సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 33వ భాగం....


ఈరోజు భాగంలో అనుభవాలు:
  1. అడిగింది ఇచ్చారు బాబా
  2. మూడువారాల పారాయణ స్వీకరించి, బాబా తమ అనుగ్రహాన్ని చూపించారు

అడిగింది ఇచ్చారు బాబా

హైదరాబాద్ నుండి ఒక సాయిభక్తురాలు తన అనుభవాన్నిలా తెలియజేస్తున్నారు.

సాయిబంధువులకు నా నమస్కారములు. పదిరోజుల క్రిందట జరిగిన ఒక అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటాను.


గతనెలలో నేను ఆఫీసులో సెలవు తీసుకుని మా అమ్మా వాళ్ల ఇంటికి వెళ్ళాను. మా నాన్నగారు నా పేరుమీద బ్యాంకులో క్రాప్ లోన్ తీసుకున్నారు. ప్రతి సంవత్సరం అది రెన్యువల్ చేయించాలి. లోన్ నా పేరుమీద ఉండటంవల్ల నేను తప్పనిసరిగా ఉండాలి. 2019, ఏప్రిల్ 23న నేను డ్యూటీలో చేరాల్సివుండగా, ఏప్రిల్ 22న లోన్ రెన్యువల్ చేసే పని పెట్టుకున్నాం. అందుకోసం వేరే బ్యాంకునుండి డబ్బులు తెచ్చి ఈ బ్యాంకులో కట్టి రెన్యువల్ చేయించాలి. అయితే మొదటి బ్యాంక్ వాళ్ళు డబ్బులు చేతికివ్వకుండా వేరే బ్రాంచిలో వేశారు. అందువలన నాన్న గుంటూరు వెళ్లి డబ్బులు డ్రా చేసుకుని వచ్చారు. అప్పటికి బాగా ఆలస్యమవటం వలన రెండో బ్యాంకుకి వెళ్ళడానికి చాలా తక్కువ సమయం ఉంది. ఆరోజు పని పూర్తికాకపోతే మరుసటిరోజు కూడా నేను ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. నాకు ఏమిచేయాలో అర్థంకాక. "బాబా! పని ఈ రోజే అయిపోతే బ్లాగులో నా అనుభవాన్ని పంచుకుంటాను" అని అనుకున్నాను. మేము వెళ్లేసరికి దాదాపు బ్యాంకు టైమ్ అయిపోవచ్చింది. మేము ఒకతనిని సంప్రదిస్తే, "బ్యాంకు టైమ్ అయిపోయింది. మీరు రేపు రావాల్సిందే" అన్నారు. నేను అతనితో, "నేను రేపు డ్యూటీలో జాయిన్ కావాలి. కాబట్టి ఈరోజు రాత్రి వెళ్ళిపోవాలి. ప్లీజ్, మీరే ఏదో ఒక సహాయం చేయండి" అని అభ్యర్థించాను. అప్పుడతను కావలసిన పేపర్లమీద నా సంతకాలు చేయించుకుని, బ్యాంకు ఫార్మాలిటీస్ పూర్తి చేసి, "మీరు రేపు రావాల్సిన పనిలేదు. మీ నాన్నగారు వస్తే చాలు" అని చెప్పారు. అలా బాబా అనుగ్రహించారు. "థాంక్యూ సో మచ్ బాబా! సదా నాకు అండగా నిలిచి అవసరంలో ఆదుకుంటున్నారు".

మూడువారాల పారాయణ స్వీకరించి, బాబా తమ అనుగ్రహాన్ని చూపించారు

పేరు వెల్లడించని సాయిభక్తురాలు తన అనుభవాన్ని పంచుకుంటున్నారు.

గత పది సంవత్సరాలుగా నేను సాయిబాబా భక్తురాలిని. ప్రస్తుతం చెన్నైలో నివాసముంటున్నాను. బాబా కృపవలన మా అబ్బాయి ఎమ్మెస్ పూర్తి చేసిన వెంటనే మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చింది. అయితే ఉద్యోగంలో చేరాక తెలిసిన విషయం ఏమిటంటే, రెండేళ్ల అనుభవం తర్వాత గానీ ఆ కంపెనీ వాళ్ళు హెచ్1బి వీసాకి స్పాన్సర్ చేయరని. తన స్నేహితులందరికీ చాలా సులువుగా హెచ్1బి వీసా లభించింది. అది తెలిసి మా అబ్బాయి కంపెనీ వాళ్లని మళ్ళీ వీసా స్పాన్సర్‌షిప్ గురించి అడిగాడు. చాలా ఆర్గ్యుమెంట్ జరిగాక వాళ్ళు స్పాన్సర్ చేయడానికి అంగీకరించారు. కానీ, ఆ ప్రయత్నంలో తన వీసా  తిరస్కరించబడటంతో తన జీవితం క్లిష్టపరిస్థితిలో పడిపోయింది. దాంతో మావాడు వేరే ఉద్యోగం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాడు. తను చాలా కంపెనీల్లో సెలెక్ట్ అయినప్పటికీ వీసా లేని కారణంగా ఆ ఉద్యోగాలు రాలేదు. తన తరఫున నేను, "బాబా! నేను నిజాయితీగా వారం విడిచి వారం 3 సప్తాహ పారాయణలు చేస్తాను. వీసా సెలెక్షన్స్ మొదలైన మొదటివారంలోనే తనకి వీసా ఇప్పించండి" అని ప్రార్థించి పారాయణ మొదలుపెట్టాను. మూడు పారాయణలు పూర్తైనప్పటికీ వీసా రాకపోవడంతో నేను చాలా ఆందోళనపడ్డాను. ఆ సమయంలో నా మనసుకెందుకో ఏప్రిల్ మొదటివారంలో వీసా సెలక్షన్స్ మొదలవుతాయనిపించింది. వెంటనే నేను, "మరో పారాయణ చేస్తాను. ఆ తర్వాత వీసా వచ్చినా, రాకపోయినా వాస్తవాన్ని స్వీకరించాల"ని నిర్ణయించుకున్నాను. ఆ ఆలోచన ప్రకారం పారాయణ మొదలుపెట్టాను. అయితే అనుకోకుండా మూడోరోజు నా నెలసరి మొదలుకావడంతో అర్థాంతరంగా పారాయణ ఆగిపోయింది. ఏం చేయాలో అర్థంకాక నేను చాలా ఏడ్చాను. కానీ బాబా కృప చూపించారు. మరుసటిరోజే మా అబ్బాయి వీసా లాటరీ ద్వారా ఆమోదింపబడింది. నేను కోరుకున్నట్లుగా మొదటివారం సెలక్షన్స్‌లోనే బాబా నా కోరిక తీర్చారు. అది బాబా మహిమ. నా మూడువారాల పారాయణ స్వీకరించి బాబా తమ అనుగ్రహాన్ని చూపించారు. అయితే అనుకోకుండా మరో సమస్య వచ్చిపడింది. రెండునెలల్లో మా అబ్బాయి స్టూడెంట్ వీసా ఎక్స్‌పైర్ కాబోతోంది. "బాబా! తన స్టూడెంట్ వీసా కూడా త్వరగా వచ్చేలా అనుగ్రహించండి".

1 comment:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo