1. శిరిడీ యాత్రకు సంబంధించి బాబా అనుగ్రహం
2. బాబా దయవల్ల తగ్గిన డెంగ్యూ జ్వరం
శిరిడీ యాత్రకు సంబంధించి బాబా అనుగ్రహం
ముందుగా, ఈ బ్లాగును నిర్వహిస్తున్న సాయికి నమస్కారాలు. నేను ఒక సాయిభక్తురాలిని. నేను ప్రతిరోజు బ్లాగులో వచ్చే భక్తుల అనుభవాలు చదువుతాను. తద్వారా జీవితంలో వచ్చే సమస్యలకు బాబా సమాధానం చూపిస్తున్నారు. కొన్నిసార్లు సమస్యల వల్ల మన నమ్మకం సన్నగిల్లుతుంది, ఒక్కోసారి అధికమవుతుంది. ఏదేమైనా నేను నా చివరి క్షణం వరకు ఎన్ని కష్టాలు వచ్చినా బాబా చేయిని వదిలిపెట్టను. ఆయన నాకు చాలా అనుభవాలు ప్రసాదించారు. ఇప్పుడు మా శిరిడీ ప్రయాణం గురించి పంచుకుంటాను. మాది పెద్ద కుటుంబం. మేము ఐదుగురం ఆడపిల్లలం. నాకు తప్ప మిగతా అందరికీ పెళ్లిళ్లు అయ్యాయి. అందరినీ దృష్టిలో పెట్టుకుని మార్చిలో శిరిడీ ప్రయాణానికి ప్లానింగ్ మొదలుపెడితే అటు ఇటు తిరిగి సెప్టెంబర్ 3న వెళ్లాలని నిర్ధారణకొచ్చి 2022, జూలై 26న టిక్కెట్లు బుక్ చేశాము. అందరికోసం ఆలోచించటం వల్ల అంత ఆలస్యమైంది. అప్పటికీ నా రెండో సిస్టర్‌కి మాతో రావడానికి కుదరలేదు. కానీ మా కజిన్ బ్రదర్ మాతో శిరిడీ రావడానికి సిద్ధమయ్యాడు.
ఇకపోతే, నాకు ఆగస్టు 19న రావాల్సిన నెలసరి ఎంతకీ రాలేదు. నిజానికి ప్రతినెల నాకు నెలసరి సక్రమంగా వచ్చేది. ఎప్పుడైనా సమస్య వచ్చినా ఊదీనీళ్లు తాగితే నెలసరి వచ్చేసేది. అలాంటిది ఈసారి ఊదీనీళ్లు త్రాగినా ప్రయోజనం లేకపోయింది. అప్పుడు, "బాబా! నాకు ఏమిటి ఈ పరీక్ష? 25 మంది కుటుంబసభ్యులం శిరిడీ వస్తున్నాము. అక్కడికి వచ్చాక నాకు నెలసరి వస్తే ఇంకేమైనా ఉందా? అందరి ముందు ఇబ్బందిగా ఉంటుంది. మీ దర్శనానికి కూడా రాలేను. అసలే మీ దర్శనం కోసం చాలారోజుల నుండి ఎదురుచూస్తున్నాను" అని బాగా ఏడ్చాను. అయినా బయలుదేరేరోజు వరకు నాకు నెలసరి రాలేదు. ఆరోజు, "బాబా! శిరిడీ నుండి తిరిగి వచ్చేవరకు నాకు నెలసరి రాకూడదు. నేను ఈ విషయంగా ఏ క్షణమూ భయపడకూడదు. నేను సంతోషంగా మీ సన్నిధిలో గడపాలి. అలా అయితే సచ్చరిత్ర పారాయణ చేస్తాను" అని బాబాను వేడుకుని శిరిడీకి ప్రయాణమయ్యాను. ట్రైన్‍లో ఉండగా నా మనసు, 'నీ బిడ్డ నీ దగ్గరకి వస్తుంది బాబా' అని ఉప్పొంగిపోతున్న తరుణంలో ఈ క్రింది బాబా మెసేజ్ వచ్చింది. నా మనసు తెలుసుకుని నా మనోభావాలకు తగ్గట్టు బాబా ఇచ్చిన ఆ మెసేజ్ చూశాక నాకు కలిగిన నా ఆనందం అంతా ఇంతా కాదు.
శిరిడీ చేరుకున్నాక మాకు బాబా దర్శనం చాలా బాగా జరిగింది. అందరమూ బాబా దర్శనంతో చాలా సంతోషించాము. మా అక్కకూతురు తన జీతం డొనేట్ చేస్తే, శేజారతికి ఏడు టిక్కెట్లు లభించాయి. ఆ టిక్కెట్లపై మా అమ్మానాన్నలకి, మాలో మరికొందరికి ఆరతి దర్శనమైంది. ఇంకోరోజు అనుకోకుండా ధూప్ ఆరతి సమయంలో ద్వారకామాయి దగ్గర ఉండటం నాకు చాలా సంతోషాన్నిచ్చింది. ఎందుకంటే, నేను ఎప్పుడూ ద్వారకామాయి వద్ద ఆరతి సమయానికి ఉండలేదు. ఇకపోతే, అంతకుముందు శిరిడీ వెళ్ళినప్పుడు అనుకోకుండా రెండుసార్లు మధ్యాహ్న ఆరతి దర్శనమైన మాకు ఈసారి బాబా ఒక్కసారి కూడా ఆరతి దర్శనం ఇవ్వలేదని నేను చాలా బాధపడ్డాను. కానీ బాబా ఎవ్వరినీ నిరాశపరచరు కదా! చివరిరోజున పన్నెండు గంటల ఆరతి ప్రారంభానికి ముందు క్యూలైన్లో ఉన్న మాకు ఆరతి దర్శనభాగ్యాన్ని బాబా ప్రసాదించారు. అంత రద్దీలో మాకు ఆ అవకాశం లభిస్తుందని మేము అస్సలు అనుకోలేదు. అంతా బాబా దయ. నేనైతే ఆరతి సమయమంతా బాబాను పరిపూర్ణంగా దర్శించుకోగలిగాను. అంతలా అనుగ్రహించారు బాబా. అంతటితో దాదాపు అందరికీ ఆరతి దర్శనాలయ్యాయి. చాలా చాలా సంతోషించాము. అంతా బాగా అయిందనుకుంటున్న తరుణంలో సీనియర్ సిటిజన్ దర్శనానికి వెళ్లొచ్చిన మా నాన్న మావాళ్లతో, "ఇప్పుడే వస్తాన"ని చెప్పి బయటకు వెళ్లి దారి తప్పిపోయారు. మా ఫోన్లన్నీ లాకర్లో ఉండటం, సాయంత్రం 5:20కి మేము ట్రైను ఎక్కాల్సి ఉండటం వల్ల మేము చాలా కంగారుపడి నాన్న కోసం చాలాసేపు వెతికాము, కానీ ప్రయోజనం లేకపోయింది. చివరికి నేను, "నాన్న కనిపిస్తే, బ్లాగులో పంచుకుంటాన"ని బాబాకి మ్రొక్కుకున్నాను. బాబా దయవల్ల నాన్న మా దగ్గర ఉన్న తన ఫోన్‍కి వేరే ఎవరో ఫోన్‍తో కాల్ చేసి, ఎలాగో ఆటోలో మేమున్న రూముకి చేరుకున్నారు. అలా మేము ఆ టెన్షన్ నుండి బయటపడ్డాము. గురుస్థాన్ వద్ద నేను ఆశపడ్డ వేపాకు దొరకకపోయినప్పటికీ నాలుగు రోజులలో బాబా మమ్మల్ని ఎంతగానో అనుగ్రహించారు. నేను మొత్తం ఐదుసార్లు బాబా దర్శనం చేసుకున్నాను.
మా తిరుగు ప్రయాణంలో మాకు కాజీపేట వరకే రిజర్వేషన్ ఉంది. మేము ఇంకా చాలాదూరం వెళ్లాల్సి ఉండగా, జనరల్ టికెట్ తీసుకుని మధ్యాహ్నం వేరే ట్రైన్ ఎక్కాము. ఆ కంపార్ట్‌మెంట్లో జనం చాలా విపరీతంగా ఉన్నారు. అందువల్ల మేము దిగాల్సిన స్టేషన్లో ఆ రద్దీని దాటుకుని ఎలా దిగుతామా అని టెన్షన్ పడ్డాము. నేను భయంతో ట్రైన్ ఎక్కినప్పటినుండి దిగేవరకు బాబాని ప్రార్థిస్తూనే ఉన్నాను. ఆయన దయవల్ల మాకు ఒక తెలుగు అబ్బాయి పరిచయమయ్యాడు. తను కూడా మేము దిగే స్టేషన్‍లోనే దిగుతానని, దిగేటప్పుడు మా లగేజీ దించడంలో మాకు చాలా సహాయం చేశాడు. అతని రూపంలో బాబానే మాకు సహాయం చేశారనిపించింది. బాబా దయవల్ల అంతా బాగా జరిగింది. లేకపోతే మేము దిగాల్సిన స్టేషన్‍లో దిగలేక పక్క రాష్ట్రానికి వెళ్లిపోవాల్సి వచ్చేది. మేము ఇంటికి వచ్చిన రెండు రోజుల తర్వాత నాకు నెలసరి వచ్చింది. అంతా బాబా దయ. "ధన్యవాదాలు బాబా. అనుకున్న విధంగా మా శిరిడీ ప్రయాణం గురించి బ్లాగులో పంచుకున్నాను. ఆలస్యమైనందుకు క్షమించు బాబా. మాకు రావాల్సిన డబ్బులు వచ్చేలా చేయండి బాబా. అమ్మ ఆరోగ్యం బాగుండట్లేదు. తనకి ఆరోగ్యాన్ని ప్రసాదించు తండ్రీ. నా కుటుంబం బాగుండేలా చూడండి. అలాగే అందరినీ చల్లగా చూడు. నేను చాలా అయోమయంలో ఉన్నాను. ఎటూ తేల్చుకోలేని పరిస్థితి బాబా. ఇష్టపడిన వ్యక్తిని దూరం చేస్తున్నావు. ఇక నా జీవితంలో సంతోషం రాదా? 'నమ్ముకున్నవారిని పతనం కానివ్వను' అంటావు. మరి ఇదేంటి బాబా? మిమ్మల్ని ఎంతగానో నమ్ముకున్నాను, కానీ మీరు ఏ సహాయం చేయట్లేదు. నాకు చాలా బాధగా ఉంది. ఎన్నో రాత్రులు మీ సమాధానం కోసం ఏడ్చాను. ఎన్ని చేసినా, ఏం చేసినా నాకు ఒక్క మార్గమూ చూపించట్లేదు. ఎంతోమంది జీవితాలను సరిదిద్దావు. నేను ఎందుకు మీకు కనిపించట్లేదు? నా మనసులో ఉన్నది మీకెందుకు అర్థం కావట్లేదు? నేను మీ బిడ్డని కాదా? దయచేసి నాకు ఒక మంచి జీవితాన్ని ఇవ్వు. నిన్నే నమ్ముకున్నాను. ఏం చేసినా నువ్వే చేయాలి. అలాంటిది నువ్వే మౌనంగా ఉంటే అంతకంటే బాధ ఏముంటుంది? బాబా! ఇదంతా నా బాధ. అంతేగానీ మీపట్ల కోపం, ద్వేషం కాదు. మిమ్మల్ని తప్పుపట్టాలని కాదు తండ్రీ".
బాబా దయవల్ల తగ్గిన డెంగ్యూ జ్వరం
సద్గురు శ్రీసాయినాథ్ మహరాజ్ కీ జై!!! నా పేరు శ్రీకాంత్. మా అమ్మాయి హైదరాబాదులోని ఒక కళాశాలలో బీబీఏ చదువుతోంది. బాబా దయవల్ల అంతా మంచిగా జరుగుతున్న సమయంలో అనుకోకుండా తనకి పంటినొప్పి తీవ్రంగా వచ్చింది. నేను తనని అక్కడే హైదరాబాదులోని ఒక హాస్పిటల్‍కి పంపి వైద్యం చేయించాను. అయితే ఆ నొప్పి తగ్గేలోపే తనకి విపరీతంగా జ్వరం వచ్చింది. దాంతో తనకి ఇష్టం లేకున్నప్పటికీ తనని మా ఊరికి రప్పించాను. తను ఇంటికి వచ్చాక రక్తపరీక్షలు చేయిస్తే డెంగ్యూ పాజిటివ్ అని వచ్చింది. నేను, నా భార్య చాలా భయాందోళనలకు గురయ్యాము. కానీ నాకు, నా భార్యకి ఆ శిరిడీ సాయినాథునిపై సంపూర్ణ విశ్వాసం ఉండటం వల్ల, "అమ్మాయికి త్వరగా డెంగ్యూ తగ్గేలా, క్రమంగా ప్లేట్లెట్లు పెరిగేలా అనుగ్రహించమ"ని ఆ తండ్రిని వేడుకున్నాము. కానీ రోజురోజుకీ ప్లేట్లెట్ల సంఖ్య తగ్గుతుండటంతో మాకు చాలా భయమేసింది. డాక్టరు కూడా అమ్మాయిని హాస్పిటల్లో అడ్మిట్ చేయమని చెప్పారు. అయినప్పటికీ మేము బాబాపై మాకున్న నమ్మకంతో అమ్మాయిని హాస్పిటల్లో అడ్మిట్ చేయకుండా ఇంటిలోనే ఉంచుకుని డాక్టర్ సలహాననుసరించి జాగ్రత్తగా చూసుకోసాగాము. "జ్వరం తగ్గి, ప్లేట్లెట్ల సంఖ్య పెరిగితే, మా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాము" అని సాయినాథుని వేడుకుని ప్రతిరోజూ అమ్మాయికి ఊదీ పెడుతుండేవాళ్ళము. ఆ సాయినాథుని కృపాకటాక్షాల వలన మా అమ్మాయికి క్రమంగా డెంగ్యూ జ్వరం తగ్గి, ప్లేట్లెట్లు పెరిగాయి. నిజంగా నేను, నా కుటుంబం ఆ సాయినాథునికి ఎల్లప్పుడూ ఋణపడి ఉంటాము. "ధన్యవాదాలు బాబా. నా కొడుకుకి, కూతురుకి, నా భార్యకి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించు తండ్రీ. అలాగే నా కొడుకు, కూతురులకు మంచి విద్యాబుద్ధులు ప్రసాదించండి బాబా".
Jaisairam bless supraja for her neck pain and shoulder pain and help her to get better Jaisairam 🙏
ReplyDeleteHai na na bartha manasu manchi ga marchi nannu kapuraniki thiskellela chudu sai. Na kapuram nilabettu sai. Na jeevitham madhyalo apeyyodhu sai mi midhe baram vesi brathukuthunna sai. Nenu na husband kalisipothe na anuvvam blog lo panchukuntanu sai naku aa adhrystani prasadinchu sai 🙏🙏🙏
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sairam
ReplyDeleteSai always be with me