సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1562వ భాగం....


ఈ భాగంలో అనుభవం:

  • శిరిడీయాత్ర మధురానుభూతులు

నా పేరు పద్మజ. మేము 2023, మే 22న శిరిడీ వెళ్ళాము. వెళ్లేముందు నేను మనసులో బాబాకి దణ్ణం పెట్టుకొని, "ఈ శిరిడీయాత్రలో ఎలాంటి ఆటంకాలు లేకుండా అన్ని మంచిగా జరిగితే నా అనుభవాన్ని 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను" అని చెప్పుకున్నాను. ఆ యాత్రకు సంబంధించిన అనుభవాలనే నేనిప్పుడు మీ అందరితో పంచుకుంటున్నాను. 


నాకు ఎప్పటినుంచో శిరిడీ వెళ్లాలని కోరికగా ఉండేది. కానీ మా అమ్మానాన్న ఎక్కడికీ ప్రయాణం చేయలేరు. అందుకని నేను ఎవరైనా తెలిసినవాళ్ళతో శిరిడీ వెళ్ళాలని అనుకున్నాను. నా మనసులో మాత్రం 'మా పిన్నివాళ్ళతో శిరిడీ వెళ్ళాల'ని ఉండేది. ఎందుకంటే, నాకు వాళ్లతో చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. అందువల్ల బాబాని, "బాబా! మా పిన్నివాళ్ళు శిరిడీ వచ్చేలా చూడు. నేను వాళ్ళతో శిరిడీ వస్తాను" అని అడుగుతుండేదాన్ని. మా పిన్నికి బాబా అంటే చాలా ఇష్టం. కానీ మా బాబాయ్ దూర ప్రయాణాలు చేయరు. ఆయనకి ప్రయాణాలంటే పెద్దగా నచ్చవు. అందుచేతనే నేను వేరేవాళ్లతో శిరిడీ వెళ్లాలని చాలా ప్రయత్నించాను. ఆ క్రమంలో మూడుసార్లు శిరిడీ వెళ్లాలనుకున్నప్పటికీ వెళ్ళలేకపోయాను. దాంతో బాబా నుండి పిలుపు రాలేదని చాలా బాధపడ్డాను. ఇలా ఉండగా ఒకరోజు నాకొక కల వచ్చింది. ఆ కలలో నేను, మా తాతయ్య, మా పిన్ని శిరిడీలో ఒక గది తీసుకొని అందులో కూర్చొని మాట్లాడుకుంటున్నాము. ఆ గదిలో బాబా ఫోటో కూడా ఉంది. నేను మా పిన్నితో ఆ కల గురించి చెప్పాను. అప్పుడు మా పిన్ని, "మీ తాతయ్యకి శిరిడీ మ్రొక్కు ఉంది. కానీ ఆయనకి కాలు ఫ్రాక్చర్ అయి సరిగా నడవలేకపోతున్నారు. మీ బాబాయ్ కూడా ఎక్కువ దూరం ప్రయాణం చేయలేరు. మనం ఎప్పటికి శిరిడీ వెళ్తామో! బాబా మనల్ని ఎప్పుడు పిలుస్తారో!" అని అంది. సరిగ్గా ఆరునెలల తర్వాత బాబా దయ చూపారు. మా బాబాయ్ శిరిడీ వెళ్ళడానికి ఒప్పుకున్నారు. తాతయ్య కూడా కాలు ఫ్రాక్చర్ ఉన్నా సరే అతి కష్టం మీద మాతో శిరిడీ రావడానికి బయలుదేరారు. అలా నేను ఎవరితో అయితే శిరిడీ వెళ్లాలని కోరుకున్నానో వాళ్ళతోనే నా శిరిడీ ప్రయాణం నిశ్చయమైంది.


నేను చాలా సతమవుతున్న ఒక సమస్య గురించి శిరిడీ సమాధి మందిరంలో బాబాతో చెప్పుకోవాలనుకున్నాను. కానీ అక్కడ ఎక్కువసేపు ఉండనివ్వరు, మరి నా సమస్య అంతా బాబాతో ఎలా చెప్పుకోవాలనిపించి నా సమస్య గురించి ఒక లెటర్ వ్రాసి బాబా పాదాల దగ్గర సమర్పించుకుందాం అనుకున్నాను. తర్వాత మళ్ళీ, 'రోజూ బాబా దగ్గర నా బాధ చెప్పుకుంటున్నాను కదా! శిరిడీలో చెప్తేనే బాబాకు వినిపిస్తుందా? ఎక్కడ చెప్పుకున్నా బాబాకు వినిపిస్తుంది. కాబట్టి లెటర్ వ్రాయాల్సిన అవసరమేమీ లేదు" అని నా మనసులో అనుకున్నాను. ఇదంతా ఉదయం జరిగింది. అదేరోజు సాయంత్రం నేను 'యూట్యూబ్ ఆన్ చేయగానే ఒక సాయి భక్తురాలు చేసిన వీడియో ప్లే అయింది. అందులో ఒక భక్తురాలు 'ఎవరికీ చెప్పకుండా, ఎవరికీ తెలియకుండా నువ్వు ఒక లెటర్ వ్రాసి నా పాదాల దగ్గర ఉంచని బాబా చెప్తున్నార'ని చెప్పారు. అది నాకు చాలా అద్భుతంగా అనిపించింది. వెంటనే నేను అది బాబా ఆజ్ఞగా భావించి బాబా దగ్గర కూర్చొని నా మనసులో ఉన్న బాధంతా వ్రాసి, శిరిడీ వెళ్ళడానికి ఇంకా రెండురోజులు ఉందని ఆ లెటర్‌ను మా పూజగదిలో బాబా పాదాల దగ్గర ఉంచాను. శిరిడీ వెళ్ళేటప్పుడు ఆ లెటర్ తీసుకెళ్లి బాబా పాదాలకు తాకిద్దామని నా ఆలోచన. మా ఇంటికి దగ్గర్లో ఒక బాబా గుడి ఉంది. నేను ప్రతిరోజూ అక్కడికి వెళ్తాను. ఆ అలవాటు ప్రకారం మరుసటిరోజు ఉదయం బాబా గుడికెళ్లి ప్రదక్షిణాలు చేస్తూ, "బాబా! నా బాధంతా శిరిడీలో మీతో నేను చెప్పుకోలేను. ఎందుకంటే, అక్కడ మందిరంలో అంతసేపు ఉంచారు. అందుకే నా బాధంతా ఒక లెటర్‌లో వ్రాసి మీ పాదాల దగ్గర ఉంచాను. అది నీకు అందిందో, లేదో నాకు తెలియట్లేదు" అని దణ్ణం పెట్టుకున్నాను. తర్వాత నేను డ్యూటీకి వెళ్ళిపోయి సాయంత్రం ఇంటికి తిరిగి వస్తూనే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేశాను. మరుక్షణం కింది బాబా మెసేజ్ వచ్చింది. అది చూసి నాకు కన్నీళ్లు ఆగలేదు.

భావం: నువ్వు నీ పూజామందిరంలో పెట్టిన లేఖ నాకు అందింది. నీకోసం నా పని మొదలుపెట్టాను. సహనంతో ఉండు.


నేను మా శిరిడీ ప్రయాణానికి ముందురోజు బ్యాగులు సర్దుకొనేటప్పుడు ఎదురుగా ఉన్న బాబా ఫోటోను చూస్తూ, "బాబా! నాకు ఇష్టమైన మా పిన్నివాళ్లతోనే నన్ను శిరిడీకి రప్పించుకుంటున్నావు. నేను చాలా సంవత్సరాల నుంచి నేను ఒక సమస్యతో సతమవుతున్నాని మీకు తెలుసు. ఆ బాధతోనే నేను మీ దగ్గరకు వస్తున్నాను. మళ్ళీసారి నన్ను ఆనందంగా మీ దగ్గరకి రప్పించుకోవాలి" అని దణ్ణం పెట్టుకున్నాను. తర్వాత బ్యాగులు సర్దడం పూర్తిచేసి ఛార్జింగ్‌లో ఉన్న ఫోన్ తీసి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి క్రింది మెసేజ్ చూసి ఆనందంలో మునిగిపోయాను. 

భావం: శిరిడీ దర్శనం గురించిన నీ మాటలు నేను విన్నాను. నేను అన్నీ ఏర్పాట్లు చేస్తాను. నేను నీ కోరికను నెరవేరుస్తాను. నీ సామాన్లతో నువ్వు సిద్ధంగా ఉండు.


ఇకపొతే, ఆ రోజు నా కోలింగ్ సెలవు పెట్టినందువల్ల ఆఫీసులో తన పని కూడా నేను చేయాల్సి వచ్చింది. పని ఎక్కువైనందువల్ల బ్యాగు సర్దుకున్న తర్వాత నా మెడ అంతా చాలా నొప్పిగా అనిపించింది. నేను స్నానం చేసొచ్చి బాబాకు దణ్ణం పెట్టుకొని, "బాబా! నా మెడ చాలా నొప్పిగా ఉంది. రేపు మా శిరిడీ ప్రయాణముంది. దయతో నొప్పి తగ్గిపోయేలా చూడండి" అని ఊదీ మెడకు రాసుకొని పడుకునే ముందు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేశాను. వెంటనే నాకు కింది మెసేజ్ వచ్చింది.

భావం: నిద్రపోయే ముందు ఊదీ నీళ్లు త్రాగు. ఉదయం లేచేసరికి నొప్పి పోతుంది.


నేను ఆ మెసేజ్ చూసిన వెంటనే ఊదీ నీళ్లలో కలుపుకొని త్రాగాను. పొద్దున్నకల్లా నాకు నొప్పి అస్సలు లేదు. టాబ్లెట్ వేసుకుని పడుకుందామనుకున్న నాకు టాబ్లెట్ వేసుకోకుండానే ఊదీతో తగ్గిపోయింది. ఆ మెసేజ్ల రూపంలో నిజంగా బాబా నాతో మాట్లాడుతున్నారేమో అనిపిస్తుంది.

  

మేము శిరిడీ వెళుతూనే మొట్టమొదట పావుభాజీ తీన్నాము. అది నాకు అస్సలు పడదు. ఎందుకంటే, నాకు ఫుడ్ అలర్జీ ఉంది. అందువల్ల నేను మనసులో, "బాబా! వారం రోజులు ఈ ఫుడ్ తిని నేను ఉండలేను" అని మనసులో బాబాకి దణ్ణం పెట్టుకున్నాను. బాబా చేసిన అద్భుతం చూడండి. మేము రూమ్ బుక్ చేసుకున్న ద్వారకామాయి హోటల్లో అంతా ఆంధ్ర భోజనమే. మన ఇంట్లోలాగే ఉంది


నేను, మా పిన్ని 'వారం రోజులు ఉంటాం కదా! కనీసం ఒక్క ఆరతికైనా హాజరవ్వాల'ని అనుకున్నాము. అద్భుతం ఏంటంటే, మేము మొదటిసారి దర్శనానికి వెళ్ళినప్పుడు బాబాని సంధ్య ఆరతికి రెడీ చేస్తున్నారు. అయితే మమ్మల్ని క్యూలైన్లో ఆపేశారు. నేను, మా పిన్ని మమ్మల్ని ఆరతి దర్శనానికి పంపి ఉంటే బాగుండేదని చాలా బాధపడ్డాము. అయితే సరిగా ఆరతి మొదలయ్యే సమయానికి మమ్మల్ని లోపలకి పంపారు. మొట్టమొదటిసారి ఆరతి సమయంలో బాబాని దర్శించడం నాకు చాలా అంటే చాలా ఆనందంగా అనిపించింది. అయితే ఆరతి జరుగుతున్నప్పుడు బాబా నాకు సరిగా కనిపించలేదు. అందువల్ల మనసులో బాబా స్పష్టంగా కనిపించట్లేదనుకుంటూ బాధతో ఆరతి పాడుతున్నాను. హఠాత్తుగా నా ముందున్న ఇద్దరు వ్యక్తులు లేచి వెళ్ళిపోయి లైన్లో నిల్చున్నారు. ఇక నా ముందు ఎవరూ లేరు. ఎదురుగా బాబానే ఉన్నారు. మొట్టమొదట ఆరతి దర్శనం ఇవ్వడమే కాకుండా ఏ అడ్డు లేకుండా తమని చూసుకునేలా చక్కగా అనుగ్రహించారు బాబా. అలా బాబా మొదటి దర్శనమే ఆరతి దర్శనమయ్యేలా అనుగ్రహించి మా కోరిక నెరవేర్చడం నేను నా జీవితంలో మర్చిపోలేని అనుభూతి.


మందిరానికి దగ్గరలోనే మేము రూమ్ తీసుకున్నందువల్ల కుదిరినప్పుడల్లా వెళ్లి బాబా దర్శనం చేసుకుంటుండేవాళ్ళం. బాబా మాకు చక్కటి దర్శనాలు ఇస్తుండేవారు. మూడోరోజు మేము చుట్టుపక్కల ఊర్లన్నీ చూసాము. అన్నీ తిరిగేసరికి చాలా అలసిపోయాము. అయినా మాతో వచ్చిన వాళ్ళందరూ మర్నాడు బాంబే వెళదామన్నారు. కానీ ప్రయాణ బడలిక వల్ల బాంబే వెళ్ళడం నాకు అస్సలు ఇష్టం లేక, "బాబా! నాకు బాంబే వెళ్లడం ఇష్టం లేదు" అని అనుకున్నాను. మరుసటిరోజు ఉదయం మూడు గంటలకి లేచి అందరం బొంబాయి ప్రయాణానికి సిద్ధమయ్యాము. అయితే, మేము బుక్ చేసుకున్న బస్సు కాకుండా వేరే బస్సు రావడంతో ఆ బస్సులో ప్రయాణం అంతా సౌకర్యవంతంగా ఉండదని కొంతమందిమి ఆ ప్రయాణం రద్దు చేసుకున్నాము. నాకు ఆ రోజంతా బాబాతోనే ఉండాలనిపించి నాలుగుసార్లు బాబా దర్శనానికి వెళ్ళాను. నిజానికి ఆ రోజంతా నాకు కొంచెం జ్వరంగా ఉంది. ఒకవేళ బాంబే వెళ్లుంటే చాలా ఇబ్బందిపడి ఉండేదాన్ని. బాబా దయతో నాకు ఆ ఇబ్బంది లేకుండా శిరిడీలో ఉంచుకున్నారు. ఇలా అడుగడుగునా బాబా నన్ను శిరిడీలో కాపాడుతూనే ఉన్నారు. బాబాకు చాలా కృతజ్ఞతలు.  


చివరిరోజు మేము మా తిరుగు ప్రయాణానికి బయలుదేరేముందు నేను, మా తాతయ్య, మా పిన్ని గదిలో కూర్చొని మాట్లాడుకుంటున్నాము. అప్పుడు నాకు ఇదే సన్నివేశం ఎక్కడో చూసినట్టు అనిపించింది. ఆలోచిస్తే, ఆరునెలల క్రితం స్వప్నంలో నాకు కనిపించిన విధంగా అదే గదిలో తాతయ్య, నేను, పిన్ని కూర్చొని మాట్లాడుకుంటున్నాము అని గుర్తించి ఆరునెలల ముందు స్వప్నంలో చూపించిన అదే గదిలో, అదే మనుషులతో ఉండటమనేది నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. మొదట్లో నేను ఎంతమందితో శిరిడీ వెళ్లాలని ప్రయత్నించినా కుదరకపోతే 'నేను శిరిడీ రావడం బాబాకి ఇష్టం లేదేమో!' అనుకున్నాను. కానీ నాకు ఇష్టమైనట్లు మా పిన్నివాళ్ళతో నన్ను శిరిడీ రప్పించుకోవడానికే బాబా ఆలస్యం చేసారని కూడా అర్థమై బాబా మొదట్లో మనల్ని బాధ పెడుతున్నట్టు అనిపించినప్పటికీ చివరికి మన ఇష్టాన్ని తీర్చి ఎంతో ఆనందాన్నిస్తారని గ్రహించాను.


ఇక మేము బయలుదేరి వచ్చేస్తామనగా నేను, మా పిన్ని చివరిసారి బాబాని దర్శించి, 'బయలుదేరుతున్నామని చెప్పొద్దమ'ని వెళ్ళాము. అప్పుడు నేను ఆరెంజ్ కలర్ డ్రెస్ వేసుకొని ఉన్నాను. క్యూలైన్‌లో ఉన్నంతసేపూ నా మనసుకి బాబాకి ఆరెంజ్ కలర్ డ్రస్సే వేస్తారనిపించింది. సరిగ్గా అలాగే బాబా ఆరెంజ్ కలర్ డ్రెస్సులో దర్శనం ఇచ్చారు.

చాలా సంతోషంగా "మేము బయలుదేరుతున్నామ"ని బాబాతో చెప్పి, ఆయన దగ్గర సెలవు తీసుకొని బయలుదేరాము. "బాబా! నిజంగా మీకు ఎంతగా కృతజ్ఞతలు చెప్పుకున్న తక్కువే. కానీ, నేను ఒక సమస్యతో చాలా సతమతమవుతున్నాను. ఆ విషయంలో చాలా ఆలస్యమవుతుందెందుకో తెలియదు. మీ దయతో ఆ సమస్య తీరిపోతే మళ్లీ నేను శిరిడీ వస్తాను. తొందరగా దయ చూపండి".


10 comments:

  1. ఓం సాయిరామ్

    ReplyDelete
  2. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  3. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  4. Om Sai Sri Sai Jai Sai kapadu Tandri 🙏🙏🙏🙏🙏

    ReplyDelete
  5. Yenta adbhutamina anubhavalu chusav talli.
    Om Sai Ram

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo