సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1111వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా దయ మన మీద ఉంటే దేనికీ అడ్డుండదు
2. కావాల్సినంత అనుగ్రహించిన బాబా
3. బాబా ఉండగా ఎలాంటి లోటుండదు

బాబా దయ మన మీద ఉంటే దేనికీ అడ్డుండదు

అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు, రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ అయిన శ్రీసాయినాథునికి వేలవేల పాదాభివందనాలు. సాయిభక్తులకు నమస్కారాలు. నా పేరు మల్లేశ్వరి. బాబా తమ భక్తులను ఎల్లవేళలా కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటారు. నిరంతరమూ ఆయన మనకు చేసే సహాయాలు ఎన్నో, ఎన్నెన్నో. మా అబ్బాయి ఆస్ట్రేలియాలో, అమ్మాయి అమెరికాలో ఉంటున్నారు. వాళ్ళిద్దరినీ మన బాబా చల్లగా చూసుకుంటున్నారు. 2022, ఫిబ్రవరి 6న మా అబ్బాయి పెళ్లి జరిగింది. ఆ సమయంలో అడుగడుగునా బాబా మాకు ఎంతో సహాయాన్ని అందించి మేము అనుకున్నదానికంటే ఘనంగా, ఎంతో వైభవంగా పెళ్లి జరిపించారు. ఆ సమయంలో బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలను నేనిప్పుడు మీతో పంచుకుంటాను.

సరిగ్గా పెళ్లి సమయానికి నాకు నెలసరి సమయం. ఆ సమస్యను అధిగమించడానికి టాబ్లెట్లు వాడినా నా విషయంలో ప్రయోజనం ఉండదు. అందుచేత నేను బాబానే నమ్ముకుని, రోజూ బాబాకు పూజచేసి ఉదయం, సాయంత్రం ఊదీ ప్రసాదం తీసుకోసాగాను. బాబా దయ మన మీద ఉంటే మనకి ఏ అడ్డమూ ఉండదు. ఆయన కృపవలన దేనికీ ఆటంకం లేకుండా అన్నీ సవ్యంగా జరిగిపోయాయి. ఇకపోతే, పెళ్లి సమయానికి కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్నందున పెళ్ళికి బంధువులు వస్తారో, రారో అనుకున్నాము. కానీ, బాబా దయవలన మేము అనుకున్నదానికంటే చాలామంది, అంటే 2,500 మంది వచ్చారు. ఎవరికీ ఎలాంటి ఇబ్బందీ కలగకుండా మన బాబా చూసుకున్నారు.

బాబా సమక్షంలో పెళ్లి జరగాలని తలచి నేను ఒక పెద్ద బాబా క్యాలెండరు తీసుకెళ్లి పెడదామనుకున్నాను. కానీ కుదరలేదు. అయినా నేను, "బాబా! మీరు ఎలాగైనా వస్తారు" అని అనుకున్నాను. పెళ్లిరోజు ఉదయాన్నే నా స్నేహితురాలు ఒకామె వచ్చి, "అక్కా! నీకు ఇష్టమైంది తీసుకొచ్చాను" అని నా చేతికి ఇచ్చింది. తీసి చూస్తే, మన తండ్రి సాయినాథుడు. ఇక నా సంతోషానికి అవధులు లేవు. 

మా అమ్మాయి పెళ్ళికి వచ్చి, తిరిగి వెళ్ళేటప్పుడు తన పాస్‌పోర్టు చిరిగిపోయింది. అది చూసి ఇండియాలోనే అమ్మాయిని ఆపారు, తరువాత మళ్ళీ పంపించారు. కానీ అక్కడ అమెరికాలో ఏమంటారోనని మా అమ్మాయి భయపడింది. తను నాకు ఆ విషయం చెప్పగానే నేను 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగ్ ఓపెన్ చేసి చూస్తే, "నువ్వు చింతపడవద్దు. నిన్ను సురక్షితంగా గమ్యం చేరుస్తాను" అన్న బాబా సందేశం వచ్చింది. దాంతో నేను మా ఇంట్లోవాళ్లతో, 'మన తండ్రి బాబా అంతా చూస్తూనే ఉన్నారు. ఆయన ఉండగా మనకి భయమెందుకు?' అని చెప్పాను. బాబా దయవలన అమెరికాలో పాస్‌పోర్టు సరిగా చూడకుండానే అమ్మాయిని ఇంటికి పంపించారు.

పెళ్లి తరువాత ఒకసారి మా ఇంటిలో టీవీ రాలేదు. ఉదయం అంతా ప్రయత్నించినా రాలేదు. సాయంత్రం పొలం నుంచి వచ్చి చూసినా రాలేదు. ఇక నేను 'బాబా, బాబా' అనుకుంటూ "టీవీ వస్తే, నా అనుభవాన్ని తోటి భక్తులతో పంచుకుంటాను" అని అనుకున్నాను. తక్షణమే టీవీ వచ్చింది. ఇంకా ఎన్నో వ్రాయాలనుకుంటున్నాను కానీ, ఎన్నని వ్రాయగలను? చిన్న విషయం దగ్గరనుండి అతి పెద్ద సమస్య వరకు ప్రతిదీ మన సాయితండ్రే చూసుకుంటున్నారు. మన సాయినాథుని దయ మన మీద ఉంటే, సమస్యలేవైనా సునాయాసంగా సమసిపోతాయి. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".

కావాల్సినంత అనుగ్రహించిన బాబా

ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!!! భక్తులందరికీ నమస్కారం. నా పేరు శ్రేయ. నేను సాయిభక్తురాలిని. బాబా మనకు రోజూ ఏదో ఒక అనుభవం ఇస్తూనే ఉంటారు. ఒకరోజు నా మొబైల్ ఫోన్ పూర్తిగా పనిచేయడం మానేసింది. ఇంక నేను కొత్త ఫోన్ కొనుక్కున్నాను. కానీ పాత ఫోన్లో చాలా ముఖ్యమైన ఫోన్ నెంబర్లు, మెసేజ్లు ఉన్నాయి. అందువల్ల నేను మనసులో బాబాతో, "ఒక్క గంటసేపు అయినా నా పాత ఫోన్ పనిచేసేలా చేసి అందులో ఉన్న నాకు కావాల్సిన సమాచారమంతా కొత్త ఫోన్‌లోకి తీసుకునేలా అనుగ్రహించండి" అని చెప్పుకున్నాను. తర్వాత నేను పాత ఫోన్ ఛార్జింగ్ పెట్టి కొంతసేపైన తర్వాత ఆన్ చేశాను. బాబా దయవల్ల ఫోన్ ఆన్ అయి, పూర్తి స్థాయిలో కాకపోయినా నా అవసరానికి సరిపడేంతసేపు పని చేసింది. నాకు చాలా ఆశ్చర్యమేసింది. "బాబా! నేను కోరుకున్నట్లు పాత ఫోన్‍లోని సమాచారమంతా కొత్త ఫోన్‍లోకి తీసుకోగలిగాను. మీకు చాలా చాలా ధన్యవాదాలు సాయి".

బాబా ఉండగా ఎలాంటి లోటుండదు

సాయినాథునికి నా నమస్కారాలు. నేను సాయిభక్తురాలిని. సాయిబాబా దయతో నా భర్తకు ఖతార్‌లో ఉద్యోగం వచ్చింది. మావారు నాతో, "ముందుగా నేను అక్కడికి వెళ్లి, తరువాత నిన్ను, పిల్లల్ని తీసుకుని వెళ్తాను" అని అన్నారు. అది కరోనా సమయం అయినందున పిల్లలతో ఒంటరిగా ఉండడానికి నేను చాలా భయపడ్డాను. కానీ బాబా అనుగ్రహం వలన 6 నెలల్లో రావలసిన రెసిడెంట్ పర్మిట్ మూడు నెలల్లోనే వచ్చింది. దాంతో నేను, పిల్లలు కూడా మావారి దగ్గరకి వెళ్ళాము. "నన్ను, మా పిల్లల్ని తొందరగా మావారి దగ్గరకు చేర్చినందుకు ధన్యవాదాలు బాబా".

ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!!!

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo