సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1096వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా అనుగ్రహ ప్రసాదం
2. పోగొట్టుకున్న దాన్ని ఇల్లు చేరేలోపు దొరికేలా చేసిన బాబా
3. సాయినాథుని స్మరిస్తే సులభంగా సమస్యల నుండి బయటపడుతాం

బాబా అనుగ్రహ ప్రసాదం


ముందుగా ఈ బ్లాగు నిర్వాహకులకు, సాటి సాయి బంధువులకు నా నమస్కారాలు. నేను ఒక సాయి భక్తురాలిని. 2022, ఫిబ్రవరి 12 సాయంత్రం మా కజిన్ నాకు గిఫ్ట్‌గా ఒక పిజ్జా ఆర్డరు చేశాడు. అయితే నాకు మూడు నెలలు నిండి నాల్గవ నెల నడుస్తున్న పాప ఉంది. అంటే నేను బాలింతను కాబట్టి పత్యం ఉండాలి, ఏది పడితే అది తినకూడదు. ఏ మాత్రం పత్యం లేకపోయినా పాపకి కడుపునొప్పి వస్తుంది. అందువల్ల పిజ్జా తినొచ్చొ, లేదో అని ఇంటర్నెట్లో శోధించి బాలింతలు తినొచ్చని నిర్ధారణ చేసుకున్నాకే నేను ఆ పిజ్జా తిన్నాను. తర్వాత కాసేపటికి పాపకి పాలిచ్చాను. ఇంక రాత్రి పాప ఒకటే ఏడుపు. ఎంత సముదాయించినా అస్సలు ఆపట్లేదు. దాంతో నాకు చాలా భయమేసింది. ఏం చేయాలో అర్ధంకాక 'ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పే పత్యం పాటిస్తూ చక్కగా ఉంటున్న నేను ఇప్పుడు ఈ ఇంటర్నెట్‌ని నమ్మి తప్పుచేసాను' అనిపించి నా మీద నాకే కోపమొచ్చింది. ఇంకా దిగులుతో నేను, మా అమ్మ అదేపనిగా బాబా నామస్మరణ చేస్తూ పాపకి కొంచెం కడుపునొప్పి మందు వేసాము. అయినా పాప ఏడుస్తూనే ఉంది. అప్పుడు బాబా ఊదీ తెచ్చి పాపకు పెట్టి, నా నోట్లో కొంత వేసుకుని, పాప తల దగ్గర ఊదీ ప్యాకెట్ పెట్టి పాపని పడుకోబెడుతూ, 'పాపకి వచ్చిన కష్టం సమసిపోతే 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాన'ని అనుకున్నాను. అంతే, కాసేపటికి పాప ఏడుపు ఆపేసింది. నేను, మా అమ్మ హాయిగా ఊపిరి పీల్చుకున్నాం. ఒక్కసారిగా ప్రాణం లేచి వచ్చినట్లు అనిపించింది. నిజానికి నేను ప్రతి చిన్న విషయాన్ని బ్లాగులో పంచుకోవడం బాగోదులే అని ఊదీ పెట్టి, నామస్మరణ చేద్దాం అనుకున్నాను. అయితే అలా చేసినప్పటికీ పాప ఏడుపు ఆపలేదు. దాంతో నేను బ్లాగులో పంచుకుంటానని అనుకున్నాను. అంతటితో పాప కొంచెం కొంచెంగా ఏడుపు ఆపేసింది. ఈ అనుభవం ద్వారా బాబా నాకు 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు గొప్పతనాన్ని మరియు  'ఈ బ్లాగును వదలొద్దు' అని చెప్తున్నారు అనిపించింది. "నన్ను క్షమించండి బాబా. ఇంకెప్పుడూ పత్యం మానను. దయచేసి నా బిడ్డకున్న గుండె సమస్యను ఎటువంటి ఆపరేషన్ అవసరం లేకుండా సహజంగా నయమయ్యేలా ఆశీర్వదించండి బాబా".


2022, ఫిబ్రవరి 14న మా నాన్నగారు చాలా ముఖ్యమైన పని మీద ఎస్.బి.ఐ. బ్యాంకుకి వెళ్లారు. అసలు వియమేమిటంటే, మా నాన్నగారు గత సంవత్సరం పదవి విరమణ చేశారు. పదవి విరమణ వలన ఆయనకి రావాల్సిన బెనిఫిట్స్ కొన్ని గత సంవత్సరం వచ్చాయి. మరికొన్ని బెనిఫిట్స్ కోసం నాన్న ఒక సంవత్సరమంతా బ్యాంకుల చుట్టూ తిరిగారు. చివరికి ఫిబ్రవరి 14న బ్యాంకువాళ్ళు "6 లక్షల రూపాయలు ఇస్తాము. చెక్ బుక్ తీసుకుని రండి" అన్నారు. మా నాన్న వెంటనే చెక్ బుక్ మీద 6 లక్షలని వ్రాసి, సంతకం చేసి బ్యాగులో పెట్టుకుని బ్యాంకుకి వెళ్లారు. బ్యాంకువాళ్ళు, "ఐటి సంతకం మిస్సయింది, అదొక్కటి చేసుకుని రండి. మీకు రావాల్సిన డబ్బులు మీకిస్తాము" అని అన్నారు. దాంతో నాన్న ఆటోలో ఇంటికి తిరిగి వచ్చారు. తీరా ఇంటికి వచ్చాక చూస్తే, నాన్న పట్టుకుని వెళ్లిన బ్యాగు కనపడలేదు. దాన్ని నాన్న ఆటోలో మర్చిపోయారు. ఆ బ్యాగులో చెక్ బుక్, పాస్ బుక్, ఏటిమ్ కార్డు, ఆధార్ కార్డు వంటి చాలా ముఖ్యమైనవన్నీ ఉన్నాయి. వాటిని వెతకడానికి నాన్న ఇంటి నుండి బయటకి వెళ్లారు. నేను, "బాబా! బ్యాగు దొరికితే 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో ఈ అనుభవాన్ని పంచుకుంటాను" అని అనుకున్నాను. మరుక్షణం ఆటో అతను వచ్చి, బ్యాగు ఇచ్చి వెళ్ళాడు. అతనెప్పుడూ సంతోషంగా, విజయవంతమైన జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా బాబాను కోరుకుంటున్నాను. ఇదంతా సాయిబాబా దయ. "అన్నిటికీ ధన్యవాదాలు బాబా. ఏవైనా తప్పులుంటే క్షమించండి బాబా".


ఓం శ్రీసచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథాయ నమః!!!


పోగొట్టుకున్న దాన్ని ఇల్లు చేరేలోపు దొరికేలా చేసిన బాబా


ముందుగా శ్రీసాయినాథుని పాదపద్మములకు భక్తితో నమస్కరిస్తున్నాను. బాబా మాకు ప్రసాదించిన అనుభవాలను తోటి భక్తులతో పంచుకునేందుకు అనువుగా మాకు ఒక వేదికనందించిన 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు నిర్వాహకులకు, అలాగే సాయి భక్తులకు హృదయపూర్వక వందనాలు. నేను ఒక సాయి భక్తురాలిని. బాబాతో నాకు చాలా అనుభవాలు ఉన్నప్పటికీ ఒక ప్రత్యేక అనుభవాన్ని ఈ వేదిక ద్వారా మొట్టమొదటిసారి నేను మీ అందరితో పంచుకుంటున్నాను. నాకు వివాహమైన తర్వాత నేను నా ఉద్యోగరిత్యా రోజూ తూప్రాన్ నుండి హైదరాబాదుకు వెళ్లొస్తుండేదాన్ని. నేను ఆ ఆఫీసులో చేరిన కొత్తలో నాకు నాలుగు నెలలు జీతం రాలేదు. దానివల్ల డబ్బుకు మాకు చాలా ఇబ్బందిగా ఉండేది. మావారు అప్పుచేసి మరీ నన్ను రోజూ  ఆఫీసుకు పంపుతుండేవారు. ఇలా ఉండగా ఒకరోజు నా జీతం, నాలుగు నెలల ఎరియర్స్ వచ్చాయి. ఆ డబ్బులు అందుకుని త్వరగా తూప్రాన్ వెళ్ళాలని ఆఫీసులో అనుమతి తీసుకుని హైదరాబాదులోని జూబ్లీ బస్టాండుకు వెళ్ళాను. అక్కడ తూప్రాన్ వెళ్లే ఒక ఆర్డినరీ బస్సు ఉంటే ఎక్కి కూర్చుని నా హ్యాండ్ బ్యాగు, వాటర్ బాటిల్ ప్రక్కన పెట్టాను. ఇంతలో ఒక స్పెషల్ ఎక్స్ ప్రెస్ బస్సు వచ్చింది. అది వెంటనే కదులుతుంటే ఈ బస్సు దిగి ఆ బస్సు ఎక్కాను. అయితే బస్సు చాలా రద్దీగా ఉండి నాకు సీటు దొరకక వెంటనే దిగేసాను. తీరా చూసుకుంటే నా హ్యాండ్ బ్యాగు లేదు, వాటర్ బ్యాగు మాత్రమే ఉంది. ఆ హ్యాండ్ బ్యాగులోనే నా నాలుగు నెలల జీతం, చాలా ముఖ్యమైన వస్తువులున్నాయి. అందువలన ఏమి చేయాలో, ఎవరిని అడగాలో తెలియక నాకు ఒక్కసారిగా చాలా టెన్షన్‍గా అనిపించింది. వెంటనే 'నా బ్యాగు పోయింద'ని బస్టాండులో, పోలీస్ స్టేషన్‍లో రిపోర్టు ఇచ్చి వస్తుండగా, "బస్సు టిక్కెటుకు డబ్బులు ఉన్నాయా?" అని పోలీస్ ఆఫీసర్ అడిగారు. అందుకు నేను "నా చేతిలో కొద్దిగా డబ్బులున్నాయి" అని చెప్పాను. తరువాత తూప్రాన్ బస్సు ఎక్కాను. బస్సు కండక్టరు వస్తే టిక్కెట్టుకోసం డబ్బులిచ్చాను. ఆ కండక్టరు, "ఆ చివరన ఉన్న అతను మీ టిక్కెటుకు డబ్బులిచ్చారమ్మా" అని చెప్పారు. నేను. "ఎవరు?" అంటూ వెనక్కి తిరిగి చూస్తే, అక్కడ సుమారు 20 సంవత్సరాల వయస్సున్న అబ్బాయి ఉన్నాడు. అతను ఎవరో నాకు తెలియదు. అతను నాతో "మీ బ్యాగు పోయిందని టిక్కెటుకు డబ్బులిచ్చాను" అని అన్నాడు. నేను తనతో "అవసరం లేదు. నా వద్ద డబ్బులున్నాయి" అని చెప్పి ఊరుకున్నాను. ఇక నేను అతనితో ఏమీ మాట్లాడలేదు. అతనూ మాట్లాడలేదు. నేను చాలా ఆందోళన చెందుతూ, "బాబా! ఇప్పుడు ఏమి చెయ్యాలి? మావారికి ఏమి చెప్పాలి? అప్పు ఎలా తీర్చాలి? సహాయం చేయండి బాబా. మీరు తప్ప నాకు వేరే దిక్కులేదు" అని బాబాను వేడుకుంటున్నాను. మరోపక్క నా మనసు, 'నువ్వు ఇల్లు చేరేలోపు నీ బ్యాగు దొరుకుతుంది' అని చెప్తుంది. అప్పుడు నేను, 'బ్యాగు ఎలా దొరుకుతుంది? ఇప్పుడు లేని బ్యాగు, ఇంటికి వెళ్లేలోపల ఎలా కనపడుతుంది' అని నా మనస్సును ప్రశ్నిస్తూ అదే సమయంలో బాబాను తీవ్రంగా ప్రార్థిస్తున్నాను. ఇక బస్సు తూప్రాన్ బస్ స్టేషన్‍కి చేరుతుందనగా వెనుక కూర్చున్న ఆ అబ్బాయి, "మీరు మొదట ఎక్కి దిగిన బస్సు ఈ బస్సు వెనకే వస్తుంది. అందులో మీ బ్యాగు ఉండొచ్చు. నేను వెళ్లి కనుక్కుని వస్తాను" అని చెప్పి వేగంగా బస్సు దిగి వెళ్లి ఆ బస్సు కండక్టరుతో మాట్లాడాడు. మళ్ళీ నా వద్దకి వచ్చి "మీ బ్యాగు ఆ బస్సులో ఉంది. వాళ్ళు అడిగితే, మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదని చెప్పండి" అని చెప్పి నన్ను తీసుకుని వెళ్లి నా బ్యాగు నాకు ఇప్పించాడు. బ్యాగును చూడగానే నేను, "బాబా..  బాబా.. థాంక్యూ బాబా" అని బాబాకు నమస్కరించి ఆ అబ్బాయికి, ఆ బస్సు కండక్టరుకి కృతజ్ఞతలు తెలిపి ఇంటికి వెళ్ళాను. తర్వాత ఆలోచిస్తే, నేను ముందు ఆ బస్సు ఎక్కినట్లు ఆ అబ్బాయికి ఎలా తెలుసు! అని ఆశ్చర్యంగా అనిపించింది. ఏదేమైనా ఇది దయతో బాబా నాపై చూపిన గొప్ప అనుగ్రహం. లేకుంటే ఎంతో ఇబ్బంది పడేదాన్ని. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".


సాయినాథుని స్మరిస్తే సులభంగా సమస్యల నుండి బయటపడుతాం


శ్రీసచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కి జై!!!


ముందుగా సాయి బంధువులందరికీ నమస్కారం. ఇంత అద్భుతమైన వేదికను ఏర్పాటు చేసి, చక్కగా నిర్వహిస్తున్న బ్లాగు బృందానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నా పేరు శ్వేత. మాది ఒక చిన్న మధ్య తరగతి కుటుంబం. నా జీవితంలో చిన్న చిన్న సమస్యలు చాలా ఉన్నప్పటికీ బాబా దయవల్ల జీవితం సాగిపోతుంది. ఎటువంటి సమస్య వచ్చినా ఆ సాయినాథుని స్మరిస్తే సులభంగా ఆ సమస్యల నుండి బయటపడతాము అనడానికి నిదర్శనమైన అనుభవాలు నాకు చాలా జరిగాయి. అనుకోకుండా మా పెద్దబ్బాయికి జరిగిన అపెండిసైటిస్ సర్జరీ మొదలుకుని మావారి వెన్నుపూసకి జరిగిన సర్జరీ వరకు ఆ సాయినాథుని స్మరిస్తూనే ఒకొక్క సమస్యని దాటుకుంటూ వస్తున్నాం. నేను ఇప్పుడు బాబా నాకు ప్రసాదించిన ఒక చిన్న అనుభవాన్ని మీతో పంచుకుంటున్నాను. ఇటీవల ఒకరోజు ఒత్తిడి ఎక్కువగా ఉన్నందున నాకు బాగా వెన్నునొప్పి వచ్చింది. ఆ నొప్పి ఎంత ఎక్కువగా ఉందంటే అటు, ఇటు కదలడానికి కూడా లేనంతగా. నాకు ఇద్దరు చిన్న పిల్లలున్నారు, పైగా బయట పరిస్థితులు ఎంత మాత్రమూ బాగోలేదు. అందువలన నాకు చాలా భయమేసి, 'ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః' అని స్మరిస్తూ బాబాను తలచుకుని, "బాబా! రేపటికి ఈ నొప్పి తగ్గేలా చూడు స్వామి. నా అనుభవాన్ని తోటి భక్తులతో పంచుకుంటాను" అని పడుకున్నాను. మరుసటిరోజు ఉదయం లేచేసరికి నొప్పి చాలావరకు తగ్గింది. ఆ స్వామి కృప లేకుంటే ఇది సాధ్యమా? "హే సాయిదేవా! దయుంచి మమ్మల్ని సదా కాపాడు తండ్రి".


సర్వేజన సుఖినోభవంతు!!!



8 comments:

  1. Om sai ram 🌹🙏🙏🙏🌹

    ReplyDelete
  2. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������

    ReplyDelete
  3. Om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    ReplyDelete
  4. Jaisairam bless me for my health and wealth of happiness and happiness in the world of yours Jaisairam bless me for my MBA exam and help me to get above fair grade Jaisairam

    ReplyDelete
  5. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  6. Om Sairam
    Sai Always be with me

    ReplyDelete
  7. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయి నాధ్ మహరాజ్ కి జై

    ReplyDelete
  8. Omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo