శ్రీసాయిబాబాతో ప్రత్యక్ష అనుబంధాన్ని కలిగి ఉండి, సాయి సంస్థాన్‌కు చెప్పుకోదగ్గ సేవలను అందించిన అత్యంత గౌరవనీయమైన భక్తులలో గణేష్ గోవింద్ నార్కే ఒకరు. అతను ఎం.ఏ., ఎం.ఎస్.సి పూర్తిచేసి భూగర్భ రసాయనశాస్త్ర ప్రొఫెసర్‌గా పూనా ఇంజనీరింగ్ కళాశాలలో పనిచేశాడు.
నార్కే 1905వ సంవత్సరంలో ఎమ్.ఎ. పట్టా పుచ్చుకున్నాడు. 1907 నుండి 1909 వరకు అతను కలకత్తాలో జియోలాజికల్ సర్వేలో (భూగర్భ పరిశోధన) శిక్షణ పొందాడు. 1909లో భారత ప్రభుత్వం అతన్ని ఉన్నత విద్యకై మాంచెస్టర్(ఇంగ్లాండ్) పంపింది. అతనక్కడ గనులు, భూగర్భశాస్త్రంలో ఎమ్.ఎస్.సి. పట్టా పుచ్చుకుని 1912 ఆగస్టులో స్వదేశానికి తిరిగి వచ్చాడు. అతని భార్య, తల్లి, మామగారైన శ్రీమాన్ బూటీ తరచూ శిరిడీ దర్శిస్తూ, బాబా సన్నిధిలో గడుపుతుండేవారు. ఒకసారి వాళ్ళు, "శిరిడీ వచ్చి బాబాను దర్శించుకోమ"ని నార్కేకు ఉత్తరం వ్రాశారు. అందుకతను, "బాబా రమ్మని చెబితే తప్పక వస్తాన"ని తిరిగి జాబు వ్రాశాడు. అతని మామగారు బాబా దగ్గరకు వెళ్ళి ఆ విషయం చెప్పగా, బాబా తమ సమ్మతి తెలియజేశారు. వెంటనే అతని మామగారు, "బాబా రమ్మని చెప్పార"ని నార్కేకు ఉత్తరం వ్రాశాడు. దాంతో నార్కే 1913, ఏప్రిల్ నెలలో మొదటిసారి శిరిడీ సందర్శించాడు.
మాధవరావు దేశ్‌పాండే(శ్యామా) అతనిని బాబా దర్శనానికి తీసుకుని వెళ్లి బాబాకు పరిచయం చేశాడు. వెంటనే బాబా, "ఇతనిని నాకు పరిచయం చేస్తున్నావా! ముప్ఫై తరాల నుండి ఇతను నాకు తెలుసు!" అన్నారు. "నా గత జన్మల విషయాలు బాబాకు తెలియడం ఎంత అద్భుతమో కదా!" అని అనుకున్నాడతను. తన భార్యను, తల్లిని, బూటీని బాబా ఎంతో ఆదరణగా చూస్తూ ఉండటం గమనించాడు. ఆ మొదటి దర్శనంలో అతను తనకు కలిగిన అనుభవం గురించి ఇలా చెప్పాడు: "ప్రధానంగా నా దృష్టినాకర్షించినవి వారి నేత్రాలు. వారి చూపు నా అణువణువులోకి చొచ్చుకునిపోయింది. చావడిలో ఆశీనులైన అప్పటి బాబా రూపం నా హృదయంలో చెరగనిముద్ర వేసింది" అని.
క్రమంగా నార్కే శిరిడీలోని వాతావరణానికి అలవాటుపడి బాబాకు సేవచేయడం, ఆరతులకు హాజరవడం మొదలుపెట్టాడు. ఒకసారి ఆరతి జరుగుతున్నప్పుడు బాబా కోపావేశాలతో ఊగిపోతున్నారు. ఏ కారణం లేకుండా అందరిపై తిట్లవర్షం కురిపిస్తున్నారు. ఏ కారణం చేత, ఎవరినుద్దేశించి బాబా అలా చేస్తున్నారన్నది ఎవరూ చెప్పలేకపోయారు. అది చూసిన నార్కే మనసులో 'బహుశా బాబా పిచ్చివారేమో'నన్న సందేహం క్షణకాలం మెదిలింది. తరువాత యథావిధిగా ఆరతి పూర్తయింది. తరువాత నార్కే ఇంటికి వెళ్లి, మళ్ళీ మధ్యాహ్నం మశీదుకొచ్చి బాబా పాదాలు ఒత్తుతూ కూర్చున్నాడు. అప్పుడు బాబా అతని తలమీద చిన్నగా తట్టి, “నేను పిచ్చివాడిని కాదు!” అన్నారు. ఆ మాటలు విన్న నార్కే ఆశ్చర్యానికి అంతులేదు. 'బాబా సర్వాంతర్యామి. ఆయన నుండి దాచేందుకు ఏదీ సాధ్యపడద'ని అతనికి అర్థమయ్యింది. 'వారు నా అంతర్యామి, అంతరాత్మ' అని అనుకున్నాడు. అప్పటినుండి వారి అంతర్యామిత్వం అనుభవమయ్యే సంఘటనలెన్నో అతనికి అనుభవమయ్యాయి. ఆ విషయమే అతడిలా చెప్పాడు: "బాబా మాట్లాడినప్పుడు నా హృదయపీఠంపై ఆశీనులై నా మనసులోని కోరికలు, ఆలోచనలు చెబుతున్నట్లుండేది. వారు నాలో ఉన్న దైవం. వారిని భగవంతుడనటంలో నాకెలాంటి సందేహం లేదు" అని. కానీ శాస్త్రీయంగా ఆలోచించే ఒక ప్రొఫెసర్‌గా అతనింకా బాబాను పరీక్షిస్తుండేవాడు. ప్రతి పరీక్షలోనూ 'వారు సర్వజ్ఞులని, సర్వవ్యాపకులని, సర్వశక్తిమంతులని, సంకల్పమాత్రాన సర్వాన్నీ మార్చగల సమర్థుల'న్న విశ్వాసం అతనికి కలిగింది. భూతభవిష్యద్వర్తమానాలలో బాబాకి తెలియని విషయమంటూ ఏదీ లేదన్న దానికి ఋజువుగా అతను పొందిన వందలాది అనుభవాల నుండి కొన్ని తెలుసుకుందాం.
నార్కే మొదటిసారి బాబా దర్శనం చేసుకున్నప్పుడు కేవలం మూడు నాలుగు రోజులు మాత్రమే శిరిడీలో ఉన్నాడు. తరువాత బాలఘాట్, బర్మాలకు వెళ్ళాడు. బర్మా ఆయిల్ కంపెనీలో మూడునెలలు ఉద్యోగం చేసి తిరిగి నాగపూర్ చేరుకున్నాడు. అక్కడినుండి తన భార్యతో శిరిడీ వెళ్లి నాలుగు నెలలు అక్కడ గడిపి తిరిగి నాగపూర్ చేరుకున్నాడు. తరువాత బాబా అతనిని శిరిడీ రమ్మన్నారని మాధవరావు నుండి ఉత్తరం రావడంతో ఈసారి అతనొక్కడే శిరిడీ వెళ్లి 13 నెలలు శిరిడీలో గడిపాడు. ఉద్యోగం లేకపోయినప్పటికీ అతను దిగులుపడలేదు. అప్పుడప్పుడూ చిత్రంగా ఫకీరు జీవితమే మేలేమోనన్న ఆలోచనలు అతనికి కలుగుతుండేవి.
1913లో ఒకరోజు బాబా నార్కేతో, “మీ మామ ఇక్కడొక పెద్ద రాతి కట్టడం నిర్మిస్తాడు. దానికి నీవు పర్యవేక్షకునిగా ఉంటావు" అని అన్నారు. బాబా చెప్పినట్లుగానే నార్కే మామ బూటీ 1915-1916లో వాడా (ప్రస్తుత సమాధిమందిరం) నిర్మాణాన్ని ప్రారంభించాడు. 1920 తరువాత ఏర్పాటు చేసిన సమాధిమందిర ట్రస్టులో నార్కే ఒక సభ్యునిగా వ్యవహరించాడు.
1914వ సంవత్సరంలో బాబా కొన్ని కఫ్నీలు తయారుచేయించి, చాలామంది భక్తులకు పంచిపెడుతున్నారు. దూరాన నిలబడి అదంతా గమనిస్తున్న నార్కే తనకు కూడా బాబా ఒక కఫ్నీ ఇస్తే ఆ కఫ్నీని భద్రంగా దాచుకుని సాయిబాబా భజన మొదలైన ప్రత్యేక సందర్భాలలో ధరించవచ్చని అనుకున్నాడు. అయితే ఇంకా కఫ్నీలు మిగిలే ఉన్నప్పటికీ హఠాత్తుగా బాబా కఫ్నీలు పంచడం ఆపేశారు. కొంతసేపటి తరువాత బాబా నార్కేను దగ్గరకు రమ్మని సైగచేసి పిలిచారు. అతడు దగ్గరకు రాగానే బాబా అతని తలపై తమ మృదువైన హస్తాన్నుంచి నెమ్మదిగా తడుతూ, "కఫ్నీ ఇవ్వనందుకు నన్ను తప్పుపట్టవద్దు. ఆ ఫకీరు (దేవుడు) నీకు కఫ్నీ ఇవ్వడానికి అనుమతించలేదు" అన్నారు.
నార్కేకు చాలాకాలం వరకు స్థిరమైన ఉద్యోగం దొరకలేదు. ఇంగ్లండులో భూగర్భ శాస్త్రవేత్తగా, మైనింగ్ ఇంజనీరుగా పట్టభద్రుడైన అతని అర్హతకు సరిపడే ఉద్యోగ ప్రకటనలు చాలా తక్కువగా వస్తుండేవి. కొద్దిపాటి జీతంతో స్వల్పకాలిక ఉద్యోగాలే అతనికి లభిస్తుండేవి. కొంతకాలం పనిచేయడం, మరికొంతకాలం నిరుద్యోగిగా ఉండటం జరుగుతుండేది. రోజులు గడుస్తున్నా జీవితంలో స్థిరపడకపోవడంతో నార్కే బంధువులు అతని ఉద్యోగ విషయంగా బాబాను అడుగుతుండేవారు. ఆ విషయమై అతని తల్లి చాలా ఆందోళన చెందుతుండేది. ఉద్యోగ నిమిత్తం తన బిడ్డ కలకత్తా, బర్మా వంటి దూరప్రాంతాలకు వెళ్లడం చూసిన ఆమె ఒకసారి బాబాతో, "బాబా! నా బిడ్డని మా ఊరిలోగానీ, శిరిడీకి దగ్గరలోగానీ మంచి ఉద్యోగంలో స్థిరపడేలా అనుగ్రహించండి" అని మొరపెట్టుకుంది. అప్పుడు బాబా, "నేనతనిని పూనాలో స్థిరపరుస్తాను!" అని అన్నారు. ఒక్కొక్కప్పుడు నార్కేకు ఒకేసారి అనేక ఉద్యోగ అవకాశాలు వస్తుండేవి. వాటిలో ఏదో ఒకదానిని ఎంచుకోవాల్సి వచ్చేది. అటువంటి పరిస్థితుల్లో అతను బాబా యొక్క సర్వజ్ఞత, దివ్యదృష్టిపై విశ్వాసంతో తనకు దారిచూపమని బాబాను అడిగేవాడు. అతనికి బాబాపై ఉన్న నమ్మకం పాలు త్రాగే పసిబిడ్డకు తన తల్లిపై ఉండేటటువంటిది. అయితే బాబా ఎంపిక చిత్రంగా ఉండేది. ఒకసారి, 'కలకత్తా వెళ్లాలా? బర్మా వెళ్లాలా?' అని అడిగినప్పుడు, దూరప్రదేశమైన బర్మాకు వెళ్లమన్నారు బాబా. అతను ఇలా అడిగిన అన్ని సందర్భాలలోనూ, “బర్మా-పూనా వెళ్ళు” అనీ, లేదా "ఫలానాచోటు-పూనా వెళ్ళు" అనీ ప్రతిసారీ పూనా పేరు జతపరచి చెబుతుండేవారు బాబా. తన విద్యార్హతలకు తగిన ఉద్యోగం పూనాలో దొరికే అవకాశం లేదని తనలో తాను నవ్వుకునేవాడు నార్కే. 1917లో ఒకసారి వారణాసి విశ్వవిద్యాలయం నుంచి ఇంటర్వ్యూకి రమ్మని అతనికి ఉత్తరం వచ్చింది. బాబాను సలహా అడిగితే, “నువ్వు వారణాసి వెళ్ళనవసరం లేదు, పూనా వెళ్ళు” అన్నారు బాబా. “బాబా! పూనాలో భూగర్భశాస్త్రానికి సంబంధించిన కాలేజీలుగానీ, విశ్వవిద్యాలయాలుగానీ ఏమీ లేవు” అన్నాడతను. బాబా సమాధానమేమీ ఇవ్వలేదు.
చివరికి 1917వ సంవత్సరంలో పూనా విశ్వవిద్యాలయంలో భూగర్భశాస్త్రానికి సంబంధించిన కోర్సు ప్రారంభమయింది. ఆ శాస్త్రాన్ని బోధించేందుకు ఒక ప్రొఫెసర్ కావాలని పత్రికా ప్రకటన వెలువడింది. అది చూసిన వెంటనే నార్కే, "ఆ ఉద్యోగానికి దరఖాస్తు చేయమంటారా?" అని బాబాను అడిగాడు. బాబా అనుమతించడంతో అతడు ఆ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నాడు. ఎంతోమంది అభ్యర్థులు ఆ ఉద్యోగానికై పోటీపడ్డారు. పైగా పలుకుబడిగలవారి సిఫారసులు తీసుకుని రావడంతో నార్కే పరిస్థితి క్లిష్టతరమైంది. అతడు శిరిడీ నుంచి వెళ్ళిన తరువాత బాబా అక్కడున్న వారిని, "నార్కే ఎక్కడికి వెళ్ళాడు?" అని అడిగారు. అందుకు వాళ్ళు, "అతను ఉద్యోగ ప్రయత్నం మీద పూనా వెళ్లాడ"ని చెప్పారు. బాబా, "అల్లా అనుగ్రహిస్తాడు" అని అన్నారు. తరువాత ఆయన వాళ్ళని, "నార్కేకు పిల్లలున్నారా?" అని అడిగారు. "అతనికి చాలామంది పిల్లలు పుట్టారు. కానీ, ఎవ్వరూ ఎక్కువకాలం జీవించలేద"ని వాళ్ళు చెప్పారు. అప్పుడు కూడా బాబా, "అల్లా అనుగ్రహిస్తాడు" అని ఆశీర్వదించారు. బాబా ఆశీర్వదించినట్లుగానే నార్కే 1918లో ఆ విశ్వవిద్యాలయంలో భూగర్భ, గనుల శాస్త్రంలో ప్రొఫెసర్‌గా మంచి జీతంతో నియమితుడయ్యాడు. 1919లో ఆ ఉద్యోగం పర్మినెంట్ అయింది. బాబా ప్రతి పట్టణానికి చివర ‘పూనా’ అని ఎందుకు జతపరిచేవారో అప్పుడతనికి అర్థమై, ఈ ఉద్యోగ విషయం 1913లోనే బాబా దృష్టిలో ఉందని గ్రహించాడు. "నా భవిష్యత్తు మొత్తం బాబాకు తెలుసన్నమాట" అని అనుకున్నాడు. బాబా ఆశీర్వదించిన మీదట నార్కేకు కలిగిన బిడ్డలందరూ క్షేమంగా ఉన్నారు. అతనికి నలుగురు కుమారులు. ఇవన్నీ బాబా కృపాశీస్సుల వలన మాత్రమే సాధ్యమయ్యాయి.
చాలాకాలం తర్వాత 1916వ సంవత్సరంలో ఒకసారి నార్కే శిరిడీ వెళ్ళాడు. గ్రామానికి చేరిన వెంటనే బాబాకు ఎవరెవరు ఏయే సేవలు చేస్తున్నారని విచారించాడు. న్యాయవాదియైన వామనరావు పటేల్ బాబా తరఫున గ్రామంలో భిక్షాటన చేస్తున్నట్లుగా తెలిసింది. దాంతో అతడు కాస్త అసూయ చెంది, "ఆ సేవను నాకెందుకు ప్రసాదించకూడదు?" అని తన మనసులో అనుకున్నాడు. కానీ దానిని బయటకు వ్యక్తపరచలేదు. ఇంతలో బాబాను దర్శించుకునే సమయం ఆసన్నమయింది. బట్టలు మార్చుకునే సమయం లేక సూటు, బూటు, ప్యాంటు, కోటు, తలపై టోపీతోనే ద్వారకామాయికి వెళ్ళి బాబాను దర్శించుకున్నాడు. అప్పటికే ఒక భక్తుడు "వామనరావుకు భిక్షాపాత్రనిచ్చి పంపమంటారా?" అని మూడుసార్లు బాబాని అడుగుతున్నాడు. హఠాత్తుగా బాబా నార్కే వైపు చూపుతూ, “ఆ భిక్షాపాత్ర తీసుకుని ఈరోజు భిక్షకోసం ఇతను వెడతాడు. ఇతనిని వెళ్లనివ్వండి” అని అన్నారు. ఆరోజు నార్కే సూటు, బూటుతో భిక్ష తీసుకొచ్చాడు. ఆ తరువాత నాలుగునెలలు అతడు మామూలు దుస్తులు ధరించి ప్రతిరోజూ మధ్యాహ్నం బాబా తరఫున భిక్షకు వెళ్లి, బాబాకోసం భిక్ష తీసుకుని వచ్చేవాడు. అన్నిరోజులపాటు భిక్షకు వెళ్ళినది అతనొక్కడే. బాబా ఆ సేవకు అతనినెందుకు ఎన్నుకున్నారో ప్రజలు అర్థం చేసుకోలేకపోయారు. హృదయాంతర్యామి అయిన బాబా అతని మనసెరిగి అతనికి ఆవిధంగా సేవ చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించారు. బాబా తమ తరఫున మధ్యాహ్న వేళ భిక్షకు వెళ్ళే భాగ్యాన్ని చాలా కొద్దిమందికి మాత్రమే ఇచ్చేవారు.
బాబా ప్రతిరోజూ నైవేద్యం కోసం హల్వా దుకాణదారుడు రంగారావు వద్ద నుండి మిఠాయి తెప్పించేవారు. 1916వ సంవత్సరంలో శిరీడీలో ప్లేగు వ్యాధి తీవ్రంగా ప్రబలి పెద్ద ఉపద్రవాన్ని సృష్టించింది. ఆ అంటువ్యాధి కలిగిస్తున్న విధ్వంసానికి ప్రతి ఒక్కరూ చావుభయంతో తల్లడిల్లిపోయారు. నార్కేకి కూడా చావుభయం పట్టుకుంది. శిరిడీలోనే ఉంటే తనకి చావు తప్పదనుకున్నాడు. అటువంటి పరిస్థితుల్లో బాబా నార్కేను పిలిచి, కొంత డబ్బిచ్చి రంగారావు దుకాణానికి వెళ్ళి మిఠాయి తెమ్మని ఆదేశించారు. భయపడుతూనే అతడు ఆ దుకాణానికి వెళ్ళాడు. దుకాణదారుడయిన రంగారావు ఆరోజే చనిపోయాడు. శవం ఇంకా అక్కడే ఉంది. ప్రక్కనే అతని భార్య సీతాబాయి రోదిస్తూ ఉంది. అక్కడి పరిస్థితినంతా చూసిన నార్కేకి గుండె ఆగినంతపనైంది. ఒకవైపు ప్లేగు వ్యాధితో మరణించిన రంగారావు శవం దుకాణంలో ఉంది. మరోవైపు మిఠాయి తెమ్మన్న బాబా ఆజ్ఞ. ఏమి చేయాలో అర్థంకాని పెద్ద సందిగ్ధంలో పడ్డాడు నార్కే. అతను గొప్ప విద్యావంతుడు, పైగా ప్రతి విషయాన్ని విశ్లేషించి మరీ ఆలోచించే వ్యక్తి. అందుచేత బాబా ఆ దుకాణంనుంచే తనని మిఠాయి తెమ్మని ఆజ్ఞాపించారంటే దానికి తగిన కారణం ఖచ్చితంగా ఉండనే ఉంటుందని భావించి కాస్త ధైర్యం తెచ్చుకుని రంగారావు భార్యతో బాబా మిఠాయి తెమ్మని తనని పంపించారని చెప్పాడు. ఆమె అలమారా వైపు చూపుతూ, “ధైర్యం ఉంటే, ఆ అలమరాలోని మిఠాయి తీసుకుపొమ్మ"ని చెప్పింది. అతడు దీనితో తాను, మిగిలినవారు ప్లేగు బారిన పడతామేమోనని భయంతో వణికిపోతూ మిఠాయి తీసుకుని, ప్రక్కనే డబ్బులు పెట్టి అక్కడినుండి వచ్చేశాడు. మసీదుకు వెళ్ళి మిఠాయిని బాబా పాదాల వద్ద పెట్టాడు. బాబా దాన్నే ప్రసాదంగా భక్తులందరికీ పంచిపెట్టి నార్కేతో, “శిరిడీలో ఉంటే మరణిస్తావని, ఊరు విడిచి వెళ్తే సురక్షితంగా ఉంటావని అనుకుంటున్నావా? కానీ అలా ఎన్నటికీ జరగదు. అదంతా నీ భ్రమ. ఎక్కడున్నా సమయం వచ్చినప్పుడు మృత్యువు కొడుతుంది. మరణించవలసిన వారే మరణిస్తారు. రక్షింపబడవలసిన వారు రక్షింపబడతారు" అని అన్నారు. ఆవిధంగా బాబా నార్కే భయాన్ని పారద్రోలారు. కలరా వ్యాధి వ్యాపించిన మరో సందర్భంలో కూడా బాబా ఇలాగే అతనికి ధైర్యం చెప్పారు.
బాబా భక్తులందరిలోనూ ఉన్నత విద్యాభ్యాసం చేసిన వ్యక్తి నార్కే ఒక్కడే. అతనికి మంచి సూక్ష్మదృష్టి కలవాడనే గుర్తింపు ఉంది. బాబాను దగ్గరనుండి నిశితంగా పరిశీలించే అవకాశం అతనికి కలిగింది. దానివల్ల బాబాను బాగా అర్ధం చేసుకున్నాడు. అతను తన అధ్యయనానికి సంబంధించిన వివరాలను 1936లో బి.వి.నరసింహస్వామిగారు చేసిన ఇంటర్వ్యూలో చెప్పారు. వాటిని అతని మాటల్లోనే తెలుసుకుందాం. అవి బాబా యొక్క మరో కోణాన్ని మన ముందు ఆవిష్కరిస్తాయి.
నిశితంగా పరిశీలించి, బాబా భౌతికంగా ఈ లోకంలోను, సూక్ష్మరూపంలో ఇతర లోకాలలో కూడా వశిస్తూ తమ కర్తవ్యాన్ని నిర్వహిస్తుంటారన్న అద్భుత సత్యాన్ని నేను గుర్తించాను. బాబా గురించి సరిగా తెలియనివారికి వారు మాట్లాడే మాటలు అర్థరహితంగా అనిపించేవి. కానీ వాటిని జాగ్రత్తగా గమనిస్తే వారి మాటలలోని భావాన్ని తెలుసుకోవచ్చు. బాబా మాటలు సంజ్ఞలు, నీతికథలు, ఉపమానాలతో కూడి ఉండి, వారి మాటలు నిగూఢంగా ఉండేవి. కనుక సామాన్యులు వారి మాటలలోని మర్మాన్ని అర్థం చేసుకోలేక ఎవరికి తోచిన వ్యాఖ్యానాలు వారు చేసుకునేవారు. అంతేకాదు, బాబాను ఒక లౌకికవాదిగానూ, అత్యాశగలవానిగానూ అపార్థం చేసుకునేవారు. ఉదాహరణకు, ఒకసారి ఒక వ్యక్తి మశీదుకొచ్చి బాబాను కొద్దిసేపు పరిశీలించాడు. నేను అతనిని, "బాబాపై మీ అభిప్రాయం ఏమిట"ని అడిగాను. అందుకతను నిరాశతో, "రోజులో ఎల్లప్పుడూ డబ్బు గురించి మాట్లాడే సాధువులను నేను ఎప్పుడూ చూడలేదు" అని అన్నాడు. బాబా తరచుగా "పైసా" అనే పదాన్ని "పుణ్యం" అనే అర్థంతో మాట్లాడతారని అతనికి తెలియదు. బాబా మాటలను జాగ్రత్తగా పరిశీలించి, విశ్లేషిస్తే వారి తత్వము, చర్యలు, శక్తి అద్భుతమైనవని, వారి మార్గదర్శకత్వం, సహాయం, ప్రజలు పొందే ప్రయోజనం చాలా విలక్షణమైనవని తెలుస్తాయి.
http://bonjanrao.blogspot.com/2012/10/prof-g-g-narke.html
om om sai ram
ReplyDeleteom sai baba i love nanna
ReplyDeleteOm Sai
ReplyDeleteSri Sai
Jaya Jaya Sai
🙏🙏🙏
🙏💐🙏 ఓం సాయిరాం 🙏💐🙏
ReplyDeleteఓం సాయిరాం...🌹🙏🏻🌹
ReplyDeleteOm Sai Ram 🙏🌹🙏🌹🙏
ReplyDeleteఓం శ్రీ సాయినాథాయ నమః!🙏
ఓం ఆరోగ్య క్షేమదాయ నమః!🙏
సాయి ఈశ్వర మా యొక్క అందరి అనారోగ్యం ఇప్పటికిప్పుడు రూపుమాపి నిర్మూలన చేసి ఆశీర్వదించు సాయినాథ్ దేవా..
ReplyDeleteOm Sri Sai
ReplyDeleteOm Sri Sai
Om Sri Sai
Om Sri Sai
Om Sri Sai
Om Sri Sai
Om Sri Sai
Om Sri Sai
Om Sri Sai
Om sairam
ReplyDeleteOm sairam
Om sairam
Om sairam
Om sairam
Om sairam
Om sairam
Om sairam
Om sairam
Om sai ram, baba naaku manchi arogyanni echi twaraga kolukune la chayandi tandri pls, digestion problem eam lekunda chudandi baba pls, ofce lo situations anni bagunde la chayandi baba pls, amma nannalani shiva family ni, ma family ni, e prapancham lo andarni kshamam ga arogyam ga chusukondi baba pls.
ReplyDelete