కాకాసాహెబ్ దీక్షిత్ డైరీ - పదవ భాగం.
ఇంకా రాలేదా?
నేను శిరిడీలో ఉండగా బొంబాయి నుండి నాకో ఉత్తరం వచ్చింది. ఆ ఉత్తరములో నా సోదరుడు బాలూకాకాకి, నానాసాహెబ్ కరంబేల్కర్ భార్యకు చాలా ప్రమాదకరంగా జబ్బు చేసిందని తెలిపారు. ఆ విషయం నేను బాబాకు నివేదించాను. బాలూకాకా గురించి అడిగితే, “అతడికి బాగవుతుంది” అన్నారు బాబా. శ్రీకరంబేల్కర్ భార్య గురించి అడిగినపుడు, “ఆమె ఇంకా ఇక్కడకు రాలేదా?” అని అడిగారు. నేను 'లేద'ని జవాబిచ్చి, “రమ్మని కబురు చెయ్యమంటారా?” అని అడిగాను. "అలాగే, కబురు చెయ్యి" అన్నారు బాబా. ఇంతలో, బాలూకాకాకు ఆరోగ్యం చక్కబడ్డదనీ, కానీ కరంబేల్కర్ భార్య మరణించిందనే వార్త తెలిసింది!
బాబా ఒక్కమాటంటే చాలు!
హార్దాలో మేజిస్ట్రేట్‌గా పనిచేస్తున్న కృష్ణజీ నారాయణ్ అని పిలువబడే శ్రీచోటూభయ్యాసాహెబ్ పరూల్కర్ 1924, ఫిబ్రవరి 11వ తేదీన నాకిలా ఉత్తరం వ్రాశారు :
"బాబా అనుగ్రహం వల్ల నాకొచ్చిన ఒక జబ్బు నయమయింది. నేను ఆమ్లపిత్తవ్యాధి(biliousacidity)తో బాధపడుతూ ఉండేవాడిని. భోంచేస్తే తిన్నదంతా వాంతి అయిపోయేది. ఎంతమంది డాక్టర్ల దగ్గర, ఆయుర్వేద వైద్యుల దగ్గర మందులు తీసుకున్నా, ఏమాత్రం గుణం కనిపించలేదు. కొంతకాలం తరువాత, నా తండ్రిగారి మిత్రుడైన శ్రీసదాశివ రామచంద్ర పట్వర్ధన్‌గారు నాగపూర్ నుండి ఒక గొప్ప వైద్యుణ్ణి నా వద్దకు పంపి, ఆయన దగ్గర చికిత్స చేయించుకొమ్మని సలహా యిచ్చాడు. ఆ వైద్యుడు చాలా వృద్ధుడు. ఆయన హార్దా వచ్చి మందు తయారుచేశాడు. ముందు మూడు పొట్లాలు మందు ఇచ్చాడు. ప్రొద్దునొక పొట్లాం, మధ్యాహ్నం ఒక పొట్లాం వేసుకొన్నాను. అంతే, మధ్యాహ్నం మూడు గంటలకల్లా నాకు విరోచనాలు మొదలయ్యాయి. రాత్రి 8 గంటలయ్యేసరికి ఎన్ని విరోచనాలయ్యాయో నాకే గుర్తులేదు. ఆ దెబ్బకి ప్రక్కమీద నుంచి లేచే శక్తి కూడా నాకు లేకుండా పోయింది. ఆ పరిణామానికి ఆ వైద్యుడు, మా కుటుంబసభ్యులు విపరీతంగా భయపడిపోయారు. ఆ వైద్యుడు మా పూజాగదిలో కూర్చుని, దైవాన్ని ప్రార్థించి, ఆ తరువాత నా విరోచనాలు ఆగేందుకు ఒక మందిచ్చాడు. రాత్రి 11 గంటలకు కానీ విరోచనాలు తగ్గలేదు. ఆ వైద్యుడు నా తండ్రిగారితో, “ఇకమీదట ఆమ్లపిత్తానికి ఏ మందులూ వాడకండి! అది ఒక సత్పురుషుని కృపవల్లనే బాగవుతుంది” అని అన్నాడు. నేను మందులు వాడటం పూర్తిగా మానేశాను. ఆ తరువాత ఐదారు సంవత్సరాలకి నేను బాబా దర్శనం కోసం శిరిడీ వెళ్ళాను. నేనుగానీ, నాతో వచ్చిన మిత్రుడుగానీ నా జబ్బు గురించి బాబాతో ఏమీ చెప్పలేదు. ఆ మరుసటి సంవత్సరం గురుపూర్ణిమకు నేను మళ్ళీ శిరిడీ వెళ్ళాను. ఆ మరుసటిరోజు నేను, నా సోదరుడు నారాయణరావు, ఇంకా ఒకరిద్దరు ముగ్గురు మిత్రులు కలిసి మసీదులో బాబా వద్ద కూర్చున్నాము. ఇంతలో 'మౌసీబాయి' అనే ఆమె అక్కడికొచ్చింది. “మౌసీ, ఏం ఇంత ఆలస్యమయింది?" అని బాబా ఆమెనడిగారు. దానికామె, 'తాను పుల్లత్రేపుల('ఓక్లా')తో బాధపడుతున్నందువల్ల సమయానికి రాలేకపోయాన'ని జవాబిచ్చింది. దానికి బాబా నవ్వుతూ "నీవు బాగా ముక్కా మొయ్యా తింటున్నావు. అందుకే నీకీ బాధ!” అన్నారు హాస్యధోరణిలో. వెంటనే మౌసీబాయి తన జబ్బు నయం చెయ్యమని బాబాను ప్రార్థించింది. బాబా కొన్నిక్షణాలు మౌనంగా ఉండి, తరువాత నాకేసి చూపుతూ, “అతడు కూడా చాలాకాలంగా ఇదే వ్యాధితో బాధపడుతున్నాడు!” అన్నారు. అప్పుడు నా సోదరుడు నారాయణరావు బాబాతో, “అవును బాబా, ఇతను చాలాకాలంగా ఆ వ్యాధితో బాధపడుతున్నాడు. ఎన్ని వైద్యాలు చేసినా ఫలితం ఉండటంలేదు" అన్నాడు. దానికి బాబా, “ఇక మీదట అన్ని మందులు ఆపెయ్యమను! ఇకపై అతనికి ఆ బాధ ఉండదు” అన్నారు. ఆ తరువాత ఈరోజుకి ఎనిమిదేళ్ళు గడిచాయి. కానీ, ఆరోజునుండి యీనాటి వరకూ నాకా బాధ ఒక్కసారి కూడా రాలేదు. అంతకుమునుపు సుమారు 10, 12 ఏళ్లు నానా రకాల మందులు వాడాను. కానీ ఫలితం లేకపోయింది. కానీ బాబా అన్న ఒకే ఒక్క మాటతో ఆ జబ్బు పూర్తిగా నయమయింది. ఆ సమర్థ సద్గురుని లీలలు ఎంత అద్భుతాలు!"
తరువాయి భాగం రేపు
సోర్స్ : సాయిపథం - వాల్యూం 1