సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1581వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. భక్తుని చెదరని విశ్వాసం - లోన్ వచ్చేలా అనుగ్రహించిన బాబా
2. బాబాతో చెప్పుకోగానే ప్లాటు అమ్మకానికి కుదిరిన బేరం

భక్తుని చెదరని విశ్వాసం - లోన్ వచ్చేలా అనుగ్రహించిన బాబా


ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై!!!

ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!!!


సాయిభక్తులందరికీ నా నమస్కారములు. నా పేరు చంద్రశేఖర్. 2022, డిసెంబర్ నెల నుండి నేను నాకు డబ్బు అవసరమై మా ఇంటిపై లోన్ తీసుకోవడం కోసం బ్యాంకువాళ్ళను సంప్రదిస్తున్నాను. ఆ క్రమంలో చాలామంది బ్యాంకువాళ్ళు "మీ ఇంటి దస్తావేజులు  మీ నాన్నగారి పేరు మీద ఉన్నాయి. ఆయన వయస్సు ఎక్కువైనందున లోన్ ఇవ్వలేము" అని అన్నారు. అప్పుడు నేను, 'మనకు సాయిబాబా ఉన్నారు. ఆయనే నాకు సహాయం చేస్తారు' అనుకొని, "బాబా! మీరే మాకు బ్యాంకు లోన్ ఇప్పించాలి తండ్రీ. మిమ్మల్నే నమ్ముకున్నాను దయచూపించు తండ్రీ. నాకు లోన్ వచ్చేవరకు నాకు ఇష్టమైన కాయగూర తినను" అని బాబాకు మొక్కుకున్నాను. అలాగే నాకిష్టమైన కాయగూర తినడం మానేసాను. కానీ ఏ బ్యాంకువాళ్ళు దయ చూపలేదు. దాంతో మరలా సాయిబాబా(ఫోటో) ముందు నిలబడి, "సాయీ! నాకు లోన్ ఇప్పించి ఆర్థిక ఇబ్బందుల నుండి నన్ను రక్షించు తండ్రీ" అని వేడుకొని సాయిసచ్చరిత్ర రెండుసార్లు, సాయిలీలామృతం రెండుసార్లు పారాయణ చేసాను. అయినా బ‌్యాంకువాళ్ళు ఏదో ఒక కారణం చెప్పి లోన్ ఇవ్వడానికి తిరస్కరించారు. అయినా నేను చెదరని విశ్వాసంతో ప్రతిరోజూ బాబా ముందు నిలబడి, "బాబా! నాకు లోన్ ఇప్పించు తండ్రీ" అని అడుగుతూ ఉండేవాడిని. అప్పుడొకరోజు నేను నా ఆఫీసు పని మీద వేరే ఊరు వెళ్ళాను. అక్కడ 'ఇంటిపై లోన్ ఇవ్వబడును' అని ఉన్న ఒక బోర్డు నా కంటపడింది. ఆ బోర్డు మీద ఉన్న నెంబరుకు ఫోన్ చేస్తే, ఆ బ్యాంకు ఆయన "మీకు ఎంత డబ్బు కావాలి? ఎన్ని సంవత్సరాలు కడతారు?" అని అడిగారు. నేను ఆయనతో 'నాకు ఇంత డబ్బు కావాలి, ఇన్ని సంవత్సరాలు కడతాను' అంటే "మా దగ్గర ఎక్కువ సంవత్సరాలు కట్టడానికి ఉండదండి. కానీ నాకు తెలిసిన వేరే బ్యాంకు అతనిని మీ దగ్గరకు పంపిస్తాను. అతనితో మాట్లాడండి. మీకు లోన్ ఇస్తారు" అని చెప్పారు. చెప్పినట్లే, 2023, ఫిబ్రవరిలో ఒక బ్యాంకు అతనిని మా ఇంటికి పంపించారు. నేను అతనికి అన్ని వివరాలు చెపితే, "మేము మీకు లోన్ ఇస్తాం" అని చెప్పారు. అంతా బాబా దయ అనుకున్నాను. ఆ బ్యాంకువాళ్ళు లోన్ ప్రక్రియ మొదలుపెట్టి, మా కుటుంబసభ్యుల సంతకాలు మొదలైనవి తీసుకున్నారు. తర్వాత 'మీకు లోన్ శాంక్షన్ అయింది' అని మెసేజ్ చేసారు. నేను ఆ మెసేజ్ చూసి బ్యాంకువాళ్ళకి ఫోన్ చేస్తే, ఏవో కారణాలు చెప్పి "మీకు లోన్ రావడానికి ఆలస్యం అవుతుంది" అన్నారు. నేను సాయిబాబాను, "మీ దయ చూపించి నాకు లోన్ ఇప్పించు తండ్రీ. నాకు లోన్ వస్తే, మీ అనుగ్రహాన్ని బ్లాగు ద్వారా తోటి భక్తులతో పంచుకుంటాను బాబా" అని ప్రతిరోజూ ప్రార్థిస్తూ ఉండేవాడిని. బాబా నా మీద దయతో బ్యాంకువాళ్ళ మనసు మారేలా చేసి 2023, జూలై 12న చెక్ నా చేతికి అందేలా చేసారు. నేను అదేరోజు బ్యాంకుకి వెళ్లి చెక్ డిపాజిట్ చేస్తే, జూలై 13న నా బ్యాంకు అకౌంటులో డబ్బులు జమ అయ్యాయి. ఇదంతా సాయిబాబా దయ. "సాయిబాబా! మీకు మాటిచ్చినట్లు నా అనుభవాన్ని బ్లాగులో పంచుకున్నాను. అందరూ బాగుండాలి సాయి. నాకు మంచి జీవితాన్ని ప్రసాదించు. తండ్రీ, దయ చూపు".


బాబాతో చెప్పుకోగానే ప్లాటు అమ్మకానికి కుదిరిన బేరం


ఓం శ్రీసాయినాథాయ నమః!!! సాయి మహారాజ్‌కు, సాయిబంధువులకు నా నమస్కారాలు. నా పేరు మహేష్. నేను 2021లో ఒక బ్రోకర్ మాటలు నమ్మి మరుసటి సంవత్సరం పలికే ధరను అప్పుడే పెట్టి ఒక ప్లాటు కొన్నాను. అతను అలానే నా చేత ఇంకో రెండు ప్లాట్లు కూడా కొనిపించి, "మంచి లాభాలకు నేనే వాటిని అమ్మిస్తాను" అని నన్ను బాగా నమ్మపలికాడు. నేను అతన్ని పూర్తిగా నమ్మాను. కానీ ఒక సంవత్సరం తర్వాత ఆ ప్లాట్లను అమ్మిపెట్టమని అతనిని అడిగితే, "ఎవరూ కొనడానికి ముందుకు రావట్లేదు. వచ్చినా తక్కువ ధరకి అడుగుతున్నారు. ఇచ్చేస్తావా?" అని అన్నాడు. అప్పుడు నాకు అతని నిజస్వరూపం అర్థమైంది. ఇతని మాటలు నమ్మి నేను మూడు ప్లాట్లు కొన్నాను, తొందరపడ్డాను అని నా తప్పు తెలుసుకున్నాను. ఇక నా ప్రయత్నం నేను చేశాను. చాలామంది బ్రోకర్లకి చెప్పాను. ఆరు నెలలు గడిచాయి. అందరూ, "నువ్వు ఎక్కువ ధర పెట్టి కొన్నావు. ఇప్పుడైతే అంత ధర లేదు, ఇంతే వస్తుంది" అని తక్కువ ధర చెప్పేవారు. నేను చేసేది లేక సరేనని స్వల్ప లాభానికి రెండు ప్లాట్లు అమ్మేసాను. ఇంకా ఒక ప్లాటు మిగిలింది. దాన్ని అమ్మకానికి పెడితే బ్రోకర్లు అందరూ కలిసి ఏవో కారణాలతో అమ్మకుండా చేస్తుండేవారు. నాకు చాలా బాధేసి బాబాతో, "బాబా! ఆ ప్లాట్ ఎవరైనా తీసుకుంటే, మీ అనుగ్రహాన్ని 'సాయి మహరాజ్ సన్నిధి'లో పంచుకుంటాన"ని చెప్పుకున్నాను. అలా బాబాతో చెప్పుకోగానే ఒకరి ద్వారా స్వల్ప లాభంతో ప్లాటు అమ్మకానికి బేరం కుదిరి అడ్వాన్సు ఇచ్చారు. కానీ ఎవరైనా అడ్డు తగులుతారేమోనని నాకు ఒకటే బాధేసింది. అలా జరగకుండా బాబానే దగ్గరుండి 2023, జూలై 12న ఆ ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేయించి నా చేతికి డబ్బు వచ్చేలా అనుగ్రహించారు. తరువాత బాబాని అడిగితే, 'వ్యవసాయ భూమి కొనమ'ని సందేశమిచ్చారు. వారి ఆదేశం మేరకు ఆ డబ్బుతో వ్యవసాయ భూమి కొనడానికి నిర్ణయించుకున్నాను. ఈ అనుభవం ద్వారా 'ఎవరినీ అంత గుడ్డిగా నమ్మకూడదు' అని బాబా తెలియజేసారు. "ధన్యవాదాలు బాబా".


సాయిభక్తుల అనుభవమాలిక 1580వ భాగం....


ఈ భాగంలో అనుభవం:

  • మన సాయిబాబా - మన ప్రతి మాట వింటారు

ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!!! సాయిభక్తులందరికీ నా నమస్కారాలు. నా పేరు కుమారి. మా అన్నయ్యవాళ్ల 4 సంవత్సరాల పాపకి తిరుపతి మొక్కు ఉంది. అయితే వాళ్ల ఆర్థిక పరిస్థితి సరిగా లేనందున ఆ మొక్కు ఎలా తీర్చాలని వాళ్ళు బాధపడుతుండేవాళ్లు. ఆ విషయం గురించి నేను బాబాకి చెప్పుకొని, "బాబా! అన్నయ్యవాళ్లు ఎలాగైనా ఈ సంవత్సరం తిరుపతి వెళ్లి మొక్కు తీర్చుకోవాలి. అలా అయితే మీ అనుగ్రహాన్ని నేను బ్లాగులో పంచుకుంటాను" అని వేడుకున్నాను. కొన్నిరోజుల తర్వాత అన్నయ్యవాళ్ళు, "తిరుపతి వెళ్తున్నాము. మీరూ వస్తారా?" అని మమ్మల్ని అడిగారు. మొదట మేము రామని చెప్పాము కానీ, మా అమ్మకి కూడా మొక్కు ఉన్నందున తర్వాత సరేనని చెప్పాము. ఇది 2023, మేలో జరిగింది. వెంటనే జూన్ 22కి ట్రైన్ టిక్కెట్లు బుక్ చేసుకున్నాము. అవి వెయిటింగ్ లిస్టులో ఉన్నప్పటికీ కంఫర్మ్ అయిపోతాయి అనుకున్నాం. ఇక దర్శనం టిక్కెట్లు, రూములకోసం ఆన్లైన్‌లో చూస్తే, ఫుల్ అయిపోయి వున్నాయి. దాంతో అక్కడికి వెళ్లి చూసుకుందామని అనుకున్నాము. నేను, "బాబా! దర్శనం, రూమ్స్ విషయంలో ఏటువంటి ఇబ్బంది లేకుండా ఉంటే మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి చెప్పుకొని ఆయన మీద భారం వేశాను. సరిగా ఒక వారం ముందు రైల్వేస్టేషన్‌లో అడిగితే, "టిక్కెట్లు కంఫర్మ్ కాలేదు, ఇక కావు. క్యాన్సల్ చేసుకోండి" అని చెప్పారు. అప్పుడు మేము సరేలే తత్కాల్ టిక్కెట్లు ప్రయత్నిద్దాము అనుకున్నాము. నేను అయితే 'బాబా ఏదో ఒకటి చేస్తార'ని ఆయన మీద నమ్మకం ఉంచాను. 


ఇంతలో హఠాత్తుగా మా అమ్మకి విపరీతంగా దగ్గు వచ్చి అస్సలు తగ్గలేదు. రెండు రోజులు నిరంతరాయంగా అమ్మ దగ్గుతూనే ఉంది. తనకి ఆస్త్మా ఉంది. హాస్పిటల్‌కి వెళితే, డాక్టర్ చెక్ చేసి టెస్టులు, ఎక్స్-రే వ్రాశారు. మేము "ఈ స్థితిలో తిరుపతి వెళితే పర్వాలేదా?" అని డాక్టరుని అడిగాం. అందుకు డాక్టరు, "మరుసటి వారం రిపోర్టులు వస్తేగానీ ఏం చెప్పలేను" అన్నారు. నేను, "బాబా! నువ్వే దిక్కు. రిపోర్టులు నార్మల్‌గా వచ్చి, తిరుపతి వెళ్ళమని డాక్టరు చెపితే, మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి చెప్పుకున్నాను. అమ్మకి రోజూ ఊదీ పెట్టి, ఊదీ కలిపిన నీళ్లు ఇస్తూ 'ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః' అనే నామాన్ని నిత్యం పఠిస్తూ ఉండేదాన్ని. మరుసటి వారం రిపోర్టులు వచ్చాయి. బాబాని తలుచుకొని డాక్టర్ దగరకి వెళితే, డాక్టర్ రిపోర్టులు చూసి, "ఏం పర్లేదు. టాబ్లెట్లు వాడండి" అని అన్నారు. నేను వెంటనే నా మనసులో బాబాకి ధన్యవాదాలు చెప్పుకున్నాను. ఇంతలో డాక్టరు, "తిరుపతి వెళ్ళండి. రెండు వారాల తర్వాత మళ్ళీ రండి" అని అన్నారు. అంతా బాబా దయ.


అయితే తత్కాల్‌లో ట్రైన్ టిక్కెట్లు బుక్ అవ్వలేదు. అందరూ ఇక తిరుపతి ప్రయాణం క్యాన్సల్ అనుకున్నారు. కానీ నేను, "బాబా! మీరే ఏదో ఒకటి చేయండి" అని బాబాని అడిగాను. అకస్మాత్తుగా మా తమ్ముడువాళ్ల ఫ్రెండ్ ఫోన్ చేసి, "అక్కా! రేపటికి ఒక ట్రైన్‌కి టిక్కెట్లు అందుబాటులో ఉన్నాయి" అని చెప్పాడు. అది విని నేను షాకయ్యాను. ఆనందంగా ఆ ట్రైన్‌కి టిక్కెట్లు బుక్ చేసుకున్నాము. తిరుపతి చేరుకున్నాక రైల్వేస్టేషన్ సమీపంలోనే మాకు దర్శనం టిక్కెట్లు కూడా దొరికాయి. కొండపైకి వెళ్ళాక మాకు రెండురోజులకి రూమ్స్ దొరకడంతో మేము అందరం షాకయ్యాము. కేవలం 5 గంటల సమయంలో మాకు వేంకటేశ్వరస్వామి దర్శనం చాలా బాగా జరిగింది. అంతా బాబా దయ. చివరిరోజున శ్రీకాళహస్తి వెళ్లి, దర్శనం చేసుకొని, అదేరోజు ట్రైన్ ఎక్కి తిరిగి ఇంటికి చేరుకున్నాము. అసలు వెళ్ళమనుకుంటే వెళ్ళేలా చేసి మా యాత్ర అంతా మాకు చాలా సహాయం చేశారు బాబా. 'బాబా' అని పిలిస్తే చాలు, పలుకుతారు.


ఇంటికి వచ్చిన 3 రోజుల తర్వాత మా అమ్మకి మళ్ళీ ఆరోగ్యం బాగాలేకపోతే అమ్మని తీసుకొని మళ్లీ డాక్టర్ దగరకు వెళ్ళాము. డాక్టరు, "ఊరు వెళ్ళారు కదా! ఇన్ఫెక్షన్‌లా అయింది. టాబ్లెట్స్ ఇస్తాను, ఒక వారం వాడి రండి" అన్నారు. అయితే అమ్మకి దగ్గు అస్సలు తగ్గలేదు. మూడురోజులు నిరంతరాయంగా అమ్మ దగ్గుతూనే ఉంది. రాత్రి పడుకునేది కాదు, ఆహారం కూడా తినేది కాదు. అందువల్ల అమ్మ బరువు తగ్గిపోతుంటే నాకు చాలా భయమేసింది. రోజూ అమ్మకి ఊదీ పెట్టి, ఊదీ నీళ్లు ఇస్తూ, 'ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః' అనే నామాన్ని చెప్పుకున్నాను. అయినా అమ్మకి తగ్గలేదు. మా చిన్నప్పుడు ఒకసారి అమ్మకి టీబీ వచ్చిందంట. డాక్టర్ కూడా, "మీకు టీబీ వచ్చి ఎన్ని సంవత్సరాలైంది" అని అడిగారు. అందువల్ల 'అమ్మకి మళ్లీ టీబీ వచ్చిందేమో, దగ్గు తగ్గకపోతే టీబీ టెస్టు చేస్తారేమో' అని నాకు చాలా భయమేసింది. అందువల్ల డాక్టర్ ఒక వారం తర్వాత రమ్మని చెప్పినప్పటికీ అమ్మకి దగ్గు తగ్గని కారణంగా ముందుగానే శుక్రవారం హాస్పిటల్‌కి వెళదామని అనుకొని గురువారంనాడు నేను బాబా గుడికి వెళ్లి, "అమ్మ ఆరోగ్యం బాగుండాలి సాయి. అమ్మకి దగ్గు తగ్గి టెస్టులు ఏమీ లేకుండా టాబ్లెట్లు ఇస్తే, మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాతో చెప్పుకున్నాను. కానీ ఆరోజు అమ్మకి చాలా ఎక్కుగా దగ్గు వచ్చింది. నేను, "బాబా! నువ్వే దిక్కు" అని అనుకున్నాను. బాబా దయవల్ల ఆరోజు రాత్రి నుండి దగ్గు కొంచం కొంచంగా తగ్గుతూ వచ్చింది. అందువల్ల మేము శుక్రవారం డాక్టర్ దగరకి వెళ్ళలేదు. కానీ సోమవారం వరకు అమ్మకు దగ్గు వస్తూనే ఉంది, కాకపోతే అంత ఎక్కువగా కాదు, చాలా స్వల్పంగా. హఠాత్తుగా అంతలా ఎలా తగ్గిందో! అది బాబా మిరాకిల్.  


ఇక విషయానికి వస్తే, మా తమ్ముడు అమ్మని తీసుకొని హాస్పిటల్‌కి వెళ్ళాడు. నేను, "బాబా! డాక్టరు టాబ్లెట్లు మాత్రమే ఇవ్వాలి, టెస్టులు ఏమీ వ్రాయకూడదు" అని బాబాకి చెప్పుకున్నాను. అప్పటివరకు జరుగుతున్న ఈ అనుభవం అంతా ఒక పుస్తకంలో వ్రాస్తున్న నేను, 'చివరిలో ఏం వ్రాయాలి? డాక్టర్ ఏం చెప్తారు?' అని అనుకుంటున్నంతలోనే మా తమ్ముడు ఫోన్ చేసి, "డాక్టరు టాబ్లెట్లు ఇచ్చారు. ఒక నెల తర్వాత మళ్లీ రమ్మన్నారు" అని చెప్పాడు. నేను చాలా షాకయ్యను, అస్సలు మాటలు రాలేదు. కన్నీళ్ల పర్యంతమవుతూ బాబా దగరకి వెళ్లి ధన్యవాదాలు చెప్పుకున్నాను. ఇంకేం చెప్పాలో నాకు తెలియడం లేదు. మన సాయిబాబా ఉన్నారు - పిలిస్తే పలుకుతారు. మన సాయిబాబా - మన ప్రతి మాట వింటారు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా. ఏదైనా అనుభవం పంచుకోవడం మర్చిపోయినా, అలాగే తెలిసీతెలియక ఏదైనా తప్పు చేసినా క్షమించు సాయి. అమ్మ ఆరోగ్యం అస్సలు బాగుండట్లేదు, ఎప్పుడూ ఏదో ఒక సమస్య వస్తుంది. తను ఆరోగ్యంగా ఉండేలా చూసే భాధ్యత మీదే సాయి. మాకు మీరు తప్ప ఎవరూ లేరు సాయి. నా కష్టం నీకు తెలుసు, సహాయం చేయి సాయి. అందరికీ తోడుగా ఉండండి బాబా".


సాయిభక్తుల అనుభవమాలిక 1579వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. ఫిస్టులా బాధ నుండి బయటపడేసిన బాబా
2. ప్రతి విషయంలో తోడుగా ఉంటున్న బాబా

ఫిస్టులా బాధ నుండి బయటపడేసిన బాబా


సాయిబంధువులకు నమస్కారం. నా పేరు గురుప్రసాద్. నేను సాఫ్ట్వేర్ ఉద్యోగిని. ఆస్ట్రేలియాలో ఉంటున్నాను. నాకు 2022, మే 7న ఇండియాలో ఫిస్టులా ఆపరేషన్ జరిగింది. తరువాత 2022, అక్టోబరులో నేను మా కుటుంబసభ్యుల కోసం వీసాకి అప్లై చేశాను. 2023, జూన్ 13న వీసాలు వచ్చాయి. దాంతో నేను మా కుటుంబసభ్యులను ఆస్ట్రేలియా తీసుకెళ్లడానికి 2023, జూన్ 22న ఇండియా వచ్చాను. తీరా ఇక్కడికి వచ్చాక నాకు అదివరకు ఆపరేషన్ జరిగిన చోట కొంచెం నొప్పి మొదలై, రసి కూడా కారసాగింది. దాంతో నేను మళ్లీ నాకు ఆపరేషన్ చేసిన డాక్టర్ దగ్గరకి వెళితే, డాక్టర్ చూసి, "మళ్ళీ ఆపరేషన్ చేయాలి" అన్నారు. నేను, "అదేంటి గత సంవత్సరం ఆపరేషన్ పూర్తిగా  విజయవంతమైందని అన్నారు కదా!" అని అడిగితే, "ఆ సమస్య మళ్ళీ వచ్చే అవకాశం కూడా ఉంద"ని అన్నారు. నాకు ఏమి చేయాలో అర్థంకాక మాకు తెలిసిన ఒక డాక్టర్ని సంప్రదించాను. అతను చూసి "ఫిస్టులా సమస్య మళ్ళీ వచ్చింది" అని అన్నారు. నేను, "గత సంవత్సరం లేజర్ ట్రీట్మెంట్ చేసారు" అని చెప్తే, "ఫిస్టులాకి లేజర్ ట్రీట్మెంట్ ఎలా చేస్తారు?" అని నన్ను కొన్ని టెస్టులకి పంపించారు. వాటి రిజల్ట్స్ వచ్చాక "మలద్వారం వద్ద ఫిస్టులా ఏర్పడి ఒక వైపు 7cm, మరో వైపు 1.1mm ఇన్ఫెక్షన్ వెళ్ళింది. రెండుసార్లు ఆపరేషన్ చేయాలి" అని అన్నారు. నేను ఎప్పుడు ఏ విషయంలో అయినా ముందు బాబాకి చెప్పుకుంటాను. అందువల్ల, "బాబా! నాకు నువ్వే దిక్కు. నాకు ఆపరేషన్ నువ్వే చేయాలి" అని మనసులో గట్టిగా బాబాని ప్రార్థించాను. బాబా దయవల్ల జూన్ 28న ఆపరేషన్ జరిగింది. డాక్టరు "ఒక ఆపరేషన్ సరిపోతుంది, రెండో ఆపరేషన్ అవసరం లేద"ని చెప్పారు. నేను ఆ డాక్టరు రూపంలో బాబానే నాకు ఆపరేషన్ చేసారని భావించి చాలా ఆనందపడ్డాను. ఆపరేషన్ అనంతరం బాగా నొప్పులు ఉంటే, "బాబా! ఒక వారం రోజుల్లో నాకు నయమైతే మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాతో చెప్పుకున్నాను. తర్వాత 'బాబా బాబా' అనుకుంటూ పడుకుంటే నిద్రలో హఠాత్తుగా నా శరీరం ఒకసారి కదిలింది. నిజానికి నేను అయితే నొప్పి వల్ల అస్సలు కదలలేను. అలా బాబానే నన్ను కదిలించారని గ్రహించాను. సరిగ్గా ఆపరేషన్ జరిగిన రెండు వారాల తర్వాత గురువారం వచ్చే లోపు నొప్పులు చాలావరకు తగ్గి మాములుగా నడవగలిగాను. ఇదంతా బాబా చేసిన అద్భుతలీల. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".


ప్రతి విషయంలో తోడుగా ఉంటున్న బాబా


సాయిభక్తులకి నమస్కారం. నేను ఒక సాయిభక్తుడిని. ఒకరు నన్ను ఏదో ఒకటి అని ఎగతాళి చేస్తుండేవారు. తను మనసులో ఏదో పెట్టుకొని కావాలనే అలా చేస్తున్నారని నాకు అర్థమైనందువల్ల, 'ఇలా చేసి, నన్ను ఇబ్బందిపెట్టొద్ద'ని నేను ఎప్పుడూ తనతో  చెప్పలేదు. ఎందుకంటే, నేను ఏమన్నా కూడా నన్ను బ్యాడ్ చేస్తారని నాకు అనిపించింది. అందుచేత నేను బాబాను, "దయచేసి తను ఎగతాళి చేయడం ఆపేలా చూడు బాబా" అని వేడుకున్నాను. బాబా దయవల్ల తను ఇప్పుడు నన్ను ఏమీ అనడం లేడు, నన్ను టార్గెట్ చేయడం మానేశారు. నాపై అసూయతో అలా నన్ను ఇబ్బందిపెట్టారని నాకిప్పుడు అర్థమైంది.


ఒకరోజు మా పొలంలోని మోటర్ ఆన్ చేయగానే బోర్డులో నుండి పొగలు వచ్చాయి. వెంటనే మోటారు ఆపేసాము. కానీ బోర్డులో నుండి పొగలు వస్తున్నాయంటే బోర్డులో ఏదో జరిగిందని నా మనసుకనిపించి చాలా బాధ కలిగింది. ఎందుకంటే, ఎప్పటికప్పుడు ఏదో ఒక రిపేర్ చేయిస్తునే వున్నా మళ్ళీ ఈ కష్టం వచ్చింది. అకస్మాత్తుగా నాకు బాబా గుర్తొచ్చి, "బాబా! ఏ సమస్యా లేకుండా చూడు తండ్రీ. మీ అనుగ్రహాన్ని బ్లాగు ద్వారా తోటి భక్తులతో పంచుకుంటాను" అని బాబాతో చెప్పుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ మోటార్ ఆన్ చేసి ఒక పది నిమషాలు రన్ చేశాను. ఈసారి ఏ సమస్యా రాలేదు. "ఇలా ప్రతి విషయంలో నాకు తోడుగా ఉంటున్నందుకు థాంక్యూ బాబా. నేను అప్పుడప్పుడు మిమ్మల్ని కొన్ని అడుగుతూ ఉంటాను. నా యందు దయ ఉంచి వాటిని కూడా తీరుస్తారని ఆశిస్తున్నాను".


సాయిభక్తుల అనుభవమాలిక 1578వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. శ్రీసాయి అనుగ్రహం
2. బాబా దయతో చేకూరుతున్న ఆరోగ్యం

శ్రీసాయి అనుగ్రహం


సాయిబంధువులకు నమస్కారం. నేను ఒక సాయిభక్తురాలిని. నాకిప్పుడు 45 సంవత్సరాలు. నేను నా చిన్నతనంలో ఎప్పటినుంచి బాబాను ప్రార్థించడం మొదలుపెట్టానో స్పష్టంగా గుర్తులేదుగాని, నాకు దాదాపు 11 సంవత్సరాల వయస్సున్నప్పుడు నా కంటే ఒక సంవత్సరం చిన్న అయిన నా జూనియర్ ఒక అమ్మాయి బయట ఆడుకుంటున్నప్పుడు తన చేతికి ఫొటోలతో ఉన్న పిల్లల బాబా పుస్తకం దొరికింది. నేను ఆ పుస్తకం మొత్తం చదివాను. ఆ తర్వాత ఒకరోజు మా నాన్న నాకోసం ఒక లక్ష్మీదేవి వెండి ఉంగరం తీసుకుందామని నన్ను ఒక నగల దుకాణానికి తీసుకెళ్లారు. కానీ నేను సాయిబాబా ఉంగరం కొనమని నాన్నని అడిగాను. ఆ సమయంలో నేను బాబా ఉంగరం అడగడానికి కారణమేమిటో నాకు తెలియదు కానీ, ఇప్పుడు ఈ వయస్సులో బాబా నన్ను ఆ విధంగా తమ వైపుకు ఆకర్షించారని నేను బలంగా నమ్ముతున్నాను.


ఆ తరువాత నేను నా చదువులో బిజీ అయిపోయాను. నేను ఎంసెట్ వ్రాసినప్పుడు మా అత్తలలో ఒకరికి ఒక మంచి వృత్తి విద్య కళాశాలలో నాకు సీటు వచ్చినట్టు కల వచ్చింది. దాంతో మా అమ్మ, అత్త నేను ఖచ్చితంగా ఒక మంచి కాలేజీలో చేరతానని నమ్మారు. వాళ్ళ నమ్మకమే నిజమైంది. నిజాయితీగా చెప్పాలంటే నేను మాత్రం ఆ కల గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. నేను నా చదువులలో నిమగ్నమైపోయి పూర్తిగా బాబాని నిర్లక్ష్యం చేశానని చెప్పవచ్చు. కానీ ఇప్పుడు ఈ వయసులో ఆలోచిస్తుంటే నా చిన్ననాటినుంచి బాబా నన్ను చూసుకుంటున్నారని అనిపిస్తుంది.


నా ఇంజనీరింగ్ పూర్తయ్యాక ఉద్యోగ ప్రయత్నాలు చేశాను కానీ, నాకు ఉద్యోగం రాలేదు. దాంతో నేను చాలా కృంగిపోయాను. ఆ సమయంలో నేను 'దేవుళ్ళు'  సినిమా చూసాను. ఆ సినిమా తిరిగి నన్ను బాబాకి చేరువ చేసింది. బాబా దయతో రెండు, మూడు నెలలలో నాకు ఒక ఉద్యోగం వచ్చింది. అయితే, నేను ఆ ఉద్యోగం కేవలం ఆరు నెలలే చేశాను.


నాకు పెళ్ళైయ్యాక మొదటిసారి నేను గర్భవతిగా ఉన్నప్పుడు తొలి నెలల్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ఆ సమయంలో నేను నా పరిస్థితి చాలా దారుణంగా ఉంటుందేమో అని భయపడ్డాను. అయితే బాబా చమత్కారాన్ని చూడండి! ఆయన నన్ను వదలి పెట్టలేదు. "అంతా బాగుంటుంద"ని స్పష్టమైన సూచనలిచ్చారు. ఆయన చెప్పినట్లే నేను ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనిచ్చాను. రెండోసారి గర్భవతిగా ఉన్నప్పుడు నేను మానసికకంగా కృంగిపోయి చాలా ఇబ్బందిపడ్డాను. అప్పుడు కూడా బాబా కృపవల్ల నేను ఆ క్లిష్ట పరిష్టితి నుండి బయటపడ్డాను. ఇంకా ఆర్థికంగా నష్టపోయి కష్టంలో ఉన్నప్పుడు నాకు, నా కుటుంబానికి చాలా సహాయం చేసి మాకు రక్షణనిచ్చారు బాబా.


నేను, మా చెల్లి అమెరికాలో ఉంటున్నాము. బాబా దయతో నాకు అమెరికన్ సిటిజెన్షిప్ వచ్చింది. ప్రస్తుతం నేను వృద్ధాప్యంలో నా తల్లిదండ్రులకి చేతకానప్పుడు వాళ్ళ బాధ్యత తీసుకోవాల్సిన అవసరం గురించి వాళ్ళ ఇద్దరు కూతుళ్లలో ఒకదానిగా ఆలోచిస్తున్నాను. కానీ పెద్ద కూతురుగా నేను ఆ బాధ్యతను ఎలా నెరవేర్చగలనని ఎప్పుడూ భయపడుతూ సదా బాబాని, "దయచేసి నాతో ఉండి నా బాధ్యతను నెరవేర్చేలా చూడండి" అని వేడుకుంటున్నాను. 2023, జూలై 3, గురుపూర్ణిమనాడు నేను బాబా గుడికి వెళ్ళేముందు "బాబా! మీ మూర్తి మీద నుండి పువ్వు జారేలా చేసి నేను నా బాధ్యతను విజయవంతంగా పూర్తి చేస్తానన్న సంకేతాన్ని ఇవ్వండి" అని బాబాను ప్రార్థించి గుడికి వెళ్ళాను. నేను బాబాకి ఎదురుగా ఉండగా ఒక స్త్రీ బాబా మూర్తిని తాకడానికి ప్రయత్నించింది. ఆ క్రమంలో బాబా మూర్తి మీద నుండి ఒక పువ్వు కిందకి జారిపడింది. ఆ విధంగా బాబా నన్ను ఆశీర్వదించడంతో 'బాబా చూసుకుంటార'నే విశ్వాసం కలిగి ఆ పువ్వు ఇంటికి తెచ్చుకున్నాను. నేను బాబాను తమ వెండి లాకెట్‌ను నాకు ప్రసాదించమని అడిగాను. బాబా దాన్ని ఖచ్చితంగా అనుగ్రహిస్తారని అనుకుంటున్నాను. ఇప్పుడు ఇవన్నీ వ్రాస్తుంటే నేను బాబా శ్రద్ధ వహించాల్సిన పిచ్చుకనని, భగవంతుడు ఆయనకి అప్పగించిన పైసానని అనిపిస్తుంది. బాబా ఎల్లపుడూ తమ భక్తులను గమనిస్తూ ఎప్పుడూ వాళ్ళతో ఉంటారు. నేను బాబా చెప్పేది పాటించాలి, ఆయన నన్ను సన్మార్గంలో నడిపిస్తారు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా". 


సాయినాథార్పణమస్తు!!!


బాబా దయతో చేకూరుతున్న ఆరోగ్యం


నా పేరు ధనలక్ష్మి. రెండు సంవత్సరాల నుండి నా చేయి, కాలు ఒక వైపు లాగుతూ ఉన్నాయి. ఆసుపత్రికి వెళ్లినా నయం కాలేదు. మేము ఒక సిమెంటు ఫ్యాక్టరీలో ఉండేవాళ్ళం. అక్కడ బాబాని బాగా కొలిచేవారు. నాకు బాబా అంటే అంతగా నమ్మకం ఉండేది కాదు. కానీ ఒకరోజు బాబా మెసేజ్ చదువుతున్నప్పుడు నాకు తెలియకుండానే బాబా మీద నమ్మకం, ఇష్టం కలిగి "నా రోగం నయం చేయమ"ని బాబాని అడిగి, 'శిరిడీ వస్తాన'ని అనుకున్నాను. బాబా దయవల్ల ఇప్పుడు నా రోగం 85% తగ్గింది. 2023, జూలైలో శిరిడీ వెళ్తున్నాను. బాబా దయవల్ల నేను ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను.


సాయిభక్తుల అనుభవమాలిక 1577వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. చాలా సంవత్సరాల తర్వాత బాబా ప్రసాదించిన శిరిడీ దర్శనభాగ్యం
2. బాబా వల్లే సంతోషం

చాలా సంవత్సరాల తర్వాత బాబా ప్రసాదించిన శిరిడీ దర్శనభాగ్యం


సాయిభక్తులకు ప్రణామాలు. నా పేరు శ్రీకాంత్. బాబా అనుమతి లేనిదే ఎవ్వరూ శిరిడీ వెళ్లలేరని మన అందరికీ తెలిసిందే! మేము చాలా రోజుల నుంచి శిరిడీ వెళ్లి బాబా దర్శనం చేసుకోవాలని అనుకుంటున్నప్పటికీ వెళ్లలేకపోయాము. 2022లో శిరిడీ వెళ్లాలని ప్రణాళిక వేసుకొని రైలు టిక్కెట్లు, దర్శనం టిక్కెట్లు, వసతి అన్నీ బుక్ చేసుకున్నాము. అప్పటికి చాలా రోజులు ముందు నుండి, "నేను కోరుకొనే ప్రమోషన్ నాకు రావాల"ని నేను బాబాను ప్రార్థిస్తున్నాను. హఠాత్తుగా బాబా అనుగ్రహించారు. నాకు ప్రమోషన్ వచ్చి వేరే నగరానికి బదలీ అయింది. దాంతో మా శిరిడీ ప్రయాణం రద్దు అయ్యింది. తరువాత 2023, మే-జూన్‌లో మేము శిరిడీ వెళ్ళడానికి ప్రణాళిక వేసుకొని ముందుగా టిక్కెట్లు మొదలైన అన్ని బుక్ చేసుకున్నాము. తదనుగుణంగా 2023, మే 31న మేము మా ప్రయాణం మొదలుపెట్టాము. అప్పుడు మా సహనానికి అసలైన పరీక్ష మొదలైంది. మాతోపాటు డబై సంవత్సరాల వయస్సున్న మా అమ్మ శిరిడీ వస్తున్నందున మేము ఆమె సౌకర్యం కోసం చాలా జాగ్రత్తలు తీసుకున్నాము. కానీ మా ట్రైన్ ఆరు గంటలు ఆలస్యంగా వచ్చింది. దాంతో ఆదిలోనే మా మనసు పాడైపోయింది. ఏదేమైనా బాబాపై విశ్వాసముంచి మేము రైలెక్కి మా ప్రయాణాన్ని ప్రారంభించాము. రైలు ఆలస్యం రానురానూ అధికమవుతూ చివరికి 8 గంటలు ఆలస్యంగా 2023, జూన్ 2, ఉదయం 7:45కి మేము మన్మాడ్ చేరుకున్నాము. నేను చాలా చాలా సంవత్సరాల తర్వాత శిరిడీ వెళ్తున్నందున మన్మాడ్ చేరుకోగానే, "మా విషయంలో అన్నీ జాగ్రత్తగా చూసుకోండి బాబా" అని బాబాను ప్రార్థించాను. మేము ట్రైన్ దిగుతూనే మా వద్ద‌కి తెల్లగా, పొడవుగా, నుదుటన ఊదీ ధరించి ఉన్న వ్యక్తి పెద్దగా నవ్వుతో వచ్చి, "మీరు శిరిడీ వెళ్తున్నారా?" అని అడిగాడు. నేను అక్కడ డ్రైవర్లు గుంపు లేకపోవడం, ప్రయాణికులను పిలిచి విసిగించే పరిస్థితి లేకపోవడం చూచి ఆశ్చర్యపోయాను. కేవలం అతనొక్కడే మా వద్దకొచ్చి ఆలా అడిగాడు. వెంటనే నేను, నా కుటుంబం అతనితో వెళ్ళాము. అతను చాలా జాగ్రతగా వాహనాన్ని నడపసాగారు. నేను మన్మాడ్ నుండి శిరిడీ చేరుకునేవరకు దారి పొడువునా 'వ్యక్తిని పంపి మమల్ని శిరిడీ తీసుకెళ్తున్న' బాబా చమత్కారం గురించే ఆలోచించిస్తూ ప్రయాణం సాగించాను. మొత్తానికి పది గంటలకు మేము ముందుగా బుక్ చేసుకున్న హోటల్‌కి చేరుకున్నాము. ఆ వ్యక్తి తన ఫోన్ నంబర్ ఇచ్చి, "మీకు ఏ సహాయం కావాలన్నా, తిరుగు ప్రయాణానికి మన్మాడ్ వెళ్లాలన్నా నాకు ఫోన్ చేయండి" అని చెప్పి వెళ్ళాడు. అంతా బాబా ప్రణాళిక. అర్థరాత్రి మన్మాడ్‌లో దిగి ఇబ్బందిపడకుండా హాయిగా రాత్రంతా ట్రైన్‌లోనే విశ్రాంతి తీసుకొనేలా చేసి ఉదయానికి మమ్మల్ని శిరిడీ చేర్చుకున్నారు. అయితే ఆలస్యంగా చేరుకున్నందువల్ల మేము ముందుగా బుక్ చేసుకున్న 9 గంటల దర్శనం టిక్కెట్లను ఉపయోగించుకోలేకపోయాము. 


మేము స్నానాలు చేసుకొని 12 గంటలప్పుడు టిఫిన్ చేసి, ఆపై దర్శనానికి వెళ్ళాము. బాబా మాకు చాలా చక్కటి దర్శనమిచ్చి మమ్మల్ని ఎంతగానో సంతోషపెట్టారు. బాబా చమత్కారాలు చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి, వాటిని అంత తేలికగా అర్ధం చేసుకోలేము. దర్శనానంతరం మేము మా రూముకి వెళ్లి కాసేపు విశ్రాంతి తీసుకొని పురాతన శిరిడీ, ఖండోబా మందిరం, ఉపాసని మందిరం చూడటానికి వెళ్ళాము. బాబా బస, దర్శనం మొదలైన అన్నీ విషయాలలో మాకు ఏ ఇబ్బందులు, టెన్షన్లు లేకుండా అన్నీ మంచిగా అమర్చారు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".


జై సాయినాథ్ మహారాజ్!!!


బాబా వల్లే సంతోషం


నేను ఒక సాయి భక్తురాలిని. నేను నా చిన్నప్పుడు అంటే నాకు 7-8 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు మా ఇంటికి దగ్గరలో ఉండే సాయిబాబా గుడికి ప్రతిరోజూ ఎంతో శ్రద్ధగా వెళ్ళేదాన్ని. కొన్నిరోజులకి మేము ఇల్లు మారాము. దాంతో బాబా గుడికి ఎప్పుడో ఒకసారి వెళ్తుండేదాన్ని. నేను పెద్దయ్యాక అది కూడా లేదు. 2012లో నేను ఇంటర్ 2వ సంవత్సరం చదువుతున్నప్పటి నుండి 2023 వరకు అంటే దాదాపు 10 ఏళ్ళలో నా జీవితంలో చాలా సంఘటనలు జరిగాయి. ఇంటర్ తర్వాత డిగ్రీ, అది అయిపోయాక రెండు సంవత్సరాలు ఖాళీగా ఉన్నాను. ఆ తరవాత ఎంబీఏలో జాయినై ఎలాగోలా పీజీ పూర్తి చేశాను. అది పూర్తైయ్యేసరికి 2020లో లాక్డౌన్ వచ్చింది. దాంతో ఉద్యోగం లేదు. నా ప్రేమ విఫలమై నేను ఇష్టపడ్డ అబ్బాయి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని, ఇంకా అతని గురించి చాలా నిజాలు తెలిసాయి. ఒక్కసారిగా నాకు సంతోషం అనేది లేకుండా పోయింది. అలా 3 సంవత్సరాలు గడిచిపోయాక 2023 ఏప్రిల్ నెలలో అకస్మాత్తుగా నాకు సాయిబాబా గుర్తొచ్చారు, చిన్నప్పుడు ఆయన గుడికి వెళ్లడం గుర్తొచ్చింది. ఎందుకో తెలీదుగానీ ఆయనకి నా జీవితం గురించి మ్రొక్కుకోవాలనిపించి మ్రొక్కుకున్నాను. ఒక్కసారిగా నాకు తెలిసిన వాళ్ళందరూ గుర్తొచ్చి వాళ్లంతా చాలా సంతోషంగా ఉండటం గుర్తొచ్చాయి. బాబాని వేడుకుంటే అందరిలాగే నాకు కూడా మంచి జరుగుతుందని నమ్మకంతో సరిగ్గా 20 ఏళ్ళ తర్వాత మళ్లీ బాబాను పూజించడం, సాయి నామాలు వ్రాయడం మొదలుపెట్టాను. తర్వాత ఒకరోజు మా ఇంట్లో సాయి దివ్యపూజ పుస్తకం కనిపించింది. ఆ పుస్తకం చదివి అందులో చెప్పినట్టు 5 వారాలు పూజ చేయాలని అనుకున్నాను. అనుకున్నట్లే ఉద్యోగం కోసం బాబాకి మ్రొక్కుకొని సాయి దివ్యపూజ ప్రారంభించాను. 3 వారాలకే చాలా మంచి జీతంతో మంచి కంపెనీలో నాకు ఉద్యోగం వచ్చింది. బాబా నా కోరిక నేరవేర్చినందుకు నాకు చాలా సంతోషంగా అనిపించింది. నమ్మకం, సహనం ఉంటే మనం అనుకున్నవి బాబా ఖచ్చితంగా తీరుస్తారు. ఇప్పుడు నేను ఉద్యోగం చేసుకుంటూ సంతోషంగా ఉన్నాను. ఇక నేను బాబాని పూజించటం ఎప్పటికీ మానను, పూజిస్తూనే ఉంటాను. జులై 3న నా పుట్టినరోజు, ఈ సంవత్సరం అదేరోజున గురుపౌర్ణమి రావడం నాకు చాలా సంతోషాన్నిచ్చింది. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".


సాయిభక్తుల అనుభవమాలిక 1576వ భాగం....


ఈ భాగంలో అనుభవం:

  • 'బాబా అండగా ఉన్నారు' అనే నమ్మకముంటే ఎటువంటి కష్టానైనా ఎదుర్కొని విజయం సాధించగలరు

శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై!!!


సాయిబంధువులందరికీ నమస్కరాలు. నేను ఒక సాయి భక్తురాలిని. మేము యుఎస్ఏలో నివాసముంటున్నాము. నేను చిన్నతనం నుండి బాబా కథలు వింటూ, చరిత్ర పారాయణ చేస్తూ, సాయిచాలీసా, ఆరతులు పాడుతూ పెరిగాను. సాయి నాతోనే ఉన్నారని నిరూపణ ఆయన సంఘటనలు నా జీవితంలో కోకొల్లలు. చిన్న సమస్య నుండి ప్రాణాంతకమైన పరిస్థితుల వరకు ఏ రోజూ బాబా నన్ను వదల్లేదు. నా జీవితంలో ఎప్పుడు, ఏది జరిగినా(మంచైనా, చెడైనా) అంతా బాబా దయనే. చెడు జరిగింది, అనుకున్నది జరగలేదు అన్న సందర్భాలలో అది మన కర్మ ప్రక్షాళన కోసమేనని, మనకు అవసరమనుకుంటే బాబా తప్పక ఇస్తారని నేను అనుకుంటూ ఉంటాను. బాబా నా కష్టసుఖాల్లో తల్లిలా ఆదరిస్తూ, ఓదారుస్తూ, చేయూతనిస్తూ ఎప్పుడూ నా వెంటే ఉంటున్నారు. నేనే ఆయన చరిత్ర నిత్యం పఠిస్తూ కూడా అప్పుడప్పుడు ఆయన చెప్పిన మాటలు పాటించకుండా బాధపెడుతుంటాను నా సాయితండ్రిని. అయినా నా సాయి నా చేయి వదల్లేదు. దానికి ఇప్పుడు నేను మీ అందరితో పంచుకున్న అనుభవం ఒక పెద్ద ఉదాహరణ.


మా పెద్దమ్మాయి మెడిసిన్ రెండవ సంవత్సరం చదువుతుంది. 2023, జూన్ 9, 13 తేదీలలో తనకి రెండు పరీక్షలు జరిగాయి. అవి ఫైనల్ పరీక్షలని మా అమ్మాయి చాలా కష్టపడి చదివింది. అయితే తన స్నేహితులందరూ భయపడి నెల తర్వాత వ్రాయడానికి పరీక్షల తేదీ మార్చుకున్నారు. దాంతో మా అమ్మాయి కూడా భయపడింది. అప్పుడు నేను తనతో, "బాబా ఉన్నారు. ఎటువంటి దిగులు వద్దు. తేదీ మార్చుకోవద్దు. కష్టపడి చదివి పరీక్షలు వ్రాయి" అని ధైర్యం చెప్పాను. నేను తనకి ఏ బాధ వచ్చినా చెప్పేది ఒకటే, 'ఊదీ పెట్టుకోమ'ని. తను నాకోసం రోజూ ఊదీ పెట్టుకొని, కొంచెం నీటిలో కలుపుకొని త్రాగుతుంది. పరీక్షలు జరిగే రోజుల్లో కూడా తను అలాగే చేసింది. అయితే తను భయపడినట్లే పేపర్ చాలా కఠినంగా వచ్చింది. దాంతో తనకి పరీక్ష పాస్ అవుతానన్న ఆశపోయింది. నాకు మాత్రం మన సాయి మనల్ని నిరాశపరచారని నమ్మకం. నేను 9వ తేదీ నుండి 13వ తేదీ వరకు రోజుకు ఒక అవధూత చరిత్ర(మాస్టర్ ఎక్కిరాల భరద్వాజగారి రచనలు) పారాయణ చేశాను. "నాకు మీ మీద ఉన్న నమ్మకం పిల్లలకు కూడా ఉండాలి తండ్రీ. మీరే ఆ నమ్మకం వారిలో కలిగించాలి" అని బాబాను వేడుకోని రోజు లేదు. ఇంకా మా అమ్మాయితో, "బాబా చరిత్ర రోజుకు నీకు ఎంత వీలైతే అంత చదువు. నువ్వే చూస్తావు బాబా మహిమ" అని చెప్పాను. తను సరే అని చదవడం మొదలుపెట్టింది. అంతేకాదు, "అమ్మా! మనం ఇండియా వెళ్లినప్పుడు శిరిడీ కూడా వెళదాం" అంది. అది విని నాకు చాలా సంతోషంగా అనిపించింది. అప్పటినుండి ఏదో ఒక రూపంలో 'భయపడవద్దు' అని సాయి అభయమిస్తుండేవారు.


మొదటిగా జూన్ 16వ తేదీన మన ఈ బ్లాగులో తెలంగాణ నుండి ఒక సాయి భక్తురాలు వాళ్ళ అమ్మాయి కూడా మెడిసిన్ రెండవ సంవత్సరం పరీక్షలు వ్రాసి, పాస్ అవ్వనేమోనని దిగులుపడిందని, కానీ బాబా దయవల్ల పాస్ అయిందని తన సంతోషాన్ని పంచుకున్నారు. అది చదివాక బాబా నాకు ధైర్యం చెప్పినట్లు అనిపించింది. తర్వాత 2023, జూన్ 21, బుధవారంనాడు నేను సాయి లీలామృతం చదువుతుంటే అందులో సావిత్రిబాయి టెండూల్కర్ కొడుకు మెడికల్ ఎగ్జామ్ పాస్ అయిన లీల వచ్చింది. అదేరోజు మధ్యాహ్నం మా అమ్మాయి నాకు ఫోన్ చేసి, "ఎగ్జామ్ రిజల్ట్ వచ్చింది. నాకు చాలా భయంగా ఉంది. నువ్వు వెబ్సైట్ ఓపెన్ చేసి చూడు" అని చెప్పింది. ఎంత నమ్మకమున్న కూడా నేను వణుకుతున్న చేతులతో వెబ్సైటు ఓపెన్ చేసి చూస్తే, 'ఒక పరీక్ష పాస్' అని ఉంది. నా కంట నీళ్లు ఆగలేదు. "తండ్రీ, సాయినాథా! నువ్వు ఉన్నావని అమ్మాయికి నమ్మకం కలిగించినందుకు ధన్యవాదాలు" అని చెప్పుకున్నాను.


ఇకపోతే, మరో పరీక్ష రిజల్ట్ మరుసటి బుధవారం ప్రకటిస్తారని వెబ్సైటులో ఉంది. దానికోసం మళ్లీ చిన్న దిగులు. అమ్మాయి చరిత్ర చదువుతూ, ఊదీ పెట్టుకొని, నీళ్లలో  కలుపుకొని తాగుతుండేది. ఇక చివరిగా బుధవారం రానే వచ్చింది. కానీ నాకెందుకో 'అమ్మాయి రిజల్ట్ గురువారం బాబా పారాయణ, ఆరతి అయ్యాక చూడాలి' అని మనసులో బలంగా అనిపించింది. నా సాయితండ్రి అది కూడా విన్నారు. బుధవారం ఫలితాలు ప్రకటించలేదు, గురువారంకి వాయిదా వేశారు. ఇక నేను సంతోషంగా గురువారం(తొలి ఏకాదశి) పూజ, పారాయణ చేసుకున్నాను. అప్పుడు కూడా బాబా నాతో మళ్లీ మాట్లాడారు. ఎలా అంటే, మహాపారాయణలో భాగంగా నాకు 48, 49 అధ్యాయాలు వచ్చాయి. 48వ అధ్యాయంలో షేవడే పరీక్ష సరిగా వ్రాయకపోయినా పాసైన లీల వచ్చింది. 'తండ్రీ' అని దణ్ణం పెట్టుకున్నాను. తర్వాత నేను హారతి పాడుతుండగా మా అమ్మాయి 'ఎగ్జామ్ పాస్' అన్న రిజల్ట్ పేజీని స్క్రీన్ షాట్ మెసేజ్ చేసింది. నాకు చాలా సంతోషమేసింది. "తండ్రీ! నిజానికి తను పరీక్ష పాస్ అయిందన్న దానికంటే నువ్వు ఉన్నావని పిల్లలకి నమ్మకం కలిగించినందుకు నాకు ఇంత సంతోషంగా ఉంది" అని ఏడ్చేసాను. ఎందుకంటే, జీవితంలో ఇంతకుమించిన పరీక్షలు ఎదురవుతాయి. 'బాబా అండగా ఉన్నారు' అనే నమ్మకం ఉంటే ఎటువంటి కష్టాలు అయిన ఎదుర్కొని విజయం సాధించగలరు. ఆ శ్రద్ధ-సబూరీ ఉంటే చాలు. అన్నీ తానై మన సాయితండ్రి నడిపిస్తారు మనల్ని.


చివరిగా ఒక మాట, సత్సంగం అనేది కరువు అయిపోయి, దేవుని మీద నమ్మకం కలిగించడం కష్టమైన ఈ రోజుల్లో ఈ 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగు నిజంగా మనకు దొరికిన ఒక అపూర్వమైన వరం. ప్రతిరోజూ ఎందరో అనుభవాలు చదువుతూ ఉంటే, 'బాబా మనతోనే ఉన్నారు' అని ప్రతి ఒక్కరికీ(నమ్మకం లేని వారికి కూడా) తప్పకుండా అనిపిస్తుంది. ఇంతటి వరాన్ని మనకు అందిస్తున్న బాబాకి మనసారా శతకోటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను


సర్వేజనా సుఖినోభవంతు|

లోకాసమస్తా సుఖినోభవంతు||


సాయిభక్తుల అనుభవమాలిక 1575వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. కరోనా నుండి కాపాడి పునర్జన్మనిచ్చిన సాయిబాబా
2. ఏదైనా సమస్య వచ్చినప్పుడు బాబా మీద భారమేస్తే ఆయన మనల్ని కాపాడుతారు

కరోనా నుండి కాపాడి పునర్జన్మనిచ్చిన సాయిబాబా


నా పేరు పిడెం నరసింహులు. మేము హైదరాాబాద్, నల్లకుంటలో ఉంటున్నాము. ముందుగా సాయిభక్తులందరికీ నమస్కారం. నేను ఇప్పుడు 2020, సెప్టెంబర్‌లో కరోనా రెండో విడతప్పుడు స్వయంగా నాకు జరిగిన అనుభవం పంచుకుంటున్నాను. హఠాత్తుగా నాకు జ్వరం వస్తూ పోతూ ఉండేది. దాంతో ఒకరోజు కరోనా టెస్టు చేయించుకుంటే 'పాజిటివ్' అని వచ్చింది. అప్పటికి వేరే లక్షణాలేవీ కనిపించకపోయినా ఆ రోజు సాయంత్రానికి మాత్రం నా పరిస్థితి కొద్దికొద్దిగా దిగజారడం ప్రారంభించింది. కనీసం అరటిపండు కూడా తినలేని స్థితికి వచ్చాను. అడుగు తీసి అడుగు వేయలేకపోయాను. కష్టం మీద రెండు అడుగులు వేయగానే ఆయాసమోచ్చి కుప్పకూలిపోయేవాడిని. ఆ విధంగా ఒక రాత్రంతా గడిచింది. మరుసటిరోజు ఎలాగో కష్టపడి ఆటోలో చైతన్యపురిలోని నా మిత్రుని ఆస్పత్రికి వెళ్లాను. ఒక గంటసేపు ఆక్సిజన్ పెట్టి మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో అంబులెన్స్‌లో సిటి స్కానింగ్‌కు పంపారు. దారిలో దిల్‌సుఖ్‌నగర్ సాయిబాబా మందిరం ఆర్చి నా కంటపడింది. అంబులెన్స్‌లోని బెడ్ మీద నుండే రెండు చేతులెత్తి నమస్కరించాను. స్కానింగ్ అయిపోయన రెండు గంటల తరువాత రిపోర్టులు వచ్చాయి. అప్పటికే నన్ను ఆస్పత్రిలో అడ్మిట్ చేసుకున్నారు. నా భార్య, కుమారుడు ఆస్పత్రికి వచ్చారు. డాక్టర్లు వాళ్ళని పిలిచి, "ఆయన ఊపిరితిత్తులు 80 శాతం దెబ్బతిన్నాయి. ఇక బతకడం కష్టం. బంధువులు ఎవరన్నా ఉంటే తెలియపరచండి" అని అన్నారు. అదే విషయాన్ని నా భార్య వచ్చి నాతో చెప్పింది. "నాకు ఏమి కాదులే" అని నేను తనకి ధైర్యం చెప్పాను. కానీ నేను బతుకుతానన్న నమ్మకం ఎవరికీ లేదు. ఊరిలో ఉండే మా అమ్మ, తమ్ముడు, తన భార్య కారు మాట్లాడుకుని మరుసటిరోజు హైదరాబాద్ వచ్చారు. కరోనా కారణంగా వ్యాపారం నడవక మా వద్ద డబ్బు కూడా లేదు. అయినా నేను ధైర్యంగానే ఉండసాగాను. దాదాపు 14 రోజులపాటు ఐసియులో ఉన్నాను. అప్పటికీ వైద్యులకు నమ్మకం కుదరడం లేదు. నాకు మాత్రం లోపల వ్యాధి నయమవుతున్నట్లు తెలుస్తుండేది. ఆక్సిజన్ లెవెల్స్ క్రమంగా పెరిగాయి. ఆక్సీజన్ పైపు తీసి బాత్రూమ్‌కు వెళ్లగలుగుతుండేవాడిని. డాక్టర్లకి నమ్మకం లేకపోయినా నా మనోధైర్యాన్ని చూసి 15వ రోజు జనరల్ రూమ్‌కు మార్చారు. ఆ తరువాత మూడు రోజులకు డిశ్చార్జ్ కూడా చేశారు. 80 శాతం ఊపిరితిత్తులు దెబ్బతిన్నా నేను కోలుకోవడం డాక్టర్లకే ఆశ్చర్యం కలిగించింది. నేను, నా కుటుంబం డాక్టర్లకు నమస్కరించబోతే, "మేము చేసింది ఏమీ లేదు. ఇంతకంటే తక్కువ తీవ్రత ఉన్నవాళ్ళు చాలామంది చనిపోయారు(నా కళ్లముందే నా పక్క బెడ్డుపై ఉన్న పేషెంటు కూడా చనిపోయాడు). కాబట్టి మాదేమీ లేదు. దేవుడే మిమ్మల్ని కాపాడాడు" అని అన్నారు. ఆ దేవుడు ఎవరో కాదు, సాక్షాత్తు సాయిబాబానే. నేను బతికానంటే అంతా ఆ సాయిదేవుని కృప మాత్రమే. ఈ వ్యాధి బారినపడతానని, నా ప్రాణానికి ముప్పు ఉందని ఆయనకు ముందే తెలుసేమో! అప్పటికీ రెండు నెలల ముందు నుండి నా చేత భరద్వాజ మాస్టారు రచించిన గురుచరిత్ర, సాయిచరిత్ర పారాయణ చేయించారు. నిజానికి నేను వాటిని ఎప్పుడో పాత పుస్తకాలు అమ్మేవాళ్ళు దగ్గర కొని ఒక మూలన పెట్టేసాను. సరిగా నాకు కరోనా సోకడానికి రెండు నెలలు ముందు వాటిని పారాయణ చేయాలన్న బుద్ధి పుట్టించారు బాబా. 2014లో శిరిడీ నుండి తెచ్చుకున్న ఒక చిన్న బాబా విగ్రహం మా ఇంటిలో ఉంటే, ఆ విగ్రహానికి అభిషేకం చేసి రోజూ పారాయణ చేస్తూ, సాయంత్రం పూట బాబా గుడిలో జరిగే ఆరతికి వెళ్తుండేవాడిని. ఆ విధంగా ఆయన నా చేత పూజలు చేయించుకొని, దానికి బదులుగా నా  ప్రాణాలు కాపాడారు. నన్ను నా కుటుంబాన్ని ఆదుకున్న సాయినాథునికి ఏమిచ్చి ఋణం తీర్చుకోగలను? నా అనుభవాన్ని ఈ విధంగా అందరితో పంచుకునే భాగ్యం కల్పించిన సాయిబాబాకు నమస్సులతో..


ఏదైనా సమస్య వచ్చినప్పుడు బాబా మీద భారమేస్తే ఆయన మనల్ని కాపాడుతారు


అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!


నాడు బాబా సశరీరులుగా ఉన్నప్పుడు ఎలాంటి అనుభవాలు భక్తులు పొందారో నేడు కూడా భక్తులు ఎన్నో అనుభవాలను పొందుతున్నారు. ఏదైనా సమస్య వచ్చినా, రాబోతున్నా బాబా ఏదో ఒక రూపంలో మనకు సహాయం చేయడం, హెచ్చరించడం జరుగుతున్నాయి. ప్రతిరోజు, ప్రతి నిమషం బాబాతో మనకి ఏదో ఒక అనుభవం ఉండనే ఉంటుంది. ఈ బ్లాగు ద్వారా అటువంటి అనుభవాలు చదువుతుంటే చాలా ఆనందంగా ఉంటుంది. అంతేకాదు ఈ బ్లాగు వల్ల ప్రతిరోజు బాబా దర్బారులో ఆయనతో ఉన్న అనుభూతి కలుగుతుంది. ఇక విషయానికి వస్తే, నా పేరు చైతన్య. 2023, ఏప్రిల్‌లో మా కుటుంబం, మా స్నేహితుల కుటుంబం కలిసి శిరిడీ వెళ్లేందుకు టికెట్లు బుక్ చేసుకున్నాము. అనంతరం హఠాత్తుగా మా మామయ్యగారు అనారోగ్యం పాలయ్యారు. దాంతో మేము శిరిడీ వెళ్లలేమేమోనని నేను చాలా బాధపడి, "బాబా! మా మామయ్యగారి ఆరోగ్యం బాగుండేలా చూడండి. మీ దయతో మా శిరిడీ ప్రయాణానికి ఆటంకాలు లేకుండా ఉంటే నా అనుభవాన్ని తోటి భక్తులతో పంచుకుంటాన"ని అనుకున్నాను. బాబా దయతో మావయ్యగారి ఆరోగ్యం మెరుగుపరిచి మా శిరిడీ ప్రయాణానికి ఎటువంటి ఆటంకం లేకుండా చూసారు. మేము సంతోషంగా శిరిడీ వెళ్ళాం. మొదటిరోజు బాబా దర్శనం చేసుకొని రెండోరోజు నాసిక్, త్రయంబకేశ్వర్ వెళ్ళడానికి వెహికల్ బుక్ చేసుకున్నాము. అయితే హఠాత్తుగా ఆ రాత్రి నాకు గ్యాస్ ప్రాబ్లెమ్ వచ్చి విరోచనాలు మొదలయ్యాయి. నాకు చాలా భయమేసింది. "బాబా! రేపు నాసిక్ వెళదామనుకుంటే ఇదేంటి ఇలా అయ్యింది. నా వల్ల మిగతవాళ్ళు కూడా ఇబ్బందిపడతారు. నాకు తగ్గిపోయేలా చూడండి బాబా" అని బాబాని వేడుకొని ఊదీ నీళ్లలో కలుపుకొని త్రాగి 'ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః' అని అనుకుంటూ నిద్రపోయాను. ఉదయం నిద్ర లేచేసరికి నాకు తగ్గిపోయింది. అంతా ఊదీ మహిమ. మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు బాబా మీద భారమేస్తే ఆయన మనల్ని కాపాడుతారు. ఇకపోతే నేను, "బాబా! ప్రయాణంలో ఎలాంటి ఇబ్బందీ రాకుండా చూడండి" అని బాబాను వేడుకొని మా స్నేహితులతో కలిసి నాసిక్‌యాత్రకు బయలుదేరాను. బాబా దయవల్ల ఏ ఇబ్బంది లేకుండా నాసిక్, త్రయంబకేశ్వర్ వెళ్లి శివయ్య దర్శనం చేసుకొని తిరిగి క్షేమంగా శిరిడీ చేరుకున్నాము. తర్వాత రోజు మేము ఔరంగాబాద్‌కి సమీపంలో ఉన్న ఘృష్ణేశ్వర్ వెళ్లి అక్కడి శివయ్య దర్శనం చేసుకుని క్షేమంగా ఇంటికి చేరుకున్నాము. "చాలా ధన్యవాదాలు బాబా. మీ అనుగ్రహం మాపై సదా ఉండాలని, మీ కృపాదృష్టి మమ్మల్ని కాపాడుతూ ఉండాలని కోరుకుంటున్నాను. సదా మీ నామస్మరణలో ఉండేలా దీవించండి బాబా".


సాయిభక్తుల అనుభవమాలిక 1574వ భాగం....


ఈ భాగంలో అనుభవం :

  • ఎప్పుడూ వెన్నంటి కాచుకునే సాయినాథుడు

నేను ఒక సాయి భక్తురాలిని. నిత్య జీవితంలో ప్రతిరోజూ బాబా ఏదో ఒక ప్రయోజనం కోసం ఎక్కడో ఒక సూత్రాన్ని కడుపుతుంటారు. ఏది అని వ్రాయగలం? ఎన్నని వ్రాయగలం? నేను ఈమధ్య నా అనుభవాలు వ్రాసి చాలాకాలం అయింది. మనసులో ఉన్న కొన్ని కోరికలు తీరిన తరువాత వివరంగా పంచుకుందామని ఆగాను. కానీ 2023, జూన్ 10న 'సాయి మహారాజ్ సన్నిధి' టెలిగ్రామ్ గ్రూపులో సాయి భక్తుల అనుభవాలు చదువుతుంటే ఎందుకో అప్పటికి రెండు రోజుల క్రితం జరిగిన చిన్న సంఘటన వ్రాయాలనిపించింది.


2023, జూన్ 1, గురువారం సాయంత్రం నేను హారతికని బాబా గుడికి వెళ్ళాను. హారతి అనంతరం యథాలాపంగా(ముందుగా అనుకోకుండా) కొద్ది దూరంలో ఉన్న కేశవస్వామి గుడికి వెళ్ళాను. అక్కడ దర్శనమయ్యాక పూజారిగారు, "అమ్మా! వచ్చే గురువారం శ్రవణ నక్షత్రం సందర్భంగా స్వామికి అభిషేకం జరుగుతుంది, గోత్రనామాలు వ్రాయించుకుంటారా?" అని అడిగారు. మాములుగా నేను ఏడాదికి ఒకసారి మా ఊరిలో జరిగే లక్షపత్రి పూజ తప్ప ఇతరత్రా అభిషేకాలు వంటివేమీ చేయించను. కనీసం బాబాకి కూడా ఎప్పుడూ అభిషేకం చేయించను. ఊరికే గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి దర్శనం చేసుకుని వస్తాను. అభిషేకం పేరు చెప్పి లీటర్ల కొద్దీ పదార్ధాలు వ్యర్థం చేస్తున్నట్లు నా మనసుకి అనిపిస్తుంది. అలాంటి నేను ఆ పూజారి అలా అడిగేసరికి, ఏదో అడిగారు. కాదనడం ఎందుకన్నట్టుగా సరే అని ఆయన చెప్పిన డబ్బులు చెల్లించాను. అంతటితో ఆగక ఎందుకో గుర్తుపెట్టుకుని ఆ కార్యక్రమానికి హాజరు కావాలాని గట్టిగా అనుకున్నాను. ఆ పూజారి, "ఉదయం 6 గంటలకు ప్రారంభిస్తాం. పూర్తైయ్యేసరికి 8.30 అవుతుంది. మీ వీలుని బట్టి రావచ్చు" అని చెప్పారు. నేను, "ఏమైనా తెచ్చుకోవాలా?" అని అడిగితే, "అవసరం లేదు. మీకు వీలుంటే కాస్త ఆవు పాలు తెచ్చుకోండి. అభిషేకానికి వాడుదాం" అని అన్నారు. నేను సరేనని మావారిని కూడా అభిషేకానికి హాజరయ్యేలా ముందే ప్రిపేర్ చేశాను. ఎందుకంటే, తను మామూలుగా ఉదయం 7.30, 8 మధ్యలో తన ఆఫీసుకి బయలుదేరి వెళ్లిపోతుంటారు. ఆరోజు(2023, జూన్ 8, గురువారం) కొంచెం ముందే లేచి 6 గంటలకి గుడికి వెళ్లి, అక్కడ పూజ పూర్తయ్యాక తను అటునుంచి ఆటే ఆఫీసుకి వెళ్లేలా ప్లాన్ చేసుకున్నాము. మావారు అలాగే బాబా గుడికి కూడా వెళదామన్నారు. కానీ ఏదో విధంగా ఆలస్యమైపోయి మేము వెళ్ళేసరికి 7 గంటలు అయింది. అప్పటికి కేశవస్వామికి అభిషేకం పూర్తై కర్టెన్ వేసేసి క్లీనింగ్ చేస్తూ ఉన్నారు. చేతిలో పాలు నన్ను వెక్కిరించాయి. ఆలస్యంగా రావడం మాదే తప్పని తెలుస్తున్నా, 'అయ్యో! ఇంత ప్లాన్ చేసుకుని అభిషేకం చూడలేకపోయాను' అని కొంచెం దిగులుగా అనిపించింది. అంతలో మావారు ఇక్కడ క్లీనింగ్ అయ్యేలోపు బాబా గుడికి వెళ్ళొచ్చేద్దాం అన్నారు. ఈ పాలు కూడా బాబా గుడిలో బాబాకి అభిషేకం చేద్దాం, అక్కడ ఎప్పుడూ చిన్న బాబా విగ్రహాలకు అభిషేకాలు చేస్తూ ఉంటారు కదా అనుకుని అక్కడికి వెళ్ళాం. అక్కడ దర్శనం అయిందికానీ, "అభిషేకం ఇప్పుడు చేయము. పొద్దున్నే అయిపోతుంది" అన్నారు. నాకు బాబా మీద చాలా కోపం వచ్చింది. తప్పు మాదే అని తెలుస్తున్నా 'తెచ్చిన పాలను మళ్ళీ వెనక్కి ఎలా తీసుకెళ్లాలి? మీరైనా స్వీకరించవచ్చు కదా! కేశవస్వామి అభిషేకానికి తెచ్చినా అన్నీ మీ రూపాలే కదా!' అని ఎందుకో కొంచెం బాబా మీద అలిగాను. సాధారణంగా నేను ఎప్పుడైనా అటువంటి సందర్భాలలో 'సాయి అనుగ్రహం నా మీద తగ్గిందా ఏంటి?' అని కొంచెం ప్రతికూల భావాలకు లోనై బాధపడేదాన్ని లేదా భయపడేదాన్ని. కానీ ఈసారి నా ఆ స్వభావానికి విరుద్ధంగా తిరిగి దెబ్బలాటకి వెళ్లినట్టుగా అలిగాను. మావారు, "సరే, వదిలేయ్! అవి మన పొట్టలోకే వెళ్ళాలని వ్రాసి పెట్టుందేమో!" అన్నారు. ఇంకా మేము ఇంటికి వచ్చేసాము. అయినా నేను ఆ పాల గురించే ఆలోచించసాగాను. 'అభిషేకం పేరుతొ వృధా చేయడం నాకిష్టం లేదని బాబా ఎవరికైనా ఉపయోగపడేలా చేస్తారేమో, ఎవరైనా వచ్చి అడుగుతారేమో, ఎవరు వస్తారో' అని ఎదురుచూస్తూనే ఆ పాలు కాచి, చల్లారాక ఫ్రిడ్జ్‌లో పెట్టేసి ఆ విషయం మర్చిపోయాను.


ఆరోజు రాత్రి జరిగిన వింత చూడండి! మేము రోజూ ఆవుపాలు తెప్పించుకుంటాము. పాలు తెచ్చే అబ్బాయి రాత్రి చాలా ఆలస్యంగా అంటే సుమారు రాత్రి 9.30 ప్రాంతంలో పాలు తెచ్చి ప్రహారీగోడ మీద పెట్టి ఒకసారి బెల్ కొట్టి వెళ్ళిపోతాడు. మేము త్వరగా పడుకుంటాం. అందువల్ల తలుపులన్నీ వేసేసుకుని కేవలం ఆ పాలకోసం నిద్రపోకుండా వేచి చేసి, అవి రాగానే లోపల పెట్టుకొని పడుకుంటాం. ఆరోజు రాత్రి మావారు ఫోన్ చూస్తూ, "పాలు తెచ్చేసావా?" అని అడిగారు. నేను ఇంకా తేలేదు అన్నాను. ఆయన, "లేదా? ఇందాక 10 నిమిషాల క్రితమే నాకు బెల్ వినపడింది. వెళ్లి చూడు" అన్నారు. సరేనని వెళ్లి చూస్తే, అక్కడ పాలు లేవు. పాల అబ్బాయికి ఫోన్ చేస్తే, "నేను పావుగంట క్రితమే పెట్టేసాను" అన్నాడు. దాంతో పాలు పిల్లి ఎత్తుకెళ్లి ఉంటుందని నిర్థారించుకొని పోనీలే, ఈరోజు పాలు పిల్లి పొట్టలోకి వెళ్లాయనుకుంటూ ఉండగా 'ఆరోజు ఉదయం అభిషేకానికని తీసుకెళ్ళి, తిరిగి వెనక్కు తెచ్చిన పాలు ఎవరికి చేరుతాయో అని ఎదురుచూడడం, మావారు అవి మనకే రాసిపెట్టి ఉన్నాయేమో అనడం' అంతా ఫ్లాష్‌బ్యాక్‌లా నాకు గుర్తొచ్చాయి. అప్పుడు, 'ఆరోజు పాలని పిల్లి పట్టుకెళ్ళిపోతుంది కాబట్టి మరుసటిరోజు పొద్దున్నే బయటకి పాలకోసం వెళ్ళే ఇబ్బందిలేకుండా ముందురోజు పాలను బాబా మాకోసం ఉంచేసారా?' అని స్పురించింది. ఆ తలంపు నా మదిలోకి రాగానే నా పరిస్దితి ఎలా ఉండి ఉంటుందో మీరే ఊహించుకోండి. దాన్ని బాబా ప్రేమ అనాలా?, ప్రణాళిక అనాలా?, వాత్సల్యం అనాలా? ఏ పేరు పెట్టాలో నాకైతే అర్దం కావట్లేదు.


ఇంకో అనుభవం: బాబా ఎప్పుడూ ఏ కార్యక్రమానికి నాకు నెలసరి అడ్డు రానివ్వలేదు. ముందో, వెనకో మొత్తానికి అనుకున్న కార్యక్రమానికి అడ్డు లేకుండా జరిపిస్తుంటారు బాబా. ఇక విషయానికి వస్తే, 2023, జూన్ 2, శుక్రవారం మా ఫ్రెండ్ నాకు ఫోన్ చేసి, "నేను మన ఊరి బ్యాచ్‌తో తిరుపతి సేవకు వెళ్తున్నాను. సేవకి వెళ్లాలని నేను ఎప్పటినుంచో అనుకుంటున్నాను కానీ, నెలసరి సమస్య వల్ల ఇప్పటివరకూ కుదరలేదు. ఇప్పుడు అనుకోకుండా నాకు ఈ అవకాశం వచ్చింది. సేవకి వెళ్ళే వాళ్ళలో ఎవరో ఒకరిద్దరు ఆగిపోవటం వల్ల నాకు అవకాశమొచ్చి ఇప్పటికిప్పుడు ప్రయాణం పెట్టుకున్నాను" అని చెప్పింది. నేను తనకి శుభాకాంక్షలు చెప్పి సరదాగా "నేను కూడా వచ్చేయనా?" అని అన్నాను. దానికి తను, "వస్తావా? అవకాశం ఉన్నట్టుంది. అడుగుతాను" అనింది. అయితే నేను, "ఇప్పుడే అడగొద్దు. నేను కొంచెం ఆలోచించుకొని ఒక పావుగంటలో ఫోన్ చేస్తాను" అని చెప్పి ఫోన్ పెట్టేసాను. తరువాత తను చెప్పిన తేదీలు చూసుకుంటే బయలుదేరవలసినది జూన్ 3, శనివారం, తిరిగి వచ్చేది 11వ తేదీ, ఆదివారం. నా నెలసరి తేదీ 14. ఒక రెండు, మూడు రోజులు ముందుగా వస్తుందనుకున్నా అప్పటికి సేవ పూర్తైపోతుంది. మహా అయితే ప్రయాణంలో రావొచ్చు. నేనెప్పుడూ సేవకి వెళ్ళాలని పెద్దగా అనుకోనప్పటికీ స్వామి ఈ విధంగా అవకాశమిచ్చి పిలుస్తున్నారేమో, వెళ్తే బాగుంటుందేమో అని ఒకవైపు, రేపు మధ్యాహ్నం ట్రైన్ ఎక్కాలంటే (రాత్రి 9 గంటలప్పుడు) అన్నీ కుదురుతాయి అని మరో వైపు, వెళ్తే పై అనుభవంలో చెప్పిన అభిషేకం మిస్ అవుతానేమో అని ఇంకో వైపు ఆలోచిస్తూ ఏదీ తేల్చుకోలేక సతమతమయ్యాను. చివరికి ఇక ఇలా కాదని బాబా ముందు చీటీలు వేసాను. చీటిలో వెళ్ల వద్దని వచ్చింది. ఇక మరో ఆలోచన లేకుండా నా ఫ్రెండ్‌తో రానని చెప్పేసి అక్కడితో వదిలేసాను. చూస్తే, ఎప్పుడూ సరిగా లేదా రెండు రోజులు ముందుగా వచ్చే నెలసరి ఏకంగా ఐదారు రోజుల ముందుగా జూన్ 9న వచ్చింది. అప్పుడు కానీ, బాబా ఎందుకంత స్పష్టంగా సేవకి వెళ్ళొద్దని చెప్పారో అర్దమై మరోసారి మనని ఎప్పుడూ వెన్నంటి కాచుకునే సాయినాథుని కృపాదృష్టికి పులకించిపోయాను. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".


ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి!!!


సాయిభక్తుల అనుభవమాలిక 1573వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. కష్టమొచ్చినా ప్రతిసారీ సహాయం చేస్తున్న బాబా
2. టెన్సన్స్ తొలగించి పరీక్షలు మంచిగా వ్రాసేలా అనుగ్రహించిన బాబా

కష్టమొచ్చినా ప్రతిసారీ సహాయం చేస్తున్న బాబా


అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై!!!


సాయిబంధువులందరికీ నా నమస్కారాలు. నా పేరు ఉషశ్రీ. నేను నా చిన్నప్పటి నుండి సాయినాథుని భక్తురాలిని. నా జీవితంలో బాబా చాలాసార్లు సహాయం చేసారు. కొన్ని అనుభవాలను నేనిప్పుడు మీతో పంచుకుంటున్నాను. విదేశాలలో ఉద్యోగం రావాలంటే ఇంగ్లీష్ భాషకి సంబంధించి ఒక పరీక్షలో తప్పనిసరిగా స్కోర్ 7 రావాలి. అయితే నాకు మొదటి ప్రయత్నంలో ఆ స్కోర్ రాలేదు. అప్పుడు నేను సాయిబాబాకి మ్రొక్కుకొని నిష్టగా సచ్చరిత్ర ఒక వారం పారాయణం చేశాను. బాబా నన్ను అనుగ్రహించి రెండో ప్రయత్నంలో నాకు కావాల్సిన స్కోర్ వచ్చేలా చేసారు. తరువాత నేను వేరే దేశంలో ఉన్నప్పుడు మా చెల్లి నాకు ఫోన్ చేసి, "నా మెడ దగ్గర వాపు వచ్చింది, నొప్పి కూడా ఉంది. చాలారోజుల నుండి తగ్గట్లేదు. నాకు భయంగా ఉంది" అని చెప్పింది. అది విని నాకు కూడా భయమేసి నేను చాలా టెన్షన్ పడినందువల్ల ఆకస్మికంగా భయాందోలనలకు గురి అవుతుండేదాన్ని. ఆ స్థితిలో నేను బాబాని, "చెల్లికి తొందరగా తగ్గిపోవాలి" అని ప్రార్ధించి సాయి సచ్చరిత్ర మరోసారి పారాయణ చేశాను. పారాయణ మొదలుపెట్టిన రెండోరోజు మా చెల్లి ఫోన్ చేసి, "ఇన్నిరోజులుగా తగ్గని వాపు ఇప్పుడు టాబ్లెట్స్‌తో తగ్గిపోయింది" అని చెప్పింది. సాయి బాబా మహిమ అటువంటిది.


నాకు ఐర్లాండ్‌లో ఉద్యోగం వచ్చాక నా భర్త వీసా ఇష్యూస్ వల్ల రెండుసార్లు రిజెక్ట్ అయ్యింది. ప్రతిరోజూ బాబాని ప్రార్థిస్తున్నా మావారికి వీసా రాలేదు. అలా రెండు సంవత్సరాలు గడిచిపోయాయి. ఆ రెండు సంవత్సరాలు ఒంటరిగా నేను చాలా ఇబ్బందిపడ్డాను. అయినా నేను వదలకుండా ప్రతి నెలా సచ్చరిత్ర పారాయణ చేస్తూ ఉండేదాన్ని. కొంచం ఆలస్యమైనా చివరికి బాబా అనుగ్రహించి మావారికి వీసా వచ్చేలా చేసారు. ఇలా ఒకసారి కాదు, కష్టం వచ్చిన ప్రతిసారీ బాబా నాకు సహాయం చేస్తూనే ఉన్నారు. నేను గర్భవతిని అవ్వాలని చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ అవి ఫలించలేదు. చివరికి బాబాకి మొక్కుకున్నాక ఆయన దయవలన నాకు పాప పుట్టింది. తనకి సాయిబాబా పేరు వచ్చేలా 'అద్వైత సాయి' అని నామకరణం చేసాము. ఈమధ్య మా పాపకి తరచూ జలుబు చేస్తూ వుంది. తనకి ఆ సమస్య తగ్గితే నా జీవితంలో నేను పొందిన సాయి అనుగ్రహాలను బ్లాగులో పంచుకుంటానని బాబాకి మొక్కుకున్నాను. "బాబా! నా బిడ్డకి జలుబు తొందరగా తగ్గేలా అనుగ్రహించండి". 


సాయిమహరాజ్ కి జై!!!


టెన్సన్స్ తొలగించి పరీక్షలు మంచిగా వ్రాసేలా అనుగ్రహించిన బాబా


సాయిభక్తులందరికీ నమస్కారం. నా పేరు అపర్ణ. మేము ఎప్పుడు, ఏ పని చేసినా ప్రతి దానిలో మన సాయినాథుని కృపాకటాక్షాలు ఉండాలని అనుకుంటాం. ఈ మధ్య మా అబ్బాయికి పరీక్షలు జరిగాయి. తను పరీక్షలకు హాజరు అయ్యేముందు గుడికి వెళ్ళి సాయి ఆశీస్సులు తీసుకుని వెళ్ళాడు. మొదటిరోజు పరీక్ష అయిపోయాక రెండోరోజు బాబు చాలా ఒత్తిడికి గురై బాగా భయపడ్డాడు. తన పరిస్థితి చూసి నాకు చాలా బాధ కలిగింది. వెంటనే సాయినాథుని తలచుకొని "బాబా! బాబు టెన్షన్ తొలగించి పరీక్ష మంచిగా వ్రాసేలా చేయండి. ఈ సమస్య తీరితే మీ అనుగ్రహాన్ని 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను" అని దణ్ణం పెట్టుకున్నాను. తర్వాత రోజు పరీక్షకి వెళ్ళిన బాబు చాలా సంతోషంగా తిరిగి వచ్చి, 'అన్ని తనకి వచ్చిన ప్రశ్నలే వచ్చాయని, ఏ టాపిక్స్ అయితే ఒత్తిడి మూలంగా గుర్తుపెట్టుకోలేకపోయానో అవి పరీక్షలో అస్సలు రాలేదని' చెప్పాడు. చివరి పరీక్ష అప్పుడు కూడా బాబు భయపడ్డాడు. కానీ, బాబా దయవల్ల ఆ పరీక్ష కూడా బాగా వ్రాశాడు. బాబా దయవల్ల 2023, జులై 5న వచ్చిన ఫలితాల్లో బాబు మంచి పర్సంటేజ్‌తో పాసయ్యాడు. మిత్రులారా! శ్రీసాయినాథుడు మనల్ని ఎల్లప్పుడూ కంటికి రెప్పలా కాపాడతారు. అందుకు మా జీవితాలే నిదర్శనం. నేను, నా బిడ్డ ప్రతిదీ సాయినాథుని ఆజ్ఞ లేదా ఆశీర్వాదంగా భావిస్తాం. నా కుటుంబ సుఖసంతోషాలన్నీ మన బాబా ప్రసాదమే. "చాలా చాలా ధన్యవాదాలు బాబా. ఎల్లప్పుడూ ఇదే విధంగా మా అబ్బాయిని ఆశీర్వదించండి. తను ఏకాగ్రతతో శ్రద్ధగా చదువుకునేటట్లు చూడండి". చివరిగా ఒక మాట, ఈ బ్లాగు మూలంగా మనలో సాయిపట్ల భక్తి, విశ్వాసాలు మరింత బలపడుతున్నాయి.


ఓం సాయిరక్షక శరణం దేవా!!!


సాయిభక్తుల అనుభవమాలిక 1572వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా ఉన్నారు - తప్పక మేలు చేస్తారు
2. ఎటువంటి ఇబ్బంది లేకుండా యాత్రను పూర్తి చేయించిన బాబా

బాబా ఉన్నారు - తప్పక మేలు చేస్తారు


ఓం శ్రీసాయినాథాయ నమః!!! నా పేరు జయ. బాబా అంటే నాకు చాలా చాలా ఇష్టం. నాకు సర్వమూ బాబానే. 2021లో నా గుండెల్లో నొప్పిలా వస్తుండేది. చాలా దడగా, నీరసంగా ఉండేది. నడిచినా, మెట్లు ఎక్కినా ఆయాసం కూడా వచ్చేది. డాక్టరుకి చూపించుకుంటే ఈసీజీ తీసి, "రిపోర్టు నార్మల్‌గానే వచ్చింది కానీ, లక్షణాలన్నీ గుండెకు సంబంధించినవి లాగానే ఉన్నాయి. అందుకని పది రోజులకు మందులు వ్రాస్తున్నాను. వీటికి తగ్గకపోతే వేరే టెస్టులు కూడా చేయిద్దాం" అన్నారు. నేను ఆ మందులు వాడాను కానీ, ఫలితం కనపడలేదు. అప్పుడు వేరే డాక్టర్, మంచి స్పెషలిస్ట్ అంటే అక్కడ చూపించుకున్నాను. ఆ డాక్టరు కొన్ని టెస్టులు చేశారు. అన్నీ నార్మల్‌గానే ఉన్నాయి. నా ఆరోగ్యంలో మాత్రం ఏ మార్పు రాలేదు. పైగా ఒక్కొక్కసారి ఎడమ చేయి బాగా లాగుతుండేది. మాకు తెలిసినవాళ్ళు నా బాధను చూసి వాళ్లకు తెలిసినవాళ్ళ టెస్టు రిపోర్టులన్నీ నార్మల్‌గా ఉన్నా హార్ట్ ప్రాబ్లంతో బాధపడుతున్నారని, అది ఏంజియోగ్రామ్ టెస్ట్ ద్వారానే తెలుస్తుందని, కాబట్టి నన్ను కూడా విజయవాడ హాస్పిటల్లో చూపించుకోమని అనేవారు. కానీ నేను సాయిబాబాను తలుచుకొని, "తండ్రీ! నాకు నువ్వే దిక్కు. నా పరిస్థితి నీకు తెలుసు. అన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టుకునే స్థితిలో నేను లేను. అయినా ఉన్న డబ్బులు మంచికి ఉపయోగపడాలి. అంతేగానీ మందులకు, టెస్టులకు ఖర్చు పెట్టడమంటే నాకు మొదటినుండి అంతగా నచ్చదు. ఆ విషయం మీకు తెలుసు బాబా. కాబట్టి నా సమస్యను తెలీకగా తగ్గించవా సాయినాథా" అని ఆయన మీదే భారమేసాను. తరువాత గుండెల్లో నొప్పి అనేది గ్యాస్టిక్, స్పాండిలైటిస్(వెన్నెముక డిస్కులు అరగటం), గుండె సమస్యలు ఈ మూడింటిలో దేనివలనైనా రావచ్చునని ఒక ప్రొఫెసర్ వీడియో ద్వారా తెలిసి నాకు ఎంతో ధైర్యం కలిగింది. బాబాయే ఆ విధంగా నాకు ధైర్యాన్నిచ్చారు అప్పుడు నాకు స్పాండిలైటిస్ సమస్య ఉన్నందున ఆ కారణంగానే నాకు ఈ సమస్యలని అనిపించింది. దాంతో హోమియో మందులు వాడటం మొదలుపెట్టాను. బాబా నా యందుండి గుండెల్లో నొప్పి, దడ, ఆయాసం అన్నీ తగ్గించారు. బాబా దయవలన ఇప్పుడు ఆ సమస్య తీరిపోయింది.


మా పాప డిగ్రీ పూర్తిచేసి హైదరాబాదులో గ్రూప్స్ కోచింగ్ తీసుకుంటుంది. తను 2023, జనవరిలో సంక్రాంతి పండగకి ఇంటికి వచ్చి, తిరిగి వెళ్ళింది. అక్కడికి వెళ్ళాక తనకి జలుబు, జ్వరం వస్తుంటే మందులు వేసుకుంది. అయినా తనకి తగ్గకపోయేసరికి పాపను ఇంటికి వచ్చేయమన్నాను. ఇక్కడికి వచ్చాక ఇక్కడి డాక్టరుకి చూపిస్తే, టెస్టులు చేసి టైఫాయిడ్ అన్నారు. అప్పుడు నేను, "పాపకు తగ్గిపోతే, మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని సాయిబాబాకు దణ్ణం పెట్టుకున్నాను. ఆ తండ్రి దయవల్ల పాపకు తగ్గి ఇప్పుడు బాగానే ఉంది.


నాకు తెలిసిన ఒకామె కాంటాక్ట్ బేసిస్‌లో కంప్యూటర్ ఆపరేటరుగా పని చేస్తుంది. ఆమెకి ఏలూరు నుండి బీమవరంకి బదిలీ అవ్వడంతో ఆమె చాలా బాధపడింది. అది తెలిసి నాకు కూడా చాలా బాధేసింది. ఎందుకంటే, వచ్చే తక్కువ జీతానికి రోజూ అంత దూరం ప్రయాణం చేయాలంటే చాలా కష్టం. నేను బాబాకి దణ్ణం పెట్టుకొని, "ఆమె ఏలూరులోనే ఉండేలా అనుగ్రహించు బాబా. అలా జరిగితే మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను తండ్రీ" అని ప్రార్థించాను. తర్వాత ఆమెతో, "దిగులు పడకండి. బాబాను ప్రార్థించండి. ఆయన తప్పక మేలు చేస్తార"ని చెప్పాను. ఇటీవల నేను ఆమెను కలిసినప్పుడు, "కొంత ఇబ్బందిపడినప్పటికీ బాబా దయవలన ప్రస్తుతం నాకు ఏలూరుకు బదిలీ అయింద"ని  చెప్పింది. అది విని నేను చాలా సంతోషించాను. 'బాబా ఉన్నారు - తప్పక మేలు చేస్తారు' అనేది అక్షరాలా నిజం.


సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై!!!


ఎటువంటి ఇబ్బంది లేకుండా యాత్రను పూర్తి చేయించిన బాబా


సాయిబంధువులందరికీ నమస్కారం. నా పేరు చల్లా గురుమూర్తి. నేను గుంటూరు నివాసిని. 2023, జూన్ 10న మేము ఆగ్రా, మధుర, కాట్రా(వైష్ణోదేవి), హరిద్వార్ యాత్రలకు రైలులో బయలుదేరాము. 2023, జూన్ 13, రాత్రి కాట్రా నుండి వైష్ణోదేవి ఆలయానికి బయలుదేరాము. మూడు నెలల క్రితం నాకొక ఆపరేషన్ జరిగి ఉన్నందున మేము డోలీలో వెళ్లాలనుకున్నాము. కానీ ఆ సమయంలో డోలీలు దొరకలేదు. దాంతో గుర్రాల మీద లేదా నడిచి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఆపరేషన్ అయిన కారణంగా గుర్రంపై వెళ్లే సాహసం నేను చేయలేకపోయాను. మా అమ్మాయి గుర్రం మీద వెళ్లడానికి భయపడింది. అందువల్ల నేను, మా అమ్మాయి నడిచి వెళ్లాలనుకున్నాము. నా భార్య, మాతో పాటు ఉన్న మరో ఇద్దరు యాత్రికులు గుర్రంపై బయలుదేరారు. మా కంటే ముందు నా శ్రీమతి వెళ్ళడం వలన, అదికాక ఆపరేషన్ అయిన మూడు నెలలకే 13 కిలోమీటర్ల దూరం నడిచి కొండపైకి వెళ్ళలంటే నాకు చాలా భయమేసి, "మా ప్రయాణం ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగాల"ని శిరిడీ సాయినాథుని, ఏడుకొండలవాడిని వేడుకున్నాను. వారివురి కృపవలన మా యాత్ర ఏ ఇబ్బందీ లేకుండా బాగా జరిగి తిరిగి మేము మా ఇంటికి క్షేమంగా చేరుకున్నాము. "ధన్యవాదాలు బాబా. ప్రస్తుతం మాకున్న సమస్యలను కూడా త్వరలో తీర్చు తండ్రీ".


సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo