సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1694వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. ఇలా ఉంటాయి మన బాబా మహిమలు
2. దేశంకాని దేశంలో ఉచితంగా బీటెక్ సీటు ప్రసాదించిన బాబా

ఇలా ఉంటాయి మన బాబా మహిమలు

సాయిభక్తులందరికీ బాబా ఆశీస్సులు. నా పేరు నాగలక్ష్మి. మాది విజయవాడ. నేను 2008 నుండి బాబాని పూజిస్తున్నాను. నాకు ఏ కష్టమొచ్చినా బాబా చూసుకుంటారు. నా జీవితంలో జరిగే ప్రతిదీ బాబా ప్రసాదించిన వరమే. ఈ బ్లాగులోని భక్తుల అనుభవాలు చూసి నేను కూడా నా అనుభవాలు పంచుకోవాలని అనుకుంటుండేదాన్ని. కానీ సరిగ్గా వ్రాయలేనేమోనని వెనకడుగు వేసేదాన్ని. బాబా ఏదో ఒక రూపంలో పంచుకోమని సూచిస్తుండేవారు. ఇప్పుడు ఇటీవల జరిగిన ఒక అనుభవాన్ని మీతో పంచుకుంటాను. 2023, అక్టోబర్ నెల మూడో వారంలో మా బాబుకి తీవ్రంగా జ్వరం వచ్చింది. బాబా దయవల్ల ఒక మూడు రోజుల్లో తగ్గింది. కాని జ్వరం తగ్గిన మరుసటిరోజు నుండి బాబుకి విపరీతమైన కాళ్లనొప్పులు మొదలయ్యాయి. నాకు చాలా భయమేసి, "బాబా! ప్రతి గురువారం సంధ్య హారతికి గుడికి వచ్చి పారాయణ చేస్తాను" అని అనుకున్నాను. బాబా దయవల్ల మరుసటిరోజుకి కాళ్లనొప్పులు కాస్త తగ్గి, ఆ మర్నాటికి ఎటువంటి నొప్పులు లేవు. నేను తర్వాత గురువారం నుండి సచ్చరిత్ర సప్తాహ పారాయణ బాబా సన్నిధిలో మొదలుపెట్టాను. అయితే, బాబుకి కాళ్లనొప్పులు తగ్గిన ఒక వారం తర్వాత మళ్లీ జ్వరం వచ్చింది. అప్పుడు నేను, "బాబా! మావాడికి జ్వరం తగ్గేలా చేయండి తండ్రీ. మీ అనుగ్రహం బ్లాగు ద్వారా తోటి సాయిభక్తులతో పంచుకుంటాను" అని అనుకున్నాను. చిత్రంగా నేను ఎప్పుడైతే బ్లాగులో పంచుకుంటానని అనుకున్నానో, అప్పటినుంచి బాబుకి జ్వరం పూర్తిగా తగ్గిపోయింది. మన బాబా మహిమలు అలా ఉంటాయి. "ధన్యవాదాలు బాబా. చాలారోజుల నుంచి శిరిడీ వెళ్లాలన్న నా కోరిక తీరడం లేదు బాబా. అందుకని మీరు నన్ను శిరిడీ తీసుకొని వెళ్లెవరకూ నాకు చాలా ఇష్టమైన నాన్ వెజ్ తినడం మానేస్తాను. అలాగైనా నన్ను మీరు శిరిడీ తీసుకెళ్తారని అనుకుంటున్నాను. ఇక మీ దయ బాబా. ఎందుకంటే, మీ ఆజ్ఞ లేనిదే శిరిడీ వెళ్లలేమని నేను నమ్ముతాను".


దేశంకాని దేశంలో ఉచితంగా బీటెక్ సీటు ప్రసాదించిన బాబా

ఓంసాయి శ్రీసాయి జయజయసాయి. సాయిభక్తులకు నమస్కారం. నా పేరు కళ్యాణి. నేను ఇప్పుడు పంచుకోబోయే అనుభవం నా జీవితంలో జరిగిన ఒక పెద్ద అద్భుతం. బహుశా ఇటువంటిది మళ్లీ నా జీవితంలో జరగకపోవచ్చు. మా పెద్దబ్బాయి పేరు సోమశేఖర్. 2022లో తను ఇంటర్ పూర్తి చేసాడు. ఇంటర్లో తనకి ఒక ముగ్గురు మిత్రులు ఉన్నారు. అందరూ మెరిట్ విద్యార్థులు. క్లాసులో వాళ్లదే ఫస్ట్ ర్యాంక్. మేమందరం చాలా సంతోషించేవాళ్ళం. ఇంటర్ పూర్తయ్యాక పిల్లలు ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలంటే తల్లిదండ్రులందరం మా ఇంట్లో కూర్చున్నాం. అప్పుడు పిల్లలు, "మేము  ఇండియాలో బీటెక్ చేయము, కెనడా వెళ్తాము" అని చెప్పారు. అది విని మాకు చాలా ఆశ్చర్యం కలిగింది. కెనడాలో చదువు, అది కూడా బీటెక్ అంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. మాకేమో వెనక ఆస్తులు ఏమీ లేవు, చేతిలో పైసా లేదు. అందువల్ల మాకు నోట్లోంచి మాటలు రాలేదు. నేను, మావారు ఎంతలా చెప్పడానికి ప్రయత్నించినా మా అబ్బాయి ఒప్పుకోలేదు. ఇక చేసేది లేక బాబా మీద భారం వేసి సరేనన్నాము.

పిల్లలు ముందుగా IELTS పరీక్ష వ్రాసారు. అందరికీ మంచిగా స్కోర్స్ వచ్చాయి. వెంటనే వాళ్ళు కెనడాలో అడ్మిషన్ కోసం అప్లై చేసుకున్నారు. కానీ హఠాత్తుగా నలుగురు పిల్లల్లో ఒకరి అమ్మగారు చనిపోయారు. దాంతో ఆ అబ్బాయి కెనడా వెళ్లే ప్రక్రియ నుండి విరమించుకున్నాడు. మిగిలిన ముగ్గురు పిల్లలు బాధపడ్డారు. అడ్మిషన్ విషయానికి వస్తే, మా అబ్బాయికి అడ్మిషన్ రాక వాడు చాలా బాధపడ్డాడు. మిగిలిని ఇద్దరిలో కూడా ఒక అబ్బాయికి మాత్రమే అడ్మిషన్ వచ్చింది. ఆ అబ్బాయి 16 లక్షల రూపాయలు ఫీజు కట్టి, మరో ఏడు లక్షలు తీసుకొని కెనడా వెళ్ళాడు. మిగతా ఇద్దరు పిల్లలు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. మేము "ఎందుకు బాబా ఇలా చేశావు?" అని అనుకున్నాం. నేను మా అబ్బాయి కెనడా వెళ్లే ప్రయత్నాలు మొదలుపెట్టినప్పటినుండి రోజూ చేస్తున్న బాబా చరిత్ర పారాయణ ఆపకుండా చేస్తూ బాబా ఏదో మంచి చేస్తారని ఎదురుచూసాం.

ఒకరోజు మా అబ్బాయి మరోసారి ప్రయత్నించేందుకు ఒక కన్సల్టెన్సీకి వెళితే, పని జరగలేదు. కానీ అదేరోజు ఒక విచిత్రం జరిగింది. ఆ కన్సల్టెన్సీవాళ్ళు కెనడా వెళ్లేందుకు కాకుండా ఇటలీ గురించి మా అబ్బాయితో చెప్పారు. మా అబ్బాయిలో ఇంటర్లో 96.1% వచ్చినందున వాళ్ళు, "ఇటలీలో చాలా మంచి కాలేజీలు ఉన్నాయి. వాటిలో ఖచ్చితంగా అడ్మిషన్, దాంతో పాటు స్కాలర్ షిప్ కూడా వస్తుంది, ఖర్చు ఏం లేకుండా బిటెక్ చేయవచ్చు" అని చెప్పారు. మాకు చాలా ఆశ్చర్యం కలిగింది. 'ఇలా కూడా ఉంటుందా? ఇది నిజమేనా? ఖర్చు లేకుండా మెరిట్ మీద అడ్మిషన్ వస్తుందా?' అని మేము చాలా సందేహపడ్డాము. కానీ కొన్ని దినాలపాటు కొంత విచారణ జరిపిన మీదట మా అబ్బాయి 'వాళ్ళు చెప్పింది నిజమేన'ని నిర్ధారించాడు. అప్పటివరకు ఏ కాలేజీలో జాయిన్ అవ్వని తను, తన ఫ్రెండ్ చాలా ఆలోచించుకున్నాక మా అబ్బాయి ఇటలీ వెళ్ళడానికి, తన ఫ్రెండ్ జర్మనీ వెళ్ళడానికి నిశ్చయించుకున్నారు. అయితే కన్సల్టెన్సీవాళ్ళకి చాలా డబ్బులు కట్టాల్సి వస్తుందని మా అబ్బాయి ప్రతి విషయాన్ని తనే స్వయంగా పరిశోధించి ప్రాసెస్ మొదలుపెట్టాడు. ఆ క్రమంలో ఒక కన్సల్టెన్సీ అబ్బాయి తనకి ఉచితంగా సహాయం చేసాడు. ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ 2023, అక్టోబర్ 26, గురువారంనాడు మా అబ్బాయికి వీసా వచ్చింది. మాకు చాలా ఆనందం కలిగింది. చేతిలో ఒక్క నయా పైసా లేని సమయంలో దేశంకాని దేశంలో ఉచితంగా సీటు తెచ్చుకోవడం, హఠాత్తుగా వీసా కోసం 18 లక్షలు చూపించగలడగం అంతా బాబా దయనే కదా! బాబా ఆశీస్సులతోపాటు మీ అందరి ఆశీస్సులు ఎల్లప్పుడూ మా అబ్బాయికి ఉండాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".


సాయిభక్తుల అనుభవమాలిక 1693వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా దయతో విదేశీ ప్రయాణం
2. దసరా పండగకు నెలసరి అడ్డులేకుండా అనుగ్రహించిన బాబా

బాబా దయతో విదేశీ ప్రయాణం

నేను ఒక సాయిభక్తుడిని. ఒకానొక వయసులో ప్రతిరోజూ బాబా చరిత్ర చదివే అలవాటు నాకు ఉండేది. అయితే వయసు, ఉద్యోగంలో హోదా పెరిగే కొలదీ బాబా చరిత్ర చదవడం మానేసాను. బహుశా బాబా నన్ను పరీక్షించదలిచారేమో! పెళ్ళైన కొన్నాళ్ళకి నా స్వకర్మల వల్ల, చేసిన పాపాల వల్ల కొంచెంకొంచెంగా నేను సమస్యల సుడిగుండంలోకి నెట్టివేయబడి అన్నీ రకాలుగా నష్టపోయాను. 'కష్టాలు వచ్చినప్పుడే మనం దేవుడిని గుర్తు చేసుకుంటామ'ని బాబా చరిత్రలో చెప్పినట్టు నేను మరల బాబా చరిత్ర నిత్య పారాయణ మొదలుపెట్టాను. కొంతకాలానికి నేను, నా భార్య, మా అమ్మాయి విదేశాలకు వెళ్లాలని అనుకున్నాం. అయితే నా భార్య తనకు నచ్చిన దేశమైతేనే వస్తానని అంది. సరేనని, బాబా మీద భారమేసి తనకు నచ్చిన దేశానికి వెళ్లే ప్రయత్నం చేద్దామనుకున్నాం. అందుకోసం మా బావ ఒకరు మార్గం చెప్పారు. అదే సమయంలో మంచి, చెడు చెప్పే ఒక గురువుగారు బాబా దయవల్ల నాకు కలిశారు. ఆయన అనుమతితో ముందుగా నా భార్య ఆ దేశానికి వెళ్లేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాం. అయితే రెండుసార్లు మా ప్రయత్నాలు విఫలమయ్యాయి. తర్వాత ఒక కార్తీక సోమవారం శివాలయంలో దీపారాధన చేసి ఇంటికొచ్చి మా విదేశ ప్రయాణం గురించి మాట్లాడుకుంటూ పడుకున్నాం. మరుసటిరోజు ఉదయం 6గంటలకు మా ప్రయత్నంలో మొదటి భాగం ఫలించింది. అంటే మేము కోరుకున్న దేశానికి వెళ్ళటానికి మొదటి ద్వారం తెరుచుకుంది. అన్నీ అర్హతలు ఉన్నట్టు, వీసా అప్లై చేసేందుకు అర్హులమన్నట్లు మాకు మెయిల్ వచ్చింది. నా భార్యకి వీసా వచ్చిన తర్వాత తను ఏ క్షణమైనా మమ్మల్ని వదిలి ఉద్యోగం కోసం ఆ దేశం వెళ్లాల్సి ఉంటుంది. తను వెళ్లిన తర్వాత నేను, నా కూతురు కూడా వెళ్లాల్సి ఉండగా ఈ లోపల మిగిలిన పనులు చూసుకోవడానికి, మా ఇతర కుటుంబసభ్యులతో గడపటానికి, ముఖ్యంగా నా భార్యతో సమయం గడపటానికి నేను ఉద్యోగం మానేయాల్సి వచ్చి, మా విదేశీ ప్రయాణ ప్రయత్నాలు ఫలిస్తాయన్న నమ్మకంతో చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేసాను. కానీ తర్వాత వ్యవహారమంతా పరమపద సోపాన పటంలో ఒక నిచ్చెన ఎక్కితే, రెండు పాములు కాటేసినట్టు సాగుతుండేది. కొన్నాళ్ళకి వీసా ఇంటర్వ్యూకి వెళ్లే సమయం వచ్చినప్పటికీ అది సవ్యంగా జరగలేదు. ఆ రోజు నా భార్య చాలా ఇబ్బందులు పడి ఎంతో బాధ అనుభవించి, "ఇక ఆ దేశం వెళ్ళాలన్న ఆలోచననే వదిలేద్దామ"ని అంది. అయ్యో.. ఇలా జరిగిందేమిటని అని చాలా బాధపడ్డాము. అంతలో మళ్ళీ కార్తీకమాసం వచ్చింది. బాబా చరిత్రలో, ‘ఇష్ట దైవాన్ని మనసారా ఆరాధిస్తే, ఆ దైవమే సరైన మార్గం చూపిస్తాడ’ని చెప్పబడింది. అనుకోకుండా నేను ఒక గురువారం మా ఇంటికి దగ్గర్లో ఉన్న సాయిబాబా గుడికి వెళ్ళాను. ఆ సమయంలో అక్కడ అన్నదానం జరుగుతుంది, ఆ గుడివాళ్ళు నన్ను భోజనం చేసి వెళ్ళమన్నారు. కానీ కార్తీక ఉపవాస దీక్ష వల్ల నేను ప్రసాదం స్వీకరించలేక మనసులో, "బాబా! నా భార్యకి వీసా వస్తే, ఈ గుడిలో అన్నదానం చేస్తాన"ని బాబాకి నమస్కారం చేసుకున్నాను. అంతే, బాబా దయ చూపారు. సరిగ్గా నెలరోజులకు నా భార్యకి వీసా వచ్చింది. ఇక అప్పటినుండి మాకు, మా కుటుంబానికి ఏ మంచి జరగాలన్న బాబా సప్తాహ పారాయణ చేయటం, కోరిక తీరిన వెంటనే బాబా గుడిలో అన్నదానం చేయటం అలవాటు చేసుకున్నాం. బాబా గుడిలో పల్లకి ఇద్దామని కూడా అనుకొని, బాబా దయతో గురుపౌర్ణమినాడు ఎంతో అంగరంగ వైభవంగా పల్లకి ఉత్సవం జరిపి పల్లకిని బాబాకి సమర్పించుకున్నాము. తర్వాత 2023, ఫిబ్రవరిలో నా భార్య తను కోరుకున్న దేశానికి వెళ్ళింది. ఆ తర్వాత నేను, నా కూతురు నా భార్య దగ్గరకు వెళ్లడానికి ప్రయత్నాలు చేస్తే అప్పుడు కూడా ఏవేవో అడ్డంకులు వచ్చాయి. అప్పుడు నేను బ్లాగులోని తోటి భక్తుల అనుభవాలు చూసి, 'నా కోరిక నెరవేరితే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన'ని అనుకున్నాను. బాబా దయతో అడ్డంకులు తొలగి మేము నా భార్య దగ్గరకి వెళ్ళడానికి మార్గం సుగమమై నేను, నా కూతురు సెప్టెంబర్‌లో క్షేమంగా ఆ దేశం చేరుకున్నాము. "మీకు చాలా చాలా ధన్యవాదాలు సమర్ధ సాయినాథా! మాకు తల్లి, తండ్రి, గురువు, అన్నీ మీరే అయి మమ్మల్ని సదా కాపాడు స్వామి. మీ నుండి, మీ పాదాల నుండి మా దృష్టి ఎప్పటికీ మరలకుండా చూడు స్వామి".

శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై.


దసరా పండగకు నెలసరి అడ్డులేకుండా అనుగ్రహించిన బాబా

సాయిబంధువులకు నమస్కారం. నేను ఒక సాయిభక్తురాలిని. గత కొన్ని నెలలుగా సరిగ్గా పండగల సమయంలో నెలసరి వస్తుండటం వల్ల శ్రీరామనవమి, వరలక్మి వ్రతం, వినాయకచవితి పండగలప్పుడు నేను బయట వున్నాను. దానికి నేను చాలా బాధపడుతుంటే, అది చాలదన్నట్లు నా స్నేహితురాళ్లు అన్ని పండుగలకు నువ్వు దూరమవుతావని అంటుండేవాళ్ళు. దానితో నా బాధ మరింత ఎక్కువయ్యేది. ఇలా వుంటే దసరా కూడా నాకు నెలసరి వచ్చే సమయంలోనే వచ్చింది. ఇక అప్పుడు నేను బాబాకి, అమ్మవారికి దణ్ణం పెట్టుకొని, "నెలసరి వల్ల పండగకి ఇబ్బంది లేకుండా ఉంటే, మీ అనుగ్రహం బ్లాగు ద్వారా తోటి సాయిభక్తులతో పంచుకుంటాను నాన్నా" అని బాబాకి మొక్కుకున్నాను. అద్భుతం! ఈసారి వారం ముందే నా ఇబ్బంది తొలగిపోయి సంతోషంగా బతుకమ్మ, దసరా చేసుకున్నాను. "ఇదంతా మీ దయనే నాన్నా. ఇలాగే వచ్చే నెలలో దీపావళి, తమ్ముడు పెళ్లికి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తారని ఆశిస్తున్నాను బాబా. అన్నిటికీ ధన్యవాదాలు బాబా".

సాయిభక్తుల అనుభవమాలిక 1692వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. కోరినట్లు నిదర్శనం ఇచ్చిన బాబా
2. దయచూపిన బాబా
3. జ్వరం నుండి ఉపశమనం ప్రసాదించిన బాబా

కోరినట్లు నిదర్శనం ఇచ్చిన బాబా

నా పేరు శ్రీరంజని. నేను 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగులోని భక్తుల అనుభవాలు చదువుతూ, "బాబా! మీరు మీ సందేశాలు ద్వారా నన్ను నడిపిస్తున్నారు కానీ, నాకెప్పుడు స్వప్నదర్శనం అనుగ్రహిస్తారు" అని చాలాసార్లు అనుకున్నాను. 2023, అక్టోబర్ 19న నా భర్త పుట్టినరోజు. ఆ ముందురోజు అక్టోబర్ 18న నా భర్త, "రేపు బాబా గుడికి వెళదామ"ని, మళ్ళీ అంతలోనే "రేపు గురువారం కదా! గుడిలో ప్రశాంతంగా ఉండదు. గుడికి వెళ్ళేది ప్రశాంతత కోసమేగా! కాబట్టి శుక్రవారం గుడికి వెళదాం. రేపు ఇంట్లోనే పూజ చేసుకుందాం" అని అన్నారు. అలా అన్న ఆయన మరుసటిరోజు ఉదయం 11.30కి "బాబా గుడికి వెళదాం" అన్నారు. నేను వెంటనే తయారయ్యాను. ఇద్దరం కలిసి ఇంటినుండి బయటపడేసరికి 12.15 అయింది. ఇంట్లో ఉండగా నేను, "బాబా! మీరు నాకు గుడిలో ఏదో ఒక నిదర్శనమిస్తే, త్వరలోనే మీరు నాకు స్వప్న దర్శనమిస్తారని నేను ఆనందంగా ఉంటాను తండ్రీ" అని అనుకున్నాను. అలాగే టైం అయిపోయినప్పటికీ "మాకు మధ్యాహ్న హారతి కూడా అందితే బాగుంటుంది బాబా" అని అనుకున్నాను. మేము గుడికి వెళ్లి కాళ్ళుచేతులు కడుక్కొని కొబ్బరికాయ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడొక చిన్నబాబు 'హ్యాపీ బర్త్ డే టు యు' అని పాడుకుంటున్నాడు. అది విని నేను ఆ రూపంలో బాబానే స్వయంగా నా భర్తకి శుభాకాంక్షలు చెప్పారని చాలా సంతోషించాను. నా కళ్లలో నీళ్లు తిరిగాయి. తర్వాత మేము గుడి లోపలి వెళ్లి బాబా దర్శనం చేసుకున్నాము. ఆ వెంటనే మధ్యాహ్న హారతి మొదలైంది. హారతి అయ్యాక దర్శనం లైన్లో ఉన్న ఒకావిడ తన బాబుని 'చింటూ' అని పిలిచింది. ఇంట్లో నా భర్తని పిలిచే పేరు కూడా 'చింటూ'నే. నా భర్త కొట్టిన కొబ్బరికాయలో పువ్వు వచ్చింది. ఇలా బాబా నాకు నాలుగు నిదర్శనాలు ఇచ్చి నన్ను ఎంతగానో అనుగ్రహించారు. "బాబా! మీరు రోజురోజుకి నన్ను మీకు దగ్గరగా చేర్చుకుంటున్నారు. ధన్యురాలిని బాబా. త్వరలో నాకు స్వప్న దర్శనాన్ని అనుగ్రహించండి బాబా".


దయచూపిన బాబా

ఓం శ్రీసాయినాథాయ నమః. సాయిబంధువులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు సత్యనారాయణమూర్తి. 2023, అక్టోబర్ నెల మూడోవారంలో ఒకరోజు ఉన్నట్లుండి నా భార్య బీపీ ఎక్కువై తను చాలా ఇబ్బందిపడింది. నాకు ఏం చేయాలో తోచక బాబా ఊదీ తన నుదుటన పెట్టి నా దగ్గరున్న ఒక టాబ్లెట్ ఇచ్చాను. తర్వాత డాక్టర్ని సంప్రదించి, వారి సలహా మీద మరొక టాబ్లెట్ కూడా ఇచ్చాను. అప్పుడు కొంచెం నార్మల్ అయి నా భార్య సుమారు రెండు గంటలసేపు నిద్రపోయింది. సాయంత్రం డాక్టర్ దగ్గరకి వెళ్లి చూపిస్తే కొన్ని టెస్టులు వ్రాశారు. ఆ టెస్టులు చేస్తున్నంతసేపు నేను, "రిపోర్టులు నార్మల్ రావాల"ని బాబాను ప్రార్థిస్తూ ‘అలా వస్తే బ్లాగులో పంచుకుంటాన’ని అనుకున్నాను. బాబా దయవల్ల రిపోర్టులన్నీ నార్మల్ వచ్చాయి. కొద్దిగా బీపీ ఎక్కువగా ఉంటే దానికి మందులు వ్రాసి పంపారు. "చాలా చాలా కృతజ్ఞతలు బాబా".

2023, అక్టోబర్ 19 రాత్రి ఒక్కసారిగా నా బీపీ ఎక్కువై ఊపిరి తీసుకోవడానికి చాలా కష్టంగా అనిపించింది. ‘గ్యాస్ట్రిక్ సమస్య వల్ల ఊపిరి ఆడట్లేదేమో! ఈ రాత్రివేళ హాస్పిటల్స్‌లో డాక్టర్లు అందుబాటులో ఉండరు’ అని భయపడ్డాను. మా క్రింద అపార్ట్మెంట్లో డాక్టర్లు ఉన్నారని వెళ్లి చూస్తే, వాళ్ళు ఇంట్లో లేరు. వెంటనే నేను నా స్నేహితుడికి ఫోన్ చేసి, రమ్మని పిలిచాను. తను రాగానే ఇద్దరం కలిసి దగ్గర్లో ఉన్న హాస్పిటల్‌‌కి వెళ్ళాము. వెంటనే చికిత్స మొదలుపెట్టి ఈసీజీ తీసి గుండెలో సమస్య ఉందని చెప్పారు. నేను, "బాబా! నాకు ఏ ఇబ్బంది లేకుండా ఇంటికి తిరిగి వెళితే మీకు తులసిమాల, కొబ్బరికాయ సమర్పించుకుంటాను. అలాగే మీ అనుగ్రహాన్ని 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాన"ని బాబాకి దణ్ణం పెట్టుకున్నాను. ఆ రాత్రి ఏదో చికిత్స చేసి, మర్నాడు ఉదయం గుండెకు స్కానింగ్ చేసారు. రిపోర్టులో కొద్దిగా సమస్య ఉందని వచ్చినప్పటికీ "మందులతో తగ్గిపోతుంది" అని చెప్పి నన్ను ఇంటికి పంపేసారు. "ధన్యవాదాలు బాబా. మీ భక్తులందరినీ ఇలాగే కాపాడుతూ ఉండండి బాబా".

జ్వరం నుండి ఉపశమనం ప్రసాదించిన బాబా

నా పేరు శ్రీకాంత్. 2023, అక్టోబర్ నెల మూడోవారంలో నాకు జ్వరం వచ్చింది. రెండు రోజుల్లో తగ్గకపోతే డాక్టర్ వద్దకు వెళదామని ఒక టాబ్లెట్ వేసుకుని, "బాబా! మీ దయతో జ్వరం తగ్గిపోతే, మీ అనుగ్రహాన్ని బ్లాగు ద్వారా తోటి సాయి భక్తులతో పంచుకుంటాను" అని బాబాని ప్రార్ధించి, ఊదీ పెట్టుకొని పడుకున్నాను. మర్నాడు జ్వరం చాలావరకు తగ్గింది. అయితే నేను నా అనుభవాన్ని బ్లాగుకి పంపుదామని అనుకుంటూనే వారం గడిచిపోయింది. తర్వాత నాకు మళ్ళీ జ్వరం వచ్చింది. అప్పుడు నేను నా మ్రొక్కు నెరవేర్చనందు వల్లే ఇలా జరిగిందని గ్రహించి బాబాను క్షమించమని వేడుకొని, "జ్వరం తగ్గించండి బాబా. ఈసారి మీ అనుగ్రహాన్ని తప్పకుండా బ్లాగులో పంచుకుంటాన"ని చెప్పుకున్నాను. బాబా దయవల్ల ఒక్కరోజులో జ్వరం తగ్గిపోయింది. "ధన్యవాదాలు బాబా".

సాయిభక్తుల అనుభవమాలిక 1691వ భాగం...


ఈ భాగంలో అనుభవాలు:

1. అనారోగ్యం ముదరకుండా కాపాడిన బాబా
2. బాబా ఉండగా భయం లేదు
3. అగరుబత్తి పొడితో విపరీతమైన దగ్గు నివారించిన బాబా

అనారోగ్యం ముదరకుండా కాపాడిన బాబా

అందరికీ హాయ్. నేను ఒక సాయి భక్తురాలిని. నాకు ఇప్పుడు 29 సంవత్సరాలు. నేను నా 21వ ఏట నుండి బాబా భక్తురాలిని. నేను బాబాని నా తల్లిలా భావిస్తాను. ఆయన నన్ను ఎంతగానో ప్రేమిస్తూ అన్ని విధాలా మార్గనిర్దేశం చేస్తూ, రక్షణనిస్తూ నేను కోరుకున్నవన్నీ ఇచ్చారు. ఆయన నా జీవితంలో చూపిన లీలలకు అంతులేదు. నేనిప్పుడు 2023, అక్టోబర్ నెల మొదటి వారంలో బాబా నాకు ప్రసాదించిన ఒక అనుభవాన్ని మీతో పంచుకుంటున్నాను. బాబా నాకు  కవల పిల్లల్ని ప్రసాదించారు. వాళ్ళని సాధారణంగా నేను, మా అత్తగారు జాగ్రతగా చూసుకుంటుండేవాళ్ళం. అయితే పిల్లలకి 11 నెలల వయసప్పుడు అత్తయ్య అనారోగ్యం పాలై హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సి వచ్చింది. ఆవిడ హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయి వచ్చాక పిల్లలని చూసుకోవడానికి మేము ఒక ఆయాను ఏర్పాటు నియమించాము. కొన్నిరోజులకి ఆమె సెలవు తీసుకొని తన స్వగ్రామానికి వెళ్ళింది. అదే సమయంలో అకస్మాత్తుగా నాకు జలుబు, ఒళ్లునొప్పులు, జ్వరం వచ్చాయి. వాటితో నేను పూర్తిగా అనారోగ్యం పాలైతే పిల్లల్ని చూసుకోవడానికి ఎవరూ లేరని నాకు భయమేసి బాబాను, "బాబా! నేను అనారోగ్యం పాలుకాకుండా సహాయం చేయండి" అని ప్రార్థించి ఊదీ పెట్టుకున్నాను. అద్భుతం జరిగింది. బాబా దయవల్ల నేను నెమ్మదిగా కోలుకోనారంభించాను. నా ద్వారా పిల్లలకి జలుబు వ్యాప్తి చెందినప్పటికీ పెద్దగా ప్రభావం చూపలేదు. ఇది అందరికీ చిన్న విషయం అనిపించవచ్చు కానీ, ఒక తల్లిగా నా చంటి బిడ్డలిద్దరినీ చూసుకోవడం చాలా కష్టమైన విషయం. అయినా చిన్న విషయాలలో సైతం బాబాపట్ల విశ్వాసం పెంపొందడానికి సహాయపడుతుందన్న ఉదేశ్యంతో నేను ఈ అనుభవాన్ని మీ అందరితో పంచుకున్నాను. "చాలా చాలా ధన్యవాదాలు బాబా". సాయిరాముడు అందరికీ మంచి ఆరోగ్యాన్ని, దీర్ఘాయుస్సును ప్రసాదించుగాక!


బాబా ఉండగా భయం లేదు

నా పేరు లలిత. మా పెరట్లో ఒక పెద్ద సంపెంగ పూల చెట్టు ఉంది. దానికి పువ్వులు చాలా పైకి పూస్తుండటం వల్ల ఒక పెద్ద కర్ర సహాయంతో మేము రోజూ పువ్వులు తీస్తుంటాం. అలా ఒకరోజు నేను కర్రతో పువ్వులు తీస్తున్నప్పుడు చేజారి ఆ కర్ర గోడకి అవతలి వైపు పడిపోయింది. మాది ఉమ్మడి కుటుంబం. కర్ర పడేశానని తెలిస్తే ఎవరు ఏమంటారో అని నాకు భయమేసింది. కానీ గోడకు అవతలవైపు చాలా లోతుగా ఉంటుంది. అందువల్ల నాకు ఆ కర్రను ఎలా తీయాలో అర్థం కాలేదు. అప్పుడు నేను, "బాబా! ఏదో విధంగా ఆ కర్ర తేగలిగేలా నాకు సహాయం చేయండి తండ్రీ" అని బాబాకి దణ్ణం పెట్టుకున్నాను. తర్వాత విషయం మా పనిమనిషికి చెప్పాను. ఆమె, "మా దగ్గర చాలా పెద్ద గెడకర్ర వుంది. దాని సహాయంతో తీద్దాం" అని అంది. కానీ వారం రోజులైనా ఆమె ఆ పని చేయకుండా ఏదో ఒక షాకు చెప్తుండేది. అప్పుడు నేను, "బాబా! ఆమె గెడకర్ర తెచ్చి మా కర్రను తీస్తే, మీ అనుగ్రహం బ్లాగు ద్వారా తోటి సాయి భక్తులతో పంచుకుంటాను" అని బాబాకి దణ్ణం పెట్టాను, బాబా దయవలన ఆమె మరో ఇద్దరితో కలిసి గెడకర్ర తీసుకొచ్చి మా కర్రను తీసింది. వెంటనే నేను బాబాకు ధన్యవాదాలు తెలుపుకున్నాను.

మరొక చిన్న విషయం. ఈమధ్య మేము తిరుపతి, విజయవాడ వెళ్ళాము. ఆ సమయంలో మా పెద్దపాపకి నెలసరి వచ్చింది. దాంతో మేము తనని విజయవాడ అమ్మవారి దర్శనానికి తీసుకొని వెళ్ళలేక రూములో ఉంచి వెళ్లాలనుకున్నాము. కాని తను ఒక్కతే ఎలా ఉంటుందని భయపడ్డాము. అయితే మేము రూమ్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ క్యాలెండర్ మీద పసుపురంగు వస్త్రాలలో సాయిబాబా దర్శనం ఇచ్చారు. ఆయన 'భయం లేకుండా ప్రశాంతంగా వెళ్ళు, పాపకి నేను తోడు ఉంటాన'ని చెప్తున్నట్లు నా మనసుకి అనిపించింది. ఇక మేము పాపని గదిలో ఉంచి ప్రశాంతంగా అమ్మవారి దర్శనం చేసుకొని వచ్చాము. పాప మేము వచ్చేవరకు ఒక్కతే భయం లేకుండా ఉంది. బాబా ఉండగా మనకు భయం లేదు. అన్నీ ఆయనే చూసుకుంటారు. "థాంక్యూ సాయితండ్రీ. నేను నిన్నే నమ్ముకున్నాను. నన్ను ఎన్నడూ విడువకు తండ్రీ"

ఓంసాయి శ్రీసాయి జయిసాయిసాయి.

జై సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై.


అగరుబత్తి పొడితో విపరీతమైన దగ్గు నివారించిన బాబా


ఓంసాయి శ్రీసాయి జయజయసాయి. సాయిభక్తులందరికీ వందనాలు. నా పేరు కుసుమ. నేను చిన్నప్పటినుండి బాబా భక్తురాలిని. ఒకసారి మా బాబుకి జలుబు, దగ్గు ఉన్నప్పుడు ఒకరోజు సాయంత్రం దగ్గు విపరీతంగా రాసాగింది. నాకు ఏం చేయాలో తోచక మా పక్కింటి పాపని ఊదీ కోసం గుడికి పంపాను. తను తిరిగొచ్చి గుడి మూసేసారని చెప్పింది. నాకు ఏం చేయాలో అర్థంకాక ఆలోచిస్తుంటే, సచ్చరిత్రలోని నానా చందోర్కర్ బాబాని తలుచుకొని మట్టిని ఊదీగా పెట్టే సంఘటన జ్ఞప్తికి వచ్చింది. వెంటనే దేవుడి గూట్లో ఉండే అగరుబత్తి పొడి తీసి, "బాబా! ఇదే మీ ఊదీ" అని అనుకోని ఆ పొడి బాబుకి పెట్టాను. అంతే, అప్పటివరకూ ఉన్న విపరీతమైన దగ్గు ఆగిపోయి మరి రాలేదు. ఈ అనుభవం ద్వారా బాబా ఎప్పుడూ మనతో ఉండి, మనల్ని రక్షిస్తారని నాకు అర్థమైంది. "ధన్యవాదాలు బాబా".

సాయిభక్తుల అనుభవమాలిక 1690వ భాగం....


ఈ భాగంలో అనుభవం:

  • మొక్కు తీర్చుకోవడంలో బాబా అనుగ్రహం


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!! సాయి భక్తులకు నా హృదయపూర్వక నమస్కారాలు. నేను ఒక సాయి భక్తురాలిని. నాకు ఊహ తెలియక ముందే నా తల్లిదండ్రులు నన్ను బాబాకి దగ్గర చేసారు. కాదు, వారి ద్వారా బాబాయే నన్ను ఆయన భక్త కోటిలో చేర్చుకున్నారు. నాకు 4 సంవత్సరాల వయసున్నప్పుడు 1999లో మేము మొదటిసారి శిరిడీ వెళ్ళాము. మాది దిగువ మధ్యతరగతి కుటుంబం. అప్పట్లో మా కుటుంబ ఆర్థిక పరిస్థితి అంత బాగాలేకపోయినప్పటికీ 1999 నుండి నాన్న మమల్ని ప్రతి సంవత్సరం శిరిడీ తీసుకొని వెళ్తుండేవారు. బాబా మా కుటుంబ ఆర్థిక పరిస్థితిని అంచెలంచెలుగా మెరుగుపరిచి సొంతిల్లు, కారు మొదలైన అన్ని మాకు అనుగ్రహించారు. ప్రతి దశలో మాకు ఎదురైనా సమస్యలన్నిటి నుండి మమల్ని బయటపడేసారు. ముఖ్యంగా మా అమ్మ ఆరోగ్యం, మా అక్క వైవాహిక జీవితాలకి సంబంధించి బాబా చూపిన అనుగ్రహం మాటల్లో చెప్పలేనిది. మా అక్క వైవాహిక జీవితం కోసం నేను మొక్కుకున్న మొక్కు తీర్చడానికి సాయినాథుడు ఎలా కరుణించారో నేనిప్పుడు తెలియజేస్తాను.

2020లో మా అక్క, బావల మధ్య గొడవలు జరిగి అక్క మా ఇంటికి వచ్చేసింది. ఆ సమస్యతో పోరాడుతున్న సమయంలో ఒకరోజు నేను, మా అక్క, మా తల్లిదండ్రులు కలిసి వెంకయ్యస్వామి దర్శనం కోసం గొలగమూడి వెళ్లాము. అక్కడ నేను ఆవేదనతో, "మా అక్క జీవితం నిలబెట్టమ"ని స్వామిని వేడుకున్నాను. ప్రతి సంవత్సరం ఆగస్టులో వెంకయ్యస్వామి ఆరాధన ఉత్సవాలు జరుగుతాయి. నేను అక్క, బావ కలిస్తే వచ్చే ఏడాది జరిగే స్వామి ఆరాధన ఉత్సవాల సమయంలో 3 రోజులు స్వామి సేవ చేస్తానని అనుకున్నాను. నా దృష్టిలో వెంకయ్యస్వామి, సాయినాథుడు వేరు కాదు. ఆ స్వామి రూపంలో ఉండే సాయినాథుడు నా కోరికను ఒక్క నెల లోపల తీర్చారు. గొడవలేమీ లేకుండానే అక్క, బావ కలిసారు. నా కోరిక ఫలించింది. దాంతో నేను వచ్చే ఏడాది ఆరాధన సమయంలో నా మొక్కు తీర్చుకుందాం అని అనుకున్నాను. అయితే 2021లో కోవిడ్ కారణంగా ఆరాధన ఉత్సవాలు జరగలేదు. 2022లోనైనా మొక్కు తీర్చుకుందామంటే సరిగ్గా ఆ సమయానికి అడ్డాలు వచ్చి పడ్డాయి. ప్రతిసారీ ఇలా జరుగుతుందేంటని నాకు చాలా భయమేసింది, బాధ కలిగింది. 2023లో ఎలాగైనా నా మొక్కు తేర్చుకోవాలని దృఢ సంకల్పం చేసుకొని నా మొక్కు తీరేదాకా 'ఓం నారాయణ ఆదినారాయణ' నామాన్ని వ్రాసి ప్రతినెలా స్వామి ధునికి సమర్పించాలని అనుకున్నాను. అది నెరవేరేలా, అలాగే సేవ చేసుకునే అవకాశమివ్వమని ప్రార్థిస్తూ ఉండేదాన్ని. నిజానికి నాకు అక్కడ ఎలా సేవ చేయాలి? ఎవరిని అడగాలి? అసలు చేయనిస్తారో, లేదో కూడా తెలియదు. వాటి గురించి గొలగమూడి వెళ్లిన ప్రతిసారీ అక్కడివాళ్లను అడిగేదాన్ని. వాళ్లు ఆఫీసులో కనుక్కొండి అనేవాళ్లు. ఆఫీసులో అడిగితే ఒకసారి చేయడనికి లేదని, లేదంటే ప్రసాదాలయంలో అడగండని చెప్తూ ఉండేవారు. ఇలా ఎవరూ నాకు సరైన సమాచారం ఇవ్వలేదు. చివరికి ఆరాధన సమయం దగ్గరికి వచ్చేసింది. నాకు ఈసారి కూడా మొక్కు తీరదని భయమేసి, "ఎటువంటి ఇబ్బందులు లేకుండా నా మొక్కు తీర్చుకోగలగాలి బాబా. అదే జరిగితే మీ అనుగ్రహం 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగు ద్వారా తోటి సాయి భక్తులతో పంచుకుంటాను" అని బాబాకి చెప్పుకున్నాను. రేపు ఆరాధన అనగా ముందురోజు వరకూ ఏ సేవ చేయాలి, ఎవరిని అడగాలి అన్న విషయంలో నాకు స్పష్టత రాలేదు. అయినా బాబా మీద భారమేసి మా నాన్నతో గొలగమూడికి బయలుదేరి 'సేవ చేసే అవకాశం దొరికినా, దొరకకపోయినా ఉదయం నుండి సాయంత్రం వరకు అక్కడే ఉండాల'ని అనుకున్నాను. ముందుగా నేను, నాన్న స్వామి దర్శనం చేసుకుని బయటకు వచ్చాము. నాన్నకి అక్కడ పనిచేసే అధికారి ఒకరు తెలుసు. ఆయన్ని అడుగుతానని నాన్న అన్నారు. కానీ ఆ సమయంలో ఉత్సవం జరుగుతుంది. జనం బాగా ఉన్నారు. అందువల్ల ఆ ఆఫీసర్ దగ్గరకి పోవడం కష్టమైంది. కాసేపటికి బాబా, స్వామి దయవల్ల ఆ అధికారి జనాన్ని దాటుకొని పక్కన ఉన్న ఒక షాపు దగ్గరకి వచ్చి నిలబడ్డాడు. నాన్న వెళ్లి ఆయన్ని పలకరించి సేవ చేసుకోవాలన్న నా మొక్కు గురించి చెప్పి, "అవకాశం ఇవ్వమ"ని అడిగారు. అందుకు ఆయన ఒప్పుకొని చేసుకోమన్నారు. కానీ ఏ సేవ చేయాలో చెప్పలేదు. తర్వాత మా నాన్నకి తెలిసినవాళ్ళు 'ఉభయం'(దేవాలయానికి సంబంధించిన బ్రహ్మోత్సవ, ప్రత్యేక ఉత్సవాల్లో అయ్యే ఖర్చును భరించే వారిని ఉభయ కర్తలని వారు సమర్పించే ధన, వస్తు, ప్రసాద, పూజా సామాగ్రిని ఉభయం అని అంటారు) చేస్తుంటే, వాళ్లలో బాగా తెలిసిన ఆయనతో నాన్న నా మొక్కు గురించి చెప్పి,.ఆఫీసర్ అనుమతి ఇచ్చారని కూడా చెప్పి నన్ను ఆయనకి అప్పజెప్పి వెళ్ళిపోయారు. కాసేపు తర్వాత ఆయన నన్ను తీసుకెళ్లి మందిరంలో ఉండే పనివాళ్లతో చెప్పి, నన్ను అక్కడ ఉండమని చెప్పి వెళ్లిపోయాడు. నేను అక్కడే నిలబడి, అక్కడ ఉన్న ఒక వ్యక్తిని, "ఎదైనా పని ఉంటే చెప్పండి. సేవ చేయడానికి వచ్చాను" అని అన్నాను. అతను మొదట అనుమానంగా చూసాడు. అప్పుడు నేను పలానా అధికారి దగ్గర అనుమతి తీసుకున్నానని చెప్పాను. అతను సరేనని క్యూ కంట్రోల్ చేయమని చెప్పాడు. దాంతో ఒక పక్క సేవ చేసే అవకాశం దొరికిందని సంతోషం, ఇంకోపక్క ఇదివరకు ఎప్పుడు ఇలాంటి సేవ చేయలేదన్న బెరుకుతో మద్యలో నిల్చుని క్యూ కంట్రోల్ చేయడంలో నిమగ్నమయ్యాను. ఆ సాయినాథుడు నాకోసం ఒక అద్భుతం చేసారు. నేను అక్కడ భయంభయంగా నిలబడి ఉండగా నా పక్కకు వచ్చి ఒక ఆవిడ నిలబడింది. ఆవిడ ఎవరో కాదు, నా చిన్నప్పుడు మా ఎదురింట్లో ఉండే ఆంటీ. ఆంటీని చూడగానే నాకు భయం, బెరుకు పోయి భలే ఉత్సాహం వచ్చింది. తనని పలకరించగా తను కూడా సేవ చేయడానికి వచ్చారని తెలిసింది. తనకు వాలంటీర్ పాస్(రెగ్యులర్ గా సేవ చేసేవాళ్ళకి ఇచ్చే పాస్) ఉంది. నేను తనతో నా మొక్కు గురించి చెప్పి, "మూడు రోజులు నాతో సేవ చేయించండి" అని అడిగాను. ఆంటీ ఎంతో సంతోషించి తను చేసే అన్నీ సేవలకి నన్ను తీసుకుపోతానని చెప్పింది. సేవ చేయాలని మొక్కుకొని ఏం చేయాలో, ఎలా చేయాలో తెలియక ఇబ్బందిపడ్డ నాకు బాబా ఆవిధమైన ఏర్పాటు చేసినందుకు పులకించిపోయాను. ఆ మూడు రోజులూ ఆంటీ నన్ను నిమిషం కూడా వదలకుండా తనతోనే ఉంచుకొని అవకాశం ఉన్న సేవలన్నీ నాతో చేయించింది. అలాగే ఇంకో విషయం, మందిరంలోని పూజారి ఆంటీతో "ఆ అమ్మాయి కొత్త అమ్మాయిలా ఉంది. మీరు దగ్గర ఉండి భోజనానికి తీసుకువెళ్లండి" అని చెప్పాడు. అది పూజారి చెప్పినట్టుగా నాకు అనిపించలేదు, వెంకయ్యస్వామి రూపంలో సాయినాథుడే చెప్పినట్టు అనిపించింది. ఆ బాబా దయవల్ల నా శక్త్యానుసారం 3 రోజులు సేవ చేసుకొని మొక్కు తీర్చుకున్నాను. నా మొక్కు తీరినందుకు నేను పొందిన సంతృప్తి మాటల్లో చెప్పలేనిది. “చాలా చాలా ధన్యవాదాలు బాబా”.

ఇంకో రెండు అనుభవాలు చెప్పి ముగిస్తాను. నా మేనత్తకి చిన్న వయసులోనే షుగర్ వచ్చింది. దానివల్ల తను తరచూ అనారోగ్యం పాలవుతుంటుంది. తనకి నాలుగు ఆపరేషన్లు కూడా జరిగాయి. అలాంటి తను ఈమద్య జ్వరం, జలుబు, ఆయాసంలతో మళ్ళీ అనారోగ్యం పాలైంది. నాకు చాలా బాధేసి "బాబా! అత్తకి వెంటనే తగ్గిపోతే, మీ అనుగ్రహం బ్లాగులో పంచుకుంటాన"ని బాబాను ప్రార్థించాను. బాబా అనుగ్రహంతో అత్తకి జ్వరం, జలుబు, ఆయసం తగ్గాయి. "ధన్యవాదాలు బాబా. అత్త ఆరోగ్యం నిలకడగా ఉండేలా అనుగ్రహించు తండ్రీ".

అత్తకి బాగలేని సమయంలోనే నాకు కూడా జలబు చేసింది. ఎన్ని మాత్రలు వేసుకున్నా తగ్గలేదు. జలుబు వల్ల ఆఫీసులో ఒక పని సరిగ్గా చేయలేకపోయాను. దానివల్ల ఏదన్నా ఇబ్బంది అవుతుందేమో అని చాలా భయపడ్డాను. ఒక రాత్రి అయితే పని భయం, జలుబు వల్ల విసుగు వచ్చి అస్సలు నిద్రపోలేకపోయాను. అప్పుడు మా నాన్న డాక్టర్ని అడిగి ఒక టాబ్లెట్ తెచ్చి ఇచ్చారు. ఆ టాబ్లెట్‌తో కూడా నాకు తగ్గుతుందనిపించక టాబ్లెట్ వేసుకునే ముందు దేవుడు గదిలోకి వెళ్లి, టాబ్లెట్ బాబా పాదాల దగ్గర పెట్టి, కొంచెం ఊదీ పెట్టుకొని, "బాబా! ఈ టాబ్లెట్‌తో జలుబు తగ్గాలి" అని ప్రార్థించి టాబ్లెట్ వేసుకున్నాను. బాబా కృపతో పక్క రోజుకి జలుబు కాస్త తగ్గింది. ఆ పక్కరోజుకి పూర్తిగా తగ్గిపోయింది. ఆఫీసులో నేను సరిగ్గా చేయలేకపోయిన పని వల్ల కూడా ఏ ఇబ్బంది రాలేదు. ఇలా అనుక్షణం నాతో ఉండి నా ప్రతి ప్రార్థనని వింటున్న ఆ సాయినాథునికి నేను శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. నాకు సదా ఆయన స్మరణ కలిగిలే దీవించమని వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.

సర్వం శ్రీసాయినాథార్పణమస్తు!!!

శుభం భవతు !!!!


సాయిభక్తుల అనుభవమాలిక 1689వ భాగం....


ఈ భాగంలో అనుభవం:

  • ప్రతి విషయంలో సహాయం చేస్తున్న బాబా

నా పేరు హాసిని. ఒకరోజు నేను నా ఫ్రెండ్‌తో చదువు గురించి చాట్ చేస్తుండగా ఏమైందో తెలియదు కానీ హఠాత్తుగా నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. అదివరకే నా ఫోన్‌కి ఆ సమస్య ఉంది. అయితే అప్పుడు ఫోన్ స్టోరేజ్ నిండిపోవడం వల్ల  హ్యాంగ్ అయి స్విచ్ ఆఫ్ అయ్యేది. కానీ ఈసారి సమస్య అది కాకపోయినప్పటికీ ఎందుచేతనో హఠాత్తుగా స్విచ్ ఆఫ్ అయింది. ఎంత ప్రయత్నించినా ఆన్ అవ్వలేదు. అప్పుడు ఈ బ్లాగులో చదివిన ఒక భక్తుని అనుభవం గుర్తు వచ్చింది. అదేమిటంటే, ఒక అంకుల్ తన ఫోను ఆన్ అవ్వకపోతే బాబా ఊదీ రాసానని, బాబా దయతో ఫోన్ పని చేసిందని. అందువల్ల నేను కూడా నా ఫోన్‌కి ఊదీ రాసాను. కానీ నా ఫోన్ ఆన్ అవ్వలేదు. అప్పుడు నేను, 'అంకుల్ ఫోన్ పని చేసింది, నా ఫోన్ ఎందుకు ఆన్ అవ్వలేదు' అనుకున్నాను. తర్వాత మళ్ళీ ఫోన్ ఆన్ చేసే ముందు, "బాబా! నా ఫోన్ ఆన్ అయితే, మీ అనుగ్రహాన్ని బ్లాగు ద్వారా తోటి సాయిభక్తులతో పంచుకుంటాను" అని మ్రొక్కుకొని ఆన్ చేస్తే, వెంటనే ఫోన్ ఆన్ అయింది. అంతా బాబా చేసిన అద్భుతం.

2023, ఆగస్టులో మా కుటుంబమంతా కలిసి గిరిప్రదక్షిణ చేయాలని అరుణాచలం వెళ్ళాము. గిరి ప్రదక్షిణ చేయాలంటే చాలా ఓపిక ఉండాలి. ఎందుకంటే, మొత్తం 14 కిలోమీటర్లు నడవాలి. అది కూడా చెప్పులు, సాక్సులు లేకుండా. మేము సాయంత్రం 5 గంటలకు గిరి ప్రదక్షిణ మొదలుపెట్టాము. అప్పుడు నేను ముందుగా బాబాని తలుచుకున్నాను. దారిలో ఉన్న 8 శివలింగాల దగ్గర మాకు విబూది ఇస్తే, నేను నుదుటన పెట్టుకొని, మిగిలింది నోట్లో వేసుకొని, "నాకు ఓపికనివ్వండి బాబా" అని అనుకుంటూ ముందుకుసాగాను. మధ్యలో ఓ చోట ప్రదక్షిణ కొనసాగించడానికి మాకు అస్సలు ఓపిక లేకుండా పోయింది. అప్పుడు నేను బాబానే తలుచుకొని, "బాబా! నాకు, నా కుటుంబానికి గిరి ప్రదక్షిణ పూర్తి చేసే ఓపికనివ్వండి" అని బాబాను బతిమాలుకున్నాను. తర్వాత కూడా బాబాని, అర్ధనారీశ్వరులను తలుచుకుంటూ నడకసాగించాను. బాబా దయవల్ల మంచిగా ప్రదక్షిణ పూర్తై రాత్రి 12 గంటలకు మా గదికి చేరుకున్నాము. అంత దూరం నడిచినందున కాళ్ళ నొప్పులు రాకుండా ఉండడానికి మా వాళ్ళందరూ పెయిన్ కిల్లర్ టాబ్లెట్లు వేసుకున్నారు. నేను మాత్రం వేసుకోలేదు. బాబా దయవల్ల మరుసటిరోజుకి నాకు ఎలాంటి నొప్పులు రాలేదు. సాధారణంగా నా కాళ్ళకి పగుళ్లు సమస్య ఉంది. చెప్పులు లేకుండా నడిస్తే ఖచ్చితంగా పగుళ్లు వచ్చి నొప్పి ఉంటుంది. అలాంటిది 14 కిలోమీటర్లు నడిచినా ఎక్కడా కాళ్లు పగలలేదు. అంతా బాబా దయ.

అరుణాచలంలో దైవ దర్శనానంతరం మేము కంచి వెళ్లి విష్ణుకంచి, శివకంచి దర్శించి తర్వాత వెల్లూరు వెళ్ళాము. అదేరోజు రాత్రి మేము తిరుపతిలో తిరుగు ప్రయాణానికి రైలు ఎక్కవలసి ఉంది. అయితే వెల్లూరు నుంచి తిరుపతి వెళ్లి రైలు అందుకోవడానికి చాలా తక్కువ సమయం వుండింది. బస్సువాళ్ళని అడిగితే తిరుపతి బస్టాండ్‌కి చేరుకునేసరికి రాత్రి 9:50 అవుతుందన్నారు. అక్కడినుండి మేము రైల్వేస్టేషన్‌కి వెళ్ళాలంటే మాతో పాటు ఉన్న పెద్దవాళ్ళు తొందరగా నడవలేరు కాబట్టి స్టేషన్‌కి చేరుకోవడానికి కాస్త సమయం పడుతుంది. అందువల్ల మాకు రైలు అందుతుందో, లేదో అని నాకు భయమేసి వెల్లూరులో బస్సు ఎక్కే ముందు, "బాబా! మేము ఎలాగైనా రైలు అందుకునేలా చూడండి. రైలు తప్పిపోతే అమ్మమ్మ, తాతయ్యలకు ఇబ్బందవుతుంది. కాబట్టి మీ దయతో బస్సు కాస్త ముందుగా చేరుకొని, రైలు తప్పిపోకుండా ఉంటే మీ అనుగ్రహం బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి చెప్పుకున్నాను. తర్వాత కూడా బాబాకి చెప్పుకుంటూనే ఉన్నాను. అయితే మధ్య దారిలో టిఫిన్ల కోసమని బస్సు ఆపారు. అప్పుడు మేము 'ఇంకా రైలు తప్పిపోయినట్లే!' అని అనుకున్నాము. కానీ బాబా దయవల్ల రైలుకి ఇంకా కొంచం సమయం ఉందనగా బస్సు తిరుపతి బస్సు స్టాండ్‌కి చేరుకుంది. మేము చకచకా బస్సు దిగి ఆటో ఎక్కాము. రైల్వేస్టేషన్‌కి చేరుకున్నాక మేము ఆటో అతనికి డబ్బులిచ్చి వెళ్లిపోతుంటే అతను, "అమ్మా! మీ బ్యాగులు తీసుకోండి" అని అన్నాడు. విషయమేమిటంటే, హడావిడిలో మేము మా బ్యాగులు మర్చిపోయి వెళ్ళిపోతున్నాం. సాధారణంగా ఆటోవాళ్ళు డబ్బులిచ్చాక వెళ్లిపోతారుగాని మేము సామాను ఏమైనా మరిచిపోయామా అని చూడరు. బాబాయే మా బ్యాగులు పోకుండా సహాయం చేసారని అనుకున్నాను. ఇకపోతే, రైలు సమయానికంటే ముందే స్టేషన్‌కి చేరుకున్నాము. ఇదంతా బాబా దయ. లేకపోతే ఎంత ప్రయత్నించినా బస్సు డ్రైవర్ వేగంగా తీసుకొచ్చేవారు కాదు. ఇంకో ముఖ్య విషయమేమిటంటే, బాబా తమ భక్తులని పస్తు ఉంచారు కదా! మేము ఎక్కాల్సిన రైలు రావడానికి కాస్త ఆలస్యమైంది. దాంతో మేము చక్కగా స్టేషన్ దగ్గర్లో టిఫిన్లు తీసుకొని ట్రైన్ ఎక్కాక తిన్నాము. అలా బాబా దయవల్ల మా అందరి అరుణాచల దర్శనం చాలా మంచిగా జరిగింది.

ఒకసారి నేను డబ్బులు ఎక్కడో పెట్టేసి మార్చిపోయాను. అలానే ఒక సరస్వతి కవచం తాలూకు జిరాక్స్ పేపర్ కూడా ఎక్కడో పెట్టి మార్చిపోయాను. "బాబా! ఆ రెండూ దొరికితే మీ అనుగ్రహం తోటి సాయిభక్తులతో పంచుకుంటాను" అని బాబాను వేడుకున్నాను. అంతే, 3 నిమిషాల్లో అవి దొరికాయి.

మా అమ్మకి టెన్షన్ ఎక్కువ. ఏ చిన్న విషయం జరిగినా ఊరికే టెన్షన్ చెంది నిరాశపడిపోతుంటారు. ఒకసారి రెండు రోజులైనా అమ్మ అలానే ఉంటే నేను 3వ రోజు, "బాబా! నేను ఊదీ అమ్మకి ఇస్తున్నాను. తనని నార్మల్ చేయండి" అని బాబాతో చెప్పుకొని ఊదీ నీళ్లలో కలిపి అమ్మకి ఇచ్చాను. బాబా దయవల్ల అమ్మ మరుసటిరోజుకి మామూలు అయింది. నిజానికి ఏదైనా కష్టమొస్తే ఊదీ వాడాలనిగాని, ఇంకేదైనా వాడాలనిగాని, అది చేయాలి, ఇది చేయాలి అని గానీ నాకు తెలీదు. ఈ బ్లాగ్ చదివాకే కష్టమొస్తే ఏం చేయాలో తెలిసి ఆవిధంగా చేస్తున్నాను. ఈ బ్లాగ్ వల్ల బాబాపై నాకు భక్తి, ప్రేమలు ఇంకా ఇంకా అధికమవుతున్నాయి. ఈ బ్లాగ్ లేకపోతే నేను ఏమైపోతానో నాకు తెలీదు. అంతా బాబా ఇచ్చిన అదృష్టం. "ధన్యవాదాలు బాబా".

ఒకరోజు నేను సాయినాన్నని, "నాన్నా! నాకు గురువారం లోపు శిరిడీలో మీరు చిలుక ఆకుపచ్చ రంగు వస్త్రాలు ధరించి నాకు దర్శనం ఇవ్వండి" అని అడిగాను. కానీ గురువారం వరకు నేను కోరుకున్న రంగు వస్త్రాల్లో బాబా దర్శనం ఇవ్వలేదు. నేను చాలా బాధపడ్డానుగాని తర్వాత. 'పోనీలే, నాలా చాలామంది భక్తులు బాబాని అడుగుతారు. ఆయన వాళ్ళు కోరుకున్న వస్త్రాల్లో దర్శనమిచ్చి వాళ్ళని కూడా సంతృప్తిపరచాలి కదా! అందుకే కుదరలేదేమో!' అని అనుకోని ఆ విషయం అక్కడితో మర్చిపోయాను. ఆ తర్వాత 2023, అక్టోబర్ 19, గురువారంనాడు ధూప్ హారతికి నేను కోరుకున్న చిలుక ఆకుపచ్చ రంగు వస్త్రాల్లో దర్శనం ఇచ్చారు బాబా. నేను చాలా సంతోషించి, ‘అడిగింది మనం మర్చిపోయినా బాబా ఎప్పటికీ మార్చిపోర'ని అనుకున్నాను.

గతంలో నేను పంచుకున్న ఒక అనుభవంలో మా ఇంటి దగ్గర పువ్వులు కోయడానికి ఎప్పుడు వెళ్లినా ఒక తాతగారు నన్ను తిట్టేవారని, అప్పుడు నేను ఆ తాత ఏదో ఒకటి అంటారన్న భయంతో పువ్వులు కోయడానికి వెళ్ళేటప్పుడు బాబాని తలుచుకుంటే ఆ తాత ఏమీ అనలేదని చెప్పాను. ఆ తర్వాత నేను ఆ తాత ఏమీ అనట్లేదని బాబాను తలుచుకోకుండా మామూలుగా పువ్వులు కోయడానికి వెళ్తే ఆ తాత నాపై అరిచారు. అప్పుడు నేను ఆ తాత తిట్టకుండా బాబానే రోజూ నాకు సహాయం చేస్తున్నారని గ్రహించాను. నిజంగా బాబా నాకు ప్రతి విషయంలో సహాయం చేస్తున్నారు. "ధన్యవాదాలు బాబా. ఒక సంవత్సరం నుంచి నేను మిమ్మల్ని ఒక కోరిక కోరుతున్నాను. అది నెరవేర్చండి ప్లీజ్ బాబా".

సర్వం శ్రీసాయినాథార్పణమస్తు.


సాయిభక్తుల అనుభవమాలిక 1688వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. పిలిచిన వెంటనే పలికే దైవం సాయి
2. నోరు తెరిచి అడగకపోయినా ఆదుకున్న బాబా

పిలిచిన వెంటనే పలికే దైవం సాయి

నేను ఒక సాయిభక్తురాలిని. 2022 ఏప్రిల్‌లో నేను యూరిన్ ఇన్ఫెక్షన్‌తో చాలా ఇబ్బందిపడ్డాను. ఎన్ని హాస్పిటల్‌కి వెళ్లినా, ఎన్ని మందులు వాడినా ఇన్ఫెక్షన్ తగ్గలేదు. అటువంటి సమయంలో ఈ బ్లాగు నా కంటపడింది. బ్లాగులోని ఒక భక్తుని అనుభవం చదివిన వెంటనే నేను అందులో చెప్పినట్లు ఊదీ నీళ్లలో కలుపుకుని తాగి, "బాబా! నాకు యూరిన్ ఇన్ఫెక్షన్ బాధ నుండి ఉపశమనం కలిగించండి. మీ అనుగ్రహాన్ని బ్లాగు ద్వారా తోటి సాయిబంధువులతో పంచుకుంటాను" అని బాబాను ప్రార్థించాను. నిజంగా బాబా అద్భుతం చేసారు. అప్పటినుండి ఇప్పటివరకు నేను మళ్ళీ ఇన్ఫెక్షన్‌తో అస్సలు బాధపడలేదు. "చాలా ధన్యవాదాలు బాబా".

ఒకరోజు రాత్రి ఒంటిగంటప్పుడు మా పాపకి బాగా కడుపులో నొప్పి వచ్చింది. అప్పుడు మావారు లేరు. నాకు ఏం చేయాలో అర్ధం కాలేదు. వెంటనే బాబాని చూస్తూ, "బాబా! పాపకి కడుపునొప్పి తగ్గించండి. నాకు మీరే దిక్కు. ప్లీజ్ బాబా" అని వేడుకొని ఊదీ నీళ్లలో కలిపి పాప చేత తాగించాను. బాబా దయవల్ల ఒక్క 15 నిమషాల్లో కడుపునొప్పి తగ్గి పాప హాయిగా నిద్రపోయింది.

ఒకసారి ఒక సంస్థ నుండి డబ్బులు రావాల్సి ఉండగా అందరికీ వచ్చినా నాకు మాత్రం రాలేదు. నేను ఆ డబ్బుల కోసం రెండు నెలలు ఎదురుచూసాను. అయినా రాలేదు. నాకు డబ్బు అత్యంత అవసరమైనప్పటికీ ఏం చేయాలో అర్ధంకాని పరిస్థితి. రోజూ బాబాని వేడుకుంటూ ఉండేదాన్ని. అయినా డబ్బులు రాలేదు. అలాంటి సమయంలో బ్లాగులో ఒకరు, 'సప్తాహ పారాయణ చేసాము. అవ్వాల్సిన పని అయింది' అని పంచుకున్నారు. బాబా నన్ను అలా చేయమని చెప్తున్నారని నా మనసుకి అనిపించి నేను కూడా సప్తాహ పారాయణ మొదలుపెట్టాను. చివరిరోజు పారాయణ 5.45కి పూర్తి అయింది. బాబా చేసిన అద్భుతం చూడండి. 6 గంటలకి నా అకౌంటులో డబ్బులు పడ్డాయి. దాంతో నా ఆనందానికి అవధులు లేవు. "థాంక్యూ సో మచ్ బాబా. లవ్ యు బాబా. మా అందరి అవసరాలు మీకు తెలుసు. అందరినీ ఇలానే కాపాడండి బాబా".


నోరు తెరిచి అడగకపోయినా ఆదుకున్న బాబా

నేను ఒక సాయిభక్తురాలిని. మాది హైదరాబాద్. నేను, నా స్నేహితురాలు మాకు కుదురినప్పుడల్లా గురువారంనాడు సాయిబాబా గుడిలో సాయంకాలం హారతికి వెళుతుండేవాళ్ళం. అలా ఒక చలికాలంలో సంధ్య హారతికి వెళ్ళినపుడు హారతి ముగిసేసరికి బాగా ఆలస్యం అయింది. చలికాలం కావడం వలన 6:30కే బాగా చీకటి పడిపోయింది. ఇంటికి తిరిగి ఆటోలో వెళ్లడానికి మా దగ్గర డబ్బులు లేక నడిచే వెళ్దామని బయలుదేరాము. మా ఇల్లు నడక దూరంలోనే ఉంటుంది. కానీ ఆ దారంతా నిర్మానుష్యంగా ఉంది. మా వెనక కొంచెం దూరంలో పది, పదిహేను మంది అబ్బాయిలు నడిచి వస్తున్నారు. వాళ్ళు చూడటానికి రౌడీల్లా ఉన్నందువల్ల మా ఇద్దరికీ చాలా భయమేసింది. వాళ్ళు మమ్మల్ని సమీపిస్తూండేసరికి మా గుండెల్లో రాయి పడినట్లు అయింది. కళ్ళ నుండి నీళ్లు రావడం ఒక్కటే తక్కువ. వాళ్ళు కొంచెం వెకిలిగా మాట్లాడుతూ మాకు అతి దగ్గరగా వస్తుంటే, భయంతో, 'సాయిబాబా నువ్వే దిక్కు తండ్రీ' అని మనసులో అనుకున్నానో, లేదో గుర్తులేదుగాని మేము కాస్త వేగంగా అడుగులు వేయసాగాము. అంతలో అనుకోకుండా మేము ఏమాత్రం ఊహించిన సంఘటన జరింగింది. నాకు తెలిసిన ఒక ఆటో అన్నయ్య ఆటో నడుపుకుంటూ మా దగ్గరకి వచ్చి ఆగి, "ఇంటికేగా వెళ్తున్నారు. రండి, నేను దింపుతాను" అని మమ్మిల్ని ఆటో ఎక్కించుకొని మా ఇంటి దగ్గర దింపాడు. సాయిబాబానే అలా మమ్మల్ని ఆదుకున్నారని నాకు తెలుసు. అందులో నాకు ఏ సందేహము లేదు. ఇది నాకు ఒక అద్భుతమైన అనుభవం. ఇలా ఎన్నో ఎన్నెన్నో అనుభవాలు బాబా నాకు ప్రసాదించారు. ఇలా మీతో పంచుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. "ధన్యవాదాలు బాబా".

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo