సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుడు - నందూ మార్వాడీ


నందరామ్ మార్వారీ సంక్లేచ అలియాస్ నందూ మార్వాడీ పెద్ద భూస్వామి, వడ్డీ వ్యాపారి. అతను సున్నితమైన వ్యక్తిత్వం గలవాడు, దయగలవాడు. అతని తాతగారు రాజస్థాన్‌లోని ఖరాడే గ్రామం నుండి శిరిడీ వచ్చి స్థిరపడ్డారు. ఆ కుటుంబంలోని మగపిల్లలు బాల్యంలోనే మరణిస్తుండేవారు. అందువలన ఒకరోజు నందరామ్ అమ్మమ్మ బాబా వద్దకు వెళ్లి తన కుటుంబాన్ని ఆశీర్వదించమని కోరింది. బాబా ఆమెకు మూడు మామిడిపండ్లు ఇచ్చారు. తరువాత ఆమెకు ముగ్గురు మగపిల్లలు పుట్టారు. “ఆమ్ర(మామిడిపండు) లీల” తరువాత ఆ కుటుంబంలోని మగపిల్లలందరూ సురక్షితంగా ఉన్నారు.

నందరామ్ 1866వ సంవత్సరంలో జన్మించాడు. శిరిడీలోనే పెరిగాడు. 1875లో నందరామ్ బాబాకి చేరువయ్యాడు. త్వరగానే తనలో బాబాపట్ల భక్తిప్రపత్తులు అంతకంతకూ పెరిగి ఎక్కువ సమయం బాబాతో గడుపుతుండేవాడు. నందరామ్ కుటుంబాన్ని బాబా ఎంతగానో ప్రేమించేవారు. బాబా భిక్ష తీసుకునే భాగ్యాన్ని పొందిన ఐదు ఇళ్లలో వీరి ఇల్లు ఒకటి. వీరి ఇల్లు ద్వారకామాయికి అతి సమీపంలో ఉన్నప్పటికీ, భిక్ష తీసుకునే క్రమంలో బాబా చివరిగా వీరి ఇంటికి వచ్చేవారు. నందరామ్ భార్య రాధాబాయిని బాబా "ఓ బోపిడీబాయి, భిక్షా దే!" అని పిలిచేవారు. ఆమె భిక్ష ఇవ్వడంలో ఆలస్యం చేస్తే బాబా ఆమెను తిడుతూ ద్వారకామాయికి తిరిగి వెళ్ళిపోయేవారు. ఆమెకు బాబాపట్ల పూర్ణమైన భక్తివిశ్వాసాలు ఉండేవి. బాబా తిట్లు మరోరూపంలో ఉన్న ఆశీస్సులని ఆమెకు బాగా తెలుసు. అప్పుడప్పుడు బాబా ఆమెతో పూరణ్ పోళీలు చేయమని, భోజనం(full meal) పెట్టమని అడిగేవారు. ఆమె అన్నీ తయారుచేసి, పళ్లెంలో వడ్డించి ద్వారకామాయికి తీసుకుని వెళ్ళేది. బాబా చాలా కొద్దిగా తిని, మిగతా ఆహారాన్ని అందరికీ పంచేవారు. ప్రతి దీపావళికి ఆమె ఐదు గజాల తెల్లని కాటన్ వస్త్రాన్ని తీసుకుని, బాబా కోసం కఫ్నీ కుట్టి, ఆయనకు సమర్పించేది. బాబా చాలా ఆనందంతో వెంటనే దాన్ని ధరించేవారు.

1911లో ప్లేగు చెలరేగి గ్రామస్థులు ఊరు విడిచి వెళ్లిపోతున్నారు. నందరామ్ కళ్ళు కూడా జ్వరంతో ఎర్రబడ్డాయి. అతను కొంతమంది గ్రామస్థులను కలిసినప్పుడు వాళ్ళు, "జ్వరంతో మీ కళ్ళు ఎర్రబడ్డాయి, ఇది ప్లేగు వ్యాధికి మొదటి సంకేతం" అని అన్నారు. అతను ఆ మాటలు విని భయంతో వణికిపోయాడు. గ్రామస్థుల సలహాపై అతడు మారుతి ఆలయానికి వెళ్లి నూనె దీపం వెలిగించి, కొబ్బరికాయ కొట్టి, 'తనని కాపాడమ'ని మారుతిని వేడుకున్నాడు. తరువాత శిరిడీ విడిచి రహతాకు సమీపంలో ఉన్న ఎక్రూఖా గ్రామానికి వెళ్లడం అతనికి మంచిదనిపించి గుర్రం తీసుకుని బాబా అనుమతికోసం ద్వారకామాయికి వెళ్ళాడు. బాబా అతనితో, "నేను ఉన్నంతవరకు నిన్ను చావనివ్వను!" అని ఊదీ ఇచ్చారు. వెంటనే అతని జ్వరం తగ్గిపోయింది.

మరొకసారి ఒక భయంకరమైన అంటువ్యాధి గ్రామంలో ప్రబలింది. ఆ సమయంలో చక్కెర తీసుకోరాదని నమ్ముతారు. చక్కెర తీసుకున్న వాళ్ళు తీవ్ర అనారోగ్యంతో బాధపడ్డారు, కొందరు ప్రాణాలు కోల్పోయారు. నందరామ్ కూడా ఆ వ్యాధి బారిన పడ్డాడు. వ్యాధి యొక్క మొదటి సంకేతాన్ని గమనించిన వెంటనే అతను నేరుగా ద్వారకామాయికి వెళ్లి, బాబా పాదాలను ఆశ్రయించాడు. బాబా తమ జేబులోంచి ఒక చక్కెర ప్యాకెట్ తీసి అతనికి ఇచ్చారు. బాబాపై అపారమైన నమ్మకంతో అతను ఆ చక్కరను ఒకేసారి తినేశాడు. మరుక్షణంలో అతను కోలుకున్నాడు.

నందరామ్‌ స్వీకరించడంలో కంటే ఇవ్వడంలో, మంచి చేయటంలో నమ్మకం కలిగి ఉండేవాడు. అతను చేసిన ఉత్తమమైన పని ఏమిటంటే, బూటీవాడాకు, ద్వారకామాయికి మధ్యనున్న భూమిని బాబాకోసం దానం చేయడం. ఈ పని దామూ అన్నా చేతులమీదుగా జరిగింది. తరువాత ఈ స్థలంలోనే సమాధి మందిర పొడిగింపు జరిగింది. అతను మారుతి, గణేశ మందిరాలను మరమ్మతులు చేయించి, నేలమీద బండలు పరిపించాడు.

నందరామ్ 1946, అక్టోబరు 13న మరణించాడు. అతని దాతృత్వాన్ని, సాంఘిక కార్యక్రమాలను అతని వారసులు కొనసాగిస్తున్నారు. అప్పట్లో నందరామ్ ఇల్లు ఉన్న స్థలంలో ఇప్పుడు ఒక వాణిజ్య సముదాయం ఉంది. ద్వారకామాయి ఎదురుగా ఉన్న ఆ భవనాన్ని, దానిపై నందూ మార్వాడీ అన్న పేరును భక్తులు గమనించవచ్చు.

(ఈ వివరాలు నందరామ్ మనుమడు దిలీప్ సంక్లేచ రచయితతో పంచుకున్నారు).

సమాప్తం.

 Source: Ambrosia in Shirdi & Baba’s Gurukul by Sai Bhakta Vinny Chitluri 

సాయిభక్తుల అనుభవమాలిక 274వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. భక్తులపై తమకున్న బాధ్యతను ఎంతో బాధ్యతాయుతంగా నెరవేరుస్తారు బాబా
  2. ఏ నొప్పీ చిన్నది కాదని తెలియజేసి తగిన గుణపాఠం నేర్పిన బాబా

భక్తులపై తమకున్న బాధ్యతను ఎంతో బాధ్యతాయుతంగా నెరవేరుస్తారు బాబా

ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

నేను సాయిభక్తురాలిని. 2018లో నా తల్లిదండ్రుల శిరిడీ సందర్శనానికి సంబంధించిన అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటాను. సాయిబాబా చేసే అనేక అద్భుతాలలో ఇది ఒకటి.

అక్టోబరు నెలలో వచ్చే మా అమ్మ పుట్టినరోజు కోసం తోబుట్టువులందరం కలిసి తనకోసం ఏదైనా ప్రత్యేకంగా ప్లాన్ చేయాలని చర్చించుకున్నాము. మా అమ్మకు ఆధ్యాత్మిక విషయాలపట్ల ఆసక్తి ఎక్కువ కాబట్టి మేము తనని శిరిడీ పంపాలని నిర్ణయించుకున్నాము. అక్టోబరు 16న బయలుదేరి 19వ తేదీన తిరిగి వచ్చేలా టిక్కెట్లు బుక్ చేశాము. అయితే 2018, అక్టోబరులో వచ్చే విజయదశమి చాలా ప్రత్యేకమైనది. నాటికి బాబా మహాసమాధి చెంది వందేళ్లు. ఆ వేడుకలను ఎంతో ఘనంగా చేస్తున్నారు. కాబట్టి ప్రపంచం నలుమూలల నుండి భక్తులు శిరిడీకి తరలివస్తారు. దానికి ప్రధానమంత్రి కూడా వస్తున్నారు. అందువలన చాలా రద్దీ ఉంటుంది. అది మేము ముందు ఊహించలేదు. ఆ రద్దీ కారణంగా మా తల్లిదండ్రులు ఇబ్బందిపడతారేమోనని భయపడ్డాము. ఈ విషయం నాన్నకి తెలిసి ఆయన కూడా భయపడటం మొదలుపెట్టారు. నేను శిరిడీలో నాకు తెలిసిన కొంతమందికి ఫోన్ చేసి, "వయస్సు పైబడిన మా తల్లిదండ్రులు ఒంటరిగా వస్తున్నారు. వాళ్ళకి సహాయం చేయమ"ని అడిగాను. వాళ్లంతా, "దీదీ(అక్క)! ఆ సమయంలో చాలా బిజీగా ఉంటాము. సహాయం చేయడం చాలా కష్టం" అని చెప్పారు. దాంతో నేను చాలా ఆందోళన చెంది క్వశ్చన్&ఆన్సర్ సైట్‌లో బాబాను అడిగాను. "ఒక అద్భుతం ఉంది. నీ కళ్ళు కన్నీళ్లతో నిండిపోతాయి" అని వచ్చింది. దాంతో ఇక అంతా బాబా చూసుకుంటారని ధైర్యం కలిగింది.

రైలులో రెండురోజులు ప్రయాణం చేసి నా తల్లిదండ్రులు శిరిడీ చేరుకుని హోటల్లో దిగారు. అక్కడ ఎవరో ఇప్పుడే వెళితే దర్శనం త్వరగా అవుతుందని చెప్పారు. వెంటనే నా తల్లిదండ్రులు మందిరానికి బయలుదేరారు. మావాళ్ళు రైలులో తినడానికి ఆహారాన్ని తీసుకెళ్ళినా ముందురోజు ఆహారాన్ని తినడం అలవాటులేని నాన్న సరిపడా తినలేదు. అలాంటి ఆయన ఏమీ తినకుండా నేరుగా మందిరానికి వెళ్లిపోయారు. తీరా అక్కడికి చేరుకునేసరికి నీరసంతో మైకం కమ్మినట్లై ఒళ్ళంతా బాగా చెమటలు పట్టేశాయి. ఆయనకి వెంటనే టాయిలెట్ కి వెళ్లాలనిపించింది. అయితే అక్కడ వాళ్ళకి మందులు ఎక్కడ దొరుకుతాయో, టాయిలెట్స్ ఎక్కడ ఉన్నాయో తెలియలేదు. ఈలోగా నీళ్లు త్రాగాలని కూడా ఆయనకి అనిపించింది. అంతలో ఎక్కడినుండి వచ్చాడోగాని  ఒక వ్యక్తి వాళ్ళ వద్దకు వచ్చి నాన్నకు ఒక వాటర్ బాటిల్ ఇచ్చాడు. తరువాత టాయిలెట్ కి, ఫార్మసీకి కూడా తీసుకెళ్లాడు. వాళ్లకు తోడుగా ఉండి సీనియర్ సిటిజన్ క్యూ ద్వారా దర్శనం చేయించాడు. ప్రసాదాలయానికి తీసుకెళ్లాడు. బాబా భక్తుల ఇళ్లను చూపించాడు. వాళ్ళున్న మూడు రోజుల్లో ఉదయం, సాయంత్రం వాళ్ళతోనే ఉండి, వాళ్ళ హ్యాండ్‌బ్యాగులు పట్టుకుని శిరిడీలోని ప్రదేశాలన్నీ చూపించి ఎంతో సహాయం చేశాడు. నాన్న చెయ్యిపట్టుకుని మరీ వాళ్ళని జాగ్రత్తగా చూసుకున్నాడు. అంతా బాబా అనుగ్రహం. మావాళ్లు శిరిడీ నుండి తిరిగి వచ్చాక కూడా అతను అప్పుడప్పుడు నా తల్లిదండ్రులకి ఫోన్ చేస్తూ ఉండేవాడు. దాదాపు రెండునెలల తర్వాత నా సోదరి శిరిడీ వెళ్తుంటే నా తల్లిదండ్రులు, 'అతనితో కావాలనుకున్నప్పుడు మాట్లాడటానికి వీలుగా అతనికొక మొబైల్  అందజేయమ'ని చెప్పారు. సరేనని నా సోదరి మొబైల్ తీసుకుని వెళ్లి అతనికిస్తే, 'సిమ్ కార్డు తీసుకోవడానికి తనకి చిరునామా లేద'ని మొబైల్ తీసుకోవడానికి నిరాకరించాడు. నాకు బాబా ఎన్నో అనుభవాలు ఇచ్చారుగాని ఆయన రక్షణ ముందు మనం చాలా అల్పులమని అర్థం అయ్యింది. ఆయన తన బిడ్డలను తన దర్బారుకు పిలిపించుకుంటే, వాళ్ళపట్ల తమకున్న బాధ్యతను ఎంతో బాధ్యతాయుతంగా నెరవేరుస్తారని నమ్మకం కలిగించారు బాబా. "చాలా చాలా ధన్యవాదాలు బాబా! మీ మేలు ఎన్నటికీ మరువలేను".

source : http://www.shirdisaibabaexperiences.org/2019/09/shirdi-sai-baba-miracles-part-2491.html

ఏ నొప్పీ చిన్నది కాదని తెలియజేసి తగిన గుణపాఠం నేర్పిన బాబా

విశాఖపట్నం నుండి శ్రీమతి నాగలక్ష్మి తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో ఇలా పంచుకుంటున్నారు:

ఓం శ్రీ సాయినాథాయ నమః.
       
నా పేరు నాగలక్ష్మి. మాది విశాఖపట్నం. ఇదివరకు నా అనుభవాలను కొన్నింటిని ఈ బ్లాగు ద్వారా మీతో పంచుకున్నాను. ఇటీవల జరిగిన ఒక సంఘటన ద్వారా బాబా నాపై చూపిన ప్రేమను ఇప్పుడు మీతో పంచుకుంటాను. ఈ సాయి బ్లాగులో వచ్చిన అనేకమంది భక్తుల అనుభవాలను నేను చదువుతూ ఉంటాను. వాటిలో ఒకదానిలో ఒక భక్తుడు తన తలనొప్పి గురించి చెప్పి, బాబా దయవల్ల నొప్పి తగ్గిన వైనాన్ని తెలియజేశాడు. అది చదివిన నేను మావారితో, "ఏమండీ! చిన్న తలనొప్పిని పెద్ద సమస్యలా ఈ బ్లాగులో వ్రాశారు" అని చెప్పి నవ్వుకున్నాను. అంతే! నాకు హఠాత్తుగా తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, జ్వరం మొదలయ్యాయి. "ఇంకో నాలుగు రోజులలో శిరిడీ ప్రయాణం ఉంది. ఇలాంటి సమయంలో నాకిలా అయిందేమిటి?" అని అనుకున్నాను. ఏవో కొన్ని మందులు కొనుక్కుని వేసుకున్నాను. ట్రైన్ ఎక్కే సమయానికి జ్వరం తగ్గింది. కానీ తలనొప్పి మాత్రం ఎక్కువైపోయింది. తెచ్చుకున్న మాత్రలు అయిపోవచ్చాయి. నేను ఎప్పుడూ ఇలాంటి తలనొప్పి ఎరుగను. వెంటనే బాబాని తలచుకొని, "తండ్రీ! తలనొప్పి చిన్నదని భావించి హేళనగా నవ్వాను. దాని రుచి ఎలా వుంటుందో చూపించావా తండ్రీ! ఏ నొప్పీ చిన్నది కాదని చెప్పడానికి నాకు ఈ తలనొప్పి తెప్పించావా!" అని మనసులో చాలా బాధపడ్డాను. "నన్ను క్షమించండి బాబా! ఇంకెప్పుడూ ఎవరి బాధనీ చిన్నచూపు చూడను. నన్ను క్షమించి, నేను ట్రైను దిగి నీ శిరిడీలో అడుగుపెట్టే సమయానికి నాకు ఈ తలనొప్పి మాయమైపోయేలా అనుగ్రహించండి. ఇంకెప్పుడూ నాకు తలనొప్పి బాధ తెలియకుండా ఉండేలా ఆశీర్వదించండి బాబా!" అని బాబాని ప్రార్థించాను. నిజంగా అద్భుతం! శిరిడీలో దిగేసరికి నాకు తలనొప్పి పూర్తిగా తగ్గిపోయింది. ఒంట్లో చాలా తేలికగా అనిపించింది. ఏ నొప్పీ చిన్నది కాదని తెలియజేసి బాబా నాకు తగిన గుణపాఠం నేర్పారు. ఆ క్షణమే బాబాకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. 

ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!

రామచంద్ర దాదా పాటిల్


సాయిబాబాతో రామచంద్ర దాదా పాటిల్ యొక్క ఋణానుబంధం చాలా గొప్పది. అతనికి బాబా పట్ల ఉన్న  ప్రేమ చాలా గాఢమైనది.

రామచంద్ర దాదా పాటిల్ శిరిడీలో జన్మించాడు. అతను రాధాబాయి, దాదా కోతే పాటిల్ దంపతుల ఏకైక కుమారుడు. రామచంద్రకు ముగ్గురు సోదరీమణులు ఉన్నారు. వాళ్ళది సంపన్న కుటుంబం. పూర్వీకుల నుండి సంక్రమించిన వారి ఆస్తులు శిరిడీలోనేకాక పొరుగు గ్రామాల వరకు చాలా విస్తృతంగా వ్యాపించి ఉన్నాయి. వాళ్లకున్న అనేక ఎకరాల వ్యవసాయ భూముల్లో అన్ని రకాల ధాన్యం, చెఱకు పండేవి. రామచంద్ర అక్కడ పనిచేసే కూలీలను పర్యవేక్షిస్తుండేవాడు. రామచంద్ర చాలా తెలివైన విద్యార్థి. అతను మరాఠీలో ఏడవ తరగతి వరకు చదువుకున్నాడు. అతనికి చట్టంపై, న్యాయవ్యవస్థపై చాలా ఆసక్తి ఉండేది.

11 సంవత్సరాల వయస్సులో రామచంద్ర బాబా సేవను ప్రారంభించాడు. అతనికి బాబాపై అపారమైన విశ్వాసం. బాబా మాట అతనికి చట్టం. 1916లో అతను ఇన్‌ప్లూయెంజాతో తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. అన్నిరకాల ఔషధాలు ఉపయోగించారు గానీ, అవి గుణమివ్వలేదు. అతడు పూర్తిగా నిరాశ చెంది భయంతో సాయిని స్మరిస్తున్నాడు. ఒకరాత్రి బాబా అతనికి సాక్షాత్కరించి, "భయపడవద్దు, నీకు చాలా ఆయుష్షు ఉంది(తు గాబ్రో నాకోస్, తుల పుష్కల్ ఆయుసే అహాయ)" అని చెప్పారు. బాబా మాటలతో రామచంద్ర చాలా ఉపశమనం పొందాడు. తరువాత బాబా, "కానీ తాత్యా గురించే నా ఆలోచన. ఈరోజు నుండి సరిగా రెండు సంవత్సరాల తరువాత విజయదశమిరోజున తాత్యా మరణిస్తాడు. ఈ విషయం నువ్వు ఎవరికీ చెప్పకు!" అన్నారు. కొద్దిరోజుల్లో రామచంద్ర కోలుకున్నాడు. కానీ తాత్యా విషయంలో బాబా చెప్పిన దాని గురించి చాలా కలత చెందాడు. బాబా మాట ఎప్పుడూ నిజమై తీరుతుందని నమ్మకం ఉన్న అతను తాత్యాను కోల్పోతానన్న ఆలోచనను తట్టుకోలేకపోయాడు. ఆ విషయం గురించి నమ్మకస్తుడు, తనకు మంచి స్నేహితుడైన బాలాషింపీతో చెప్పాడు. తాత్యా, రామచంద్ర పాటిల్‌లు చిన్నప్పటినుండి మంచి స్నేహితులు, కలిసి పెరిగారు. ద్వారకామాయిలో ప్రతిరోజూ భోజన సమయంలో వారిద్దరికీ ఒకే పళ్లెంలో వడ్డించటం ద్వారా బాబా వారి మధ్య బంధాన్ని బలోపేతం చేశారు.

రామచంద్ర పాటిల్ సీతాబాయిని వివాహం చేసుకున్నాడు. కానీ ఆమె ద్వారా తనకు సంతానం లేనందున, అతను మరో వివాహం చేసుకున్నాడు. రెండో భార్యకు ఇద్దరు కొడుకులు పుట్టారు.

బాబా మహాసమాధి చెందిన తరువాత భక్తులు బాబాను బూటీవాడాలో సమాధి చేయడానికి రాత్రంతా పని చేస్తున్నారు. కొర్హాలే గ్రామానికి చెందిన పహిల్వాన్ అమీర్ శక్కర్ ఈ పరిణామాలను చూసి రామచంద్ర పాటిల్ తాతగారైన అప్పాజీ కోతే పాటిల్ సహాయం కోరాడు. మృతదేహాన్ని గ్రామంలో ఉంచడం మంచిది కాదని చెప్పి అతన్ని ఒప్పించాడు. అంతేకాదు, బూటీవాడాలో సమాధి నిర్మిస్తే, ఎప్పటికైనా వాళ్ళు కోరుకున్న బ్రాహ్మణ పూజారిని నియమించి ముస్లింలను లోపలికి రానీయకుండా నిషేధిస్తారని విజ్ఞప్తి చేశాడు. వెంటనే అప్పాజీ గ్రామస్తులను సమావేశపరిచి ఆ విషయాన్ని చెప్పాడు. దాంతో గ్రామస్తులు బాబా దేహాన్ని ఊరిబయట సమాధి చేయడానికి అంగీకరించారు. ఇది విన్న రామచంద్ర పాటిల్ అలా చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ బాబా చివరి కోరికను గౌరవించి ఆవిధంగా నడుచుకోవాలని ఖండితంగా చెప్పాడు. ఈ విషయం అప్పాజీకి కోపం తెప్పించింది. దాంతో అతను రామచంద్రను మళ్ళీ తన ఇంట్లోకి అడుగుపెట్టవద్దని ఆక్షేపించాడు. ఏదేమైనా బాబా చివరి కోరికను గౌరవించాలని నిశ్చయించుకున్నాడు రామచంద్ర పాటిల్. అందుకే అప్పటినుండి అతను తన మొదటి భార్య సీతాబాయి తన తాతగారి ఇంట ఉన్నప్పటికీ దాదాపు 12 సంవత్సరాలు ఆ ఇంట అడుగుపెట్టలేదు. బాబా చివరి కోరికను నెరవేర్చడంలో, బూటీవాడాలోనే బాబా దేహాన్ని సమాధి చేసేందుకు గ్రామస్తులను ఒప్పించడంలో రామచంద్ర విజయం సాధించాడు. 

36 గంటలపాటు బాబా దేహం ద్వారకామాయిలో ఉన్న తరువాత బాబా దేహాన్ని గ్రామమంతటా ఊరేగించి ఆ తర్వాత బూటీవాడాలో సమాధి చేశారు. బాబా సమాధిని, సమాధి మందిరాన్ని బహుమతిగా ఇచ్చిన రామచంద్ర పాటిల్, గోపాలరావు బూటీలకు సాయిభక్తులు ఎప్పటికీ కృతజ్ఞతలు చెప్పుకోవాలి.

బాబా సమాధి చెందిన తరువాత 13వ రోజున రామచంద్ర పాటిల్ విందు ఏర్పాటు చేశాడు. ఆ కార్యక్రమంలో భాగంగా వేలాదిమంది భక్తులకు లడ్డూలు పంపిణీ చేశారు. అద్భుతం ఏమిటంటే, వేలాదిమందికి లడ్డూలు పంపిణీ చేసిన తరువాత కూడా అంతే మొత్తంలో లడ్డూలు మిగిలివున్నాయి. ఆ లడ్డూలను బాబా సమాధి చెందినప్పుడు రాని భక్తులకు దాదాపు 2 నెలలపాటు పంపిణీ చేశారు.

బూటీకి రామచంద్ర పాటిల్ అంటే చాలా ఇష్టం. తరచూ బూటీ అతనిని నాగపూర్‌కు వచ్చి తనతోపాటు ఉండి వ్యాపారంలో తనకు సహాయం చేయమని అడుగుతుండేవాడు. కానీ శిరిడీ విడిచిపెట్టడమన్న ఆలోచనను రామచంద్ర అస్సలు భరించలేకపోయేవాడు.

ఆ రోజుల్లో శిరిడీ గ్రామ సరిహద్దు చావడి వరకు ఉండేది. అక్కడినుండి బెరాగాఁవ్ గ్రామం ఉండేది. ఈ రెండు గ్రామాల సరిహద్దులో ఉన్న మారుతి మందిరంలో రెండు హనుమంతుని విగ్రహాలు ఉండేవి. ఒకటి శిరిడీ గ్రామానికి చెందినది కాగా రెండోది బెరాగాఁవ్‌కు చెందినది. బెరాగాఁవ్ గ్రామాన్ని శిరిడీలో చేర్చడంలో రామచంద్ర ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరించాడు.

రామచంద్ర పాటిల్ 20 సంవత్సరాలపాటు శిరిడీ గ్రామ పంచాయతీలో గ్రామాధికారిగా పనిచేశాడు. ఇప్పటికీ అతని ఫోటో శిరిడీ నగరపాలిత కార్యాలయంలో ఉంది. అతడు తన అధికారిక విధులతోపాటు శిరిడీ సాయిబాబా సంస్థాన్ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొనేవాడు. చాలాకాలం సంస్థాన్ జాయింట్ సెక్రటరీగా కూడా ఉన్నాడు. అతడు దక్షిణ భిక్ష సంస్థలో కార్యదర్శిగా కూడా వ్యవహరించాడు.

రామచంద్ర పాటిల్ ఉదయాన్నే లేచి ఒక కప్పు టీ త్రాగేవాడు. మళ్ళీ మధ్యాహ్న ఆరతి వరకు ఏమీ తినేవాడు కాదు. అతను రోజూ ఆరతికి హాజరయ్యేవాడు. 1916లో తప్ప అతడు ఏ ఒక్క రోజూ అనారోగ్యానికి గురికాలేదు. అతడు తన 70 సంవత్సరాల వయస్సులో మరణించాడు. ఆరోజు అతడు కొంతమంది అతిథులను భోజనానికి ఆహ్వానించాడు. అతిథులు రావడం ఆలస్యం అయ్యింది. అందువలన అతని కుటుంబసభ్యులు అతన్ని భోజనం చేయమని చెప్పారు. దానికతను "మధ్యాహ్న ఆరతి వరకు వేచి ఉంటాన"ని బదులిచ్చాడు. అంతలో తలతిరుగుతున్నట్లుగా అనిపించి కూర్చున్నాడు. కుటుంబీకులు వైద్యుని తీసుకొచ్చే లోపల అతను ప్రశాంతంగా తన తుదిశ్వాసను విడిచాడు.

రామచంద్ర పాటిల్ వారసులు ఇప్పటికీ శిరిడీలో నివసిస్తున్నారు. అయితే వాళ్ళు తమ ఇంటిని, మిగిలిన ఆస్తులను సఖారాం షెల్కేకి అమ్మివేశారు. ఇప్పుడు వాళ్ళు శిరిడీ పోలీస్ స్టేషనుకి సమీపంలో, హైవేకి దూరంగా ఉన్న ఒక చిన్న బంగ్లాలో నివసిస్తున్నారు. 

సమాప్తం. 

 Source: Baba’s Anurag by Sai Bhakta Vinny Chitluri Sai Leela Magazine

సాయిభక్తుల అనుభవమాలిక 273వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. ఉద్యోగం ప్రసాదించిన బాబా 
  2. 36 గంటల్లో బాబా చూపిన అద్భుతం

ఉద్యోగం ప్రసాదించిన బాబా 

సాయిబంధువులందరికీ నమస్కారం. ప్రత్యేకించి ఈ బ్లాగ్ నిర్వహిస్తున్నవారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నా పేరు మంకు కృష్ణ. నేను శ్రీకాకుళం జిల్లాలోని గెద్దలపాడు గ్రామ నివాసిని. బాబా నాకు ప్రసాదించిన ఒక అనుభవాన్ని నేను ఇప్పుడు మీతో పంచుకుంటాను. 

సుమారు పది సంవత్సరాల క్రితం నాకు బాబాపై భక్తిశ్రద్ధలు ఏర్పడ్డాయి. మా గ్రామానికి కాస్త దూరంలో ఉన్న పిట్టవానిపేట గ్రామ పరిధిలో బాబా మందిరం ఉంది. అక్కడ జరిగే కార్యక్రమాలకు నా వంతు సహాయాన్ని నేను చందాలరూపంలో ఇస్తూ, వీలైనప్పుడల్లా బాబా కార్యక్రమాలలో పాల్గొంటుండేవాడిని. అలా బాబా గురించి తెలుసుకునే అవకాశం లభించింది, ఈ జన్మకిది చాలు. నా జీవితంలో మంచి మార్పుకు కారణం బాబానే. కొన్ని రోజులకి నేను బాబా అనుగ్రహంతో బాబా మందిర కమిటీలో ఒక సభ్యుడినయ్యాను.

కొన్నిరోజులుగా నేను ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాను. కానీ, నేను చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. నాకు ఉద్యోగం ప్రసాదించమని పరిపరివిధాల బాబాను ప్రార్థించసాగాను. ఒకరోజు ఒక ఇంటర్వూకి పిలుపు రావడంతో బాబాను ప్రార్థించి ఆ ఇంటర్వ్యూకి హాజరయ్యాను. వెల్డింగుకి సంబంధించిన టెస్టింగ్‌ ఇంటర్వ్యూ జరిగింది. ఆ టెస్ట్ పూర్తి చేశాక నేను ఇంటికి తిరిగి వచ్చాను. కానీ నేను చేసింది సంతృప్తికరంగా అనిపించక ఈ ఉద్యోగం కూడా నాకు రాదని నేను చాలా నిరాశపడ్డాను. అయితే కరుణామయుడు, సమర్థ సద్గురువు అయిన సాయినాథుని అనుగ్రహంతో రెండు రోజుల తరువాత "మీరు ఉద్యోగానికి ఎంపికయ్యారు" అని ఫోన్ కాల్ వచ్చింది. నా ఆనందానికి అవధులు లేవు. తనను నమ్ముకున్నవారు కోరుకున్నది కచ్చితంగా నెరవేరుతుందని నిరూపించారు బాబా. ఇప్పుడు నేను సౌదీ అరేబియాలో ఉద్యోగం చేస్తున్నాను. నా కుటుంబసభ్యులంతా ఎంతో ఆనందంగా ఉన్నారు. దీనికి కారణం బాబానే. "చాలా చాలా ధన్యవాదాలు బాబా! ప్రాపంచిక జీవితంలోనే  కాకుండా ఆధ్యాత్మిక మార్గంలో కూడా నన్ను నడిపించవయ్యా! ఈ జన్మంతా నీ సేవ చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించు సాయీ!".

36 గంటల్లో బాబా చూపిన అద్భుతం

USA నుండి అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

సాయిబాబా పట్ల నేను ఎంతో కృతజ్ఞత కలిగివున్నాను. ఆయన అనుగ్రహం లేనిదే నేను లేను. నేను ఎన్నో తప్పులు చేసినప్పటికి ఆయన ప్రేమతో నన్ను క్షమించారు. నేను బాబాకి ఇచ్చిన మాటప్రకారం, ఉద్దేశపూర్వకంగా ఎవరినీ బాధపెట్టకూడదని నిర్ణయించుకున్నాను. ఒకవేళ ఎవరైనా నన్ను గాయపరచినా ఆ స్థలాన్ని వదిలి వెళ్ళిపోతాను, మిగిలినది ఆయన చూసుకుంటారు.

నేను నా భర్త, 4 సంవత్సరాల కొడుకుతో USAలో నివసిస్తున్నాను. నేను హెచ్1బి వీసా మీద ఇక్కడ ఉంటున్నాను. 2019, జూన్‌లో నా వీసా గడువు ముగియనుండటంతో నేను 2019, ఫిబ్రవరి 14న వీసా పొడిగింపు కోసం దరఖాస్తు చేసుకున్నాను. నేను గత 10 సంవత్సరాలుగా ఒక ఇండియన్ ఎం.ఎన్‌.సి సంస్థలో పనిచేస్తున్నాను. చాలా కంపెనీలు హెచ్1బి వీసాలను దుర్వినియోగం చేస్తుండటంతో కంపెనీ పేరు చూస్తూనే చాలావరకు హెచ్1బి దరఖాస్తులు తిరస్కరించబడుతున్నాయి. నాకున్న టైమ్ తక్కువ కాబట్టి అలాంటివేమైనా జరిగితే పరిస్థితి ఏంటని నేను భయపడ్డాను. ఫలితం తెలుసుకోవడానికి 5 - 6 నెలలు వేచి ఉండటానికి బదులుగా ప్రీమియం వీసా (వీసా 15 రోజుల్లోపు ఆమోదించబడుతుంది లేదా తిరస్కరించబడుతుంది) కోసం దరఖాస్తు చేద్దామని నిర్ణయించుకున్నాను. ఎందుకంటే ఫలితం ఏదైనా, దాన్నిబట్టి తరువాత ఏమి చేయాలన్నది ప్లాన్ చేయవచ్చు. అందువలన ఇతరులు వద్దంటున్నా 2019, ఏప్రిల్ 16, మంగళవారంనాడు నేను ప్రీమియం వీసాకు మార్చుకునేందుకు USCIS కి దాఖలు చేసుకున్నాను. ఫలితం ఎలా వస్తుందోనన్న భయంతో 2019, ఏప్రిల్ 17న నేను సాయిబాబా క్వశ్చన్&ఆన్సర్ వెబ్‌సైటులో బాబాని అడిగాను. '36 గంటలు వేచి ఉండు, మీకు అద్భుతం కనిపిస్తుంది' అని వచ్చింది. ఆ సందేశాన్ని చూసిన నేను, "ఒక్క రోజు క్రితమే నేను దాఖలు చేసుకున్నాను. 36 గంటల్లో ఏమద్భుతం జరుగుతుంది? బాబా ఏదో సరదాగా చెప్తున్నారు" అని అనుకున్నాను.

మరుసటిరోజు ఏప్రిల్ 18, గురువారం ఉదయం 8 గంటలకు నా భర్త నన్ను పిలిచి, "ఈరోజు గురువారం కదా! మందిరానికి వెళుతున్నావా?" అని అడిగారు. నాకు నెలసరి సమస్య ఉన్నందున నేను వెళ్లనని చెప్పాను. అందుకు తను సరేనని, "నీ వాట్సాప్ లోని సందేశాలను ఒకసారి చూసుకో" అని చెప్పారు. నేను వాట్సాప్ తెరిచి, నా వీసా ఆమోదింపబడిందన్న సందేశాన్ని చూసి ఆశ్చర్యపోయాను. 'కేవలం రెండు రోజుల్లో వీసా ఆమోదింపబడటం ఎలా సాధ్యమైంద'ని నేను అవాక్కైపోయాను. కానీ సాయి తనకి ఏదైనా సాధ్యమేనని మరోసారి ఋజువు చేశారు. ఆయన చెప్పినట్లుగానే 36 గంటల్లో అద్భుతాన్ని నాకు చూపించారు. "థాంక్యూ! థాంక్యూ సో మచ్ బాబా!" సాయిపై నమ్మకం ఉంచండి. శ్రద్ధ, సబూరీ కలిగి ఉండండి. ఆయన మన ప్రతి కదలికను గమనిస్తూ ఉంటారు. దయచేసి ఎవరినీ మీ మాటలతో లేదా ప్రవర్తనతో బాధపెట్టవద్దు.

source : http://www.shirdisaibabaexperiences.org/2019/09/shirdi-sai-baba-miracles-part-2485.html

సాయిభక్తుడు - శ్రీ నాగేష్ ఆత్మారామ్ సావంత్


సాయిభక్తుడు శ్రీ నాగేష్ ఆత్మారామ్ సావంత్ మరాఠా కులానికి చెందినవాడు. అతడు సబ్‌ఇన్‌స్పెక్టరుగా పనిచేశాడు. ఇతను 1922 డిసెంబరులో సావంత్‌వాడీలో ఉన్నప్పుడు 'సాయిలీలా మ్యాగజైన్' చదవడం ద్వారా సాయిబాబా గురించి తెలుసుకున్నాడు. ఆ పత్రికలోని బాబా లీలలు అతనిని ఎంతగానో ఆకర్షించాయి. 1923 డిసెంబరు నెలలో ఒకరోజు అతని తలపై ఒక బల్లి పడింది. అది ఎంతో అశుభసూచకం. అప్పుడు అతని భార్య గర్భవతి. ఆ సమయంలో ఆమె మహారాష్ట్రలోని మాల్వాన్ తాలూకా, పెందూర్‌లో నివాసముంది.

1924 జనవరిలో నాగేష్ శిక్షణ(ట్రైనింగ్) కొరకు నాసిక్‌లో ఉన్న పోలీస్ స్కూలుకి వెళ్ళాడు. ఆ శిక్షణ అతనికి నచ్చలేదు. అతనెప్పుడూ బాబా గురించే ఆలోచిస్తూ, ఆయనే తనని కాపాడతారని నమ్మి ప్రార్థిస్తుండేవాడు. తరువాత తన స్నేహితుడు శ్రీ పి.దేవ్ వద్ద నుండి ఒక బాబా చిత్రపటం తీసుకుని పూజించడం మొదలుపెట్టాడు. నాసిక్‌లో జరిగిన శాఖాపరమైన పరీక్షలో నాగేష్ విఫలమయ్యాడు. ఆ పరీక్షలో విఫలమైన వారికి సబ్‌ఇన్‌స్పెక్టర్ అయ్యే అవకాశం ఉండదు. అందువల్ల, అతను సుమారు ఐదు సంవత్సరాలు తాత్కాలిక సబ్‌ఇన్‌స్పెక్టరుగా కొనసాగాడు. ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోవడంతో అతను మళ్ళీ నాసిక్ వెళ్లే ప్రయత్నం కూడా చేయలేదు. తాను పరీక్షలో ఉత్తీర్ణత సాధించకపోయినా బాబా తనను శాశ్వత సబ్‌ఇన్‌స్పెక్టరును చేస్తారని అతను పూర్తి నమ్మకంతో ఉండేవాడు. అతడి నమ్మకం వృధా పోలేదు. 1929 జులైలో పోలీసుశాఖ ప్రత్యేక కేసుగా పరిగణించి, నాగేష్‌ను పరీక్ష నుండి మినహాయించి పర్మినెంట్ సబ్‌ఇన్‌స్పెక్టరుగా నియమించింది.

1924వ సంవత్సరం నుండి నాగేష్ ప్రతి విజయదశమికి శిరిడీ వెళ్లి సాయిబాబా పుణ్యతిథి ఉత్సవాల్లో పాల్గొనడం ప్రారంభించాడు. ఆ అలవాటు ప్రకారం అతను 1926లో శిరిడీ వెళదామనుకున్నాడు. అది మొహర్రం మాసమైనందువలన సాధారణంగా డిపార్టుమెంట్ సెలవు మంజూరు చేయదు. కానీ అతను ఎలాగైనా సాయిబాబా పుణ్యతిథి ఉత్సవాలకు హాజరు కావాలని ఆత్రుతగా ఉన్నాడు. ఆ రాత్రి అతనికి బాబా కలలో దర్శనమిచ్చారు. ఆ కలలో బాబా కొన్ని కాగితాలమీద సంతకం చేయడాన్ని అతను చూశాడు. దానినిబట్టి  సాయిబాబా తనను సెలవుకోసం దరఖాస్తు చేసుకోమని సూచిస్తున్నట్లుగా అతను భావించి, సెలవుకోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఎటువంటి సమస్య లేకుండా సెలవు మంజూరైంది.

1929, ఫిబ్రవరిలో ముంబాయిలో హిందూ ముస్లింల మధ్య అల్లర్లు చెలరేగాయి. నాగేష్ పరేల్ ప్రాంతంలో విధుల్లో ఉన్నాడు. అకస్మాత్తుగా అతనికి జ్వరం, తలనొప్పి వచ్చాయి. మరో విభాగం నుండి ఒక యూరోపియన్ పోలీస్ ఆఫీసర్ పరిస్థితిని గమనించడానికి అక్కడకు వచ్చాడు. అతను నాగేష్‌ను చూసి, "నీ ఆరోగ్యం సరిగా లేనట్లుంది" అని అన్నాడు. తరువాత అతను నేరుగా నాగేష్ యొక్క పోలీసు సూపరింటెండెంట్ వద్దకు వెళ్లి, నాగేష్‌కు మౌఖిక సెలవు మంజూరు చేయించి, ఆ స్థానంలో అతను అదనపు బాధ్యతలు తీసుకున్నాడు. మధ్యాహ్నం 3:30 గంటలకు నాగేష్ ఆ స్థలాన్ని విడిచిపెట్టి ఇంటికి చేరుకున్నాడు. అతను అక్కడినుండి వచ్చిన తరువాత ఆ ప్రాంతంలో అల్లర్లు చెలరేగి, ఆ అల్లర్లలో యూరోపియన్ ఆఫీసరును చంపివేశారని సుమారు ఒక గంట తరువాత నాగేష్‌కి తెలిసింది.

నాగేష్ అనారోగ్యం అలానే కొనసాగుతుండటంతో అతడు పోలీస్ హాస్పిటల్‌కి వెళ్ళాడు. వైద్యులు పరీక్షించి అతను టైఫాయిడ్‌తో బాధపడుతున్నట్లు నిర్ధారించారు. సుమారు 17 రోజుల తరువాత ఒక రాత్రి అతనికి ఒక కల వచ్చింది. కలలో నల్లని దుస్తులు ధరించి, తలకు నల్లని వస్త్రాన్ని కట్టుకున్న ఒక బలిష్ఠుడైన వ్యక్తి నాగేష్‌ను ఈడ్చుకుంటూ వెళ్ళసాగాడు. నాగేష్ "బాబా, బాబా" అని అరవడం ప్రారంభించాడు. మరుక్షణంలో తెల్లని దుస్తులు ధరించిన తెల్లని వ్యక్తి కనిపించి ఆ నల్లని మనిషితో పోట్లాడి, నాగేష్‌ను అతని బారినుండి కాపాడాడు. నాగేష్ "బాబా! దత్తమహరాజ్!" అని అరిచాడు. అకస్మాత్తుగా బాబా అతను పూజించే పటం నుండి బయటకు వచ్చి కొన్ని క్షణాల్లో అంతర్థానమయ్యారు. అప్పటికే ఆ నల్లని వ్యక్తి, తెల్లని వ్యక్తి అదృశ్యమయ్యారు. ఆ సమయంలో సబ్జా ఆకుల, అగరుబత్తీల పరిమళాన్ని నాగేష్ అనుభవించాడు. ఆ క్షణం నుండి అతనిని ఇబ్బంది పెడుతున్న జ్వరం తగ్గిపోయింది.

నాగేష్ అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్నప్పుడు, గ్రామంలో ఉన్న అతని తల్లికి కలలో ఎవరో కనిపించి, "భయపడవద్దు, నేను నీ కొడుకుని సురక్షితంగా ఇంటికి తీసుకొచ్చి వదిలిపెడతాను" అని చెప్పారు. సరిగ్గా ఒక వారం తరువాత నాగేష్‌కు 3 నెలల సెలవు దొరకడంతో ఇంటికి వెళ్ళాడు.

అబ్బాసావంత్ అనే 44 సంవత్సరాల వయస్సున్న తన స్నేహితుని అనుభవం గురించి నాగేష్ ఇలా చెప్పాడు:

"అబ్బాసావంత్ ముంబాయిలో కానిస్టేబుల్‌గా పనిచేస్తుండేవాడు. అతను మా ఇంటి సమీపంలోనే నివసిస్తుండేవాడు. అతను ఒక కొత్త చీర తీసుకొచ్చి, 'బాబా కానుక' అని చెప్పి తన భార్యకు ఇచ్చాడు. బాబా మీద నమ్మకం లేని ఆమె తన భర్తతో, "ఇది బాబా ఇచ్చిన బహుమతి అని మీరు అంటున్నారు. కానీ ఇది మీరు కష్టపడి సంపాదించిన డబ్బుతోనే కదా కొన్నది?" అని అన్నది. ఆ రాత్రి చీరను ఆమె ఒక టేబుల్ మీద ఉంచింది. మరుసటి ఉదయాన్నే ఆమె లేచి చూసేసరికి టేబుల్‌పై ఉన్న కొత్త చీర మధ్యలో నిప్పు కణిక పెట్టినట్లుగా పై మడత నుండి క్రింది మడత వరకు కాలిపోవడంతో పనికిరాకుండా పోయింది. అప్పుడు ఆమె తన భర్తతో, "బాబా రేపు మరొక కొత్త చీర ఇస్తారేమో చూద్దాం" అని అన్నది. మరుసటిరోజు అతనికి అకస్మాత్తుగా కొంత డబ్బు వచ్చింది. ఆ డబ్బుతో అతను మరొక కొత్త చీర తీసుకుని తన భార్యకు ఇచ్చాడు".

సమాప్తం.

Source: Devotees Experiences of Sri Saibaba part II by Pujya Sri B.V.Narasimha Swamiji

సాయిభక్తుల అనుభవమాలిక 272వ భాగం....


ఈ భాగంలో అనుభవం:
  • నాలాంటి చాలా చిన్న భక్తురాలికోసం కూడా బాబా వస్తారు!

USA నుండి అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

సాయిరామ్! నేనొక చిన్న సాయిసేవకురాలిని. నేను పాఠశాలకి వెళ్ళేరోజుల నుండి నేను ఆయన భక్తురాలిని. అప్పటినుండి ఎప్పుడూ నాకు రక్షణనిస్తున్నది ఆయనే అని నేను గుర్తించాను. ఆయనే నా సంరక్షకుడు.

నేను, నా భర్త, ఇద్దరు అందమైన చిన్నారులతో(ఆడపిల్లలు)తో మాదొక చిన్న కుటుంబం. మావారు ఐటీ ఫీల్డ్‌లో పనిచేస్తున్నారు. నేను గృహిణిని. తీవ్రంగా ప్రయత్నించిన మీదట బాబా కృపతో మేము  H1B వీసాపై USA కి వచ్చాము. తరువాత 2014, డిసెంబరులో నా భర్త వేరే క్రొత్త ఉద్యోగంలో చేరారు. అయితే అక్కడ మావారి బాస్ చాలా మొరటుగా ప్రవర్తిస్తూ నలుగురి ముందు మావారిని తిడుతుండేవాడు. ఏదో ఒకవిధంగా సర్దుకుపోతూ మావారు తన పని తాను చేసుకోవడానికి ప్రయత్నిస్తుండేవారు. కొన్నినెలల తరువాత మావారు ఆ ఉద్యోగం మానేయాలని అనుకున్నారు. కానీ హెచ్1బి వీసాలో ఉండడం వల్ల కనీసం వాళ్ళు మా గ్రీన్‌కార్డు దాఖలు చేసేవరకు, మాకు I-140 ఫారం వచ్చేవరకు వేచి ఉండాల్సి వచ్చింది. మా ఈ పరిస్థితిని అవకాశంగా తీసుకుని ఆ బాస్ ఇంకా ఇంకా మావారిని ఇబ్బందిపెడుతూ ఉండేవాడు. రోజులు గడుస్తున్నాగానీ పరిస్థితిలో మార్పురాలేదు. చివరికి సంవత్సరం పూర్తి కావస్తుండటంతో గ్రీన్‌కార్డు ప్రక్రియను బాస్ ఆమోదించాల్సిన సమయం వచ్చింది. ఆ స్థితిలో అతను ముందుగా ఎటువంటి సూచన లేకుండా అకస్మాత్తుగా నా భర్తను ఉద్యోగం నుంచి తొలగించాడు.

దాంతో నా భర్త పూర్తిగా కృంగిపోయారు. అటువంటి బాస్ నుండి విముక్తి లభించడం సంతోషమే అయినా‌, వీసా మొదలైన ఇతర సమస్యలతో మేము చాలా ఒత్తిడికి లోనయ్యాము. మేము ఎంతో సహనంతో ఉన్నప్పటికీ ఇలా ఎందుకు జరిగిందో అర్థంకాక ఎంతో బాధపడుతూ ఉండేవాళ్ళం. అటువంటి పరిస్థితిలో నేను, "బాబా! మాకు త్వరగా ఇంకొక ఉద్యోగం చూపించి, భారతదేశానికి తిరిగి వెళ్ళకుండా మమ్మల్ని కాపాడమ"ని బాబాను ప్రార్థించడం మొదలుపెట్టాను. ప్రతిరోజూ భక్తుల అనుభవాలు చదువుతుంటే 'బాబా జాగ్రత్త తీసుకుంటారని, మాకు తప్పక సహాయం చేస్తారని' ఆశ కలిగింది. నేను రోజూ సాయిసచ్చరిత్ర చదువుతూ మనసులో ఆయన నామజపం సదా చేస్తూ ఉండేదాన్ని. ఇక్కడొక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఆ క్లిష్టకాలంలో ఒక మధ్యవయస్కుడైన ముస్లిం వ్యక్తి తెల్లని ధోతి(పాదాలవరకు పొడవాటి దుస్తులు), తెలుపురంగు టోపీ ధరించి మా అపార్ట్‌మెంట్ ఆవరణలో నడుస్తూ కనిపించేవాడు. అతని ముఖం ఎంతో ప్రశాంతంగా చాలా ఆహ్లాదకరంగా ఉండేది. నార్త్ కరోలినాలో జనవరి, ఫిబ్రవరి నెలల్లో చలి చాలా ఉంటుంది. అంత చలిలో కూడా అతను ఒక జాకెట్ గాని, కోటుగాని ధరించలేదు. నాకు అతను బాబాను పోలి ఉన్నట్లుగా అనిపించి నా హృదయంలోనే అతనికి ప్రణామం చేసేదాన్ని. కానీ, 'నాలాంటి చాలా చిన్న భక్తురాలికోసం బాబా ఎందుకు వస్తారు?' అని అనుకునేదాన్ని. నేను నా పిల్లలకోసం బస్‌స్టాప్‌కి వెళ్ళేటప్పుడు నేను అతన్ని చూస్తుండేదాన్ని. ఒకసారి నేను అతన్ని చూసినప్పుడు అతను నన్ను చూస్తూ చక్కగా ఒక నవ్వు నవ్వారు. ఇప్పటికీ నేను ఆ నవ్వును మరువలేను. ఆశ్చర్యంతో నేను కూడా తిరిగి నవ్వాను. ఇప్పుడది గుర్తుచేసుకుంటుంటే ధన్యత నొందినట్లుగా అనిపిస్తుంది. "చాలా చాలా ధన్యవాదాలు బాబా!" మా వీసా స్థితి గురించి నేను చాలా టెన్షన్ పడినప్పుడల్లా కిటికీలోంచి చూస్తే, అతను బయట నడుస్తూ కనపడేవాడు. అలా కొన్ని రోజులు గడిచాక మావారికి ఉద్యోగం వచ్చింది. వీసా బదిలీ కూడా జరుగుతోంది. అంతలో RFE (Request For Evidence) సమస్య వచ్చింది. ఆలస్యమైనా చివరకు వీసా ఆమోదం పొందింది. మొత్తానికి సమస్యల నుండి మాకు ఉపశమనం కలిగింది అనుకున్నాం.

కానీ మరుసటిరోజే మరో చెడువార్త వినాల్సి వచ్చింది. నా భర్త ఏ పోస్టుకు అయితే ఎంపిక అయ్యారో ఆ పోస్టు ఇప్పుడు లేదని, కాబట్టి ఇప్పుడు ఉద్యోగంలోకి తీసుకోలేమని చెప్పారు. మేము పూర్తిగా కుప్పకూలిపోయాము. నేను బాబా ముందు ఏడ్చి ఏడ్చి అలసిపోయాను. కానీ ఏమీ జరగలేదు. సమస్య మళ్ళీ మొదటికొచ్చింది. ఉద్యోగం లేదు కాబట్టి మేము USAలో ఉండలేము. నా భర్త ఆ కంపెనీ వాళ్ళని కనీసం తనని ఇండియాలో అయినా నియమించమని అభ్యర్థించారు. బాబా దయవల్ల అందుకు వాళ్ళు సరేనని చెప్పి, వెంటనే ఇండియా రమ్మని అన్నారు. కేవలం 4 రోజుల్లో మేము అన్నింటినీ యు.ఎస్.ఏ. లో అమ్మేసి ఇండియాకి తిరిగి ప్రయాణమయ్యాము. అది చాలా బాధాకరమైన పరిస్థితి. ఎంతో ప్రయత్నంతో యు.ఎస్.ఏ. వచ్చిన మేము భారమైన మనస్సుతో తిరిగి ఇండియా చేరుకున్నాము.

బహుశా అదంతా మా కర్మ కావచ్చు. బాబా చెప్పినట్లు మేము దానిని ఎదుర్కోవలసి వచ్చింది. కానీ  బాబా తోడుగా ఉంటూ ధైర్యంగా ఆ కష్టాన్ని దాటించారని నేను చెప్పగలను. ఎందుకంటే, మావారు ఉద్యోగంలో చేరిన నాలుగువారాల్లో బాబా అద్భుతం చేశారు. మళ్ళీ మేము యు.ఎస్.ఏ. వెళ్లే అవకాశం వచ్చింది. మేము యు.ఎస్.ఏ. వెళ్లి అదే అపార్ట్‌మెంటులో దిగాము. అక్కడ మూడు నెలలు ఉన్నాక చికాగోకి మారాము. మేము ఉన్న ఆ మూడునెలల్లో, కష్టాల్లో ఉన్నప్పుడు కనపడ్డ ముస్లిం వ్యక్తి ఒక్కసారి కూడా కనపడలేదు. అప్పుడు నాకనించింది, 'ఎన్నోసార్లు నాకు కనిపించింది, నన్ను చూసి నవ్వింది బాబానే' అని. ఆయన దయవల్లే మేము మా జీవితంలోని ఆ కష్టకాలాన్ని దాటగలిగాము. ఆయన "మీరు పిలిచినంతనే నేను మీవద్ద ఉంటాను" అనే వాగ్దానాన్ని నా విషయంలో నిరూపించి నన్ను ఆశీర్వదించారు. "చాలా ధన్యవాదాలు బాబా! దయచేసి మీ ఆశీస్సులను మీ భక్తులందరిపై కురిపించండి. వాళ్ళ జీవితాలలో సవాళ్లను అధిగమించడానికి వారికి సహాయపడండి. ముఖంపై చిరునవ్వుతో జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కోవడానికి తగిన ధైర్యం, బలం ఇవ్వండి. ఓపికగా మీ దయకు ఎదురుచూస్తున్న భక్తులకు, మీరు అనుగ్రహించే సమయం వచ్చేవరకు అవసరమైన విశ్వాసాన్ని దయచేసి ఇవ్వండి. ఐ లవ్ యు బాబా! మా అందరినీ ఆశీర్వదించండి". 

source : http://www.shirdisaibabaexperiences.org/2019/10/shirdi-sai-baba-miracles-part-2515.html

డాక్టర్ రాజారామ్ సీతారాం కపాడి


సాయిభక్తుడు డాక్టర్ రాజారామ్ సీతారాం కపాడి 1914 ఆగస్టు 22న శిరిడీలో జన్మించాడు. అతని తండ్రి జయదేవ్ వామన్ చితంబర్ శిరిడీలోని మరాఠీ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు. చిన్నపిల్లవాడైన రాజారామ్ కపాడి ద్వారకామాయిలో బాబాతో చాలాసేపు ఆడుకునేవాడు. బాబా అతన్ని ప్రేమగా 'గణపత్' అని పిలిచేవారు.

ఒకరోజు రాజారామ్ తల్లి తన బిడ్డ ముఖంపై కుడిభాగంలో వాపు ఉన్నట్లు గమనించింది. ఆ వాపు ముక్కుకు కుడివైపున కుడికంటి క్రిందిరెప్ప దిగువభాగంలో 1/3 అంగుళమంత పెద్దదిగా ఉంది. దానిగురించి ఆమె చాలా ఆందోళన చెందింది. ఆ సమయంలో ముంబాయికి చెందిన ఒక వైద్యుడు కొన్నినెలలపాటు శిరిడీలో ఉండటానికి వచ్చాడు. ఆ వైద్యునికి రాజారామ్‌తో చాలా అనుబంధం ఏర్పడింది. ప్రతిరోజూ సాయంత్రం ఆ వైద్యుడు రాజారామ్‌ను తీసుకుని వాహ్యాళికి వెళ్తుండేవాడు. ఒకరోజు సాయంత్రం రాజారామ్ తల్లి ఆ వాపు గురించి వైద్యుడిని అడిగింది. వైద్యుడు ఆ వాపును పరీక్షించి 'ముక్కు ఎముక పెరిగింద'ని నిర్ధారించి, శస్త్రచికిత్స చేసి దానిని తొలగించాలని చెప్పాడు. అయితే శస్త్రచికిత్స ముంబాయిలో మాత్రమే సాధ్యమవుతుందని చెప్పాడు. ఆ మాట విన్న రాజారామ్ తల్లి, తన తండ్రికి కూడా అదే చోట వాపు ఉండేదని, దానిని ఏమీ చేయలేదని చెప్పింది.

కొన్నిరోజుల తరువాత రాజారామ్ బాబాతో ఆడుకుంటూ రోజూ ఇంటికి తిరిగి వెళ్లే సమయానికి వెళ్ళలేదు. బిడ్డ ఇంట్లో లేడని గమనించిన తల్లి ద్వారకామాయికి వెళ్ళింది. అక్కడ రాజారామ్ బాబాతో కూర్చుని ఉండటం ఆమెకు కనిపించింది. వెంటనే ఆమె బిడ్డనెత్తుకుని ద్వారకామాయి నుండి బయటకు తీసుకెళ్ళి చెంపదెబ్బ కొట్టింది. బాబా ఆమెను సౌమ్యంగా పిలిచి, "ఈ బిడ్డ గతజన్మలో నీ తండ్రి, నా స్నేహితుడు. తనని మళ్లీ ఎప్పుడూ కొట్టవద్దు" అని అన్నారు. బాబా మాటలతో ఆమె తన తండ్రికి, బిడ్డకి మధ్య ఉన్న శారీరక సారూప్యతను గమనించి, మళ్ళీ ఎప్పుడూ రాజరామ్‌ని కొట్టలేదు.

తరువాత వచ్చిన గురువారంనాడు ఆమె ఇంట్లో బాబా ఫోటోను పసుపు, కుంకుమతో అలంకరించి ఆరతి ఇచ్చింది. తరువాత ఆమె రాజారామ్ నుదుటిపై కొంత ఊదీ పెట్టి, తనని 'అప్పా'(తండ్రి) అని పిలిచింది. ఆ క్షణం నుండే వాపు తగ్గడం ప్రారంభమై కొద్దిరోజుల్లో పూర్తిగా నయమైపోయింది.

1918వ సంవత్సరంలో బాబా సమాధి చెందడానికి ముందు రాజారామ్ కపాడి విద్యార్థిగా శ్రీసాయిబాబా దర్శనం కోసం వెళ్ళాడు. అప్పుడు శ్రీసాయిబాబా తనని ఆశీర్వదిస్తూ వైద్యవిద్యను అభ్యసించమని చెప్పారు. బాబా చెప్పినట్లుగానే అతడు ప్రొఫెషనల్ డాక్టర్ అయ్యాడు. 1983వ సంవత్సరంలో అతడు శ్రీసాయిబాబా సంస్థాన్ అధ్యక్షునిగా పనిచేశాడు.

సమాప్తం. 

Source: Ambrosia in Shirdi - Part I by Vinny Chitluri

సాయిభక్తుల అనుభవమాలిక 271వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. దయగల సాయి చేసిన అద్భుతం
  2. బాబా యొక్క స్మార్ట్ టైమింగ్

దయగల సాయి చేసిన అద్భుతం

ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

"ప్రియమైన సాయీ! నా జీవితంలో మీ ఉనికిని తెలియజేస్తూ నిరంతరం నాకు మార్గదర్శకత్వం చేస్తున్న మీకు నా ధన్యవాదాలు". నేను కొన్నేళ్లుగా బాబా నీడలో ఉంటున్నాను. చాలా చిన్న భక్తురాలినైన నేను డార్జిలింగ్ నివాసిని. నేనిప్పుడు 2019, ఏప్రిల్‌లో జరిగిన ఒక అనుభవాన్ని మీతో పంచుకుంటాను. ఆ సమయంలో నేను ఉంటున్న పట్టణంలో ఎన్నికల ప్రచారం జరుగుతోంది. ఒకరోజు నేను కోల్‌కత్తా వెళ్లేందుకు సిలిగురిలో బస్సు అందుకోవాల్సివుంది. డార్జిలింగ్ నుండి సిలిగురి వెళ్లడానికి టాటా సుమో వంటి వాహనాలు అందుబాటులో ఉంటాయి. అయితే  ఆరోజు ఆదివారం కావడంతో వచ్చే టాక్సీలన్నీ ఫుల్ గా వస్తున్నాయి. దాంతో నేను ఆందోళనపడి బాబాను ప్రార్థించి ఆయన స్మరణ చేస్తూ నిలబడ్డాను. ఆయన దయవలన దాదాపు అరగంట వేచివున్నాక నేనొక టాక్సీ ఎక్కాను. "ధన్యవాదాలు సాయీ!" కొంచెం దూరం వెళ్లేసరికి అక్కడ ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంది. చాలా గంటల నుండి వాహనాలతో ఆ రోడ్డు బ్లాక్ చేయబడి ఉందట. అసలే అది పర్వత ప్రాంతం. ఇరుకైన రహదారి, 3 వాహనాలు ప్రక్క ప్రక్కన వెళ్లడం అసాధ్యం. రైళ్లు, బస్సులు అందుకోవాల్సిన ప్రయాణికులు ఎంతోమంది అక్కడ చిక్కుకుని, ఏం చేయాలో అర్థంకాని నిస్సహాయస్థితిలో ఉన్నారు. నేను కూడా అక్కడ ఇరుక్కుపోయాను. వ్యతిరేక దిశనుండి కూడా వాహనాలు రావడం లేదు. రహదారికి అవతల వైపు ఎన్నికల ర్యాలీకి సంబంధించిన కార్లు వరుసగా నిలిపి ఉంచారు. ఎలా లేదన్నా ట్రాఫిక్ జామ్ క్లియర్ కావడానికి 3, 4 గంటలు పడుతుంది. అప్పుడు సమయం 2.30. సాయంత్రం 6 గంటలకు సిలిగురిలో నేను ఎక్కాల్సిన బస్సు బయలుదేరుతుంది. అందువలన నేను, "బాబా! నాకు సహాయం చేయండి. దయచేసి ఎలాగైనా మా వాహనాన్ని 3 గంటలకు ఇక్కడినుండి తరలించండి" అని సాయిని ప్రార్థించి ఆపకుండా ఆయన స్మరణ చేస్తూ ఉన్నాను. నా తోటిప్రయాణీకులు ఇక్కడ దిగిపోయి ట్రాఫిక్ జామ్ లేని ప్రదేశం వరకు నడుచుకుంటూ వెళ్లి అక్కడ వేరే వాహనం ఎక్కమని సలహా ఇచ్చారు. కానీ భారీ లగేజ్ ఉన్నందున నేను అలా చేయలేక మనసులోనే బాబాను స్మరిస్తూ కూర్చున్నాను. సమయం ముందుకు నడుస్తూ మూడు గంటలు కావొస్తుంది. సరిగ్గా అప్పుడే అద్భుతం జరిగింది!

అకస్మాత్తుగా వెనుకనుండి పోలీసు పెట్రోలింగ్ వాహనం వచ్చింది. ఆ వాహనంలో ఉన్న వ్యక్తి మా కారు డ్రైవర్‌ను తమ వాహనాన్ని  అనుసరించమని సైగచేశాడు. దాంతో విఐపి వాహనం లాగా పోలీసు వాహనాన్ని అనుసరిస్తూ మా వాహనం ముందుకు దూసుకుపోయింది. నేను ఆశ్చర్యపోయాను. విషయం ఏమిటంటే, పోలీస్ వాహనంలో ఉన్న ఒక వ్యక్తి మా డ్రైవరుకు తెలుసట, పైగా అతడు ఎన్నికల ప్రచారంలో నిమగ్నుడట. ఏది ఏమైనా నేను అడిగిన సమయానికి బాబా అద్భుతం చూపించారు. హృదయపూర్వకంగా నేను బాబాకు కృతజ్ఞతలు చెప్పుకున్నాను. నా బాబా ఏదైనా సాధ్యం చేస్తారు. మా బాబాకు అసాధ్యమైన విషయం ఏదీలేదు. "సాయీ! మీకెలా ధన్యవాదాలు చెప్పాలో నాకు తెలియదు. దయచేసి రోజురోజుకి నా భక్తిని బలోపేతం చేయండి. పగలు, రాత్రి నా మనస్సు మీమీదే స్థిరపడనివ్వండి. దయచేసి నా కుటుంబసభ్యులను, ముఖ్యంగా నా కుమార్తెను మంచి ఆరోగ్యం, మంచి నడివడి, తప్పుఒప్పుల తేడా గుర్తించగల సామర్థ్యం, జ్ఞానం కలిగి ఉండేలా ఆశీర్వదించండి. నా కూతురు మీకు ప్రియమైన భక్తురాలిగా మీప్రేమ, ఆశీర్వాదాల వెలుగులో ఎదగనివ్వండి. నా ప్రియమైన దేవా! చాలా చాలా ధన్యవాదాలు. నేను మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నాను".

బాబా యొక్క స్మార్ట్ టైమింగ్

యు.ఎస్.ఏ. నుండి సాయిభక్తురాలు అపర్ణ తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

నా జీవితంలో సాయిని తెలుసుకోవడం, ఆయన్ని ఆరాధించడం గొప్పవరం. ఆయన తన ఉనికిని పలురకాలుగా తెలియజేస్తున్నారు. నాకు ఏ సందేహం వచ్చినా నేను సాయినే అడుగుతుంటాను. చీటీల ద్వారా లేదా ఇతర మార్గాలలో ఆయన నాకు మార్గనిర్దేశం చేస్తూ ఉంటారు. ఒకసారి ఒక ముఖ్యమైన మెయిల్ ఒకరికి పంపవలసి వచ్చింది. నేనే స్వయంగా పోస్టాఫీసుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆరోజు నేను చాలా బిజీగా ఉండి వెళ్ళే మనసు కూడా లేదు. అందువలన 'వెళ్లాలా, వద్దా' అని బాబాను అడిగాను. "తప్పకుండా వెళ్ళమ"ని సమాధానం వచ్చింది. ఆరోజు శనివారం. నేను పోస్టాఫీసుకు వెళ్లి ఒక వ్యక్తిని సంప్రదించాను. అతను, "ఈరోజు మెయిల్స్ అన్నీ ఇందాకే సదరు వ్యక్తి తీసుకుని వెళ్ళిపోయాడు, కాబట్టి సోమవారంనాడు మాత్రమే మీ మెయిల్ పంపబడుతుంద"ని చెప్పాడు. "నేను వచ్చేసరికే మెయిల్స్ వెళ్లిపోయినట్టైతే బాబా నన్నెందుకు ఇక్కడికి పంపారు?" అనుకున్నాను. కానీ నేను చేయగలిగేది కూడా ఏమీలేక మెయిల్ అతనికిచ్చి వచ్చేశాను. తరువాత నేను షాపింగ్ చేసి వస్తుండగా బయట పోస్టల్ మెయిల్స్ వెళ్తున్న ట్రక్ ఉండటం చూశాను. అతనితో నేను, "నా మెయిల్ ఒకటి కాసేపటిక్రితం పోస్టాఫీసులో ఇచ్చాను, దానిని తీసుకుని వెళ్తారా?" అని అడిగాను. అందుకతను అంగీకరించి నాతోపాటు తిరిగి పోస్టాఫీసుకు వచ్చి ప్యాకేజీని తీసుకున్నాడు. ఇది బాబా లీల. ఆయన చాలా స్మార్ట్ గా విషయాన్ని చక్కబరిచారు. ఆయన టైమింగ్ చాలా ప్రత్యేకమైనది. బాబా మనకు ఎప్పుడూ మార్గనిర్దేశం చేస్తారని మనం గుర్తుంచుకోవాలి.

source : http://www.shirdisaibabaexperiences.org/2019/09/shirdi-sai-baba-miracles-part-2489.html

సాయిభక్తుల అనుభవమాలిక 270వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. భక్తులను బాబా ఎంతలా కనిపెట్టుకొని ఉంటారో
  2. సాయికృపతో నా భర్త రక్తపోటు సాధారణ స్థితికి వచ్చింది

భక్తులను బాబా ఎంతలా కనిపెట్టుకొని ఉంటారో

తెలంగాణ నుండి ఒక సాయి భక్తుడు మరో అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.

ఓం సాయిరాం! ఓం సద్గురవే నమః! 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగ్ నిర్వహిస్తున్న సాయికి నా నమస్కారములు. భక్తులు తమకున్న వ్యాధి ఏదైనా సరే సాయి పాదాలకు శరణాగతులై, 'సాయీ!' అని మనసారా ప్రార్థిస్తే, వాళ్ళు ఆ వ్యాధి నుండి తప్పకుండా కోలుకుంటారు. శిరిడీ సాయి దివ్యపాదాలకు నమస్కరిస్తూ, నా భార్య ఆ సాయినాథుని ప్రేమను పొందిన అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటాను. భక్తులను బాబా ఎంతలా కనిపెట్టుకొని ఉంటారో తెలియజేసిన ఈ అనుభవాన్ని చదివి మీరు కూడా ఆనందించండి.

రెండు మూడు సంవత్సరాల క్రితం ఒకరోజు నా భార్యకు 'సాయి నవగురువార వ్రతం' పుస్తకం బాబా ప్రసాదంగా అందింది. తను ఆ పుస్తకాన్ని పూజగదిలో ఉంచింది. తర్వాత కొద్దిరోజులకి ఆమె చర్మంపై తెల్లటి మచ్చ ఉండటం గమనించాము. అది చూసి తను భయంతో మానసిక వేదనకు గురయ్యింది. తను సాయిని మనసారా ప్రార్థించి, "నా చర్మంపై ఉన్న తెల్లమచ్చను శాశ్వతంగా దూరం చేసి నన్ను రక్షించు బాబా!" అని కన్నీటితో వేడుకుంది. తరువాత బాబా ప్రసాదంగా లభించిన 'సాయి నవగురువార వ్రతం' ఆచరించింది. అదే సమయంలో ఒక మంచి డాక్టరును సంప్రదించి, ఆయనిచ్చిన మందులను వాడటం ప్రారంభించింది. నవగురువారవ్రతం పూర్తయ్యేలోపే సాయి కృపవలన తన చర్మంపై ఉన్న తెల్లమచ్చ శరీరవర్ణంలో కలిసిపోయింది. దాంతో నా భార్య ఎంతో ఆనందించి బాబాకు కృతజ్ఞతలు తెలుపుకుంది.

"రోగులను కాపాడే సాయీ! రాబోయే సమస్యను ముందుగానే గుర్తించి ప్రసాదరూపంలో నవగురువారవ్రత పుస్తకాన్ని మాకు అందించి, వ్రతం పూర్తయ్యేలోపే తెల్లమచ్చను తొలగించి మానసిక వేదన నుంచి నా భార్యకు విముక్తినిచ్చిన మీ దివ్యపాదాలకు శతకోటి ప్రణామాలు. సాయీ! మీ ప్రేమ మాపై సదా ఉండాలని కోరుకుంటూ ఆనందభాష్పాలతో...."

సాయికృపతో నా భర్త రక్తపోటు సాధారణ స్థితికి వచ్చింది

దుబాయి నుండి సాయిభక్తురాలు సవిత తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

జై సాయిరామ్! నా పేరు సవిత. "స్వామీ! మీరు నా జీవితం. నా తల్లి, తండ్రి, సోదరుడు, స్నేహితుడు, ప్రతిదీ మీరే". నేను, నా భర్త దుబాయిలో నివసిస్తున్నాము. మాపై, మాకుటుంబంపై బాబా ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉన్నాయి. నేను నా భావాలను సరిగా వ్యక్తపరచలేకపోతున్నాను. నన్ను క్షమించండి.

ఒకసారి నా భర్తకు తలనొప్పి వచ్చింది. దాంతోపాటు ఆయన దృష్టి అస్పష్టంగా మారిపోయింది. ఒకవైపు తలనొప్పి, మరోవైపు ఏదీ సరిగా కనపడక ఆయన చాలా ఆందోళనపడ్డారు. మేము అప్పటికే ఒక సంక్షోభాన్ని ఎదుర్కొంటూ మానసికంగా బలహీనంగా ఉన్నాము. దానికి తోడు నిరంతరం ఈ తలనొప్పి ఒకటి. చూసి చూసి మేము ఆసుపత్రికి వెళ్ళాము. డాక్టర్ పరీక్షించి మా వారికి రక్తపోటు చాలా ఎక్కువగా ఉందని చెప్పి కొన్ని మందులు వ్రాసిచ్చారు. ఇంకా ఇలా చెప్పారు: "ఒక నెల తరువాత కూడా మార్పు లేనట్లయితే మరికొన్ని పరీక్షలు చేయవలసి ఉంటుంది" అని. మందులు వాడుతున్నా ఆ తలనొప్పి తగ్గకపోవడంతో ఏం చేయాలో అర్థంకాక నేను బాబా ముందు చాలా ఏడ్చి, "మళ్ళీ మేము డాక్టరుని సందర్శించేలోపు మావారి పరిస్థితి సాధారణ స్థితికి రావాలి" అని బాబాను ప్రార్థించాను. ఒక సప్తాహం సాయిసచ్చరిత్ర పారాయణ చేయాలన్న సంకల్పంతో పారాయణ కూడా మొదలుపెట్టాను. బాబా కృప చూపించారు. మేము మళ్ళీ వైద్యుడిని సంప్రదించినప్పుడు మావారి రక్తపోటు సాధారణ స్థాయికి వచ్చింది. ఎంతో ఆనందంతో బాబాకు కృతజ్ఞతలు చెప్పుకున్నాను. బాబా మన దేవుడు. ఆయనను నమ్మండి, ఆయన మనతో ఎప్పుడూ ఉంటారు. ఆయన ఖచ్చితంగా మన ప్రార్థనలను వింటారు. "స్వామీ! మాకు కొన్ని ఆర్థిక సమస్యలున్నాయి. వాటిని మీరు పరిష్కరిస్తారని మాకు తెలుసు. మా కోరికలు నెరవేర్చి మమ్మల్ని ఆశీర్వదించండి".

source:http://www.shirdisaibabaexperiences.org/2019/09/shirdi-sai-baba-miracles-part-2478.html?m=0

సాయిభక్తుల అనుభవమాలిక 269వ భాగం....


ఈ భాగంలో అనుభవం:
  • అడుగడుగునా బాబా తోడుగా ఉండి నన్ను నడిపించారు

నందివెలుగు నుండి సాయి భక్తుడు సాయి సుమన్ బాబా తనకు ప్రసాదించిన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు: 

సాయిబంధువులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు.

నేను ఒక ప్రైవేట్ బ్యాంకులో ఉద్యోగం చేసేవాడిని. కొన్ని కారణాల వల్ల గతేడాది నేను ఆ ఉద్యోగానికి రాజీనామా ఇచ్చాను. తర్వాత ఎన్ని ప్రయత్నాలు చేసినా కలిసి రాలేదు. నేనెప్పుడు నా ఉద్యోగ విషయం గురించి బాబాని అడిగినా "నిశ్చింతగా కూర్చో!" అని సమాధానం వస్తుండేది. కానీ నా చుట్టూ ఉన్న పరిస్థితుల దృష్ట్యా నిలకడగా ఉండలేకపోయేవాడిని. అంతలో నాకు శిరిడీ వెళ్లే అవకాశం వచ్చింది. శిరిడీ వెళ్లి వచ్చాక బాబా కృపతో మంచి ఉద్యోగం వస్తుందని నేను, నా మిత్రులు ఆశించాం. కానీ తరువాత కూడా పరిస్థితులు అనుకూలించలేదు. దానికి తోడు ఆరోగ్య సమస్యలు కూడా చుట్టుముట్టి మనశ్శాంతి కరువైపోయింది. దాంతో నా గురువైన సాయినాథునిపై కూడా తగిన శ్రద్ధ పెట్టలేకపోయాను.

ఇలా రోజులు గడుస్తూ ఉండగా 2019, సెప్టెంబరు నెలలో బాబా దయతో నాకు తెలిసినవాళ్ళ ద్వారా వ్యాపారానికి సంబంధించిన ఒక ప్రతిపాదన వచ్చింది. నాకు వెంటనే సచ్చరిత్రలోని దామూ అన్నా ఉదంతం గుర్తుకు వచ్చింది. దామూ అన్నాకి తన స్నేహితుని ద్వారా వ్యాపార ప్రతిపాదన వచ్చినప్పుడు, అతడు శ్యామాకు ఉత్తరం వ్రాసి బాబా అభిప్రాయాన్ని తెలియజేయమని అడుగుతాడు. అలాగే, ఏ విషయంలో అయినా బాబాని అడిగి ముందుకు వెళ్లే అలవాటున్న నేను కూడా బాబా అభిప్రాయాన్ని తెలుసుకోవాలని అనుకున్నాను. బాబా నాకు ప్రసాదించిన మంచి ఆధ్యాత్మిక మిత్రుడు సురేష్‌కి ఈ విషయాన్ని చెప్పి, బాబా అభిప్రాయం ఏమిటో తెలుసుకోమని అడిగాను. తను బాబాని అడిగినప్పుడు బాబా నుండి సానుకూలమైన సమాధానం వచ్చింది. అది తెలిసిన వెంటనే నేను నా మనసులో,  "బాబా! నా అంతట నేను ఏదీ చేయలేనివాడిని. అలాంటి నేను మీ ఆదేశంతో వ్యాపారంలోకి అడుగుపెడుతున్నాను. దానికి తగిన శక్తియుక్తులు లేనివాడిని. కాబట్టి మీరే నాకు తోడుగా ఉండి, ముందుకు నడిపించాలి" అని బాబాను ప్రార్థించాను. బాబా నా ప్రార్థన విని అడుగడుగునా నాకు తోడుగా ఉండి నడిపించారు.

ముందుగా వ్యాపారం కోసం విజయవాడలో ఒక ఇల్లు అద్దెకు తీసుకోవాలని అనుకున్నాము. కానీ అక్కడ అద్దెలు ఎక్కువగా ఉండటం, మరికొన్ని ఇతర కారణాల వలన ఇల్లు దొరకలేదు. అప్పుడు వ్యాపార ప్రతిపాదన తెచ్చినవాళ్ళు 'జంగారెడ్డిగూడెంలో అద్దెలు తక్కువగా ఉంటాయి, కాబట్టి అక్కడ ఇల్లు తీసుకోమ'ని సలహా ఇచ్చారు. అయితే, జంగారెడ్డిగూడెం అంటే బాగా దూరం అవుతుంది, తెనాలి అయితే దగ్గరగా ఉంటుందని నాకు అనిపించింది. అయితే ఈ రెండింటిలో ఏ ఊరిని ఎంచుకోవాలో నిర్ణయించుకోలేకపోయాను. దాంతో నిర్ణయం కోసం మళ్ళీ సురేష్ ద్వారా బాబాని అడిగించాను. నేను ఆ మాట చెప్తూనే సురేష్ తన మనసులో యథాలాపంగా, "తెనాలి ఓకే అంటే శిరిడీ ప్రత్యక్ష ప్రసారంలో బాబా తెలుపు రంగు దుస్తుల్లో ఉండాలి" అనుకున్నాడు. అంతే! మరుక్షణంలో ప్రత్యక్ష ప్రసారం చూస్తే బాబా తెలుపురంగు దుస్తుల్లో దర్శనమిచ్చారు. అలా వెంటనే బాబా మాకు సమాధానమిచ్చారు. ఆనందంతో బాబాకు కృతజ్ఞతలు చెప్పుకుని, తెనాలిలోనే ఇల్లు తీసుకోవడానికి నిర్ణయించుకున్నాను.

ఒకవైపు వ్యాపారానికి సంబంధించిన లైసెన్స్ పనులు చేస్తూనే తెనాలిలో ఇల్లు వెతకటం ప్రారంభించాను. ఒక ఇల్లు చూసి, అద్దె మొదలైన విషయాలన్నీ మాట్లాడుకున్న తరువాత కూడా ఏవో కారణాల చేత అడ్వాన్సు ఇచ్చి ఇల్లు ఖాయం చేసుకోవడంలో జాప్యం కాసాగింది. ఇల్లు ఖాయం చేసుకోకపోయినా మాట్లాడిన తేదీ నుండి అద్దె కట్టమని ఆ ఇంటి ఓనర్ పేచీ పెట్టాడు. మరోవైపు లైసెన్స్ విషయం కూడా ఆలస్యం అవుతూ వచ్చింది. అంతలో మా బంధువుల ఇల్లు ఒకటి ఖాళీగా ఉందని తెలిసింది. అయితే ఆ ఇంటి వాస్తు అనుకూలంగా లేదని కొందరన్నారు. బాబా ఉండగా వాటి గురించి భయపడనవసరం లేదని తెలిసినా నేను ఆలోచనలో పడ్డాను. అయితే బాబా, "నన్ను నమ్ముకో! ఏ గ్రహాలు, వాస్తు ప్రభావాలు ఏమీ చేయలేవ"ని నాకు కొన్ని నిదర్శనాలు ఇచ్చారు. దాంతో నేను ఆ ఇంటిని ఖాయం చేసుకున్నాను. ఇదంతా బాబాయే నడిపించారు. ఒకవేళ నేను ముందు మాట్లాడుకున్న ఇంటికి అడ్వాన్సు ఇచ్చివుంటే నేను చాలా నష్టపోయి ఉండేవాడిని. అలా జరగకుండా బాబానే కాపాడారు. అందుకే మనం ఏ విషయంలో అయినా బాబానే నమ్ముకుంటే అంతా మంచే జరుగుతుంది.

అక్టోబరు నెలలో వ్యాపారానికి సంబంధించిన సరుకు కొరకు ఆర్డర్ పెట్టాము. సరుకు వస్తుంది వస్తుంది అంటూనే ఆలస్యం కాసాగింది. అయినా నేను ఆందోళన చెందలేదు. ఎందుకంటే, నా బాబాకి ఎప్పుడు ఏది ఇవ్వాలో బాగా తెలుసు. సమయం వచ్చినప్పుడు ఆయన అనుగ్రహిస్తారని సహనంతో వేచి ఉన్నాను. ఈలోగా నవంబరు నెల వచ్చింది. బాబా మళ్ళీ నన్ను శిరిడీకి పిలిచారు. నా స్నేహితులు శిరిడీ వెళ్తుంటే, వాళ్లతోపాటు నేను, నా తల్లిదండ్రులు శిరిడీ వెళ్ళాము. నాలుగు రోజులు చక్కటి దర్శనాలతో బాబా మమ్మల్ని ఆశీర్వదించారు. శిరిడీ నుండి వచ్చిన కొన్నిరోజులకి సరుకు హైదరాబాదుకి వచ్చింది. (వ్యాపారానికి కొత్త కాబట్టి నేర్చుకునేందుకు మొదటిసారి సరుకును తెలిసినవాళ్ళ వద్దకు తెప్పించాము). మేము చేయాల్సిన పనులు పూర్తి చేశాము. ఇక ఆ సరుకును హైదరాబాదు నుండి విజయవాడలో ఉన్న అమెజాన్ గోడౌనుకి తరలించాల్సి ఉంది. అయితే ఎంత ప్రయత్నించినా ట్రాన్స్‌పోర్ట్ వెహికిల్ దొరకలేదు. అప్పుడు నేను "సహాయం చేయమ"ని బాబాను ప్రార్థించాను. వెంటనే అప్పటివరకు ఎంత ప్రయత్నించినా దొరకని ట్రావెల్స్ లిస్ట్ నా కంటిముందు కనిపించింది. అది కూడా ఆ లిస్టులో ఉన్న 'సాయిరాం మినీ ట్రావెల్స్' పైనే నా దృష్టి పడింది. వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు లిఫ్ట్ చేయలేదు. సరేనని వేరేవాళ్ళకి ఫోన్ చేశాము. అంతలో సాయిరాం ట్రావెల్స్ వాళ్ళు ఫోన్ చేశారు. కానీ విషయం ఒక కొలిక్కి రాలేదు. దాంతో నేను, "ఏమిటి బాబా, మీరు చూపాక కూడా సమస్య అలాగే ఉంద"ని అనుకున్నాను. ఆ రాత్రి పడుకుని, మరుసటిరోజు ఉదయాన లేచాను. "ఈరోజు సాయంత్రానికల్లా సరుకు విజయవాడకి ఎలాగైనా చేర్చాలి బాబా. ఇప్పటివరకు ట్రావెల్స్ సెట్ కాలేదు, ఏమి చేయాలి బాబా?" అనుకున్నాను. మరుక్షణం ఫోన్ రింగ్ అయ్యింది. చూస్తే, సాయిరాం ట్రావెల్స్ నుండి ఫోన్. ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడాను. బాబా కృప చూడండి, అతను అతి తక్కువ మొత్తానికే (మిగతా ట్రావెల్స్ వాళ్ళు చెప్పిన దాంట్లో దాదాపు సగానికి) సరుకు విజయవాడ చేర్చడానికి ఒప్పుకున్నాడు. ఇదంతా బాబా చలవే అని బాబాకు కృతజ్ఞతలు చెప్పుకున్నాను.

ఇక ట్రావెల్స్ వాళ్ళు ఎలాంటి డ్రైవరుని పంపుతారో అని టెన్షన్ పడ్డాను. "నన్ను నమ్మి, నా ధ్యానమందే ఎవరు ఉంటారో, వారి కర్మలన్నీ సూత్రధారినై నేనే నడిపిస్తాను" అన్న చందంగా బాబా నా టెన్షన్ తీసేశారు. ట్రావెల్స్ వెహికిల్ వచ్చింది. మొట్టమొదటగా నా దృష్టిలో పడింది ఆ వెహికిల్‌లో ఉన్న బాబానే! బాబానే స్వయంగా వచ్చారు, ఇక నాకు టెన్షన్ ఎందుకని చాలా ఆనందించాను. సరుకంతా వెహికిల్‌లో ఎక్కించి మేము బయలుదేరాము. రైలు ప్రయాణంలో రేగే 'బాబా.. బాబా' అని చేసుకున్న ప్రార్థన గుర్తుకొచ్చి, నేను కూడా బాబా స్మరణ చేస్తూ, బాబా ధ్యాసలోనే ప్రయాణమంతా గడిపాను. సమయం తక్కువగా ఉంది, సాయంత్రానికల్లా విజయవాడ చేరుకోవాలని డ్రైవర్ భోజనానికి కూడా ఆపకుండా బిస్కెట్స్ మాత్రమే తీసుకుని డ్రైవ్ చేస్తున్నాడు. అప్పుడు ఉదయం జరిగిన సంఘటన గుర్తొచ్చి బాబా ప్రేమకు కరిగిపోయాను. అసలు ఏమి జరిగిందంటే, ఉదయం నేను టిఫిన్ చేయడానికి వెళ్లి ఒక దోశ తిన్నాను. సాధారణంగా ఏదో ఒక్క ఐటం మాత్రమే తింటాను. అలాంటిది ఎందుకో నా హృదయం, "ఈరోజు నీకు మధ్యాహ్న భోజనం ఉండదు, కాబట్టి ఇంకా ఏదైనా తిను" అని చెప్తున్నట్లు అనిపించింది. ఎందుకిలా అనిపిస్తుంది అనుకుంటూనే నేను ఇడ్లీ కూడా తిన్నాను. తన బిడ్డ ఆకలికి తాళలేడని తెలిసిన బాబా ముందుగానే నా మనసులో ఆలోచన ఇచ్చి కడుపునిండా తినేలా చేశారు.

ఇక అసలు కథ ఇప్పుడు మొదలైంది. విజయవాడలో గోడౌన్ సాయంత్రం 6 గంటలకు మూసివేస్తారు. మేము విజయవాడ సిటీలోకి ఎంటర్ అయ్యేసరికి 6.40 అయ్యింది. వ్యాపారంలో సహచరమిత్రులు ఫోన్ చేసి, "టైమ్ అయిపోయింది, గోడౌన్ మూసివేస్తారు. రేపటివరకు సరుకు ఎక్కడ పెడతావు? చాలా ఇబ్బంది ఎదుర్కోవలసి వస్తుంద"ని అన్నారు. నేను చాలా ఆందోళనపడ్డాను. కానీ ఏ సమస్య వచ్చినా బాబానే నాకు దిక్కు. కాబట్టి వెంటనే మనసులో బాబా పాదాలు తలచుకుని, "బాబా! నీ ఆజ్ఞ లేనిదే ఆకైనా కదలదు. నీ అనుజ్ఞ ప్రకారమే నేను హైదరాబాదులో బయలుదేరాను. ఏ ఇబ్బందీ లేకుండా అంతా సజావుగా జరిగేటట్లు చూడండి" అని బాబాను ప్రార్థించాను. తరువాత గోడౌన్ అడ్రెస్ సరిగా తెలియలేదు. ఎవరిని అడిగినా తెలియదనే చెప్తున్నారు. ఏమి చేయాలో అర్థం కాలేదు. అంతలో ఒక ముసలివ్యక్తి కనిపించాడు. 'ఆ ముసలాయనకు ఏమి తెలుస్తుందిలే' అని నేను నా మనసులో అనుకుని, నా అజ్ఞానంతో, మూర్ఖత్వంతో అతనిలో ఉన్న బాబాను గుర్తించలేకపోయాను. చివరికి అతని ద్వారానే అడ్రెస్ తెలిసింది. మేము వెంటనే గోడౌన్ వద్దకు చేరుకున్నాము. గోడౌన్ తెరిచే ఉండటం చూసి నేను ఆనందం పట్టలేకపోయాను. అదంతా నా బాబా చలవే. మామూలుగా అయితే ఆరు గంటలకే మూసేసే వాళ్ళు, కానీ ఏవో కారణాలతో వాళ్ళకి ఆలస్యమై మేము చేరుకున్న సమయానికే వాళ్ళు బయటకి వస్తున్నారు. వాళ్ళు ఏమంటారో అని నేను టెన్షన్ పడ్డానుగానీ, లోపలకి అడుగుపెడుతూనే గయలో శ్యామాకు దర్శనమిచ్చినట్లు బాబా నాకు దర్శనమిచ్చారు. బాబాను చూస్తూనే నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. బాబా దయవలన వాళ్ళు సరుకు దింపుకునేందుకు అనుమతించారు. తరువాత ఒక చిన్న సమస్య వచ్చిందిగాని, బాబాను ప్రార్థించిన వెంటనే సమసిపోయింది. ఇలా అడుగడుగునా బాబా నాకు తోడుగా ఉండి నడిపించారు.

అందరికీ నేను విన్నవించుకునేది ఏమిటంటే, మనం ఏపని చేస్తున్నా భారమంతా బాబా మీద వేసి శ్రద్ధ, సబూరీలతో ఉంటే ఆయన మన మీద అనుగ్రహవర్షాన్ని కురిపించడమే కాదు మనకు అండగా ఉంటూ మన పనులన్నీ సక్రమంగా జరిగేలా చేస్తారు.

జై సమర్థ సద్గురు సాయిబాబా!

సాయిభక్తుల అనుభవమాలిక 268వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. అంతులేని సాయికృప
  2. బాబా కృప చూపారు

అంతులేని సాయికృప

సాయిభక్తురాలు రీతూ తనకు బాబా ప్రసాదించిన అద్భుతమైన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.

నేను రీతూకుమార్. నేను న్యూఢిల్లీలో నివాసముంటున్నాను. నాకు బాబాపై పూర్తి నమ్మకం. నేను రోజూ సాయిసచ్చరిత్ర చదువుతాను. సాయిగాయత్రి కూడా పఠిస్తాను.

అందరికీ నమస్కారం. నాకు 2008లో వివాహం అయ్యింది. రెండేళ్లు సంతోషంగా జీవితం సాగింది. హఠాత్తుగా 2010లో నాకు అండాశయ క్యాన్సర్ మూడోదశలో ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఆ విషయాన్ని అంకాలజిస్ట్(క్యాన్సర్ వైద్యుడు), గైనకాలజిస్ట్ నాతో చెప్పి, "పునరుత్పత్తి అవయవాలన్నింటినీ తొలగించాలి, కాబట్టి ఇకపై మీకు పిల్లలు పుట్టే అవకాశం లేదు" అని చెప్పారు. ఆ మాట వింటుంటే నా గుండె బద్దలైనంత పనైంది. సాధారణంగా కీమోథెరపీ జరిగాక పిల్లలు పుట్టే అవకాశం కేవలం 10% మాత్రమే ఉంటుంది. అలాంటిది నాకు ఆ ఆశ కూడా లేకుండా పోయిందని చాలా బాధపడ్డాను. నా అత్తమామలు, నా భర్త ఆపరేషన్ కు అంగీకరించారు. వాళ్ళు నాతో ఒక్క మాట కూడా అనలేదు కాని, వాళ్ళ కళ్ళల్లో పిల్లలు కావాలనే వారి ఆరాటాన్ని చూశాను. కానీ ఏం చేయగలను, బాధపడటం తప్ప?

న్యూఢిల్లీ, లోఢీ రోడ్డులో ప్రసిద్ధిగాంచిన సాయిబాబా మందిరం ఉంది. మే, జూన్ నెలల్లో, మంచి ఎండల్లో నా భర్త చెప్పులు లేకుండా 40 రోజులపాటు ప్రతిరోజూ నా రిపోర్టులు తీసుకునివెళ్లి వాటిని బాబా పాదాలకు తాకించి, నాకు త్వరగా నయంకావాలని ప్రార్థిస్తూ ఉండేవారు. అదేసమయంలో మేము కొన్ని పేరున్న హాస్పిటల్స్‌కి వెళ్లి చాలామంది అంకాలజిస్టులకు నా రిపోర్టులను చూపించాము. వాళ్లంతా నా పునరుత్పత్తి అవయవాలు తొలగించడం మంచిదని చెప్తుండేవారు. కానీ నేను, నా భర్త బాబాపై పూర్తి నమ్మకం పెట్టుకున్నాము. మా నమ్మకం వృధా పోలేదు. బాబా మాకు మార్గం చూపించారు. అనుకోకుండా మేము రాజీవ్‌గాంధీ క్యాన్సర్ హాస్పిటల్లో ఒక సర్జన్‌ను కలుసుకున్నాము. అతను నా కుడి అండాశయం, కుడి ఫెలోపియన్ ట్యూబులు తొలగిస్తే చాలు, మరేమీ తీసివేయనవసరం లేదని, ఇంకా సంతానం కలిగే అవకాశముందని చెప్పారు. ఆ మాట వింటూనే మాకు చాలా సంతోషం కలిగింది. తరువాత నాకు ఆపరేషన్ జరిగింది. తరువాత 6సార్లు కీమోథెరపీ జరిగింది. నెమ్మదిగా నేను కోలుకుంటూవున్న సమయంలో ఒకరోజు నేను సాయిబాబా మందిరానికి వెళ్లి, బాబాను ప్రార్థిస్తూ ఉన్నాను. అంతలో ఒక పెద్దాయన పెద్ద పూలమాల పట్టుకుని వచ్చాడు. ఆయన నేరుగా నా వద్దకు వచ్చి, ఆ మాలను నాకిచ్చి, "నువ్విప్పుడు ఆరోగ్యంగా ఉన్నావు. త్వరలో నీకు కొడుకు పుడతాడు. బాబాపై నమ్మకం ఉంచు" అని ఆశీర్వదించి వెళ్లిపోయారు. 'నా ఆరోగ్యం గురించి ఆయనకెలా తెలుసు?' అని నేను ఆశ్చర్యపోయాను. అయితే అంకాలజిస్ట్ మరో 5 సంవత్సరాల వరకు గర్భం దాల్చవద్దని, ఎందుకంటే మళ్ళీ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. కానీ నాకు, నా భర్తకు బాబాపై పూర్తి నమ్మకం ఉంది. ఆ పెద్దాయన ఆశీర్వదించినట్లుగానే నేను త్వరలోనే గర్భం దాల్చాను. తరువాత హనుమాన్‌జయంతినాడు పండంటి మగబిడ్డకు జన్మనిచ్చాను. ఇప్పుడు నా బిడ్డకి 5 సంవత్సరాలు. బాబా దయవలన మేమిద్దరం ఆరోగ్యంగా ఉన్నాం. "ఎటువంటి ఆశా లేకుండా పోతుందన్న నా జీవితాన్ని ఇంత చక్కగా మలిచినందుకు చాలా చాలా ధన్యవాదాలు బాబా!"

చివరిగా ఒక మాట:

థోడా ధ్యాన్ లగా, సాయి దౌడే దౌడే ఆయేంగే,
థోడా ధ్యాన్ లగా సాయి దౌడే దౌడే ఆయేంగే (కొద్దిగా బాబాపై శ్రద్ధ పెట్టు, ఆయన పరుగు పరుగున వస్తారు)
తుఝె గలే సే లగాయేంగే(నిన్ను హత్తుకుంటారు).
అఖియాన్ మన్‌కీ ఖోల్(కనులు తెరిచి చూడు)
తుఝ్‌కో దర్శన్ వో కరాయేంగే(నీకు ఆయన దర్శనమవుతుంది).

బాబా కృప చూపారు

సాయిభక్తురాలు శైలజ తనకు బాబా ఇటీవల ప్రసాదించిన ఒక అనుభవాన్ని మనతో ఇలా పంచుకుంటున్నారు:

ఓం సాయిరామ్! నేను, నా భర్త ఇద్దరం సాయిభక్తులం. ఇటీవల బాబా మాకిచ్చిన ఒక అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటాను. కొంతకాలం క్రితం నా భర్త చెవికి శస్త్రచికిత్స చేయాలని డాక్టరు సూచించారు. ఆ విషయంగా మేము బాబాను చాలా ప్రార్థించాము. కొన్ని కారణాల వలన మేము మళ్ళీ డాక్టరు వద్దకు వెళ్లడం ఆలస్యమవుతూ వచ్చింది. ఈమధ్య రెండవ అభిప్రాయం కోసం మేము మరొక డాక్టరు వద్దకు వెళ్ళాము. అతను సిటి స్కాన్ చేయించారు. బాబా కృప చూపారు. రిపోర్టులో సమస్య ఏమీ లేదని వచ్చింది. దాంతో డాక్టరు శస్త్రచికిత్స అవసరం లేదని చెప్పారు. ఇది బాబా చేసిన అద్భుతం. ఆయన మా ప్రార్థనలు విని మమ్మల్ని అనుగ్రహించారు. నమ్ముకున్న వారికి బాబా ఎప్పుడూ అండగా ఉంటారు. "చాలా చాలా కృతజ్ఞతలు బాబా!"

సాయిభక్తుల అనుభవమాలిక 267వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. బాబా ప్రేమ అద్భుతం, అనంతం
  2. పిలిచినంతనే పలుకుతారు సాయి

బాబా ప్రేమ అద్భుతం, అనంతం

బాబా ప్రేమ అద్భుతం, అనంతం. ఎంత అనుభవించినా తనివితీరని ఆ ప్రేమను వర్ణించడానికి ఏ పదాలూ సరిపోవు. ఇప్పుడే(2019, డిసెంబర్ 22) బాబా నుండి పొందిన ప్రేమను ఆలస్యం చేయకుండా మీతో పంచుకోవాలని వ్రాస్తున్నాను.

2019, డిసెంబర్ 22 మధ్యాహ్నం బ్లాగ్ వర్క్ చేద్దామని కంప్యూటర్ ఆన్ చేశాక బ్లాగ్ ఓపెన్ చేసి నిర్ఘాంతపోయాను. ఎందుకంటే, ముందురోజు ఒక ఆర్టికల్ చేసి డ్రాఫ్టులో సేవ్ చేసి పెట్టుకున్నాను, అది కాస్తా కనిపించలేదు. కింద నుంచి పైదాకా అంతా వెతికాను, కానీ ఎక్కడా కనిపించలేదు. దాదాపు గంటన్నరసేపు శ్రమపడి చేసిన ఆర్టికల్ కనపడకపోయేసరికి కంగారుగా అనిపించింది. నాతో బ్లాగ్ వర్క్ చేసే వాళ్లలో ఒకరు డిలీట్ చేశారేమోనని తనకి ఫోన్ చేసి అడిగాను. తను, "అనవసరమైన డ్రాఫ్టులు ఎందుకని కొన్ని డిలీట్ చేశాను" అని చెప్పి, "అందులో ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ ఉందా?" అని అడిగారు. అందుకు నేను, "అందులో నేను కొంత వర్క్ సేవ్ చేసి పెట్టాను, అది పోయింది" అని బాధగా చెప్పాను. దాంతో తను కూడా బాధపడుతూ నిశ్శబ్దంగా ఉండిపోయారు. నాకు కూడా ఏమీ మాట్లాడాలనిపించక తను లైన్‌లో ఉండగానే చెప్పాపెట్టకుండా కాల్ కట్ చేశాను. 'మళ్ళీ ఆ ఆర్టికల్ చేసుకోవాలా?' అని చాలా బాధగా అనిపించింది. సరే, ఏం చేస్తాం అనుకొని మళ్ళీ ఆ వర్క్ చేయడానికి సిద్ధపడ్డాను. అంతలో ఏదైనా పరిష్కారం గూగుల్‌లో దొరుకుతుందేమో చూద్దామనుకున్నాను. కానీ ఇదివరకు కూడా ఇలాగే సేవ్ చేసిపెట్టుకున్న వర్క్స్ రెండు, మూడుసార్లు పోయాయి. అప్పుడు నేను గూగుల్‌లో పరిష్కారం కోసం చూసినప్పుడు, పబ్లిష్ చేసినవి డిలీట్ అయితే తిరిగి పొందే అవకాశం ఉంది కానీ, డ్రాఫ్ట్స్ డిలీట్ అయితే తిరిగి పొందలేమని తెలిసింది. ఆ విషయం తెలిసి కూడా నేను గూగుల్‌లో ఒక పేజీ తెరిచి ఒకటి రెండు పాయింట్స్ చదివానో లేదో, చాలా మనోవేదనను అనుభవిస్తూ మనసులో, "బాబా! బ్లాగులో లేదా వర్డ్ డాక్యుమెంట్‌లో ఎక్కడ సేవ్ చేసుకున్నా ఇలాగే పోతున్నాయి. నేను ఎంతో కాలాన్ని వెచ్చించి, శ్రమపడి వర్క్ చేస్తుంటే ప్రతిసారీ నాకెందుకిలా జరుగుతోంది బాబా?" అని అనుకున్నాను. వెంటనే మెరుపులా ఒక ఆలోచన వచ్చింది. కాదు..కాదు, అది బాబాయే స్ఫురింపజేశారు. వెంటనే బ్రౌజర్ హిస్టరీ ఓపెన్ చేసి, ముందురోజు ఏ టైములో అయితే ఆ ఆర్టికల్ చేసి సేవ్ చేశానో ఆ సమయాన్ని బట్టి అక్కడున్న యు.ఆర్.ఎల్ ఓపెన్ చేశాను. అద్భుతం! పోయిందనుకున్న ఆర్టికల్ దొరికింది. నిజానికి ఈ ప్రయత్నం నేను అంతకుముందు వర్క్ పోగొట్టుకున్నప్పుడు కూడా చేశాను. కానీ అప్పుడు పోగొట్టుకున్నవి తిరిగి లభించలేదు. అందుకే ఇది చాలా పెద్ద మిరాకిల్. ఇక నా ఆనందానికి అంతులేదు. పట్టలేని ఆనందంతో బాబాకు కృతజ్ఞతలు చెప్పుకోవాలని కంప్యూటరులో శిరిడీ ప్రత్యక్ష ప్రసారాన్ని ఓపెన్ చేసి, "బాబా! చాలా చాలా కృతజ్ఞతలు. ఇంత ప్రేమను నాపై కురిపించి నా బాధని క్షణంలో తీసేశారు" అని చెప్పుకున్నాను. మరుక్షణంలో నేను, 'ఈ ఆనందాన్ని, మీ ప్రేమను ఎవరో ఒకరితో పంచుకోకుండా ఉండలేను బాబా' అనుకుంటూ డ్రాఫ్ట్ డిలీట్ చేసినందుకు బాధపడుతున్న తనకి ఫోన్ చేసి బాబా ఇచ్చిన ఈ ఆనందాన్ని పంచుకుంటే తను కూడా ఆనందిస్తారని అనుకున్నాను. అదే క్షణాన రెండు విధాలుగా బాబా తమ ప్రేమను నాపై మళ్ళీ కురిపించారు. ఒకటి, ప్రత్యక్ష ప్రసారంలో ఎవరో తమ చిన్న బాబుని అక్కడున్న పూజారికి అందించారు. పూజారి ఆ బిడ్డను బాబా పాదాలకు తాకించారు. అలా చిన్నపిల్లల్ని బాబాకి తాకించిన దృశ్యాన్ని నేనెప్పుడు చూసినా, బాబా ఆ పిల్లల తలపై చేయి వేసి ఆశీర్వదిస్తున్నట్లు, ఆ స్థానంలో నా తలే ఉన్నట్లు, బాబా నన్నే ఆశీర్వదిస్తున్న అనుభూతి కలిగి మనస్సు ఆనందంతో నిండిపోగా బాబా ప్రేమను తృప్తిగా ఆస్వాదిస్తాను. ఇక రెండో విషయం, ఒక సాయిబంధువు నుండి ఫోన్ వచ్చింది. తామిచ్చిన ప్రేమను పంచుకోకుండా నేను ఉండలేనని తెలిసిన బాబా సమయానికి ఆ ఫోన్ కాల్ అందించారు. తనతో బాబా ఇచ్చిన తాజా ప్రేమను ఆనందంగా పంచుకున్నాను. తరువాత డ్రాఫ్ట్ డిలీట్ చేసినందుకు బాధపడుతున్న తనకి కూడా ఫోన్ చేసి బాబా చేసిన మిరాకిల్ పంచుకోగా, తను కూడా సంతోషించారు. బాబా ఇచ్చిన ప్రేమ పంచుకోవడంతో ఆయన ప్రేమ మరిన్ని రెట్లై నన్ను ఆనందపారవశ్యంలో ముంచేసింది. ఆనందస్వరూపుడైన బాబా తమ ప్రేమతో అంతులేని ఆనందాన్నిచ్చారు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా!"

పిలిచినంతనే పలుకుతారు సాయి

యు.ఎస్.ఏ. నుండి సాయిభక్తుడు హరీష్ తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

నేను బాబాకు సాధారణ భక్తుడిని. ఆయన లీలలంటే నాకు చాలా ఇష్టం. తరచూ వాటిని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాను. ఇక నా అనుభవానికి వస్తే...


ముందుగా నా అనుభవాన్ని ఆలస్యంగా పంచుకుంటున్నందుకు సాయికి నా క్షమాపణలు. కొన్ని వారాల క్రితం నేను రాత్రి భోజనం చేశాక ఎడమవైపు చివరి దంతాలలో ఏదో చిక్కుకున్నట్లు గమనించాను. అది నన్ను చాలా ఇబ్బందిపెట్టింది. సమయానికి నా వద్ద టూత్‌పిక్‌లు కూడా లేవు. నాకు వీలైనంతవరకూ అన్నివిధాలా ప్రయత్నించాను కానీ, ప్రయోజనం కనపడలేదు. అప్పుడు నేను, "బాబా! నా దంతాలలో ఇరుక్కున్న దాన్ని తొలగించండి. అది ఉండగా నేను నిద్రకు ఉపక్రమించలేకపోతున్నాను" అని హృదయపూర్వకంగా సాయిని ప్రార్థించాను. తరువాత నేను దాన్ని తొలగించడానికి చేసిన మొదటి ప్రయత్నంలోనే నేను ఆశ్చర్యపోయేలా అది బయటకు వచ్చింది. మన సాయికి ఒక్క పిలుపు చాలు, క్షణం ఆలస్యం చేయకుండా ఆయన పరుగున వస్తారు. గుండెలోతుల్లో నుండి పిలిస్తే ఆయన సమాధానమిస్తారు. "మీరు ఎక్కడున్నా నన్ను తలచుకున్న మరుక్షణం నేను మీ చెంత ఉంటాను" అని దాముఅన్నాతో బాబా అన్న మాటలు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. అవి కేవలం దాముఅన్నాకు చెప్పినవి కావు, అసంఖ్యాకమైన ఆయన భక్తులందరికీ ఆయన చేసిన వాగ్దానమది. ఆయన ఇప్పటికీ సజీవంగా ఉన్నారు. "ఓ దేవా! దయచేసి మీ సృష్టిపై దయ చూపండి. ప్రతి జీవిని ఆశీర్వదించండి. బాధలు లేకుండా చేసి మీ పాదాలను గుర్తుపెట్టుకుని, మీ నామము జపించేలా అనుగ్రహించండి".

సాయిభక్తుల అనుభవమాలిక 266వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. సాయి కృప అపారం!
  2. శస్త్రచికిత్స అవసరం లేకుండా బాబా కాపాడారు

సాయి కృప అపారం!

ఓం శ్రీ సాయిరాం! నా పేరు తులసీరావు. బాబా కృపవలన నా కోరికలు ఈ నవంబరు నెలలో నెరవేరాయి. ఆ కోరికలు తీర్చిన వెంటనే ఈ బ్లాగ్ ద్వారా నా అనుభవాలను పంచుకుంటానని బాబాకు వాగ్దానం చేశాను. అందుకే ఆ అనుభవాలను మీతో పంచుకోవాలని మీ ముందుకు వచ్చాను. 

నా మొదటి కోరిక:

మా అబ్బాయి బీటెక్ చదివాడు. దాని తర్వాత తను వి.ఎల్.ఎస్.ఐ ఫిజికల్ డిజైన్ కోర్సు చేశాడు. ఆ కోర్సు పూర్తయ్యాక ఆ కోర్సుకి సంబంధించిన ఒక చిన్న కంపెనీలో తనకు ఉద్యోగం వచ్చింది. ఆ కంపెనీ కంటే మెరుగైన కంపెనీలో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న సమయంలో ఒక కంపెనీలో ఖాళీలు ఉన్నాయని తెలిసింది. దానికోసం మొదట 8 రౌండ్లు క్లియర్ చేయాల్సి ఉంటుంది. అవి క్లియర్ చేసిన వాళ్లందరికీ ఉద్యోగం ఇస్తామని ఆ కంపెనీ వాళ్ళు చెప్పారు. అందుకోసం మా అబ్బాయి చాలా కష్టపడి ప్రయత్నిస్తున్న సమయంలో ఒకరోజు నాకు ఫోన్ చేసి, "అమ్మా! నాకు ఈ ఉద్యోగం వస్తుందో రాదోనని భయంగా ఉంది" అన్నాడు. నేను భారమంతా బాబా పైనే వేశాను, ఎంతైనా ఆయనే నా తండ్రి కదా!! నేను మా అబ్బాయితో, "బాబాను మనస్ఫూర్తిగా ప్రార్థించి నీ వంతు ప్రయత్నం చేయి, మిగిలినదంతా బాబానే చూసుకుంటారు" అని చెప్పాను. కానీ ఎక్కడో ఒకచోట నాలోనూ భయం మొదలైంది. బాబాను తలచుకుంటూ బ్లాగ్ ఓపెన్ చేశాను. అందులో, "ప్రశాంతంగా ఉండు, అంతా నేనే చూసుకుంటాను" అని ఒక మెసేజ్ వచ్చింది. ఈ మెసేజ్ చూసిన వెంటనే మా అబ్బాయికి ఉద్యోగం వచ్చినంత సంతోషంగా అనిపించింది. తర్వాత మా అబ్బాయి నాకు ఫోన్ చేసి, "పరీక్ష అంతంతమాత్రంగానే రాశాను, ఏమవుతుందో తెలియదమ్మా" అని చెప్పాడు. బాబా మీద అపారమైన నమ్మకం ఉన్న నేను తనతో, "ఏమీ అధైర్యపడకు, బాబా అనుగ్రహంతో నువ్వు ఆ ఉద్యోగానికి సెలెక్ట్ అవుతావు" అని ధైర్యం చెప్పాను. అనుకున్న విధంగానే మరుసటిరోజు సాయంత్రం తను నాకు కాల్ చేసి, "ఏడు రౌండ్లూ విజయవంతంగా పూర్తిచేశాను. ఇంకొక్క రౌండ్ వుంది, అది చాలా కష్టమైనది. ఏం జరుగుతుందో, ఏమో మరి!" అన్నాడు. ఆ తరువాత మా అబ్బాయి ఆ చివరి రౌండ్ కూడా చాలా బాగా చేశాడు. బాబా అనుగ్రహంతో తనకి ఆ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. ఇదంతా బాబా కృపే

నా రెండవ కోరిక:

ఇది అమ్మాయికి సంబంధించినది. చాలారోజుల నుంచి మా అమ్మాయి ఆధార్ కార్డు అప్డేట్ అవ్వడం లేదు. ఇది అందరికీ వింతగా అనిపించవచ్చు, కానీ ఇది నిజం. ఒకరోజు నేను, "బాబా! అన్ని ప్రూఫులూ ఉన్నప్పటికీ మా అమ్మాయి ఆధార్ కార్డ్ అప్డేట్ అవ్వడం లేదు. నువ్వే చూసుకోవాలి బాబా!" అని బాబాను మనస్ఫూర్తిగా ప్రార్థించి బాబా పైనే భారం వేశాను. అంతే! ఎన్నో రోజుల నుంచి అప్డేట్ కాని ఆధార్ కార్డు ఏదో మ్యాజిక్ జరిగినట్లు మరుసటివారం నుంచి చకచకా అప్డేట్ అవ్వడం ప్రారంభమై, మా అమ్మాయి ఆధార్ కార్డు మొత్తం అప్డేట్ అయ్యింది. ఇదంతా కేవలం బాబా దయవలనే జరిగింది

మూడవ కోరిక:

మావారికి మెడికల్ లీవుకి సంబంధించిన డబ్బు గవర్నమెంట్ నుంచి రావాల్సి ఉంది. అది ఎప్పుడో రావాల్సింది, కానీ మూడేళ్ళు గడిచినా రాలేదు. ఆ డబ్బు మాకు వచ్చేలా చూడమని నేను బాబాను ప్రార్థించేదాన్ని. బాబా అనుగ్రహంతో ఈ నవంబరు నెలలోనే ఆ డబ్బు మొత్తం మావారి అకౌంట్లో జమ అయింది

ఈ మూడు కోరికలూ ఈ నవంబరు నెలలోనే ఒకటి తర్వాత ఒకటి ఏదో అద్భుతంలాగా నెరవేరాయి. బాబాకు మాట ఇచ్చినట్లుగానే నేను ఈ బ్లాగ్ ద్వారా ఈ అనుభవాలన్నీ మీతో పంచుకుంటున్నాను. 

నాకు ఇంకొక కోరిక కూడా ఉంది. బాబా అనుగ్రహంతో ఆ కోరిక తీరిన వెంటనే మళ్లీ ఈ బ్లాగ్ ద్వారా మీతో పంచుకుంటాను. 
జై సాయిరామ్!

శస్త్రచికిత్స అవసరం లేకుండా బాబా కాపాడారు

ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

నేను బాబా బిడ్డలలో ఒకదాన్ని. ప్రతిరోజూ ఆయన ఆశీస్సులను పొందుతున్నాను. బాబా ఎల్లప్పుడూ నా పక్షాన నిలబడి, జీవితంలో ఎదురయ్యే ప్రతి కష్టదశను దాటేందుకు నాకు సహాయం చేసున్నారు. 2018, మే నెలలో నేను ఎండోమెట్రియోసిస్ (గర్భాశయంలో తిత్తి)తో బాధపడ్డాను. నేను డాక్టర్ని సంప్రదించినప్పుడు ఆమె, పొత్తికడుపు స్కానింగ్ చేయించుకోమని, ఒకవేళ తిత్తి 5 సెం.మీ కంటే ఎక్కువగా ఉంటే శస్త్రచికిత్స చేయాలని చెప్పింది. చాలా చిన్నవయస్సులో ఉన్న నాకు శస్త్రచికిత్స అనేసరికి మేమంతా(మా కుటుంబసభ్యులు) భయపడిపోయాము. నేను కూడా శస్త్రచికిత్స చేయించుకోవటానికి ఇష్టపడలేదు. 6 నెలల ముందు స్కానింగ్ తీసినప్పుడు తిత్తి పరిమాణం 4.2 సెం.మీ. ఉంది. అది గనక 5 సెం.మీ వరకు పెరిగితే ఖచ్చితంగా శస్త్రచికిత్స చేయాలన్నారు. డాక్టర్ సరిగ్గా 7వ రోజున స్కానింగ్ చేయడానికి అపాయింట్‌మెంట్ ఇచ్చారు. నేను భయంతో, ఆందోళనతో, "బాబా! నాకు శస్త్రచికిత్స వద్దు. దయచేసి తిత్తి పరిమాణం పెరగకుండా ఉండేలా చూడండి" అని బాబాను ప్రార్థించి, భక్తివిశ్వాసాలతో సాయిసచ్చరిత్ర చదివి ఒక వారంలో పారాయణ పూర్తిచేశాను. తరువాత చాలా భయపడుతూ స్కానింగ్ చేయించుకున్నాను. అంతకన్నా ఎక్కువ భయంతో ఫలితం కోసం వేచిచూశాను. అద్భుతం! బాబా దయవలన తిత్తి పరిమాణం పెరగలేదు, మునుపు ఎంత పరిమాణముందో అంతే ఉంది. ఇక శస్త్రచికిత్స అవసరం లేదని డాక్టర్ చెప్పారు. స్కానింగ్ రిపోర్ట్ చూసిన క్షణంలో నేను పొందిన ఆనందం నాకిప్పటికీ గుర్తుంది. "ప్రతిసారీ నన్ను కాపాడుతున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు బాబా!" 

సాయిభక్తుల అనుభవమాలిక 265వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. పెళ్ళికి ఒప్పుకునేలా బాబా చేశారు
  2. నమ్మకాన్ని గెలిపించారు బాబా

పెళ్ళికి ఒప్పుకునేలా బాబా చేశారు

సాయిభక్తురాలు ప్రతిమ తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

చాలా సంవత్సరాల క్రితం మేము ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు బాబా మా జీవితంలోకి వచ్చారు. దయతో ఆయన ఆ కష్టాల కడలి నుండి మమ్మల్ని అవతలి ఒడ్డుకు చేర్చి, మేము ఊహించిన దానికంటే సంతోషకరమైన, విజయవంతమైన జీవితాన్ని ఇచ్చారు. నేను కృంగిపోయిన సందర్భాలలో నా కష్టాన్ని బాబాతో పంచుకుంటాను. అలాంటి ఒక సందర్భంలో కల ద్వారా ఒక చక్కటి అనుభవాన్ని ఇచ్చారు. ఇబ్బందులు తాత్కాలికమైనవేనని, మనందరికీ రక్షణనిచ్చేది తామేనని బాబా నాకు భరోసా ఇచ్చారు.

మాకు ఒకే ఒక అమ్మాయి. తల్లిగా నేనెప్పుడూ తనకి ఉత్తమమైనదే ఇవ్వాలని కోరుకుంటాను. తను యు.ఎస్‌.లో చదువుకుంది. కొన్నాళ్ళు అక్కడ ఉద్యోగం చేశాక మాతో కలిసివుండటానికి తిరిగి భారతదేశానికి వచ్చింది. మేము కొంతకాలంగా తనకోసం పెళ్లిసంబంధాన్ని వెతుకుతున్నాము. తనకి తగిన సంబంధాన్ని కనుగొనడం మాకు చాలా కష్టమైంది. సమస్య ఏమిటంటే తను బెంగళూరును విడిచి వెళ్ళడానికి ఇష్టపడటం లేదు. మాకు లభించే సంబంధాలు దాదాపు అన్నీ బెంగళూరు వెలుపలవే. దాంతో మేము ఆందోళన చెందుతుండేవాళ్ళం. అలాంటి పరిస్థితులు ఎదురైన ప్రతి సందర్భంలో నేను బాబానే ఆశ్రయిస్తాను. ఆయన ఏదైనా చేయగలరు. తన భక్తులకు చేసిన వాగ్దానాన్ని ఎప్పుడూ నిలుపుకుంటారు. అందువలన నేను కేవలం ఆయననే నమ్ముకుని, "బాబా! ఈ సమస్యకు ఏదైనా పరిష్కారం చూపండి" అని ప్రార్థిస్తూ ఉండేదాన్ని. ఆ సమయంలో మహాపారాయణలో చేరమని నాకొక ఫోన్ వచ్చింది. నేను దానిని బాబా సంకేతంగా తీసుకుని మహాపారాయణ మొదలుపెట్టి, "బాబా! ఎల్లప్పుడూ నాకు మార్గనిర్దేశం చేయండి" అని ప్రార్థిస్తూ ఉండేదాన్ని. కొన్నివారాలకి మేమెప్పుడో సంబంధాన్ని కోల్పోయిన ఒక పాత ఫ్యామిలీ ఫ్రెండుతో నా భర్తకి తెలియకుండానే పరిచయం ఏర్పడింది. మాములుగా ఒకసారి మేమంతా మాట్లాడుకుంటున్నప్పుడు వాళ్ళకి తెలిసినవాళ్ళ అబ్బాయి మా అమ్మాయికి మంచి జోడీ అవుతాడని చెప్పారు. మేము కొంత సందేహంతోనే ముందుకు సాగాము. మా అమ్మాయి తన నిర్ణయం చెప్పడానికి తగినంత సమయం కావాలని, అబ్బాయిని కలిసి మాట్లాడాలని కోరుకుంది. అయితే కొన్నిసార్లు అబ్బాయిని కలిసి మాట్లాడిన తరువాత అతన్ని ఇష్టపడుతున్నట్లు తన మనసుకి చాలాసార్లు అనిపించినప్పటికీ సందేహాత్మకంగానే ఉండేది. ఒకరోజు నేను తన నిర్ణయం ఏమిటని అడిగినప్పుడు తనకి ఇంకా సమయం కావాలని, ఆ విషయంలో తనని బలవంతపెట్టొద్దని నాతో చెప్పింది. నేను సరేనని చెప్పి, ఎప్పటిలాగే బాబా తనదైన రీతిలో ఏదో ఒకటి చేస్తారని విషయాన్ని ఆయనకే వదిలిపెట్టాను.

ఆయన లీల చేశారు! ఒక గంట తరువాత మా అమ్మాయి ఆ అబ్బాయిని వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని నాతో చెప్పడానికి నా దగ్గరకు వచ్చింది. అకస్మాత్తుగా తను ఎలా నిర్ణయించుకుందని నేను తనని అడిగినప్పుడు, తను నాకొక కల గురించి వివరించింది. "కలలో బాబా తనని తిడుతూ, "ఎప్పుడూ నువ్వు అడిగిన దానికంటే ఎక్కువే ఇస్తున్నాను. ఇంక సందేహించవద్దు, ప్రశ్నించవద్దు" అని తనతో అన్నార"ని చెప్పింది. అలా మా సమస్యకు పరిష్కారం చూపించారు బాబా. ఇప్పుడు మేము తన పెళ్ళి ఏర్పాట్లలో ఉన్నాము. "బాబా! మా జీవితంలో మీరు చేస్తున్న అద్భుతాలకు చాలా కృతజ్ఞతలు". మహాపారాయణలో భాగం కావడం బాబాతో మరింత లోతైన, నమ్మకమైన సంబంధాన్ని ఏర్పరుస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు.

నమ్మకాన్ని గెలిపించారు బాబా

సాయిభక్తురాలు అనిత తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

బాబా అభయహస్తం ఎప్పుడూ తన బిడ్డలపై ఉంటుంది. బాబా మాపై చూపిన కృపకు కృతజ్ఞతలు తెలుపుకోవడానికి నా వద్ద పదాలు లేవు. మా అబ్బాయి 3వ తరగతి చదువుతున్నాడు. గత మూడు సంవత్సరాలుగా మేము ఒక బెస్ట్ స్కూలులో తనని జాయిన్ చేయడానికి ఎన్నోరకాలుగా ప్రయత్నించాము. చివరికి మంచి సిఫారసుతో కూడా మేము నేరుగా పాఠశాల యజమానిని సంప్రదించినప్పటికీ సీట్లులేవనే ఒకే స్పందన వింటున్నాము. నా భర్త అయితే ఆశను వదిలేసుకున్నారు. కానీ నేను ఆశ కోల్పోలేదు. అందుకు కారణం, సాయిబాబాపై నాకున్న నమ్మకం. నా కోరిక ఏదో ఒకరోజు నెరవేరుతుందని, మేము కోరుకున్న స్కూల్లో నా బిడ్డకి ప్రవేశం ఖచ్చితంగా దొరుకుతుందని నేను దృఢంగా నమ్మాను. చివరికి నా నమ్మకాన్ని గెలిపించారు బాబా. అకస్మాత్తుగా ఒకరోజు నా భర్తకు ఆ స్కూల్ యాజమాన్యం ఫోన్ చేసి మా అబ్బాయికి వాళ్ళ స్కూల్లో అడ్మిషన్ ఇస్తున్నట్లు ధృవీకరించారు. ముందు ఇది ఎలా సాధ్యమైందా అని మేము ఆశ్చర్యపోయాము. కానీ బాబా ఆశీర్వాదంతో ఇది జరిగిందని నేను గ్రహించాను. క్రెడిట్ అంతా బాబాకే చెందుతుంది. ఆయన తన బిడ్డల కోసం ప్రతిదీ ప్రణాళిక చేస్తారు. బాబాపై విశ్వాసముంచి సహనంతో ఉంటే సరైన సమయంలో మన కోరికలన్నీ నెరవేరుతాయి.

source:http://www.shirdisaibabaexperiences.org/2019/09/shirdi-sai-baba-miracles-part-2477.html?m=0

మోరేశ్వర్ డబ్ల్యు. ప్రధాన్ - రెండవ భాగం


బాబు ప్రధాన్

భక్తులపై బాబాకున్న ప్రేమ ఒక జన్మతో తీరిపోయేది కాదు. ఆయన ప్రేమ జన్మజన్మలకు కొనసాగుతూ భక్తులకు రక్షణనిస్తుంది. అందుకు సరైన ఉదాహరణ బాబు ప్రధాన్ ఉదంతం. బాబాకు బాబు అంటే చాలా ఇష్టం. బాబు గతజన్మల వృత్తాంతాన్ని గురించి జి.యస్.ఖపర్డేతో బాబా (సాయిలీలా పత్రిక) ఇలా చెప్పారు: "ఒకప్పుడు శిరిడీలో ఎంతో పవిత్రుడైన ఒక వృద్ధుడు 12 సంవత్సరాలకు పైగా నివసించాడు. అతని భార్యాబిడ్డలు జాల్నాలో ఉండేవారు. వాళ్ళు అతన్ని ఇంటికి రమ్మని పదేపదే కోరుతుంటే అతడు గుఱ్ఱం మీద బయలుదేరాడు. అతనికి తోడుగా నేను కూడా బండిలో వెళ్ళాను. కొంతకాలానికి ఆ వృద్ధుడు తన సోదరి కుమార్తెను వివాహం చేసుకున్నాడు. వారికి ఒక కొడుకు పుట్టాక ఆరు సంవత్సరాలకు ఆ వృద్ధుడు మరణించాడు. ఆ పిల్లవాని దాయాదులు అతనికి విషం పెట్టి చంపేశారు. ఆ పిల్లవాడే 'బాబు'గా జన్మించాడు". ఈ బాబే హరివినాయక్ సాఠే మామగారైన గణేష్ కేల్కర్ బంధువు.

ఒకసారి అతనికి బాబా స్వప్పదర్శనమిచ్చి పిలవడం వలన, అతడు ఇల్లు విడచి కాలినడకన శిరిడీ చేరి బాబాను దర్శించాడు. తర్వాత అతడు కోపర్గాఁవ్, ఏవలా గ్రామాలకు సర్వేయరయ్యాడు. ఇతని పైఅధికారి లిమాయే, సాఠేకు క్రింది ఉద్యోగి. బాబు పూర్తిగా బాబా సేవలో ఉండి, తమ ఉద్యోగ ధర్మాన్ని అశ్రద్ధ చేస్తుంటే సాఠే, కేల్కర్‌లు బాబాకు ఫిర్యాదు చేశారు. బాబా, "ఆ పనులన్నీ అలా ఉంచి అతనిని నా సేవ చేసుకోనివ్వండి" అని అన్నారు. అప్పటినుండి వారు బాబుకు ఎక్కువ పనులు చెప్పేవారుగాదు. సాయి ఒక్కొక్కప్పుడు మంచి మంచి ప్రసాదాలన్నీ ఆతనికి పెట్టేవారు. సం.1910లో ఒకసారి బాబా, "బాబు విషయంలో జాగ్రత్త తీసుకో" అని కేల్కర్‌ను హెచ్చరించారు. అతనికేమీ అర్థంగాలేదు. కొద్ది రోజుల్లో బాబుకు తీవ్రమైన జ్వరమొచ్చింది. ఒకరోజు కేల్కర్‌తో, “బాబు ఇంకా జీవించే ఉన్నాడా?" అన్నారు బాబా. కొద్దిరోజులలోనే బాబు తన 22వ ఏట శిరిడీలో చనిపోయాడు. అటుతర్వాత గూడా బాబా తరచుగా అతనిని తలచుకుంటూండేవారు.

ప్రధాన్ కుటుంబం శిరిడీ చేరిన రోజు బాబా శ్రీమతి ప్రధాన్‌ను చూపించి మాధవరావు దేశ్‌పాండేతో, "ఈమె నా బాబుకు తల్లి" అన్నారు. కానీ చందోర్కర్ గర్భవతిగా కనపడుతున్న ఆమె సోదరి గురించే బాబా చెబుతున్నారనుకుని బాబాతో, “మీరు మాట్లాడుతున్నది ఈమె గురించే కదా?” అనడిగాడు. బాబా, "కాదు, నేను మాట్లాడింది ఈమె గురించి” అంటూ మళ్ళీ శ్రీమతి ప్రధాన్ వైపే చూపించారు. ఆరోజు నుండి సరిగ్గా 12 నెలలు తిరిగేసరికి శ్రీమతి ప్రధాన్ ఒక మగపిల్లవాడికి జన్మనిచ్చింది. ఆ బిడ్డకి బాబా నోటి నుండి వెలువడిన “బాబు” అన్న పేరే పెట్టారు. నామకరణ కార్యక్రమానికి దాసగణు, చందోర్కర్ మొదలైన భక్తులందరూ రావడంతో ఆ కార్యక్రమం బాబా కరుణ, గొప్పతనాన్ని స్మరించుకునే గొప్ప వేడుకలా జరిగింది. 

ప్రధాన్ కుటుంబీకుల సంప్రదాయానుసారం ఆ కుటుంబంలోని ఏ స్త్రీ అయినా తనకు బిడ్డ పుట్టినప్పుడు గోధుమలు, టెంకాయ, పండ్లు కొంగులో కట్టుకుని అత్తవారింటికి వెళ్లి, తన మామగారి ముందుగానీ లేక వారు పూజించే ఇలవేల్పు ముందుగానీ ఉంచాలి. అయితే బాబు పుట్టిన తరువాత శ్రీమతి ప్రధాన్ తన మెట్టినింటి ఇలవేల్పుగా బాబాను కొలుచుకోవాలని నిర్ణయించుకుంది. అందువలన ఆమె ఆ వస్తువులన్నీ కొంగున కట్టుకుని, నాలుగు నెలల వయస్సున్న బాబును తీసుకుని 1912లో శిరిడీ వెళ్లి బాబాకు సమర్పించింది. బాబా వాటిని ప్రేమతో స్వీకరించారు. తరువాత బాబును తమ చేతులలోకి తీసుకుని లాలిస్తూ, "బాబూ! ఎక్కడికి వెళ్ళావు? నామీద కోపమొచ్చిందా లేక నేనంటే విసుగు పుట్టిందా? (బాబూ! కోఠే గేలా హోతాస్? మల కంఠాలాస్ హోతాస్ కాయ్?)" అంటూ ముద్దాడారు. బాబాను చూస్తూనే ఆ బిడ్డ కిలకిలా నవ్వాడు. బాబు శిరిడీ వచ్చిన సంతోష సమయంలో బాబా తమ జేబులోనుండి రెండు రూపాయలు తీసి బర్ఫీ తెప్పించి కొడుకు పుట్టిన సందర్భంలో ఎలా మిఠాయిలు పంచుతారో అలాగే బాబా అందరికీ బర్ఫీ పంచారు.

ఈ సమయంలోనే ఒకరోజు బాబా శిరిడీ గ్రామ ద్వారాన్ని చూపించి, "దీనినెవరు పునర్నిర్మిస్తారో వారికి అనుగ్రహం లభిస్తుంది" అన్నారు. వెంటనే శ్రీమతి ప్రధాన్ ఆ నిర్మాణం చేసేందుకు తమకే అనుమతినిమ్మని కోరింది. బాబా అనుమతించారు. ప్రధాన్ ఆ నిర్మాణం కొరకు 600 రూపాయలు చందోర్కర్‌కు ఇచ్చాడు. మరొకరోజు బాబా, "బాబు బంగళా అందంగా ఉంది. చక్కగా పూర్తయింది" అన్నారు. బాబా మాటలను బట్టి ప్రధాన్‌కు తాను నివాసముంటున్న బంగళాను ఖరీదు చేయమన్నట్లుగా అనిపించి ఆరుమాసాలలో, అంటే 1913లో ఆ ఇంటిని అతడు కొనుగోలు చేశాడు.

తరువాత ప్రధాన్ దంపతులు బాబు మొదటి పుట్టినరోజు సందర్భంగా బాబా దర్శనానికి శిరిడీ తీసుకెళ్లారు. అప్పుడు కూడా బాబా తమ సంతోషానికి సంకేతంగా రెండు రూపాయలతో బర్ఫీ కొని అందరికీ పంచిపెట్టారు. తరువాత బాబా ప్రత్యేకించి "బాబుకు తమ్ముడు కానీ, చెల్లి కానీ లేరా?" అని అడిగారు. శ్రీమతి ప్రధాన్ కాస్త సిగ్గుపడుతూ, "మీరు మాకు ఈ బాబునొక్కడినే ప్రసాదించారు" అని జవాబిచ్చింది. అప్పటికి వాళ్ళకి ఒక కుమార్తె ఉంది. అయితే బాబా మాటలనే ఆశీస్సులుగా భావించి తమకు కొడుకు, కూతురు పుడతారని వాళ్ళు అనుకున్నారు. బాబా చెప్పినట్లే జరిగింది.

బాబు మొదటి పుట్టినరోజు సందర్భంగా శ్యామా ఇంట్లో గొప్ప విందు ఏర్పాటు చేసి అందరినీ ఆహ్వానించాడు ప్రధాన్. ఆరోజు గురువారం. బాలాసాహెబ్ భాటే తనకు గురువారంనాడు బయట తినకూడదనే నియమం ఉందని చెప్పి విందుకు గైర్హాజరయ్యాడు. తరువాత అతడు  బాబా దగ్గరకు వెళ్ళినప్పుడు బాబా ఇలా అడిగారు:

బాబా: భావూ(ప్రధాన్) ఏర్పాటు చేసిన విందుకు వెళ్లి భోంచేశావా?
భాటే: ఈరోజు గురువారం బాబా!
బాబా: అయితే ఏమిటట?
భాటే: గురువారంనాడు బయటెక్కడా భోంచేయకూడదన్నది నా నియమం.
బాబా: ఎవరి ప్రీతికోసం ఆ నియమం పెట్టుకున్నావు?
భాటే: మీ ప్రీతికోసమే.
బాబా: అయితే నేనే చెబుతున్నాను. భావూ వద్దకు వెళ్లి భోంచేసిరా!

అప్పటికే సాయంత్రం 4 గంటలు అయినప్పటికీ ప్రధాన్ వద్దకు వెళ్లి, బాబా ఆదేశాన్ని తెలియజేసి భోంచేసి వెళ్ళాడు భాటే.

ప్రధాన్ మొదటిసారి శిరిడీ వెళ్ళినప్పటినుండి మసీదులో బాబాతోనే భోజనం చేసేవాడు. బాబా తమ స్వహస్తాలతో పదార్థాలను తీసి పళ్ళాల నిండా పెట్టేవారు. అది చాలా ఎక్కువ పరిమాణంలో ఉండేది. ప్రధాన్ విలువైన ఆ ప్రసాదాన్ని పారవేయకుండా, తనకు పెట్టిన దాంట్లో ముప్పాతిక భాగం తన మేనకోడలితో ఇంటికి పంపేవాడు. అది ఆ కుటుంబానికంతా సరిపోయేది. అంతేకాక మిగిలిన ప్రసాదంతో అతని కడుపు నిండి రాత్రికి ఇక ఆకలయ్యేది కాదు. అంత సమృద్ధిగా భక్తులకు వడ్డించేవారు బాబా. భోజనం చేసిన తరువాత బాబా పండ్లను కూడా ఇచ్చేవారు. ప్రధాన్ బాబును తీసుకుని వెళ్ళినప్పుడు, బాబుకి వండిన పదార్థాలు సహించవని, బాబా వాడికి మొదట మామిడిపండ్లు మొదలైనవి తినిపించేవారు. దానితో వాడి కడుపు నిండేది. ప్రధాన్‌కి మరో కూతురు, కొడుకు పుట్టిన తరువాత వాళ్ళని కూడా మసీదుకు తీసుకుని వెళ్లి బాబాతో భోజనం చేసేవాడు ప్రధాన్.

ప్రధాన్ చివరిసారిగా బాబాను 1918 మే నెలలో దర్శించాడు. అప్పుడు అతను వద్ద రూ. 3,800 ఉన్నాయి. బాబా పట్టుబట్టడం వలన అతడు తాను అనుకున్న దానికంటే ఎక్కువ కాలం శిరిడీలో ఉన్నాడు. అప్పుడతడు మొత్తం 32 రోజులు బాబాతో గడిపాడు. ఒకరోజు భక్తులందరూ బాబాకు ఛత్రం పట్టి మేళతాళాలతో ఊరేగింపుగా లెండీకి తీసుకెళ్లి విడిచి వచ్చారు. కాసేపటికి బాబా ప్రధాన్‌ను పిలిపించారు. ప్రధాన్ వెళ్లగా బాబా అతని తలపై తమ హస్తాన్నుంచి, "భావూ, నేను చెప్పిన పని చేస్తావా?" అని అడిగారు. అతడు చేస్తానని చెప్పాడు. అప్పుడు బాబా‌, "అయితే, నాకు వంద రూపాయలు ఒక సంచిలో వేసి మసీదుకు తెచ్చి ఇవ్వు" అన్నారు. అతడు అలానే చేశాడు. ఆ సమయంలో బాబా తరచూ అతనిని దక్షిణ అడుగుతుండేవారు. ఫలితంగా అతడు తన వద్ద ఉన్న 3,800 రూపాయలతోపాటు పూణేకు చెందిన ఒక పశువైద్యుని వద్ద అప్పుగా తీసుకున్న మరో 1200 రూపాయలను కూడా బాబాకు దక్షిణగా సమర్పించుకున్నాడు. (వాచా చెప్పకపోయినా బాబా వద్ద స్పష్టంగా కనిపించే పద్ధతి ఏమిటంటే - బాబా తాము ప్రేమించిన వారి వద్ద ఉన్న డబ్బంతా తరుచుగా తీసేసుకుంటారు.) బాబా 5,000 రూపాయలు దక్షిణగా స్వీకరించాక ఏవేవో సంజ్ఞలు చేశారు. అవి ప్రధాన్‌కు స్పష్టంగా అర్థం కాకపోయినప్పటికీ అందులో "మిన్ను విరిగి మీదపడినా వెఱవకు. నేను నీవెంటే ఉంటాను" అన్న భావం ఉన్నట్లు గ్రహించాడు. మొట్టమొదట ప్రధాన్ బాబాను దర్శించినప్పుడు, గత ఆరు సంవత్సరాలుగా అతడిచ్చిన చిలింనే ఉపయోగిస్తున్నట్లు చెప్పారు బాబా. వారి మాటలలోని అంతరార్థం తనకు బోధపడలేదని ప్రధాన్ చెప్పాడు.

ప్రధాన్ 1916లో శిరిడీలో జరిగిన బూటీ రెండవ వివాహానికి హాజరయ్యాడు. అతడు శిరిడీ నుండి తిరుగు ప్రయాణమవుతున్నప్పుడు బాబా, "నేనూ మీవెంటే వస్తాను (తుఝ్యా బరోబర్ మీ యేఈన్)" అన్నారు. ప్రత్యక్షంగా బాబా ప్రధాన్‌తో వెళ్ళనప్పటికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళ ప్రయాణం సుఖంగా సాగింది. దాన్నిబట్టి బాబా తమ సూక్ష్మశరీరంతో వారిని అనుసరించి ప్రమాదాలను, ఇబ్బందులను తొలగించారని ప్రధాన్‌కు అనిపించింది.

ఒకరోజు మధ్యాహ్నం రెండు గంటలకు బాబా, "ప్రధాన్ వచ్చాడా?" అని దీక్షిత్‌ను అడిగారు. "లేదు బాబా, కబురు చేసేదా?" అన్నాడు దీక్షిత్. "చేయి" అంటూ కొద్ది ఊదీనిచ్చి, "ఇది పంపించు" అన్నారు బాబా. ఆ ఊదీ, ఒక ఉత్తరమూ బాలాషింపీ ద్వారా ప్రధాన్‌కి పంపాడు దీక్షిత్. అప్పుడు వెల్లడైన వివరాలు: శిరిడీలో బాబా అతని గురించే హెచ్చరిస్తున్న క్షణంలో హైకోర్టులో కొందరు స్నేహితులతో మాట్లాడుతున్న ప్రధాన్ అకస్మాత్తుగా స్పృహతప్పి పడిపోయాడు. కొద్దిసేపట్లో తనంతటతానే తెప్పరిల్లుకుని రైల్లో ఇల్లు చేరాడు. తెల్లవారేసరికి ఊదీ, జాబులతో బాలాషింపీ బొంబాయి చేరాడు. సాయికి మన బాధలు నివేదించనక్కరలేదు. ఆయన అనుక్షణం మనల్ని కనిపెట్టుకుని ఉంటారని గుర్తుంచుకుంటే చాలు.

బాబా ఒకసారి శ్రీమతి ప్రధాన్‌తో, "ఎవరైనా పది మాటలంటే, ఒకవేళ మనం సమాధానం ఇవ్వాల్సివస్తే ఒక్క మాటతో సమాధానమిద్దాం" అనీ, "ఎవరితోనూ గొడవకుగానీ, పోటీకిగానీ దిగవద్దు" అనీ హితవు చెప్పారు. ఒకసారి శ్రీమతి ప్రధాన్ మసీదుకు వెళ్ళినప్పుడు బాబా ఆగ్రహంతో కేకలు వేస్తారేమోనని భయపడింది. ఆరోజు బాబా అలా ఏమీ చేయకుండా, "చూశావా, నేను ఎవరిపైనా కోప్పడలేదు, కేకలు వేయలేదు, అవునా?" అన్నారు.

ఒకసారి శ్రీమతి ప్రధాన్‌కు కలలో బాబా కనిపించి, వారి పాదాలకు పసుపు, కుంకుమ పెట్టమన్నారు. కలలో ఆమె బాబాను అలాగే పూజించింది. తరువాత ఆ కల విషయం చందోర్కర్‌కు చెప్పగా చందోర్కర్, 'నిత్యం ఆమె ఇంట్లో తమ పాదపూజ చేసుకోవడం' బాబా అభిమతంగా చెప్పి, రెండు వెండిపాదుకలు తీసుకుని శిరిడీ వెళ్ళమని ఆమెకు చెప్పాడు. ఆమె అలానే చేసింది. ఆమె వెళ్ళగానే, అప్పటిదాకా కాళ్ళు ముడుచుకుని కూర్చుని ఉన్న బాబా, తమ పాదాలను ముందుకు చాచి, "పాదుకలను ఈ పాదాల మీద ఉంచి పూజించుకో" అన్నారు. ఆమె బాబా ఒక్కొక్క పాదంపై ఒక్కొక్క పాదుకను ఉంచి పూజించింది. అప్పుడు బాబా చందోర్కర్‌తో, "చూశావా! ఈ తల్లి నా పాదాలను కోసి తీసుకెళ్తోంది (నానాహినేఁ మాఝే పాయ్ పహ కాపూన్ నేలే)" అని అన్నారు. తరువాత బాబానే ఆ రెండు పాదుకలను ఆమె చేతికిచ్చారు. అప్పటినుండి బాబా పాదుకలు ప్రధాన్ ఇంట పూజింపబడుతున్నాయి.

ఒకసారి ప్రధాన్ పిల్లలందరికీ పొంగు (మీజిల్స్) పోసింది. వైద్యుడు బాబు పరిస్థితి ప్రమాదకరంగా ఉందని చెప్పాడు. అందరూ ఆశ వదులుకున్నారు. ఆ స్థితిలో బాబాను ప్రార్థించింది శ్రీమతి ప్రధాన్. బాబా ఆమెకు కనిపించి, "ఎందుకమ్మా దుఃఖిస్తావు? పిల్లవాడు బాగానే ఉన్నాడు. ఉదయం ఆరు, ఆరున్నర గంటలకు వాడికి మంచి ఆహారం పెట్టు" అన్నారు. ఉదయానికల్లా బాబు లేచి ఆడుకోవడం ప్రారంభించాడు. వైద్యుడు వాడిని చూసి ఆశ్చర్యపోయి, పిల్లవాడికి ఏ ఆహారం పెట్టవద్దన్నాడు. కానీ, పిల్లవాడు అన్నీ తిని అరాయించుకున్నాడు.

ప్రధాన్ కుటుంబంలోని పిల్లలందరికీ అప్పుడప్పుడు మూర్ఛ వస్తుండేది. ఒకరాత్రి 11 గంటల సమయంలో శ్రీమతి ప్రధాన్‌కు కలలో బాబా కనిపించి, "నిద్రపోతున్నావా? లే! పిల్లవాడికి మూర్ఛ వస్తుంది" అన్నారు. వెంటనే ఆమె లేచి పిల్లవాడిని చూసింది. జ్వరంగానీ, మూర్ఛ లక్షణాలుగానీ కనిపించలేదు. కానీ బాబా హెచ్చరించినందువల్ల ఆమె వేడినీళ్లు, నిప్పు, ఉడుకులోన్ మొదలైనవన్నీ సిద్ధం చేసుకుని జాగ్రత్తగా ఉంది. రాత్రి రెండు గంటల సమయంలో పిల్లవాడికి మూర్ఛ లక్షణాలు కనిపించాయి. అన్నీ సిద్ధంగా ఉండబట్టి ఎటువంటి కష్టం లేకుండా త్వరగా పిల్లవాడికి నయమైంది.

మరొకరోజు ఆమె మసీదులో బాబాను పూజిస్తుండగా, బాబా పూజ మధ్యలో ఆమెను ఆపి, "నీవు వెంటనే బసకు వెళ్ళు" అన్నారు. ఆమె బసకు వెళ్లేసరికి పాప గుక్కపెట్టి ఏడుస్తోంది. అందుకే బాబా తనని పూజ మధ్యలో ఆపి పంపారని ఆమె గ్రహించింది. ఆమె పాపను సముదాయించి మరలా మసీదుకు వచ్చింది. అప్పుడు బాబా, "ఇప్పుడు పూజ పూర్తి చేసుకో" అన్నారు.

ఒకసారి ప్రధాన్ దంపతులు అప్పుడే టైఫాయిడ్ జ్వరం నుండి కోలుకుంటున్న వాళ్ళ అబ్బాయిని తీసుకుని శిరిడీ వెళ్లదలిచారు. డాక్టర్ వద్దని చెప్పాడు, కానీ వాళ్ళు పిల్లవాడిని తీసుకుని శిరిడీ ప్రయాణమయ్యారు. రైలులో వాడికి జ్వరమొచ్చింది. అందరూ చెబుతున్నా వినకుండా పిల్లవాడిని తీసుకొచ్చాము, ఇప్పుడు వాడికేమన్నా అయితే నా పిచ్చితనాన్ని చూసి నలుగురూ నవ్వుతారేమోనని శ్రీమతి ప్రధాన్ భయపడింది. పిల్లవాడు జ్వర తీవ్రతతో పడుకునే ఉన్నాడు. కనీసం కూర్చోలేకపోతున్నాడు. అలాంటిది వాళ్ళు శిరిడీ చేరి బాబా వద్దకు వెళ్ళేటప్పటికి పిల్లవాడు కోలుకొని లేచి నిలబడగలిగాడు. బాబా, "ఇప్పుడు నిన్ను చూసి ఎవ్వరూ నవ్వరు" అన్నారు. రైలులో ప్రయాణించేటప్పుడు ఆమె మదిలో మెదిలిన ఆలోచనల గురించి బాబాకు తెలుసు.

బాబా సమాధి చెందిన మరుసటిరాత్రి, అంటే 1918, అక్టోబర్ 16న శ్రీమతి ప్రధాన్‌కు ఒక కల వచ్చింది. కలలో బాబా మరణిస్తున్నట్లు కనిపించింది. అప్పుడు ఆమె, "బాబా చనిపోతున్నారు" అని కేకలు పెట్టింది. అప్పుడు బాబా, "మహాత్ముల విషయంలో చనిపోతున్నారని అనకూడదు. సమాధి చెందుతున్నారు అనాలి" అన్నారు. మరుక్షణంలో బాబా శరీరం నిశ్చలంగా మారింది. అందరూ దుఃఖిస్తున్నారు. ఆమెకు చాలా బాధ కలిగింది. ఆమెకు మెలకువ వచ్చి చూస్తే, అప్పుడు సమయం రాత్రి 12.30 గంటలైంది. మరుసటి ఉదయం బాబా 1918, అక్టోబర్ 15, విజయదశమిరోజున మధ్యాహ్నం 3 గంటలకు సమాధి చెందినట్లు అణ్ణాచించణీకర్ నుండి జాబు వచ్చింది.

1918, అక్టోబర్ 19 రాత్రి శ్రీమతి ప్రధాన్‌కు కలలో బాబా కనిపించి, మూడు రూపాయలిచ్చారు. కలలో డబ్బు తీసుకోవడం అశుభంగా ఆమె భావించి బాధపడుతుంది. అప్పుడు బాబా, "తీసుకో, తీసుకో! కానీ నీవు డబ్బాలో దాచిన డబ్బంతా నాకు పంపు" అన్నారు. ఆమె మరుసటిరోజు తాను దాచుకున్న డబ్బంతా శిరిడీకి పంపింది.

1918, అక్టోబర్ 19 రాత్రి శ్రీమతి ప్రధాన్ సోదరికి బాబా కలలో కనపడి, "మీ సంచిలో ఉన్న పీతాంబరం పంపి, నా సమాధిపై కప్పించండి" అన్నారు. వెంటనే మెలుకువ వచ్చి, చాలా సంవత్సరాలుగా ఉతికిన ఒక పీతాంబరం వారి సంచిలో ఉన్న సంగతి జ్ఞాపకమొచ్చి, ఉదయమే దానిని శిరిడీ పంపారు. 1923 వరకు తరచూ దానిని బాబా సమాధి మీద కప్పేవారు.

శాంతాక్రజ్‌లో ఉండగా ఒకప్పుడు శ్రీమతి ప్రధాన్‌కి ప్రసవ సమయం సమీపించింది. ఆమెకు సహాయంగా ఒక మంత్రసానిని, ఒక నర్సును నియమించారు. ఆమె పురిటినొప్పులతో నాలుగురోజులు బాధపడ్డా గానీ ప్రసవం కాలేదు. నర్సు భయపడి శ్రీమతి ప్రధాన్ సోదరి దగ్గరకు వెళ్లి, "నొప్పులు ప్రారంభమై నాలుగు రోజులు అవుతున్నా ప్రసవం కావడంలేదు, వెంటనే డాక్టరుకి కబురు పెట్టడం మంచిద"ని చెప్పింది. శ్రీమతి ప్రధాన్ సోదరి బాబా పటం ముందు నిలిచి బాబాను ఆర్తిగా ప్రార్థించింది. వెంటనే ఎవరి సహాయం లేకుండా శ్రీమతి ప్రధాన్‌కు సుఖప్రసవమైంది. బాబా శక్తికి, కరుణకి వాళ్లంతా ఆశ్చర్యపోయారు.

మాధవ్‌ భట్ అనే వృద్ధ తెలుగు బ్రాహ్మణుడు పరమ శివభక్తుడు. అతడు రాత్రింబవళ్ళు రుద్రాభిషేకం మొదలైన పూజలు చేస్తూ గడిపేవాడు. ప్రధాన్ కుటుంబంతో అతనికి మంచి అనుబంధం ఉండేది. ఆ కుటుంబ శ్రేయస్సు కోసం అతడు వారింట్లో ప్రతిరోజూ మంత్రజపం,  పూజ నిర్వహిస్తుండేవాడు. అతనికి బాబుపై ఎనలేని ప్రేమాభిమానాలుండేవి. బాబుకు సంవత్సరం నిండాక ఒకసారి ప్రమాదంగా జబ్బు చేసింది. ప్రధాన్ దంపతులు బాబాను పూజించడం గిట్టని మాధవ్‌ భట్ ముస్లిం ఫకీరైన సాయిబాబాను పూజిస్తున్నందుకే బాబు అనారోగ్యానికి గురయ్యాడని భావిస్తుండేవాడు. ఒక రాత్రి బాబు జ్వరం తీవ్రమై ప్రమాదస్థితి ఏర్పడింది. ప్రధాన్ దంపతులు భట్‌ను లేపాలని అనుకుంటుండగా తనకు తానుగా అతడే లేచి మేడపైకి వెళ్లి, బాబా ఫోటో ముందు కూర్చుని, "నాకు వచ్చిన స్వప్నం నిజమైతే, బాబు జ్వరం 15 నిమిషాలలో తగ్గిపోవాలి. రేపటి నుండి వాడు ఆడుకోగలగాలి. డాక్టర్లు వాడు పూర్తిగా కోలుకున్నట్లు చెప్పాలి. అలా జరిగితే మీరు సిద్ధపురుషుడని నమ్మి మీ ముందు సాగిలపడతాను. 15 రోజులలో శిరిడీ వచ్చి మీకు 108 రూపాయలు దక్షిణ సమర్పిస్తాను" అని మ్రొక్కుకున్నాడు. తరువాత భట్ తనకు వచ్చిన కల గురించి ఇలా చెప్పాడు: "ఒక ముసల్మాను బాబా వలె దుస్తులు ధరించి దండము చేతబూని నా పడక దగ్గరికి వచ్చి నన్ను లేపాడు. తరువాత మేడ మెట్లు ఎక్కుతూ, "నీకేం తెలుసు? ఈ ఇల్లు నాది. ఈ బిడ్డను నేనే ప్రసాదించాను. నీవు పిల్లవాడి రోగం నయం చేయగలవని అనుకుంటున్నావా? ఆ పిల్లవాడు నావాడు. ఆ విషయం నీకు వెంటనే నిరూపిస్తాను" అని పైకి వెళ్ళాడు. దాంతో నేను మేల్కొని, బాబా పటం దగ్గర ప్రార్థించాను" అని. ఇలా అతను ప్రార్థించిన గంట తరువాత బాబు జ్వరం, దగ్గు తగ్గిపోయాయి. పిల్లవాడు చురుకుగా ఆడుకోసాగాడు. ఇది చూసి భట్ నేరుగా బాబా పటం దగ్గరకు వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేశాడు.

తరువాత భట్ తన మ్రొక్కు తీర్చుకోవడానికి శిరిడీ వెళ్ళాడు. బాబా అతడిని చూస్తూనే, "ఇతడు నన్ను కుక్క, పిల్లి అని, ముసల్మానునని అంటున్నాడు" అని భక్తులతో అన్నారు. బాబా అంతర్యామిత్వానికి భట్ ఆశ్చర్యచకితుడై వారి పాదాలపై పడి నమస్కరించి, 108 రూపాయల దక్షిణ సమర్పించాడు. అప్పుడు బాబా శ్యామాతో, "ఈ భట్ నన్ను రోజుకు ఎన్నిసార్లు పూజిస్తుంటాడో!" అని అన్నారు. తరువాత భట్ తన మనసులో బాబాకు ఇలా మ్రొక్కుకున్నాడు: మొదటిది, తనకు ఒక కొడుకు పుడితే 108 రూపాయలు దక్షిణ సమర్పించుకుంటానని, రెండవది, తన యజమాని అయిన శ్రీ ప్రధాన్ కోరిక నెరవేరితే దానికి పదింతల డబ్బు దక్షిణగా సమర్పించుకుంటానని. అదేరోజు మధ్యాహ్నం భట్ మళ్ళీ మసీదుకు వెళ్ళి బాబాను దర్శించాడు. అప్పుడు బాబా అతనిని దక్షిణ అడిగారు. పక్కనే ఉన్న శ్యామా బాబాతో, "ఇతడు ఉదయమే దక్షిణ సమర్పించాడు" అని చెప్పాడు. అప్పుడు బాబా, "ఇతను ఉదయమిచ్చింది చాలా చిన్న మొత్తం. అతడింకా పెద్ద మొత్తమే మనకి ఇవ్వబోతున్నాడు" అని అన్నారు. తన అంతరంగంలోని ఆలోచనలన్నీ బాబాకు తెలుసునని భట్ గ్రహించాడు. ఒక సంవత్సరం తరువాత భట్‌కు మగపిల్లవాడు పుట్టాడు. భట్ శిరిడీ వెళ్ళి బాబాకు 108 రూపాయల దక్షిణ సమర్పించాడు. తరువాత అతడు తన స్వగ్రామంలో తన సోదరుడు నిర్మించిన దత్తమందిరంలో బాబా ఫోటోని ఉంచి పూజించుకోసాగాడు.

బాబా సమాధి చెందిన తరువాత కూడా వారి ఆశీస్సుల వల్ల ప్రధాన్ ఎన్నో ప్రయోజనాలను పొందాడు. 1920 నుండి 1926 వరకు అతడు సౌత్ సాల్సెట్ రెండవ తరగతి కోర్టు మేజిస్ట్రేటుగా పనిచేశాడు. 1926లో అతను జె.పి.(జస్టిస్ ఆఫ్ పీస్) గా పనిచేశాడు. 1921-23లో బొంబాయి శాసనమండలి సభ్యునిగా థానా నుండి ఎన్నికయ్యాడు. 1927లో అతనికి రావు బహదూర్ బిరుదు ప్రదానం చేయబడింది. ప్రధాన్ కొంతకాలం సాయిబాబా సంస్థాన్ అధ్యక్షుడిగా పనిచేసి ఎనలేని సేవలు అందించాడు. సంస్థాన్ యొక్క జీవితకాల ధర్మకర్తలలోని మొదటి ఐదుమందిలో అతడు కూడా ఒకడు. అతడు బాబా జీవితం మరియు బోధల గురించి వివరిస్తూ 'Shri Sai Baba Of Shirdi: A Glimpse Of Indian Spirituality' అన్న ఒక పుస్తకాన్ని రచించాడు.

సమాప్తం.

Source http://bonjanrao.blogspot.com/2012/10/moreshwar-w-pradhan.html
http://www.saiamrithadhara.com/mahabhakthas/moreshwar_w_pradhan.html
Devotees Experiences of Sri Saibaba part II by Pujya Sri B.V.Narasimha Swamiji

ముందు భాగం కోసం బాబా పాదుకలు తాకండి. 

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo