సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయి అనుగ్రహ సుమాలు - 19 వ భాగం.


కాకాసాహెబ్ దీక్షిత్ డైరీ - 19వ భాగం.

శ్రీ హరిసీతారామ్ దీక్షిత్ గారు వ్రాసి ఉంచిన అనుభవాలు.

అనుభవం - 16

శంకర్రావ్ క్షీరసాగర్ మామ్లేదార్ ఒకసారి బాబా దర్శనానికై వచ్చినప్పుడు బాబా  దక్షిణ అడిగారు. తాను జేబులోనున్న డబ్బులన్నింటినీ బాబా చేతికి ఇచ్చారు. తాను వాడాకు తిరిగి వచ్చాక ఎవరో తనను “నీవు తిరిగి వెళ్ళడానికి డబ్బులెలా?” అని అడిగారు. అందుకు శంకర్రావ్ “బాబా ఇస్తారు” అని చెప్పారు. అదే రోజు సాయంకాలం రహతాకు చెందిన పోస్ట్ మాస్టర్ తన అతిథితో కలసి శిరిడీకి వచ్చారు. ఆ అతిథికి శంకర్రావు కొన్ని సంవత్సరాల క్రితం రూ. 20/- లను అప్పుగా ఇచ్చారు. తాను ఆ డబ్బులను శంకర్రావు అడగకుండానే తిరిగి ఇచ్చారు. అంటే శంకర్రావు ఖర్చులన్నింటికీ ఆ డబ్బులు సరిపోయాయి.

అనుభవం -17

బాబా తమ దేహాన్ని మంగళవారం అక్టోబర్ 15వ తారీఖు, మూడవ పొద్దులో త్యజించారు. అదే రోజు రాత్రి బాబా లక్ష్మణ్ భట్ స్వప్నంలోకి వచ్చి “బాపూసాహెబ్ జోగ్ నాకు కాకడ ఆరతి చేయడానికి రాడు, కారణం తాను నేను చనిపోయానని అనుకుంటున్నాడు. కానీ నేను జీవించే ఉన్నాను. నీవు వచ్చి నాకు కాకడ ఆరతి చేయి” అని చెప్పారు. స్వప్నంలో వచ్చిన ఆజ్ఞ ప్రకారం తెల్లవారుఝామున లక్ష్మణ్ భట్ ద్వారకామాయిలోకి వెళ్ళాడు. కారణం, ఆరోజు బాబా దేహాన్ని ద్వారకామాయిలోనే ఉంచారు. లక్ష్మణ్ భట్ వెళ్ళి అక్కడ ఆరతి చేశాడు. ఆ సమయంలో బాబా చేతులు కదలసాగాయి అని అందరికీ అనిపించింది. మధ్యాహ్నం కూడా ఆరతి ద్వారకామాయిలోనే జరిగింది. 16వ తారీఖు సాయంకాలం బాబా దేహాన్ని బూటీ వాడాకు తీసుకు వచ్చి పెట్టారు. అక్కడ ఆరోజు రాత్రి శేజారతి జరిగింది. తరువాత అక్కడ నిత్యనియమంగా కాకడ ఆరతి, మధ్యాహ్న ఆరతి, సాయంకాలం ఆరతి మరియు శేజ్ ఆరతి అనే క్రమం మొదలై ఇప్పటికీ అప్రతిహతంగా సాగుతూనే ఉంది.

అనుభవం - 18

బాబా మహాసమాధి చెందిన తరువాత రెండు, మూడు రోజులకు శాంతాక్రుజ్ కు  చెందిన మోరేశ్వర్రావు ప్రధాన్ యొక్క మరదలికి బాబా స్వప్నంలో కనిపించి “నీ ట్రంకుపెట్టెలో పసుపు రంగు పీతాంబరం ఉంది. ఆ వస్త్రాన్ని నా సమాధిపై కప్పడానికి పంపించు” అని చెప్పారు. ఆమె ఆ పీతాంబర వస్త్రాన్ని చాలా సంవత్సరాల పూర్వం ట్రంకుపెట్టెలో భద్రపరచి ఉంచింది. ఆ విషయం ఆమెకు గుర్తు కూడా లేదు. లేవగానే ఆమె ఆ స్వప్నాన్ని గురించి మోరేశ్వర్ ప్రధాన్ కు చెప్పింది. వెనువెంటనే ట్రంకు పెట్టె తెరచి, ఆ పీతాంబరవస్త్రాన్ని శిరిడీకి పంపించమని మోరేశ్వర్ ప్రధాన్ కు ఇచ్చింది. ప్రస్తుతం ఆ వస్త్రం ఇక్కడే (శిరిడీలో) ఉంది. అప్పుడప్పుడు ఆ వస్రాన్ని సమాధిపై కప్పి ఉంచుతారు.

అనుభవం - 19

ఒకరోజు తెల్లవారుఝామున లక్ష్మణ్ రావ్ ఉరఫ్ కాకా మహాజని స్వప్నంలో బాబా కనిపించి “నిద్రపోతున్నావా? లే, ఈ రోజు నాది ముప్పయ్యవ రోజు. లేచి ఆ కార్యక్రమం సంగతి చూడు” అని చెప్పారు. మహాజని నిద్ర మేల్కొన్నాడు. తనకు ఏమనిపించిందంటే, ముప్పయ్యవ రోజు ఎప్పుడో అయిపోయి ఉంటుంది అని! కాని మరలా తాను లెక్కపెడితే ఆరోజు ముప్పయ్యవ రోజుగా తేలింది. అప్పుడు తాను బ్రాహ్మణులను పిలిపించి బాబా పాదుకలకు అభిషేకం చేయించాడు మరియు కొందరు భక్తులను భోజనానికి పిలిచి బాబా యొక్క మాసికం యొక్క పుణ్యతిథిని వైభవం జరిపించారు. ఆ తరువాత ప్రతి మాసిక పుణ్యతిథి ముంబాయిలో జరుగుతూ ఉంది.

అనుభవం - 20 


శ్రీ మోరేశ్వర్ ప్రధాన్ గారి పెద్ద కుమారుడు ఒకసారి బాగా జబ్బున పడ్డాడు. ఆ సమయంలో అక్కడ శాస్త్రిబువా అనే తేలంగి బ్రాహ్మణుడు ఉండేవారు. ఆ శాస్త్రిబువా దత్తోపాసకులు. తనకు శ్రీ మోరేశ్వర్, శ్రీ సాయిబాబాను పూజించడం ఇష్టం ఉండేది కాదు. “నీవు బాబాను వదిలేయ్, శ్రీ దత్తుని శరణు చెందు, అప్పుడు నీ కుమారుడు బాగవుతాడు” అని తాను మోరేశ్వర్‌కు చెప్పాడు. “బాబా సాక్షాత్తు దత్తుడే” అని మోరేశ్వర్ చెప్పాడు. అప్పుడు శాస్త్రిబువా, “ఒకవేళ నీ కుమారుడు ఐదు నిమిషాలలో పాలు త్రాగితే, సాయిబాబా సాక్షాత్తు దత్తుడేనని నేను ఒప్పుకుంటాను” అని అన్నారు. “ఉదయం నుండి పిల్లవాడు కోలుకుంటూ త్వరగా పూర్తిగా ఆరోగ్యవంతుడైనట్లయితే, నేను కూడా బాబా దర్శనానికి వెళతాను, మరియు నూట పాతిక రూపాయలు దక్షిణగా సమర్పించుకుంటాను అని కూడా అన్నాడు. శాస్త్రిగారు కోరుకున్న విధంగానే పిల్లవాడు ఐదు నిమిషాలలో పాలు త్రాగసాగాడు. అలానే మరుసటిరోజు నుండి పిల్లవాడు కోలుకోసాగాడు. పిల్లవాడు పూర్తిగా కోలుకున్నాక శాస్త్రిబువా శిరిడీకి బాబా దర్శనానికై వెళ్ళాడు. రూ.125/-లను బాబాకు దక్షిణగా సమర్పించాడు. తరువాత మూడవ పొద్దులో బాబా రూ.5/- లను దక్షిణగా అడిగారు. అప్పుడు మాధవరావ్ దేశ్‌పాండే బాబాతో, “ఉదయం ఆయన 125 రూపాయలను దక్షిణగా ఇచ్చారు. ఇప్పుడు ఇంకో ఐదు రూపాయలు దక్షిణగా ఎందుకు?” అని అడిగాడు. అప్పుడు బాబా, "రూ.125/- దక్షిణగా ఇచ్చింది తన దత్తునికి. నాకు ఎక్కడ ఇచ్చారు?” అని అన్నారు. అప్పుడు శాస్త్రిబువా, బాబా అడిగిన విధంగానే 5 రూపాయలను ఇచ్చారు.

తరువాయి భాగం రేపు 

సోర్స్: సాయిభక్త శ్రీకాకాసాహెబ్ దీక్షిత్ డైరీ by విజయ్ కిషోర్.

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo