాము. అలా ఆ సంవత్సరం శివరాత్రి ఉపవాస, జాగరణలతో ఆనందంగా గడిచిపోయింది. ఇదంతా బాబా కృపాకటాక్షం. ఇకపోతే మేము స్నానాలు చేసి బాబాకి దీపారాధన చేశాక నా భార్య బాబా పుస్తకం చదువుతుంటే, “దారిలో పడిఉన్న లడ్డు ప్రసాదం ప్యాకెట్ తీసుకోకుండా వదిలేసి వచ్చారు” అని వచ్చింది. తద్వారా 'కిందపడి ఉన్నా ప్రసాదం ప్రసాదమే. దాన్ని తీసుకోకుండా ఎందుకు వదిలి వచ్చామ’ని బాబా మమ్మల్ని సున్నితంగా హెచ్చరిస్తున్నారని మాకు అనిపించింది. క్రిందపడిన ప్రసాదాన్ని అలా వదిలేయకూడదని బాబా మాకు ఆవిధంగా తెలియజేశారు. మేము తప్పయిందని చెంపలేసుకున్నాము. బాబా సదా మా ముందుండి మమ్మల్ని నడిపిస్తూ, మా మనసులోని భావాలను గ్రహిస్తూ, తప్పు ఒప్పులను తెలియపరుస్తూ ఉంటారని అనడానికి నిదర్శనమే బాబా మాకు ప్రసాదించిన ఈ అనుభవం.


    మేము మా కారులో ఒక చిన్న బాబా చిన్న విగ్రహం పెట్టుకున్నాము. విగ్రహం ఉంటే బాబా ఉన్నట్లే గదా! ఒకసారి మేము కారులో తెనాలి వెళ్తుండగా ఓ చోట బ్రిడ్జి మీద ఒక అమ్మాయి స్కూటీ మీద వస్తూ తనంతటతనే మా కారుకి తగిలి బాలెన్స్ చేసుకోలేక ప్రక్కకు పడింది. బాబా దయవలన తనకేమీ కాలేదు. కానీ వెనక వచ్చేవాళ్ళు హడావిడి చేసి, ట్రాఫిక్ పోలీసుని పిలిచారు. అతను వచ్చి అంతా పరిశీలించి, "తప్పు అమ్మాయిదే అనిపిస్తుంది” అని అన్నాడు. ఇంతలో ఆ అమ్మాయి చెప్పాపెట్టకుండా స్కూటీ మీద వెళ్ళిపోయింది. నేను నా ఫోన్ నెంబర్ ఆ పోలీసుకు ఇచ్చి, "ఏదైనా అవసరమైతే, ఫోన్ చేయండి" అని చెప్పి వచ్చేశాను. అయితే ఆ సంఘటన జరిగిన దగ్గర నుండి నా మనసులో, 'ఎప్పుడూ ఇలా జరగలేదు. చెయ్యని తప్పుకి వేరే వాళ్ళతో మాట పడాల్సి వచ్చింది' అని ఏదో తెలియని బాధగా ఉంది. నేను ఆరోజు సాయంత్రం పేపరు చదువువుతుంటే అందులో, “ఉదయం జరిగిన సమస్య తీరిపోయింది. బాధపడవద్దు” అని ఉంది. అది చదివాక నా మనసు తేలికపడింది. చూశారా! బాబా ఎలా ఓదార్చారో. ఇలా చిన్న, పెద్ద సమస్యల నుండి బాబా నన్ను చాలాసార్లు కాపాడారు. మన తప్పులేకపోతేనే సుమా!


    బాబా ఊదీ దివ్య ఔషధమని చెప్పటానికి సందేహమే లేదు. ఒకసారి నేను అడుగు తీసి అడుగు వేయలేనంత నడుము నొప్పితో వారం రోజులు చాలా బాధపడ్డాను. పూజ తరువాత ఊదీ నుదుటన ధరించి, మరికొంత ఊదీ నోట్లో వేసుకోవడం నాకు అలవాటు. అలా చేస్తూ ఉన్నా నొప్పి ఏ మాత్రం తగ్గలేదు. వారం రోజులైన తర్వాత నొప్పి భరించలేక డాక్టరుకి చూపించుకుందామనుకున్నాను కానీ, 'బాబా ఉండగా డాక్టరు దగ్గరకి వెళ్ళడమెందుకు?' అని, 'రేపు చూద్దాం, రేపు చూద్దాం' అంటూ రెండు రోజులు గడిపాను. అప్పుడు నా భార్య బాబా పుస్తకం చదువుతుండగా, “ఊదీ తీర్థంతో నేను నీ నడుము నొప్పి తగ్గిస్తాను” అన్న వాక్యం కనిపించింది. వెంటనే ఆమె ఆ వాక్యాలు నాకు చూపించింది. ఇక అప్పటినుండి నేను పూజయ్యక కొంచెం ఊదీ నీటిలో కలిపి ఆ తీర్థాన్ని తీసుకోవడం మొదలుపెట్టాను. రెండోరోజుకి నడవగలిగాను. వారం రోజులు క్రమం తప్పకుండా ఊదీ తీర్ధం తీసుకున్నాక నడుము నొప్పి పూర్తిగా తగ్గిపోయింది. బాబా చెప్పినట్లు పాటించడం వల్ల నేను ఆ బాధ నుండి విముక్తి పొందాను, బాబా తన భక్తులను వారివారి బాధల నుండి, నొప్పుల నుండి రక్షిస్తారు. మనకు ఆయనపై పూర్తి విశ్వాసం ఉండాలి.


    పునర్జన్మను ప్రసాదించిన బాబా: 2010లో నా భార్య అనారోగ్యానికి గురైంది. బాబాని అడిగితే, “వెంటనే ఆపరేషన్ చేయించుకోవాలి” అని అన్నారు. అయితే మేము కొన్ని కారణాల వల్ల చాలాకాలంపాటు ఆపరేషన్ వాయిదా వేశాము. రెండు సంవత్సరాల తర్వాత ఒకరోజు అర్ధరాత్రి నా భార్యకి బాగా సీరియస్ అయింది. అప్పుడు మేము బెంగుళూరులో ఉన్నాము. మేము ఉండే చోటు నుండి హాస్పిటల్‍కి కిలోమీటర్ల దూరం వెళ్ళాలి. మా అల్లుడు ఆటో కోసమని వెళ్లి కొంతసేపటికి, 'ఇంత రాత్రివేళ ఆటోలు లేవు, దొరకవు" అని వెనక్కి వచ్చేశాడు. మేము బాబాని స్మరిస్తూ, ఆయనే ఆటో పంపుతారన్న నమ్మకంతో నా భార్యను తీసుకుని రోడ్డు మీదకు వెళ్ళాము. సరిగ్గా అప్పుడే ఒక ఆటో మా దగ్గరకి వచ్చి ఆగింది. అందులో ఇద్దరు యువకులున్నారు. వాళ్ళు మమ్మల్ని, "ఎక్కడికి వెళ్ళాల"ని అడిగితే, "హాస్పటల్"కని చెప్పాము. వాళ్ళు, “ఎక్కండి” అని మమ్మల్ని హాస్పిటల్‍‍కి చేర్చారు. నేను, “డబ్బులు ఎంత ఇవ్వమంటార"ని అడిగితే, “చిల్లర ఎంత ఉంటే, అంత ఇవ్వండ"ని అన్నారు. అప్పుడు నేను, "నా దగ్గర 30 రూపాయల చిల్లర డబ్బులున్నాయ"ని చెప్తే, “అవిచాలు, ఇవ్వండి” అని తీసుకుని వెళ్ళిపోయారు. మేం కంగారుగా హాస్పిటల్‍లోకి వెళ్ళిపోయాము. తర్వాత ఆలోచిస్తే, 'ఆటోవాళ్ళు ఎలా లేదన్నా కనీసం 200 రూపాయలు తీసుకుంటారు. కానీ వాళ్లు ఇచ్చినంత తీసుకుని వెళ్ళిపోయారు. అనుమానమే లేదు అది బాబా పంపిన ఆటో' అని అనిపించి, 'మనకు అన్నీ ఇచ్చే ఆయనకు కనీస ఛార్జి డబ్బులైన ఇవ్వలేద'ని చాలా బాధపడ్డాను. ఇకపోతే డాక్టరు నా భార్యని చూసి, కొన్ని మందులు వ్రాసారు. ఆ మందులు వాడుతూ ఇంకొక సంవత్సరం గడిపాము. 2013లో నా భార్య బాగా బలహీనపడిపోయి కనీసం నాలుగు అడుగులు కూడా వేయలేని స్థితికి వచ్చింది. అప్పుడు తనని హాస్పిటల్‍కు తీసుకుని వెళ్తే, అన్ని పరీక్షలు చేసి, "ఆమె శరీరంలో కేవలం 4 గ్రాముల రక్తం ఉంది. 12 గ్రాములు ఉండాలి" అని అన్నారు. డాక్టరు నా భార్యతో “నువ్వు కోమాలోకి వెళ్ళవలసిన దానవు, ఇలా ఎలా ఉన్నావ"ని అన్నారు. రోజుకొక బాటిల్ చొప్పున రక్తం ఎక్కించి 12 గ్రాములు అయ్యాక ఆపరేషన్ చేశారు. కావలసిన రక్తం అంతా బాబా ఉచితంగా ఏర్పాటు చేశారు. అలా  బాబా సకాలంలో చేయవల్సినవన్నీ చేసి నా భార్యకు పునర్జన్మను ప్రసాదించారు. లేకుంటే కోమాలోకి వెళ్ళి గుండెకు రక్త సరఫరాకాక, పరిస్థితి వేరేవిధంగా ఉండేది. ఇప్పుడు అంతా బాగానే ఉంది.  బాబా ఉండగా మనకి భయమెందుకు? ఆ బంగారు తండ్రికి సర్వదా మేము కృతజ్ఞులమై ఉంటాము.


    2013లో మేము బెంగుళూరులో ఉన్నప్పుడు ఒకరోజు రాత్రి 11 గంటల సమయంలో అకస్మాత్తుగా మా అమ్మాయికి శ్వాస తీసుకోవడం ఇబ్బందైంది. వెంటనే మేము పక్కనే ఉన్న ఒక చిన్న డాక్టరుకు చూపిస్తే, ఆయన పరీక్ష చేసి, “శ్వాసలో ఇబ్బంది ఉంది. ఇది గుండెకు సంబంధించినదై ఉంటుంది. మీరు వెంటనే ఈమెను సత్య సాయి హాస్పిటల్‍కి తీసుకుని వెళ్ళండి. వాళ్ళు వెంటనే పరీక్ష చేసి సమస్యేమిటో చెప్తారు. ఇప్పుడే వెళ్ళండి, రేపు ఉదయమైతే చాలా జనం ఉంటార"ని చెప్పారు. ఆ సమయంలో ఆటోలు దొరకక బైక్ మీద నేను, మా అల్లుడు అమ్మాయిని తీసుకుని హాస్పిటల్‍కు బయలుదేరాము. బైక్ బయలుదేరగానే నేను మనసులో, “బాబా! మా అమ్మాయికి గుండెకు సంబంధించిన సమస్య ఏమీ లేదు. అసలు ఈమెకు ఏ అనారోగ్యం లేదు, అంతా బాగానే ఉందని చెప్పించు తండ్రి. నేను మీకు 1000 రూపాయలు దక్షిణ శిరిడీకి పంపుతాను" అని బాబాను వేడుకున్నాను. మేము హాస్పిటల్‍కి వెళ్లినంతనే చకచకా పరీక్షలన్నీ చేసి, హార్ట్ స్పెషలిస్ట్ డాక్టరు కూడా పరీక్షించి, “సమస్యే మీ లేదు. అంతా బాగానే ఉంది. దుమ్ము వలన శ్వాసకు సమస్య వచ్చింది" అని చెప్పారు. ఆ మాట వింటూనే మా కంగారంతా మటుమాయం అయ్యింది. సంతోషంగా బయటికి వచ్చి వెళ్ళిపోతూ గేటు వద్ద ఉన్న సెక్యూరిటీ గార్డుకు 100 రూపాయలు ఇవ్వబోతే, అతను “వద్దండి, బాబాయే మాకు జీతాలు ఇస్తున్నారు. అవి చాలు. మీ అమ్మాయికి ఏమీ లేదన్నారు. చాలా సంతోషం, వెళ్ళిరండి” అని అన్నారు. ఈ రోజుల్లో కూడా ఇలాంటివారు ఉండబట్టి ధర్మం ఇంకా  ఉందనుకున్నాను. తర్వాత బాబాకు కృతజ్ఞతలు చెప్పుకుని శిరిడీకి దక్షిణ పంపించాను.


    నేను బెంగుళూరులో ఉన్నప్పుడు ఒక కంపెనీలో జాబ్ చేస్తుండేవాడిని. ఒకరోజు ఉదయం 8 గంటలకు ఇంటి నుండి కంపెనీకి వెళ్ళడానికి బస్సు ఎక్కాను. నేను దిగాల్సిన స్టేజ్ దగ్గర ఒక స్పీడ్ బ్రేకర్ ఉంది. డ్రైవరు బస్సుని రోడ్డు పక్కకి తీసి ఆపకుండా సరిగ్గా స్పీడు బ్రేకర్ వద్ద బస్సు ఆపి నన్ను దిగమన్నాడు. నేను ఒక కాలు క్రింద పెట్టాను, రెండో కాలు ఇంకా బస్సు చివరి మెట్టు మీద ఉంది. అంతలో అప్రయత్నంగా నేను బస్సు వెనుకకు చూస్తే, ఒక 'మహేంద్ర జీపు' చాలా వేగంగా దూసుకొస్తోంది. దాని వేగాన్ని బట్టి అది నన్ను ఢీకొట్టడం ఖాయమని అర్థమవుతుంది. కానీ నేను అటు బస్సు దిగలేను, అలాగని వెనక్కి ఎక్కలేను. అంతలో నాకు బాబా జ్ఞాపకం వచ్చి, ఆయనను తలుచుకున్నాను. అంతే, నా మెడ మీద ఒక చేయి పడింది. అది నన్ను అమాంతం గాల్లోకి లేపి, ఆ జీపు కన్నా వేగంగా బస్టాపులో దించింది. ఆ చేయి బాబాదే. నా మెడ మీద ఏదో బరువు పడిందని తెలుసుగాని, బాబా కనపడలేదు. ఇదంతా బస్టాపులో ఉన్న ఒకతను చూస్తూ తలను అటు ఇటు ఆడించి, అవాక్కయి నోటి మీద వ్రేలు వేసుకున్నాడు. నేను బాబాకు కృతజ్ఞతలు చెప్పుకుని కంపెనీకి వెళ్ళిపోయాను. ఆనాడు బాబా రక్షించకపోయుంటే నేను ఈరోజు ఇలా ఆయన అనుగ్రహాన్ని మీతో పంచుకోలేకపోయేవాడిని.


    ఒకసారి నేను, నా భార్య, నా మనుమడు ముగ్గురమూ స్కూటీ మీద వెళ్తూ ఓ చోట రోడ్డు దాటాలనుకున్నాము. అయితే అక్కడ రోడ్డుకు ఒక పక్కన ఇద్దరు వ్యక్తులు బైక్ ఆపి మాట్లాడుకుంటున్నారు. నేను వాళ్ళను తప్పించే ప్రయత్నంలో స్కూటీని ఎడమవైపు త్రిప్పేసరికి ఒక ట్రాక్టర్ ఇసుక లోడుతో చాలా స్పీడుగా వస్తూ కనిపించింది. నా భార్య కంగారుపడి స్కూటీ మీద నుండి దిగేసింది. ట్రాక్టర్ డ్రైవరు కూడా కంగారులో క్రిందకు దూకడానికి ప్రయత్నించాడు కానీ, అంతలో ట్రాక్టర్ దానంతట అదే బ్రేక్ పడినట్లుగా మాకు చాలా కొద్దిదూరంలో ఆగిపోయింది. ఒక్క అంగుళం కూడా ముందుకు కదలలేదు. మేము పక్కకు తప్పుకున్నాక ట్రాక్టర్ కదిలింది. అదెలా సాధ్యమయిందో డ్రైవరుకు కూడా అర్ధం కాలేదు. వాళ్ళు, 'మాకు పెద్ద ప్రమాదం తప్పింది' అని అనుకుంటూ వెళ్ళిపోయారు. బైకు అతను కూడా, "ట్రాక్టర్ వస్తున్న స్పీడుకి మీ స్కూటీని ఢీ కొట్టడం ఖాయమనుకున్నాన"ని అన్నాడు. అంతా బాబా దయ. ఆయన రక్షణ ఉంటే అలా ఎందుకు జరుగుతుంది. ప్రక్కనే బాబా గుడి ఉంటే మేము వెంటనే ఆ గుడికి వెళ్ళాము. ఇంకోసారి కూడా మేము ముగ్గురం బెంగుళూరు మెయిన్ రోడ్డు మీద స్కూటీపై వెళ్తున్నాము. ఆ సమయంలో వాహనాలుతో రోడ్డు చాలా రద్దీగా ఉంది. అంత రద్దీలోనూ ఒక కారు చాలా స్పీడుగా వచ్చి వెంట్రుకవాసి గ్యాప్‍లో మమ్మల్ని క్రాస్ చేసింది. ముందున్న ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఉన్న కొంతమంది ఆ కారుని ఆపి, "ఏమిటా స్పీడు?” అని డ్రైవర్ను తిట్టి పంపించారు. నిజానికి ఆ కారు వేగానికి వచ్చే గాలికి ఎవరైనా కింద పడిపోవడం, వెనుక వచ్చే వాహనాలు పైనుండి వెళ్లిపోవడం జరిగేది. కానీ మాకు ఏమీ కాలేదు. అలా చిన్న, పెద్ద ప్రమాదాల నుండి బాబా మమల్ని రక్షిస్తూ ఉన్నారు.


    2019, మే నెల చివరి వారంలో నా భార్య, మా మనవడు సాయీష్ అనంతపురంలో ఒక వివాహానికి వెళ్లి, రాత్రి 10 గంటలకు ఏసీ స్లీపర్ బస్సులో తిరుగు ప్రయాణమయ్యారు. రాత్రి 12 గంటల సమయంలో నా భార్య నాకు ఫోన్ చేసి, "సాయీష్‍కి విరోచనాలు అవుతున్నాయి. బస్సువాళ్ళు  సహాయం చేస్తున్నారు. ఎక్కడైనా టాబ్లెట్లు దొరుకుతాయేమోనని చూస్తున్నారు" అని చెప్పింది. బస్సు ప్రయాణంలో ఉండగా అర్ధరాత్రి వేళ ఇలా జరిగితే ఇబ్బంది కదా అని నేను వెంటనే, "బాబా! వాళ్ల ఇబ్బంది గుర్తించి వెంటనే సాయీష్‍కు విరోచనాలు అవకుండా అనుగ్రహించండి" అని బాబాను ప్రార్థించాను. బాబా దయ చూపారు. సాయీష్‍కి మళ్ళీ విరోచనం కాలేదు. విశేషం ఏమిటంటే, బస్సువాళ్ళు టాబ్లెట్లు ఇచ్చినప్పటికీ అవి వేసుకోకుండానే తనకి విరోచనాలు ఆగిపోయాయి. ఏ ఇబ్బందీ లేకుండా వాళ్ళు క్షేమంగా ఇంటికి చేరుకున్నారు. బాబా అనుగ్రహంతో ఏ సమస్య అయినా అంతరించిపోవాల్సిందే!


    మేము ఒకరోజు మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరి తెనాలి వెళ్ళాము. భక్త శ్రీరామదాసు సినిమా చూసి, ఇంటి పనులు, స్కూలుకు సంబంధించిన పనులన్నీ చూసుకుని, రాత్రి 7 గంటలకి తిరిగి ఇల్లు చేరాము. తలుపు తాళం తీయగానే అదో రకమైన మాడు వాసన వచ్చింది. వెంటనే వంట గదిలోకి వెళ్ళి చూశాము. మధ్యాహ్నం బయటికి వెళ్ళేముందు పాలు స్టవ్ మీద పెట్టి, స్టవ్ ఆఫ్ చేయటం మరిచిపోయి అలాగే వెళ్లిపోయామని అప్పుడు అర్థమైంది. స్టవ్ సిమ్‍లో వెలుగుతూనే ఉంది, పాలు మొత్తం ఆవిరైపోయాయి. గిన్నె అలాగే ఉంది. ఏదైనా ఐతే అని ఊహించటానికి చాలా భయమేసింది. ఏదేమైనా బాబా ఇంట్లోనే ఉండి, ఏ ప్రమాదమూ జరగకుండా చూసుకుని క్రొత్త ఇంటిని కాపాడారు. "సర్వదా మీకు కృతజ్ఞతలు బాబా".


    మేము అప్పుడప్పుడు గుంటూరు వెళ్లి అక్కడ పనులన్నీ చూసుకుని స్కూటరు మీద తిరిగి నారాకోడూరు వచ్చేవాళ్ళం. మేము గుంటూరులో బయలుదేరగానే దట్టంగా మబ్బుపట్టి చినుకులు మొదలయ్యేవి. మేము, "బాబా! మేము ఇల్లు చేరేంతవరకూ వర్షం పడకుండా ఆపండి" అని బాబాను అడిగేవాళ్ళము. అంతే, వర్షం ఆగిపోయేది. ఇల్లు చేరి లోపలకు అడుగుపెట్టగానే పెద్ద వర్షం పడేది. ఇలా చాలాసార్లు జరిగింది.


    సర్పాల నుండి బాబా కాపాడిన వైనం: ఒకసారి మేము గుంటూరు వెళ్ళి, రాత్రికి తిరిగి ఇంటికి వచ్చి తలుపులు తెరిచాక చూస్తే, పూజగదిలో బాబా విగ్రహం ముందు రెండడుగుల సర్పం బాబానే చూస్తూ కనిపించింది. అది మమ్మల్ని గమనించి ప్రక్క గదిలోకి వెళ్ళింది. దాన్ని కొట్టి చంపేశారు. బాబా మేము వచ్చేంతవరకూ దానిని ఎక్కడకీ కదలనీయకుండా చేసి మాకు కనిపించేటట్టు చేసారు. ఇంకొకసారి స్కూలు పిల్లలు ఆరు బయట చదువుకుంటుండగా ఒక పెద్ద జెర్రిపోతు గేటులో నుండి లోపలికి వచ్చి ఒక చిన్న సందులో దూరి మూడుగంటలపాటు అక్కడే ఉండిపోయింది. ఆ మూడు గంటలసేపు పిల్లలు, మేము చాలా కంగారుపడ్డాము. తరువాత నలుగురు వ్యక్తులు వచ్చి దానిని చంపేశారు. ఆ పాముని ఎటూ పోనివ్వకుండా ఆపింది బాబానే. అలా పై రెండు సందర్భాలలో పాముల వల్ల ఎవరికీ ఏ హాని కలగకుండా కాపాడారు బాబా.


    ఒక శివరాత్రి నాటి సాయంత్రం మేము క్వారీలోని శివాలయానికి వెళ్లి దర్శనం చేసుకుని ఇంటికి తిరిగి వచ్చాం. ఆ సమయంలో కరెంటు లేదు. ఇంటి గేటు వద్ద ఒక చిన్న పాము పిల్ల పడగ విప్పి కన్పించింది. తర్వాత ప్రక్కకు వెళ్ళిపోయింది. శివరాత్రి రోజున బాబాయే ఆరూపంలో, బయటివాళ్ళెవరూ ఇంట్లో రాకుండా ఆపారు. ఇంకోసారి మేము ఊరు వెళ్ళడానికి బయలుదేరుతున్న సమయంలో ఇంటి గేటు వెలుపల నుండి ఒక పెద్ద కట్లపాము వచ్చి, ప్రక్కనే ఉన్న నీళ్ళ సంప్‍లో పడిపోయింది. తర్వాత మేము దాన్ని చంపివేశాము. అలా కాకుండా మేం ఊరికి వెళ్ళిన తర్వాత అది లోపలికి వచ్చి ఉంటే, తిరిగి వచ్చిన మేము దాన్ని చీకట్లో చూసుకునే వాళ్ళం కాదేమో! బాబానే ఆ  ఆపద నుండి మమ్మల్ని రక్షించారు.


    తరువాయి భాగం వచ్చేవారం...

     


    ముందు భాగం కోసం
    బాబా పాదుకలు తాకండి.




     


     


    తరువాయి భాగం కోసం
    బాబా పాదాలు తాకండి.

     


    సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

    Subscribe Here

    బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

    Delivered by FeedBurner

    Followers

    Recent Posts


    Blog Logo