1. బాబా ఉన్నారు
2. కాపాడిన బాబా
3. ఇల్లు దొరికేలా అనుగ్రహించిన బాబా
బాబా ఉన్నారు
నా పేరు రేవతి. నేను బాబాను పూజిస్తాను. బాబా నాకు చాలా అనుభవాలు ప్రసాదించారు. వాటినుండి కొన్ని అనుభవాలు పంచుకుంటున్నాను. ముందుగా సాయితండ్రికి శతకోటి పాదాభివందనాలు. నేను 2002లో ఉపాధ్యాయ వృత్తిలో చేరాను. ఆ ఉద్యోగం బాబా భిక్ష. నేను ఆ వృత్తిలోకి చేరడానికి ప్రయత్నాలు చేస్తున్న రోజుల్లో ఒకరోజు బాబా నా కలలో, "మొదటి ప్రయత్నంలో నీకు ఉద్యోగం రాదు, రెండవ ప్రయత్నంలో వస్తుంది" అని చెప్పారు. బాబా చెప్పినట్లే 2001లో నాకు ఉద్యోగం రాలేదు, 2002లో వచ్చింది.
కరోనా రెండో వేవ్‌లో ముందుగా మా అమ్మకి కోవిడ్ వచ్చింది. తరువాత మా ఇంటిల్లిపాదికి కోవిడ్ పాజిటివ్ వచ్చింది. అమ్మ షుగర్ పేషెంట్ కావడం వల్ల ఆమెను హాస్పిటల్లో చేర్చాల్సి వచ్చింది. కానీ బాబా దయవల్ల అమ్మ కోవిడ్ నుంచి కోలుకుని ఇంటికి వచ్చింది. ఇంకా మేము కూడా కోవిడ్ నుండి బయటపడ్డాము. అంతా బాబా దయే.
ఇటీవల ఒకసారి మా అమ్మకు ఏం తిన్నా జీర్ణం అవ్వక వాంతులు అయ్యాయి. మేము అమ్మకి బాబా ఊదీ పెట్టి, ఊదీ నీళ్లు త్రాగించి హాస్పిటల్‌కి తీసుకుని వెళ్ళాము. బాబా దయవల్ల అమ్మకి వాంతులు తగ్గాయి కాని, విపరీతమైన నీరసం ఉండేది. నేను బాబా ఫోటో దగ్గర, "బాబా! అమ్మకి నీరసం కూడా తగ్గేలా చూడు తండ్రి, నా అనుభవం బ్లాగులో పంచుకుంటాను" అని వేడుకున్నాను. తరువాత మా సిస్టర్‌కి "ఊదీ నీళ్లు త్రాగించండి, ఒక గంటలో ఆరోగ్యం చేకూరుతుంది" అని బాబా సందేశం వచ్చింది. మేము అలాగే చేసాము. మంచం మీద నుంచి లేవలేని స్థితిలో ఉన్న అమ్మ బాబా చెప్పినట్లే ఒక గంటలో లేచి నిదానంగా నడవసాగింది. అప్పుడు అర్థమైంది, 'బాబా మాటలు పొల్లుపోవు. అక్షర సత్యాలు. బాబా మీద నమ్మకంతో ఓపికగా ఉండటమే మనం చేయాల్సిన పని' అని.
రెండు నెలల క్రితం నా కడుపులో విపరీతమైన మంట వచ్చింది. హాస్పిటల్‌కి వెళ్తే, ఎండోస్కోపీ తీశారు. డాక్టరు రిపోర్టు చూసి, "పేగుల్లో రంధ్రం ఉన్నట్లుగా ఉంది. అది రంధ్రమా లేక మచ్చా తెలియడం లేదు" అని అనుమానం వ్యక్తం చేసి, "ఒకసారి బాడీ స్కాన్ చేద్దాం" అన్నారు. దాంతో, 'డాక్టరు ఎందుకిలా అనుమానంగా చెప్పారు. అల్సర్, క్యాన్సర్ వంటివేమైనా నాకు వస్తున్నాయా?' అని నాకు టెన్షన్ మొదలైంది. వెంటనే, "ఏమిటి సాయి? దయచేసి మీరే నన్ను రక్షించాలి తండ్రి" అని బాబాకి వేయిసార్లు దణ్ణం పెట్టుకున్నాను. తరువాత స్కాన్ చేసే గదిలో బెడ్ మీద పడుకుని 'సాయి సాయి' అనుకుంటూ లలిత అమ్మవారిని, ఆంజనేయున్ని కూడా వేడుకోసాగాను. సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ఆ టెస్టులు, ఈ టెస్టులు చేసాక చివరికి రిపోర్టులు డాక్టరు దగ్గరకి వెళ్లాయి. వాటిని చూసి డాక్టరు, "ఏమీ లేదు, రెండు నెలలు టాబ్లెట్లు వాడండి" అని చెప్పారు. ఆ రకంగా సాయి నన్ను రక్షించారు. "బాబా! నువ్వు ఉన్నావు తండ్రి. మీకు శతకోటి ధన్యవాదాలు. ఈ అనుభవాలు పంచుకోవడంలో ఆలస్యం చేసినందుకు నన్ను క్షమించు దేవా. ఎల్లప్పుడూ మా కుటుంబంపై కృప చూపించు తండ్రి. జన్మజన్మలందు మేము మిమ్మల్ని గుర్తు పెట్టుకునేటట్లు అనుగ్రహించండి సాయి".
కాపాడిన బాబా
నేను సాయి భక్తురాలిని. బాబా నా జీవితంలో ఎన్నో లీలలు చూపారు. ఎన్నోసార్లు కష్టాల నుంచి గట్టెంక్కించారు. ఇప్పుడు ఇటీవల బాబా ప్రసాదించిన ఒక అనుగ్రహాన్ని మీతో పంచుకుంటున్నాను. మావారి స్నేహితుల కుటుంబీకులు నాతో మాట్లాడుతారు. మేము ఓదార్పు కోసం మా ఇళ్ళల్లో ఉన్న సమస్యల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. ఒకరోజు మావారి ఫ్రెండ్ భార్య నాకు కాల్ చేసి, తన భర్త చేసిన పనుల గురించి చెప్పింది. నిజానికి ఆ అన్నయ్య నాకు తెలిసి మంచివారే. కానీ వాళ్లూవీళ్లూ కలిసి తమ మధ్య గొడవ జరిగేలా చేస్తున్నారని ఆమె నాతో చెప్పింది. తరువాత మావారు నన్ను, "ఆమె నీకు ఫోన్ చేసిందా?" అని అడిగారు. "చేసింద"ని చెప్తే, ఏమంటారో ఏమోనని భయపడి "లేద"ని అన్నాను. అయితే సాయంత్రానికి వాళ్ల మధ్య పెద్ద గొడవ అయ్యి మమ్మల్ని కూడా రమ్మన్నారు. అప్పుడు మావారు, "ఆమె నీకు ఫోన్ చేసిందా, లేదా" అని గట్టిగా అడిగేసరికి, "చేసింద"ని చెప్పాను. దాంతో ఆయన "నాకు ఎందుకు అబద్ధం చెప్పావు?" అన్నారు. "భయమేసి" అని చెప్పాను. అదలా ఉంటే వాళ్ళు మమ్మల్ని ఋజువులకోసం పిలిచారేమోనని నాకు చాలా భయమేసింది. అందుచేత వాళ్ళింటికి వెళ్లేటప్పుడు, "బాబా! నన్ను ఏమి ఋజువులు అడగకుండా ఉంటే, బ్లాగులో పంచుకుంటాన"ని అనుకున్నాను. అక్కడికి వెళ్ళాక ఆ భార్యాభర్తలిద్దరూ ముందు పొట్లాడుకున్నా తరువాత బాబా దయవల్ల కలిసిపోయారు. నన్ను ఏమీ అడగలేదు. దయగల బాబా నన్ను కాపాడారు. "ధన్యవాదాలు బాబా. ఈ అనుభవం పంచుకోవడం ఆలస్యం చేసినందుకు దయచేసి క్షమించండి బాబా. నేను ఒక విషయంలో చాలా డోలాయమానంలో ఉన్నాను. దయచేసి నాకు దారి చూపండో బాబా. నా దృష్టి మీపై నిలిచేలా చూడు సాయి".
ఇల్లు దొరికేలా అనుగ్రహించిన బాబా
ఈ బ్లాగు నిర్వాహకులకు మరియు బ్లాగుని ప్రతిరోజు చదువుతున్న వారికి నా నమస్కారాలు. నేను ఒక సాయిభక్తురాలిని. మేము యూరప్‌లో నివాసముంటున్నాము. మేము ఉంటున్న అద్దె ఇంటి వల్ల మాకు చాలా సమస్య అయింది. రెండు సంవత్సరాల, ఆరు నెలల మా బాబు ఏడవడం వల్ల చాలా ఇబ్బందిగా ఉందని మా ఇంటి ఓనర్ మమ్మల్ని ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపొమ్మన్నారు. ఇక్కడ యూరప్‌లో ఇల్లు దొరకడం చాలా కష్టం. ఎంత ప్రయత్నించినా మాకు ఇల్లు దొరకలేదు. కొంత సమయం కావాలని అడిగితే, ఇంటి ఓనర్ ఒప్పుకోలేదు. పైగా మా మీద కేసు పెట్టి చాలా ప్రాబ్లమ్ చేసాడు. నాకు చాలా భయమేసింది, ఇండియాకి వెళ్లిపోవాలి అనిపించింది. తరువాత మా ఫ్రెండ్ ద్వారా నాకు మహాపారాయణ గురించి తెలిసి అందులో చేరాను. బాబా దయవల్ల పారాయణ మొదలుపెట్టిన రెండో వారంలో మాకు ఇల్లు దొరికింది. 2022, మార్చ్ 5న ఆ ఇంటికి మారాం. "థాంక్యూ బాబా. సదా మాకు తోడుగా ఉండండి తండ్రి". మాకు ఇల్లు దొరికితే, బ్లాగులో పంచుకుంటానని బాబాకిచ్చిన మాట ప్రకారం ఇలా మీతో పంచుకున్నాను. అందరికీ బాబా ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను.

