సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

బాపూసాహెబ్ జోగ్


బాపూసాహెబ్ జోగ్
సాయి ప్రముఖ భక్తులలో బాపూసాహెబ్ జోగ్ అలియాస్ సఖారాం హరి ఒకరు. ఇతడు 1856వ సంవత్సరంలో జన్మించాడు. ఇతను పూణే నివాసి. ఇతను ప్రభుత్వ పి.డబ్ల్యూ. డిపార్టుమెంటులో సూపర్‌వైజరుగా పనిచేసి 1909లో ఉద్యోగ విరమణ చేశాడు. అనంతరం భార్య శ్రీమతి తాయిబాయితో కలిసి శిరిడీ వచ్చి స్థిరపడ్డాడు. సంతానభాగ్యం లేని వారిరువురు తమకు వచ్చే పింఛనుతో శిరిడీలో సాయి సేవ చేసుకుంటూ ప్రశాంతమైన జీవనాన్ని గడిపారు.

ప్రముఖ సత్పురుషులు విష్ణుబువా జోగ్, బాపూసాహెబ్ యొక్క దగ్గరి బంధువులలో ఒకరు (పవిత్ర శ్రీసాయిసచ్చరిత్ర 43, 44వ అధ్యాయం ప్రకారం అతను జోగ్ కు మామ). శిరిడీ సందర్శనానికి ముందు సాధు సఖారాం మహరాజ్ కు కృతజ్ఞతలు తెలుపుకునే విషయమై జోగ్ కబాద్ వెళ్లాడు. ఆయన సేవ చేస్తూ కొంతకాలం అక్కడ గడిపాక శిరిడీ వెళ్లి కొద్దిరోజులు అక్కడ గడిపి, తిరిగి కబాద్ వచ్చి తన మిగిలిన జీవితాన్ని అక్కడే గడపాలని అనుకున్నాడు. కానీ బాబాకి బాపూసాహెబ్ విషయంలో వేరే ప్రణాళికలున్నాయి. ఆయన అతన్ని శిరిడీలోనే ఉంచేశారు. కనీసం ఒక్కసారి వెళ్లి తన సామానులు తెచ్చుకోవడానికి కూడా బాబా అనుమతించలేదు.

బాపూసాహెబ్ జోగ్  'చిత్పావన్ కొంకణి బ్రాహ్మణుడు'. ఈ బ్రాహ్మణ తెగ చాలా సనాతనమైనది. వారు పవిత్రమైన కర్మలను అనుసరించడంలో ఖచ్చితంగా ఉండేవారు. జోగ్ కూడా తన వ్యవహారాలలో న్యాయంగా, నిజాయితీగా, ముక్కుసూటిగా ఉండేవాడు. అతని భార్య తాయిబాయి కూడా అదే స్వభావాన్ని కలిగి ఉండటం చేత వారివురూ ఒకరికోసం ఒకరు పుట్టారు అన్నట్లుండేవారు. ఆ దంపతులిద్దరూ అత్యంత భక్తి విశ్వాసాలతో బాబాను పూజించుకుంటూ ఆనందకరమైన జీవితాన్ని శిరిడీలో గడిపేవారు. బాబా ఆమెను 'ఆయీ' అని ప్రేమగా పిలిచేవారు. జోగ్‌ను ఎంతగానో ప్రేమించేవారు. ఆ దంపతులు సాఠేవాడాలో నివాసముండేవారు. ఎప్పుడైనా కొంతమంది భక్తులు అతనికిష్టంలేని విషయాలు మాట్లాడినప్పుడు అతను కోపంతో కబాద్ వెళ్ళిపోతానని బెదిరిస్తుండేవాడు. అప్పుడు బాబా జోక్యం చేసుకుని, "వాడా ఏమైనా సాఠే తండ్రిదా? మీకు ఇబ్బంది కలిగించవద్దని దాదాకేల్కరుతో చెప్తాను. మీరు నిశ్చింతగా అక్కడే ఉండండి. సరేనా!" అని చాలా మధురంగా చెప్పేవారు. దాంతో అతడు శిరిడీలో ఉండటానికి సుముఖత చూపేవాడు.

జోగ్ ఇంటి పూజాగదిలో సర్వదేవతల విగ్రహాలూ వుండేవి. అయితే ఆతడు ప్రధానంగా 'దత్త ఉపాసకుడు'. దత్త సాంప్రదాయ ఆచారాలను అనుసరిస్తూ తన సాధనను మౌనంగా చేసుకుంటూ ఉండేవాడు. ప్రతి సంవత్సరం దత్తజయంతినాడు అతను దత్తాత్రేయునికి నివేదనతోపాటు ఒక కఫ్నీని కూడా సమర్పించుకునేవాడు. ఆ అలవాటు ప్రకారం ఒక సంవత్సరం దత్తజయంతినాడు కఫ్నీని బాబాకు సమర్పించుకోవాలన్న బలమైన కోరిక అతనికి కలిగింది. వెంటనే బాలాషింపీని కలిసి ఒక కఫ్నీ కుట్టమని చెప్పాడు. దత్తజయంతి రానే వచ్చింది. ఆనాడు అతడు మశీదుకు వెళ్లి బాబాకు పూజచేసి, కఫ్నీ సమర్పించాడు. బాబా అతడిచ్చిన కఫ్నీ తీసుకుని, తమ కఫ్నీని ప్రసాదంగా అతనికిచ్చి ఆశీర్వదించారు. అతడు పట్టలేని ఆనందంతో ఆ కఫ్నీని తీసుకుని వెళ్లి భద్రంగా భద్రపరుచుకున్నాడు. సాయంత్రవేళల్లో అతడు ఆ కఫ్నీ ధరించి, తలచుట్టూ తెల్లటి వస్త్రాన్ని కట్టుకుని బాబా దర్శనానికి వెళ్ళేవాడు. అతను వాటిని 'దర్బారీ పోషక్' (కోర్టు దుస్తులు) అని పిలిచేవాడు. ఇతర సమయాల్లో మాత్రం సాధారణ దుస్తులు ధరించేవాడు. 

బాపూసాహెబ్ సహజంగా దయార్ద్రహృదయం గల మంచి వ్యక్తి అయినప్పటికీ, ఉద్యోగరీత్యా తనకున్న అధికారం వల్ల మరియు కార్మికులతో వ్యవహరించే తీరు వల్ల కొంత కఠినంగా ఉన్నట్లు కనిపించేవాడు. అతిత్వరగా తన నిగ్రహాన్ని కోల్పోయేవాడు. అంతేకాదు, తాను ఆదా చేసుకున్న కొంచెం డబ్బుతో పొదుపుగా జీవనం సాగిస్తున్నప్పటికీ ఆ సంపాదన వలన అతనిలో అహంభావం చోటుచేసుకున్నది. ఆ విషయం తెలిసిన బాబా తమదైన పద్ధతిలో శిక్షణనిచ్చి నిదానంగా అతని యొక్క ఈ వైఖరిలో మార్పు తీసుకొచ్చారు.

ఒకసారి అతని వద్ద డబ్బు లేదని తెలిసికూడా బాబా అతనిని దక్షిణ అడిగారు. అతడు, "బాబా, నా వద్ద ధనం లేదని చెప్పాడు. అయినా ప్రతి పది, పదిహేను నిమిషాలకి ఒకసారి బాబా అతనిని దక్షిణ అడుగుతుండేవారు. చివరికి అతను విసిగిపోయి, "నా వద్ద ధనం లేదంటుంటే" అని గొంతు చించుకుని అరిచాడు. అప్పుడు బాబా, "బాపూసాహెబ్! కోపం తెచ్చుకోకు, నిగ్రహాన్ని కోల్పోవద్దు. నీ దగ్గర ధనం లేకుంటే లేదని నిదానంగా చెప్పు, అదీకాకుంటే ఊరుకో! అరుస్తావెందుకు?" అని అన్నారు.  అతని వద్ద ఉన్న డబ్బంతా అయిపోయేవరకు తిరిగి తిరిగి దక్షిణ అడిగిమరీ తీసుకుంటుండేవారు.

బాబాకు అతని పట్ల చాలా నమ్మకం. తరచూ డబ్బును భద్రపరచమని జోగుకిస్తుండేవారు. అతడు ఆ డబ్బును చాలా జాగ్రత్తగా భద్రపరిచేవాడు. ఎందుకంటే, అది బాబా డబ్బు అని అతనికి బాగా తెలుసు. ఏదైనా అవసరమొచ్చినప్పుడు బాబా ఆ డబ్బు నుంచి కొనుగోలు చేయమని అతనితో చెప్తుండేవారు. అప్పుడప్పుడు ఆయన వంద రూపాయలు అతనికిచ్చేవారు. కొన్నిరోజుల తర్వాత ఆయన సరదాగా, "బాపూసాహెబ్, కొన్నిరోజుల క్రితం నీకు నూటఇరవైఐదు రూపాయలు ఇచ్చాను. వెళ్లి తీసుకొని రా" అనేవారు. అప్పుడు జోగ్ బాబాతో, "బాబా, మీరు కేవలం వంద రూపాయలు మాత్రమే ఇచ్చారు" అనేవాడు. ఇలా కొన్నిసార్లు జరిగిన తరువాత, బాపూసాహెబ్ కోపంతో, "బాబా, మీ డబ్బు లావాదేవీలతో నాకు సంబంధం వద్దు. మీ డబ్బుని వేరే ఎవరి వద్దయినా ఉంచుకోండి" అన్నాడు. అప్పుడు బాబా, "బాపూసాహెబ్, కోపం తెచ్చుకోవద్దు! నేను పొరపాటు చేశాను, అవి వంద రూపాయలే, సరేనా!" అని అనేవారు.

ఒకసారి ఒక భక్తుడు బాబాకి ఒక గినియా ఇచ్చాడు. బాబా దానిని బాపూసాహెబుకిచ్చి, "ఇది ఏమిటి?" అని అడిగారు. అతను బాబాతో అది ఒక గినియా అని, అది పదిహేను రూపాయలకు సమానమని చెప్పాడు. బాబా, "ఇది ముప్ఫైరూపాయల విలువైనది. దీనిని నీ వద్ద ఉంచి, నాకు ముప్ఫైరూపాయలు ఇవ్వు" అన్నారు.

పై సంఘటనల వెనుక బాబా ఉద్దేశ్యం ఏమిటన్నది బాహ్యానికి తెలియకున్నా నిదానంగా అతను ఒక విలువైన పాఠం నేర్చుకున్నాడు. అప్పటినుండి ప్రతినెలా అతను కోపర్గాఁవ్ వెళ్లి పెన్షన్ తెచ్చుకుని, దుకాణదారులకు ఇవ్వవలసిన బకాయిలను చెల్లించి, మిగిలిన సొమ్ము తెచ్చి బాబా ముందు ఉంచేవాడు. బాబా భక్తులకు శిక్షణనిచ్చే పద్ధతి చాలా విలక్షణమైనది. ఆయన భక్తులకు తెలియకుండానే వాళ్లలో గొప్ప పరిణతి తీసుకుని వస్తారు.

బాబాకు నిత్యం ఆరతి, పూజ చేస్తుండే మేఘ 1912, జనవరి 19న మరణించాడు. అతని మరణానంతరం బాబా ఆ సేవను జోగ్‌కు అప్పగించారు. అప్పటినుండి 1918లో బాబా మహాసమాధి చెందేవరకు ఆయనకు సంబంధించిన అన్ని వ్యవహారాలు అతడెంతో భక్తిశ్రద్ధలతో బాధ్యతాయుతంగా చేశాడు. అతడు మశీదులో, చావడిలో రోజుకు మూడుసార్లు చొప్పున ఆరతి చేసేవాడు. సాధారణంగా ఆరతికి గణనీయమైన సంఖ్యలో భక్తులు ఉండేవారు. ఎవరున్నా, లేకపోయినా పట్టించుకోకుండా అతను మాత్రం భక్తితో ఉత్సాహంగా బాబాకు ఆరతి నిర్వహించేవాడు. అతడు బాబా సేవతోపాటు యాత్రికులు, సందర్శకులకోసం ప్రతిరోజూ సాఠేవాడాలో జ్ఞానేశ్వరి మరియు ఏకనాథ భాగవతం పఠించేవాడు.

బాపూసాహెబ్ మరియు తాయిబాయి నిష్ఠతో కూడిన జీవితాన్ని కొనసాగించేవారు. ఏ కాలమైనాసరే ఉదయాన్నే 3 గంటలకి నిద్రలేచి, దీక్షిత్ వాడా వెనుకనున్న బావి వద్ద నుండి చల్లటి నీటిని తెచ్చుకుని స్నానం చేసి, వారి గృహదేవతలకు మతపరమైన ఆచారాలతో కడునిష్ఠగా "పూజ" చేసిన తరువాత గ్రంథపఠనం చేసేవారు. బాబా చావడిలో నిద్రించిన రాత్రయితే మరునాటి ఉదయం కాకడ ఆరతి చేయడానికి జోగ్ చావడికి వెళ్ళేవాడు. ఒకవేళ బాబా మశీదులోనే ఉంటే అయన ఫలహారం చేసేవేళకు మశీదుకెళ్ళేవాడు. తరువాత బాబాతో లెండీకి వెళ్ళేవాడు, లేదంటే బాబా తిరిగి వచ్చేవరకు తన ఇంటిలో భగవద్గీత పారాయణ చేసేవాడు.

బాబా లెండీ నుండి వచ్చాక ఆ దంపతులిద్దరూ ద్వారకామాయికి వెళ్లి ఆయన దర్శనం చేసుకునేవారు. అతడు బాబా ప్రక్కన ఉండి అవసరమైన అన్ని పనులు చూసుకుంటుండేవాడు. తరువాత ఆ దంపతులిద్దరూ ఇంటికి వెళ్లి ఆరతి సమయానికల్లా నైవేద్యం సిద్ధం చేయడంలో నిమగ్నమయ్యేవారు. తమ దైవమైన బాబా ఏది కోరుకుంటే అది సిద్ధపరిచేవారు. తాయిబాయి బాబా తమ వద్దకు పంపే అసంఖ్యాకమైన అతిథులకు కావలసిన ఏర్పాట్లు చూసుకునేది.

తరువాత జోగ్ బాబాకు మధ్యాహ్న ఆరతి చేసేవాడు. భక్తులు తమకు పండ్లు, మిఠాయిలు సమర్పించినప్పుడు ఆ మొత్తం బుట్టను బాబా అతనికి ఇచ్చేవారు. తరచూ బాబా కొంతమంది భక్తులను అతనింట భోజనానికి పంపేవారు. బాబా పంపిన ఆ అతిథులను వెంటబెట్టుకుని తన ఇంటికి వెళ్లి ఎంతో  ఆదరంగా వాళ్ళకి భోజనం పెట్టేవాడు. సుమారు 3-30 గంటల సమయంలో అతడు మసీదుకెళ్ళి కాసేపు బాబా సన్నిధిలో గడిపిన తరువాత ఇంటికి వచ్చి సాయంత్రం వరకు ఏకనాథ భాగవతం చదివేవాడు. అప్పుడప్పుడు బాబా అతడు చేసే పారాయణను వినమని భక్తులను పంపేవారు. రోజువిడిచిరోజు బాబా చావడికి వెళ్ళేటప్పుడు, రాత్రి 9-30 గంటలకు అతడు ఆరతి చేసేవాడు. చావడి ఉత్సవ సమయంలో బాపూసాహెబ్ జోగ్ ఒక వెండిపళ్ళెంలో బాబా పాదములు కడిగి అర్ఘ్య పాద్యములర్పించి, చేతులకు గంధము పూసి, తాంబూలమునిచ్చేవాడు. ఆ ఊరేగింపులో అతడు బాబా శిరస్సుపై ఛత్రమును పట్టుకునేవాడు. ఆఖరికి వేడుక పూర్తయ్యాక సర్వలాంఛనాలతో కర్పూర హారతినిచ్చేవాడు. ఆ విధంగా ఏడు సంవత్సరాలపాటు జోగ్ నిరంతరాయంగా భక్తిప్రపత్తులతో తన విధులు నిర్వర్తించాడు. 

జోగ్ బాబాకు గొప్ప భక్తుడు. ఇక్కడ ఒక సంఘటన గురించి చెప్పుకుందాం. సాయికి ఒక్కొక్కప్పుడు కోపావేశం తొంగిచూసేది. ఫిబ్రవరి 26, 1912న చావడి ఉత్సవానికి మశీదుపై దీపాలు పెట్టడానికి పైకెక్కిన వాళ్ళను ఆయన తిట్టారు. ఊరేగింపు బయలుదేరగానే శ్రీమతి జోగ్‌పై సటకా విసిరారు. చావడిలో ఆరతి కాగానే కోపంతో జోగ్ చేతులు పట్టుకుని, “ఆరతి ఎందుకు ఇచ్చావ్?” అని గద్దించారు. ఒకసారి బాపూసాహెబ్ జోగ్‌కు ఆరతి సమయంలో బాబా అక్కల్కోట  మహరాజ్‌గా దర్శనం ఇచ్చారు.

గతంలో జోగ్ ఉద్యోగంలో ఉన్నప్పుడు ఒకసారి తన భార్య తరఫు బంధువులకు కొంతడబ్బు అప్పుగా ఇచ్చాడు. ఆ వ్యక్తి 14 సంవత్సరాలు దాటినా డబ్బు తిరిగి చెల్లించలేదు. ఒకసారి జోగ్ ఆర్థిక పరిస్థితి బాగాలేక ఆ వ్యక్తి నుంచి డబ్బును తిరిగి వసూలు చేసుకోవడానికి ఔరంగాబాద్ వెళ్లి, అవసరమైతే చట్టపరంగానైనా డబ్బు తిరిగి రాబట్టాలని అనుకున్నాడు. ఆ విషయమై అనుమతి తీసుకోవడానికి బాబా వద్దకు వెళ్లాడు. బాబా ఔరంగాబాద్ వెళ్ళడానికి అనుమతినివ్వకుండా, "ఋణగ్రహీత స్వయంగా త్వరలో ఇక్కడికి వచ్చి నీ డబ్బు నీకిస్తాడు. కాబట్టి దానిగురించి ఆందోళనచెందక, ఓర్పు కలిగి ఉండమ"ని సూచించారు. జోగ్ కోపంతో, "నేను వెళ్తేనే ఇవ్వనివాడు, దావా వేయకపోతే ఎలా ఇస్తాడు? అది రాకుంటే నేనిక్కడ ఎలా బ్రతకాలి? మీ సేవ ఎలా చేయాలి?" అన్నాడు. కానీ బాబా అనుమతి ఇవ్వకపోయేసరికి అతడు ఆశ వదులుకున్నాడు. 

తరువాత ఒకరోజు అకస్మాత్తుగా ఆ ఋణగ్రహీత శిరిడీ వచ్చి, జోగ్‌ను కలుసుకుని, అసలు మొత్తాన్ని ఇచ్చాడు. జోగ్ మాత్రం వడ్డీ కూడా ఇస్తేనే గాని ఆ పైకం ముట్టనని పట్టుబట్టాడు. కానీ, "వడ్డీ లేకుండానే తీసుకోమ"ని బాబా చెప్పారు. బాబా వడ్డీ వద్దనేసరికి జోగ్‌కి మొదట్లో అసంతృప్తిగా ఉన్నప్పటికీ, బాబా మాట కాదనకుండా వడ్డీ లేకుండానే ఆ పైకం తీసుకుని బాబాకు  అర్పించాడు. బాబా ఆ పైకం నుండి కొంతమాత్రమే తీసుకుని మిగిలినది అతనికే ఇచ్చారు. నోటు గడువు దాటిపోయినా, తనవైపు నుండి ఎలాంటి ప్రయత్నం లేకుండానే తన సొమ్ము తనకి రావడం నిజంగా గొప్ప అద్భుతం. అందుకు జోగ్ ఎంతో సంతోషించాడు.

బాపూసాహెబ్ ఆహారం తీసుకునే విషయంలో చాలా సంప్రదాయబద్ధంగాను, కఠినంగాను ఉండేవాడు. అతను ఏకాదశి మరియు ఇతర ఉపవాసం ఉండే రోజుల్లో ఉల్లిపాయలను ముట్టుకునేవాడు కాదు. అయితే ఒక ఏకాదశిరోజున, ఏ వంటకం చేయమంటారని బాబాని అడిగాడు జోగ్. "ఉల్లితో కిచిడీ చేయమ"ని బాబా చెప్పారు. ఏమాత్రం సంకోచం లేకుండా బాబా చెప్పారని కిచిడీ తయారుచేసి తీసుకొచ్చి బాబాకు అర్పించాడు జోగ్. బాబా కొంచెం రుచి చూసి, "బాగుంది, అందరికీ పంచి, నువ్వు కూడా తిను" అన్నారు. తన నియమాన్ని ప్రక్కనపెట్టి బాబా ఆజ్ఞ ప్రకారం ఉల్లికిచిడీ తిన్నాడు జోగ్.

ఒకరోజు రాత్రి సుమారు 8 గంటల సమయంలో బాపూసాహెబ్ జోగ్‌ను తేలు కుట్టింది. అతను వెంటనే బాబా వద్దకు వెళ్లాడు. అతడు మశీదు మెట్లెక్కుతుండగా బాబా, “బాపూసాహెబ్, ఏమిటి?” అని అడిగారు. “బాబా! నన్ను తేలు కుట్టింది” అని జోగ్ చెప్పాడు. “తగ్గిపోతుందిలే, వెళ్ళు!” అని బాబా అన్నారు. జోగ్ వెంటనే వెనుతిరిగాడు. అతనింకా మశీదు పరిసరాలు దాటి బయటకొచ్చాడో లేదో తన నొప్పంతా పూర్తిగా తగ్గిపోయింది.

ఒకసారి శ్రీమతి కాశీబాయి కనీత్కర్ అనే భక్తురాలితో, అంగోన్ కవాడ్‌కి చెందిన శ్రీసఖారాం మహరాజ్ అనే గొప్ప సాధువుతో కలసి తాము కొంతకాలమున్నామని, ఆయన తమ గురుబంధువని, అక్కడ ఆయనతో కలసి ఒక మామిడిమొక్క నాటామని బాబా చెప్పారు. జోగ్ ఈ ఇద్దరినీ దర్శిస్తుండేవాడు. ఒకసారి జోగ్ అంగోన్ కవాడ్ లోని ఆ మామిడిచెట్టు నుండి ఒక కాయను కోసి శిరిడీకి  తీసుకువెళ్ళాడు. కానీ అది పచ్చిగా ఉందని దారిలో రెండు మామిడిపండ్లు కొని బాబాకు సమర్పించాడు జోగ్. బాబా ఆ పండ్లను స్వీకరించక ఆ మొదటికాయనే కోరి తీసుకున్నారు. దానిని చూడగానే ఆనందభాష్పాలతో ఆయన కళ్ళు నిండాయి. దానిని అటూ ఇటూ త్రిప్పి చూచి, “ఇది ఇంకా పండలేదు” అన్నారు. 'ఔన'న్నాడు జోగ్. బాబా మరికొద్దిసేపు దానిని తదేకంగా చూచి, దానిని కోయించి భక్తులందరికీ పెట్టించారు. అదెంతో మధురంగా ఉండటం చూచి అందరూ ఆశ్చర్యపోయారు.

ఒకరోజు ఉదయం తాయిబాయి  నైవేద్యం తీసుకుని ద్వారకామాయికి వెళ్లినప్పుడు, బాబా ఆమెతో, "ఆయీ! నేడు ఎక్కువమొత్తంలో పూరణ్ పొళీలు(బొబ్బట్లు) చేసి, నెయ్యితో బాగా కాల్చి ఉంచు. వాటిని ఒక గేదెకు తినడానికి పెట్టు" అని చెప్పారు. అందుకు ఆమె, "బాబా! నేను మీరు చెప్పినట్లుగా పోళీలు చేసి గేదెకు పెట్టడానికి సిద్ధమే కానీ, ఆ గేదెను వెతుక్కుంటూ నేను ఎక్కడికి వెళ్ళాలి? నేను దానిని ఎలా గుర్తించాలి?" అని అడిగింది. అప్పుడు బాబా, "ఆయీ! నీవు దీనిగురించి ఎందుకు ఆందోళన చెందుతున్నావు? పూరణ్ పోళీలు సిద్ధం చేయటం పూర్తయిన వెంటనే గేదె మీ ఇంటి గుమ్మం వద్దకు వస్తుంది" అని జవాబిచ్చారు. ఆమె ఆశ్చర్యంతో, "బాబా మా ఇంటికి రెండు గుమ్మాలున్నాయి. ప్రతిరోజు ఎన్నో గేదెలు మా ఇంటి ముందున్న దారిలో వెళ్తూ ఉంటాయి. తరచూ  మా ఇంటి గుమ్మం దగ్గర ఆహారం కోసం ఆగుతూ ఉంటాయి. నేను వాటికి ఆహారం పెడుతుంటాను" అని బదులిచ్చింది. అప్పుడు బాబా, "ఆయీ, పూరణ్ పోళీలు సిద్ధం చేసి, వాటికి నెయ్యి రాస్తున్నప్పుడు ఆ గేదె మీ ఇంటి వెనుకగుమ్మం వద్దకు వచ్చి వేచిచూస్తుంది" అని వివరించారు.

బాబా ఇచ్చిన జవాబుతో సంతృప్తి చెందిన తాయీ ఇంటికి వెళ్లి శ్రద్ధతో, సమృద్ధిగా నెయ్యివేసి, రుచికరమైన పూరణ్ పోళీలు చాలా చేసింది. మధ్యాహ్నం 12:30కి ఆమె వెనుకగుమ్మం తలుపు తెరచి చూసేసరికి అక్కడ బాబా చెప్పినట్లుగా ఒక గేదె వేచివుంది. ఆమె ఆశ్చర్యపోతూనే బాబా మాటలు సత్యమైనందుకు సంతోషించింది. వెంటనే బాబా చెప్పినట్లుగానే ఆమె పళ్లెంనిండా పూరణ్ పోళీలు తీసుకొచ్చి ఆ గేదె ముందు పెట్టింది. ఆ గేదె వాటినన్నింటిని తిన్నాక ఆమె చూస్తుండగానే హఠాత్తుగా మరణించింది. ఆమె ఒక్కసారిగా హతాశురాలైంది. గేదె మరణానికి తానే బాధ్యురాలినని ఆమె భావించి ఎంతో బాధపడింది. వెంటనే ఆమె వంటగది లోపలికి వెళ్లి, ఆ పోళీల తయారీలో ఉపయోగించిన ప్రతి పదార్థాన్నీ జాగ్రత్తగా పరిశీలించింది. కానీ తనకు ఎటువంటి పొరపాటు జరిగినట్లు తోచలేదు. ఆమె మనస్సు వికలమైపోయింది. తనలో తాను, "నేను ఎంతో ప్రేమతో, ఆనందంగా ఈ పూరణ్ పోళీలు చేశాను. అటువంటప్పుడు ఇది ఎలా జరిగింది? ఎందుకు ఈ గేదె చనిపోయింది? నేను దీనిని చంపలేదు, అయినప్పటికీ ప్రతి ఒక్కరూ దాని మరణానికి నన్ను బాధ్యురాలిని చేస్తారు. ప్రతి ఒక్కరూ ఏమనుకుంటారో, నా గురించి ఏం చెప్పుకుంటారో? నేను కేవలం బాబా ఆజ్ఞను అనుసరించాను. కానీ, ఈ గేదె ఎవరిదో ఆ యజమాని దీని గురించి తెలుసుకున్నప్పుడు అతను గేదెని నేను చంపానని అంటాడు. అందుకు తగిన పైకం ఆ యజమాని చెల్లించమంటే, ఎంత చెల్లించాల్సి వస్తుందో? ఒకవేళ అతను ఫిర్యాదును నమోదు చేస్తే ఏం చేయాలి? దాని ఫలితమేమిటి?" అని పరిపరివిధాల ఆలోచిస్తూ, "ఏది ఏమైనా బాబా ఈ విశ్వం యొక్క సృష్టికర్త. నేను కేవలం ఆయన ఆదేశాలను పాటించాను. చెడు  ఫలితమే ఎదురైనప్పటికీ ఆయన నన్ను క్షమిస్తారు" అని సమాధానపడింది. వెంటనే ఆమె బాబా వద్దకు వెళ్లి జరిగినదంతా వివరంగా చెప్పింది. 

బాబా, "ఆయీ, భయపడవద్దు. ఏం జరిగిందో అది మంచికే జరిగింది. ఇది ఎప్పటికైనా జరిగేదే. ఆ గేదెకు ఈ ఒక్క కోరిక(వాసన) మాత్రమే మిగిలిపోయింది. ఆ కోరిక తీరిన వెంటనే ఈ జన్మనుండి దానికి విముక్తి లభించింది. ఇప్పుడది మంచి పునర్జన్మను పొందుతుంది. నీచజన్మ నుండి దానిని విముక్తి చేసినందువల్ల నీవు విచారించనవసరం లేదు. గేదెజన్మ నుండి విముక్తి పొంది మంచిజన్మ ప్రాప్తిస్తున్నప్పుడు ఎందుకు బాధపడాలి? దానికి యజమాని అంటూ ఎవరూ లేరు. కాబట్టి ఎవరూ వచ్చి నిన్ను ప్రశ్నించరు. కాబట్టి నువ్వు భయంలేకుండా ఇంటికి వెళ్ళు" అని ఆమెను ఓదార్చారు. బాబా మాటలతో మనశ్శాంతి లభించగా ఆమె సంతోషంగా ఇంటికి వెళ్ళింది.

బాబా ఒకసారి తాయిబాయికి ఊరి బయట వేపచెట్టు ప్రక్కనున్న జాగా చూపి, “ఇది మా స్థలం. ఇక్కడొక భవనం లేస్తుంది. మేమక్కడే ఉంటాము. పెద్దలు నన్నక్కడ కనిపెట్టుకుని సేవలు చేస్తారు” అన్నారు. ఆమెకు ఆ మాటలు అర్థం కాలేదు. కానీ తర్వాత అదే స్థలంలో బూటీవాడా నిర్మాణం జరిగింది.

ఒకసారి తాయిబాయి అనారోగ్యం పాలైంది. బాబాపై ఉన్న విశ్వాసంతో ఆమె ఏ మందులూ తీసుకోలేదు. అయితే రోజులు గడుస్తున్నా అనారోగ్యం తగ్గుముఖం పట్టకపోయేసరికి ఆమె సహనం కోల్పోయి తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లాలని అనుకుంది. కానీ శిరిడీ నుండి బయలుదేరే సమయానికి హఠాత్తుగా ఆమెకు నయమై ఇక శిరిడీ విడిచి వెళ్లనవసరం లేకుండా పోయింది.

మరొకప్పుడు ఆమెకు కళ్ళ సమస్య వచ్చింది. ఆ వ్యాధి రోజురోజుకు పెరగసాగింది. ఇంటి వైద్యాలన్నీ చేసింది కానీ ఉపశమనం కలగలేదు. అప్పుడు ఆమె బాబాను ప్రార్థించింది. బాబా ఆమెకు ఒక ఔషధం చెప్పి, “ఈ ఔషధాన్ని ఎవరికీ చెప్పకు. ఏ వ్యాధిగ్రస్తుని కళ్ళలోనూ వేయకు” అని చాలా స్పష్టంగా ఆదేశించారు. ఆమె ఆ ఔషధాన్ని ఉపయోగించి వ్యాధినుండి స్వస్థత పొందింది.

ఒక్కమాటలో చెప్పాలంటే తాయిబాయి భక్తికి ప్రతిరూపంలా ఉండేది. ఆమె అంత గొప్ప భక్తురాలు. ఆమె బాబాను అత్యంత భక్తితో ఆరాధించేది. ఆమెకు 'గురువు' పట్ల ఉన్న ప్రేమ చాలా గొప్పది. బాబా సమాధి చెందిన తర్వాత ఆమె తనపై తాను నియంత్రణ కోల్పోయింది. శిరిడీ వీధులలో తిరుగుతూ తన గురువైన బాబా కోసం వెతుకుతూ ఉండేది. ఆమెకు చుట్టుప్రక్కల ధ్యాసే ఉండేది కాదు. ఆమె ముఖంపైన ఒక రకమైన శూన్యత కనిపించేది. చివరికి రెండు నెలలు గడిచాక ఆమె మరణించింది. అంతటి ప్రేమ ఆమెకు బాబాపై ఉండేది.

ఒకసారి పార్వని(పండగ వంటి) పవిత్రమైన సమయంలో బాపూసాహెబ్ జోగ్, అతని భార్య తాయిబాయి కోపర్గాఁవ్ వద్ద గంగలో స్నానం చేయాలని అనుకున్నారు (బాబా గోదావరి నదిని ‘గంగ’ అని పిలిచేవారు). మిగిలిన భక్తులు కూడా అదేవిధంగా అనుకున్నారు. బాబా అనుమతికోసం జోగ్ వెళ్ళగా, బాబా అతనితో, "బాపూసాహెబ్, బఘు త్యాచ విచార్ ఉద్యా సకాలి (బాపూసాహెబ్! చూడు, మనం దాని గురించి రేపు ఆలోచిద్దాం)" అని అన్నారు. అప్పుడు బాపూసాహెబ్, "బాబా! ఆ పవిత్రమైన ఘడియలు ఉదయం ఏడు గంటలకి. ఆ సమయానికల్లా మేము కోపర్గాఁవ్ చేరుకోవాలంటే వేకువఝామున సుమారు నాలుగుగంటలకే మేల్కొనవలసి ఉంటుంది" అని సమాధానమిచ్చాడు. అయితే బాబా మళ్ళీ అవే పదాలు పునరావృతం చేశారు. అనేకవిధాలుగా బాబాని జోగ్ వేడుకున్నాడు. కానీ బాబా, "రేపు చూస్తాం" అని మాత్రమే చెప్పారు. జోగ్, అతని భార్య చాలా నిరాశకు గురయ్యారు. అతడా నిరాశతో, "ఇలాంటి శుభసమయం జీవితకాలంలో ఒకసారి మాత్రమే వస్తుంది. ఈ ఫకీరుకి ఏమి తెలుస్తుంది దాని విలువ?" అని ఏదేదో అనేశాడు. ఏది ఏమైనా అతడు బాబాకు పరమభక్తుడు, ఆయన ఇష్టానికి వ్యతిరేకంగా నడుచుకోలేడు. బాధతో అతనికి ఆ రాత్రి నిద్రపట్టలేదు. 

ఉదయాన మామూలుగానే వెళ్లి బాబాకు ఆచారపూర్వకంగా కాకడఆరతి చేశాడు. ఇలా ఆరతి ముగిసిందో, లేదో అంతలోనే గ్రామస్థులు పరుగుపరుగున, “గంగానది నీటి ప్రవాహంతో కాలువలు నిండిపోతున్నాయి” అని అరుస్తూ వచ్చారు. బాబా జోగ్ వైపు చూస్తూ, "తూ సాగ్లి రథ్ లేయే శివే డిలేయాస్, పాన్ దేవచే దయ, గంగా ఆప్లాపాషి అలే. జా అత అన్గోలె కరుణ్ ఘేయే” (రాత్రంతా నన్ను నువ్వు నిందిస్తూ ఉన్నావు. కానీ దేవుని దయవలన గంగ మన దగ్గరకు వచ్చింది, ఇప్పుడు వెళ్ళి దానిలో మునగండి) అని అన్నారు. విషయమేమిటంటే, ఆరోజుల్లో గోదావరినది నుండి శిరిడీ వరకు ఒక కాలువ నిర్మాణం జరుగుతున్నది. నిజానికి ఆ పనులు పూర్తయి నీళ్ళు రావడానికి ఇంకా రెండు, మూడునెలల సమయం ఉంది. కానీ ఆనకట్ట తెగిపోవడం వలన గోదావరి నీళ్ళు సరిగ్గా సమయానికి శిరిడీ చేరాయి. బాపూసాహెబ్, అతని భార్య తాయిబాయి మరియు మిగిలిన గ్రామస్థులు ఆనందంతో గంగలో స్నానం చేశారు. బాపూసాహెబ్ కాలువలో ఉదయం, మధ్యాహ్నం రెండుపూటలా స్నానం చేశాడు. అతని సంతోషాన్ని చూస్తూ బాబా, "అరే బాపూసాహెబ్, దేవుడు ఎంత దయగలవాడో చూడు! కానీ మనం అతనిపై పూర్తి విశ్వాసాన్ని ఉంచము. మనమసలు 'సబూరి' కలిగివున్నామా? సబూరి అంటే చెదిరిపోని కేంద్రీకృతమైన విశ్వాసం” అని అన్నారు. ఈ విషయం గురించి తర్ఖడ్ తన స్మృతులలో ఇలా చెప్పాడు: “చీకట్లో అంతదూరం నడిచివెళ్ళే కష్టం మాకు కలగకుండా, మా కోరికను తీర్చడం కోసం ఆ గోదావరినే మా వద్దకు తీసుకువచ్చిన సద్గురుసాయి సమర్థతను తెలుసుకోకుండా మూర్ఖంగా ఆడిపోసుకున్నానని తరువాత రోజులలో జోగ్ వెక్కివెక్కి ఏడ్చేవాడు".

బాపూసాహెబ్ జోగ్ తల్లి శిరిడీలో మరణించింది. అందుకు సంబంధించిన కార్యక్రమాలను మతపరమైన అన్ని ఆచారాలతో నిర్వహించాలని అతడు అనుకున్నాడు. అతను తన జాతి బ్రాహ్మణులు శిరిడీలో అందుబాటులో లేనందున నాసిక్ వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. అతను బాబా వద్దకు వెళ్లి, ఆ తేదీలలో బ్రాహ్మణులు అందుబాటులో ఉంటారో, లేదో తెలుసుకోవడానికి నాసిక్ వెళ్ళడానికి అనుమతి కోరాడు. కానీ బాబా అనుమతించలేదు. అప్పుడక్కడే ఉన్న కాకాసాహెబ్ దీక్షిత్, "బాబా! మీరు, నేను మరియు బాపూసాహెబ్ కలిసి నాసిక్ వెళ్దాం. అక్కడ బాపూసాహెబ్ ని వదిలిపెట్టి, మనం బొంబాయి వెళ్దాం" అని అన్నాడు. అందుకు బాబా, "మీ కది కొన్నాల సూధర్ మనుష్ నాహి" (అర్థం: నేను ఎప్పుడూ, ఎవరినీ మధ్యలో విడిచిపెట్టే వ్యక్తిని కాదు) అని తన విలక్షణ పద్ధతిలో అసాధారణమైన సమాధానాన్ని ఇచ్చారు. ఇంతలో జోగ్, "బాబా! ఏం జరిగినా నేను ఈరోజు వెళ్ళాలి. ఇక్కడ నా కులం బ్రాహ్మణులు లేరు" అన్నాడు. బాబా అతనితో, "సాయంత్రం ఈ విషయాన్ని మనం నిర్ణయిద్దాం" అని అన్నారు. బాబా అలా చెప్పిన గంట లోపల జోగ్ కులానికి చెందిన వేద
బ్రాహ్మణుడు బాబా దర్శనార్థం శిరిడీ వచ్చాడు. బాబా అతనిని జోగ్ వద్దకు పంపారు. అతడు గొప్ప పండితుడు. ఊహించనిరీతిలో ఆ ప్రత్యేకమైన రోజున అతని రాకకు జోగ్ చాలా సంతోషించాడు. ఇక అతనికి నాసిక్ వెళ్ళాల్సిన అవసరమే లేకుండా పోయింది. తరువాత ఆ బ్రాహ్మణునితో సంతృప్తికరంగా వేడుకను జరిపించాడు జోగ్. చిన్న చిన్న విషయాల్లో కూడా భక్తుల అవసరాల పట్ల బాబా ఎంతో శ్రద్ధ వహిస్తారు.

జోగ్ చాలా సంవత్సరాలపాటు బాబాకి సేవ చేశాడు. అయినప్పటికీ అతని మనస్సు శాంతిని, సంతృప్తిని పొందలేదు. ఆధ్యాత్మికంగా అతనికి ఎదుగుదల కనపడలేదు. ఒకరోజు అతడు, "బాబా! రోజూ మీ సేవ చేస్తున్నప్పటికీ, మశీదులో, చావడిలో ఆరతులు ఇస్తూ పూజలు చేసినప్పటికీ నాకు మానసిక శాంతి లేదు. బాబా! మీ ఆశీస్సులు, మానసిక శాంతి నాకు ఎప్పుడు లభిస్తాయి? మీరు ఎప్పుడు నాకు సన్యాసం ఇస్తారు?" అని అడిగాడు. అప్పుడు బాబా, "బాపూసాహెబ్! పూర్వపు జన్మలలోని పాపకర్మ ఫలాలను అనుభవించటం పూర్తిచేయాలి" అని చెప్పారు. తర్వాత మళ్ళీ బాబా, "కోపాన్ని, కోరికలను జయించడం, సర్వబంధాల పట్ల నిర్లిప్తంగా ఉండటం అలవాటు చేసుకోవాలి. నీవు నీ లౌకిక బాధ్యతల నుండి విముక్తుడవై, భిక్షువై జీవించాలి. అప్పుడు మాత్రమే నా ఆశీర్వాదానికి అర్హుడవవుతావు. అప్పుడే శాశ్వతమైన శాంతి సాధించగలవు" అని చెప్పారు.

బాబా మహాసమాధి చెందిన రెండునెలలకే భార్య మరణించడంతో ఉన్న ఆ ఒక్క బంధం నుండి కూడా విముక్తుడయ్యాడు జోగ్. దాంతో అతనికి ప్రాపంచిక విషయాలపట్ల ఆసక్తిపోయి వైరాగ్యం పెంపొందింది. తరువాత అతను సన్యాసం తీసుకుని, జీవనం కోసం కావలసిన ఆహారాన్ని భిక్షమెత్తుకునేవాడు. కొన్ని సంవత్సరాలపాటు శిరిడీలో ఉంటూ బాబా యొక్క సమాధికి సేవలు చేసుకున్నాడు. కాకాసాహెబ్ దీక్షిత్ మరణానంతరం ఇతర భక్తులు శిరిడీని విడిచిపెట్టారు. ఒంటరితనాన్ని భరించలేక బాపూసాహెబ్ సాకోరి వెళ్లి ఉపసానీబాబాకు శిష్యునిగా మారాడు. బాబాకు చేసిన విధంగానే భక్తితో ఉపాసనీని సేవించుకునేవాడు. బాబా చెప్పిన ప్రకారమే కాలక్రమంలో అతను పూర్తిగా లౌకిక బంధాలనుండి స్వేచ్ఛను పొంది, ఆధ్యాత్మిక ఆనందాన్ని అనుభవిస్తూ 1926లో తన 70 సంవత్సరాల వయస్సులో శాంతియుతంగా మరణించాడు.

బాపూసాహెబ్ జోగ్ సమాధి చెందడానికి ఆరునెలలముందు ఒక సంఘటన జరిగింది. కాకాసాహెబ్ దీక్షిత్ 1926లో జ్యేష్ఠమాసం ఏకాదశి రోజున సమాధి చెందాడు. సరిగ్గా ఆరునెలల తరువాత బాపూసాహెబ్ సమాధి చెందాడు. ఈ విషయమై ఒక భక్తునికొక స్పష్టమైన కల వచ్చింది. ఆ కలలో బాబా ముందు కొంతమంది భక్తులు కూర్చొని ఉన్నారు. ఆ భక్తులు కళ్ళు తెరచి చూస్తూ ఉన్నారు. అక్కడే కూర్చుని ఉన్న కాకాసాహెబ్ దీక్షిత్ కళ్ళు మూసుకుని ధ్యానంలో ఉన్నారు. అతని ప్రక్కన ఒక ఖాళీ స్థలం ఉంది. కలలోనే ఆ భక్తుడు, "బాబా! ఎందుకు కాకా ప్రక్కన స్థలం ఖాళీగా ఉంది? అతనెందుకు కళ్ళు మూసుకుని ఉన్నాడు?" అని అడిగాడు. అప్పుడు బాబా, "దీక్షిత్ కొత్తగా వచ్చినవాడు, ఆ ఖాళీ స్థలం ఆరునెలల తరువాత రానున్న మరొక ప్రియమైన భక్తుడికోసం కేటాయించబడింది" అని సమాధానమిచ్చారు. ఈవిధంగా జోగ్ మరణాన్ని బాబా ముందే సూచించారు. బాపుసాహెబ్ జోగ్ సమాధి సాకోరిలో ఉపాసనీ ఆశ్రమం ముందు ఉంది.

సాకోరిలో ఉన్న జోగ్ సమాధి

సమాప్తం.


3 comments:

  1. Om Sai Ram 🙏🌹🙏
    ఓం శ్రీ సాయినాథాయ నమః 🙏
    ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః🙏

    ReplyDelete
  2. Om Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🙏😊❤🕉

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo