సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

బయజాబాయి


శ్రీసాయిని ప్రత్యక్షంగా సేవించిన భక్తులలో తొంభైఅయిదు శాతం ఆయనలోని మహిమను దర్శించి ఆయనను ఆశ్రయించారు. మిగిలిన అయిదు శాతం మాత్రం కేవలం సాయి మహిమ వలన కాక మమతానుబంధంతో బాబాతో తమను తాము ముడివేసుకున్నారు. అలాంటి వారిలో ముఖ్యంగా పేర్కొనవలసిన భక్తులు మహల్సాపతి, తాత్యా, తాత్యా తల్లిదండ్రులైన శ్రీమతి బయజాబాయి, శ్రీ గణపతికోతే మొదలైనవారు. వీరిలో బయజాబాయి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

షిరిడీ నివాసి, ధనవంతుడు మరియు భూస్వామి అయిన గణపతి కోతే పాటిల్ ను వివాహం చేసుకొని బయజాబాయి షిరిడీకి వచ్చింది. ఆమె ఒక గృహిణిగా గృహకృత్యాలు చేసుకొంటూ, ప్రేమతో అందరినీ ఆదరించేది. ఆమె ఇంటికి వచ్చిన అతిథులకు మరియు బంధువులకు ప్రేమతో వండి వడ్డించేది. అన్నం పరబ్రహ్మ స్వరూపంఅన్న సత్యాన్ని నమ్మి నిత్యాన్న సంతర్పణలు చేస్తూ ఉండేది.

లోకకళ్యాణార్థం శ్రీసాయిబాబా బాల్యావస్థలో షిరిడీలో ప్రకటమైన తొలినాళ్ళలో ఆ గ్రామ ప్రజలకు శ్రీసాయి అంటే ఒక పిచ్చి ఫకీరు, ఒక సామాన్య భిక్షకుడు మాత్రమే. శ్రీసాయి మహిమ ఏ మాత్రం ప్రకటం కాని ఆ రోజులలోనే ఒకనాడు గణపతి కోతే పాటిల్, భార్యతో కలిసి మొదటిసారిగా సాయి వద్దకు వెళ్లారు. వారిని చూస్తూనే సాయి లేచి నిలబడి వారిని ఆదరించి, అతని భార్య బయజాబాయి తమ సోదరియని చెప్పారు. ఆమెకి గూడా మొదటి దర్శనంలోనే బాబాపై భక్తి శ్రద్ధలు కల్గి ఆయనకు భిక్ష పెట్టకుండా భోజనం చేయకూడదని నిశ్చయించుకుంది.

షిరిడీ వచ్చిన మొదటి రోజులలో సాయిబాబాకు నిర్ణీతమైన నివాసస్థలం ఉండేది కాదు. షిరిడీ గ్రామ పొలిమేరలలో మరియు పొరుగున ఉన్న అడవులలో తిరుగుతూ లేదా వేపచెట్టు క్రింద కూర్చుని గడిపేవారు. ఆయన అప్పట్లో జట్టు పొడుగ్గా పెంచుకొని తలకు తెల్లని రుమాలు, నడుముకు లంగోటి, పహిల్వానులా ఒక చొక్కా వేసుకొనేవారు. ఆయన ధనికులు - పేదలు, తమను గౌరవించేవారు - తృణీకరించేవారు అనే భేదమెరుగని గంభీరుడు. ఆయన తరచుగా "అల్లాహ్"ను స్మరిస్తూ మశీదులోనో, గ్రామ పరిసరాలలోని చిట్టడవిలోనో ఏటి ఒడ్డునున్న తుమ్మచెట్టు క్రిందనో ఒంటరిగా కాలం గడుపుతూండేవారు. తరచుగా తమలో తాము మాట్లాడుకొనేవారు. ఎదుట ఎవరూ లేకున్నా కోపంతో పెద్దగా తిడుతూనో, రాయి విసురుతానని బెదిరిస్తూనో వుండేవారు. దయ్యం పట్టిన వానిలా వున్నట్లుండి దూసుకు పోతుండేవారు. అందువలన ఆయనొక పిచ్చి ఫకీరని జనం తలచేవారు. లెండీ దగ్గర ఒక పెద్ద తొట్టిలో గ్రామస్థులంతా పాత్రలు కడుక్కొనేవారు. ఆ నీరు పశువులు త్రాగేవి. చాలాకాలం సాయి గూడ ఆ నీటినే త్రాగేవారు. అందువలన గ్రామస్థులు ఆయనను మంచినీటి బావి దగ్గరకు రానిచ్చేవారు గాదు. అయినా తాత్యా తల్లి బయజాబాయి ఆయనకు చేసిన సేవ అనన్యం! "సాయిబాబా అంటే బిచ్చమెత్తుకుంటూ బ్రతికే పిచ్చి ఫకీరేగా!" అని అందరూ అనుకుంటున్న ఆ రోజుల్లోనే ఆయనలోని దైవత్వాన్ని గుర్తించి సాక్షాత్తూ భగవంతునిగా భావించి ఎంతో భక్తి శ్రద్ధలతో ఆమె బాబాకు నిస్వార్థమైన సేవ చేసింది.

సాయిబాబా నిత్యం ఐదు ఇళ్లలో భిక్ష చేసేవారు. ఆ ఐదు ఇళ్లలో బయజాబాయి ఇల్లు ఒకటి. బాబా ఆమె గడపలోకి వచ్చి"అక్కా! రొట్టె ముక్క పెట్టవూ!” అనేవారు. ఆమె ఎంతో ఆదరంతో, గౌరవంతో రొట్టెలు, కూరలు తెచ్చి ఆయనకు పెట్టేది. అలా బాబా వచ్చి భిక్ష తీసుకొని వెళ్ళేవరకు తానూ భోజనం చేసేది కాదు బయజాబాయి. ఆ తల్లి ఎన్ని జన్మలలో ఎంతటి పుణ్యం చేసుకున్నదో గాని ఆమెకు సాయి అంటే ఎక్కడ లేని నమ్మకం ఏర్పడింది. ఒక్కొక్కసారి సాయి భిక్షకి వచ్చేవారు కారు. ఎక్కడో చుట్టుప్రక్కల అడవుల్లో తిరుగుతుండేవారు. అలాంటప్పుడుబాబా భుజిస్తేగాని తాను భోజనం చేయకూడదనే కఠిన నియమం తనకు తానే విధించుకున్న ఆ తల్లి తాను చేసిన వంటకాలన్నీ ఒక గంపలో పెట్టుకొని, దానిని తలకెత్తుకొని, తాత్యాను వెంటబెట్టుకొని చుట్టుప్రక్కలంతా గాలించి,
చివరికి ఆయన్ని వెదికి పట్టుకొనేది. ఒక్కొక్కసారి ముళ్ళూ, పొదలూ లెక్కచేయక చిట్టడవులలో గూడ ఆయన కోసం వెతకవలసి వచ్చేది. ఆయన ఏకాంతంగా ధ్యానంలో కూర్చొని వుంటే వారి ముందు ఆకువేసి భోజనం వడ్డించి, కలిపి బిడ్డకు తినిపించినట్లే తినిపించేది. చివరికి ఆయన తిన్నాకే ఇంటికి తిరిగి వచ్చి తాను తినేది. శ్రీకృష్ణునికి గోరుముద్దలు తినిపించిన యశోదమ్మ ఎంతటి పుణ్యాత్మురాలో ఈ బయజాబాయి కూడా అంతటి పుణ్యాత్మురాలు. బాబా ఎక్కడ ఉన్నా వెతికి రోజూ అన్నం పెట్టిన అన్నపూర్ణాదేవి. శ్రీసాయిసచ్చరిత్ర 8వ అధ్యాయంలో ఆమె ప్రేమ, భక్తి మరియు సంరక్షణ చాలా అందంగా వర్ణించబడ్డాయి. కొన్నాళ్ళకి ఆమె శ్రమ చూడలేక కాబోలు ఆయన తిరగడం మాని మశీదులోనే వుండసాగారు. అప్పటినుండి ఆమెకు బాబా కోసం అడవులలో, ముళ్ళ పొదలలో తిరిగే శ్రమ తొలగింది.


బాబా ఉదయం సుమారు 9 గంటల ప్రాంతంలో ఎడమ భుజానికి నాల్గు మడతలు వేసిన గుడ్డను జోలెగా కట్టుకొని, కుడిచేతిలో రేకుడబ్బా తీసుకొని, నిత్యం ఐదు యిళ్ళ వద్ద భిక్ష తీసుకొచ్చేవారు. ద్రవాహారాలు డబ్బాలోను, రొట్టెలు వంటి ఘన పదార్ధాలు జోలెలోను వేయించుకొనేవారు. బాబా బయజాబాయి ఇంటికి వెళ్లి "ఆబాదే ఆబాద్, బయజాబాయి రోటీ లావ్!" అని కేకవేయగానే ఆ తల్లి పనులన్నీ ఆపివేసి, ఆయనను ఆహ్వానించి, లోపలకి వెళ్లి, తాజాగా భక్రీ, కూర తయారు చేసి బాబాకి సమర్పించి ఆయన ఎదుటనే కుర్చునేది. బాబా ఆమె ప్రేమకి మరియు భక్తికి ఎంతో ఆనందించేవారు. అప్పుడు 7, 8 సంవత్సరాల వయస్సు గల ఆమె కొడుకు తాత్యా బాబా భుజాలపైన ఎక్కడమో, ఆయన ఒడిలో పొర్లడమో చేసేవాడు. ఆమె అతనిని కసిరినా, ఆమె ముఖంలో ఏ మాత్రం చికాకు వ్యక్తమైనా, బాబా ఎందుకమ్మా వాణ్ణి కోప్పడతావు? వాడి ఇష్టం వచ్చినట్లు చేయనివ్వు అనేవారు. అలా తొలిరోజులలో బయజాబాయి ఇంట భిక్షకోసం 15 సార్లు కూడా వెళ్ళేవారు. అన్నిసార్లు వచ్చినప్పటికీ ఆ తల్లి విసుగుకోకుండా ప్రతిసారి ఆదరంతో బాబాకు భిక్ష సమర్పించేది. బాబా షిరిడీకి వచ్చిన కొద్ది సంవత్సరాల తరువాత 1876లో అహ్మద్ నగర్ జిల్లాలో కరువు వచ్చింది. ఆ సమయంలో బాబా ధనికులైన నందురామ్ మార్వాడి, బయజాబాయిల ఇళ్ళ వద్ద మాత్రమే భిక్షగా కేవలం సగం రోటీ తీసుకొనేవారు.

బాబా ఎవరింటికి వెళ్లినా వీధి గుమ్మం ముందు నిలుచుని భిక్ష స్వీకరించేవారు కానీ, ఎప్పుడూ ఏ గృహస్థుల ఇంటిలో అడుగు పెట్టలేదు. అలా వచ్చినప్పుడల్లా బయజాబాయి ఇంటిలోకి రమ్మని బాబాను సాదరంగా ఆహ్వానించేది. బాబా ఎప్పుడైనా వారి ఇంటి గుమ్మం ముందున్న పంచలో మాత్రం కూర్చునేవారు. ఆమె బాబాను వారింట్లోనే కూర్చొని తన కళ్ళ ఎదుట రెండు ముద్దలయినా తిని వెళ్ళమని బ్రతిమలాడేది. బాబా మాత్రం తనకి తోచినట్లు చేసేవారు. ఎప్పుడైనా అరుదుగా బుద్ధి పుడితే వారి ఇంటి పంచలోనే భోజనం చేసేవారు. అటువంటి సందర్భాలలో ఆమె ఆనందానికి హద్దులు ఉండేవి కావు. "ఇంకొంచెం తిను!" అంటూ బ్రతిమిలాడి తినిపించి, "ఏమైనా త్రాగడానికి తీసుకో!" అనేది ప్రేమగా. అటువంటి ఒకానొక సందర్భంలో తాత్యా భార్య రంభాబాయి బాబాకు ఆహారాన్ని వడ్డించి ఇంటిలో ఒక మూలన నిలబడి బాబా మరియు బయజాబాయిల మధ్య సంభాషణను విన్నారు. రంభాబాయికి వారి సంభాషణ ఒక కొడుకు మరియు తల్లికి మధ్య ఉన్నట్లు అనిపించింది. ఆ సంభాషణలో బాబా యొక్క పుట్టుపూర్వోత్తరాల గురించి బయజాబాయి ప్రశ్నించి బాబా యొక్క కుటుంబసభ్యుల గురించి లేదా వారి జాడ గురించి తెలుసుకోవాలని ప్రయత్నించేది. కానీ బాబా నుండి అందుకు సంబంధించిన ఎటువంటి సూచన కూడా లభించలేదు. బాబా యొక్క ప్రాంతం, కులం, తల్లిదండ్రులు మరియు తెలిసిన వారి గురించి కూడా ఆమె ప్రశ్నించేది, కానీ బాబా ఈ విషయాల గురించి ఒక్క సూచనను కూడా ఇవ్వలేదు. సామాన్యంగా బాబా భాకరి(సజ్జ రొట్టె), కూర మాత్రం భుజించేవారు. ఎప్పుడైనా పాలు, పెరుగు, మజ్జిగ, ఊరగాయ, ఉల్లిపాయ, అప్పడం అడిగి ప్రీతిగా తినేవారు. అందుకని బయజాబాయి వాటిని తాజాగా తయారుచేసి సిద్ధంగా ఉంచుకొనేది.

ఒకసారి బాబా బయజాబాయిని"ఏమి కావాలి? సంపదలా, సంతతా(వంశాభివృద్ధి)? ఏది కావాలో కోరుకో?" అని అడిగారు. ఆ సమయంలో ఆమె తాత్యా సంక్షేమం గురించి కోరుకుంది. అతనికి ముగ్గురు భార్యలు ఉన్నప్పటికీ, వారికి పిల్లలు లేరు. వెంటనే బాబా ఆమెను ఆశీర్వదించారు. బాబా ఆశీర్వాదంతో అతనికి ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు పుట్టారు.

బాబా ఆమె చేసిన సేవను ఎన్నడూ మరువక ఆమెను ఆమె బిడ్డడైన తాత్యాను కంటికి రెప్పలా కాపాడుతుండేవారు. చివరకు తాత్యా ప్రాణం కాపాడడానికి తమ ప్రాణాన్నే అర్పించారని భక్తులంటారు. కృతజ్ఞతకు మరోపేరు సాయి.

బయజాబాయి పండరి యాత్ర:

పూజ్య గురుదేవులు శ్రీసాయినాథుని శరత్ బాబూజీ రచించిన శ్రీసాయిభక్త విజయం బుక్ లోని బయజాబాయి పండరి యాత్రకు సంబంధించిన క్రింది వ్యాసాన్ని కూడా చదవండి.

బాబాను ఎంతో ఆత్మీయతతో, అచంచల భక్తి శ్రద్ధలతో సేవించిన బయజాబాయికి బాబా వివిధ సందర్భాలలో ఏమి బోధించారో, ఆమెకు కలిగిన దివ్యానుభూతులేమిటో వివరంగా గ్రంథస్తం కాకపోవటం సాయిభక్తుల దురదృష్టమే. తాత్యా తమ స్మృతులలో తన తల్లి బయజాబాయికి సంబంధించిన ఒక సంఘటన యిలా చెప్పారు: ఒక ఆషాఢ ఏకాదశికి రాధాకృష్ణఆయి షిరిడీ నుండి పండరిపూరుకు పాదయాత్ర చేయ సంకల్పించింది. ఆమెతోపాటు బాలాషింపి, మాధవపస్లే కూడా బయలుదేరారు. ఆ విషయం తెలిసి మా అమ్మ బయజాబాయి, నేను, మరికొందరు గ్రామస్థులు కూడా పండరి వెళ్ళాలనుకున్నాం. ముందే బయలుదేరి వెళ్ళిన రాధాకృష్ణఆయి బృందాన్ని బండ్లలో అహ్మద్ నగర్ వెళ్లి కలుసుకొని, అక్కడినుండి అందరం కాలినడకన పండరి చేరాలని అనుకున్నాము. మా అమ్మ, బావ, లక్ష్మీబాయిషిండే, మరి నలుగురైదుగురు స్త్రీలు ప్రయాణానికి సిద్ధమైనారు.

బయలుదేరేముందు మేమంతా బాబా దర్శనం చేసుకొని, ఆయన ఆశీస్సులు తీసుకోవడానికి మశీదుకు వెళ్ళాం. బాబా ఆశీర్వదించి ఊదీ ఇచ్చారు. మా సామానులతో మూడు బండ్లు గ్రామ బావి వద్ద చెట్టు క్రింద బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నాయి. తర్వాత నేను మా యాత్ర నిర్విఘ్నంగా జరగడానికి మారుతి ఆలయంలో టెంకాయ కొట్టి, శని ఆలయానికి వెళ్తుండగా, దారిలో ఈనాడు సమాధి మందిరమున్న చోట బాబా నిలుచుని ఉన్నారు. నేను శని ఆలయంలో టెంకాయ కొట్టి బయటకు వచ్చేసరికి బాబా నన్ను పిలుస్తున్నారని కొండ్యా చెప్పాడు. నేను బాబా ఉన్న చోటుకి వెళ్ళాను. బాబా నన్ను మసీదుకు తీసుకెళ్ళారు. బాబా యథాస్థానంలో కూర్చున్నారు. నేను బాబా ప్రక్కన ఉన్న కటకటాల దగ్గర, నా ఎదుట షామా కూర్చున్నాము. షామా చిలుం వెలిగించి బాబాకి అందించాడు. బాబా చిలుం పీలుస్తూ కూర్చున్నారు. అంతా మౌనంగా కూర్చున్నాము. కొంతసేపటికి షామా బాబాతోదేవా! పండరియాత్రకు బయలుదేరిన బయజాబాయి వాళ్ళంతా అక్కడ తాత్యా కోసం ఎదురు చూస్తున్నారు” అన్నాడు. అప్పుడు బాబాబయజాబాయిని ఇటు పిలవండి! అన్నారు. మా అమ్మ హడావిడిగా వచ్చి, ఆతురతగాబాబా, ఏమిటి పిలిచారట? ప్రొద్దుగ్రుంకుతోంది. అందరూ బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారు అన్నది. బాబా ప్రశాంతంగామాయీ, నీవు ఇంటికెళ్ళు! ఇవాళ బయలుదేరవద్దు. రేపు కూడా వద్దు! ఎల్లుండి ప్రయాణంకా! ఎందుకు, ఏమిటని అడగకు! ఈ విషయంలో ఎవ్వరినీ సంప్రదించనక్కరలేదు. ఇదిగో, ఊదీ తీసుకో! అన్నారు. మా అమ్మ మరో ఆలోచన లేకుండా, సరే బాబా! మీరు చెప్పినట్లు ఎల్లుండే వెళ్తాము” అన్నది. ఆ తర్వాత షామా పంచాంగం చూచి, ఆ రోజు ప్రయాణానికి మంచిరోజు కాదని చెప్పాడు.

మూడవరోజు ఉదయమే మేము మళ్ళీ ప్రయాణానికి సిద్ధమైనాము. బాబా ఉత్సాహంగా ప్రతి ఒక్కరికీ ఊదీ ఇచ్చి, రోడ్డు వరకు వచ్చి మమ్ము సాగనంపారు. మేము పుంతంబా చేరి స్నానాలు, అల్పాహారం పూర్తి చేసుకొని, రైలెక్కి ఉదయం 8 గంటలకు బేలాపూర్ చేరాము. 9 గంటలకు రాధాకృష్ణఆయి బృందాన్ని కలుసుకున్నాము. భోజన సమయానికి నరసింగపూర్ చేరి, శ్రీ నరసింగ మహారాజ్ దర్శనం చేసుకున్నాము. అక్కడినుండి బయలుదేరి మరుసటిరోజు సాయంత్రానికి పండరిపురం చేరాము. పండరీపురంలో ఏకాదశినాడే కలరా చెలరేగింది. ద్వాదశి నాటికి బాగా విజృంభించింది. మా బృందంలోని వారంతా భయపడిపోయి షిరిడీ తిరిగి వెళ్ళడానికి తొందరపడసాగారు. నేను మాత్రం ఏదేమయినా పూర్ణిమ వరకు అక్కడే ఉందామని పట్టుబట్టాను. మా అమ్మ కూడా భయపడిపోయి, అక్కడే మమల్తదారుగా చేస్తున్న నానాసాహెబ్ చందోర్కర్ ను కలిసి వెంటనే షిరిడీ తిరిగి వెళ్ళడానికి నన్ను ఒప్పించమని కోరింది. నానాసాహెబ్ నాకు, బాలాషింపీకి కబురుపెట్టి పిలిపించి, వెంటనే షిరిడీ వెళ్ళమని సలహా ఇచ్చాడు. సర్వజ్ఞుడైన బాబాకు పండరిపురంలో కలరా చెలరేగుతుందని ముందే తెలుసు. కానీ మా ఉత్సాహం చూచి యాత్ర మాన్పించలేకపోయారు!" 

సాయిభక్తులపై పంచాంగాల పట్టు ... శరణాగతి పథం నుండి బయటకు నెట్టు:


స్థూలంగా చూస్తే ఎంతో చిన్నదిగా కనిపించినా, శ్రీసాయితత్త్వవిచారం దృష్ట్యా ముఖ్యమైన అంశం ఒకటి ఈ సంఘటనలో ఇమిడి ఉంది! నా చర్యలు అత్యంత అగాధాలు” అని బాబానే ఒకసారి అన్నారు. అటువంటి అగాధమైన శ్రీసాయి చర్యలను ఆయన బోధించిన తత్త్వానికి సమన్వయించుకొని, అవగాహన చేసుకోవడానికి ప్రయత్నించడం సాధనలో అవసరం. కానీశ్రీసాయి చర్యలకు జ్యోతిషం, వాస్తు మొదలైన శాస్త్రాల వెలుగులో కారణాలు వెతకబూనడం కేవలం అజ్ఞానమవుతుంది. అంతా సిద్ధమై ప్రయాణం కాబోయేముందు బయజాబాయి పండరియాత్రను వాయిదా వేయమన్నారు బాబా. మారు మాటాడకుండా, మరో ఆలోచన లేకుండా ఆ తల్లి ప్రయాణం మానుకొన్నది. బాబా మాటపై ఆమెకు గల అచంచల భక్తి విశ్వాసాలకు అది తార్కాణం. ఆ శరణాగతి తత్త్వమే తమ మాటల ద్వారా, చేతల ద్వారా బాబా మనకు ప్రబోధించినదీ, నేర్పదలచినదీ! అదీ సాయిభక్తులు సాధించవలసింది. బయజాబాయి ప్రయాణం హఠాత్తుగా మాన్పించడానికి కారణాలు వెతకబూని పంచాంగం చూచి, ఆ రోజు మంచిరోజు కాదని, అందుకే బాబా ప్రయాణం ఆపుచేశారని తేల్చి చెప్పాడు షామా! షామా మాటలను ఆధారం చేసుకొని ప్రయాణాది కార్యాలకు పంచాంగం ప్రకారం మంచిరోజు అదీ చూచుకొని ప్రారంభించడాన్ని బాబా పరోక్షంగా ప్రోత్సహించారని కొందరు అనుకొనే అవకాశముంది. కొంచెం ఆలోచిస్తే ఈ అభిప్రాయం ఎంత అసంబద్ధమో ఇట్టే బోధపడుతుంది. బయజాబాయి ప్రయాణం బాబా వాయిదా వేయడానికి ఆ రోజు మంచిరోజు కాదనేదే కారణమైతేఆ మాట చెప్పడానికి అరగంట ముందు ఆ యాత్రాబృందానికి ఊదీ ఇచ్చి, వెళ్లి రమ్మని ఎందుకు బాబా ఆశీర్వదించారు? అది మంచిరోజు కాదనే విషయం ఒక అరగంట ముందు బాబాకు తెలియదా? తరువాత తన నిర్ణయాన్ని పంచాంగంతో ముడిపెడతారని తెలిసే కాబోలు సర్వజ్ఞుడైన సాయి, “ఈ విషయంలో ఎవ్వరినీ సంప్రదించకు!” అని ఖచ్చితంగా నిషేధించారు. అంటే పరోక్షంగా బాబా తమ సహజరీతిలో పంచాంగాన్ని సంప్రదించడాన్ని నిషేధించినట్లే! అయితే తాత్యా భావించినట్లు పండరిలో కలరా ప్రబలుతుంది గనుక బాబా అలా ప్రయాణం వాయిదా వెయ్యమన్నారనడం కూడా పూర్తిగా సరిపోదు! అదే కారణమైతే ఎన్నో సందర్భాలలో ఇతర భక్తులకు చెప్పినట్లు స్పష్టంగా ప్రయాణమే వద్దని చెప్పి ఉండేవారు బాబా. అంతేగాక, అదే కారణమైతే, బయజాబాయికి పెట్టిన ఆటంకాలేవీ, అంతకుముందే పండరి ప్రయాణమైన రాధాకృష్ణఆయి బృందానికి బాబా పెట్టలేదు కదా? మరి, బాబా అలా ఎందుకు చేసినట్లు? ఆయన చర్యల వెనుక ఉన్న ఆంతర్యం ఆయనకే ఎరుక! అగాధ తవ కరణీ అని సాయిని ఆరతికారుడు కీర్తించినట్లు బాబా చర్యలు అగాధాలు, అనూహ్యాలు!

శ్రీమతి బయజాబాయి సుమారు 1910లో పరమపదించింది. ఆమె భర్త శ్రీ గణపతి కోతే పాటిల్ అంతకు కొన్నేళ్ల ముందే దివంగతుడయ్యాడు. బాబా అనుగ్రహం వలన బయజాబాయి వారసులంతా ధనవంతులుగా ఉన్నారు. నేటికి కూడా వారి కుటుంబంలో బాబాకు నైవేద్యం ఇవ్వకుండా ఏ ఆహారాన్నీ తాకరు. షిరిడీ సాయిబాబా సంస్థాన్ వారు బయజాబాయి వారసులకు పల్లకీ ఊరేగింపు సందర్భంగా బాబా యొక్క ఫోటోను, పాదుకలను తీసుకువెళ్ళే అవకాశాన్ని ఇచ్చారు. ఇది వారికి గొప్ప గౌరవం.

ఇంతటి గొప్ప భక్తురాలి గృహాన్ని చూడాలనుకోవడం సాయిభక్తులకు సహజమే. బయజాబాయి ఇల్లు మొదట చావడి నుండి తూర్పు దిశలో ఉన్న వీధిలో ప్రస్తుతం ఇచ్ఛ్ రాజ్ హోటల్ సమీపంలో ఉండేది. తరువాత ఆ ఇంటిని అమ్మేసి మహాలక్ష్మి మందిరం సమీపంలో ప్రస్తుతమున్న పిల్ గ్రిమ్స్ ఇన్ హోటల్ వెనుక క్రొత్త ఇల్లు నిర్మించుకొని అందులో నివసించేవారు. ఇప్పుడు ఆ ఇంటి జాగాలోనే బయజాబాయి గెస్ట్ హౌస్ అనే హోటల్ ఉంది.


(Source : www.shirdisaitrust.org, Ambrosia in Shirdi & Baba's Gurukul by Vinny Chitluri
http://saiamrithadhara.com/mahabhakthas/bayajabai_kote_patil.html,
సాయి భక్త విజయం.)


5 comments:

  1. Nice ,meku books chadiva habit vunda .so good .

    ReplyDelete
    Replies
    1. బాబా అంటే నాకు ప్రాణం సాయి, అందుకే అయన గురించి ఏదో ఒకటి తెలుసుకోవాలని ఉంటుంది. అందుకే ఇన్ఫర్మేషన్ కోసం వెతుకుతూ ఉంటాను.

      Delete
  2. షిరిడి సాయిబాబా గురించి ఎంత తెలుసుకున్న,ఇంకా తెలుకోవలసిన విషయము ఎంతో వుంది.
    సాయిని సేవిస్తున్నామంటే
    సాయిని ఆరాధిస్తున్నామంటే
    సాయిని పూజిస్తున్నామంటే
    పూర్వజన్మలలో మనము ఎంతో పుణ్యము చేసుకొనివుండాలి. ఆ ఫలితమే ఈనాడు సాయిబాబాతో యీ అనుబందము ఏర్పడింది. మనమెంత అదృష్టమంతులం మనకు సాయి గురు భక్తి మరియు సాయి గురు సేవ లభించడం.

    ReplyDelete
  3. Om Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🕉🙏❤😃🌺🥰🌹😀🌸😊🌼

    ReplyDelete
  4. సమర్థ సద్గురు సచ్చిదానంద శ్రీ సాయినాథ మహారాజ్ కి జై

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo