సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

మోరేశ్వర్ డబ్ల్యు. ప్రధాన్ - రెండవ భాగం


బాబు ప్రధాన్

భక్తులపై బాబాకున్న ప్రేమ ఒక జన్మతో తీరిపోయేది కాదు. ఆయన ప్రేమ జన్మజన్మలకు కొనసాగుతూ భక్తులకు రక్షణనిస్తుంది. అందుకు సరైన ఉదాహరణ బాబు ప్రధాన్ ఉదంతం. బాబాకు బాబు అంటే చాలా ఇష్టం. బాబు గతజన్మల వృత్తాంతాన్ని గురించి జి.యస్.ఖపర్డేతో బాబా (సాయిలీలా పత్రిక) ఇలా చెప్పారు: "ఒకప్పుడు శిరిడీలో ఎంతో పవిత్రుడైన ఒక వృద్ధుడు 12 సంవత్సరాలకు పైగా నివసించాడు. అతని భార్యాబిడ్డలు జాల్నాలో ఉండేవారు. వాళ్ళు అతన్ని ఇంటికి రమ్మని పదేపదే కోరుతుంటే అతడు గుఱ్ఱం మీద బయలుదేరాడు. అతనికి తోడుగా నేను కూడా బండిలో వెళ్ళాను. కొంతకాలానికి ఆ వృద్ధుడు తన సోదరి కుమార్తెను వివాహం చేసుకున్నాడు. వారికి ఒక కొడుకు పుట్టాక ఆరు సంవత్సరాలకు ఆ వృద్ధుడు మరణించాడు. ఆ పిల్లవాని దాయాదులు అతనికి విషం పెట్టి చంపేశారు. ఆ పిల్లవాడే 'బాబు'గా జన్మించాడు". ఈ బాబే హరివినాయక్ సాఠే మామగారైన గణేష్ కేల్కర్ బంధువు.

ఒకసారి అతనికి బాబా స్వప్పదర్శనమిచ్చి పిలవడం వలన, అతడు ఇల్లు విడచి కాలినడకన శిరిడీ చేరి బాబాను దర్శించాడు. తర్వాత అతడు కోపర్గాఁవ్, ఏవలా గ్రామాలకు సర్వేయరయ్యాడు. ఇతని పైఅధికారి లిమాయే, సాఠేకు క్రింది ఉద్యోగి. బాబు పూర్తిగా బాబా సేవలో ఉండి, తమ ఉద్యోగ ధర్మాన్ని అశ్రద్ధ చేస్తుంటే సాఠే, కేల్కర్‌లు బాబాకు ఫిర్యాదు చేశారు. బాబా, "ఆ పనులన్నీ అలా ఉంచి అతనిని నా సేవ చేసుకోనివ్వండి" అని అన్నారు. అప్పటినుండి వారు బాబుకు ఎక్కువ పనులు చెప్పేవారుగాదు. సాయి ఒక్కొక్కప్పుడు మంచి మంచి ప్రసాదాలన్నీ ఆతనికి పెట్టేవారు. సం.1910లో ఒకసారి బాబా, "బాబు విషయంలో జాగ్రత్త తీసుకో" అని కేల్కర్‌ను హెచ్చరించారు. అతనికేమీ అర్థంగాలేదు. కొద్ది రోజుల్లో బాబుకు తీవ్రమైన జ్వరమొచ్చింది. ఒకరోజు కేల్కర్‌తో, “బాబు ఇంకా జీవించే ఉన్నాడా?" అన్నారు బాబా. కొద్దిరోజులలోనే బాబు తన 22వ ఏట శిరిడీలో చనిపోయాడు. అటుతర్వాత గూడా బాబా తరచుగా అతనిని తలచుకుంటూండేవారు.

ప్రధాన్ కుటుంబం శిరిడీ చేరిన రోజు బాబా శ్రీమతి ప్రధాన్‌ను చూపించి మాధవరావు దేశ్‌పాండేతో, "ఈమె నా బాబుకు తల్లి" అన్నారు. కానీ చందోర్కర్ గర్భవతిగా కనపడుతున్న ఆమె సోదరి గురించే బాబా చెబుతున్నారనుకుని బాబాతో, “మీరు మాట్లాడుతున్నది ఈమె గురించే కదా?” అనడిగాడు. బాబా, "కాదు, నేను మాట్లాడింది ఈమె గురించి” అంటూ మళ్ళీ శ్రీమతి ప్రధాన్ వైపే చూపించారు. ఆరోజు నుండి సరిగ్గా 12 నెలలు తిరిగేసరికి శ్రీమతి ప్రధాన్ ఒక మగపిల్లవాడికి జన్మనిచ్చింది. ఆ బిడ్డకి బాబా నోటి నుండి వెలువడిన “బాబు” అన్న పేరే పెట్టారు. నామకరణ కార్యక్రమానికి దాసగణు, చందోర్కర్ మొదలైన భక్తులందరూ రావడంతో ఆ కార్యక్రమం బాబా కరుణ, గొప్పతనాన్ని స్మరించుకునే గొప్ప వేడుకలా జరిగింది. 

ప్రధాన్ కుటుంబీకుల సంప్రదాయానుసారం ఆ కుటుంబంలోని ఏ స్త్రీ అయినా తనకు బిడ్డ పుట్టినప్పుడు గోధుమలు, టెంకాయ, పండ్లు కొంగులో కట్టుకుని అత్తవారింటికి వెళ్లి, తన మామగారి ముందుగానీ లేక వారు పూజించే ఇలవేల్పు ముందుగానీ ఉంచాలి. అయితే బాబు పుట్టిన తరువాత శ్రీమతి ప్రధాన్ తన మెట్టినింటి ఇలవేల్పుగా బాబాను కొలుచుకోవాలని నిర్ణయించుకుంది. అందువలన ఆమె ఆ వస్తువులన్నీ కొంగున కట్టుకుని, నాలుగు నెలల వయస్సున్న బాబును తీసుకుని 1912లో శిరిడీ వెళ్లి బాబాకు సమర్పించింది. బాబా వాటిని ప్రేమతో స్వీకరించారు. తరువాత బాబును తమ చేతులలోకి తీసుకుని లాలిస్తూ, "బాబూ! ఎక్కడికి వెళ్ళావు? నామీద కోపమొచ్చిందా లేక నేనంటే విసుగు పుట్టిందా? (బాబూ! కోఠే గేలా హోతాస్? మల కంఠాలాస్ హోతాస్ కాయ్?)" అంటూ ముద్దాడారు. బాబాను చూస్తూనే ఆ బిడ్డ కిలకిలా నవ్వాడు. బాబు శిరిడీ వచ్చిన సంతోష సమయంలో బాబా తమ జేబులోనుండి రెండు రూపాయలు తీసి బర్ఫీ తెప్పించి కొడుకు పుట్టిన సందర్భంలో ఎలా మిఠాయిలు పంచుతారో అలాగే బాబా అందరికీ బర్ఫీ పంచారు.

ఈ సమయంలోనే ఒకరోజు బాబా శిరిడీ గ్రామ ద్వారాన్ని చూపించి, "దీనినెవరు పునర్నిర్మిస్తారో వారికి అనుగ్రహం లభిస్తుంది" అన్నారు. వెంటనే శ్రీమతి ప్రధాన్ ఆ నిర్మాణం చేసేందుకు తమకే అనుమతినిమ్మని కోరింది. బాబా అనుమతించారు. ప్రధాన్ ఆ నిర్మాణం కొరకు 600 రూపాయలు చందోర్కర్‌కు ఇచ్చాడు. మరొకరోజు బాబా, "బాబు బంగళా అందంగా ఉంది. చక్కగా పూర్తయింది" అన్నారు. బాబా మాటలను బట్టి ప్రధాన్‌కు తాను నివాసముంటున్న బంగళాను ఖరీదు చేయమన్నట్లుగా అనిపించి ఆరుమాసాలలో, అంటే 1913లో ఆ ఇంటిని అతడు కొనుగోలు చేశాడు.

తరువాత ప్రధాన్ దంపతులు బాబు మొదటి పుట్టినరోజు సందర్భంగా బాబా దర్శనానికి శిరిడీ తీసుకెళ్లారు. అప్పుడు కూడా బాబా తమ సంతోషానికి సంకేతంగా రెండు రూపాయలతో బర్ఫీ కొని అందరికీ పంచిపెట్టారు. తరువాత బాబా ప్రత్యేకించి "బాబుకు తమ్ముడు కానీ, చెల్లి కానీ లేరా?" అని అడిగారు. శ్రీమతి ప్రధాన్ కాస్త సిగ్గుపడుతూ, "మీరు మాకు ఈ బాబునొక్కడినే ప్రసాదించారు" అని జవాబిచ్చింది. అప్పటికి వాళ్ళకి ఒక కుమార్తె ఉంది. అయితే బాబా మాటలనే ఆశీస్సులుగా భావించి తమకు కొడుకు, కూతురు పుడతారని వాళ్ళు అనుకున్నారు. బాబా చెప్పినట్లే జరిగింది.

బాబు మొదటి పుట్టినరోజు సందర్భంగా శ్యామా ఇంట్లో గొప్ప విందు ఏర్పాటు చేసి అందరినీ ఆహ్వానించాడు ప్రధాన్. ఆరోజు గురువారం. బాలాసాహెబ్ భాటే తనకు గురువారంనాడు బయట తినకూడదనే నియమం ఉందని చెప్పి విందుకు గైర్హాజరయ్యాడు. తరువాత అతడు  బాబా దగ్గరకు వెళ్ళినప్పుడు బాబా ఇలా అడిగారు:

బాబా: భావూ(ప్రధాన్) ఏర్పాటు చేసిన విందుకు వెళ్లి భోంచేశావా?
భాటే: ఈరోజు గురువారం బాబా!
బాబా: అయితే ఏమిటట?
భాటే: గురువారంనాడు బయటెక్కడా భోంచేయకూడదన్నది నా నియమం.
బాబా: ఎవరి ప్రీతికోసం ఆ నియమం పెట్టుకున్నావు?
భాటే: మీ ప్రీతికోసమే.
బాబా: అయితే నేనే చెబుతున్నాను. భావూ వద్దకు వెళ్లి భోంచేసిరా!

అప్పటికే సాయంత్రం 4 గంటలు అయినప్పటికీ ప్రధాన్ వద్దకు వెళ్లి, బాబా ఆదేశాన్ని తెలియజేసి భోంచేసి వెళ్ళాడు భాటే.

ప్రధాన్ మొదటిసారి శిరిడీ వెళ్ళినప్పటినుండి మసీదులో బాబాతోనే భోజనం చేసేవాడు. బాబా తమ స్వహస్తాలతో పదార్థాలను తీసి పళ్ళాల నిండా పెట్టేవారు. అది చాలా ఎక్కువ పరిమాణంలో ఉండేది. ప్రధాన్ విలువైన ఆ ప్రసాదాన్ని పారవేయకుండా, తనకు పెట్టిన దాంట్లో ముప్పాతిక భాగం తన మేనకోడలితో ఇంటికి పంపేవాడు. అది ఆ కుటుంబానికంతా సరిపోయేది. అంతేకాక మిగిలిన ప్రసాదంతో అతని కడుపు నిండి రాత్రికి ఇక ఆకలయ్యేది కాదు. అంత సమృద్ధిగా భక్తులకు వడ్డించేవారు బాబా. భోజనం చేసిన తరువాత బాబా పండ్లను కూడా ఇచ్చేవారు. ప్రధాన్ బాబును తీసుకుని వెళ్ళినప్పుడు, బాబుకి వండిన పదార్థాలు సహించవని, బాబా వాడికి మొదట మామిడిపండ్లు మొదలైనవి తినిపించేవారు. దానితో వాడి కడుపు నిండేది. ప్రధాన్‌కి మరో కూతురు, కొడుకు పుట్టిన తరువాత వాళ్ళని కూడా మసీదుకు తీసుకుని వెళ్లి బాబాతో భోజనం చేసేవాడు ప్రధాన్.

ప్రధాన్ చివరిసారిగా బాబాను 1918 మే నెలలో దర్శించాడు. అప్పుడు అతను వద్ద రూ. 3,800 ఉన్నాయి. బాబా పట్టుబట్టడం వలన అతడు తాను అనుకున్న దానికంటే ఎక్కువ కాలం శిరిడీలో ఉన్నాడు. అప్పుడతడు మొత్తం 32 రోజులు బాబాతో గడిపాడు. ఒకరోజు భక్తులందరూ బాబాకు ఛత్రం పట్టి మేళతాళాలతో ఊరేగింపుగా లెండీకి తీసుకెళ్లి విడిచి వచ్చారు. కాసేపటికి బాబా ప్రధాన్‌ను పిలిపించారు. ప్రధాన్ వెళ్లగా బాబా అతని తలపై తమ హస్తాన్నుంచి, "భావూ, నేను చెప్పిన పని చేస్తావా?" అని అడిగారు. అతడు చేస్తానని చెప్పాడు. అప్పుడు బాబా‌, "అయితే, నాకు వంద రూపాయలు ఒక సంచిలో వేసి మసీదుకు తెచ్చి ఇవ్వు" అన్నారు. అతడు అలానే చేశాడు. ఆ సమయంలో బాబా తరచూ అతనిని దక్షిణ అడుగుతుండేవారు. ఫలితంగా అతడు తన వద్ద ఉన్న 3,800 రూపాయలతోపాటు పూణేకు చెందిన ఒక పశువైద్యుని వద్ద అప్పుగా తీసుకున్న మరో 1200 రూపాయలను కూడా బాబాకు దక్షిణగా సమర్పించుకున్నాడు. (వాచా చెప్పకపోయినా బాబా వద్ద స్పష్టంగా కనిపించే పద్ధతి ఏమిటంటే - బాబా తాము ప్రేమించిన వారి వద్ద ఉన్న డబ్బంతా తరుచుగా తీసేసుకుంటారు.) బాబా 5,000 రూపాయలు దక్షిణగా స్వీకరించాక ఏవేవో సంజ్ఞలు చేశారు. అవి ప్రధాన్‌కు స్పష్టంగా అర్థం కాకపోయినప్పటికీ అందులో "మిన్ను విరిగి మీదపడినా వెఱవకు. నేను నీవెంటే ఉంటాను" అన్న భావం ఉన్నట్లు గ్రహించాడు. మొట్టమొదట ప్రధాన్ బాబాను దర్శించినప్పుడు, గత ఆరు సంవత్సరాలుగా అతడిచ్చిన చిలింనే ఉపయోగిస్తున్నట్లు చెప్పారు బాబా. వారి మాటలలోని అంతరార్థం తనకు బోధపడలేదని ప్రధాన్ చెప్పాడు.

ప్రధాన్ 1916లో శిరిడీలో జరిగిన బూటీ రెండవ వివాహానికి హాజరయ్యాడు. అతడు శిరిడీ నుండి తిరుగు ప్రయాణమవుతున్నప్పుడు బాబా, "నేనూ మీవెంటే వస్తాను (తుఝ్యా బరోబర్ మీ యేఈన్)" అన్నారు. ప్రత్యక్షంగా బాబా ప్రధాన్‌తో వెళ్ళనప్పటికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళ ప్రయాణం సుఖంగా సాగింది. దాన్నిబట్టి బాబా తమ సూక్ష్మశరీరంతో వారిని అనుసరించి ప్రమాదాలను, ఇబ్బందులను తొలగించారని ప్రధాన్‌కు అనిపించింది.

ఒకరోజు మధ్యాహ్నం రెండు గంటలకు బాబా, "ప్రధాన్ వచ్చాడా?" అని దీక్షిత్‌ను అడిగారు. "లేదు బాబా, కబురు చేసేదా?" అన్నాడు దీక్షిత్. "చేయి" అంటూ కొద్ది ఊదీనిచ్చి, "ఇది పంపించు" అన్నారు బాబా. ఆ ఊదీ, ఒక ఉత్తరమూ బాలాషింపీ ద్వారా ప్రధాన్‌కి పంపాడు దీక్షిత్. అప్పుడు వెల్లడైన వివరాలు: శిరిడీలో బాబా అతని గురించే హెచ్చరిస్తున్న క్షణంలో హైకోర్టులో కొందరు స్నేహితులతో మాట్లాడుతున్న ప్రధాన్ అకస్మాత్తుగా స్పృహతప్పి పడిపోయాడు. కొద్దిసేపట్లో తనంతటతానే తెప్పరిల్లుకుని రైల్లో ఇల్లు చేరాడు. తెల్లవారేసరికి ఊదీ, జాబులతో బాలాషింపీ బొంబాయి చేరాడు. సాయికి మన బాధలు నివేదించనక్కరలేదు. ఆయన అనుక్షణం మనల్ని కనిపెట్టుకుని ఉంటారని గుర్తుంచుకుంటే చాలు.

బాబా ఒకసారి శ్రీమతి ప్రధాన్‌తో, "ఎవరైనా పది మాటలంటే, ఒకవేళ మనం సమాధానం ఇవ్వాల్సివస్తే ఒక్క మాటతో సమాధానమిద్దాం" అనీ, "ఎవరితోనూ గొడవకుగానీ, పోటీకిగానీ దిగవద్దు" అనీ హితవు చెప్పారు. ఒకసారి శ్రీమతి ప్రధాన్ మసీదుకు వెళ్ళినప్పుడు బాబా ఆగ్రహంతో కేకలు వేస్తారేమోనని భయపడింది. ఆరోజు బాబా అలా ఏమీ చేయకుండా, "చూశావా, నేను ఎవరిపైనా కోప్పడలేదు, కేకలు వేయలేదు, అవునా?" అన్నారు.

ఒకసారి శ్రీమతి ప్రధాన్‌కు కలలో బాబా కనిపించి, వారి పాదాలకు పసుపు, కుంకుమ పెట్టమన్నారు. కలలో ఆమె బాబాను అలాగే పూజించింది. తరువాత ఆ కల విషయం చందోర్కర్‌కు చెప్పగా చందోర్కర్, 'నిత్యం ఆమె ఇంట్లో తమ పాదపూజ చేసుకోవడం' బాబా అభిమతంగా చెప్పి, రెండు వెండిపాదుకలు తీసుకుని శిరిడీ వెళ్ళమని ఆమెకు చెప్పాడు. ఆమె అలానే చేసింది. ఆమె వెళ్ళగానే, అప్పటిదాకా కాళ్ళు ముడుచుకుని కూర్చుని ఉన్న బాబా, తమ పాదాలను ముందుకు చాచి, "పాదుకలను ఈ పాదాల మీద ఉంచి పూజించుకో" అన్నారు. ఆమె బాబా ఒక్కొక్క పాదంపై ఒక్కొక్క పాదుకను ఉంచి పూజించింది. అప్పుడు బాబా చందోర్కర్‌తో, "చూశావా! ఈ తల్లి నా పాదాలను కోసి తీసుకెళ్తోంది (నానాహినేఁ మాఝే పాయ్ పహ కాపూన్ నేలే)" అని అన్నారు. తరువాత బాబానే ఆ రెండు పాదుకలను ఆమె చేతికిచ్చారు. అప్పటినుండి బాబా పాదుకలు ప్రధాన్ ఇంట పూజింపబడుతున్నాయి.

ఒకసారి ప్రధాన్ పిల్లలందరికీ పొంగు (మీజిల్స్) పోసింది. వైద్యుడు బాబు పరిస్థితి ప్రమాదకరంగా ఉందని చెప్పాడు. అందరూ ఆశ వదులుకున్నారు. ఆ స్థితిలో బాబాను ప్రార్థించింది శ్రీమతి ప్రధాన్. బాబా ఆమెకు కనిపించి, "ఎందుకమ్మా దుఃఖిస్తావు? పిల్లవాడు బాగానే ఉన్నాడు. ఉదయం ఆరు, ఆరున్నర గంటలకు వాడికి మంచి ఆహారం పెట్టు" అన్నారు. ఉదయానికల్లా బాబు లేచి ఆడుకోవడం ప్రారంభించాడు. వైద్యుడు వాడిని చూసి ఆశ్చర్యపోయి, పిల్లవాడికి ఏ ఆహారం పెట్టవద్దన్నాడు. కానీ, పిల్లవాడు అన్నీ తిని అరాయించుకున్నాడు.

ప్రధాన్ కుటుంబంలోని పిల్లలందరికీ అప్పుడప్పుడు మూర్ఛ వస్తుండేది. ఒకరాత్రి 11 గంటల సమయంలో శ్రీమతి ప్రధాన్‌కు కలలో బాబా కనిపించి, "నిద్రపోతున్నావా? లే! పిల్లవాడికి మూర్ఛ వస్తుంది" అన్నారు. వెంటనే ఆమె లేచి పిల్లవాడిని చూసింది. జ్వరంగానీ, మూర్ఛ లక్షణాలుగానీ కనిపించలేదు. కానీ బాబా హెచ్చరించినందువల్ల ఆమె వేడినీళ్లు, నిప్పు, ఉడుకులోన్ మొదలైనవన్నీ సిద్ధం చేసుకుని జాగ్రత్తగా ఉంది. రాత్రి రెండు గంటల సమయంలో పిల్లవాడికి మూర్ఛ లక్షణాలు కనిపించాయి. అన్నీ సిద్ధంగా ఉండబట్టి ఎటువంటి కష్టం లేకుండా త్వరగా పిల్లవాడికి నయమైంది.

మరొకరోజు ఆమె మసీదులో బాబాను పూజిస్తుండగా, బాబా పూజ మధ్యలో ఆమెను ఆపి, "నీవు వెంటనే బసకు వెళ్ళు" అన్నారు. ఆమె బసకు వెళ్లేసరికి పాప గుక్కపెట్టి ఏడుస్తోంది. అందుకే బాబా తనని పూజ మధ్యలో ఆపి పంపారని ఆమె గ్రహించింది. ఆమె పాపను సముదాయించి మరలా మసీదుకు వచ్చింది. అప్పుడు బాబా, "ఇప్పుడు పూజ పూర్తి చేసుకో" అన్నారు.

ఒకసారి ప్రధాన్ దంపతులు అప్పుడే టైఫాయిడ్ జ్వరం నుండి కోలుకుంటున్న వాళ్ళ అబ్బాయిని తీసుకుని శిరిడీ వెళ్లదలిచారు. డాక్టర్ వద్దని చెప్పాడు, కానీ వాళ్ళు పిల్లవాడిని తీసుకుని శిరిడీ ప్రయాణమయ్యారు. రైలులో వాడికి జ్వరమొచ్చింది. అందరూ చెబుతున్నా వినకుండా పిల్లవాడిని తీసుకొచ్చాము, ఇప్పుడు వాడికేమన్నా అయితే నా పిచ్చితనాన్ని చూసి నలుగురూ నవ్వుతారేమోనని శ్రీమతి ప్రధాన్ భయపడింది. పిల్లవాడు జ్వర తీవ్రతతో పడుకునే ఉన్నాడు. కనీసం కూర్చోలేకపోతున్నాడు. అలాంటిది వాళ్ళు శిరిడీ చేరి బాబా వద్దకు వెళ్ళేటప్పటికి పిల్లవాడు కోలుకొని లేచి నిలబడగలిగాడు. బాబా, "ఇప్పుడు నిన్ను చూసి ఎవ్వరూ నవ్వరు" అన్నారు. రైలులో ప్రయాణించేటప్పుడు ఆమె మదిలో మెదిలిన ఆలోచనల గురించి బాబాకు తెలుసు.

బాబా సమాధి చెందిన మరుసటిరాత్రి, అంటే 1918, అక్టోబర్ 16న శ్రీమతి ప్రధాన్‌కు ఒక కల వచ్చింది. కలలో బాబా మరణిస్తున్నట్లు కనిపించింది. అప్పుడు ఆమె, "బాబా చనిపోతున్నారు" అని కేకలు పెట్టింది. అప్పుడు బాబా, "మహాత్ముల విషయంలో చనిపోతున్నారని అనకూడదు. సమాధి చెందుతున్నారు అనాలి" అన్నారు. మరుక్షణంలో బాబా శరీరం నిశ్చలంగా మారింది. అందరూ దుఃఖిస్తున్నారు. ఆమెకు చాలా బాధ కలిగింది. ఆమెకు మెలకువ వచ్చి చూస్తే, అప్పుడు సమయం రాత్రి 12.30 గంటలైంది. మరుసటి ఉదయం బాబా 1918, అక్టోబర్ 15, విజయదశమిరోజున మధ్యాహ్నం 3 గంటలకు సమాధి చెందినట్లు అణ్ణాచించణీకర్ నుండి జాబు వచ్చింది.

1918, అక్టోబర్ 19 రాత్రి శ్రీమతి ప్రధాన్‌కు కలలో బాబా కనిపించి, మూడు రూపాయలిచ్చారు. కలలో డబ్బు తీసుకోవడం అశుభంగా ఆమె భావించి బాధపడుతుంది. అప్పుడు బాబా, "తీసుకో, తీసుకో! కానీ నీవు డబ్బాలో దాచిన డబ్బంతా నాకు పంపు" అన్నారు. ఆమె మరుసటిరోజు తాను దాచుకున్న డబ్బంతా శిరిడీకి పంపింది.

1918, అక్టోబర్ 19 రాత్రి శ్రీమతి ప్రధాన్ సోదరికి బాబా కలలో కనపడి, "మీ సంచిలో ఉన్న పీతాంబరం పంపి, నా సమాధిపై కప్పించండి" అన్నారు. వెంటనే మెలుకువ వచ్చి, చాలా సంవత్సరాలుగా ఉతికిన ఒక పీతాంబరం వారి సంచిలో ఉన్న సంగతి జ్ఞాపకమొచ్చి, ఉదయమే దానిని శిరిడీ పంపారు. 1923 వరకు తరచూ దానిని బాబా సమాధి మీద కప్పేవారు.

శాంతాక్రజ్‌లో ఉండగా ఒకప్పుడు శ్రీమతి ప్రధాన్‌కి ప్రసవ సమయం సమీపించింది. ఆమెకు సహాయంగా ఒక మంత్రసానిని, ఒక నర్సును నియమించారు. ఆమె పురిటినొప్పులతో నాలుగురోజులు బాధపడ్డా గానీ ప్రసవం కాలేదు. నర్సు భయపడి శ్రీమతి ప్రధాన్ సోదరి దగ్గరకు వెళ్లి, "నొప్పులు ప్రారంభమై నాలుగు రోజులు అవుతున్నా ప్రసవం కావడంలేదు, వెంటనే డాక్టరుకి కబురు పెట్టడం మంచిద"ని చెప్పింది. శ్రీమతి ప్రధాన్ సోదరి బాబా పటం ముందు నిలిచి బాబాను ఆర్తిగా ప్రార్థించింది. వెంటనే ఎవరి సహాయం లేకుండా శ్రీమతి ప్రధాన్‌కు సుఖప్రసవమైంది. బాబా శక్తికి, కరుణకి వాళ్లంతా ఆశ్చర్యపోయారు.

మాధవ్‌ భట్ అనే వృద్ధ తెలుగు బ్రాహ్మణుడు పరమ శివభక్తుడు. అతడు రాత్రింబవళ్ళు రుద్రాభిషేకం మొదలైన పూజలు చేస్తూ గడిపేవాడు. ప్రధాన్ కుటుంబంతో అతనికి మంచి అనుబంధం ఉండేది. ఆ కుటుంబ శ్రేయస్సు కోసం అతడు వారింట్లో ప్రతిరోజూ మంత్రజపం,  పూజ నిర్వహిస్తుండేవాడు. అతనికి బాబుపై ఎనలేని ప్రేమాభిమానాలుండేవి. బాబుకు సంవత్సరం నిండాక ఒకసారి ప్రమాదంగా జబ్బు చేసింది. ప్రధాన్ దంపతులు బాబాను పూజించడం గిట్టని మాధవ్‌ భట్ ముస్లిం ఫకీరైన సాయిబాబాను పూజిస్తున్నందుకే బాబు అనారోగ్యానికి గురయ్యాడని భావిస్తుండేవాడు. ఒక రాత్రి బాబు జ్వరం తీవ్రమై ప్రమాదస్థితి ఏర్పడింది. ప్రధాన్ దంపతులు భట్‌ను లేపాలని అనుకుంటుండగా తనకు తానుగా అతడే లేచి మేడపైకి వెళ్లి, బాబా ఫోటో ముందు కూర్చుని, "నాకు వచ్చిన స్వప్నం నిజమైతే, బాబు జ్వరం 15 నిమిషాలలో తగ్గిపోవాలి. రేపటి నుండి వాడు ఆడుకోగలగాలి. డాక్టర్లు వాడు పూర్తిగా కోలుకున్నట్లు చెప్పాలి. అలా జరిగితే మీరు సిద్ధపురుషుడని నమ్మి మీ ముందు సాగిలపడతాను. 15 రోజులలో శిరిడీ వచ్చి మీకు 108 రూపాయలు దక్షిణ సమర్పిస్తాను" అని మ్రొక్కుకున్నాడు. తరువాత భట్ తనకు వచ్చిన కల గురించి ఇలా చెప్పాడు: "ఒక ముసల్మాను బాబా వలె దుస్తులు ధరించి దండము చేతబూని నా పడక దగ్గరికి వచ్చి నన్ను లేపాడు. తరువాత మేడ మెట్లు ఎక్కుతూ, "నీకేం తెలుసు? ఈ ఇల్లు నాది. ఈ బిడ్డను నేనే ప్రసాదించాను. నీవు పిల్లవాడి రోగం నయం చేయగలవని అనుకుంటున్నావా? ఆ పిల్లవాడు నావాడు. ఆ విషయం నీకు వెంటనే నిరూపిస్తాను" అని పైకి వెళ్ళాడు. దాంతో నేను మేల్కొని, బాబా పటం దగ్గర ప్రార్థించాను" అని. ఇలా అతను ప్రార్థించిన గంట తరువాత బాబు జ్వరం, దగ్గు తగ్గిపోయాయి. పిల్లవాడు చురుకుగా ఆడుకోసాగాడు. ఇది చూసి భట్ నేరుగా బాబా పటం దగ్గరకు వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేశాడు.

తరువాత భట్ తన మ్రొక్కు తీర్చుకోవడానికి శిరిడీ వెళ్ళాడు. బాబా అతడిని చూస్తూనే, "ఇతడు నన్ను కుక్క, పిల్లి అని, ముసల్మానునని అంటున్నాడు" అని భక్తులతో అన్నారు. బాబా అంతర్యామిత్వానికి భట్ ఆశ్చర్యచకితుడై వారి పాదాలపై పడి నమస్కరించి, 108 రూపాయల దక్షిణ సమర్పించాడు. అప్పుడు బాబా శ్యామాతో, "ఈ భట్ నన్ను రోజుకు ఎన్నిసార్లు పూజిస్తుంటాడో!" అని అన్నారు. తరువాత భట్ తన మనసులో బాబాకు ఇలా మ్రొక్కుకున్నాడు: మొదటిది, తనకు ఒక కొడుకు పుడితే 108 రూపాయలు దక్షిణ సమర్పించుకుంటానని, రెండవది, తన యజమాని అయిన శ్రీ ప్రధాన్ కోరిక నెరవేరితే దానికి పదింతల డబ్బు దక్షిణగా సమర్పించుకుంటానని. అదేరోజు మధ్యాహ్నం భట్ మళ్ళీ మసీదుకు వెళ్ళి బాబాను దర్శించాడు. అప్పుడు బాబా అతనిని దక్షిణ అడిగారు. పక్కనే ఉన్న శ్యామా బాబాతో, "ఇతడు ఉదయమే దక్షిణ సమర్పించాడు" అని చెప్పాడు. అప్పుడు బాబా, "ఇతను ఉదయమిచ్చింది చాలా చిన్న మొత్తం. అతడింకా పెద్ద మొత్తమే మనకి ఇవ్వబోతున్నాడు" అని అన్నారు. తన అంతరంగంలోని ఆలోచనలన్నీ బాబాకు తెలుసునని భట్ గ్రహించాడు. ఒక సంవత్సరం తరువాత భట్‌కు మగపిల్లవాడు పుట్టాడు. భట్ శిరిడీ వెళ్ళి బాబాకు 108 రూపాయల దక్షిణ సమర్పించాడు. తరువాత అతడు తన స్వగ్రామంలో తన సోదరుడు నిర్మించిన దత్తమందిరంలో బాబా ఫోటోని ఉంచి పూజించుకోసాగాడు.

బాబా సమాధి చెందిన తరువాత కూడా వారి ఆశీస్సుల వల్ల ప్రధాన్ ఎన్నో ప్రయోజనాలను పొందాడు. 1920 నుండి 1926 వరకు అతడు సౌత్ సాల్సెట్ రెండవ తరగతి కోర్టు మేజిస్ట్రేటుగా పనిచేశాడు. 1926లో అతను జె.పి.(జస్టిస్ ఆఫ్ పీస్) గా పనిచేశాడు. 1921-23లో బొంబాయి శాసనమండలి సభ్యునిగా థానా నుండి ఎన్నికయ్యాడు. 1927లో అతనికి రావు బహదూర్ బిరుదు ప్రదానం చేయబడింది. ప్రధాన్ కొంతకాలం సాయిబాబా సంస్థాన్ అధ్యక్షుడిగా పనిచేసి ఎనలేని సేవలు అందించాడు. సంస్థాన్ యొక్క జీవితకాల ధర్మకర్తలలోని మొదటి ఐదుమందిలో అతడు కూడా ఒకడు. అతడు బాబా జీవితం మరియు బోధల గురించి వివరిస్తూ 'Shri Sai Baba Of Shirdi: A Glimpse Of Indian Spirituality' అన్న ఒక పుస్తకాన్ని రచించాడు.

సమాప్తం.

Source http://bonjanrao.blogspot.com/2012/10/moreshwar-w-pradhan.html
http://www.saiamrithadhara.com/mahabhakthas/moreshwar_w_pradhan.html
Devotees Experiences of Sri Saibaba part II by Pujya Sri B.V.Narasimha Swamiji

ముందు భాగం కోసం బాబా పాదుకలు తాకండి. 

4 comments:

  1. Om sai sri sai Jaya Jaya sai, on sai sri sai Jaya Jaya sai, om sai sri sai Jaya Jaya sai, om sai sri sai Jaya Jaya sai 🙏🙏🙏🙏

    ReplyDelete
  2. ఓం శ్రీ సాయిరాం తాతయ్య 🙏🙏🙏

    ReplyDelete
  3. Om sai ram, anta bagunde la chayandi , nannaki chayi noppi tagge la chayandi, edaina tappu cheste kshaminchandi tandri pls, ofce lo anta bagunde la chayandi, na manasuki nachakunda yedi jaragakunda chudandi tandri pls.

    ReplyDelete
  4. Om sai ram, nannaki cheyi noppi alage kaali noppi taggela chayandi tandri, daani valla ye pramadam lekunda chayandi tandri pls, anni baralu me meede vesthunna, tagginche badyata meede tandri meeru tappa nayam chayataniki cheppukotaniki inka evaru leru tandri.

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo