సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1815వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. సరైన సమయానికి ఆలోచననిచ్చి పెద్ద సమస్య కాకుండా కాపాడిన బాబా
2. సాయికి చెప్పుకుంటే తీరిన సమస్య

సరైన సమయానికి ఆలోచననిచ్చి పెద్ద సమస్య కాకుండా కాపాడిన బాబా


సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!


సాయిభక్తులందరికీ నమస్కారం. నా పేరు సుగుణ. నేను నా అర్హతలకి తగ్గ ఉద్యోగం వెతుక్కుందామని హైదరాబాద్ వెళ్ళాను. ఆ ఉద్యోగం వచ్చేలోపు బాబా నాకు ఒక చిన్న ఉద్యోగాన్ని చూపించి, తద్వారా వచ్చే డబ్బుతో ఎవరి మీద ఆధారపడకుండా నా పిల్లల స్కూల్ ఫీజులు, వాళ్ళ ఇతర అవసరాలు, అలాగే నా అవసరాలు తీర్చుకుంటూ నా బాధ్యతలన్నీ నెరవేర్చుకునేలా అనుగ్రహించారు. అందుకు ధన్యవాదాలు బాబా. ఇకపోతే, నా పిల్లలు మా అమ్మవాళ్ళ దగ్గరుండి చదువుకుంటున్నారు. 2024, ఫిబ్రవరిలో ఐదేళ్లు ఉన్న మా చిన్నబాబుకి రాత్రి నిద్రలో జ్వరం వచ్చింది. అమ్మ జ్వరం సిరప్ వేస్తే, జ్వరం తగ్గిందికానీ భయంతో రాత్రంతా నిద్రలో ఏడుస్తూనే ఉన్నాడు. ఉదయం టిఫిన్ కూడా సరిగా తినలేదు. నీరసంగా ఉన్నందున బాబుని ఆరోజు స్కూలుకి పంపలేదు. మధ్యాహ్నానికి మళ్ళీ జ్వరం రావడంతో అమ్మ బాబుని హాస్పిటల్‌కి తీసుకెళితే డాక్టరు మందులిచ్చారు. ఆ మందులు వాడుతున్నా బాబుకి జ్వరం తగ్గడం, మళ్ళీ రావడం జరుగుతుండేది. అప్పుడు నాకు, 'ఎందుకన్నా మంచిది. ఒకసారి నేను వెళ్తే, బాబుకి బెంగ ఏమన్నా ఉంటే పోతుంది' అనిపించి హఠాత్తుగా టికెట్ తీసుకొని అమ్మ వాళ్ళింటికి వెళ్ళాను. నేను వెళ్లేసరికి బాబుకి జ్వరం లేదు, బాగానే ఉన్నాడు. దాంతో రెండు రోజుల తర్వాత నేను రైలు టికెట్ తీసుకోవాలా, వద్దా అని ఆలోచించినప్పటికీ మళ్ళీ వద్దులే, ఇంకో 2 రోజులు ఇక్కడ ఉందామని టిక్కెట్టు తీసుకోలేదు. అదేరోజు మధ్యాహ్నం బాబుకి మళ్ళీ జ్వరం వచ్చింది. సిరప్ వేస్తే తగ్గిందికానీ, ఒకసారి రక్తపరీక్ష చేయిస్తే మంచిదనే ఆలోచన నాకు వచ్చింది. ఆ ఆలోచన నాకొచ్చిందనే కంటే బాబా ఇచ్చారు అనడం సబబుగా ఉంటుంది. విషయం అమ్మతో చెప్తే, "సరే, బాబుని హాస్పిటల్‌కి తీసుకెళదాం" అంది. అయితే ఆరోజు మంగళవారం అయినందున పిల్లల హాస్పటల్‌కి సెలవు ఉంటుంది. అయినా ఎందుకైనా మంచిదని ఒకసారి హాస్పిటల్‌కి కాల్ చేస్తే, "ఈ రోజు హాస్పిటల్ ఓపెన్ ఉంది. డాక్టరు ఇప్పుడు 1:30 నుండి 3:30 వరకు ఓపీ చూస్తారు. మీరు 3, 3.30 లోపు రండి" అని చెప్పారు. వాళ్ళు చెప్పిన సమయానికి బాబుని తీసుకుని నేను, అమ్మ హాస్పిటల్‌కి వెళ్లి కన్సల్టెంట్ స్లిప్ వ్రాయించాను. 5 నిమిషాల్లోనే నన్ను పిలిచారు. అసలు ఆ హాస్పిటల్లో చాలా సమయం వెయిట్ చేయాలి. లోపలికి వెళ్ళిన తర్వాత డాక్టరు బాబుని చెక్ చేసి, నేను అడగకముందే "ఒకసారి బ్లడ్ టెస్ట్ చెపిద్దాం అమ్మా" అన్నారు. సరేనని అక్కడే టెస్ట్ చేయిస్తే ఒక గంటలో రిపోర్ట్ వచ్చింది. అందులో బ్లడ్ ఇన్ఫెక్షన్ ఉన్నట్టు ఉంది. బాబుకి సంవత్సరంన్నర వయసున్నప్పుడు కూడా ఇలానే బ్లడ్ ఇన్ఫెక్షన్ ఉంటే ఇదే హాస్పిటల్లో 3 రోజులు ఉన్నాం. ఇప్పుడు కూడా ఎవరో పిల్లలిద్దరు అదే సమస్య కారణంగా హాస్పిటల్‌లో అడ్మిట్ అయి చికిత్స తీసుకోవడం నేను చూశాను. అందువల్ల, 'మేము కూడా హాస్పిటల్‌లో ఉండాలా ఏంటి?' అని అనుకోసాగాను. కానీ మనసులో ఎక్కడో, 'లేదు. ఉండవలసిన అవసరం లేకుండా మన బాబా చూస్తారు' అనిపించింది. సరే, రిపోర్ట్ తీసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్తే, నా మనసుకి అనిపించినట్లే, 'హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సిన అవసరం లేకుండా కొన్ని యాంటీబయాటిక్స్ ఇచ్చి, రెండు రోజులు వాడి రమ్మన్నారు'. డాక్టర్ చెప్పినట్టు 2 రోజులు ఆ మందులు వాడాక మళ్ళీ హాస్పిటల్‌కి వెళ్తే, "ఇప్పుడు బాగానే ఉంది" అని మల్టీవిటమిన్ సిరప్ వ్రాసారు. చూసారా! మన బాబా దయతో  సమస్య పెద్దది కాకుండా మొదటిలోనే పరీక్ష చేయించాలనే ఆలోచన నాకిచ్చి నా బాబు ఆరోగ్యం బాగుండేలా చేసారు. "చాలా చాలా ధన్యవాదాలు సాయితండ్రీ. ఎప్పుడూ ఇలాగే నా బిడ్డలని, కుటుంబసభ్యులని చల్లగా చూడు తండ్రీ. నా చేయి ఎప్పుడూ వదలకుండా మీపై మరింత భక్తి ధృడపరుచు తండ్రీ".


సాయికి చెప్పుకుంటే తీరిన సమస్య


సాయి భక్తులకు నమస్కారం. నా పేరు రఘునాథ్. ఎక్కడ ఉన్నా, ఎంత దూరాన ఉన్నా నా వారిని పిచ్చుక కాలికి దారం కట్టి నా దగ్గరకి లాక్కుంటానని చెప్పినా విధంగా సాయి నన్ను తన భక్తుడిగా చేసుకున్నారు. 2024, ఫిబ్రవరి నెల మొదటి వారం నుండి 40 రోజులపాటు నా చెవిలో ఏదో ఉన్నట్టుండి చాలా ఇబ్బంది పడ్డాను. చివరికి డాక్టర్ వద్దకు వెళ్ళాలనుకుంటూ సాయి భక్తుల అనుభవాలు చదివాను. అలా చదువుతున్న సమయంలో, "నా చెవి సమస్య తగ్గితే, మీ అనుగ్రహాన్ని తోటి సాయి భక్తులతో పంచుకుంటాన"ని సాయికి చెప్పుకున్నాను. ఆ మరుసటిరోజు సాయంత్రం స్నానం చేసిన తర్వాత ఇయర్ బడ్ చెవిలో పెట్టుకున్నాను. దాన్ని తిరిగి బయటకి తీసే క్రమంలో అదివరకు ఎప్పుడో నా చెవిలో ఉండిపోయిన ఇయర్ బడ్ తాలూకు దూది బయటకు వచ్చింది. నేను ప్రతిరోజూ ఇయర్ బడ్ ఉపయోగిస్తున్నప్పటికీ 40 రోజులుగా నన్ను ఇబ్బందిపెడుతున్న ఆ దూది బయటకి రాలేదు. సాయికి చెప్పుకున్నాకనే ఆయన దయతో ఆ దూది బయటకు వచ్చి సమస్య తీరింది. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".


సాయిభక్తుల అనుభవమాలిక 1814వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. సంపూర్ణ విశ్వాసముంటే ఏ సమస్యనైనా పరిష్కరిస్తారు బాబా
2. ప్రతి కష్టంలో బాబా చేయూతనివ్వడం మన అదృష్టం

సంపూర్ణ విశ్వాసముంటే ఏ సమస్యనైనా పరిష్కరిస్తారు బాబా


ఓంసాయి శ్రీసాయి జయజయసాయి. నేను ఒక సాయి భక్తురాలిని. నేను ప్రతిరోజూ ఠంచనుగా సాయి పూజ చేస్తాను. కాని నా పూజలో, ప్రార్ధనలో ఏదో వెలితి ఉన్నట్లు నాకు అనిపించేది. అవసరార్దం తప్ప మనఃస్పూర్తిగా నేను సాయిని కొలవటం లేదనేది నా మనస్సాక్షికి తెలిసేది. ఎంత ప్రయత్నించినా పూజ చేస్తున్న సమయంలో నా మనసును పలురకాల ఆలోచనలు చుట్టుముట్టేవి. బలవంతంగా మనసును పూజ వైపుకు మరలించుకునేదాన్ని. బాబాతో నా పరిస్థితి చెప్పుకొని, "నాపై దయతలచి నా మనసు మీ పాదాల చెంత ప్రతిక్షణం నిలిచేలా అనుగ్రహించండి" అని ప్రార్థిస్తూ ఉండేదాన్ని. ఆయన చంచలమైన మనసుతో నేను చేసే పూజను స్వీకరించి ఎన్నో దారుణమైన పరిస్థితుల నుండి నన్ను, నా కుటుంబాన్ని పలుమార్లు కాపాడారు. అయినా నాలాంటి అజ్ఞాని దృష్టి దృఢంగా ఆయనపై నిలిచేది కాదు. ఒకరోజు బాబా సందేశాన్ని అనుసరించి నేను సచ్చరిత్ర సప్తాహ పారాయణం మొదలుపెడుతూ, "నన్ను కనికరించి నా మనసును మీ ఆధీనంలో ఉంచుకొని నాతో పారాయణం చేయించండి" అని బాబాను ప్రార్థించి పారాయణ సాగించాను. బాబా దయతో మొదటిరోజు నుండి నా మనసులో ఎలాంటి ఆందోళనలు లేకుండా నాకు తృప్తినిచ్చే విధంగా పారాయణ ప్రశాంతంగా జరిగింది. అంతకుముందు నేను ఎన్నోసార్లు చేసిన పారాయణకు ఆసారి మనసుపెట్టి చేసిన పారాయణకు చాలా వ్యత్యాసముంది. సోమవారంనాడు పారాయణ పూర్తయ్యాక కోర్టు వ్యవహారార్థం అత్యవసరంగా నా లాయరును కలవాల్సి వచ్చింది. ఆ లాయరు సంవత్సరం క్రితం పూర్తి చేయాల్సిన నా కేసును నా పరిస్థితి వివరిస్తున్న కూడా అకారణంగా వాయిదా వేస్తూ వచ్చాడు. ఆరోజు ఎలాగైనా ఆ లాయర్ని కలిసి కేసు విషయం మాట్లాడాలన్న నిశ్చయంతో నేను ప్రయాణమయ్యాను. దారి పొడవునా ఎటువంటి సంశయాలు, వత్తిడి లేని నిండు మనసుతో ఆరోజు సచ్చరిత్రలో చదివిన విషయాలను మననం చేసుకుంటూ లాయర్ ఆఫీసుకు చేరుకున్నాను. అక్కడ ఆఫీసు తలుపులు తెరిచే వున్నాయి గాని లాయర్ కానీ, అతని స్టాఫ్ కానీ అందుబాటులో లేరు. అప్పటికి నెల రోజుల ముందు నుండి నాకు అదే పరిస్థితి ఎదురవుతుంది. అయినప్పటికీ ఆరోజు ఎలాగైనా నేను లాయరును కలవాలనుకున్నాను. అందుచేత అక్కడ ఎవరూ లేకపోయినా లైట్లు వేసి, తలుపులు తెరిచి ఉన్నందున వాళ్ళు వస్తారన్నా ఆశతో అక్కడే సుమారు రెండు గంటలు వేచి వున్నాను. కానీ ఎవరూ రాలేదు. కనీసం ఫోన్‌‌లో మాట్లాడదామని ప్రయత్నించినా నా ఫోన్ కాల్‌కి ఆన్సర్ చేయలేదు. చివరికి నేను బాబాను, 'ఇంకా అక్కడే వుండనా? లేదా తిరిగి వెళ్లనా?' అని అడిగితే, 'వెళ్ళమ'ని సమాధానం వచ్చింది. దాంతో మరుసటిరోజు ప్రయత్నిద్దామని నేను అక్కడి నుండి బయలుదేరాను. దారిలో నాకు కావలసిన పండ్లు కొందామని ఒక సూపర్ మార్కెట్‌కు వెళ్ళి, తిరిగొచ్చి కారు ఎక్కగానే నా ఫోన్‌కు లాయర్ వద్ద నుండి మెసేజ్ వచ్చింది. నా కేసు వాయిదా కోర్టులో మరుసటిరోజు వుందన్నది దాని సారాంశం. నా పరిస్థితికి దయతలిచి వెంటనే పని జరిగే విధంగా అనుగ్రహించిన నా తల్లి, తండ్రి, తోబుట్టువు, గురువు, దైవం అన్నీ అయిన నా బాబాకు నిండు మనసుతో కృతజ్ఞతలు తెలుపుకున్నాను. సంపూర్ణమైన విశ్వాసంతో ధర్మబద్ధమైన ఏ కోరిక కోరినా ఆ తండ్రి అనుగ్రహించడానికి ఆత్రుతపడతారని ఈ అనుభవం వల్ల మరోసారి నాకు ఋజువైంది.


ఒకరోజు విపరీతమైన పని ఒత్తిడి వల్ల ఆ రాత్రంతా నాకు నిద్రపట్టలేదు. ఆ కారణంగా మరుసటిరోజు నేను చాలా అలసటగా వున్నాను. అయినా బయటకు వెళ్ళక తప్పని పరిస్థితి ఉండటంతో బాబా కథలను గుర్తు చేసుకుంటూ, ఆయన నామాన్ని జపిస్తూ ఎలాగో ప్రయాణం సాగించాను. తీరా అంత కష్టపడి వెళితే నేను వెళ్లిన పని మరుసటిరోజుకు వాయిదా పడింది. 'అయ్యో..' అనుకుంటూ 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగు తెరిస్తే, “నా మందిరంలో కూర్చొని నా హారతి చూడు తల్లీ' అని కనిపించింది. అప్పటికి నేను వెళ్ళిన ప్రదేశం నుండి నేనింకా తిరిగి ఇంటికి బయలుదేరలేదు. అక్కడున్న మిగతా పనులు చూసుకొని ఒక గంట తరువాత తిరిగి ఇంటికి వస్తూ, దారిలో వున్న బాబా మందిరం సమీపంలోకి రాగానే సుమారుగా రాత్రి 8.30 గంటలప్పుడు సాయంత్రం బ్లాగులో చదివిన పై మెసేజ్ గుర్తొచ్చింది. ఇప్పుడు గుడి తెరిచి ఉందో, లేదో అని సందేహిస్తూనే గుడి దగ్గరకి వెళ్ళాను. గుడి తెరిచి ఉంది. లోపల ఇద్దరు వ్యక్తులు మాత్రమే వున్నారు. త్వరత్వరగా వెళ్ళి బాబా దర్శనం చేసుకొని మందిరం మూసే సమయమేమోనని తొందరగా తిరిగి వచ్చేయబోతుండగా పూజారి, "అమ్మా! బాబా హారతి సమయమైంది. మీకు యిష్టమైతే అది అయ్యేవరకు వుండమ"ని అన్నారు. నేను సంతోషంగా హారతిలో పాల్గొన్నాను. శ్రీసాయి హారతి చూడమని ఆదేశించటమే కాదు, చూసే అవకాశం కూడా కల్పించారు. ఆయన లీలలు ఎన్ని చెప్పినా తక్కువే. వాయిదాపడిన నా పని 2 రోజుల తరువాత నేను అనుకున్నదానికంటే చాలా బాగా పూర్తయింది. "సాయి ప్రభూ! ఎప్పటికీ మీ అనుగ్రహం సాయి భక్తులందరిపై ఇలాగే వుండాలని కోరుకుంటూ మీకు కోటి వందనాలు తండ్రీ".


సమర్ధ సద్గురు శ్రీసాయినాథార్పణమస్తు!!!


ప్రతి కష్టంలో బాబా చేయూతనివ్వడం మన అదృష్టం


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి అనంత్ కోటి పాదాభివందనాలు. సాయిబంధువులకు నమస్కారాలు. నా పేరు ప్రసన్న. నేను హైదరాబాద్ నివాసిని. నాకు సాయే తల్లి, తండ్రి, గురువు, దైవం, సమస్తం. 2024, మార్చి నెల రెండో వారంలో ఒకరోజు మా చెల్లి చాలా టెన్షన్ పడుతూ మా ఇంటికి వచ్చింది. విషయమేమిటని అడిగితే, "ఇంట్లో చాలా వాదులాటలు జరుగుతున్నాయి" అని చెప్పింది. ఆ కారణంగా తన ఆరోగ్యం కూడా కాస్త చెడింది. తను ఆరోజు సాయంత్రం వరకు మా ఇంటిలో ఉండి వెళ్ళింది. తను వెళ్ళాక నేను 2-3 సార్లు ఫోన్ చేస్తే, తను చాలా క్లుప్తంగా మాట్లాడింది. నాకు చాలా టెన్షన్‌గా అనిపించి, "బాబా! చెల్లి వాళ్ళింట్లో అంతా సాధారణ స్థితికి రావాలి. తను నాకు ఫోన్ చేయాలి" అని సాయినాథుని వేడుకొని ఆ రాత్రి పడుకున్నాను. మరుసటిరోజు మా చెల్లి ఫోన్ చేసి చాలా బాగా మాట్లాడింది. సాయి ప్రేమ అనంతం, అక్షయం. ఆయన కరుణ అపారం. ప్రతి కష్టం, సమస్యలో ఆయన మనకి చేయూతనివ్వడం మన అదృష్టం. సాయి లేని జీవితం అసలు ఊహించలేము. "ధన్యవాదాలు బాబా. మీ కృపాకటాక్షాలు అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను తండ్రీ".


సాయిభక్తుల అనుభవమాలిక 1813వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా దయతో చేకూరిన ఆరోగ్యం
2. ప్రతిక్షణం నీడలా కాపాడిన సాయి

బాబా దయతో చేకూరిన ఆరోగ్యం


సాయిభక్తులకు నమస్కారాలు. నా పేరు మహేష్. నా ఆరోగ్యం అంతగా బాగుండదు. నాకు మొత్తం నాలుగుసార్లు సర్జరీ జరిగగా 2022 ఏప్రిల్‌లో నాలుగోసారి చాలా పెద్ద సర్జరీ జరిగింది. ఒక 10 రోజుల తరువాత నేను డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చాను. కానీ ఇంటికి వచ్చిన తర్వాత కుట్లు వేసిన వద్ద చీము పట్టి, చీట్లి చాలా రక్తం పోయింది. అలా రెండుసార్లు జరిగింది. మొదటిసారి జరిగినప్పుడు నేను 10 రోజులు హాస్పిటల్లో ఉన్నాను. అప్పుడు కనీసం బాబాను వేడుకుందామన్న ఆలోచన కూడా నా మనసులోకి రాలేదు(మొదట్లో నేను సాయిని అంతగా నమ్మేవాడిని కాదు). రెండోసారి అదే సమస్య వచ్చినప్పుడు నేను మళ్ళీ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను. డాక్టర్ కంగారుపడి నాకు రక్తం ఎక్కించారు. అప్పటికి మా దగ్గర వున్న డబ్బులు అయిపోయాయి. ఇన్సూరెన్స్ లిమిట్ కూడా అయిపోయింది, మొత్తం వాడేసుకున్నాము. రెండు రోజుల తర్వాత నాకు బాబా గుర్తొచ్చారు. ఆయన నా మనసులోకి  వచ్చిన వెంటనే, "నన్ను సురక్షితంగా ఇంటికి చేర్చండి బాబా. అలా అయితే శిరిడీ మరియు అరుణాచలం దర్శిస్తాను" అని నమస్కారం చేసాను. అద్భుతం! అరగంటలో నేను నెమ్మదిగా కోలుకోవటం మొదలుపెట్టాను. అలాగే లేదనుకున్న ఇన్సూరెన్స్ కూడా ఓకే అయ్యింది. నేను క్షేమంగా ఇంటికి వచ్చాను. సాయికి చెప్పుకున్నట్టుగానే శిరిడీ వెళ్లి బాబా దర్శనం చేసుకున్నాను. కాని ఇంతవరకు అరుణాచలం వెళ్లలేకపోయాను.


ఇకపోతే, సర్జరీ జరిగినప్పటి నుండి నాకు కడుపునొప్పి తరచూ వస్తుంది. అయితే ఒక మాత్ర వేసుకుంటే చాలు, ఒక్క పూటలో తగ్గిపోయేది. కానీ ఈమధ్య ఒకసారి నాకు కడుపునొప్పి తట్టుకోలేనంతగా వచ్చి ఇంజక్షన్ చేయించుకున్నా కూడా తగ్గలేదు. పైగా ఇంకా పెరిగింది. 2 గంటల తర్వాత మరోసారి ఇంజక్షన్ చేయించుకొని ఇంటికి వచ్చాక, "నొప్పి తగ్గేలా చేయమ"ని బాబాకి నమస్కరించుకున్నాను. ఆశ్చర్యం! వెంటనే నొప్పి తగ్గడం మొదలై 5 నిమిషాలలో పూర్తిగా తగ్గిపోయింది. ఇప్పుడు నా ఆరోగ్యానికి తగ్గట్టు మంచి జీతంతో, నేను చేయగలిగే మంచి ఉద్యోగం ఇవ్వమని, నా ఆరోగ్యం మంచిగా ఉండేలా చూడామని సాయిని వేడుకుంటున్నాను. అందుకు తగ్గట్టు ఏదో ఒక రూపంలో బాబా నాకు, "నేను నీకు ఏది మంచిదో అది చేస్తాను. త్వరలో నువ్వు అనుకున్నది ఇస్తాను" వంటి సానుకూల సందేశాలు పంపిస్తూ ఉన్నారు. "ధన్యవాదాలు బాబా. నేను కోరుకున్నట్టు మంచి జీతంతో ఉద్యోగం వచ్చి ఆరోగ్యంగా ఉద్యోగం చేసుకునేలా దీవించు తండ్రీ".


ప్రతిక్షణం నీడలా కాపాడిన సాయి

  

సాయిబంధువులందరికీ నమస్కారం. నా పేరు అపర్ణ. ఈ మధ్య మా అబ్బాయి తన ప్రాజెక్ట్ పని మీద పూణే వెళ్ళవలసి వచ్చింది. బాబా దయవల్ల మంచి అవకాశం లభించిందని మా అబ్బాయి పూణే నుండి శిరిడీ వెళ్ళడానికి కూడా రిజర్వేషన్ చేసుకున్నాడు. బాబా వద్దకు వెళ్లడం కంటే మించిన ఆనందం ఏముంటుందని నాకు చాలా సంతోషమేసింది. ఇకపోతే, మా అబ్బాయివాళ్ళ గైడ్ పూణే నగరంలో ఉన్న ఒక కాలేజీ హాస్టల్లో వసతి ఏర్పాటు చేశారు. అంతా బాగుందనుకున్నాము. కానీ ప్రయాణానికి ఇంకా పది రోజులు ఉందనగా ఆ వసతి సౌకర్యం రద్దు అయింది. మాకు చాలా కంగారుగా అనిపించింది. కానీ, 'బాబా ఉన్నారు. అన్ని ఆయనే చూసుకుంటార'ని నేను భారం ఆయనపై వేసి ఊరుకున్నాను. తర్వాత నా భర్తకి మాకున్న ఇస్కాన్ లైఫ్ మెంబర్షిప్ గుర్తొచ్చి పూణే ఇస్కాన్ సభ్యులతో మాట్లాడారు. వాళ్ళు మొదట, "కార్డ్ హోల్డర్ లేకుండా కుటుంబసభ్యులైనా సరే అనుమతించమ"ని అన్నారు. కానీ రిక్వెస్ట్ చేస్తే ఒప్పుకున్నారు. అలా మా అబ్బాయి వసతి సమస్య బాబా తీర్చారు.  తర్వాత మా అబ్బాయి ముందుగా పూణే వెళ్లి, అక్కడ పని పూర్తైన తర్వాత శిరిడీ వెళ్లి, అక్కడ మూడు రోజులుండి రోజుకు రెండుసార్లు బాబా దర్శనం చేసుకున్నాడు. బాబా తమ హారతి దర్శనం కూడా తనకి అనుగ్రహించారు. అలా మూడురోజులు మా అబ్బాయి శిరిడీలో బాబా సన్నిధిలో ఎంతో సంతోషంగా గడిపాడు. శిరిడీ నుండి మా ఊరు(రాజమండ్రి) వచ్చే ట్రైన్ టికెట్లు చివరి రోజు ఉదయం వరకు వెయిటింగ్ లిస్ట్‌లోనే ఉండేసరికి నేను, "బాబా! మీరే కాపాడాలి" అని బాబాకి దణ్ణం పెట్టుకున్నాను. ఆ రోజు మధ్యాహ్నం చార్ట్ ప్రిపరేషన్ అయ్యాక చూసుకుంటే, బాబా దయవల్ల టికెట్లు కన్ఫర్మ్ అయ్యాయి. అలా సాయి తన బిడ్డల్ని ఎల్లప్పుడూ రక్షిస్తానని నిరూపించారు. అప్పుడు నా ఆనందానికి అవధులు లేవు. మా అబ్బాయికిగానీ, తనతో ఉన్న తన స్నేహితులకిగానీ హిందీ అస్సలు రాకపోయినప్పటికీ బాబా దయవల్ల ఏ ఇబ్బంది లేకుండా పూణే, శిరిడీ వెళ్లి క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చారు. నా కోరిక ప్రకారం మా అబ్బాయి 'సాయి సచ్చరిత్ర' పుస్తకం బాబా సమాధికి తాకించి, దానితోపాటు ఊదీ, పువ్వులు, బాబా ప్రతిమను నాకు ప్రసాదంగా తీసుకొచ్చాడు. అలా బాబా నాకు ఎంతో సంతోషాన్ని ప్రసాదించారు. మేము లేకుండా అంత దూరం వెళ్లడం మా అబ్బాయికి అదే మొదటిసారి. అయినా బాబా నిత్యం తనతోనే ఉండి తనని కాపాడుతారన్న దృఢ నమ్మకంతో భాష రాకపోయినా భయపడకుండా వెళ్ళాడు. అలాగే ప్రతిక్షణం సాయి వాడిని నీడలా కాపాడారు. "ధన్యవాదాలు బాబా".


చివరిగా సాయిభక్తులందరికీ ఒక మనవి: 'ఎల్లప్పుడూ శ్రద్ధ-సబూరీతో ఉండండి. మన సాయి నిత్యం మనల్ని రక్షిస్తుంటారు'.


ఓం సాయి రక్షక శరణం దేవ!!!


సాయిభక్తుల అనుభవమాలిక 1812వ భాగం....


ఈ భాగంలో అనుభవం:

  • శ్రీసాయి కృపాశీస్సులు

అందరికీ నమస్కారం. నాపేరు హాసిని. నా ఫోన్ ఎప్పుడూ హ్యాంగ్ అయి దానంతట అదే స్విచ్ ఆఫ్ అయిపోతూ ఉంటుంది. అలా ఎప్పుడు జరిగినా నేను బాబా ఊదీ ఫోన్‌కి పెట్టి 'ఓం సాయిరాం' అని అనుకుంటాను. బాబా ఊదీ పెట్టాక ఫోన్ పని చేయకుండా ఉంటుందా? వెంటనే ఆన్ అయ్యేది. ఇలా చాలాసార్లు జరిగింది. ఒకరోజు బాబా గుడికి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. అప్పుడు నేను నా నుదిటిపై ఉన్న ఊదీని ఫోన్‌కి తాకించి, "బాబా! ఫోన్ ఆన్ అవ్వాలి" అని అనుకున్నాను. వెంటనే ఆన్ అయింది. ఇంకోసారి రీఛార్జ్ చేస్తుంటే మధ్యలో ఫోన్ ఆగిపోయింది. అప్పుడు కూడా నేను బాబా ఊదీ పెట్టి, 'ఓం సాయిరామ్' అని అన్నాను. బాబా దయవల్ల ఫోన్ ఆన్ అయింది.


ఒకసారి మా అమ్మ నీరసంగా అయిపోతే నీళ్లలో బాబా ఊదీ కలిపి కొన్ని రోజులపాటు ఇచ్చాను. అప్పటినుండి మళ్ళీ ఇప్పటివరకు మా అమ్మకి మళ్లీ నీరసం అన్నది తెలీలేదు.


మా అమ్మ నాకు ఎప్పుడు డబ్బులు ఇచ్చినా నేను ఎక్కడో ఒక దగ్గర పెట్టి మార్చిపోతుంటాను. అలాగే ఈమధ్య ఒకరోజు మర్చిపోయినప్పుడు, "బాబా! నా డబ్బు దొరికేలా చేయండి" అని బాబాను అడిగి, ఆ విషయం అంతటితో మార్చిపోయాను. కానీ మన బాబా మార్చిపోరు కదా! ఒకరోజు నేను రోజూ కూర్చునే చోటే ఒక పుస్తకం కింద ఆ 400 రూపాయలు దొరికాయి. అలాగే బాబా దయవల్ల ఇంకోరోజు ఎక్కడో పెట్టి మర్చిపోయిన పోస్ట్ ఆఫీస్ పుస్తకం దొరికింది. 4 నెలల క్రితం నేను నా మార్కుల షీట్ ఎక్కడో పెట్టి మర్చిపోయాను. సరే, చూద్దాంలే అని వాటిని వెతకకుండా ఆలస్యం చేసాను. చివరికి ఒకరోజు, "బాబా! నా మార్కుల షీట్ కనిపించేలా చూడండి. మీకు పాలాభిషేకం చేస్తాను" అని బాబాకి మొక్కుకున్నాను. బాబాకి చెప్పుకున్నాక మనం ఇంకా భయపడాల్సిన పని లేదు కదా! నా మార్కుల షీట్ దొరికేసింది. ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, 'ఇక్కడ ఉంది చూడు, ఇక్కడ పెట్టి మార్చిపోయావు' అని బాబానే మనకు తెలియజేస్తారు.


ఒక బుధవారంనాడు నా స్నేహితురాలు తన బుక్స్ నాకు ఇస్తానని అంది. కానీ, మళ్ళీ ఇవ్వడానికి సందేహపడింది. అప్పుడు నేను, "బాబా! నా స్నేహితురాలికి ఆ బుక్స్ అవసరం లేదు. తను ఆ బుక్స్ నాకు ఇచ్చేలా చేయండి. ఎందుకంటే, నేను ఇప్పటికి ఇప్పుడు ఆ బుక్స్ కొనలేను. అంత డబ్బు అంటే నాకు కష్టం" అని బాబాతో చెప్పుకున్నాను. ఆ మరుసటిరోజు గురువారం. ఆరోజు నేను బాబాని ఒక్కటే అడిగాను: "బాబా! మా జీవితాలు మార్చండి. ఎటూ కాకుండా అయిపోయింది" అని. తర్వాత బాబా గుడికి వెళ్లి, అక్కడ కూడా బాబాని పుస్తకాల గురించి అడిగాను. మధ్యాహ్న ఆరతి అనంతరం గురువారం అయినందున అన్నదానం మొదలైంది కానీ, ఆరోజు చాలా రద్దీగా ఉండటం వల్ల నేను తినకుండా వెళ్లిపోదామనుకున్నాను. కానీ మన బాబా మనల్ని ఆకలితో పంపరు కదా! పూజారిగారు నన్ను, "బోజనం చేసావా అమ్మా?" అని అడిగారు. నేను, "లైన్లో చాలామంది ఉన్నారు" అని అంటే ఆయనే ఒక పళ్లెంతో భోజనం తెచ్చి నాకిచ్చారు. బాబాయే ఆ రూపంలో ఎండలో ఖాళీ కడుపుతో ఇంటికి పంపకుండా నా ఆకలి తీర్చారు. ఇంకా బాబా చేసిన అద్భుతం చూడండి. నేను గుడిలో నుండి బయటకి అడుగుపెడుతూనే నా స్నేహితురాలు నాకు ఫోన్ చేసి, "మా ఇంటికి వెళ్లి బుక్స్ తెచ్చుకొని, చదువుకో" అని చెప్పింది. నిజానికి తను వేరే ఊరిలో బిజీగా ఉంది. అంత బిజీలో కూడా తను నాకు ఫోన్ చేసి ఆ మాట చెప్పింది. అంతా బాబా దయ.


ఒకసారి మేము పూరి జగన్నాథస్వామి దర్శనానికి వెళ్ళాము. అప్పుడు నేను, "బాబా! పూరి దర్శనం బాగా జరిగేలా చూడండి. మీకు కొబ్బరికాయ సమర్పిస్తాను" అని బాబాకి మొక్కుకున్నాను. బాబా దయవల్ల ట్రైన్ రిజర్వేషన్లు దొరికి అనుకున్న సమయానికి మేము పూరి చేరుకున్నాము. కానీ అక్కడ రూము కోసం వెళితే, ఎంతకీ కనిపించలేదు. అప్పుడు నేను, "బాబా! రూము దొరికేలా చూడండి" అని బాబాను అడిగాను. బాబా దయవల్ల రూములు దొరికాయి. అందరం ఫ్రెష్ అయి దర్శనం కోసం వెళ్ళాము. అక్కడ దర్శనానికి లైన్స్ వంటివి ఏమీ లేవు. అంతా గుంపులో గోవిందా అన్నట్టు ఉంది. పైగా చాలా రద్దీగా వుంది. మాతో ఇద్దరు చిన్న పిల్లలున్నారు. ఆ రద్దీలో మేము తప్పిపోతామేమో అనిపించి, "బాబా! ఈ పిల్లలు తప్పిపోకుండా చూడండి. అలాగే దర్శనం బాగా అయ్యేలా మీరే చూడాలి" అని, 'బాబా.. బాబా' అనుకుంటూ వెళ్ళాము. రద్దీ బాగా ఉన్నప్పటికీ బాబా దయవల్ల నేను, పిల్లలు ఒకే చోట ఉన్నాము. దర్శనం చేసుకొనే సమయంలో అక్కడున్న పూజారి నడవండి, నడవండి అని అనకుండా కాసేపు స్వామిని దర్శించుకొనే అవకాశం ఇచ్చారు. అలా నేను కోరుకున్నట్లు దర్శనం బాగా అయ్యెలా చూసారు బాబా. అంత రద్దీలో కూడా మరోసారి వెళ్లి స్వామి దర్శనం చేసుకున్నాము. అప్పుడు కూడా నాతో వున్న పిల్లలు ఎక్కడా తప్పిపోలేదు బాబా దయవల్ల. ఇక తిరుగు ప్రయాణమప్పుడు సమయానికి ట్రైన్ అందుకుంటామో, లేదోనని భయమేసింది. కానీ బాబా దయవల్ల మేము సమయానికి ట్రైన్ అందుకొని క్షేమంగా మా ఇంటికి చేరుకున్నాము. ముందు బాబాకి మ్రొక్కుకున్నట్లు ఆయనకి కొబ్బరికాయ సమర్పించుకున్నాను. "బాబా! మీ అనుగ్రహం ఎల్లప్పుడూ నాపై, మా కుటుంబంపై వుండేలా చూడండి. అందరూ బాగుండాలి. అందులో మేము ఉండాలి బాబా".


ఒకసారి నా చెల్లి ఒక ఉద్యోగానికి దరఖాస్తు చేసి, 'ఆ ఉద్యోగం వస్తుందా?' అని బాబా ముందు చీటీలు వేస్తే, రాదని వచ్చింది. అయినా చెల్లి ఇంటర్వ్యూకి వెళితే, నిజంగానే ఆ ఉద్యోగం తనకి రాలేదు. మళ్ళీ దరఖాస్తు చేసినప్పుడు ఒక వారంలో చెప్తామని అన్నారు. అప్పుడు నేను బాబా ముందు మళ్ళీ చీటీలు వేస్తే, ఉద్యోగం వస్తుందని వచ్చింది. బాబా చెప్పినట్లే చెల్లికి ఆ ఉద్యోగం వచ్చి, జాయిన్ అయింది. నేను బాబాకి మ్రొక్కుకున్న ప్రకారం కొబ్బరికాయ, శీర సమర్పించుకున్నాను. మొదటి జీతం వచ్చాక 500 రూపాయలతో అన్నదానం చేస్తానని కూడా అనుకున్నాను కానీ, జీతం రాకముందే ప్రాజెక్టులు లేక చెల్లికి ఉద్యోగం లేకుండా పోయింది. "బాబా! మీరే చెల్లికి ఇంకో ఉద్యోగం దొరికేలా చేయాలి. ఇంకా ఎన్నాళ్లు ఈ కష్టాలు మాకు బాబా?".

సాయిభక్తుల అనుభవమాలిక 1811వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. శ్రీసాయినాథుని కృపాకటాక్షాలు
2. ప్రేమతో పిలిస్తే పలికే దైవం సాయినాథుడు
3. సమయానికి కాలేజీకి చేరుకునేలా అనుగ్రహించిన బాబా

శ్రీసాయినాథుని కృపాకటాక్షాలు


ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!


సాయిభక్తులకు నమస్కారం. నేను ఒక సాయిభక్తురాలిని. మా అబ్బాయి బీటెక్ చదువుతున్నాడు. తను చదివే కాలేజీ హాస్టల్లో సాయినాథుని మందిరం ఉండటం మాకు అత్యంత ఆనందాన్ని ఇచ్చింది. అయితే మా అబ్బాయికి హాస్టల్ ఉండడం చాలా కష్డంగానూ, చదవగలనో, లేదోనని భయంగానూ ఉండేది. ఒకసారి తాను ఇంటికి వచ్చి, తిరిగి హాస్టల్‌కి వెళ్ళడానికి మధ్య కొంచెం గ్యాప్ వచ్చింది. అందుచేతనో లేక మరే కారణం చేతనో గాని తను కాస్త బెరుకుగా, ఇబ్బందిగా ఆందోళన చెందసాగాడు. దాంతో మేము చాలా ఇబ్బందిపడి రాత్రిళ్లు మాకు నిద్ర కరువైంది. అప్పుడు మేము మా సాయినాథుని, "మా అబ్బాయి అక్కడ సర్దుకొని తనంతటతానే 'నాకు ఇక్కడ బాగుంది. చదువు విషయంలో గాని, హాస్టల్ విషయంలో గాని నాకు ఏ విధమైన ఇబ్బంది లేదు' అని చెప్పేలా చేయండి" అని వేడుకున్నాము. ఆ మరుసటిరోజు మా అబ్బాయి ఫోన్ చేసి చాలాసేపు మాట్లాడాడు. తను చెప్పిన మాటలు విని మాకు అత్యంత ఆనందం, ఆశ్చర్యం కలిగాయి. మేము బాబాను ఏమైతే వేడుకున్నామో అక్షరాల అవే మాటలు మా అబ్బాయి నోటి నుండి వచ్చాయి. మా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇదంతా శ్రీసాయినాథుని కృపాకటాక్షాలకు నిదర్శనం.


ఒకసారి మావారు విపరీతమైన గ్యాస్ వల్ల ఛాతి అంతా గ్యాస్ పట్టేసి చాలా ఇబ్బందిపడ్డారు. అప్పుడు సాయి ఊదీ వారి గుండెలకు రాస్తే కొద్దిసేపటికి చాలా ఉపశమనం పొందారు. ఇలా శ్రీసాయినాథుని కరుణ, దయ ఎల్లప్పుడూ మా యందు ఉన్నాయి. వారు మా వెన్నంటే ఉంటున్నారు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".


సద్గురు సాయినాథాయ నమః!!!


ప్రేమతో పిలిస్తే పలికే దైవం సాయినాథుడు


సాయిభక్తులందరికీ నమస్కారం. నా పేరు సౌజన్య. నేను మాకు బాబు పుడితే పేరులో 'సాయి' వచ్చేలా పెట్టుకుంటానని, శిరిడీ వస్తానని మొక్కుకున్నాను. బాబా దయవల్ల మాకు బాబు పుట్టాడు. తనకి ఐదు నెలల వయసున్నప్పుడు నామకరణం చేయాలనుకున్న ప్రతిసారీ ఏదో ఒక కారణంగా అది వాయిదా పడుతూ ఉండేది. చివరికి 2024, మార్చి 6న చేయాలని నిశ్చయించుకుని అన్ని ఏర్పాట్లు చేసుకున్నాము. అయితే వారం రోజుల ముందు బాబుకి తీవ్రంగా జ్వరమొచ్చింది. ఆ కారణంగా బాబు ఆడుకోకుండా డల్‌గా ఉండేవాడు. చిన్న శబ్దమైన నిద్రలేచి ఏడ్చేవాడు. మార్చి 5, ఉదయం కూడా బాబుకి బాగా టెంపరేచర్ ఉండేసరికి, 'రేపు కూడా నామకరణం చేయలేమా?' అని నాకు టెన్షన్ మొదలైంది. అప్పుడు బాబా ఊదీ బాబుకి పెట్టి, "బాబు యాక్టివ్‌గా ఉండి, రేపు ఏ ఆటంకం లేకుండా నామకరణం జరగాలి" అని బాబాను ప్రార్థించాను. మరుసటిరోజు పొద్దున్నే నామకరణ కార్యక్రమానికి సిద్దమయ్యాము. బాబా దయవల్ల బాబుకి టెంపరేచర్ ఏం లేదు. కాకపోతే, డల్‌గా ఉన్నాడు. అయినా అలాగే బాబుని బాబా గుడి తీసుకెళ్లి ‘మోహిత్ సాయి’ అని నామకరణం చేసాము. ఉదయాన అభిషేకం మొదలుకొని హారతి అయ్యేవరకు మేము గుడిలోనే ఉన్నాము. పూజారి బాబుని బాబా పాదాల దగ్గర పడుకోబెట్టారు. బాబు ఏడుస్తాడేమో అనుకున్నాను కానీ, ఏడవలేదు. హారతి జరిగేటప్పుడు శబ్దాలకి కూడా బాబు ఏడవలేదు. బాబా దయవల్ల అంతా బాగా జరిగి ఇంటికి తిరిగి వచ్చాము. అద్భుతమేమిటంటే, ఇంటికి వచ్చినప్పటి నుంచి బాబు బాగా సంతోషంగా, ఉల్లాసంగా ఉండటం చూసాను. ఇప్పుడు బాబు బాగున్నాడు. అంతా బాబా అనుగ్రహం. ప్రేమతో పిలిస్తే పలికే దైవం సాయినాథుడు. “ధన్యవాదాలు బాబా”.


సమయానికి కాలేజీకి చేరుకునేలా అనుగ్రహించిన బాబా


ఓం శ్రీ సమర్థ సద్గురు శ్రీసాయినాథ్ మహరాజ్ కి జై!!!


నా పేరు దేవప్రసాద్. నేను ఉదయగిరిలో కాంట్రాక్ట్ లెక్చర్‌గా పని చేస్తున్నాను. నేను ప్రతిరోజు నెల్లూరు నుండి ఉదయగిరికి బస్సులో వెళ్తుంటాను. ఇలా ఉండగా ఈమధ్య ఒక పది రోజులు పరీక్ష పేపర్లు దిద్దే డ్యూటీ వేశారు. ఆ 10 రోజులు పూర్తయిన తర్వాత తిరిగి కాలేజీలో చేరదామని బస్సు స్టాండుకి వెళ్ళేటప్పటికి నేను వెళ్లాల్సిన బస్సు వెళ్ళిపోయింది. ఆ బస్సులో వెళ్తేనే నేను సరైన సమయానికి కాలేజీకి చేరుకోగలను. అందువల్ల నేను బాబాని తలుచుకొని, "నేను సరైన సమయానికి కాలేజీకి చేరేలా అనుగ్రహించమ"ని అనుకున్నాను. అంతే, 10 నిమిషాల్లో మా కాలేజీ లెక్చరర్ ఒకరి కారులో అక్కడికి వచ్చారు. ఆ లెక్చరర్ నెల్లూరులో ఏదో పని చూసుకొని ఉదయగిరిలోని కాలేజీకి వెళ్తూ నన్ను తన కారులో ఎక్కించుకొని కాలేజీ దగ్గర దించారు. నేను బాబాను వేడుకోవడం వల్ల, ఆయన అనుగ్రహంతో సరైన సమయానికి కాలేజీకి చేరుకున్నాను. "ధన్యవాదాలు బాబా".


ఓం సాయినాథ్ మహారాజ్ కీ జై!!!


సాయిభక్తుల అనుభవమాలిక 1810వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబాను మనసారా కోరుకుంటే జరగనిదేముంటుంది?
2. కోరుకున్నట్లే అనుగ్రహించిన బాబా

బాబాను మనసారా కోరుకుంటే జరగనిదేముంటుంది?


ఓం శ్రీసాయినాథాయ నమః!!! నేను ఒక సామాన్య సాయిభక్తురాలిని. బాబా నా జీవితంలోకి నా చిన్నప్పుడే వచ్చారు. అప్పటినుండి ఆయన లీలలు తరచూ నాకు అనుభవమవుతూ ఉన్నాయి. 2024, ఫిబ్రవరి నెలాఖరులో నేను, మా ఆయన బయటకు వెళ్ళినప్పుడు ఒక షాపులో నుండి బయటకు రాగానే అకస్మాత్తుగా మా వారికి నడుము నొప్పి వచ్చింది. దానితో ఆయన నడవలేక అక్కడే షాపు ముందు కూర్చుండిపోయారు. ఆ సమయంలో నేను, "బాబా! ఆయనకి నడుము నొప్పి తగ్గేలా చేయండి" అని బాబాకి చెప్పుకున్నాను. అంతే, ఒక 15 నిమిషాల తర్వాత మావారు లేచి, "తగ్గిపోయింది. ఇక వెళదాం" అని బండి ఆయనే నడిపించారు. అంతలా ఉంటాయి బాబా లీలలు.


2024, ఫిబ్రవరి నెలాఖరులోనే ఒకరోజు నా పొత్తికడుపులో బాగా నొప్పి వచ్చింది. ఆ రాత్రంతా నేను ఆ నొప్పిని అలానే భరిస్తూ పడుకున్నాను. మరుసటిరోజు ప్రొద్దున్న బాబా ఊదీ నీళ్లలో కలిపి తీసుకున్నాను. అంతే, రాత్రి నుంచి ఉన్న నొప్పి కొద్దికొద్దిగా తగ్గడం మొదలై రెండవరోజు రాత్రికి పూర్తిగా తగ్గిపోయింది. బాబాను మనసారా కోరుకుంటే జరగనిదేముంటుంది?


మా అపార్టుమెంటులో వాటర్ లీకేజీ ప్రాబ్లం ఉంది. ప్లంబర్ 2 రోజులు చెక్ చేసి మా ఇంటి బాల్కనీ నుండి లీకు అవుతుందని, కానీ బాల్కనీలో ఉన్న సింక్ వల్లనో, వాషింగ్ మెషీన్ దగ్గర ఉండే ఔట్లెట్ వల్లనో చెప్పలేనని, ఒకవేళ సింక్ వలన సమస్య అయితే కనుక చిన్నదే కానీ, వాషింగ్ మెషీన్ దగ్గర అయితే మాత్రం చాలా పెద్ద సమస్య, బాల్కనీ టైల్స్ అన్నీ పగలగొట్టి చూడాలన్నాడు. అప్పుడు నేను, "బాబా! సమస్య చిన్నదే అయ్యేలా చూడండి" అని బాబాను ప్రార్థించాను. బాబా దయవల్ల వాచ్మెన్ వచ్చి సింక్ నుండి లీకేజీ అవుతుందని చెప్పాడు. అది విని నాకు ఎంతో సంతోషమనిపించింది. సమస్య చిన్నదానితో తీరిపోయేలా చేసిన బాబాకు ధన్యవాదాలు తప్ప ఏమి చెప్పగలను? "ఎంతోకాలంగా ఒక ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నాను సాయి. త్వరగా ఆ సమస్య నుంచి బయటపడేయండి సాయి".


కోరుకున్నట్లే అనుగ్రహించిన బాబా


సాయిబంధువులందరికీ నమస్కారం. నా పేరు సునీత. 2024 ఫిబ్రవరి నెలలో ఒకరోజు మా అత్తయ్య, మావయ్య చెకప్ కోసం హాస్పటల్‌కి వెళ్లారు. డాక్టర్ మా అత్తయ్యకి అంజియోగ్రామ్ చేయాలని చేశారు. ఆ టెస్ట్ చేస్తున్నప్పుడు మధ్యలో మా అత్తయ్య గుండె వేగం ఎక్కువైనందువల్ల మళ్ళీ టెస్ట్ చేయాల్సి వస్తుందేమో, రేపు చెప్తాము అన్నారు. టెస్ట్ అనంతరం ఇంటికి వచ్చేసరికి మా అత్తయ్య చాలా నీరసంగా ఉన్నారు, చెయ్యి కూడా చాలా నొప్పిగా ఉందని అన్నారు. నాకు చాలా టెన్షన్‌గా, బాధగా అనిపించి, "బాబా! మిమ్మల్నే నిత్యం పూజించే అత్తయ్యకి ఎటువంటి సమస్య లేకుండా చూడండి. అలాగే మళ్ళీ టెస్ట్ చేయాలని డాక్టర్ చెప్పకుండా చూడండి" అని బాబాను వేడుకున్నాను. నేను కోరుకున్నట్లే డాక్టర్, "టెస్ట్ మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు. ఎటువంటి సమస్య లేదు" అని చెప్పారు. బాబా దయవల్ల చిన్న నొప్పితోనే పెద్ద సమస్యేమీ లేకుండా చేశారు. అనుకున్న వెంటనే మన కష్టాలు తీర్చే సాయితండ్రికి నా శతకోటి నమస్కారాలు. ఇలానే నాకు, నా కుటుంబానికి అన్నివేళలా తోడుగా ఉండండి బాబా.


సాయిభక్తుల అనుభవమాలిక 1809వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. సాయితో పరిచయం
2. పిలిచినంతనే చెవినొప్పి తగ్గించిన బాబా

సాయితో పరిచయం


నేను ఒక సాయి భక్తురాలిని. నేను డిగ్రీ చదువుకునే రోజుల్లో బాబా గుడికి వెళ్ళటం మొదలుపెట్టాను. అప్పుడు బాబా గురించి నాకు ఏమీ తెలియదు. గుడికి వెళ్లడం, రావడం అంతే. పెళ్ళైన తర్వాత నా భర్త బాబాను పూజించడం, శిరిడీకి వెళ్లడం చేస్తుండేవారు. నాకు తెలియకుండానే బాబా నన్ను తమ వైపుకు లాక్కున్నారు. ఎలా మొదలైందో తెలియకుండానే గురువారం పూజ చేయడం మొదలై నెమ్మదిగా బాబా భక్తురాలినయ్యాను. నేను మా ఊరిలో డిగ్రీ పూర్తిచేశాక మేము హైదరాబాదులో కాపురం ఉండసాగాము. అప్పట్లో నా భర్త జీతం చాలా తక్కువగా ఉండేది. అందువల్ల నేను ఉద్యోగ ప్రయత్నాలు చేశాను. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా నాకు ఉద్యోగం రాలేదు. చివరకి ఒక ఉద్యోగం గురించిన వివరాలు తెలిసినప్పుడు నేను బాబాని నాకు ఆ ఉద్యోగం వచ్చేలా చేయమని అడిగాను. కాదు, బాబాని బ్లాక్ మెయిల్ చేశానంటే బాగుంటుందేమో! ఎందుకంటే, నేను బాబాని ‘నాకు ఉద్యోగం ఇస్తావా లేక నా ప్రాణం తీసుకుంటావా’ అని అడిగాను. బాబా దయవల్ల నాకు ఆ ఉద్యోగం వచ్చింది. కానీ ఆ ఉద్యోగంలో నేను ఎన్ని కష్టాలు పడ్డానో ఆ బాబాకే  తెలుసు. ఒక నెలలోనే ఆ ఉద్యోగం మానేశాను. అప్పుడు నాకు ఏది కావాలో అది సమయానికి బాబా సమకూరుస్తారని నాకు అర్థమై బాబాతో, "మీరు ఏది ఇస్తే, అది తీసుకుంటాను. నేను ఏదీ అడగను" అని చెప్పి నమస్కరించాను. అప్పటినుండి నేను బాబాను ఏమీ కోరను.


మా అత్తగారి ద్వారా సచ్చరిత్ర పుస్తకం నా దగ్గరకి వచ్చింది. అప్పటికి ఆ పుస్తకం గురించి నాకు ఏమీ తెలియదు. చదవమన్నారని చెప్పి ఆ పుస్తకంలో ఉన్నట్టు సప్తహ పారాయణం చేశాను. నేను ఏ కోరికతోనూ పారాయణ చేయనప్పటికీ పారాయణ పూర్తవుతూనే నా భర్తవాళ్ళ సార్ మా కోసం మూడు గదులతో ఒక షెడ్డు వేసి ఇచ్చారు. దాంతో అప్పటివరకు మాకున్న అద్దె ఇంటి కష్టాలు తప్పాయి. అది చిన్న ఇల్లు అయినా చుట్టూ గులాబీ మొక్కలతో(ప్రతిరోజూ 20-30 పువ్వులు ఉండేవి), పళ్ళ మొక్కలతో చాలా అందంగా ఉండేది. ఆడగకపోయినా నా బాబా నన్ను కనిపెట్టుకొని నా అవసరం తీర్చారు. అలాగే కొన్ని పారాయణాలు చేశాక మేము ఒక అపార్ట్మెంట్ తీసుకున్నాము. ఇది నిజంగా బాబా ఆశీర్వాద ఫలితమే. "థాంక్యూ బాబా".


కొంతకాలానికి నాకు ఒక ప్రైవేటు లిమిటెడ్ కంపెనీలో అకౌంటెంట్‌గా ఉద్యోగం వచ్చింది. ఆ ఆఫీసు ఒక భవనం యొక్క సెకండ్ ఫ్లోర్‌లో ఉండేది. గ్రౌండ్ ఫ్లోర్లో మా ఎండి సార్ వాళ్ళు, వాచ్మెన్ కుటుంబం ఉండేవి. ఎండి సార్‌కు ఒక కుక్క ఉంది. అది వాచ్మెన్‌తో సహా ఎవరు దగ్గరకు వెళ్ళినా కరిచేది. మొదటి అంతస్తు నిర్మాణం పూర్తిగా అవ్వనందున స్టోర్ రూములా ఉపయోగించేవారు. ఒకరోజు కుక్కను మొదటి అంతస్తులో వదిలి బయట గేటు వేసి ఉంచారు. ఆ విషయం తెలియని నేను ఆరోజు పని పూర్తి చేసుకొని ఇంటికి వెళ్ళేటప్పుడు మెట్లు దిగుతూ డ్రెస్ సరి చేసుకోవడానికని మొదటి అంతస్తు గేట్ తీసి లోపలికి వెళ్లాను. అలికిడికి కుక్క పరిగెత్తుకుంటూ వచ్చింది. అది ఖచ్చితంగా కరిచేస్తుందని భయంతో 'బాబా' అని అరిచి నా హ్యాండ్ బ్యాగ్ అడ్డుపెట్టాను. ఆ కుక్క హ్యాండ్ బ్యాగు వాసన చూసి వెనుతిరిగి వెళ్ళిపోయింది. ఏమైందని ఆలోచిస్తే బ్యాగులో సాయిబాబా ఫోటో, ఊదీ ఉన్నాయి. ఇది బాబా లీల కాకపోతే ఏంటి? వెంటనే బాబాకు నమస్కరించి థాంక్స్ చెప్పాను. నేను చాలా సున్నితస్తురాలిని. ఎవరు ఏమన్నా భరించలేను. పనిలో తప్పులున్నా, నిర్ణయం తీసుకోలేని పరిస్థితి ఎదురైనా నేను బాబాను వేడుకుంటాను. ఆయన ఎల్లవేళలా నాకు తోడుగా ఉండి సమస్యల నుండి రక్షిస్తున్నారు. ఇలా బాబా ఎల్లవేళలా నన్ను కాపాడతారాని నా నమ్మకం. “చాలా చాలా ధన్యవాదాలు బాబా”.


ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!!!


పిలిచినంతనే చెవినొప్పి తగ్గించిన బాబా


సాయి బంధువులందరికీ నమస్కారములు. నేను ఒక సాయి భక్తురాలిని. 2024, మార్చ్ 2న మా బాబుకి చేవి నొప్పి వచ్చింది. హాస్పిటల్‌కి వెళ్దామంటే, వద్దన్నాడు. అందువల్ల నేను ఇంట్లోనే ఉన్న ఇయర్ డ్రాప్స్ వేసి, బాబు చెవి దగ్గర బాబా ఊదీ పెట్టి, "బాబా! చెవి నొప్పి తగ్గేలా చూడు స్వామీ" అని బాబాని వేడుకున్నాను. పిలిస్తే పలికే మన బాబా ఉండగా మనకు భయమెందుకు? ఒక గంట తర్వాత బాబుకి నొప్పి తగ్గింది. "బాబా! మీకు వేల కోటి వందనాలు".


సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo