సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

లక్ష్మణ్ బజీ అవరె


1910 సంవత్సరంలో 'లక్ష్మణ్ బజీ అవరె'కి రెండు కళ్ళలో నొప్పి వచ్చి రెండు కళ్ళ నుండి నీరు కారసాగింది. చివరికి కంటిచూపు కూడా పోయింది. నయం చేయడానికి చేసిన అన్ని ప్రయత్నాలు, మందులు ఏవీ పనిచేయలేదు. ఆ కుటుంబానికి తెలిసిన ఒక స్నేహితుడు శిరిడీ వెళ్ళమని సలహా ఇచ్చి, "బాబా దర్శనం చేసుకుంటే బాధ నయం కాగలద"ని చెప్పాడు. 

దాంతో లక్ష్మణ్ కుటుంబం ఒక గురువారం శిరిడీ వెళ్లి బాబా దర్శనం చేసుకుంది. బాబా లక్ష్మణ్ వైపు కరుణతో చూసి, “అల్లా అచ్ఛా కరేగా” అంటూ ఊదీ ఇచ్చారు. వాళ్ళు ఇంటికి తిరిగి వెళ్ళాక లక్ష్మణ్ కంటి నుండి నీరు రావడం ఆగి, నొప్పి కూడా తగ్గింది. అప్పటినుండి ఆరు నెలలపాటు వాళ్ళు ప్రతి గురువారం శిరిడీ వెళ్లి బాబా దర్శనం చేసుకుంటుండేవారు.

కొన్నిరోజులకి ఆ గ్రామస్తులు అతని తల్లితో అతనిని బొంబాయిలో జె.జె.హాస్పిటల్‌కి తీసుకెళ్ళమని చెప్పారు. వారు బొంబాయి బయలుదేరిన రోజు లక్ష్మణ్ ఒళ్ళంతా మంటలు పుట్టి బాధ కలిగింది. బ్రిటిష్ కంటి వైద్యుడు లక్ష్మణ్‌ను పరీక్షించి అతని కళ్ళు బాగా చెడిపోయాయని, కంటిచూపు మరి రాదని చెప్పాడు. వాళ్ళు చాలా బాధపడుతూ తిరిగి ఇల్లు చేరారు. వాళ్ళు లక్ష్మణ్‌కు కంటిచూపు వచ్చినా, రాకున్నా శిరిడీ వెళ్ళి, సాయి చెంత ఉండాలని నిశ్చయించుకొని కుటుంబమంతా శిరిడీ వెళ్లి కొన్నిరోజులపాటు శిరిడీలోనే ఉన్నారు. తర్వాత లక్ష్మణ్ తల్లి అతనిని బాబా చెంత విడిచి మిగతా అందరినీ తీసుకొని స్వగ్రామం వెళ్ళిపోయింది. లక్ష్మణ్‌కు బాబా యందు సంపూర్ణ విశ్వాసం. అతను ప్రతిరోజు బాబా ముఖం కడుక్కున్న నీళ్ళతో తన కళ్ళను కడుక్కునేవాడు. ఈవిధంగా ఒక నెల రోజులపాటు చేసాడు. అకస్మాత్తుగా ఒకరోజు కొంచెం కంటిచూపు వచ్చింది. తరువాత ఒక సాయంత్రం చావడిలో బాబా దర్శనం చేసుకున్నాడు. అప్పుడు బాబా లక్ష్మణ్ గుండెపై చేతితో తట్టి, “ఇతనికి మళ్ళీ కంటిచూపు పూర్తిగా వస్తుంది. ఇకపై అంతా స్పష్టంగా చూడగలడు” అన్నారు. మరుక్షణమే లక్ష్మణ్‌కు చూపు వచ్చింది. బాబా చేసిన మేలుకు లక్ష్మణ్ కృతజ్ఞతాభావంతో పరవశించిపోయాడు. రాధాకృష్ణమాయి లక్ష్మణ్‌ను బావి నుండి నీరు తెమ్మని చెప్పేది, మరికొన్ని సేవలు కూడా ఆమె అతనికి చెప్పేది. లక్ష్మణ్ తనకు కంటిచూపును తిరిగి ప్రసాదించిన సాయిపై కృతజ్ఞతాభావంతో ఆ సేవలను సంతోషంగా చేస్తుండేవాడు. అలా బాబా మహాసమాధి చెందేవరకు లక్ష్మణ్ శిరిడీలోనే ఉండిపోయాడు.

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo