సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

కర్మానుసారం ప్రమాదం జరిగినా నా బిడ్డలను నేను ఎల్లప్పుడూ కంటికి రెప్పవలె కాపాడుకుంటాను


తాడిపత్రి నుండి సాయిబంధువు భాస్కర్‌గౌడ్ తన అనుభవాలను ఇలా తెలియజేస్తున్నారు..

భగవాన్ శ్రీ శిరిడీ సాయిబాబా దివ్యపాదపద్మాలకు శిరస్సు వంచి నమస్కరిస్తూ, పూజ్య గురుదేవులు శ్రీ అమ్ముల సాంబశివరావుగారి దివ్యపాదపద్మాలకు నమస్కరిస్తూ...

నా పేరు కె.భాస్కర్‌గౌడ్. ప్రస్తుతం నేను MBA  రెండవ సంవత్సరం చదువుతున్నాను. బాబా నాకు ప్రసాదించిన గొప్ప అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకోబోతున్నాను. అది 2012వ సంవత్సరం, నేను ఇంటర్ రెండవ సంవత్సరం చదువుతున్న రోజులు. నేను తాడిపత్రి పట్టణంలో ఉన్న శిరిడీ సాయిబాబా మందిరంలో ఉంటూ, ప్రతిరోజు బాబాకి నాలుగు ఆరతులు ఇస్తూ, మందిర సమయంలో మందిరంలో ఉంటూ, కాలేజీ సమయంలో కాలేజీకి వెళ్తూ నా చదువు కొనసాగిస్తున్నాను. తేదీ సరిగ్గా గుర్తులేదుగానీ జూన్ నెల మొదటి వారంలో ఒకరోజు మందిరంలో బాబాకు మధ్యాహ్న ఆరతిచ్చి నా రూమ్‌‌కి వెళ్లి ముందుగా కుక్కర్లో అన్నం పెట్టి, తరువాత ప్రెషర్ కుక్కర్‌‌లో పప్పు, కాయగూరలు, పచ్చిమిర్చి వేసి నీళ్ళు పోసి మూతపెట్టి స్టవ్ వెలిగించాను. పది నిమిషాల తరువాత ఒకటి, రెండు విజల్స్ వచ్చాయి. తరువాత విజిల్స్ రావడం లేదు. పప్పు ఉడకడం పూర్తయిందనుకొని ప్రెషర్ కుక్కర్ కిందకి దించాను. నేనెప్పుడూ ఏ పని చేస్తున్నా బాబా నామస్మరణ చేసుకుంటూ ఉంటాను. ఆ సమయంలో కూడా 'ఓంసాయి, శ్రీసాయి, జయజయసాయి' అని స్మరించుకుంటున్నాను. ప్రెషర్ కుక్కర్ మూత తీయడానికి ఎంత ప్రయత్నించినా మూత రాలేదు. పది నిమిషాల తరవాత ప్రెషర్ కుక్కర్ మూత బలంగా లాగాను. ఆ ఫోర్స్‌‌కి ప్రెషర్ కుక్కర్ మూతకున్న విజిల్ ఫోర్సుగా వచ్చి నా కంటికి తగిలింది. కుక్కర్‌‌లో ఉన్న పచ్చిమిర్చి నీళ్ళు మొత్తం నా ముఖంపై పడ్డాయి. దానితో ముఖమంతా భరించలేనంత మంట, నొప్పి. యాసిడ్ పోస్తే ఎంత మంటగా ఉంటుందో అంత మంట. అంత నొప్పిలోనూ నేను బాబా స్మరణ ఆపలేదు. మంట వలన కన్నులు తెరుద్దామన్నా నేను తెరవలేకపోయాను. వెంటనే బాబా మందిరం లోపలికి వెళ్లి కొద్దిగా ఊదీని నా ముఖంపై పూసుకుని హాస్పిటల్‌‌కి వెళ్ళాము. నన్ను తీసుకువెళ్ళడానికి కొంతమంది సహాయంగా వచ్చారు. వారి సహాయంతో హాస్పిటల్‌‌కి వెళ్లి డాక్టర్‌‌తో జరిగింది చెప్పగా, "నేనేమీ చేయలేను. వేరే డాక్టర్ దగ్గరకి వెళ్ళండ"ని చెప్పారు డాక్టర్. పైగా, "ఐ-స్పెషలిస్ట్ దగ్గరకు వెళ్లినా నువ్వింక చూడలేవు" అన్నారు. ఆ మాట వినగానే నాకు చాలా భయం వేసింది. వెంటనే నాకు పితృసమానులైన మా మామయ్య వి.శంకర్ ప్రసాద్ (నాకు తల్లిదండ్రులు లేరు. అన్నీ మామయ్యే చూసుకుంటారు) ఆ డాక్టర్‌‌తో, "నొప్పి తగ్గడానికి ఏదైనా మందు ఇవ్వండ"ని అడిగారు. ఆ సహాయం కూడా అతను చేయలేదు. నేను నా మనసులో, "నీ భక్తుడనైనా నాకింత ప్రమాదం జరిగింది. డాక్టర్ ఏమీ చేయలేమని అంటున్నారు. నొప్పి, మంట భరించలేకపోతున్నాను. మీరే ఏదైనా చేసి తగ్గించండి బాబా" అని ప్రార్థించాను. వెంటనే హాస్పిటల్లో ఉన్న మరో డాక్టర్ స్వయంగా వచ్చి నన్ను ఆపరేషన్ థియేటర్లోకి తీసుకొని వెళ్లి నా ముఖంపై ఉన్నదంతా క్లీన్ చేసి ముఖానికి మందు రాసి పంపించారు. 

ఆరోజు రాత్రి కలలో తెల్లటి దుస్తులు ధరించి, తెల్లటి గడ్డం ఉన్న వ్యక్తి నా మంచం దగ్గరకి వచ్చి నా ముఖాన్ని తన చేతితో తాకి, "నీ కర్మ వలన జరిగిన ప్రమాదమది. అయితే నా బిడ్డలను నేను ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉంటాను. నా బిడ్డలను కంటికి రెప్పవలె కాపాడుకుంటాను" అని చెప్పారు. మరుక్షణం నాకు స్పృహ వచ్చింది. లేచి చూస్తే అక్కడ ఎవరూ కనపడలేదు. అలా బాబా స్వప్నంలో తన చేతితో నా ముఖాన్ని నిమిరినప్పటినుండి నాకు నొప్పి, మంట ఏవీ లేవు. పూర్తిగా కళ్ళు తెరవడానికి నాకు సుమారుగా 60 నుండి 70 రోజులు పట్టింది. నేను కళ్ళు తెరవడానికి ప్రయత్నించినా నాకు అంత స్పష్టంగా కనిపించేది కాదు. "నన్ను ఆశ్రయించినవారిని, శరణుజొచ్చినవారిని నిరంతరం రక్షించుటయే నా కర్తవ్యం అని తాము చెప్పినట్లుగానే బాబా నన్ను అటువంటి పరిస్థితి నుండి రక్షించారు.


No comments:

Post a Comment

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo