సాయి వచనం:-
'నేను మీ కంటికి కనిపించనని మీరు చింతపడవద్దు. నా ఎముకలు మాట్లాడటాన్ని, మీకు కబుర్లు చెప్పడాన్ని మీరు వింటారు.'

'బాబా మహారాజు అయితే ఆయన బిడ్డలమైన మనమూ రాజకుమారులం, రాజకుమార్తెలమే. ‘మనమూ ఆ రాజవంశీకులమే’ అనే రాజసం, దర్పం, గర్వం, వినయం అన్నీ మనలోనూ ఉండి అందుకు తగ్గట్టుగా నడుచుకోవాలి' - శ్రీబాబూజీ.

డాక్టర్ ఇనామ్‌దార్ ఆధ్యాత్మిక వికాసం


సత్పురుషుని యొక్క అనుగ్రహం పొందడం అంత తేలిక కాదని తరచూ చెప్తూ ఉంటారు. బజారుకు వెళ్లి, కిరాణకొట్టులో తీసుకుని వచ్చేదికాదు సత్పురుషుల అనుగ్రహం. భక్తి, విశ్వాసాలు కలిగి ఉంటే సమయం వచ్చినప్పుడు సత్పురుషులే తమ అనుగ్రహాన్ని భక్తుని మీద కురిపిస్తారు.

డా.ఇనామ్‌దార్ దైవానుగ్రహం పొందిన వ్యక్తి. చిన్నవయసులోనే వైరాగ్యాన్ని సాధించడమే కాకుండా బాబా అనుగ్రహాన్ని పొందాడు. దురదృష్టవశాత్తు అతని పూర్తి పేరు, ఊరు తెలియలేదు. ఆయన వృత్తాంతాన్ని గిర్‌గాఁవ్ కి చెందిన రజని బార్కే అనే భక్తుడు ఇలా వివరించారు:
   
డా.ఇనామ్‌దార్ బాబా దైవత్వము గురించి, ఘనకీర్తి గురించి వినడమే కాకుండా చదివాడు కూడా. అందువలన, "అంతటి గొప్ప సత్పురుషుని పాదాలకు శరణు వేడాలి. ఆయన అనుగ్రహిస్తే నా ఈ మానవజన్మ యొక్క ఆధ్యాత్మిక లక్ష్యం నెరవేరుతుంది. కాబట్టి నేను వెంటనే శిరిడీ వెళ్లి బాబా దర్శనం చేసుకోవాలి" అని అతను అనుకున్నాడు. వెంటనే, 'ఏదో ఒకనాడు బాబా కరుణతో తనపై దృష్టి సారించి, ఉపదేశించి, ఆధ్యాత్మికోన్నతికి తోడ్పడతార'నే తలంపుతో శిరిడీ వెళ్ళాడు. శిరిడీలో వారంరోజులు ఉన్నాడు. అంతలో అతని చంచల మనస్సు, "ఎంతకాలం నేను ఇక్కడ ఉండాలి? బాబా నాకు మార్గదర్శనం చేయడం లేదు. అనవసరంగా నేనిక్కడ నా సమయాన్ని వృధా చేసుకుంటున్నాను. నా మనస్సు యొక్క చంచలత్వాన్ని అణిచివేసి, నాకు సరియైన మార్గం చూపే వేరొక సత్పురుషుణ్ణి చూసుకోవాలి" అని కలవరపడసాగింది.

మరుసటిరోజే డాక్టర్ బాబా అనుమతి తీసుకుని సతమ్ మహారాజ్‌ను కలవాలన్న ఆశతో ధానోలికి ప్రయాణమయ్యాడు. సతమ్ మహరాజ్ తన మనసుకు శాంతి ప్రసాదించి, ఉపదేశిస్తారని చాలా ఉత్సుకతతో ధానోలి చేరుకుని, సతమ్ మహరాజ్ ఎక్కడ ఉంటారో, ఆయనని ఎప్పుడు కలవాలో విచారించాడు. కానీ ఆ విషయంలో ఎవరూ అతనికి సహాయం చేయలేకపోయారు. ఎందుకంటే, సతమ్ మహరాజ్ ఒకేచోట ఎక్కువ కాలం ఉండటం చాలా అరుదు. డాక్టర్ ధానొలీలో రెండురోజులు ఉన్న తరువాత మళ్ళీ అతని చంచల మనస్సు కలవరపెట్టసాగింది. అతను ఒక ఎత్తైన కొండపైకి వెళ్లి కూర్చుని, "ఇంకా ఎన్ని రోజులు నేను ఇక్కడ నా సమయాన్ని వృధా చేసుకోవాలి?" అని ఆలోచనలోపడ్డాడు. మరుక్షణం సతమ్ మహరాజ్ అతని ముందు ప్రత్యక్షమై, "నీకు ఏ ఒక్క సత్పురుషుని మీదా  దృఢమైన విశ్వాసం  కలగలేదు. మరలాంటప్పుడు ఏ సత్పురుషుడైనా నీ పట్ల ఎలా ప్రసన్నులవుతారు? నీ చంచల మనస్సు పలువిధాలుగా పరుగులు తీస్తోంది. మరి ఆయన ఎలా నీకు ఆశ్రయమిస్తారు? నీ భక్తిలో సంపూర్ణ శరణాగతి లేదు. ముందు నీ మనస్సులో భక్తి నింపుకొని సర్వేంద్రియాలను ఒక్క సత్పురుషుని మీద కేంద్రీకరించు. అప్పుడు ఖచ్చితంగా నీ ఆధ్యాత్మిక లక్ష్యాన్ని చేరుకుంటావు" అన్న భావంతో ఉన్న ఒక అభంగాన్ని నిదానంగా గానం చేశారు. తరువాత సతమ్ మహరాజ్ డాక్టరును ఆశీర్వదించి, "తక్షణమే శిరిడీకి తిరిగి వెళ్ళమ"ని చెప్పారు.

తరువాత డాక్టర్ శిరిడీ చేరుకుని మసీదుకు వెళ్ళాడు. అతనిని చూస్తూనే బాబా నవ్వి, "భగవంతుడు పేరు వున్న ప్రతి ఒక్కదానిలో ఉన్నాడు. ఆయన సర్వవ్యాపి" అన్నారు. ఆ మాట వింటూనే అతను, "సత్పురుషులిద్దరూ ఒకే అంతర్‌దృష్టి కలిగి ఉన్నారు. ఇద్దరూ చెప్పే మాట ఒక్కటే!" అని ఆశ్చర్యపోయాడు. అదే డాక్టర్ జీవితంలో పెద్ద మలుపు. ఆ క్షణం నుండి డాక్టర్ బాబాకు అంకిత భక్తుడయ్యాడు. క్రమంగా అతని విశ్వాసం దృఢమవుతూ బాబా యందే అతని మనస్సు కేంద్రీకృతమయ్యింది. అతని విశ్వాసం బలపడేకొద్దీ ఇతర విషయాల పట్ల పూర్తి నిర్లిప్తత ఏర్పడి అంతరాంతరాలలో బాబాపట్ల భక్తి నిండిపోయింది. అలా బాబా అతన్ని అనుగ్రహించారు. బాబా ఆజ్ఞతో అతను తన మొత్తం జీవితాన్ని ఆయనకు సమర్పణ చేసుకున్నాడు. సౌరాష్ట్ర ప్రాంతమంతా బాబా మహిమను గానం చేస్తూ తిరిగాడు. చివరికి పోరుబందరును అతని స్వస్థానముగా చేసుకుని సౌరాష్ట్రలో 'గోంగ్డీవాలే బాబా'(the sadhu with a sheep’s blanket)గా ప్రసిద్ధిగాంచాడు.


సోర్స్: Baba's Divine Manifestations by విన్నీ చిట్లూరి.

8 comments:

  1. ఓం సాయిరాం...🌹🙏🌹

    ReplyDelete
  2. జై సాయిరాం! జై గురుదత్త!

    ReplyDelete
  3. Om Sree Sachidhananda Samarda Sadguru Sree Sai Nadhaya Namaha

    ReplyDelete
  4. OM SRI SACHIDHANAMDHA SAMARDHA SATHDGURU SAINATHAYA NAMAH.
    Om Sai Ram

    ReplyDelete
  5. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  6. Om Sairam
    Sai always be with me

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers


Blog Logo