సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 505వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

  1. దక్షిణ స్వీకరించి పారాయణకు ఆశీస్సులిచ్చిన బాబా
  2. సర్వజీవ స్వరూపుడు సాయినాథుడు

దక్షిణ స్వీకరించి పారాయణకు ఆశీస్సులిచ్చిన బాబా
 
హైదరాబాదు నుండి సాయిభక్తురాలు శ్రీమతి ఉష తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.

ఓం శ్రీ సాయినాథాయ నమః. సాయి కుటుంబసభ్యులందరికీ నా నమస్కారం. నేను ప్రతిరోజూ సాయిభక్తుల అనుభవాలను చదవడానికి ఎంతో ఆసక్తి చూపిస్తాను. ఎందుకంటే వాటిలో ప్రతి ఒక్కరికి బాబాతో గల అనుబంధం, బాబా పట్ల తమ ప్రేమను మనకు తెలియజేయడంలో వారి సంతోషం అవగతమౌతుంది. అదేవిధంగా గతంలో నాకు జరిగిన సాయిలీలను మీ అందరితో పంచుకున్నాను. ఇప్పుడు మరొక సాయిలీలతో మీ ముందుకు వచ్చాను.

2020, ఏప్రిల్ నెలలో మా పాప కోసం ‘నవ గురువార వ్రతం’ చేయాలనుకున్నాను. కానీ ఇల్లంతా ఎంత వెతికినా సాయి సచ్చరిత్ర పుస్తకం కనబడలేదు. దాంతో, ‘నేను నవ గురువార వ్రతం చేయటం సాయికి ఇష్టమో లేదేమో’ అనుకున్నాను. అలా ఆలోచిస్తూనే ఒక వారం గడిచిపోయింది. మరుసటి గురువారం గూగుల్‌లో వెతికి pdf ద్వారా సచ్చరిత్ర పారాయణ చేయటం మొదలుపెట్టాను. కానీ ఇంట్లో ఏవో చికాకులు తలెత్తాయి. ఒక వారం పారాయణ పూర్తయింది. రెండో వారం పూజకు ఆటంకం ఏర్పడింది. ఆ మరుసటి గురువారం పూర్తి సచ్చరిత్రను పారాయణ చేసి, ఆరోజే 3వ వారం పారాయణ చేయటం మొదలుపెట్టాను. కానీ మనసులో చిన్న సంశయం వుండిపోయింది, ‘ఇలా ఆన్లైన్లో సచ్చరిత్ర పారాయణ చేయటాన్ని బాబా ఒప్పుకుంటారా లేదా’ అని. అందువల్ల నేను బాబాకు నమస్కరించి, “బాబా! నేను ఇలా ఆన్లైన్లో పారాయణ చేయటం సరైనదే అని మీరనుకుంటే మీరే స్వయంగా నా వద్ద 100 రూపాయలు దక్షిణగా అడిగి తీసుకోండి” అని మనస్పూర్తిగా బాబాను కోరుకున్నాను. ఎందుకంటే, సచ్చరిత్ర 14వ అధ్యాయంలో బాబా తనకు ఇష్టం లేకుండా దక్షిణను స్వీకరించరని ఉంది కదా! ఆ సమయంలో లాక్డౌను అమలులో ఉన్న కారణంగా నేను బాబా గుడికి వెళ్ళలేకపోయాను. ఆరోజు మధ్యాహ్నం మా అపార్టుమెంట్ గార్డెన్లో పనిచేసే ఒకామె వచ్చి, “మేడం! బియ్యం, కూరలు కొనుక్కోవడానికి చాలా కష్టంగా వుంది, 100 రూపాయలుంటే ఇవ్వండి” అన్నది. వెంటనే నేను బాబాను కోరుకున్న విషయం గుర్తుకు వచ్చింది. నేను తనకు 100 రూపాయలు ఇచ్చాను. నా ప్రార్థన మన్నించి బాబానే ఆ రూపంలో వచ్చి దక్షిణ తీసుకొని నా సచ్చరిత్ర పారాయణ పూర్తిచేయమని చెప్పినట్లు అనిపించి చాలా సంతోషించాను. 9 గురువారాలు పూర్తయ్యాక నాకు బాబా గుడికి వెళ్ళే అవకాశం కూడా బాబానే ఇచ్చారు. దాదాపు నాలుగు నెలల తర్వాత బాబాను కనులారా దర్శించుకున్నాను. బాబా అనుగ్రహంతో మా పాపకు ఇంటర్‌లో మంచి పర్సంటేజ్ వచ్చింది. తనకు ఏదైనా మంచి ఇంజనీరింగ్ కాలేజీలో సీటు వస్తే సంతోషం. అది కూడా బాబానే ప్రసాదిస్తారనే నమ్మకం నాకు చాలా ఉంది. ఎందుకంటే, “భారం నా మీద వేయండి, నేను చూసుకుంటాను” అన్నారు కదా బాబా! భారమంతా ఆయన మీదనే వేశాను, కనుక అంతా బాబానే చూసుకుంటారు.

అఖిలాండకోటి బ్రహ్మాండనాయక సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః.

సర్వజీవ స్వరూపుడు సాయినాథుడు

ఒంగోలు నుండి సాయిభక్తుడు శ్రీ మూర్తిగారు తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.

సాయిబంధువులందరికీ నమస్కారం. ఈ బ్లాగ్ నిర్వాహకులకు నమస్కారం. నా పేరు PVLN.మూర్తి. మాది ఒంగోలు. 1987, జూన్ 13వ తారీఖున మా అక్కయ్య మరియు మా బావగారు అమెరికా వెళ్ళుతున్నందున వాళ్ళను విమానం ఎక్కించి రావటానికి నేను హైదరాబాద్ వెళ్ళాను. ఆ సందర్భంలో మేమంతా కలిసి హైదరాబాదులోని పంజగుట్టలో ఉన్న సాయిమందిరానికి ఉదయాన్నే బాబా అభిషేక సమయానికి వెళ్ళాము. సాయిమందిరం మొత్తం భక్తులతో నిండి వుంది. ఆరోజు సాయిభక్తులదరికీ పండుగ, ఎందుకంటే ఆరోజు గురువారము కాబట్టి. అందరితో పాటు మేము కూడా బాబాకు జరుగుతున్న అభిషేకాన్ని చూస్తూ ఆ హాల్లో కూర్చున్నాము. నేను ఎక్కడ వున్నా బాబా నామజపం చెయ్యటం అలవాటు, కనుక బాబా నామం చేస్తూ ఎంతో ఆనందంలో వున్నాను. ఈ లోపల బాబాకు అలంకరణ కూడా పూర్తయింది. భక్తులంతా బాబా పాద స్పర్శ కోసం వరుసగా నిలబడివున్నారు. నేను దూరంనుంచే సాయి పాదాలకు నమస్కరించి, విశేషంగా వారి కృపను అక్కడి భక్తులందరితో పాటు మా మీద కూడా చూపమని మనసారా వేడుకున్నాను. తరువాత నేను మనసులోనే, “బాబా! ఈరోజు నా పుట్టినరోజు. మీ విశేషమైన కృపను నా మీద చూపండి” అని బాబాను ప్రార్థించి, వెనుకకు తిరిగి గడప దాటి నిలబడి మావాళ్ళ కోసం ఎదురుచూస్తూ గోడకు ఆనుకుని సాయినే చూస్తూ వున్నాను. ఎందుకంటే ఎక్కువమంది వుంటే నేను నెట్టుకుని పోను, దూరం నుంచే బాబాకు నమస్కారం చేసుకుని ఒక ప్రక్కన నిలబడతాను. ఇది నా అలవాటు. ఈ లోపల సాయికి అభిషేకం చేసిన మందిర పాలకవర్గ సభ్యుడు అందరూ చూస్తూ వుండగా చేతిలో పూలదండతో అందరినీ దాటుకుంటూ గడప దాటి నా వద్దకు వచ్చి, ఆ పూలదండను నాకు ఇచ్చి, “ఈ పూలదండను బాబా మెడలో వేసి పాద నమస్కారం చేసుకో!” అన్నారు. ఇది కలో నిజమో అర్థంకాక ఒక్కసారిగా సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాను. మరలా అంతలోనే తేరుకుని అనంతమైన ఆనందంతో వారి వెంట బాబా వద్దకు వెళ్లి బాబా మెడలో పూలహారం వేసి, సాయినాథునికి అనేకానేక పాదనమస్కారములు చేసుకుని, బాబా వారి పాలకోవా ప్రసాదం తీసుకుని వచ్చాను. “అసలిదంతా ఎలా జరిగింది? నాది ఈ ఊరు కాదు, నాకు ఎటువంటి ప్రత్యేకతా లేదు. నేను ఇక్కడ ఎవ్వరికీ తెలియను, ఒక్క బాబాకు తప్పితే! మా కుటుంబసభ్యులకు తప్ప మరెవ్వరికీ తెలియని నా పుట్టినరోజు నా సాయికి తెలుసు. అందుకే సాయినాథుడు నా ఊహకు అందని విధంగా తమ దివ్యాశీస్సులు నాకు అనుగ్రహించారు” అని మనసులోనే అనుకుంటూ బాబా చూపిన విశేషమైన కృపకు అంతులేని ఆనందంలో మునిగిపోయాను. ఈ అనుభవం ద్వారా వారి దివ్యత్వాన్ని నాకు రుచి చూపించి, ‘సర్వజీవ స్వరూపుడు సాయినాథుడు’ అని మరియొకసారి తెలియజేశారు బాబా. ఈ అనుభవం జరిగి చాలా సంవత్సరాలైనా ఇప్పటికీ అది నా కళ్ళకు కట్టినట్టుగానే ఉంటుంది. ఈ నా అనుభవాన్ని సాయిబంధువులతో పంచుకోవటం నాకెంతో ఆనందంగా వుంది.
 
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై! సద్గురు శ్రీ భరద్వాజ మహరాజ్ కీ జై!

- మీ సాయిబంధువు 
PVLN.మూర్తి/


7 comments:

  1. Sairam.sir..Chala baagundi.sir..Elaanti anubhavam oka saari naku kaligindi.

    ReplyDelete
  2. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!

    ReplyDelete
  3. Om Sairam
    Sairam always be with me

    ReplyDelete
  4. ఓం సాయిరాం...🌹🙏🏻🌹

    ReplyDelete
  5. ఓం సాయిరాం...🌹🙏🏻🌹

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo