సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 42వ భాగం....


ఈరోజు భాగంలో అనుభవం:

  1. సచ్చరిత్ర చదవలేదని లీలలను వినిపించారు
  2. బాబా బాధ్యత - ఊదీ మహిమ
  3. శిరిడీ ప్రసాదం - సచ్చరిత్ర రూపంలో ఆశీస్సులు
  4. చిన్న కోరికనైనా బాబా విడిచిపెట్టరు

నెల్లూరు నుండి సాయిభక్తురాలు మోనిక తన అనుభవాలను పంచుకుంటున్నారు.

సచ్చరిత్ర చదవలేదని లీలలను వినిపించారు

నేను (2019)జనవరి నెల చివర్లో ప్రతిరోజూ సాయిసచ్చరిత్ర చదవటం మొదలుపెట్టాను. ఒకరోజు కాలేజీకి ఆలస్యం అవుతుండటంతో సచ్చరిత్ర చదవకుండానే వెళ్ళిపోయాను. మధ్యాహ్నం నా సహోద్యోగి ఒకరు(నిజానికి తను క్రిస్టియన్) నన్ను పిలిచి సచ్చరిత్రలోని రెండు లీలలు చెప్పారు. తరువాత తను, "నిన్న రాత్రి నేను యూట్యూబ్ చూస్తుంటే బాబా వీడియోలు కనిపించాయి. ఇంతకుముందెప్పుడూ అలా జరగలేదు. నాకు ఎప్పుడూ జీసస్ వీడియోలు మాత్రమే కనిపిస్తాయి. ఎందుకో వాటిని చూడాలనిపించి చూసాను. ఇప్పుడు వాటిని నీకు చెప్పాలనిపించి నీతో పంచుకున్నాను" అని చెప్పారు. నేను ఉదయాన సచ్చరిత్ర చదవలేకపోయానని నా సహోద్యోగి ద్వారా నాకు సచ్చరిత్రలోని లీలలను వినిపించారు బాబా. ఎంతో అదృష్టంగా భావించి చాలా సంతోషించాను. "థాంక్యూ సో మచ్ బాబా!"

బాబా బాధ్యత - ఊదీ మహిమ

ఏప్రిల్ నెలలో ఒక గురువారం(తేదీ సరిగా గుర్తులేదు). ఆరోజు కనుపూరు ముత్యాలమ్మ జాతర మొదలైంది. ఆరోజు ఉదయం మా అమ్మగారు నాతో, "ఈరోజు అమ్మవారి జాతర కదా, కొబ్బరికాయ కొట్టు" అన్నారు. నాకు అమ్మవారంటే చాలా ఇష్టం. సంతోషంగా ఇంట్లో దేవుడికి కొబ్బరికాయ కొట్టి నమస్కరించుకుని కాలేజీకి వెళ్ళిపోయాను. సాయంత్రం తిరిగి వచ్చాక దాదాపు 7 గంటల సమయంలో నాన్న, అన్నయ్య బయటికి వెళ్లారు. ఇంట్లో నేను, అమ్మ మాత్రమే ఉన్నాము. అమ్మ వంటగదిలో పని చేసుకుంటూ ఉంది, నేను వేరే గదిలో ఉన్నాను. హఠాత్తుగా అమ్మ పెద్దగా నన్ను పిలిచారు. నాకేం అర్థంకాక కంగారుగా వెళ్లి చూస్తే, అమ్మ వంటగది ద్వారంవద్ద క్రిందపడిపోయి నొప్పితో ఏడుస్తూ ఉన్నారు. కాసేపు నాకేమీ అర్థం కాలేదు. తరువాత నేను తనకు సహాయం చేస్తుంటే, తను నాతో, "నేను బాగానే ఉన్నాను. ఆలస్యమవుతుంది, నువ్వు  ముందు వెళ్లి దేవుడి ముందు దీపం పెట్టు" అన్నారు. ఆ సమయంలో మా బెడ్‌రూమ్ తలుపు ఎదురుగా ఉన్న బాబా ఫోటో మీద నా దృష్టి పడింది. ఆ ఫోటో నాకు చాలా ప్రత్యేకమైనది. నేను సాయిలీలామృతం పారాయణం చేద్దామనుకున్నప్పుడు హఠాత్తుగా మా కజిన్ నాకా ఫోటో ఇచ్చారు. 'నేను ఉన్నాను, నువ్వు పారాయణ మొదలుపెట్టు' అన్నట్లు బాబా వచ్చారని నాకనిపించింది. అందుకే ఆ ఫోటో నాకంత ప్రత్యేకం. ఫొటోలో బాబాను చూస్తూ కోపంతో, "బాబా! మీరెందుకు చూస్తూ ఉన్నారు? అమ్మ అలా పడిపోతుంటే మీరెలా ఊరుకున్నారు? మీరు చూసుకోవాలి కదా!" అని ఏదేదో అంటూ ఆయనను నిందించాను(క్షమించండి బాబా!). తరువాత పూజగది లోపలికి వెళ్లి, అమ్మవారితో, "ఏమిటమ్మా ఇది? మీ జాతరని గుర్తుపెట్టుకుని మరీ అమ్మ నాచేత కొబ్బరికాయ కొట్టించింది. ఇలాగేనా తనని చూసుకునేది?" అని అన్నాను. తరువాత దీపం పెట్టి బయటకి వచ్చి చూస్తే, అమ్మ సోఫాలో కూర్చుని ఉన్నారు. నన్ను చూస్తూ నొప్పిగా ఉందని చెప్పారు. మా అమ్మ కొంచెం బరువు ఎక్కువ ఉంటారు కాబట్టి పడిపోయినందువలన వచ్చిన ఆ నొప్పి ఎక్కువగా ఉండి తనకి చాలా బాధగా ఉంటుందని నాకు తెలుసు. బాబా, అమ్మవారు తనని కాపాడుతారని కూడా తెలుసు. వెంటనే బాబా ఊదీ అమ్మకి పెట్టాలనుకున్నాను కానీ, అమ్మ పెట్టించుకుంటుందో లేదోనని ఆగిపోయాను. అయితే  సచ్చరిత్రలోని ఒక లీల గుర్తుకు వచ్చింది. "ఒక భక్తుడు తన కూతురి కోసం ఊదీ అవసరమై నానాసాహెబ్ చందోర్కరును అడుగుతాడు. ఆ సమయంలో నానా స్టేషన్ కి వెళ్లే మార్గంలో ఉంటాడు. వెంటనే నానా సాయిబాబా నామస్మరణ చేసి నేలపై ఉన్న మట్టిని తీసి తన భార్య నుదుటిన పెడతాడు. దాంతో వేరే ఊరిలో ఉన్న ఆ అమ్మాయికి నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది". వెంటనే నేను, "బాబా! అమ్మకోసం నేను ఊదీ పెట్టుకుంటున్నాను, తనకి నొప్పి తగ్గించండి. మీ ఊదీ శక్తి ఏమిటో చూపించండి" అని ప్రార్థించి ఊదీ నేను పెట్టుకున్నాను. ఎంత అద్భుతం జరిగిందంటే, అంత నొప్పీ ఏమైందో తెలీదు. కేవలం పదినిమిషాల్లో అమ్మ మామూలైపోయింది. కొత్త శక్తి వచ్చినట్లు చాలా ఉత్సాహంగా అయిపోయి, "నాకు బాగానే ఉంది" అని తన పనంతా తనే చేసుకుంది. అమ్మని అలా చూసి నాకు ఆశ్చర్యంగా అనిపించి బాబాకి, అమ్మవారికి కృతజ్ఞతలు తెలుపుకున్నాను. మరుసటిరోజు కూడా ఆమెలో అంతే ఉత్సాహం. ఆ రోజంతా బాబా ఇచ్చిన ఆ ఆనందంతో ఎంతో సంతోషంగా గడిపాను. ఎలా బాబా తన భక్తులను కాపాడుతారో అర్థమై ఎంత అనుభూతి పొందానో నాకు తెలుసు. ఆయనకి నా శిరస్సు వంచి ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. బాబా, అమ్మవార్లు ఎప్పుడూ ఇలాగే మమ్మల్ని రక్షిస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. బాబా అంటారు, "నా భక్తుని కుటుంబ బాధ్యత నాదే" అని. ఆ మాట నిజమే! ఆయన ఆ బాధ్యత నెరవేర్చారు. లేకుంటే నేను ఒక్కదాన్నే అమ్మను ఎలా చూసుకోగలిగేదాన్నో ఉహించలేను కూడా. ఇది నాకు చాలా ముఖ్యమైన అనుభవం. ఆ అనుభవంతో ఊదీ మహిమ ఏమిటో నాకు తెలియజేసారు బాబా.

శిరిడీ ప్రసాదం - సచ్చరిత్ర రూపంలో ఆశీస్సులు

నెలరోజుల క్రిందట ఒకరోజు నేను కాలేజీలో ఉండగా నా సహోద్యోగి ఒకరు శిరిడీ నుండి నాకోసం సాయిసచ్చరిత్ర తీసుకొచ్చి నా చేతిలో పెట్టారు. ఆ పుస్తకాన్ని బాబా సమాధికి తాకించి తెచ్చానని చెపుతూ, 'నువ్వు చాలా అదృష్టవంతురాలివి' అని అన్నారు. ఎందుకంటే, వాళ్ళ అంకుల్ వాళ్ళు కూడా సచ్చరిత్ర తీసుకోవాలని అనుకున్నారట కానీ సాధ్యపడలేదట. ఆ రూపంలో బాబా నాకు పంపిన ఆశీస్సులుగా భావించి చాలా సంతోషపడ్డాను. అందుకే ఆ పుస్తకం నాకు చాలా ప్రత్యేకమైంది.

తరువాత తను మా స్టాఫ్ అందరికీ శిరిడీ ప్రసాదం ఇవ్వబోతూ నాతోనే మొదలుపెట్టారు. కానీ నేను చేతులు కడుక్కుని తరువాత తీసుకుంటానని చెప్పాను. అయితే తరువాత ఏ కారణం చేతనో తను నాకు ప్రసాదం ఇవ్వలేదు. నాకు బాధగా అనిపించి, "బాబా ప్లీజ్! నాకు మీ ప్రసాదం కావాలి,  ఇవ్వొచ్చు కదా! ప్లీజ్.. ప్లీజ్ ..!" అని మనసులో అనుకున్నాను. అంతలో మరో సహోద్యోగి నన్ను ఒక సబ్జెక్టులో తనకున్న సందేహాన్ని అడిగారు. ఆ సబ్జెక్టు సంవత్సరం క్రిందట నేను చెప్పి ఉన్నప్పటికీ సడన్‌గా అడగటం వలన, పైగా క్లాసుకి టైమ్ అవుతుందన్న టెన్షన్లో తన సందేహానికి పరిష్కారం నాకు తోచలేదు. కానీ సహాయం చేయమని ఒకరు అడుగుతుంటే చెప్పకుండా వెళ్లిపోవడం నాకే బాధగా అనిపించింది. వెంటనే, "ప్లీజ్ బాబా! క్లాసుకి టైమ్ అవుతుంది, నాకేదైనా సహాయం చేయండి" అని అనుకున్నాను. వెంటనే మిరాకిల్ జరిగినట్లుగా రెప్పపాటు కాలంలో(బహుశా అంతకన్నా తక్కువే) టకటక వివరించి తన సందేహాన్ని తీర్చగలిగాను. జరిగినదానికి నన్ను నేనే నమ్మలేకపోయాను. "థాంక్యూ బాబా" అని మనసులోనే చెప్పుకున్నాను. మరుక్షణంలో తను నా చేతిలో ప్రసాదం పెట్టి వెళ్లిపోయారు. బాబా ప్రసాదం నా చేతిలో...! నాకెంత ఆనందం కలిగిందో మాటల్లో చెప్పలేను. నాకు ప్రసాదం చేర్చటం కోసమే బాబా నా సహోద్యోగికి సబ్జెక్టులో సందేహం వచ్చేలా చేసి, ఆమెకిచ్చిన ప్రసాదం నాకు ఇప్పించి నన్ను కరుణించారు. "థాంక్యూ సో మచ్ బాబా! మీ లీలలు అనూహ్యమైనవి. అవి అర్థం చేసుకోవటం అనితరసాధ్యం".

చిన్న కోరికనైనా బాబా విడిచిపెట్టరు

పదిరోజుల క్రితం నేను నడుచుకుంటూ వెళ్తూ, "బాబా! నేను ఆటో దగ్గరకి వెళ్ళేలోపు ఒకసారి మీ రూపం కనిపిస్తే, నేను చాలా సంతోషిస్తాను" అని అనుకున్నాను. మళ్ళీ అంతలోనే, "లేదు, లేదు బాబా! మీరు నా హృదయంలోనే ఉన్నారు. బయట కనిపించకపోయినా ఏమీ కాదు" అని అనుకున్నాను. ఒక 20 అడుగులు వేసుంటాను, అప్పటికి ఆ విషయం పూర్తిగా మర్చిపోయి వేరే ఏదో ఆలోచిస్తున్నాను. మరో మూడడుగులు వేస్తే నేను ఆటో ఎక్కాల్సిన చోటు ఉందనగా హఠాత్తుగా ఎందుకో ఒక వైపుకు చూడాలనిపించి చూస్తే, కారు మీద బాబా రూపం దర్శనమిచ్చింది. నేనెంత సంతోషం పొందానో మాటల్లో చెప్పలేను. మనం మర్చిపోయినా బాబా తన బిడ్డల కోరికలు మర్చిపోరు. "థాంక్యూ సో మచ్ బాబా!"

నాకు బాబా ఇచ్చిన ప్రతి అనుభవం చాలా చాలా స్పెషల్. ప్రతి అనుభవం నా జీవితాన్ని ఆనందభరితం మరియు కరుణరసమయం చేస్తున్నాయి. ఆ ఆనందాన్ని మీతో కూడా పంచుకోవాలనే నా ఈ ప్రయత్నం. 'అసలిదంతా నేనే టైపు చేసానా?' అని నాకే ఆశ్చర్యంగా ఉంది. అంతా బాబా దయ. "బాబా! మీరు నాకు చాలా చాలా అనుభవాలనిచ్చారు. కాకడ ఆరతి నేర్చుకోలేననుకుంటే మీరే దగ్గరుండి నేర్పించారు. చెప్పుకుంటూ పోతే రోజులో ప్రతీ నిమిషం మీరు నాకిచ్చిన గొప్ప వరం. సదా ఎప్పుడూ ఇలానే మా అందరినీ కాపాడుతూ ఉండండి, ప్లీజ్! నన్నెప్పుడూ మీ నుండి దూరం కానివ్వకండి. ప్లీజ్...ప్లీజ్..బాబా!"

సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo