సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

రావుబహద్దూర్ ఎస్.బి.ధుమాళ్ - మొదటి భాగం...



శ్రీసాయిని ప్రత్యక్షంగా దర్శించి, వారిని ఎంతగానో ప్రేమించిన ప్రముఖ సాయిభక్తులలో ఎస్.బి.ధుమాళ్ ఒకరు. ఇతను 1873లో జన్మించాడు. ఇతని స్వస్థలం మహారాష్ట్రలోని నాశిక్. ఇతను వృత్తిరీత్యా ప్లీడరు(లాయర్). ఇతనికి బాబా ప్రసాదించిన అనుభవాలను తెలుసుకునేముందు, అనుభవాలు పంచుకునే విషయంలో ధుమాళ్ వెల్లడించిన అభిప్రాయాలను అతని మాటల్లోనే చూద్దాం...

1936వ సంవత్సరంలో శ్రీబి.వి.నరసింహస్వామిగారు సాయిభక్తుల అనుభవాలను సేకరించే క్రమంలో ఎస్.బి.ధుమాళ్‌ను కలిసి, ‘బాబాతో మీ అనుభవాలేమిటో చెప్పండి’ అని అడిగినప్పుడు ధుమాళ్ వారితో ఇలా అన్నారు:


"బాబాతో మీ అనుభవాలేమిటి?" అని మీరడిగిన ప్రశ్నకు నేనేమి సమాధానం చెప్పగలను? ఒకటా, రెండా? ప్రతిరోజూ, ప్రతిక్షణమూ బాబా నాకు అనుభవాలను ప్రసాదిస్తూనే ఉన్నారు. నా జీవితంలో బాబా ప్రమేయం లేని సంఘటన అంటూ ఏదీ లేదు. అది ఎంతటి చిన్న విషయమైనా! నేను చేసే ప్రతి పనీ, వేసే ప్రతి అడుగు బాబాచే నిర్దేశింపబడిందే! అలాంటప్పుడు, దేనిని నా అనుభవంగా చెప్పగలను? బయటి ప్రపంచం నా మాటలు నమ్మకపోవచ్చు. నేను ఆ విషయం పట్టించుకోను. వాస్తవానికి ఎవరైనా తమ అనుభవం వెల్లడి చేయకపోవడానికి, ఎదుటివారు ఆ అనుభవాన్ని నమ్మకపోవడం ఒకానొక కారణం కావచ్చు. ప్రతిభక్తుడు తనకు కలిగిన అనుభవం తనకు మాత్రమే సంబంధించినదనీ, అది తన ఐహిక, ఆధ్యాత్మిక ప్రయోజనాల కోసమే ప్రసాదింపబడిందనీ అనుకుంటాడు. అంతేగానీ అజ్ఞానులు, కువిమర్శకులు, అకారణంగా అపహసించేవారితో నిండివుండే సామాన్య ప్రజానీకానికి ప్రకటించేందుకు కాదని భావిస్తాడు. అయితే, పట్టుదలగల చరిత్రకారులు, వాళ్ళు వ్రాస్తున్న గ్రంథాలను మెరుగుపరుచుకోవడానికి భక్తుల ఆంతరంగిక రహస్యాలను, అనుభవాలను వెలికి తీయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తుంటారు. కానీ, తాను గోప్యంగా ఉంచుకున్న తన అనుభవాన్ని బహిర్గతం చేసే ప్రక్రియలో, ఆ అనుభవం యొక్క జీవము, సారము నాశనమైపోతుందని భక్తుడు భావిస్తాడు. శరీరధర్మశాస్త్రజ్ఞుడు ప్రాణమున్న జీవిని అణువణువూ పరీక్షించదలచి, తనకు కావలసిన భాగాలను కోసి మైక్రోస్కోప్‌లో పెట్టి పరీక్షిస్తాడు. కానీ, అలా చేసే ప్రక్రియలోనే ఆ జీవి యొక్క ప్రాణం పోతుంది. చివరకు అతడు పరీక్షించేది నిర్జీవ పదార్థాన్నే. బాబాను గురించి తెలుసుకోవాలంటే, స్వయంగా బాబా ఇచ్చే అనుభవాలను పొంది తెలుసుకోవడమే ఉత్తమమైన మార్గం. బాబా ఎక్కడికీ వెళ్ళలేదు. వారు ఇప్పటికీ జీవించే ఉన్నారు. మహాసమాధి ముందుకన్నా ఇప్పుడు తమ కర్తవ్యాన్ని మరింత ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. శ్రద్ధగలవారికి ఈనాటికీ బాబా సన్నిధి అనుభవైకవేద్యం. కానీ అలా శ్రద్ధను పెంపొందించుకోకుండా ఇతరుల అనుభవాలను తెలుసుకోవాలని ప్రయత్నించినప్పుడు, ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి అనుభవాలు చేరే క్రమంలో వాటిలోని ఆంతర్యం అస్పష్టమవుతుంది, శక్తి తరిగిపోయి బలహీనమవుతుంది. దానివల్ల ఏ విధమైన ప్రయోజనం ఉండదు.


స్వభాషలో వ్యక్తం చేసిన అనుభవాలకు ప్రాముఖ్యత, శక్తి ఉంటాయి. నేను చెప్పిన అనుభవాలను మీరు ఆంగ్లంలోనికి అనువదించి పాఠకులకందిస్తారు. ఇలా భాషాంతరీకరణము చేసే ప్రక్రియలో మూలభావానికి లేదా అనుభవానికి జరిగే నష్టం తీవ్రంగానే ఉంటుంది. ఏదేమైనా మీరు బాబాను గురించి కొన్ని వాస్తవాలు అడుగుతున్నారు కాబట్టి నేను యదార్థమని దృఢంగా చెప్పగలిగిన నా అనుభవాలను కొన్నింటిని వివరిస్తాను. నేను ఎప్పుడూ బాబా గురించి ఆలోచిస్తున్నట్లే, బాబా కూడా నా గురించి ఆలోచించేవారు. వారిని గురించిన నా ఆలోచన ప్రేమతో నిండివున్నప్పటికీ అది శక్తిహీనమైనది, వారికి నిజమైన సేవ చేసుకోలేనిది. కానీ, బాబా నాపై చూపే ప్రేమలో అతీతమైన శక్తి ఉండి అడుగడుగునా నన్ను కాపాడుతూ ఉండేది! ఈ విషయాన్ని ఋజువు చేయడానికి ఎన్నో నిదర్శనాలున్నాయి. నేను పొందిన, పొందుతున్న మేలు ఏదైనా అది బాబా ప్రసాదించినదే. దీనిని ఇతరులు నమ్మకపోవచ్చు. కానీ బాబా నాకు సహాయపడిన కొన్ని సందర్భాలు ఎంత స్పష్టమైనవంటే సరియైన దృక్పథం గల జిజ్ఞాసువులెవరైనా బాబా మాటల్లోని, నా మాటల్లోని సత్యాన్ని అంగీకరిస్తారు. నిజానికి బాబాతో నా అనుభవాలు ఇవీ అని చెప్పడానికి సాధ్యం కాదు. ఎందుకంటే నా జీవితంలోని ప్రతి చర్య, ప్రతి సంఘటన బాబాచే మలచబడింది. బాబా తత్త్వాన్ని, నాలాంటి భక్తులకు వారు చేసిన, ఇంకా చేస్తున్న సహాయాన్ని తెలియజేసే బాబా చర్యలను, వారి ప్రబోధాన్ని మీతో పంచుకుంటాను”.


ఇక ఇప్పుడు ధుమాళ్‌కు బాబా ప్రసాదించిన అనుభవాలను తెలుసుకుందాం:


ధుమాళ్‌ మొదట్లో శ్రీగజానన్ మహరాజ్ యొక్క భక్తుడు. ఆ మహాత్ముడిని తన సన్నిహిత స్నేహితుడైన గోపాలరావు బూటీ వద్దకు తీసుకెళ్ళాడు ధుమాళ్. సుమారు 1907లో ధుమాళ్ ప్రథమంగా బాబాను దర్శించాడు. ఆ ప్రథమ దర్శనంలోనే బాబా అసాధారణమైన వ్యక్తిత్వం అతనిని అమితంగా ఆకర్షించింది. తరువాత అతను బూటీని కూడా బాబా వద్దకు తీసుకెళ్ళాడు. బూటీని తన వద్దకు తీసుకురమ్మని బాబా వాచా ఆదేశించనప్పటికీ బూటీని బాబా దగ్గరకు తీసుకెళ్ళడం బాబా ప్రేరణగానే భావించాడతను. ఆ తరువాత బూటీ కూడా బాబా భక్తుడయ్యాడు. 1918లో బాబా మహాసమాధి చెందిన తరువాత బూటీ నిర్మించిన భవంతిలోనే బాబా భౌతికదేహం సమాధి చేయబడింది. అదే ఈనాడు 'సమాధిమందిరం'గా రూపొంది, ఎందరో భక్తులు బాబాను పూజించుకోవడానికి అవకాశమేర్పరిచింది. బాబాకు బూటీ చేసిన సేవలలో అది చిరస్మరణీయమైనది.


ఒకసారి ధుమాళ్‌తో బాబా, “నిన్ను అడుగడుగునా కాపాడుతున్నాను. లేకుంటే నీకేమయ్యేదో ఆ భగవంతునికే ఎఱుక!” అన్నారు. అది అతిశయోక్తి కాదు. బాబా త్రికాలజ్ఞులు కాబట్టి, మనం చేసే ప్రతి పని, వేసే ప్రతి అడుగు సరియైనదో కాదో తెలుసుకొని సరియైన మార్గంలో నడిపిస్తుంటారు. బాబా మనలను సర్వదా జాగరూకతతో గమనిస్తూ రాబోయే ప్రమాదాల నుండి కాపాడి మనకు మంచి జరిగేటట్లు చూస్తుంటారు. మరోసారి, తమ సన్నిధిలో ధుమాళ్ మాత్రమే ఉన్నప్పుడు బాబా అతనితో, "భావూ, నాకు రాత్రంతా నిద్రపట్టలేదు” (ధుమాళ్‌‌ను బాబా "భావూ” అని పిలిచేవారు) అని అన్నారు. అందుకు ధుమాళ్, "ఎందుకు బాబా?" అని అడిగితే, "రాత్రంతా నీ గురించే ఆలోచిస్తూ ఉండిపోయాను" అన్నారు బాబా. ఆ మాటలు విన్నంతనే, బాబా తనపై చూపుతున్న ప్రేమకు, తన శ్రేయస్సుకోసం వారు తీసుకుంటున్న శ్రమకు ధుమాళ్ మనసంతా ఆనందంతోనూ, బాబాపట్ల ప్రేమతోనూ, కృతజ్ఞతతోనూ నిండిపోగా ఆనందభాష్పాలతో బాబా పాదాలకు నమస్కరించుకున్నాడు.


బాబా సశరీరులుగా ఉన్నప్పుడు తన సమస్యల పరిష్కారానికై ధుమాళ్ తరచూ బాబాకు ఉత్తరాలు వ్రాస్తుండేవాడు. మాధవరావు దేశ్‌పాండే(షామా) వాటిని బాబాకు చదివి వినిపించి, బాబా చెప్పిన విధంగా సమాధానాలను వ్రాసి ధుమాళ్‌కు పంపేవాడు. అంతేకాదు, (బాబా సశరీరులై ఉన్న కాలంలోనే) కొన్ని సందర్భాలలో ధుమాళ్ తన సమస్యల పరిష్కారానికై బాబాను ప్రార్థించి, వారి పటం ముందు చీటీలు వేసేవాడు. ఆ చీటీలో వచ్చినదానిని బాబా ఆదేశంగా భావించి తు.చ తప్పకుండా పాటించేవాడు. బాబా మహాసమాధి అనంతరం కూడా అతను ఇదే పద్ధతిని కొనసాగించాడు. ఇది సమాజానికి శాస్త్రవిరుద్ధంగా, అవివేకంగా అనిపించినప్పటికీ అతను వాటినే తు.చ తప్పకుండా పాటించేవాడు. ఈ పద్ధతి ద్వారా బాబా ఇచ్చిన ఆదేశాలు ఎల్లప్పుడూ అతనికి శ్రేయోదాయకంగానే ఉండేవి.


నాశిక్ మెయిన్‌రోడ్డులో ఉన్న తన పూర్వీకుల ఇంట్లోనే తన జీవితాంతం నివసించాడు ధుమాళ్. ఒకసారి నాశిక్‌లో ప్లేగువ్యాధి ప్రబలింది. ధుమాళ్ నివసిస్తున్న ఇంట్లో కూడా చచ్చిన ఎలుకలు కొన్ని కనిపించాయి. వెంటనే అతను ఈ విషయాన్ని బాబాకు ఉత్తరం ద్వారా తెలియజేశాడు. బాబా ఆదేశం లేనిదే అతను ఏ పనీ చేసేవాడు కాదు. తాను సదా బాబా రక్షణలోనే ఉన్నందువల్ల, బాబా నుండి సమాధానం వచ్చేవరకు ఆ ఇంట్లోనే గడపడం క్షేమమని భావించి ధుమాళ్ అక్కడే ఉన్నాడు. “నువ్వు వేసే ప్రతి అడుగులోనూ నేను మార్గదర్శకునిగా ఉంటాను” అని బాబా అతనితో చెప్పేవున్నారు. అతనికి బాబా మాటలపై సంపూర్ణ విశ్వాసం ఉంది. నాశిక్‌లోనూ, ఇతర ప్రదేశాలలోనూ జరుగుతున్న, జరగబోయే సంఘటనలు సర్వమూ బాబాకు తెలుసు కనుక, ఒక పసిబిడ్డలా బాబాపై ఆధారపడిన తనకు ఎటువంటి హానీ కలుగకుండా బాబా కాపాడుతారన్నది అతని నమ్మకం. అతను బాబాపై పెట్టుకున్న ఈ నమ్మకం ఏ ఒక్క విషయంలోనూ వమ్ము కాలేదు.


‘ఆ ఇంటిని విడిచి వేరే ఇంటికి మారు’ అని బాబా నుండి సమాధానం రావడంతో, ధుమాళ్ వెంటనే ఆ ఇంటిని ఖాళీ చేసి నాశిక్‌లోని వేరొక బంగళాకు నివాసం మార్చాడు. కానీ, ఆ బంగళాలో చేరిన రాత్రే అతని సోదరుని కుమారుని పడక దగ్గర చచ్చిన ఎలుక ఒకటి కనిపించింది. ఈ విషయాన్ని బాబాకు మళ్ళీ ఉత్తరం ద్వారా తెలియజేస్తూ, తిరిగి వేరొక ఇంటికి మారమంటారేమో తెలుపమని కోరాడు ధుమాళ్. ఈసారి, ‘మారవద్దు’ అని బాబా నుండి సమాధానమొచ్చింది. డాక్టర్లు, స్నేహితులు ఆ బంగళాలో ఉండటం శ్రేయస్కరం కాదనీ, వేరే ఇంటికి మారిపొమ్మనీ ధుమాళ్‌కు సలహా ఇచ్చారు. కానీ, అతనికి బాబా మాటే వేదవాక్కు. బాబా కృప తనపై ఉన్నంతవరకు ఏ ఆపదా సంభవించదని అతని నమ్మకం. అందువల్ల ఎవరి సలహాలు పాటించకుండా అతను ఆ బంగళాలోనే నివసించసాగాడు. ఇలా కొన్ని రోజులు గడిచిన తరువాత, పనివాళ్ళ గదులలోను, ఇంటి లోపల, బయట ఆవరణలోనూ చచ్చిన ఎలుకలు ఎన్నో కనిపించాయి. చివరకు వాళ్ళు త్రాగడానికి, వంటకు ఉపయోగించే మంచినీటి బావిలో కూడా చచ్చిన ఎలుక కనిపించింది. దాంతో, ఇక ఆ బంగళాలో ఉండటం మంచిది కాదని తోచి, అన్ని విషయాలు బాబాకు వివరంగా ఉత్తరం వ్రాసి, ఇల్లు మారడానికి అనుమతించవలసిందిగా ప్రార్థించాడు ధుమాళ్. ఈసారి వేరే ఇంటికి వెళ్ళడానికి బాబా తప్పక అంగీకరిస్తారని తలచి సామానంతా సర్ది, మూటలు కట్టి, 'బజార్' వీధిలోనున్న తమ ఇంటికి బండిలో పంపాడు. తరువాత కుటుంబంతో సహా వేరొక బండిలో ఆ ఇంటికి చేరుకున్నాడు. ఇంటి తాళం తీయడానికి ప్రయత్నిస్తుండగా ఇంతలో శిరిడీ నుండి వచ్చిన ఉత్తరం అందింది. అందులో, "మనం నివసిస్తున్న ఇంటిని ఎందుకు విడిచిపెట్టాలి? (ఆపణ్ కశాలా సోడావే? తేత్తేచ్ రాహావే)" అన్న బాబా సందేశం ఉంది. ధుమాళ్ మరేమీ ఆలోచించలేదు. బాబా ఆజ్ఞను శిరసావహించి, వెంటనే ఖాళీ చేసి వచ్చిన బంగళాకు తిరిగివెళ్ళి తన కుటుంబంతో అక్కడే నివసించసాగాడు. నీటి విషయంలో మాత్రం వారు కాస్త జాగ్రత్త వహించి, గోదావరి నుండి నీటిని తెప్పించి వాడుకోసాగారు. నాశిక్‌లో ప్లేగు బాగా వ్యాపించి రోజుకు 14-15 మంది చనిపోతున్నా, బాబా మాత్రం వారిని అదే ఇంటిలో నివసించమని ఆదేశించారు. చూసేవారికి ధుమాళ్ చేసిన పని అవివేకంగానూ, ప్రమాదకరమైనదిగానూ అనిపించినప్పటికీ బాబా అనుగ్రహంతో వారికి ఎటువంటి హానీ జరగలేదు. అందరూ క్షేమంగా ఉన్నారు.


ధుమాళ్‌పై బాబా అనుగ్రహం కేవలం ప్రాపంచిక విషయాలకే పరిమితం కాలేదు. 1909లో అతని భార్య మరణించింది. ఆమె ఆత్మశాంతి కోసం అతను ప్రతినెలా 'మాసికం' పెట్టేవాడు. ఆరవ మాసికం పెట్టవలసిన సమయం ఆసన్నమైనప్పుడు బాబా అతనితో, "ఈసారి మాసికం శిరిడీలో పెట్టు. నీ భార్యకు సద్గతి ప్రసాదిస్తాను" అన్నారు. బాబా ఆదేశానుసారం ఆరవ మాసికం శిరిడీలో పెట్టాడు ధుమాళ్. బాబా అతనిని 15 రూపాయలు దక్షిణ అడిగారు. అతను దక్షిణ సమర్పించాడు. బాబా మాటలపై ధుమాళ్‌కు అచంచల విశ్వాసముంది. బాబా మాటలు అక్షరసత్యాలని అనేక ఋజువులు దొరికినందువల్ల బాబా పట్ల అతని విశ్వాసం ఎంతో దృఢపడింది. ఈ నమ్మకం అతనికి తెలియని అతీత విషయాలపై (ఋజువుపరచలేని) కూడా నమ్మకమేర్పడడానికి తోడ్పడింది. అందువల్ల, బాబా అనుగ్రహంతో తన భార్య సద్గతి పొందిందని ధుమాళ్ సంపూర్ణంగా విశ్వసించాడు.


1909 సంవత్సరం నాటికి ధుమాళ్ వయస్సు 36 యేళ్ళు. అతను ఎంతో ఆరోగ్యంగా ఉండేవాడు. పైగా పేరున్న న్యాయవాది కూడా. దానికి తోడు సంతానం లేకుండానే అతని భార్య చనిపోయినందువల్ల, అతని స్నేహితులు, బంధువులు అతనిని ద్వితీయ వివాహం చేసుకోమని ఒత్తిడి చేయసాగారు. వీరిలో నాగపూరుకు చెందిన న్యాయవాది, ధుమాళ్ మామగారైన రావుబహద్దుర్ బాపూరావ్ దాదాకింఖేడే కూడా ఉన్నారు. బాబా అనుమతి లేనిదే తాను ఏ పనీ చేయనని ధుమాళ్ తన మామగారికి చెప్పాడు. అందువల్ల ఆయన ధుమాళ్‌ను శిరిడీ తీసుకెళ్ళారు. ముందు ఆయనొక్కరే మసీదులోనికి వెళ్ళి బాబాతో మాట్లాడి, ఐదు నిమిషాల్లో తిరిగి వచ్చి, ‘బాబా కనులలో విముఖత కనిపించిందనీ, బాబా ఆజ్ఞ లేకుండా ద్వితీయ వివాహం చేసుకోవద్ద’నీ ధుమాళ్‌తో చెప్పారు. బాబా అనుజ్ఞకు విరుద్ధంగా ధుమాళ్ ఏనాడూ నడుచుకోలేదు. బాబా తన వివాహానికి సమ్మతించనందున తన మిగిలిన జీవితమంతా ఒంటరితనంలోనే బాబా అనుగ్రహంతో ఆనందంగా గడిపాడు ధుమాళ్.


ప్రాపంచిక జీవితంలో ధుమాళ్ సాధించిన విజయాలు ఎనలేనివి. వృత్తిపరంగా అతని విజయ పరంపరలు మకుటాయమానమైనవి. అతను ఆర్థికంగా ఎదిగాడు. అతను చెల్లిస్తున్న ఆదాయపుపన్నే అందుకు నిదర్శనం. ఇదంతా కేవలం బాబా అనుగ్రహంతోనే సాధ్యమయింది. ఇన్ని విజయాలు సాధించినప్పటికీ బాబా అతనిని ప్రాపంచిక బంధాల నుండి దూరంగా ఉండేట్లు చేశారు. బాబా అతనికి విజయవంతమైన ఐహిక జీవితం ప్రసాదించిన తరువాత పారమార్థిక విషయాల వైపు అతని దృష్టిని మరలించారు. బాబా చర్యలు నిగూఢాలు, అనూహ్యాలు. అతనికి ప్రాపంచిక - పారమార్థిక విషయాలపట్ల చింత లేకుండా చేసి, వారి చెంత శరణాగతి పొందడానికి, వారి ఆదేశం అందిన వెనువెంటనే అన్నీ వదిలి వెళ్ళేందుకు ధుమాళ్‌ను సమాయత్తపరిచారు బాబా.


బాబా అనుమతితో ధుమాళ్ ప్రజోపయోగ కార్యాలు చేపట్టాడు. వీటన్నింటిలో బాబా యొక్క అద్భుత సహాయం కనిపిస్తుంది. ముందుగా, అతని న్యాయవాద వృత్తిలో బాబా సహాయపడిన సంఘటనలను తెలుసుకున్న తరువాత ప్రజోపయోగ కార్యక్రమాలలోనూ వారు అతనికి ఎలా తోడ్పడ్డారో తెలుసుకుందాం. వీటిలో కొన్ని సంఘటనలు నమ్మశక్యం కానివిగా ఉన్నప్పటికీ అవి వాస్తవాలు. 


సుమారు 1911వ సంవత్సరంలో శిరిడీ నుండి ఒక క్రిమినల్ కేసు ధుమాళ్ వద్దకు వచ్చింది. చాలా గ్రామాలలో మాదిరిగానే శిరిడీలో కూడా పార్టీ తగాదాలు, ముఠాకక్షలు ఉండేవి. ఒక మార్వాడీ స్త్రీపై దౌర్జన్యం చేసి ఆమె గౌరవానికి భంగం కలిగించారన్న నేరారోపణపై బాబా సేవకుడైన రఘుని, మరో ఐదుమందిని పోలీసులు అరెస్టు చేశారు. ఆ నేరాన్ని ప్రత్యక్షంగా చూసిన సాక్షులు చాలామంది ఉన్నట్లు చూపించారు. న్యాయమూర్తి వాళ్ళకి ఆరునెలల కారాగార శిక్ష విధించాడు. తాత్యాకోతేపాటిల్‌కు వీళ్ళపై ప్రత్యేకమైన అభిమానం, జాలి ఉన్నాయి. వాళ్ళనెలాగైనా విడుదల చేయించాలని తలచి, న్యాయమూర్తి ఇచ్చిన తీర్పుప్రతులను తీసుకొని, అప్పుడు శిరిడీలో ఉన్న ప్రముఖ న్యాయవాదులైన దీక్షిత్, ఖాపర్డే మరియు మెజిస్ట్రేటుగా రిటైరైన హెచ్.వి.సాఠే తదితరుల వద్దకు వెళ్ళాడు. వారందరూ ఆ ప్రతులను చదివి, తీర్పు చాలా బలంగా ఉందనీ, అప్పీలు చేసినా ప్రయోజనం స్వల్పమేననీ చెప్పారు. తాత్యా బాబాను ఆశ్రయించాడు. "భావూ దగ్గరికి పేపర్లు తీసుకుపో" అని బాబా ఆదేశించడంతో, తాత్యా ఆ తీర్పు ప్రతులను తీసుకుని నాశిక్ వెళ్ళి ధుమాళ్‌ను కలిశాడు. వాటిని చదివిన ధుమాళ్‌కు నిరాశ కలిగింది. అప్పీలు చేసినా ఈ కేసు గెలిచే అవకాశం కొంచెం కూడా కనపడలేదు. అందువల్ల, ‘ఈ కేసును బొంబాయికిగానీ, అహ్మద్‌నగర్‌లో ఉన్న ప్రముఖ న్యాయవాదుల దగ్గరికిగానీ తీసుకెళితే మంచిద’ని తాత్యాకు సూచించాడతను. అయితే తాత్యా అతనికి బాబా ఆదేశాన్ని గుర్తుచేయడంతో ఇక ఆ విషయంలో తన బాధ్యతగానీ, తనకు మరో మార్గంగానీ ఏమీలేదని ధుమాళ్‌కు అర్థమయింది. దాంతో అతను మారుమాట్లాడకుండా కేసును పరిశీలించి, అప్పీలు పిటీషన్ వ్రాసి, డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేటు ఇంటికి తీసుకెళ్ళాడు. ఆయన అదేమీ చదవకుండా విషయమేమిటో తెలుపమని అడిగారు. కేసు విషయం క్లుప్తంగా వివరించాడు ధుమాళ్. ఆయన అంతా విని, “నిందితులపై కేసు చాలా బలంగా ఉన్నట్లు కనిపిస్తుందే! దీనిపై నీ అభిప్రాయమేంటి?” అనడిగారు. “అసలు ఆ కేసు, అంతమంది సాక్ష్యులు వీటన్నింటికీ ముఖ్యకారణం గ్రామంలోని ముఠా తగాదాలనీ, వాటివల్లే ఆ నేరం ఆరోపించబడింద”నీ చెప్పాడు ధుమాళ్. “నువ్వు అలాగే అనుకుంటున్నావా?” అని మేజిస్ట్రేటు అతనిని అడిగారు. “అనుకోవడం కాదు, అలాగే జరిగిందని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను” అని జవాబు చెప్పాడు ధుమాళ్. మేజిస్ట్రేటు ఇంకేమీ ఆలోచించలేదు. ధుమాళ్ వ్రాసి తెచ్చిన అప్పీలు పిటీషనుపై, వాస్తవాలను ప్రస్తావిస్తూ తీర్పు వ్రాశారు. నిందితులను విడుదల చేస్తున్నట్లు చెప్పారు. కేసు పూర్వాపరాలు పరిశీలించకుండా, క్రిందికోర్టు న్యాయమూర్తి తీర్పు పరిశీలించకుండా, పోలీసులకు, పబ్లిక్ ప్రాసిక్యూటర్‌కు నోటీసులు ఇవ్వకుండా వారిచ్చిన తీర్పు అసాధారణమైనది! ఆ తరువాత మేజిస్ట్రేటు, "మీ శిరిడీ సాయిబాబా ఎలాంటివారు? వారు హిందువా, ముస్లిమా? వారు మీకేమి బోధిస్తారు?" అనడిగారు. "సాయిబాబా హిందువూ కాదు, ముస్లిమూ కాదు. ఈ రెండింటికీ అతీతులు" అని జవాబిచ్చాడు ధుమాళ్. అంతేకాదు, బాబా బోధించేదేమిటో తాను వివరించలేననీ, స్వయంగా వారిని దర్శించి తెలుసుకోవాలనీ కూడా చెప్పాడు. ‘వీలుచూచుకొని సాయిబాబాను దర్శిస్తాన’ని మేజిస్ట్రేటు అతనికి మాట ఇచ్చారు. (వాస్తవానికి ఆ మేజిస్ట్రేటు వేసవిలో ఒకరోజున బాబాను దర్శించాలని శిరిడీ బయలుదేరి, ఎండ తీవ్రంగా ఉండడంతో, కోపర్‌గాఁవ్ నుండే వెనుదిరిగారు.) ఎటువంటి విచారణలు లేకుండా ముద్దాయిలను విడుదల చేయాలన్న మేజిస్ట్రేటు నిర్ణయం, ఆ వెనువెంటనే ఆయన బాబాను గురించి అడగడం - ఇదంతా కేవలం బాబా మహిమవలనే జరిగిందనడానికి నిదర్శనం. ఈ విషయాన్ని ఈ క్రింది సంఘటన బలపరుస్తుంది.


ఆ తరువాత ధుమాళ్ అక్కడినుండి శిరిడీకి బయలుదేరాడు. ఆరోజు శిరిడీలో దీక్షిత్ కుమార్తె మరణించింది. విషాదవదనాలతో ఆమె అంత్యక్రియలకు వెళ్తున్న భక్తులలో కొందరిని పిలిచి, "వెళ్ళిపోకండి. మీకొక చమత్కారం చూపిస్తాను!" అని బాబా అన్నారు. కానీ, భక్తులకు ఏ చమత్కారమూ కనిపించనందున, వాళ్ళు అంత్యక్రియలకు వెళ్ళిపోయారు. ఆ తరువాత కాసేపటికి రఘు తదితరుల విడుదలకు సంబంధించిన వార్తతో ధుమాళ్ శిరిడీ చేరాడు. బాబా చూపిస్తానని చెప్పిన చమత్కారం అదేనని అప్పుడు భక్తులు గ్రహించారు.


మూలం:  శ్రీసాయిభక్త అనుభవసంహిత
(డివోటీస్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ శ్రీసాయిబాబా బై శ్రీబి.వి.నరసింహస్వామి)

  

 తరువాయి భాగం కోసం బాబా పాదాలు తాకండి.


4 comments:

  1. om sai ram ��

    ReplyDelete
  2. Om Sai Ram ��

    ReplyDelete
  3. Om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo