నా పేరు అరుణ్ హరిభావు వీర్. మనం ప్రతి ఒక్కరం కొన్ని కోరికలతో దేవుడిని ప్రార్థిస్తూనే ఉంటాము. నేను కూడా, "నాకు ఒక కూతురు కావాలి" అని సాయిబాబాను ఎప్పుడూ కోరుతూ వుండేవాడిని. ఎందుకంటే, మా వంశంలో ఎవరికీ అమ్మాయిలు లేరు. అందరూ అబ్బాయిలే. అందుకే నాకు అత్తలు, పిన్నిలు ఎవరూ లేరు. అక్క, చెల్లెలు కూడా లేరు. మా అన్నకు కూడా ఇద్దరూ అబ్బాయిలే. అందుకే నాకు ఒక కూతురు కావాలని కోరిక ఉండేది. కానీ మా అబ్బాయి జన్మించినపుడు నా భార్యకు చాలా సమస్యలు వచ్చాయి. ఆమె ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు క్రింద పడిపోయింది. అందుకే మాకు రెండవ సంతానం విషయంలో భయంగా ఉండేది. చూస్తూ చూస్తూనే 8 సంవత్సరాలు గడిచిపోయాయి. నాకేమో కూతురు కావాలని కోరిక. అందుకే ఒకరోజు నా భార్య వైశాలిని అడిగాను, 'మనం ఒక అనాథ బాలికను దత్తత తెచ్చుకుందాము' అని. తను 'వద్దు' అనేసింది. ఇంక నేను బాబానే శరణు వేడుకున్నాను, 'నాకు ఒక కూతుర్ని ఇవ్వ'మని.
అది 2001వ సంవత్సరం. ఒకరోజు నా భార్యకు అకస్మాత్తుగా కడుపులో నొప్పి వచ్చింది. వెంటనే మేము డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. తనను పరీక్షించిన డాక్టర్, "నీ భార్య కడుపుతో ఉంది, పైగా కవలలు" అని చెప్పారు. "అమ్మో, ఈ స్థితిలో ఇద్దరు పిల్లలా!" అని చాలా భయపడ్డాము. అందులోనూ 'ఇద్దరూ అబ్బాయిలే అయితే?' అని మరో టెన్షన్. అందుకే, 'బాబా! నువ్వే శరణు' అనుకొని, 'ఒక్క బిడ్డనయినా అమ్మాయిని ఇవ్వ'మని ప్రార్థిస్తూ ఉన్నాము. ఈ విషయంలో నేను బాబాను చాలా కష్టపెడుతున్నానేమో అని కూడా అనిపించింది నాకు. నా భార్య వైశాలికి డిసెంబర్ నెలలో డ్యూ డేట్ ఇచ్చారు. డిసెంబరులో ఇచ్చిన డేట్ ప్రకారం నొప్పులు మొదలవడంతో డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. మేము డాక్టర్ దగ్గరికి వెళ్లేసరికి అక్కడ ఒక పెద్ద బాబా ఫోటో ఉంది. డాక్టర్ నా భార్య కేస్ మొత్తం చూసి హాస్పిటల్లో అడ్మిట్ చేసుకున్నారు. నేనేమో బాబాని వదలకుండా వేడుకుంటూనే ఉన్నాను. 23న డెలివరీ అవలేదు. '24న డెలివరీ అయితే బాగుండు' అనుకున్నాను, ఎందుకంటే ఆరోజు మా పెళ్లిరోజు కూడా. కానీ ఆరోజు కూడా డెలివరీ అవలేదు. డిసెంబర్ 29న డెలివరీ అయింది. విశేషమేమిటంటే, ఆరోజు దత్తజయంతి. మా జీవితాలలో వెలుగు నింపిన రోజు. ఇంతకీ అసలు విషయం, నాకు ఇద్దరూ అమ్మాయిలే పుట్టారు. ఇంక నా ఆనందానికి అవధులు లేవు.
ఒక డిసెంబర్ నెలలో మా అమ్మాయిల బర్త్‌డే రోజున ఒక cultural fest కు వెళ్ళాము. నా భార్య మా పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసుకుందామని జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళింది. అంతా ఆశ్చర్యం, జాతకం అస్సలు ఏమీ బాగాలేదు. మనస్సులో దుఃఖిస్తూ వెనక్కి ఇంటికి వెళ్తున్నాం. అప్పుడే నా మొబైల్‌లో ఎవరో, “జాతకాలను, జ్యోతిష్యులను నమ్మవద్దు. నేనుండ భయమేల?” అన్న బాబా మాటలను మెసేజ్ పెట్టారు. ఇప్పుడు చెప్పండి, బాబా సర్వాంతర్యామి, సర్వవ్యాపకుడు, దయతో తనను నమ్మినవాళ్ళని సంరక్షించేవాడు కదా! నా కళ్ళలో నీరు అలా కారుతూనే ఉన్నాయి ఇంటికి చేరేవరకు.
అరుణ్ హరిభావు వీర్,
పూనే.
తెలుగు అనువాదం: శ్రీమతి మాధవి, భువనేశ్వర్.
చాలా బాగుంది ఈ బాబా లీల.సాయి.నేనేనా.రాసింది.అనిపిస్తుంది.మనం చాలా అదృష్టవంతులం.బాబా తోడు,నీడగా..బతుకుతున్నాము.
ReplyDelete