సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 58వ భాగం....


ఈరోజు భాగంలో అనుభవాలు:
  1. సాయినాథుని సంరక్షణ
  2. ఊదీ మహిమ

సాయినాథుని సంరక్షణ:

సాయిబంధువులందరికీ నమస్కారం. నాపేరు శ్రావణి. బాబా నా జీవితంలోకి ప్రవేశించినప్పటినుండి నాకు అండగా ఉంటూ నా జీవితాన్ని నడిపిస్తున్నారు. ఆయన ఇచ్చిన అనుభవాలను ఎప్పటికప్పుడు మీతో పంచుకుంటూనే ఉన్నాను. ఇప్పుడు ఏప్రిల్, మే నెలల్లో బాబా ఇచ్చిన మరికొన్ని అనుభవాలను మీ అందరితో పంచుకుంటాను.


మొదటి అనుభవం:

బాబా నా జీవితంలోకి వచ్చిన కొద్దిరోజులకే 'నాకొక అన్నయ్యని ఇచ్చార'ని గత సంవత్సరం మీతో పంచుకున్న ఒక అనుభవంలో తెలియపరిచాను. నేను అన్నయ్యతో మొదటిసారి మాట్లాడింది 2018, ఏప్రిల్ 13న. ఇక అప్పటినుండి నాకు తననెప్పుడు చూస్తానా అని ఉండేది. అప్పుడప్పుడు, "బాబా, అన్నయ్యని నాకు ఎప్పుడు చూపిస్తారు?" అని బాబాని అడుగుతుండేదాన్ని. అక్టోబర్ నెలలో అన్నయ్య శిరిడీ వెళ్ళినప్పుడు ఈ విషయం గురించి బాబాని అడగమని తనకి కూడా చెప్పాను. తను, "బాబా అనుకుంటే, మనం సంవత్సరంలోనే కలవొచ్చు" అన్నారు. అదే జరిగింది. సరిగ్గా సంవత్సరానికి 2019, ఏప్రిల్ 13న నేను అన్నయ్యను చూసే అవకాశాన్ని బాబా ఇచ్చారు. తను శిరిడీ వెళ్లి తిరిగి వచ్చేటప్పుడు ఏప్రిల్ 12, 13 రెండురోజులు హైదరాబాదులో ఉంటానని చెప్పారు. నాక్కూడా హైదరాబాదులో పని ఉండడంతో ఆరోజుకు హైదరాబాద్ చేరుకుని అన్నయ్యని కలిసాను. అలా మొదటిసారి మా పరిచయం జరిగిన తేదీ రోజే మేము కలిసేలా ఏర్పాటు చేసారు బాబా. "బాబా! ఆ తేదీని ఎప్పటికీ గుర్తుండిపోయేలా మంచి గిఫ్ట్ ఇచ్చారు. మీ ఆశీస్సులు లేకుంటే ఇదంతా జరిగేది కాదు. హైదరాబాద్ ప్రయాణంలో కూడా మీరు నాకు తోడుగా ఉన్నారని నాకు తెలుసు. థాంక్యూ బాబా!"


రెండవ అనుభవం:

ఏప్రిల్ 22వ తేదీన మా ఇంట్లో మరమ్మత్తు పనులు జరుగుతూ ఉన్నాయి. మా ఇంటి ఆవరణలో ఒక బాత్రూమ్ ఉంది. పని చేస్తున్నతను బాత్రూమ్ గోడలు చూసి, "ఈ గోడలు పటిష్ఠంగా లేవు. కూలిపోయే ప్రమాదం ఉంది, దీన్ని కూడా మరమ్మత్తు చేసేద్దామా?" అని అడిగారు. నిజానికి అది నిర్మించింది 2015లోనే. అందువలన మా నాన్న దాన్ని మరమ్మత్తు చేయడానికి ఒప్పుకోలేదు. కానీ నేను, "దాన్ని కూడా మరమ్మత్తు చేసేయండి" అని చెప్పాను. అతను సరేనని అందుకు కావాల్సిన డమ్మీ పైపులు తీసుకుని రావడానికి వెళ్లారు. అతను మా ఇల్లు దాటి నాలుగడుగుల దూరంలో మా వీధిలో ఉన్న బాబా మందిరం వరకు వెళ్ళుంటారు. అంతలోనే ఆ గోడ అమాంతంగా కూలిపోయింది. మేము ఆశ్చర్యపోతూ చూస్తూ ఉంటే, పక్కనే ఉన్నావిడ, "నిజంగా బాబా నీ నోటితో గోడ మరమ్మత్తు చేయమని చెప్పించినట్లున్నారు. నువ్వు చెప్పకపోయుంటే అతను అక్కడే పని చేస్తుండేవాడు. ఎంత ప్రమాదం తప్పింది!" అని అంది. ఆవిడ 'బాబా చెప్పించి ఉంటారు' అనడంతోనే నేను ఆశ్చర్యపోయాను. నిజంగా బాబా చాలా పెద్ద ప్రమాదంనుండే కాపాడారు. ఎందుకంటే, మా అమ్మ అటువైపు తిరుగుతూ వుంటుంది, మరీ ముఖ్యంగా మా అబ్బాయి ఎప్పుడూ అటువైపే ఆడుతుంటాడు. పని చేస్తున్నతను కూడా అప్పుడే వెళ్ళాడు. సంఘటన జరిగే సమయానికి ఎవరూ అక్కడ లేకపోవడం బాబా కృపే. 'ఎవరికైనా ఏమైనా జరిగివుంటే?' అని ఊహించుకోవడానికే చాలా కష్టంగా ఉంది. "చాలా చాలా కృతజ్ఞతలు బాబా, ఎల్లవేళలా మమ్మల్ని కంటికి రెప్పలా కాపుకాస్తున్నారు".


మూడవ అనుభవం:

2019, ఏప్రిల్ 28న వేరే ఊరిలో ఉన్న మా ఫ్రెండ్, వాళ్ళ ఇంటిలో చేసుకుంటున్న పూజకు నన్ను, నా ఫ్రెండ్ ని ఆహ్వానించింది. నేను, నా ఫ్రెండ్ వెళ్ళడానికి నిర్ణయించుకున్నాం. కానీ, అక్కడకు వెళ్లేందుకు దారి, బస్సు టైమింగ్స్ వంటి వివరాలు ఏవీ సరిగ్గా తెలియవు. నేను ఇంటినుండి బయలుదేరేటప్పుడు మా వీధిలో ఉన్న బాబా గుడిలో బాబాకు నమస్కరించుకుని, "బాబా! మాకు ఎలా వెళ్లాలో తెలియదు, మీరే మాకు తోడుగా ఉండి జాగ్రత్తగా తీసుకెళ్లండి" అని ప్రార్థించి వెళ్ళాను. మేము బస్టాండుకి చేరుకునేసరికి మేము వెళ్లాల్సిన ఊరికి వెళ్ళే బస్సు బయలుదేరేందుకు సిద్ధంగా ఉంది. వెంటనే మేము బస్సు ఎక్కేసాము. ఆశ్చర్యం! బస్సులోని కండక్టర్ టెన్త్ క్లాసులో మా తోటి విద్యార్థి. తను మమ్మల్ని సరిగ్గా పూజ జరుగుతున్న చోట దింపాడు. 'మాకు తోడుగా ఉండండి బాబా' అని అడిగినందుకు నిజంగానే బాబా దగ్గరుండి దించినట్లనిపించింది. "థాంక్యూ సో మచ్ బాబా!"


నాల్గవ అనుభవం:

ఈమధ్య ఎండలు ఎక్కువగా ఉండటంతో నా నోరంతా పూచి, నాలుక భాగమంతా సన్న గుల్లలు వచ్చి బాగా పొక్కిపోయింది. ఏది తినాలన్నా చాలా కష్టంగా ఉండేది. రెండురోజులపాటు మాట్లాడటానికి కూడా కష్టంగా ఉండేది. చివరికి నీళ్ళు త్రాగినా మంటగా అనిపించేది. ఆ బాధ భరించలేక బాబాని ప్రార్థించి కొంచెం ఊదీ తీసుకుని నాలుకపైనంతా రాసుకున్నాను. అలా రెండురోజులపాటు చెయ్యగా క్రమేపీ నొప్పి, మంట తగ్గిపోయాయి. "థాంక్యూ సో మచ్ బాబా!"

ఊదీ మహిమ:

ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

ఒకరోజు సాయంత్రం నేను నా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను. తను నాకోసం ఎగ్ కర్రీ చేసి డిన్నర్ లో పెట్టింది. నిజానికి అలర్జీ కారణంగా నేను కొన్ని ఆహారపదార్థాలను రాత్రిపూట తీసుకోవడం మానేసాను. వాటిలో ఎగ్ కూడా ఒకటి. కానీ తిననని హంగామా చేయడం ఎందుకని నా ఫ్రెండ్ సంతోషం కోసం ఎగ్ కర్రీ తిన్నాను. తర్వాత నీళ్లు త్రాగి నిద్రపోయాను. హఠాత్తుగా అర్థరాత్రి రెండుగంటల సమయంలో ఛాతీకి, కడుపుకి మధ్యభాగంలో నొప్పి మొదలైంది. వికారంగా కూడా అనిపించింది. నాకు చాలా ఆందోళనగా అనిపించి వెంటనే పూజగదిలోకి వెళ్లి, "బాబా! ఈ నొప్పి తగ్గిపోతే నా అనుభవాన్ని బ్లాగులో షేర్ చేసుకుంటాను" అని ప్రార్థించి కొంచెం ఊదీ తీసుకుని నా నుదిటిపై పెట్టుకుని, మరికొంత నోట్లో వేసుకున్నాను. తర్వాత కూర్చుని ఇంగ్లీష్ బ్లాగులో భక్తుల అనుభవాలు చదవడం మొదలుపెట్టాను. ఒక్కొక్క అనుభవం పూర్తయ్యేకొద్దీ కొంచెం కొంచెంగా నొప్పి తగ్గుతున్నట్లుగా అనిపించింది. మొత్తం అనుభవాలన్నీ పూర్తయ్యేసరికి నొప్పి మొత్తం తగ్గిపోయింది. వికారంగా అనిపించడం కూడా తగ్గిపోయింది. తర్వాత నేను హాయిగా నిద్రపోయాను. "ప్రియమైన బాబా! మీరు లేకుంటే, మేము కూడా లేము. ఎల్లప్పుడూ మా తప్పులు మన్నించి, మీ కృపను మాపై ఉంచండి. ఏమీ ఆశించకుండా మాపై ప్రేమను కురిపించే మీ తల్లిప్రేమకు నా నమస్సుమాంజలు". 

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo