సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 51వ భాగం....


ఈరోజు భాగంలో అనుభవాలు: 
  1. దయగల తండ్రి
  2. సాయిబాబా కృపతో పరీక్షలో ఉత్తీర్ణత

దయగల తండ్రి

బాబా దివ్యచరణాలకు నా నమస్కారములు. సాయిబంధువులందరికీ వందనం. నేను ఒక సాయిభక్తురాలిని. మాది బెంగుళూరు. నా జీవితంలో ప్రతిక్షణం బాబా కృపతోనే గడుస్తుంది. "నా జీవితంలో మీరున్నందుకు థాంక్యూ సో మచ్ బాబా!". బాబా నాకు ప్రసాదించిన ఒక అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటాను.

2018 దసరా సెలవులకు మేము మా ఊరు వెళ్లి బెంగుళూరు తిరుగు ప్రయాణమైనరోజు దసరా సెలవులలోని చివరిరోజు కావడంవలన ఆరోజు ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంది. ఘాట్ రోడ్డులో ప్రయాణం కావడంతో మావారు క్లచ్ మీద చాలా ప్రెజర్ పెట్టి కారు డ్రైవ్ చేశారు. దాదాపు ఘాట్ రోడ్డు టాప్‌కి చేరుకున్నాక హఠాత్తుగా క్లచ్ పనిచేయకపోవడంతో కారు ఆగిపోయింది. ఎలాగో మేం కష్టపడి ఇతర వాహనాలకి అడ్డుకాకుండా కారుని రోడ్డు పక్కకి తీసి పార్క్ చేశాము. ఇతర వాహనాల డ్రైవర్లు మా కారు క్లచ్ చూసి, "క్లచ్ ప్లేట్లు పూర్తిగా పాడైపోయాయి. కాబట్టి బెంగళూరు వరకు తోసుకుంటూ వెళ్లాల్సిందే" అని చెప్పారు. ఆ మాట వింటూనే నా మతిపోయింది. 300 కిలోమీటర్లు తోసుకుంటూ వెళ్లడమంటే ఎవరి ఊహకు అందని విషయం. అటువంటి పరిస్థితిలో, "బాబా! మీరే దిక్కు. మాకు సహాయం చేయండి" అని ప్రార్థించాను. మావారు కూడా ఏం చేయాలో అర్థంకాక కాసేపు షాక్‌లో ఉండిపోయారు. ఇద్దరం నిల్చుని బాబాను ప్రార్థిస్తుండగా అప్పటికే లంచ్ టైం అయినందున పిల్లలు ఏడవడం మొదలుపెట్టారు. దగ్గరలో ఒక హోటల్ కనిపించడంతో మావారు, "ముందు భోజనాలు చేద్దాం" అని అన్నారు. సరేనని హోటల్‌కి వెళ్లి లంచ్ ఆర్డరిచ్చాం. ఈలోగా మావారు హోటల్ యజమానితో, "తాత్కాలికంగా మాకు సాయం చేయడానికి దగ్గర్లో ఎవరైనా మెకానిక్ ఉన్నారా?" అని ఆరా తీశారు. అతను ఒక మెకానిక్‌కి ఫోన్ చేశారు. ఆ మెకానిక్ వస్తానని చెప్పారు కూడా. అయితే మా దురదృష్టంకొద్దీ హెవీ ట్రాఫిక్ జామ్‌లో అతను ఇరుక్కుపోయాడు. గంట దాటినా అతను రాలేకపోయాడు. ఈలోగా మా భోజనాలు కూడా పూర్తై ఆందోళనపడుతూ బాబాను ప్రార్థిస్తూ ఉన్నాము. తరువాత మావారు కారులో కూర్చుని కారు స్టార్ట్ చేసే ప్రయత్నం చేశారు. ఆశ్చర్యం! మీరు నమ్మండి! వెంటనే కారు స్టార్ట్ అయింది. పూర్తిగా డ్యామేజ్ అయిపోయినా క్లచ్ ప్లేట్లు సవ్యంగా పనిచేశాయి. బాబానే స్వయంగా డ్రైవ్ చేస్తూ మమ్మల్ని తీసుకొచ్చారో ఏమోగానీ, దాదాపు 300 కిలోమీటర్లు ఏ సమస్యా లేకుండా ప్రయాణించి సురక్షితంగా బెంగుళూరు చేరుకున్నాం. మీకు ఇంకో విషయం చెప్పాలి, ఆరోజు ఉదయమే నాకు ఒక స్వప్నం వచ్చింది. ఆ కలలో కారు డాష్ బోర్డులో నవ్వుతూ ఉన్న బాబా ఫోటో కనిపించింది. నేను కారు బయట నిల్చొని బాబాను చూస్తూ ఉన్నాను. "బాబా! అది మీరు ఇచ్చిన సూచన అని నాకు ఇప్పుడు అర్థం అవుతోంది. కాకుంటే ఇంకేమిటి? మీకన్నీ తెలుసు బాబా, కేవలం మీ అనుగ్రహం వలన మాత్రమే మేం సురక్షితంగా చేరుకున్నాం. ఇదేవిధంగా పూర్వజన్మ చెడుకర్మఫలాల వలన మా కుటుంబమంతా అనుభవిస్తున్న కష్టాలనుండి కాపాడండి. దయగల తండ్రీ! మా జీవితగమ్యాన్ని సురక్షితంగా చేరుకునేలా అనుగ్రహించండి. మీ దివ్యచరణాలకు శతకోటి ప్రణామాలు బాబా!"

సాయిబాబా కృపతో పరీక్షలో ఉత్తీర్ణత

యు.ఎస్. నుండి ఒక సాయిభక్తురాలు తన అనుభవాలను పంచుకున్నారు.

మొదటి అనుభవం:

యు.ఎస్. లోని వీసా సమస్యల వలన నేను కెనడా IELTS పరీక్ష వ్రాయాలని చాలా ఆలోచించి పరీక్షకు స్లాట్ బుక్ చేసుకున్నాను. కెనడా ఇమ్మిగ్రేషన్ పొందాలంటే ఆ పరీక్షలో కనీసం 7.5 స్కోర్ తెచ్చుకోవాలి. అయితే వ్యక్తిగత జీవితంలోని, ఉద్యోగ జీవితంలోని సమస్యల కారణంగా నేను చాలా క్రుంగిపోయాను. ఇదేసమయంలో నా పేరెంట్స్ కూడా మూడు నెలల కోసం యు.ఎస్. వచ్చారు. ఇక వాళ్లతో సమయం గడపాల్సి రావడంతో పరీక్ష కోసం చదవడానికి నాకు సమయం దొరకలేదు. పరీక్షకు రెండువారాలు ఉందనగా నేను చదవడం మొదలుపెట్టాను. దాంతో కావాల్సిన స్కోరు సాధించగలనో, లేదోనని చాలా దిగులుగా అనిపించింది. మరోవైపు నా తోటి స్నేహితులందరికీ మంచి స్కోర్ వస్తే, నేను సంపాదించలేకపోతానేమోనని ఆందోళనపడ్డాను. అయితే, నేనెప్పుడూ ఏ ఇబ్బంది కలిగినా బాబానే నమ్ముకుంటాను. ఈసారి కూడా బాబా చరణాలనే నమ్ముకున్నాను. పరీక్షకు వారం ఉందనగా నావంతు పూర్తి కృషి చేస్తూ ఏడువారాల సాయి దివ్యపూజ మొదలుపెట్టాను. గురుపౌర్ణమినాడు మొదటివారం పూజచేసి మరుసటిరోజు పరీక్ష వ్రాసాను. బాబా కృపవలన పరీక్ష బాగా వ్రాయగలిగాను కానీ, మళ్లీ పరీక్ష వ్రాయాల్సి వస్తుందేమో, దానికోసం $250 ఖర్చుపెట్టాల్సి వస్తుందని ఆందోళనపడి, "బాబా! పరీక్షలో నాకు కావలసిన ఫలితం వస్తే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని ప్రార్థించాను. రెండువారాల తర్వాత నా పరీక్షాఫలితాలు వచ్చాయి. బాబా కృపవలన మంచి స్కోరింగ్ అంటే 9 కి 8 పాయింట్స్ వచ్చాయి. చూస్తూనే సంతోషంతో ఎగిరి గంతేసి, "థాంక్యూ సో మచ్ బాబా! కెనడా పి.ఆర్. ప్రక్రియ అంతా సజావుగా సాగేలా చూడండి" అని ప్రార్థించాను.

రెండవ అనుభవం:

నాకు కాబోయే భర్త తన ఉద్యోగానికి చాలా అవసరమైన సర్టిఫికేషన్ పరీక్ష వ్రాయాల్సి ఉంది. అదేసమయంలో తన సిస్టర్ పెళ్లి యు.ఎస్. లో ఉండటంతో, పెళ్లి పనులన్నీ తానొక్కడే చూసుకోవాల్సి వచ్చింది. దాంతో ఆ సమయంలో తను పరీక్షకు అస్సలు ప్రిపేర్ కాలేకపోయాడు. పెళ్ళైన తర్వాత పరీక్షకు ప్రిపేరైనా దురదృష్టంకొద్దీ మొదటి ప్రయత్నంలో ఉత్తీర్ణుడు కాలేకపోయాడు. దాంతో తన ఉద్యోగము, వీసా రెండూ అపాయంలో పడ్డాయి. ఎంత త్వరగా వీలైతే, అంత త్వరగా ఆ పరీక్షలో ఉత్తీర్ణుడు కావాలని మళ్ళీ పరీక్షకు స్లాట్ బుక్ చేసుకున్నాడు. తను కూడా బాబాని నమ్ముతాడు. మేమిద్దరము '108 ప్రదక్షిణలు, 5 వారాల సాయి దివ్యపూజ  చేస్తామ'ని బాబాకు మ్రొక్కుకున్నాము. పరీక్షకు వెళ్ళే రోజు నేను తనతో, "బాబాను ప్రార్థించి, ఊదీ పెట్టుకుని పరీక్షకు వెళ్ళమ"ని చెప్పాను. నేను చెప్పినట్లుగానే తను బాబాను ప్రార్థించి, ఆయనపై పూర్తి విశ్వాసంతో ఊదీ పెట్టుకుని పరీక్షకు వెళ్ళాడు. పరీక్ష పూర్తవుతూనే తనకు అండగా నిలిచినందుకు బాబాకు కోటి కోటి ప్రణామాలు చెప్పుకున్నాడు. తరువాత నాకు ఫోన్ చేసి, "బాబా దయవలన పరీక్ష బాగా వ్రాసాన"ని చెప్పాడు. "థాంక్యూ సో మచ్ బాబా! లవ్ యూ! మీకు ధన్యవాదాలు చెప్పుకోవడానికి నా దగ్గర ఏ పదాలూ లేవు. నేనెప్పుడు విశ్వాసాన్ని కోల్పోయినా మీరు నా చేయి పట్టుకుని నడిపిస్తున్నారు. ఎప్పుడూ మా చేతులు గట్టిగా పట్టుకుని మాకు సహాయం చేయండి బాబా!" కొన్ని సందర్భాలలో పరిస్థితులు చాలా కఠినంగా కనిపిస్తాయి కానీ, బాబా కృపతో భవిష్యత్తులో అన్నీ సర్దుకుంటాయి. ఆయన యందు విశ్వాసముంచి సహనంతో ఉండండి.


సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo