సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

రామచంద్ర దాదా పాటిల్


సాయిబాబాతో రామచంద్ర దాదా పాటిల్ యొక్క ఋణానుబంధం చాలా గొప్పది. అతనికి బాబా పట్ల ఉన్న  ప్రేమ చాలా గాఢమైనది.

రామచంద్ర దాదా పాటిల్ శిరిడీలో జన్మించాడు. అతను రాధాబాయి, దాదా కోతే పాటిల్ దంపతుల ఏకైక కుమారుడు. రామచంద్రకు ముగ్గురు సోదరీమణులు ఉన్నారు. వాళ్ళది సంపన్న కుటుంబం. పూర్వీకుల నుండి సంక్రమించిన వారి ఆస్తులు శిరిడీలోనేకాక పొరుగు గ్రామాల వరకు చాలా విస్తృతంగా వ్యాపించి ఉన్నాయి. వాళ్లకున్న అనేక ఎకరాల వ్యవసాయ భూముల్లో అన్ని రకాల ధాన్యం, చెఱకు పండేవి. రామచంద్ర అక్కడ పనిచేసే కూలీలను పర్యవేక్షిస్తుండేవాడు. రామచంద్ర చాలా తెలివైన విద్యార్థి. అతను మరాఠీలో ఏడవ తరగతి వరకు చదువుకున్నాడు. అతనికి చట్టంపై, న్యాయవ్యవస్థపై చాలా ఆసక్తి ఉండేది.

11 సంవత్సరాల వయస్సులో రామచంద్ర బాబా సేవను ప్రారంభించాడు. అతనికి బాబాపై అపారమైన విశ్వాసం. బాబా మాట అతనికి చట్టం. 1916లో అతను ఇన్‌ప్లూయెంజాతో తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. అన్నిరకాల ఔషధాలు ఉపయోగించారు గానీ, అవి గుణమివ్వలేదు. అతడు పూర్తిగా నిరాశ చెంది భయంతో సాయిని స్మరిస్తున్నాడు. ఒకరాత్రి బాబా అతనికి సాక్షాత్కరించి, "భయపడవద్దు, నీకు చాలా ఆయుష్షు ఉంది(తు గాబ్రో నాకోస్, తుల పుష్కల్ ఆయుసే అహాయ)" అని చెప్పారు. బాబా మాటలతో రామచంద్ర చాలా ఉపశమనం పొందాడు. తరువాత బాబా, "కానీ తాత్యా గురించే నా ఆలోచన. ఈరోజు నుండి సరిగా రెండు సంవత్సరాల తరువాత విజయదశమిరోజున తాత్యా మరణిస్తాడు. ఈ విషయం నువ్వు ఎవరికీ చెప్పకు!" అన్నారు. కొద్దిరోజుల్లో రామచంద్ర కోలుకున్నాడు. కానీ తాత్యా విషయంలో బాబా చెప్పిన దాని గురించి చాలా కలత చెందాడు. బాబా మాట ఎప్పుడూ నిజమై తీరుతుందని నమ్మకం ఉన్న అతను తాత్యాను కోల్పోతానన్న ఆలోచనను తట్టుకోలేకపోయాడు. ఆ విషయం గురించి నమ్మకస్తుడు, తనకు మంచి స్నేహితుడైన బాలాషింపీతో చెప్పాడు. తాత్యా, రామచంద్ర పాటిల్‌లు చిన్నప్పటినుండి మంచి స్నేహితులు, కలిసి పెరిగారు. ద్వారకామాయిలో ప్రతిరోజూ భోజన సమయంలో వారిద్దరికీ ఒకే పళ్లెంలో వడ్డించటం ద్వారా బాబా వారి మధ్య బంధాన్ని బలోపేతం చేశారు.

రామచంద్ర పాటిల్ సీతాబాయిని వివాహం చేసుకున్నాడు. కానీ ఆమె ద్వారా తనకు సంతానం లేనందున, అతను మరో వివాహం చేసుకున్నాడు. రెండో భార్యకు ఇద్దరు కొడుకులు పుట్టారు.

బాబా మహాసమాధి చెందిన తరువాత భక్తులు బాబాను బూటీవాడాలో సమాధి చేయడానికి రాత్రంతా పని చేస్తున్నారు. కొర్హాలే గ్రామానికి చెందిన పహిల్వాన్ అమీర్ శక్కర్ ఈ పరిణామాలను చూసి రామచంద్ర పాటిల్ తాతగారైన అప్పాజీ కోతే పాటిల్ సహాయం కోరాడు. మృతదేహాన్ని గ్రామంలో ఉంచడం మంచిది కాదని చెప్పి అతన్ని ఒప్పించాడు. అంతేకాదు, బూటీవాడాలో సమాధి నిర్మిస్తే, ఎప్పటికైనా వాళ్ళు కోరుకున్న బ్రాహ్మణ పూజారిని నియమించి ముస్లింలను లోపలికి రానీయకుండా నిషేధిస్తారని విజ్ఞప్తి చేశాడు. వెంటనే అప్పాజీ గ్రామస్తులను సమావేశపరిచి ఆ విషయాన్ని చెప్పాడు. దాంతో గ్రామస్తులు బాబా దేహాన్ని ఊరిబయట సమాధి చేయడానికి అంగీకరించారు. ఇది విన్న రామచంద్ర పాటిల్ అలా చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ బాబా చివరి కోరికను గౌరవించి ఆవిధంగా నడుచుకోవాలని ఖండితంగా చెప్పాడు. ఈ విషయం అప్పాజీకి కోపం తెప్పించింది. దాంతో అతను రామచంద్రను మళ్ళీ తన ఇంట్లోకి అడుగుపెట్టవద్దని ఆక్షేపించాడు. ఏదేమైనా బాబా చివరి కోరికను గౌరవించాలని నిశ్చయించుకున్నాడు రామచంద్ర పాటిల్. అందుకే అప్పటినుండి అతను తన మొదటి భార్య సీతాబాయి తన తాతగారి ఇంట ఉన్నప్పటికీ దాదాపు 12 సంవత్సరాలు ఆ ఇంట అడుగుపెట్టలేదు. బాబా చివరి కోరికను నెరవేర్చడంలో, బూటీవాడాలోనే బాబా దేహాన్ని సమాధి చేసేందుకు గ్రామస్తులను ఒప్పించడంలో రామచంద్ర విజయం సాధించాడు. 

36 గంటలపాటు బాబా దేహం ద్వారకామాయిలో ఉన్న తరువాత బాబా దేహాన్ని గ్రామమంతటా ఊరేగించి ఆ తర్వాత బూటీవాడాలో సమాధి చేశారు. బాబా సమాధిని, సమాధి మందిరాన్ని బహుమతిగా ఇచ్చిన రామచంద్ర పాటిల్, గోపాలరావు బూటీలకు సాయిభక్తులు ఎప్పటికీ కృతజ్ఞతలు చెప్పుకోవాలి.

బాబా సమాధి చెందిన తరువాత 13వ రోజున రామచంద్ర పాటిల్ విందు ఏర్పాటు చేశాడు. ఆ కార్యక్రమంలో భాగంగా వేలాదిమంది భక్తులకు లడ్డూలు పంపిణీ చేశారు. అద్భుతం ఏమిటంటే, వేలాదిమందికి లడ్డూలు పంపిణీ చేసిన తరువాత కూడా అంతే మొత్తంలో లడ్డూలు మిగిలివున్నాయి. ఆ లడ్డూలను బాబా సమాధి చెందినప్పుడు రాని భక్తులకు దాదాపు 2 నెలలపాటు పంపిణీ చేశారు.

బూటీకి రామచంద్ర పాటిల్ అంటే చాలా ఇష్టం. తరచూ బూటీ అతనిని నాగపూర్‌కు వచ్చి తనతోపాటు ఉండి వ్యాపారంలో తనకు సహాయం చేయమని అడుగుతుండేవాడు. కానీ శిరిడీ విడిచిపెట్టడమన్న ఆలోచనను రామచంద్ర అస్సలు భరించలేకపోయేవాడు.

ఆ రోజుల్లో శిరిడీ గ్రామ సరిహద్దు చావడి వరకు ఉండేది. అక్కడినుండి బెరాగాఁవ్ గ్రామం ఉండేది. ఈ రెండు గ్రామాల సరిహద్దులో ఉన్న మారుతి మందిరంలో రెండు హనుమంతుని విగ్రహాలు ఉండేవి. ఒకటి శిరిడీ గ్రామానికి చెందినది కాగా రెండోది బెరాగాఁవ్‌కు చెందినది. బెరాగాఁవ్ గ్రామాన్ని శిరిడీలో చేర్చడంలో రామచంద్ర ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరించాడు.

రామచంద్ర పాటిల్ 20 సంవత్సరాలపాటు శిరిడీ గ్రామ పంచాయతీలో గ్రామాధికారిగా పనిచేశాడు. ఇప్పటికీ అతని ఫోటో శిరిడీ నగరపాలిత కార్యాలయంలో ఉంది. అతడు తన అధికారిక విధులతోపాటు శిరిడీ సాయిబాబా సంస్థాన్ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొనేవాడు. చాలాకాలం సంస్థాన్ జాయింట్ సెక్రటరీగా కూడా ఉన్నాడు. అతడు దక్షిణ భిక్ష సంస్థలో కార్యదర్శిగా కూడా వ్యవహరించాడు.

రామచంద్ర పాటిల్ ఉదయాన్నే లేచి ఒక కప్పు టీ త్రాగేవాడు. మళ్ళీ మధ్యాహ్న ఆరతి వరకు ఏమీ తినేవాడు కాదు. అతను రోజూ ఆరతికి హాజరయ్యేవాడు. 1916లో తప్ప అతడు ఏ ఒక్క రోజూ అనారోగ్యానికి గురికాలేదు. అతడు తన 70 సంవత్సరాల వయస్సులో మరణించాడు. ఆరోజు అతడు కొంతమంది అతిథులను భోజనానికి ఆహ్వానించాడు. అతిథులు రావడం ఆలస్యం అయ్యింది. అందువలన అతని కుటుంబసభ్యులు అతన్ని భోజనం చేయమని చెప్పారు. దానికతను "మధ్యాహ్న ఆరతి వరకు వేచి ఉంటాన"ని బదులిచ్చాడు. అంతలో తలతిరుగుతున్నట్లుగా అనిపించి కూర్చున్నాడు. కుటుంబీకులు వైద్యుని తీసుకొచ్చే లోపల అతను ప్రశాంతంగా తన తుదిశ్వాసను విడిచాడు.

రామచంద్ర పాటిల్ వారసులు ఇప్పటికీ శిరిడీలో నివసిస్తున్నారు. అయితే వాళ్ళు తమ ఇంటిని, మిగిలిన ఆస్తులను సఖారాం షెల్కేకి అమ్మివేశారు. ఇప్పుడు వాళ్ళు శిరిడీ పోలీస్ స్టేషనుకి సమీపంలో, హైవేకి దూరంగా ఉన్న ఒక చిన్న బంగ్లాలో నివసిస్తున్నారు. 

సమాప్తం. 

 Source: Baba’s Anurag by Sai Bhakta Vinny Chitluri Sai Leela Magazine

5 comments:

  1. Om sai sri sai Jaya Jaya sai, om sai sri sai Jaya Jaya sai, om sai sri sai Jaya Jaya sai, om sai sri sai Jaya jaya sai🙏🙏🙏🙏

    ReplyDelete
  2. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete
  3. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo