సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

బాబా అనుగ్రహాన్ని పొందిన కొంతమంది


    1) హరిద్వార్‌బువా                  2)అబ్దుల్ ఖాదిర్
    3)మహమ్మద్ ఖాన్                  4)నూరుద్దీన్
    5)షేక్ అబ్దుల్లా                         6)అన్వర్ ఖాన్
    7)హిడాబేగ్                                8)అన్వర్‌ఖాన్ కాజీ
    9)మద్దూషా ఫకీరు                    10)ఒక మహమ్మదీయుడు

ఇమాంభాయ్ చోటేఖాన్ చెప్పిన కొన్ని వివరాలు:

హరిద్వార్‌బువా

శిరిడీలో ఎనిమిది రోజులుండిన హరిద్వార్‌బువాకు ఒక గొప్ప అనుభవం కలిగింది. అతను శిరిడీ పొలిమేరలోనున్న సెలయేటిలో స్నానం చేయడానికి బయలుదేరే సమయానికి ఒక పిచ్చుక వచ్చి అతని తలపై కూర్చునేది. అతను సెలయేట్లో స్నానం చేస్తున్నప్పుడు మాత్రం పిచ్చుక అక్కడున్న వేపచెట్టు పైకి వెళ్ళి వేచివుండేది. అతను స్నానం ముగించిన తరువాత తిరిగి వచ్చి తలపై కూర్చునేది. నేను, ఇతర భక్తులు కూడా ఈ దృశ్యాన్ని చూశాము. మేమందరం బాబా వద్ద ఉన్న సమయంలో, "ఈ దృశ్యం దేన్ని సూచిస్తుందో చెప్పమ"ని బాబాను అర్థించాడు బువా. అప్పుడు నిర్మాణంలో ఉన్న బూటీవాడాను ఉద్దేశించి బాబా ఇలా చెప్పారు:

"లా ఇల్ల ఇల్లిల్లాహ్ క్యా బడా దర్బార్ హై౹౹
మున్షీజీతో అందాయి హై, సర్దార్‌జీ చుతీ హై॥
అల్లా మాలిక్ హై, అల్లా అచ్ఛాకరేగా౹౹"

బాబా మాటలు (1917-18లో) నిర్మాణంలో ఉన్న బూటీవాడాను సూచిస్తున్నాయి. ఆ బూటీవాడానే నేడు ఎందరో భక్తులను ఆదరిస్తున్న పెద్ద దర్బార్. మున్షీజీలు, సర్దార్లు మొదలైన ఎంతోమంది అక్కడికి వస్తున్నారు.

అబ్దుల్ ఖాదిర్


1915వ సంవత్సరంలో అబ్దుల్ ఖాదిర్ అనే అతను శిరిడీ వచ్చి బాబాను దర్శించాడు. అతడొకరోజు తకియా వద్ద కూర్చుని ఉండగా బాబా అటువైపు వచ్చారు. అబ్దుల్, "నాకు సన్యాసి కావాలని ఉంది. నాకు 'సన్యాసం' (ఫకీరీ)' ఇవ్వండి" అని బాబాను అర్థించాడు. పిడికిలిలో ఉన్న వస్తువేదో విసురుతున్నట్లు బాబా తమ పిడికిలిని అబ్దుల్ వైపు విసిరారు. కానీ వారి చేతిలో ఏదీ ఉన్నట్లు కనిపించలేదు. ఆ క్షణం నుండి అబ్దుల్ మాటలలోను, ప్రవర్తనలోను మార్పు వచ్చింది. బాబా వలె మాట్లాడుతూ అందరికీ నైతిక సలహాలిచ్చేవాడు. ఒక్కొక్కసారి అర్థంకాని మాటలేవో మాట్లాడుతూ అందరినీ తిట్టేవాడు, రాళ్ళతో కొడతానని బెదిరించేవాడు. అతను భరించలేని విధంగా తయారయ్యాడు. అతని ప్రవర్తన వలన అతని సంబంధీకులు విసుగుచెంది అతన్ని అసహ్యించుకోసాగారు. బలవంతంగా తెచ్చుకున్న ఫకీరు స్థితిలో ఒకటిన్నర నెల గడిపాక ఒకరోజు అబ్దుల్ ఖాదిర్ మసీదు మంటపం దగ్గర ఉన్నప్పుడు బాబా ఎదురుపడి, "లావ్ బలే ఇదర్” అని పలుకుతూ పిడికిలితో అతని నుండి ఏదో లాక్కుంటున్నట్లు లాక్కున్నారు. వెంటనే అతనికి పూర్వస్థితి వచ్చింది. తరువాత 15 రోజులు శిరిడీలో ఉండి బాబా అనుమతితో కిర్కి వెళ్ళి అక్కడ బాబాజాన్ సమాధి ఉన్న వేపచెట్టు ఎదురుగా బీడీకొట్టు పెట్టుకుని జీవనం సాగించాడు.

అబ్దుల్ ఖాదిర్ మదర్‌ఆలీకి గురువు. మదర్‌ఆలీ ఒక ఖాజా. అతను అప్పట్లో శిరిడీలో ఉండేవాడు. తరువాత కాలంలో అతడు ఏవలాలో ఉన్నాడు. అబ్దుల్ ఖాదిర్ ఇతర మహమ్మదీయులతో కలిసి ‘నమాజ్’, ‘అజర్’ చేసేవాడు. ప్రతిదినం పగటిపూట మసీదులో బాబా ముందు మౌలూ నిర్వహించబడేది. ఉదయం వేళల్లో తబలా, సారంగీ మొదలైన వాద్యాలతో కవ్వాలి నిర్వహించబడేది. మండపంలో 'తబోత్' నిర్మించమని ఆదేశించి, దాని నిర్మాణానికి అవసరమైన డబ్బులు కూడా ఇచ్చారు బాబా. తబోత్ నిర్మాణ సమయంలో మాంసం, కిచిడీ తయారుచేసి బాబా అందరికీ పంచేవారు. ఇలా చాలా సంవత్సరాల పాటు జరిగింది. మండప నిర్మాణం జరిగిన తరువాత ఆ కార్యక్రమాలు నిలిపివేశారు. బాబా తాము స్వయంగా 'ఫత్యా' చదవడంగానీ, ఇతరులచే చదివించడంగానీ చేసేవారు. బాబా సశరీరులై ఉన్నప్పుడు, ముస్లింలందరూ మసీదులో నమాజు చేయడానికి వచ్చేవారు. అది ఈనాటికీ కొనసాగుతోంది. బాబా కూడా వారితో కలసి నమాజు చేసేవారు. “బాబా ధుని దగ్గర నిలుచుని నమాజు చేయడం స్వయంగా చూశాను, విన్నాను. కానీ వారు ఇతరులవలె మోకాళ్ళపై కూర్చోవడంగానీ, వంగడంగానీ చేసేవారు కాదు” అని ఇమాంభాయ్ చోటేఖాన్ చెప్పాడు.

మహమ్మద్ ఖాన్

నేవాసాకు చెందిన మహమ్మద్ ఖాన్ అను రోహిల్లా శిరిడీ వచ్చి బాబాతో కొంతకాలం గడిపాడు. ఒకసారి మసీదులో తెరవెనుక బాబా మహల్సాపతితో మాట్లాడుతున్నప్పుడు ఇతడు తెర ఎత్తి లోపలికి చూశాడు. ఆశ్చర్యమేమిటంటే, అతనికి బాబా కనిపించలేదు. అంతటితో అతనికి మతి చలించి వింతగా ప్రవర్తించసాగాడు. అతనిని తీసుకుని వెళ్ళటానికి నేవాసా నుండి అతని తమ్ముడు శిరిడీ వచ్చాడు. బాబా అతనికి ఊదీ ఇచ్చి ఆశీర్వదించి పంపారు. కొంతకాలానికి ఖాన్ మామూలు స్థితికి వచ్చాడు.

నూరుద్దీన్ 

ఒకసారి నూరుద్దీన్ అనే సైనికదళానికి చెందిన ఒక అశ్వసైనికుడు శిరిడీ వచ్చి బాబాను దర్శించాడు. వెంటనే తిరిగి వెళ్ళడానికి బాబాను అనుమతి కోరాడు. బాబా వెంటనే వెళ్లేందుకు అనుమతించక, "మరుసటిరోజు వెళ్ళమ"ని చెప్పారు. అందుకతను ‘తన దళం ముందుకు వెళ్తున్నందున తానక్కడ ఆగలేన’ని చెప్పాడు. బాబా అతని చేతిలో ఊదీ పెట్టి ఉర్దూలో ఏవో మాటలు అన్నారు. వాటి అర్థం ఏమంటే "గొయ్యి త్రవ్వు - ఊదీ తిను!” అని. అతను ఊదీ తీసుకుని గుర్రంపై స్వారీ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. కోపర్‌గాఁవ్ వద్ద అతనికి శవాన్ని మోసుకుంటూ వెళ్తున్న దృశ్యమొకటి కనిపించింది. అతను తన గమ్యం చేరుకున్నాడు. కానీ ఆ శవదృశ్యం మాత్రం అతనిని వీడిపోలేదు. ఆ శవదృశ్యం కనపడినరోజు అతను తృప్తిగా భోంచేసేవాడు. ఆ దృశ్యం కనపడనిరోజు ఎంత ప్రయత్నించినా ఏదో ఒక కారణం వల్ల భోజనం చేయలేకపోయేవాడు. దీనితో విసిగిపోయిన అతను తన ఉద్యోగాన్ని కూడా వదులుకున్నాడు. బాబా మాటలు విననందుకే తనకు ఈ దుస్థితి ప్రాప్తించిందని తెలుసుకుని తిరిగి శిరిడీ చేరి ఆరునెలల పాటు అక్కడ గడిపాడు. క్రమేణా అతను ఆ శాపం నుండి విముక్తుడయ్యాడు. తరువాత బాబా అనుజ్ఞ తీసుకుని వెళ్లిపోయాడు. తరువాత అతను దెవ్లాలిలో కిరాణాకొట్టు నడుపుకుంటూ జీవనం సాగించాడు.

షేక్ అబ్దుల్లా

బాబా నాకు తెలిసిన ఇద్దరు మహమ్మదీయుల ఆధ్యాత్మిక ప్రగతికి తోడ్పడ్డారు. వజాపూర్‌కి చెందిన షేక్ అబ్దుల్లా శిరిడీ వచ్చి బాబాను దర్శించాడు. బాబా అతనితో వైరాగ్యంగా మాట్లాడుతూ, “మనం ఈరోజు చనిపోయినా, ఎల్లుండికి మూడవరోజు! ఇల్లు, భూములు, ఆస్తుల వల్ల మనకేమి ఉపయోగం?” అన్నారు. అబ్దుల్లా తిరిగి స్వగ్రామానికి వెళ్లి ఇంటిని, ఆస్తిని భార్యాబిడ్డలకి అప్పగించి విరాగియై వీధుల వెంబడి తిరగడం ప్రారంభించాడు. రాత్రిళ్ళు సమాధుల వద్ద ఏదో గొణుగుకుంటూ గడిపేవాడు. ఎవరైనా ఏదైనా పెడితే తినేవాడు, లేదంటే ఆహార విషయం పట్టించుకోక పస్తుండేవాడు. ఈ విధంగా 10-12 సంవత్సరాలు జీవించి ఆ తరువాత మరణించాడు. ఆ 12 సంవత్సరాలలో అతనికి అద్భుతశక్తులు ప్రాప్తించాయి. ఒకసారి ఇమాంభాయ్ చోటేఖాన్ పనిమీద వెళుతుంటే అబ్దుల్ అతన్ని ఆపి ఒక ప్రదేశం పేరు చెప్పి, ఆ ప్రదేశంలో పాముందని హెచ్చరించాడు. వెళుతున్నది పగటిపూటే కాబట్టి చోటేఖాన్ అతని మాటలు లక్ష్యపెట్టకుండా వెళ్ళాడు. కానీ చిత్రంగా అతను చెప్పిన ప్రదేశంలోనే పాము కనిపించింది. ఆ ఊరిలో అబ్బాస్ సేఠ్ అనే బీడీ వర్తకుడు ఒకడుండేవాడు. అతనొకసారి అబ్దుల్లాను, "ఎందుకిలా భార్యాబిడ్డలను వదిలి పిచ్చివాడిలా తిరుగుతున్నావు?" అనడిగాడు. అందుకు అబ్దుల్లా, “నువ్వు తెలుసుకుంటావులే!" అన్నాడు. “తెలుసుకునేదేముంది? ఇది నిజంగా పిచ్చే!" అన్నాడు అబ్బాస్ సేఠ్. అబ్దుల్లా పిడికిలి బిగించి అందులో ఉన్నదేదో అబ్బాస్‌పై విసురుతున్నట్లు విసిరి, “నువ్వూ అలాగే అయిపో!” అన్నాడు. అంతటితో అబ్బాస్ సేఠ్ భార్యాబిడ్డలను, వ్యాపారాన్ని అన్నింటినీ విడిచిపెట్టి పిచ్చివాడై వీధుల వెంబడి తిరగసాగాడు.

అన్వర్ ఖాన్

భోపాల్‌లో (వర్షడ్, బెహర్) అన్వర్‌ఖాన్ అనే ముస్లిం ఉండేవాడు. అతడొకసారి శిరిడీ వచ్చి బాబాను దర్శించాడు. అతను బాబాతో, “నాకు ఈ సంసారం వద్దు" అని చెప్పాడు. అతను చావడిలో 12 నెలలు నివసించాడు. బాబా అతనికి ఖురాన్ మొదటి అధ్యాయంలోనున్న "బిస్‌మిల్లా కుళియ హియో వల్కఫిరోనో నాబుడో మాబుదానా" అనే మంత్రాన్ని 101 మార్లు అర్థరాత్రి వల్లించమని ఆదేశించారు. తరువాత “దవూత్” వల్లించమన్నారు. బాబా అతనికి పేడా ప్రసాదంగా ఇచ్చి అరేబియాలోని బాగ్దాద్‌కు వెళ్ళమని ఆదేశించారు. అన్వర్‌ఖాన్ శిరిడీ నుండి బొంబాయి వెళ్ళాడు. అక్కడ కాశిం అనే హాజీ కలిసి ప్రయాణపు ఖర్చులిచ్చి అతనిని అరేబియా పంపాడు. అన్వర్ అరేబియా వెళ్ళి మళ్ళీ తిరిగి రాలేదు.

హిడాబేగ్

ఔరంగాబాదు సమీపంలోని కనాడ్‌కు చెందిన హిడాబేగ్ అనునతడు ఒకసారి శిరిడీ వచ్చి కొన్నిరోజులు గడిపాడు. అప్పుడు ఢిల్లీకి చెందిన మౌల్వీ యాకూబ్ కూడా శిరిడీలోనే ఉన్నాడు. అతను రాత్రిగానీ, పగలుగానీ మంటపంలో కూర్చుని ఖురాన్ చదువుతూ ఉండేవాడు. ఒకరాత్రి 8 గంటల సమయంలో బాబా హిడాబేగ్‌తో, “నువ్వు ఇక్కడ ఉండవద్దు. కనాడ్ (ఔరంగాబాద్) దగ్గర ఉన్న కంటోన్మెంటుకు వెళ్లు! నీ పేరు ‘పంజాబ్ షా’గా మార్చుకో! అక్కడ కూర్చుని దొరికింది తిను!” అన్నారు. అతడలాగే అక్కడికి వెళ్ళి స్థిరపడ్డాడు. అతడిని ఒక గొప్ప సాధువుగా అందరూ గౌరవిస్తారు.

అన్వర్‌ఖాన్ కాజీ

అహ్మద్‌నగర్‌కు చెందిన 65-70 సంవత్సరాల అన్వర్‌ఖాన్ కాజీ, తేలీకాకూట్‌లో ఉన్న మసీదును పునర్నిర్మించాలని సంకల్పించాడు. దానికి కావలసిన నిధుల కోసం అతను శిరిడీ వచ్చి బాబాను అభ్యర్థించాడు. మూడు, నాలుగు రోజుల తరువాత ఒకనాడు బాబా మసీదు ఎదురుగానున్న రాతిపై కూర్చుని ఉన్నారు. ఇమాంభాయ్ చోటేఖాన్ కూడా అక్కడున్నాడు. బాబా అన్వర్‌ఖాన్‌తో, “ఆ మసీదు నీ నుండి కానీ, ఇతరుల నుండి కానీ డబ్బు స్వీకరించదు. తనకు కావల్సిన సొమ్ము అదే సమకూర్చుకుంటుంది. మసీదులోని నింబారు క్రింద మూడడుగులు త్రవ్వితే నిధి లభిస్తుంది. దానితో మసీదు పునర్నిర్మాణం చేయి!" అని చెప్పారు. కాజీ అహ్మద్‌నగర్ వెళ్ళి నింబారు వద్ద త్రవ్వితే నిధి లభించింది. ఆ డబ్బుతో మసీదును పునర్నిర్మించాడు. తరువాత అతను శిరిడీ వచ్చి తకియాలో కూర్చుని ఉన్న చోటేఖాన్ తదితరులతో ఆ విషయం చెప్పాడు.

మద్దూషా ఫకీరు

ఖాందేష్‌లోని జలగాంలో ఉన్న మీరాన్‌కు చెందిన మద్దూషా ఫకీరు సుమారు 1913 ప్రాంతంలో శిరిడీ వచ్చాడు. అతను బాబాను దర్శించి, తనకు అత్యవసరంగా 700 రూపాయలు కావాలని దుఃఖించాడు. బాబా అతనికి 700 రూపాయలు ఇవ్వమని బాపూసాహెబ్ జోగ్‌తో చెప్పారు. జోగ్ 700 రూపాయల వెండినాణేలు తెచ్చి బాబా ముందు పెట్టాడు. కొండాజీ కొడుకు గులాబ్, లక్ష్మణ్ బాలాభాస్కర్ షింపీ అను ఇద్దరు బాలురను పిలిచి ఆ డబ్బును మంటపం దగ్గర కూర్చుని ఉన్న ఫకీరుకు ఇవ్వమని బాబా ఆదేశించారు. ఆ బాలురు ఆ డబ్బులోనుండి 200 రూపాయలు కాజేసి, మిగిలిన 500 రూపాయలను ఫకీరుకిచ్చారు. ఫకీరు తిరిగి బాబా దగ్గరకొచ్చి తనకు 500 రూపాయలు మాత్రమే ముట్టాయని శోకించాడు. రెండు మూడు రోజులు అతడు అసంతృప్తిగా ఏదో గొణుగుకుంటూ గడిపాడు. బాబా మాత్రం మౌనంగా ఉన్నారు. తరువాత బాబా అతనికి ఊదీ ఇచ్చారు. దాంతో అతను బాబా వద్ద అనుమతి తీసుకుని వెళ్లిపోయాడు. అతను నడుచుకుంటూ శిరిడీ నుండి రెండు మైళ్ళ దూరంలో ఉన్న నీంగాఁవ్ చేరుకునేసరికి ఒక టాంగా వచ్చి అతని ముందు ఆగింది. నిజాం రాష్ట్రంలో తాహసీల్దారుగా పనిచేస్తున్న ఐరస్ షా అను పార్శీమతస్థుడు టాంగా నుండి దిగి ఫకీరును పలకరించాడు. ముందు ఫకీరుకు ఆహారం పెట్టి, తరువాత 200 రూపాయలు ఇచ్చి, “ఇప్పుడు నీకు తృప్తిగా ఉందా?" అని అడిగాడు. తరువాత ఐరస్ షా శిరిడీ వచ్చి, తూర్పుదిశగా గ్రామ సరిహద్దులో ఉన్న తాత్యాపాటిల్ క్రొత్తింటికి వెళ్ళి అక్కడున్న వారందరితో, “తనకు గతరాత్రి బాబా కలలో కన్పించి, “టాంగాలో శిరిడీ రమ్మని, నీంగాఁవ్ సమీపంలో పులితోలు చంకన పెట్టుకుని నడిచివస్తున్న ఫకీరొకడు ఎదురుపడతాడని, ఫకీరు ఆకలిగా ఉంటాడు కాబట్టి అతడికి ఆహారం పెట్టమని, తరువాత అతనికి 200 రూపాయలు ఇవ్వమ”ని ఆదేశించినందువల్ల తాను ఆహారం, డబ్బు తీసుకుని టాంగాలో వచ్చి వాటిని ఆ ఫకీరుకు ఇచ్చాన”ని చెప్పాడు.

ఒక మహమ్మదీయుడు

నైజాం రాష్ట్రంలో వైజాపూర్ తాలూకాలో ఉన్న లాసుర్ గ్రామానికి చెందిన ఒక మహమ్మదీయుడు ఒకసారి శిరిడీ వచ్చాడు. అతను బాబాను దర్శించి తనకు అత్యవసరంగా 4000 రూపాయలుగానీ, 5000 రూపాయలుగానీ కావాలని అభ్యర్థించాడు. బాబా అతడిని 'మర్రిచెట్టు క్రింద మలవిసర్జన చేయమని, అప్పుడతనికి నాణేలు నిండి ఉన్న బిందె ఒకటి దొరుకుతుంద'ని చెప్పారు. మరుసటి ఉదయం అతను మలవిసర్జన చేశాక శుభ్రం చేసుకునేందుకు లేచి నాలుగడుగులు వేయగానే అతని కాలికి బరువైన బిందె తగిలింది. దానినిండా నాణేలున్నాయి. అది చాలా బరువుగా ఉన్నందువల్ల అతను దాన్ని లేపలేకపోయాడు. దాంతో అతను చావడిలో ఉన్న బాబా దగ్గరికి వచ్చాడు. మరొకరిని తోడు తీసుకుని తిరిగి వెళ్ళేసరికి ఆ బిందె అక్కడ లేకపోవడంతో అతను శోకించాడు. “ఆ బిందెను రూయీకి చెందిన గణూకాడు అనునతడు తీసుకుని వెళ్ళిపోయాడని, ఇక తామేమీ చేయలేమ”ని బాబా చెప్పారు. ఆ మహమ్మదీయుడు తన దురదృష్టానికి దుఃఖిస్తూ వెనుదిరిగాడు. ఆ నిధిని తీసుకుపోయిన గణూకాడు గొప్ప ధనవంతుడయ్యాడు.

Source: http://saiamrithadhara.com/mahabhakthas/chote_khan.html
devotee’s experience of saibaba by b.vi. narasimha swamy. 

7 comments:

  1. 🙏🌺🙏ఏమిటి ఈ మానవాతీత లీల.. మన ఊహకు అందని ఈ చర్యలను లీల అంటున్నాం..వింటున్న కొద్దీ ఇంకా ఏదో తెలుసుకోవాలని ఆత్రుత..సాయి సహచర్యం పొందిన ఆ నాటి భక్తుల జన్మ ధన్యం కదా.సాయిబాబా వారి స్పర్శనా.. దర్శన కలిగిన వారి జీవితాలను మనం ఏమని వర్ణించగలం...ఊహించుకొని తన్మయత్వం పొందడం తప్ప... సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై🙏🌺🙏

    ReplyDelete
  2. బాబా మీరే నన్ను కాపాడండి తల్లి తండ్రి గురువు దైవము అన్నీ మీరు 💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    ReplyDelete
  3. Om Sai Ram 🙏🌹🙏
    ఓం శ్రీ సాయినాథాయ నమః 🙏
    ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః🙏

    ReplyDelete
  4. 🌷🌸🌷🙇🙇🙇🌷🌸🌷

    ReplyDelete
  5. Om Samardha Sadguru Sree Sai Nadhaya Namaha 🕉🙏😊❤

    ReplyDelete
  6. Entha baagunnayoo baba leelalu…..

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo