సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

మోరేశ్వర్ డబ్ల్యు. ప్రధాన్ - మొదటి భాగం


మోరేశ్వర్ డబ్ల్యు. ప్రధాన్ బాబాకు గొప్ప భక్తుడు. అతను బొంబాయి హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేసేవాడు. ప్రధాన్‌కు బాబాసాహెబ్ తర్ఖడ్ (R. A. తర్ఖడ్) బాగా పరిచయస్థుడు. ప్రధాన్ బాబా గురించి తెలుసుకోవడానికన్నా ముందే తర్ఖడ్ బాబాకు అంకిత భక్తుడు. చాలాకాలంగా ప్రధాన్ తీవ్రమైన ఆస్తమాతో బాధపడుతుండేవాడు. ఆ వ్యాధి నివారణ కోసం శిరిడీ వెళ్ళమని తర్ఖడ్ అతనికి సలహా ఇచ్చాడు. ఇదిలా ఉంటే ప్రధాన్ కుటుంబానికి నానాసాహెబ్ చందోర్కర్‌తో సన్నిహిత స్నేహముండేది. అతడు తరచూ ప్రధాన్ ఇంటికి వస్తుండేవాడు. చందోర్కర్ వలనే ఆ కుటుంబమంతటికీ సాయిబాబా గురించి తెలిసింది. 1910, మే నెల మొదటివారంలో ఒకరోజు ప్రధాన్ సోదరుడు రామారావు, నానాసాహెబ్ చందోర్కర్‌లు మాట్లాడుకుంటున్నారు. వారిరువురి మధ్య సంభాషణ ఇలా సాగింది:

రామారావు: "ప్రస్తుతం అక్కల్‌కోట్ మహరాజ్ వంటి మహాత్ములు ఎవరైనా ఉన్నారా?"

చందోర్కర్: "అలాంటి వారిని చూడాలనుకుంటున్నారా?"

రామారావు: "అవును".

చందోర్కర్: "అలా అయితే, మీరు శిరిడీ వెళ్ళండి. అక్కడ ఉన్న సాయిబాబా అటువంటి మహనీయులే!"

రామారావు: "మేము శిరిడీ గురించి వినడం ఇదే మొదటిసారి. అది ఎక్కడ ఉంది? అక్కడికి ఎలా వెళ్ళాలి?"

చందోర్కర్: "శిరిడీ, అహ్మద్‌నగర్ జిల్లాలోని కోపర్గాఁవ్ తాలూకాలో ఉంది. దౌండ్-మన్మాడ్ మార్గంలో ఉన్న కోపర్గాఁవ్ స్టేషన్లో దిగాలి. అక్కడినుండి 11 మైళ్ళ దూరంలో ఉన్న శిరిడీకి టాంగాలో చేరుకోవచ్చు".

తరువాత చందోర్కర్ శ్రీసాయిబాబా గొప్పతనం, శక్తి, దయ, వ్యక్తిత్వం గురించి ఎంత స్పష్టమైన వివరణ ఇచ్చారంటే, అది విన్న ప్రతి ఒక్కరూ ఎంత త్వరగా వీలయితే అంత త్వరగా శిరిడీ వెళ్లి బాబాను దర్శించుకోవాలని ఆరాటపడ్డారు. ఆ మరుసటిరోజే ప్రధాన్ స్నేహితులు, బంధువులు సుమారు 14 మంది ఒక బృందంగా ఏర్పడి శిరిడీకి ప్రయాణమయ్యారు. వాళ్ళు తమతోపాటు ప్రధాన్‌ను కూడా తీసుకుని వెళ్లాలని అనుకున్నారు. కానీ అతడు ఆ సమయంలో ఇంట్లో లేనందున వాళ్ళు అతని భార్యతో చెప్పి బయలుదేరారు. అతడు ఆరోజు తన తల్లి వద్ద ఉన్నాడు. ఆమె వాళ్ళ ప్రయాణం గురించి అతనితో చెప్పింది. అప్పుడతడు అజ్ఞానంతో, "బాబా నిజమైన సాధువో కాదో ఎవరు చెప్పగలరు?” అని అన్నాడు.

శిరిడీ వెళ్లిన వాళ్ళు తిరిగి వచ్చాక, ప్రధాన్ తన సోదరుడిని కలిశాడు. వాళ్ళు శిరిడీ నుండి తెచ్చిన బాబా ఫోటోను, దాసగణు రచించిన భక్తలీలామృతంలోని 31వ అధ్యాయాన్ని అదేరోజు తిరిగి ఇస్తానని చెప్పి అతడు ఇంటికి తీసుకుని వచ్చాడు. ఆ అధ్యాయంలో బాబా లీలలు, మహిమల గురించి వర్ణించబడి ఉంది. అతడు తన భార్యకు బాబా ఫోటో చూపించి, 31వ అధ్యాయాన్ని బిగ్గరగా చదివి వినిపించాడు. అది అతన్నెంతగానో ప్రభావితం చేసి అతనిలో గొప్ప మార్పు తెచ్చింది. బాబా విషయంలో తన తల్లి వద్ద వ్యక్తపరిచిన సందేహాలన్నీ మాయమై, బాబా నిజమైన సత్పురుషులన్న గట్టి నమ్మకం ప్రధాన్‌కి ఏర్పడింది. అతని భార్య శ్రీమతి చోటూబాయి ఇంకా ఎక్కువగా బాబాను విశ్వసించింది. అతడు ఆ ఫోటోను, పుస్తకాలను ఈరోజు తిరిగి ఇచ్చేయాలని ఆమెతో చెప్పాడు. కానీ ఆమె బాబాను(ఫోటోను), అది కూడా గురువారంనాడు దూరం చేసుకోవటం ఇష్టపడక, వాటిని ఆరోజు తిరిగి ఇవ్వొద్దని పట్టుబట్టింది. దాంతో ప్రధాన్ వాటిని తిరిగి ఇవ్వకుండా తనవద్దే ఉంచుకున్నాడు. అలా మూడురోజులు గడిచాక నాల్గవరోజు అతని సోదరుడు వాటికోసం కబురు పంపగా, వాటిని తిరిగి ఇవ్వక తప్పింది కాదు ప్రధాన్‌కు.

ఆ తరువాత ప్రధాన్, అతని భార్య బాబా దర్శనం కోసం తపించిపోసాగారు. కానీ అందుకు పరిస్థితులు అనుకూలంగా లేవు. కారణం అతని వదిన నిండుగర్భంతో ఉండగా భర్తని పోగొట్టుకుంది. మగసంతానంలేని ఆమెకు ఈసారి తప్పక మగపిల్లవాడు పుడతాడని వాళ్లంతా ఆశగా ఎదురుచూస్తున్నారు. ఆమెకు ఏ రోజైనా కాన్పు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇంటికి ఏకైక మగదిక్కైన ప్రధాన్ ఊరు దాటి ఎక్కడికీ వెళ్ళలేని పరిస్థితి.

(కానీ) ప్రధాన్ త్వరగా బాబా దర్శనం చేసుకోవాలని అతని భార్య, ఆమె సోదరి ఆరాటపడ్డారు. అందువలన వాళ్ళ బంధువుల బృందం శిరిడీ నుండి తిరిగి వచ్చిన 15 రోజులకు, అంటే 1910 మే నెలాఖరున ప్రధాన్ శిరిడీ బయలుదేరాడు. చందోర్కర్ ఎంతో ఆదరంతో తన ఇద్దరు పిల్లలు బాపు, బాబులను అతనికి తోడుగా పంపాడు. అతడు బయలుదేరేముందు మూడు, నాలుగు బంగారు నాణాలను(గినియా), కొన్ని కరెన్సీ నోట్లను తన దగ్గర పెట్టుకున్నాడు. బాబా దక్షిణ అడిగితే వెండి నాణాలు ఇవ్వాలన్న ఉద్దేశ్యంతో అతడు ఒక నోటును మార్చి 20 వెండి రూపాయి నాణాలను సిద్ధంగా పెట్టుకున్నాడు. వాళ్ళు కోపర్గాఁవ్‌లో దిగగానే అక్కడి మామల్తదార్ సాదరంగా స్వాగతం పలికాడు. తరువాత వాళ్ళు గోదావరిలో స్నానమాచరించి, టాంగాలో శిరిడీ బయలుదేరారు. బాబా వారికోసమే ఎదురు చూస్తున్నారా అన్నట్లుగా లెండీతోట వద్ద నిలబడి ఉన్నారు. వెంటనే వాళ్ళు టాంగా దిగి సాయి మహరాజ్‌కు సాష్టాంగ నమస్కారం చేసుకున్నారు. తరువాత వాళ్ళు సాఠేవాడాలో బస చేశారు. అక్కడ వాళ్ళకి రావుబహదూర్ సాఠే, నూల్కర్(ఫస్ట్ క్లాస్ సబ్ జడ్జి)లతో పరిచయమయింది.

కొంతసేపటి తరువాత ప్రధాన్ తనతోపాటు తెచ్చుకున్న పూలు, పూలమాలలు, పండ్లు తీసుకుని బాబా దర్శనం కోసం మసీదుకెళ్ళాడు. అతడు బాబాకు పూలమాలను వేసి, తనతో తీసుకువెళ్ళిన కానుకలు సమర్పించుకున్నాడు. బాబా ముఖంలోకి, కళ్ళలోకి చూస్తూనే ప్రధాన్‌కు వారు గొప్ప మహాత్ములన్న నమ్మకం దృఢపడింది. అంతటి మహనీయుని దర్శించుకునే అవకాశం ఇచ్చినందుకు అతడు తన మనస్సులోనే భగవంతునికి కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. వెంటనే బాబా అతని నమ్మకాన్ని పరీక్షించదలచి, అతణ్ణి దక్షిణ అడిగారు. అతడు దక్షిణగా ఇవ్వడానికి సిద్ధంగా ఉంచుకున్న వెండి రూపాయలకు బదులుగా ఒక బంగారు నాణాన్ని బాబా చేతిలో పెట్టాడు. బాబా ఆ నాణాన్ని మొదట జార్జి బొమ్మ ఉన్న వైపుకు, తరువాత బొరుసు వైపుకు త్రిప్పి చూశారు. అలా మూడుసార్లు చేశారు. ఆ మూడుసార్లూ “ఇదేమిటి?” అని నూల్కర్‌ను అడిగారు. అతడు, "బాబా! అది గినియా(బంగారు నాణెం)" అని చెప్పాడు. అప్పుడు బాబా, “దీని విలువ ఎంత?" అని అడిగారు. అందుకతడు, "15 రూపాయలు" అని చెప్పాడు. బాబా ఆ నాణాన్ని ప్రధాన్‌కు తిరిగి ఇచ్చివేస్తూ, "ఇది నాకొద్దు, దీన్ని నువ్వే ఉంచుకుని, నాకు 15 రూపాయలివ్వు" అన్నారు. అతడు దాన్ని అందుకుని, పర్సులో పెడుతుండగా నూల్కర్, "అది బాబా హస్తస్పర్శతో పునీతమైన నాణెం. దానిని ఇతర నాణాలతో కలపకుండా విడిగా భద్రపరుచుకో" అని చెప్పాడు. అతడు అలాగే చేసి, 15 వెండి రూపాయి నాణాలను బాబాకు ఇచ్చాడు. బాబా వాటిని మరల మరల లెక్కించి, “ఇక్కడున్నవి పది రూపాయలే. మరో అయిదు రూపాయిలివ్వు" అన్నారు. సహజంగా వాదించడానికి అలవాటు పడిన ఏ లాయరైనా బాబా చేసిన ఆరోపణ తప్పని, తాను లెక్కించి సరిగా 15 రూపాయలిచ్చానని వాదిస్తాడు. కానీ ప్రధాన్ అలా చేయలేదు. అది తన నమ్మకానికి బాబా పెడుతున్న పరీక్ష అని తలచి, బాబా లెక్కే సరియైనదని ఆమోదిస్తూ, ఆనందంగా తన దగ్గర మిగిలిన 5 వెండి రూపాయి నాణాలను బాబాకు సమర్పించాడు. తరువాత అతడు మొదట తాను 20 రూపాయలు బాబాకు సమర్పించుకోవాలనుకున్న విషయాన్ని గుర్తుచేసుకుని, లెక్క తప్పిందన్న మిషతో బాబా అదే మొత్తాన్ని తనవద్దనుండి స్వీకరించారని అర్థం చేసుకున్నాడు. అతని వద్ద ఇంకా చాలా డబ్బు ఉన్నప్పటికీ, బాబా అతనిని మళ్ళీ దక్షిణ అడగలేదు.

తరువాత బాబా ప్రధాన్‌కి చిలిం ఇచ్చి పీల్చమన్నారు. మొదట అతడు కంగారుపడ్డాడు కానీ, బాబా మాటను జవదాటలేక చిలిం పీల్చాడు. అద్భుతం! ఆ క్షణం నుండి అతనికి తిరిగి ఆస్తమా రాలేదు. ఒకే ఒక్కసారి, అదీ 1918 సంవత్సరం, విజయదశమిరోజు మధ్యాహ్నం హఠాత్తుగా అతనికి మళ్ళీ తీవ్రంగా ఆస్తమా వచ్చింది. బాబా ఊదీ కలిపిన నీళ్లు త్రాగాక దాని తీవ్రత తగ్గుముఖంపట్టి, కొద్దిసేపట్లో పూర్తి ఉపశమనం లభించింది. అదేరోజు సుమారు మధ్యాహ్నం 2 గంటలకు శిరిడీలో శ్రీసాయిబాబా మహాసమాధి చెందారన్న వార్త అతనికి ఆ తరువాత తెలిసింది. తరువాత అతని జీవితకాలంలో మళ్ళీ ఎప్పుడూ ఆస్తమా రాలేదు. ఒక వ్యక్తి వ్యాధిని నయంచేయడంలో బాబా అనుసరించే విధానం ఎంత అద్భుతం! అతడు మనసులోనే తర్ఖడ్, చందోర్కర్ లకు కృతజ్ఞతలు తెలుపుకున్నాడు.

బాబా  ప్రధాన్ నమ్మకాన్ని బలోపేతం చేసేందుకు తమ అంతర్‌జ్ఞానాన్ని అతనికి అర్థమయ్యేలా తెలియజేస్తూ కొన్ని లీలలు చూపించారు. ప్రధాన్ మరోసారి బాబా దర్శనానికి వెళ్ళినప్పుడు బాబా తమ చుట్టూ ఉన్న భక్తులకు ఊదీ ఇస్తున్నారు. దూరంగా నిలబడి ఉన్న ప్రధాన్‌ను చూసి, "భావూ" అని సంబోధిస్తూ సైగచేసి దగ్గరికి రమ్మని పిలిచారు. అతడు వెళ్లగా బాబా, ‘"రెండు లేదా నాలుగు రోజుల్లో అంతా బాగైపోతుంది" అని ఊదీ ఇచ్చారు. ఊదీ తీసుకుని అతడు బయటకు వచ్చాడు. బాబా అతనిపై చూపిన ఆదరాభిమానాలకు నూల్కర్, శ్రీమతి జోగ్ మొదలైన భక్తులు ఆశ్చర్యపోయారు. నూల్కర్ ఆనందంతో ప్రధాన్‌ను ఆలింగనం చేసుకున్నాడు. ఐశ్వర్యాన్ని, బంగారాన్ని, కుటుంబహోదాను బాబా ఏమాత్రం లెక్కచేయరన్న విషయం అందరికీ బాగా తెలుసు. కనుక, బాబా ప్రత్యేక అభిమానం పొందడానికి ఏ సద్గ్రంథాలను పారాయణ చేశారో తెలుపమని శ్రీమతి జోగ్ ప్రధాన్‌ను అడిగింది. అతడు, తాను చేసిన సద్గ్రంథ అధ్యయనాలు, పారాయణలు ఏమీలేదని వినమ్రంగా బదులిచ్చాడు.

ప్రధాన్ మరుసటిరోజు శిరిడీ నుండి తిరుగు ప్రయాణమవ్వాలని అనుకున్నాడు. ఆ విషయమై అతడు బాబాను అనుమతి అడిగాడు. బాబా అందుకు నిరాకరిస్తూ తమదైన ప్రత్యేక రీతిలో "రేపు వెళ్ళు" అన్నారు. ప్రతిరోజూ అలానే చెప్తూ అతడిని ఎనిమిది రోజులు శిరిడీలోనే ఉంచేశారు బాబా. ఆ సమయంలో, అంటే మూడవరోజు అతడు సాయిబాబాకు ప్రత్యేకంగా విందు(భిక్ష) ఇవ్వదలచి, విందులో ఏయే పదార్థాలు ఉండాలో, ఎవరెవరిని ఆహ్వానించాలో తెలుపమని బాబాను ప్రార్థించాడు. ప్రత్యేకించి అతిథులకోసం విందులో పూరన్ పోళీలు(బొబ్బట్లు) ఉండాలని, తమకు అభిమానపాత్రుడైన బాబు(దాదాకేల్కర్ మేనల్లుడు)ను తప్పక ఆహ్వానించాలని బాబా చెప్పారు. అతడు బాబాను ఆహ్వానించేలోపే ఆయన, “నేను కూడా వస్తాను (మీహి యే ఈన్)" అని అన్నారు. 

మరుసటిరోజు ప్రధాన్ బాబా చెప్పినట్లుగానే విందు ఏర్పాటు చేసి, బాబును, ఇతర భక్తులను ఆహ్వానించాడు. అందరూ వచ్చి కూర్చున్న తరువాత పళ్ళాలలో పదార్థాలన్నీ వడ్డించారు. ప్రత్యేకంగా బాబా కోసం ఒక పళ్ళెంలో వడ్డించారు. ఒక కాకి వచ్చి బాబా కోసం ఉంచబడిన ప్లేటులోని ఒక పూరన్ పోళీని పట్టుకుపోయింది. ఆ రూపంలో బాబానే తమకు ఇష్టమైన పూరన్ పోళీ ఆరగించారని భక్తులంతా జయజయధ్వానాలు చేశారు. ఆరోజు మధ్యాహ్నం బాబా తమ శరీరంలోని పార్శ్వభాగాన్ని చూపిస్తూ, "ఈ భాగమంతా విపరీతంగా నొప్పిపుడుతోంది. కానీ మూడు నాలుగు రోజులలో తగ్గిపోతుంది” అన్నారు. బాబా చూడడానికి ఆరోగ్యంగానే ఉండడం వలన పై మాటల ద్వారా వారు చెప్పదలచుకున్నదేమిటో అర్థం చేసుకోవడం ప్రధాన్‌కు శక్తికి మించిన పని. అతడు బొంబాయికి చేరుకున్నాక బాబా మాటలలోని మర్మం బహిర్గతమైంది.

తరువాత ఒక గురువారంనాడు పెద్ద సంఖ్యలో అన్నసంతర్పణ చేసేందుకు బాబా హండీ(పెద్ద పాత్ర) పెట్టి వంట చేస్తున్నారు. వారు భక్తులందరినీ తరిమివేసి ఒంటరిగా ఉన్నారు. ఆ సమయంలో ప్రధాన్, చందోర్కర్ పిల్లలు బాపు, బాబులు అక్కడికి వెళ్తుంటే చూస్తున్నవారంతా ఆశ్చర్యపోయారు. వాళ్లకు ప్రత్యేక దర్శనం ఇవ్వడానికే భక్తులందరినీ బాబా బయటకు పంపించివేశారా అన్నట్లుగా బాబా కోప్పడకపోగా, వాళ్ళని సాదరంగా ఆహ్వానించారు. కొద్దిసేపటికి బాబా చిన్నగా ఏదో పాడుతున్నారు. బాబా ఆ పాటను మూడవసారి పాడుతున్నప్పుడు "కాయరే ఆపలా కాయ్ హూ మనావే శ్రీరామ జయరామ జయజయ రామ॥" అని ప్రధాన్‌కు వినిపించింది. ఒక్కసారిగా అతను ఉద్వేగానికి లోనై బాబా పాదాలపై తన శిరస్సునుంచాడు. అతని కళ్ళనుండి ఆనందభాష్పాలు పెల్లుబికాయి. బాబా పలికిన పలుకులే అతని కులగురువైన 'హరిబువా' అతనికి ఉపదేశించిన మంత్రం. (హరిబువా తాతగారైన ఆత్మారాంబువా ప్రధాన్ ముత్తాతగారి గురువు. వీరి పూజ కొరకు బొంబాయి ఠాకూద్వార్‌లో ఒక దేవాలయం నిర్మించబడింది.) ఆ మంత్రాన్ని అతను చాలాకాలంగా నిర్లక్ష్యం చేస్తున్నాడు. ఈ విధంగా గురువు ఉపదేశించిన మంత్రంపట్ల బాబా అతనిలో శ్రద్ధను, గౌరవాన్ని పునరుద్ధరించారు. తాను అడగకపోయినా తన ఆధ్యాత్మిక వికాసం కోసం ఎంతో శ్రద్ధ కనబరుస్తున్న బాబాకు అశ్రునయనాలతో కృతజ్ఞతలు సమర్పించడం కన్నా తాను చేయగలిగింది ఏమీలేదని అనుకున్నాడు ప్రధాన్. తనపట్ల బాబాకున్న ప్రేమ అతనిని బాగా ఆకట్టుకుంది. తరువాత బాబా హండీ దగ్గర నిలబడి ఉడుకుతున్న వంటకాన్ని సమంగా కలిసేలా గరిటెతో కాక తమ చేతితో కలియబెట్టారు. చేతితో కలియబెట్టినప్పటికీ బాబా చేయి కాలలేదు, బొబ్బలెక్కలేదు! అది చూసి ప్రధాన్ ఆశ్చర్యపోయాడు.

అకస్మాత్తుగా మధ్యాహ్నం ప్రధాన్, బాపు, బాబులను బాబా లెండీకి తీసుకువెళ్ళారు. సాధారణంగా వారు లెండీకి వెళ్లే సమయం కాదది. అక్కడ బాబా కొన్ని గుంటలు త్రవ్వి, ప్రధాన్ చేతికి కొన్ని మొక్కజొన్న విత్తనాలిచ్చి ఆ గుంటలలో పెట్టించి, వాటిపై మట్టి కప్పి నీళ్ళు పోయమన్నారు. తరువాత వాళ్ళు మసీదుకు తిరిగి వచ్చారు. ఆ లెండీ తోటనే ఏడెనిమిది సంవత్సరాల తరువాత బాబా సమాధి చెందిన వెంటనే ప్రధాన్ కొనుగోలుచేసి, సంస్థాన్ ఏర్పడ్డాక దాన్ని సంస్థాన్‌కు అప్పగించాడు.

ప్రధాన్, బాపు, బాబులను వారంరోజులు శిరిడీలోనే ఉంచిన తరువాత వాళ్ళు తిరిగి వెళ్ళడానికి బాబా అనుమతినిచ్చారు. అప్పుడే తీవ్రమైన గాలి, వాన చెలరేగి పావుగంట వర్షం పడింది. "వర్షం ఇలాగే కొనసాగితే, నదులు, వాగులు పొంగుతాయి. అప్పుడు మేము బొంబాయి వెళ్ళడానికి కష్టమవుతుంది. బాబా తిరిగి వెళ్ళడానికి అనుమతినివ్వరేమో"నని భయపడ్డాడు ప్రధాన్. అప్పుడు బాబా ఆకాశం వైపు చూస్తూ, “ఓ భగవంతుడా! ఇక వర్షాన్ని చాలించు. నా బిడ్డలు ఇళ్ళకు వెళ్ళాలి. వాళ్ళని సుఖంగా వెళ్ళనీ(అరే అల్లా అభీ బర్‌సాత్ పూరా కర్! మేరే బాల్ బచ్చే ఘర్ జానే వాలేఁ హై. ఉన్ కో సుఖ్ సే జానేదే)" అన్నారు. వెంటనే వర్షం తగ్గుముఖం పట్టింది. ప్రధాన్ తన మదిలో మెదిలే ఆలోచనలన్నీ బాబాకు తెలుసని అనుకున్నాడు. తరువాత వాళ్ళు వెళ్ళడానికి బాబా అనుమతించారు. అప్పుడు బాబు చందోర్కర్ ఒక పళ్లెం తెచ్చి బాబా పాదాల క్రింద ఉంచాడు. తరువాత బాబు నీటితో బాబా పాదాలు కడిగి, ఆ పాదతీర్థాన్ని ఇంటిలో వాడుకునేందుకు సేకరించాడు. ఆ విధంగా చేయడం శిరిడీలో అప్పుడున్న పద్ధతులకు భిన్నమైనది. అప్పటివరకు ఊదీ మాత్రమే ఇంటికి తీసుకెళ్ళేందుకు ఆమోదించేవారు. పాదతీర్థం ఆరతి సమయమప్పుడు త్రాగడానికి మాత్రమే ఇచ్చేవారు. బాబును అనుసరించి ప్రధాన్ కూడా తన తల్లికి, ఇతర భక్తులకు ఇవ్వడానికి బాబా పాదతీర్థం తీసుకున్నాడు. అప్పుడు బాబా ప్రధాన్‌తో, "నీవెంట నేనూ వస్తాను" అన్నారు. తరువాత వాళ్ళు బయలుదేరి మన్మాడ్ చేరుకున్నారు. వెంటనే పంజాబ్ మెయిల్ వచ్చింది. నిజానికి వాళ్ళ వద్ద మూడవ తరగతి టిక్కెట్లు ఉన్నాయి. అవి తరువాత వచ్చే రైలు ఎక్కడానికి మాత్రమే పనికివస్తాయి. ఆ టిక్కెట్లతో మెయిల్ ఎక్కడానికి రైల్వే నిబంధనలు ఒప్పుకోవు. కానీ ఆనందంలో వాళ్ళు అవేమీ పట్టించుకోకుండా మెయిల్ ఎక్కి, చేరవలసిన సమయానికన్నా నాలుగైదు గంటలు ముందే బొంబాయి చేరుకున్నారు.

ప్రధాన్ ఇంటికి చేరగానే తన తల్లికి పక్షవాతం వచ్చిందని తెలిసింది. శిరిడీలో బాబా తమ శరీర పార్శ్వభాగమంతా బాధిస్తున్నదని చెప్పిన సమయంలోనే బొంబాయిలో ఉన్న ప్రధాన్ తల్లికి పక్షవాతం వచ్చింది. బాబా చెప్పినట్లుగానే ఆమెకు ఒకవైపు విపరీతమైన నొప్పి ఉంది. వెంటనే డాక్టర్లను పిలిపించి చికిత్స మొదలుపెట్టారు. ప్రధాన్ సోదరి, ఇతర బంధువులు శిరిడీలో ఉన్న ప్రధాన్‌కి కబురుపెట్టాలని అనుకున్నారు. కానీ అప్పుడు అక్కడే ఉన్న చందోర్కర్, "ప్రధాన్‌కు కబురుపెట్టాల్సిన అవసరం లేదని, ప్రధాన్ బాబా సన్నిధిలో ఉన్నంతవరకు ఆమెకు ఏమీ కాదని, అవసరమైతే బాబాయే అతనిని పంపగలరని" చెప్పాడు. ప్రధాన్ శిరిడీ నుండి బయలుదేరిన రాత్రే బొంబాయిలో అతని తల్లికి చికిత్స చేస్తున్న డాక్టరు ఆమెకు జ్వరం చాలా ఎక్కువగా ఉందని, ఆమె ప్రేవులు బిగుసుకుపోయి ఉన్నాయని, పరిస్థితి ప్రమాదస్థాయికి చేరుకుందని చెప్పాడు. రాత్రికి ప్రేవుల్లో కదలిక ఏర్పడితే (విరోచనమైతే) ఆమె పరిస్థితి కాస్త మెరుగుపడుతుందని అన్నాడు. తెల్లవారుఝామున 4.30 - 5 గంటల సమయంలో ఇల్లు చేరుకున్న ప్రధాన్, తల్లి పరిస్థితి తెలుసుకున్న వెంటనే ఆమెకు బాబా ఊదీ, పాదతీర్థం ఇచ్చాడు. ఆమెకు కొద్దిగా నిద్రపట్టింది. తరువాత కాసేపటికి ప్రేవుల్లో కదలిక ఏర్పడి విరోచనమయింది. దాంతో జ్వరం తగ్గిపోయింది. డాక్టరు వచ్చి పరీక్షించి ఆమె పరిస్థితి మెరుగుపడిందని, ఇక కోలుకుంటుందని చెప్పాడు. బాబాకు ఇవన్నీ ముందుగా తెలిసే, తమ సంకల్పానుసారం వాళ్ళని ఊదీ, తీర్థంతో శిరిడీ నుండి పంపి, మన్మాడులో పంజాబ్ మెయిల్ అందేటట్లు చేసి, సరైన సమయానికి ఇంటికి చేర్చారని ప్రధాన్‌కు అర్థమయింది. అంతేకాదు, అతడు శిరిడీలో ఉన్నప్పుడు బాబా అతనిని దగ్గరకు పిలిచి ఊదీ ఇచ్చి, “మూడు నాలుగు రోజులలో అంతా బాగైపోతుంది” అన్న మాటలను బట్టి తన తల్లి నాలుగురోజుల్లో కోలుకుంటుందని కూడా అతడు గ్రహించి, 'బాబా చర్యలు నిగూఢాలు, వారి లీలలు అద్భుతాలు' అనుకున్నాడు. బాబా చెప్పినట్లుగానే అతని తల్లి నాలుగురోజుల్లో పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో నాలుగు సంవత్సరాలు జీవించింది. ఆమె చనిపోయేందుకు రెండు సంవత్సరాల ముందు శిరిడీ వెళ్లి బాబాను దర్శించి వారి ఆశీస్సులు పొందింది.

ప్రధాన్ ఇంటికి తిరిగి వచ్చిన రాత్రి అతని వదినకు ఒక కల వచ్చింది. ఆ కలలో, కఫ్నీ ధరించి తలకు గుడ్డకట్టుకున్న ఒక ఫకీరు వారింట్లో ఉన్నట్లు ఆమె చూసింది. అది విన్న ప్రధాన్‌కు తాను శిరిడీలో బాబావద్ద అనుమతి తీసుకుంటున్నప్పుడు "నేను మీ వెంట వస్తాను" అన్న బాబా మాటలు నిజమయ్యాయని తోచింది. దాంతో బాబా తమ ఇంట్లో ఉన్నారని అతను అనుకున్నాడు. తరువాత అతని కుటుంబంలోని వారందరూ బాబాను దర్శించి వారి ఆశీస్సులు పొందారు.

ఒకరాత్రి ప్రధాన్ తల్లిగారింట్లో అద్భుతమైన కీర్తనను నిర్వహించాడు దాసగణు మహరాజ్. తన కీర్తనలోని కథావిషయం ఏదైనప్పటికీ మధ్యలో బాబా గురించి, వారి లీలల గురించి వర్ణించేవాడు దాసగణు. అక్కడ కీర్తన ముగిశాక దాసగణు మహరాజ్, నానా చందోర్కరు, ఇంకా ఇతర స్నేహితులను శాంతాక్రజ్‌లో ఉన్న తన ఇంటికి వచ్చి విశ్రాంతి తీసుకోమని ఆహ్వానించాడు ప్రధాన్. అందరూ సంగీత వాయిద్యాలతో సహా ప్రధాన్ ఇంటికి వచ్చారు. అక్కడ మరో కీర్తన నిర్వహిస్తే బాగుంటుందని అందరూ తలచి కీర్తన మొదలుపెట్టారు. ఆ కీర్తన రాత్రి 2 గంటల నుండి వేకువఝామున 5 గంటల వరకు సాగింది. ఆ సమయంలో అక్కడున్న వారి మనసులు ఎంతగానో ప్రభావితం అయ్యాయి. ఆ కీర్తన విన్న శ్రీమతి ప్రధాన్‌కు శిరిడీ వెళ్లాలన్న బలమైన కోరిక కలిగింది. అంతేకాక, బాబా ఒకసారి తనకు కలలో కన్పించారని, అది బాబా తనను శిరిడీ రమ్మనడానికి సంకేతమని చెప్పింది. కానీ నెలలు నిండిన తన భార్య సోదరి విషయం ఎలా అని ప్రధాన్ ఆలోచించాడు. ప్రయాణం మధ్యలో నొప్పులొస్తే, ఆ పరిస్థితిని ఎదుర్కునేందుకు అతని భార్య, ఆమె సోదరి సంసిద్ధమయ్యారు. దాంతో ప్రధాన్ పన్నెండు టికెట్లకు డబ్బు చెల్లించి, ప్రత్యేకంగా ఓ సెకెండ్ క్లాస్ రైలు పెట్టెను బుక్ చేశాడు. అతడు ఆ రైలు పెట్టె మన్మాడ్ మీదుగా కోపర్గాఁవ్ చేరి, తిరుగు ప్రయాణంలో వారికోసం అక్కడే ఉండేటట్లు ఏర్పాటు చేసుకున్నాడు. ప్రయాణం ఎటువంటి ఇబ్బందులు లేకుండా సుఖంగా సాగింది. ఇక కోపర్గాఁవ్ చేరబోతుండగా శ్రీమతి ప్రధాన్ తమకోసం చందోర్కర్ గారు స్టేషనుకు వస్తారేమోనని అన్నది. అందుకు ప్రధాన్, "నేను శిరిడీ వెళ్తున్నట్లుగా చందోర్కర్‌కి జాబు వ్రాసినప్పటికీ, అతను వచ్చే అవకాశమే లేద"ని చెప్పాడు. కానీ ఆమె ఊహించినట్లుగానే చందోర్కర్ స్టేషనుకు వచ్చాడు.

చందోర్కరు తనకు సుస్తీగా ఉండడంతో శిరిడీ వెళ్ళి ఉన్నాడు. అతనికి రోజు మార్చి రోజు జ్వరం వస్తుండేది. ప్రధాన్ వాళ్ళు శిరిడీ వెళ్ళేరోజు, అతనికి జ్వరం వచ్చేరోజు ఒకటే అయ్యింది. అయినప్పటికీ వారి జాబునందుకున్న అతను కోపర్గాఁవ్ స్టేషనుకు వెళ్లి, వాళ్ళని స్వాగతించేందుకు బాబా అనుమతి కోరాడు. బాబా వెంటనే అనుమతించారు. అది తెలిసి దీక్షిత్ బాబాతో - చందోర్కరుకు జ్వరం వస్తుందని, అందువల్ల తాను స్టేషనుకు వెళ్ళి వాళ్ళని వెంటబెట్టుకుని వస్తానని అన్నాడు. కానీ బాబా దీక్షిత్‌ను వద్దని చందోర్కరును మాత్రమే స్టేషనుకు వెళ్ళమని గట్టిగా చెప్పారు. చందోర్కర్ స్టేషనులో ప్రధాన్ కుటుంబాన్ని కలిసి ఘనమైన ఏర్పాట్లు చేశాడు. స్త్రీలకు సౌకర్యంగా ఉండే వసతి కల్పించాడు. వాళ్లంతా గోదావరిలో స్నానమాచరించి క్షేమంగా శిరిడీ చేరుకున్నారు. చందోర్కర్ అంత శ్రమ తీసుకున్నప్పటికీ, ఆరోగ్యపరంగా అతనికి కొంచెం కూడా ఇబ్బంది కలగలేదు. అంతేకాదు, ఆరోజునుండి అతనికి మళ్ళీ జ్వరం రాలేదు.

  

 తరువాయి భాగం కోసం బాబా పాదాలు తాకండి.

4 comments:

  1. Om sai sri sai Jaya Jaya sai. Om sai sri sai Jaya Jaya sai, om sai sri sai Jaya Jaya sai 🙏🙏🙏🙏

    ReplyDelete
  2. nice leela to know sai devotees life leelas with sai is very good

    ReplyDelete
  3. ఓం శ్రీ సాయిరాం జీ 🙏🙏🙏

    ReplyDelete
  4. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo