సాయిబాబుగారు తమకు బాబా ప్రసాదించిన కొన్ని అనుభవాలు గతవారం పంచుకున్నారు. ఇప్పుడు మరికొన్ని అనుభవాలు పంచుకుంటున్నారు.
బాబా మాకు అనుగ్రహించిన వాహనాలు: 1985 వరకూ నేను ఒక సెకండ్ హ్యాండ్ సైకిల్ వాడేవాడిని. తరువాత అనుకోకుండా కేవలం నెలకు 200 రూపాయలు కట్టేలా నాకు ఒక కొత్త టి.వి.ఎస్. మోపెడ్ ఇప్పించారు బాబా. ఆ తరువాత 1997లో బజాజ్ స్కూటర్ ఇప్పించారు. నిజానికి ఆ రోజల్లో పూర్తి డబ్బు కట్టినా 6 నెలలకే బండి వచ్చేది. అలాంటిది నేను వేరేవాళ్ళతో, వాళ్ళ పనిమీద, టౌనుకు వెళ్లడం, అక్కడ అనుకోకుండా స్కూటరు చూడటం, కలర్ బాగుందనుకుని ఇంటికి రావడం, అనుకోకుండా మా బావమరిది డబ్బు ఇవ్వడం, షోరూమ్ వాళ్ళకు ఫోన్ చేసి, "ఆ బండి ఇస్తారా?" అని అడగడం, వాళ్ళు, "అది వేరేవాళ్ళు బుక్ చేస్తే వచ్చింది. కాబట్టి ఇవ్వడం కుదరద"ని చెప్పడం, మళ్ళీ వాళ్ళే ఫోన్ చేసి, "వెంటనే వచ్చి బండి తీసుకెళ్లండి" అని చెప్పడం, నేను వెళ్ళి బండి తెచ్చి ఇంటి ముందు పెట్టడం కేవలం 2-3 గంటల్లో జరిగిపోయింది. సెకెండ్ హ్యాండ్ బండి కూడా కొనలేని స్థితిలో ఉన్న నన్ను బండి చూసి ఇష్టపడిన 2 గంటల్లోనే ఆ బండికి యజమానిని చేసిన ఆ మహాత్ముని లీలలు ఎన్నని చెప్పను?
చాలాకాలం తర్వాత 2014లో బాబా మాకొక చిన్న కారుని అనుగ్రహించారు. ఆ మహాత్మ్యం చదవండి. మేము కొన్నిరోజులు బెంగుళూరులో ఉన్న తర్వాత 2013లో కొన్ని కారణాల వల్ల మాకు అనుకోని పరిస్థితి ఏర్పడింది. ఒకరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు తిరిగి తిరిగి ఏమీ పాలుపోక నా స్నేహితుడికి ఫోన్ చేశాను. అతను వెంటనే వచ్చి తనని కలవమన్నాడు. సరేనని, వెళ్ళాను. అతను, “కొంచెంసేపు వేచి ఉండండి, వస్తాను” అని అన్నాడు. అతను వచ్చేలోపు చీకటిపడుతుండగా నాకు ఏం చేయాలో తోచక బాబాను, “మా ఊరు వెళ్ళిపోవాలా? లేక ఇక్కడే ఉండాలా?” అని అడిగితే, ‘ఊరు వెళ్ళమ’ని బాబా సమాధానమిచ్చారు. వెంటనే నేను, నా భార్య బస్సు ఎక్కి, 14 గంటల ప్రయాణం చేసి మా ఊరు చేరుకున్నాము. అలా కాకుండా మేము బెంగుళూరులో ఉండుంటే పెద్ద మొత్తంలో అడ్వాన్స్ కట్టి, అద్దింట్లో నానా తిప్పలు పడాల్సి వచ్చేది. అలా కాకుండా బాబా తప్పించారు. మేము ఇక్కడికి వచ్చేటప్పటికి మా సొంతిల్లు గట్రా అన్నీ బాగానే ఉన్నాయి. కొద్దిరోజుల్లో బాబా దయవల్ల మాకు కారు కూడా అమరింది. అదెలాగో చూడండి. 2014లో ఒకరోజు నేను బాబాను, "బాబా! మాకు కారు ఇప్పిస్తారా?" అని అడిగాను. బాబా నుండి "ఇప్పిస్తాను" అని సమాధానం వచ్చింది. నేను, "క్రొత్త కారా? లేక పాతదా?" అని అడిగితే, బాబా, "క్రొత్త కారే" అని చెప్పారు. నేను, "ఏ కంపెనీ కారు?" (నా మనవడికి టాటా నానో అంటే చాలా ఇష్టం. ఆ కార్లు రోడ్డు మీద వెళ్తుంటే వాటి వైపు అలాగే చూస్తూ నిలబడతాడు. వాడు పలికిన మొదటి ఇంగ్లీషు అక్షరాలు కూడా టాటా) అని అడిగితే, బాబా, "టాటా నానో" అని చెప్పారు. తరువాత 5 నెలలు గడిచిపోయాయి. మేము ఆ విషయం పూర్తిగా మరచిపోయాము. నా స్కూటర్ పాతదైపోయి బాగా రిపేర్లు వస్తుంటే, ఒకరోజు నేను, నా భార్య 25 వేల రూపాయలు జేబులో పెట్టుకుని గుంటూరు వెళ్ళాము. అనుకోకుండా 'హీరో' కంపెనీ షోరూమ్ ముందు నుండి వెళ్తూ, ఎందుకో స్కూటీ తీసుకుందామని లోపలికి వెళ్ళాము. కానీ అది పాతది, అంత గట్టిగా లేకపోవడం వల్ల నాకు పెద్దగా నచ్చలేదు. అయినా తప్పదని, "రేటు ఎంత?" అని అడిగితే, 60 వేల రూపాయలు చెప్పారు. నేను, “ఇరవై ఐదు వేలు ఇప్పుడు ఇస్తాను, మిగిలింది ఇంటికి వెళ్ళాక ఇస్తాను. మీ కంపెనీ కుర్రవాణ్ణి నాతో మా ఇంటికి పంపండి" అని అన్నాను. దానికి వాళ్ళు, "అలా కుదరదు" అన్నారు. దాంతో నేను, నా భార్య 'బాబా ఎందుకో పని జరగనివ్వలేదు. అంతా మన మంచికే' అనుకొని అక్కడనుండి బయటకు వచ్చి వెళ్తుండగా, దారిలో ఒక కార్ల షోరూమ్ కనిపిస్తే, లోపలికి వెళ్ళాము. ఆ షోరూమ్ వాళ్ళు మాటల్లో కారు 5 లక్షలు అని చెప్పారు. 'అమ్మో! అంత రేటా?' అని అనుకుని మేము బయటకు వచ్చాము. అక్కడినుంచి ఇంటికి వస్తుంటే ఓ చోట, 'టాటా' అన్న పెద్ద అక్షరాలతో ఒక పెద్ద బోర్డు కన్పించింది. మేము 'ఇక్కడ చూద్దాం' అని లోపలికి వెళ్ళాము. కాదు, బాబానే తీసుకెళ్లారు. అప్పుడు సమయం సాయంత్రం ఐదుగంటలు అయింది. ఉదయం నుండి తిరుగుతుండటం వల్ల మేము బాగా అలసిపోయి ఉన్నాము. మేము లోపలికి వెళ్ళగానే వాళ్ళు మాకు కూల్‍డ్రింక్ ఇచ్చి, ఏ.సి. గదిలో కూర్చోబెట్టారు. కొంచెం అలసట తీరింది. అప్పుడు మేము 'నానో' కారు గురించి అడిగితే, మేనేజర్ "ప్రస్తుతం 2,70,000/- రూపాయలు ఉంది. కానీ నేను మీకొక ఆఫర్ ఇస్తాను" అని పెన్ను, పేపర్ తీసి అంకె వేయబోయాడు. వెంటనే మేము బాబాను తలచుకుని 'అతనొక ఐదువేలో, పదివేలో తగ్గిస్తాడ'నుకున్నాము. కానీ అతను ఏకంగా 70,000/- రూపాయలు తగ్గించాడు. ఆ సంఖ్యను చూడగానే మాకు ఆశ్చర్యంతోపాటు ఆనందమేసి బాబాకి కృతజ్ఞతలు చెప్పుకున్నాము. అంతలోనే అతను, “రేపు సాయంత్రం 5 గంటల లోపు డబ్బులు కడితేనే, నేను మీకు ఈ రేటుకి కారు ఇవ్వగలను” అని అన్నాడు. సరేనని, మేము మరుసటిరోజు సాయంత్రం డబ్బు కట్టి, పేపర్లు తీసుకున్నాము. బాబా మాకు చెప్పిన రంగు 'పెరల్ వైట్'.
ఆ రంగు కారు పిడుగురాళ్ళలో ఉందని, దాన్ని తెప్పించేసరికి రాత్రి 9 గంటలైంది. కానీ కొంత పేపర్ వర్క్ మరియు ఇన్సూరెన్స్ పూర్తికాలేదు. ఆరోజే ఆంధ్ర-తెలంగాణ విభజన జరిగినందున కంప్యూటర్లలో 'ఆన్‌లైన్' వర్క్ జరగట్లేదు. మేనేజర్, "అన్ని పేపర్లు లేనందున కొత్త కారు డెలివరీ ఇవ్వకూడదు. అందువల్ల మీరు మొత్తం డబ్బులు కట్టినప్పటికీ మేము కారు ఇవ్వలేకపోతున్నాము" అని చెప్పి చాలా బాధపడ్డాడు. నేను అతనితో, “మీరు బాధపడాల్సిన పనిలేదు. మనకేది మంచిదో అదే బాబా చేస్తారు" అని చెప్పాను. అతను, "వారంరోజులు పట్టొచ్చు" అని అన్నాడు. "సరే, మేము పేపర్లు రెడీ అయ్యాకే వచ్చి కారు తీసుకుని వెళ్ళతాము" అని చెప్పాము. అతను ఒక డ్రైవరును పిలిచి, షోరూమ్‍లో ఉన్న టెస్ట్ డ్రైవ్ కారులో వెయ్యి రూపాయల పెట్రోల్ వేయించి, "కారుతో సహా మమ్మల్ని ఇంటి వద్ద వదలి పెట్టి రమ్మ"ని చెప్పాడు. మేము వద్దని ఎంత చెప్పినా వినలేదు. ఆ కారు వారం రోజులు మా వద్దే ఉంది. మేము ఆ కారు వాడుకున్నాం. కాస్త డ్రైవింగ్ అలవాటయ్యింది. వారంరోజుల తర్వాత బాబా ఇప్పించిన 'పెరల్ వైట్ నానో కారు' వచ్చింది. మేము కారులో మొట్టమొదటిసారి బాబా గుడికి వెళ్ళి పూజ చేయించుకుని, ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకున్నాము. పూజారి బాబా మెడలో ఉన్న పూలమాలను కారుకి అలంకరించమని ఇచ్చారు. అలా బాబా, "పిల్లలు పాత స్కూటరుతో ఇబ్బందిపడుతున్నారు” అని మాపట్ల కరుణతో కొత్త కారుని తక్కువ రేటుకే ఇప్పించారు. మనమంటే ఆ తండ్రికి ఎంతో ప్రేమ. ఏమిచ్చి ఆయన ఋణం తీర్చుకోగలం, ఒక్క సాష్టాంగ నమస్కారం చేయడం తప్ప.
2016, అక్టోబర్ 1వ తేదీ నుండి ఆశ్వయుజమాసం మొదలై నవరాత్రులు ప్రారంభమయ్యాయి. అక్టోబర్ 7వ తేదీన నా భార్య పుట్టినరోజనగా రెండు రోజుల ముందు తన మనసుకు పుట్టినరోజునాడు గుడిలో బాబా పాదాల చెంత 108 దీపాలు వెలిగించాలనిపించి, చేబ్రోలులో ఉన్న సాయిమందిర పూజారికి ఫోన్ చేసి, గుడిలో ఉన్న ప్రమిదలను శుభ్రం చేయించమని చెప్పింది. ఆయన 'సరే'నని అన్నారు. కానీ తీరా మేము గుడికి వెళ్ళాక, “దసరా హడావిడిలో ప్రమిదలు కడిగించలేద”ని ఆయన చెప్పారు. అప్పుడు రాత్రి 7 గంటలైంది. ప్రమిదలు బాగా జిడ్డుగా ఉన్నాయి. వాటిని అప్పటికప్పుడు శుభ్రపరచడం జరగని పని. అందువలన కొత్త ప్రమిదలు కొందామని మార్కెటుకి వెళ్ళాము. అయితే ఎన్ని షాపులు తిరిగినా అందరూ ప్రమిదలు లేవనే చెప్తున్నారు. ఒకప్రక్క గుడి మూసే సమయమవుతుంది, పైగా తిరిగి తిరిగి అలసిపోయాం. మరోపక్క ఎలాగైనా 108 ప్రమిదలతో దీపారాధన చేయాలని నా భార్య అనుకుంటుంది. అట్టి స్థితిలో ఒక షాపులో అడగమని సిక్స్త్ సెన్స్ ద్వారా బాబా నాకు సూచించారు. వెంటనే ఆ షాపుకు వెళ్ళి అడిగాము. వాళ్ళు చిన్న గోతాము నిండా కొత్త ప్రమిదలు తెప్పించి ఇచ్చారు. అవి చాలా శుభ్రంగా, చూడముచ్చటగా, ముద్దుగా ఉన్నాయి. వాటిని తీసుకెళ్లి గుడిలో బాబా పాదాల వద్ద దీపాలు వెలిగించి, పూజ చేసుకున్నాము. అలా బాబా నా భార్య మదిలో కోరికను నెరవేర్చారు. ఇకపోతే, బాబాకు నా భార్య చేసిన పూజ ఫలితమో ఏమోగానీ తనకి ఆయన ఆశీస్సులతోపాటు బహుమతి కూడా లభించింది. అదేమిటంటే, ఆ(అక్టోబర్) నెల చివరివారంలో బుధవారంనాడు మేము గుంటూరు వెళదామని బయలుదేరి పార్క్ చేసిన కారు తీయడానికి వెళితే, అడ్డంగా కాలువ తవ్వి ఉంది. ఆ కాలువ దాటి కారు బయటకు రాని పరిస్థితి. మేము అప్పటికే తయారై ఉన్నందున ఇప్పుడెలా అని అనుకుని తెలిసినవాళ్ళకు ఫోన్ చేసి, "బైక్ ఇవ్వమ"ని అడిగాము. వాళ్ళు, "ఈరోజు మాకు బైకుతో పని ఉంది, రేపు తప్పకుండా ఇస్తాన"ని చెప్పారు. ఇక చేసేదిలేక గుంటూరు వెళ్ళడం మానుకుని 'మన మంచికోసం బాబా ఇలా చేసుంటార'ని అనుకున్నాము. కానీ అదేమిటో మాకు అప్పుడు తెలియలేదు. మరుసటిరోజు గురువారం బాబా పూజ చేసుకుని మధ్యాహ్నం 3 గంటల సమయంలో మేము పడుకుని ఉండగా ఎవరో తలుపు తట్టారు. లేచి తలుపు తీస్తే, ఒకతను, “మీ బావమరిది రమ్మంటున్నాడు” అని చెప్పాడు. ఎందుకోనని, నేను వెంటనే బయలుదేరాను. విషయమేమిటంటే, మా ఊరి గుడి దగ్గర 'హీరో షోరూమ్' వాళ్ళు 30-40 టూ-వీలర్లు ప్రదర్శనకు, అమ్మకానికి పెట్టారు. అక్కడున్న మా బావమరిది నన్ను చూస్తూనే, “నీకు నచ్చిన బండి తీసుకో బావా. చిన్న, పెద్ద ప్రతి పనికీ కారు బయటికి తీయడం కష్టం. ఈరోజు గురువారం కదా! మంచిరోజు" అని తన జేబులో నుండి డబ్బులు తీసి ఇచ్చాడు. నేను షాకయ్యను. అలా బాబా మా బావమరిది రూపంలో టూ-వీలర్ బహుమతిగా ఇచ్చారు. సాయంత్రం అదే బండి మీద మేము గుడికి వెళ్ళి బాబాకి కృతజ్ఞతలు చెప్పుకున్నాము. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి. అదేమిటంటే, రెండున్నర సంవత్సరాల క్రితం ఇదే కంపెనీవాళ్ళు గుంటూరులోని తమ షోరూంలో 25 వేల రూపాయలిచ్చి, “టూ-వీలర్ ఇవ్వండి. మీ కుర్రవాణ్ణి మాతో పంపితే, ఇంటి వద్ద మిగతా డబ్బు ఇస్తాము” అంటే, వాళ్ళు “అలా ఇవ్వడం కుదరదు. మొత్తం డబ్బు ఇక్కడే కట్టాలి" అని అన్నారు. ఆరోజు బాబా మాకు టూ-వీలర్‌కి బదులు కారు ఇచ్చారు. ఇప్పుడు అదే షోరూమ్ వాళ్ళు మా ఊరు వచ్చి, తక్కువ ధరకే టూ-వీలర్ ఇచ్చి వెళ్ళేలా బాబా చేశారు. ఇది ఆ చల్లని తండ్రి మహత్యం. మనం పడే ప్రతి ఇబ్బంది బాబాకి తెలుసు. ఆయన సరియైన సమయంలో తమ సహాయాన్ని అందిస్తారు.
చిన్న విషయమైనా మనసులో అనుకోగానే సర్వాంతర్యామి అయిన బాబా దాన్ని కనిపెట్టి తీర్చిన వైనం: బాబా మన మనసులోని కోరికలను గ్రహించి నెరవేరేటట్లు చేస్తారు, కానీ అవి మంచి కోరికలైతేనే. ఒక గురుపూర్ణిమ రోజున నేను, నా భార్య గుంటూరులోని నల్లపాడు రోడ్డులో గల బాబా మందిరానికి వెళ్ళాము. జనం ఇసుక వేస్తే రాలనంతగా ఉన్నారు. పూజ, దర్శనం పూర్తయిన తర్వాత భక్తులు తెచ్చిన ప్రసాదాలు పంచుతుంటే నేను ఒక్కడినే లైనులో నిల్చున్నాను. నా భార్య కూర్చుని ధ్యానం చేసుకుంటుంది. నా ముందున్న వారిలో ఒక్కొక్కరికి ఒక్కొక్క చిన్న పాలకోవా బిళ్ళ చేతిలో పెడుతున్నారు. నేను నా మనసులో, “బాబా! నేను, నా భార్య ఇద్దరమున్నాము. ఆమె ధ్యానం చేసుకుంటోంది. ప్రసాదంగా రెండు కోవా బిళ్ళలిస్తే చెరొకటి తీసుకుంటాము. లేదా ఒకటి ఇచ్చినా చెరి సగం తీసుకుంటాము. అంతా మీ ప్రసాదమే కదా!" అని అనుకున్నాను. అంతే, అందరి చేతిలో ఒక్కొక్క కోవా బిళ్ళ పెడుతున్నవారు నా వంతు వచ్చి చేయి చాపితే ఒకటి కాదు, రెండు కోవా బిళ్ళలు ఇచ్చారు. తరువాత మధ్యాహ్నం భోజన ప్రసాదం కూడా స్వీకరించి మేము ఇంటికి వచ్చాము. తరువాత ఆ రోజు దాదాపు 7000 మంది భక్తులు బాబాను దర్శించుకున్నారని మాకు తెలిసింది. అంత జనంలో కూడా నా మనసు కనిపెట్టి చిన్న విషయమే అయినా తీర్చారు.
మా అమ్మాయి గర్భవతిగా ఉన్నప్పుడు కాన్పు సమయంలో తన దగ్గర ఉండాలని నా భార్య మొట్టమొదటిసారి నన్ను ఒంటరిగా వదలి బెంగళూరు వెళ్ళింది. స్కూలు చూసుకోవాలి కాబట్టి నేను వెళ్ళలేకపోయాను. మా ఇంట్లో మగవాళ్ళకి వంటగదిలోకి వెళ్ళే అలవాటు లేదు. అందువలన నాకు వంట అస్సలు రాదు. ఒక గురువారంనాడు ఎలాగో ఉప్మా చేసి, బాబాకి నివేదించి తిందామని నోట్లో పెట్టుకుంటే, అది చప్పగా ఉంది. నేను ఉప్పు వేయనందున రుచీపచీ లేదు. అప్పుడు నేను మనసులో 'ఉప్మాలోకి నంజుకోడానికి బజ్జీలు ఉంటే బాగుండు' అని అనుకున్నాను. బాబా నా మనసులోని మాట గ్రహించినట్లున్నారు. మరుక్షణం ఎవరో బయటినుండి 'సార్, సార్' అని పిలిచారు. నేను బయటికి వెళ్లి చూస్తే, అక్కడ మా స్టూడెంట్ ఒక అబ్బాయి నిలబడి ఉన్నాడు. "ఏమిట్రా పిలిచావు?" అని అడిగాను. "మా నాన్న మీకివ్వమన్నారు" అని ఒక పొట్లం ఇచ్చాడు. దాన్ని విప్పి చూస్తే, అందులో 4 బజ్జీలున్నాయి. వాటిని చూడగానే 'ఎన్నో కోట్లమంది భక్తుల పనుల్లో నిమగ్నమైయుండి కూడా ఈ చిన్న భక్తుడి చిన్న కోరికను ఎంతో వాత్సల్యంతో తీర్చిన ఆ తండ్రికి ఏమిచ్చినా ఋణం తీర్చుకోలేనని తెలియకుండానే నా కళ్ళనుండి నీళ్ళొచ్చాయి. చిన్న కోరికను కూడా ఇది చిన్నదే కదా అని అనుకోకుండా బాబా ఎలా తీరుస్తారో చూశారా?
గుంటూరు, నల్లపాడు రోడ్డులో దక్షిణ శిరిడీగా పిలవబడే ఒక బాబా మందిరం ఉంది. మేము ఆ మార్గంలో వెళ్ళినప్పుడల్లా మందిరం లోపలికి వెళ్ళి బాబాని దర్శించుకుని వెళ్ళేవాళ్ళం. ఒకసారి మేము ఆ మందిరానికి వెళ్ళినప్పుడు మందిర అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. బాబా మూర్తి చుట్టూ దుమ్ము పడకుండా పరదాతో మూసివుంచారు. అందువల్ల అక్కడ బయట ఉన్న ఉత్సవమూర్తిని మాత్రమే చూసిన మాకు అసలు మూర్తిని దర్శించలేకపోయినందుకు బాధగా అన్పించి, “దర్శనమివ్వవా బాబా?” అని బాబాను అడిగాము. అంతలో అక్కడున్న మేనేజర్ మా బాధని చూసి, విషయం తెలుసుకుని, మమ్మల్ని లోపలికి తీసుకువెళ్ళి, మూసివున్న పరదా తీయించి బాబా దర్శనం చేయించారు. అంతేకాదు, బాబా పుస్తకాలు కూడా కొన్ని ఉచితంగా ఇచ్చారు. ఇది భక్తుల మనసెరిగిన బాబా కృపకు దర్పణం.
బాబా మాకు డబ్బిస్తారు. మేము తిరిగి బాబాకు వేల రూపాయలు దక్షిణగా సమర్పిస్తాము. అయితే, అధిక సంఖ్యలో ఊదీ పొట్లాలను ఆశించి మేము వివిధ పేర్లమీద వందల్లో రసీదులు వ్రాయిస్తాము. బదులుగా బాబా మాకు ప్రసాదించే ఊదీ పొట్లాలు చూడగానే మా మనసు అమితానందంతో నిండిపోతుంది. ఆ ఊదీయే మాకు దివ్య ఔషదం. మాకు మందులతో, వైద్యునితో పనిలేదు. ఒకసారి మేము శిరిడీలో బాబాకి దక్షిణ సమర్పించడానికని డొనేషన్ కౌంటరుకి వెళ్ళాము. మా ప్రక్కనున్న ఒక అతనికి బాబా తలకు చుట్టే 'సాయిరాం' అని ముద్రించబడివున్న కాషాయరంగు వస్త్రాన్ని కౌంటరులో ఉన్న అతను ఇచ్చారు. మాకు ఇవ్వలేదు. అప్పుడు నేను, "మాకు ఎందుకివ్వలేద"ని అడిగితే, "5000/- డొనేషన్ కట్టిన వారికే ఇస్తామ"ని చెప్పాడతను. అయితే, బాబా మాకు ఉచితంగా అలాంటి వస్త్రాన్ని ఎలా అనుగ్రహించారో చూడండి! అదేరోజు సాయంత్రం, మేము సమాధిమందిరంలో బాబా దర్శనం చేసుకున్న తర్వాత నేను బయట నిలుచుని ఉండగా నా భార్య చావడిలోకి వెళ్ళింది. ఆమె దర్శనం చేసుకుని బయటకు వస్తుంటే, అక్కడ ఉన్న మహిళా సెక్యూరిటీ నా భార్యను పిలిచి, తన చేతిలో ఉన్న బాబా తలకు కట్టే వస్త్రాన్ని నా భార్య చేతిలో పెట్టింది. మాకు చాలా ఆనందమేసింది. దాన్ని జాగ్రత్తగా ఇంటికి తెచ్చుకుని భద్రపరుచుకున్నాము. మా మనసెరిగిన బాబానే ఆ వస్త్రాన్ని మాకు ప్రసాదించారు.
Om sairam
ReplyDeleteJaisairam bless supraja for her neck pain and shoulder pain and help her to get better Jaisairam 🙏
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sairam
ReplyDeleteSai always be with me