సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

జి.జి.నార్కే - మూడవ భాగం



బాబా దృష్టిలో మనిషి జీవితానికి ఉన్న లక్ష్యాలేమిటి? వాటిని సాధించేందుకు అవసరమైన సద్గుణాలేమిటి? బాబా ఎటువంటి సాధనల పట్ల సానుకూలంగా ఉండేవారు? - వంటి అంశాలను పరిశీలిద్దాం:

నాలుగు సాధన మార్గాలు

1. యోగ మార్గం:

ఆసనం, ప్రాణాయామం, ధ్యానం, కుండలిని మేల్కొల్పడం వంటి వాటి ద్వారా అతీతమైన శక్తులు పొందడాన్ని సాయిబాబా లక్ష్యపెట్టేవారు కాదు. నాకు తెలిసినంతవరకు పై సాధనలు చేయమని బాబా ఎవరికీ సిఫారసు చేయలేదు. పైగా, "ప్రాణాయామం ద్వారా సాధన చేసేవారు కూడా చివరికి ఆధ్యాత్మిక పురోగతి కోసం నా దగ్గరకు వచ్చి తీరవలసిందే!" అని బాబా చెప్పడం నేను స్వయంగా విన్నాను.

2. కర్మ మార్గం:

సమాజంలో ఉంటూనే కర్మమార్గాన్ని అనుసరిస్తూ దేనినైనా సాధించవచ్చని బాబా తమ ఆచరణ ద్వారా నిరూపించారు. ఆయన స్వయంగా గోధుమలు విసిరేవారు. బాబా తమను దర్శించవచ్చిన భక్తులు తమ తమ గృహస్థ జీవితాలనే కొనసాగించాలని కోరుకునేవారుగానీ, సన్యసించమని చెప్పేవారు కాదు. అనగా, సన్యసించి సమాజానికి దూరంగా వెళ్లడం ఆయనకు సమ్మతం కాదు. ఋణానుబంధాన్ని అనుసరించి తమ కొద్దిపాటి ఆహారం కొరకు బాబా పరిమితంగా భిక్ష చేసినప్పటికీ భిక్ష చేసి జీవించడాన్ని ఆయన ఆమోదించేవారు కాదు. బాబా నన్ను, వామన్‌రావును భిక్షకు పంపింది మాకోసం కాదు, గురువు కోసం - వినయవిధేయతలతో గురు సేవ చేయించేందుకు. బాబా వాచా చెప్పకపోయినా విచక్షణ లేని యాచన మంచిది కాదని, దీనివలన ఆర్జించిన పుణ్యమంతా తరిగిపోతుందని వారు భావించేవారని నా అభిప్రాయం.  బాబా దక్షిణ అడగటం వెనుక అనేక కారణాలున్నా ప్రధానమైనది ఋణానుబంధ విముక్తే! ఒకసారి ఒక భక్తుడు, "మీరెందుకు దక్షిణ అడుగుతున్నారు?" అని బాబాను అడిగాడు. అప్పుడు బాబా, "నేనందరినీ దక్షిణ అడుగుతున్నానా? ఆ ఫకీరు (దేవుడు) ఎవరిని అడగమని సూచిస్తారో వారినే అడుగుతాను!" అని బదులిచ్చారు. బాబా నిర్ణీత మొత్తాన్ని మాత్రమే అడిగేవారు. అంతకన్నా ఎక్కువ పైకం ఇచ్చినా వారు స్వీకరించేవారు కాదు. బాబా దక్షిణ అడిగితే ఇవ్వడానికి ఎవరూ నిరాకరించేవారు కాదు. కొన్ని సందర్భాలలో వారు అడిగే దక్షిణకు వేరు అర్థాలు ఉండేవి. ఉదాహరణకు, ఆ భక్తుణ్ణి అక్కడినుండి వెళ్లిపొమ్మనిగానీ, ఎవరినైనా వెళ్లి కలవమనిగానీ సూచించే విధంగా ఉండేవి.

3. జ్ఞాన మార్గం:

ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రముల అధ్యయనం ద్వారా ఆత్మవిచారణ చేయడమే జ్ఞానమార్గమైతే, అది బాబా పద్ధతి కాదు. ఆయన తమ అభీష్టాన్ని ఎప్పుడూ వ్యక్తపరచలేదు. అయితే తమ ఆచరణ ద్వారా 'తమ భక్తులు తమంతటివారు కావాలన్నదే' ఆయన కోరికగా మనం గ్రహించాలి. నేను చూడగలిగినంతవరకు ఆయనకున్న జ్ఞానం, అనుభవం నిత్యసత్యాలు. ఈ లోకానికే కాక ఇతర లోకాలన్నింటికీ వ్యాపించి ఉన్న ఆయన ఎఱుక భూతభవిష్యద్వర్తమానాలకు విస్తరించి ఉంటుంది. అందువల్ల, ఏయే లోకాలలో ఏమి ఉందో, ఆత్మానందం కోసం ఏ సమయంలో ఏది ఇవ్వాలో ఆయనకు తెలుసు. అటువంటి జ్ఞానంతో ఆయన అన్ని బంధాలను త్యజించారు. అనేకానేక ఆకర్షణల మధ్య ఉంటూనే ఆయన వాటన్నిటికీ అతీతంగా ఉండేవారు. బాబా ఆచరించి చూపిన నిష్కామకర్మ, వైరాగ్యాలే ఎవరినైనా భగవంతుని వైపుకు నడిపిస్తాయి.

4. భక్తి మార్గం:

ఇతర మహాత్ముల వలె సాయిబాబా కూడా భక్తి మార్గాన్నే బోధించారు. ఈ మార్గంలో దేవుణ్ణి అనన్యంగా ప్రేమించడం, సేవించడం, ఆజ్ఞాపాలన చేయడం మొదలైనవి ప్రధానాంశాలు. ఈ మార్గంలో గురువు ద్వారానే దైవాన్ని చూస్తూ, గురువే దైవంగా ఆరాధింపబడతాడు. గురుభక్తిని పెంపొందించుకోవాలని ఆచరణ ద్వారా, బోధ ద్వారా బాబా తెలియజేసిన మార్గం విశిష్టమైనది.

బాబా యొక్క గురువు

బాబా యొక్క గురువు గురించి ఎవరికీ తెలియదు. "నా గురువు బ్రాహ్మణుడు (మాఝా గురు బ్రాహ్మణ్ ఆహే)" అని బాబా చెప్పేవారు. నిజమైన బ్రాహ్మణులపై వారికి గౌరవముండేది. "బ్రాహ్మణులు వారి సత్కర్మల వలన ఎక్కువ పైసలు సంపాదిస్తారు" అని బాబా చెప్పేవారు. 'పైసా' అంటే పుణ్యమని వారి భావం.

శిష్యునికి, భక్తునికి మధ్య తేడా ఉంది. గురువు శిష్యునితో సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉండి అతని బాధ్యతలన్నీ భరిస్తాడు. కానీ భక్తునితో ఆయనకు అటువంటి సంబంధం ఉండదు. భక్తుని పాపకర్మలను, దుఃఖాలను ఆయన భరించనవసరంలేదు. శిష్యుడు తన గురువును సేవించుకుంటూ వారి ఆజ్ఞలను శిరసావహించి తు.చ తప్పకుండా పాటించాలి. ఒకసారి బాబా, "ఎవరు నా శిష్యుడని చెప్పడానికి సాహసించగలరు? నేను నా గురువును సేవించినట్లు ఎవరైనా తృప్తికరంగా సేవించగలరా? నా గురువును సమీపించడానికే నేను వణికిపోయేవాణ్ణి!" అని అనేవారు. ఆయన రీతిన వారిని సేవించేవారెవరూ లేరు. ఆయనకు శిష్యులంటూ ఎవరూ లేరు.

బాబాకు అనేకమంది భక్తులున్నారు. ఆయన వారి యోగక్షేమాలు చూసేవారు, రక్షణనిచ్చేవారు, ప్రోత్సహించేవారు. కొన్ని ఉదాహరణల ద్వారా, సంజ్ఞల ద్వారా వారికి సూచనలు, ఆదేశాలు ఇచ్చేవారు. వాచా బోధించడం బాబా సాంప్రదాయం కాదు. ఒక్కొక్కసారి కొందరిని నీతికథల ద్వారా, మరికొందరిని ఆదేశాల ద్వారా ఉద్ధరించినప్పటికీ బాబా సాంప్రదాయం భక్తులపై అధిక ప్రభావం చూపేది. బాబా సాంప్రదాయాల ప్రకారం గురువు యొక్క పాదాలను ఆశ్రయించే శిష్యుడు లేదా భక్తుడు పవిత్రత, సత్ప్రవర్తన, ధర్మవర్తన కలిగి ఉండాలనడంలో సందేహం లేదు. అతనికి జపధ్యానాదుల వంటి సాధనలు అవసరం లేదు. జపం, ధ్యానం వంటి మనోసంబంధిత సాధనలు చేస్తున్నప్పుడు, "నేను చేస్తున్నాను" అన్న స్ఫురణే పెద్ద అవరోధం. ఇది గురు కార్యానికి పెద్ద అడ్డంకి. కాబట్టి వివిధ రకాలుగా భక్తుడు లేదా శిష్యుడిలో వ్యక్తమయ్యే అహాన్ని పూర్తిగా మనస్సు నుండి తుడిచివేయాలి. గురువెప్పుడూ ఏదీ బోధించరు. తమ శక్తిని ప్రసరిస్తారు. సంపూర్ణ శరణాగతి చెందిన ఆత్మ తనలో ప్రసరింపజేయబడిన ఆ శక్తిని పూర్తిగా గ్రహించినప్పుడు అహం నశిస్తుంది. కానీ మన బుద్ధి, స్వశక్తిపై ఆధారపడటం, తమ అభిప్రాయాన్ని సమర్థించుకోవడం మొదలైన వివిధ రూపాల అహం ఆ శక్తిని అడ్డుకుంటుంది.

పరిశీలనా దృష్టితో సాయిబాబాను సందర్శించేవారందరూ ఈ మహత్తర సత్యాన్నే గమనించి ఉంటారు. అందుకే కొంతమంది భక్తులతో బాబా, "నీవు నా వద్ద ఊరికే కూర్చో, చేయవలసినదంతా నేనే చేస్తాను" అని చెప్పేవారు. వారి అనుగ్రహాన్ని పొందడానికి వారిపై పూర్తి విశ్వాసం కలిగి ఉండాలి. అయితే, కేవలం వారి దర్శనంతో, కొద్దిసేపు వారి సమక్షంలో గడపడంతో భక్తులు విశ్వాసాన్ని పొందుతారు. బాబా తమ అద్భుతశక్తితో హృదయాంతరాళాలను, విశ్వంలోని సుదూర ప్రాంతాలను, భూతభవిష్యద్వర్తమానాలను చూడటం వంటి అనుభవాలను ప్రతి భక్తునికి ప్రసాదించడం ద్వారా వారిలో విశ్వాసాన్ని నింపుతారు. అయితే భక్తులు కేవలం విశ్వాసం మీద ఆధారపడాల్సిన పనిలేదు. ఆధ్యాత్మికంగా, ప్రాపంచికంగా తాము పొందిన ప్రయోజనం, ఎక్కడికి వెళ్ళినా, ఏమి చేసినా బాబా కృపాదృష్టిలో, సంరక్షణలో ఉన్నామనే ఎఱుక భక్తులను ముందుకు నడిపిస్తాయి. సమస్త జగత్తును తమ అధీనంలో ఉంచుకుని ఇహపరలోకాలలో మన విధివిధానాన్ని నిర్ణయించే మహాశక్తి శ్రీసాయిబాబా.

కాబట్టి, భక్తుడు లేదా సాధకుడు గురువు యొక్క కృపకు పాత్రుడయ్యేందుకు సత్ప్రవర్తన, పవిత్రత, నిరాడంబరత, సద్బుద్ధి కలిగి ఉండాలి. ఆపై ప్రగాఢ విశ్వాసంతోనూ, నిష్కపటంతోనూ మెలుగుతూ గురువు ప్రసాదించే అనుభవాల సోపానాలను అధిరోహిస్తూ ఆధ్యాత్మిక ప్రగతిలో ఉన్నత శిఖరాలను చేరుకోవాలి. 'ఒక్క అడుగు ముందుకు వేయగలిగితే చాలు' అనే దృక్పథమే సరైనది. అంతేగానీ, మన జీవితగమ్యం కొరకు తత్త్వశాస్త్రం, వేదాంతవిచారము మొదలైన జటిలమైన సిద్ధాంతాలను పరిశోధించవలసిన అవసరం లేదు. వాటిని పరిష్కరించుకోవడానికి కావలసిన సమర్థత మనకు లేదు. గురువే మనల్ని ఉద్ధరించి అపారమైన జ్ఞానాన్ని, సత్యాన్ని గ్రహించే శక్తిని అనుగ్రహించి భద్రంగా మనల్ని గమ్యానికి చేరుస్తారు.

పైన చెప్పిన విషయాలన్నీ బాబా ఏకధాటిగా నాతో చెప్పడంగానీ, ఒకేసారి నేను వినడంగానీ జరగలేదు. బాబా ఆచరణ, వారు భక్తులతో వ్యవహరించిన పద్ధతులు, అప్పుడప్పుడు వారి నోటినుండి వెలువడిన మాటలు మొదలైనవాటినుండి నేను గ్రహించిన విషయాలను సంకలనం చేశాను. నా అభిప్రాయం ప్రకారం - ఏ విషయాలను ఆస్వాదించి ఆనందించాలో, వేటిని విడిచిపెట్టాలో తెలుసుకోకుండా కేవలం వివేకవైరాగ్యాలను గూర్చి చర్చించడం బుద్ధిహీనత. ఆచరణ, అనుభవం లేకుండా మాట్లాడటం ఆత్మవంచనే గాక ఇతరులను కూడా వంచించడమే అవుతుంది. పుస్తకజ్ఞానం నిజమైనది కాదు, నిజజీవితంలోని ఒత్తిడులకు నిలబడగలిగేది కాదు. "నేను కుక్కలోను, పందిలోను, పిల్లిలోను ఉన్నాను" అని బాబా అన్నప్పుడు, వారు ఆయా ప్రాణులలో తామే ఉన్నట్లు అవి పొందే అనుభవాలను గూర్చి పలికేవారని తెలుస్తుంది. కొందరు, "ఈ విషయాన్ని మేము భగవద్గీతలో చదివాము, కాబట్టి దానిని నిజమని నమ్ముతున్నాము" అని చెబుతారు. కానీ ఏ విషయాన్నైనా అనుభవించి తెలుసుకోకుండా చెబితే అది వంచనే అవుతుంది.

బాబా గొప్పతనము, వారి నిజతత్త్వము నాకు ఒక సంఘటన ద్వారా క్షుణ్ణంగా అర్థమయింది. భక్తులు భావిస్తున్నట్లు బాబా దైవమని నేను నా అనుభవాల ద్వారా తెలుసుకున్నాను. కానీ ఒక ఆత్మ భౌతికదేహం ధరించినప్పుడు కొన్ని పరిమితులకు లోబడి ఉంటుంది. అందువల్ల వారిలో దైవత్వం, మానవత్వం రెండూ సమ్మిళితమై ఉంటూ వేటికవే వ్యక్తమవుతాయన్నది సత్యం. అయితే నా ఈ అభిప్రాయంతో శిరిడీలో ఉన్న కొందరు మిత్రులు ఏకీభవించలేదు. ఒకసారి వాళ్ళు శ్రీకృష్ణుడు ద్వారకలో ఉన్నప్పుడు ఆ ద్వీపంలో 6 కోట్లమంది నివసించేవారని చెప్పారు. నేను దాన్ని ఖండించి, "ఇప్పుడు సువిశాల భారతదేశంలో 33 కోట్లమంది అధిక జనాభాతో ఒకరి మీద ఒకరు నడుస్తున్నట్లుగా ఉంది. అలాంటప్పుడు ఆ ద్వీపంలో అంతమంది ఉండటానికి అవకాశమే లేద"ని వాదించాను. నా వాదన వాళ్ళకి నచ్చక, "ఈ విషయంపై బాబా చెపితే నమ్ముతావా?" అని నన్ను అడిగారు. నేను నమ్ముతానన్నాను. దాంతో మేమంతా బాబా దగ్గరకు వెళ్ళాము. మాధవరావు, మరికొంతమంది భక్తులు, "బాబా! పురాణాలు నిజమా?" అని అడిగారు.

సాయిబాబా: అవును, నిజమే!

భక్తులు: శ్రీరాముడు, శ్రీకృష్ణుడి గురించి మీ అభిప్రాయమేమిటి?

సాయిబాబా: వాళ్ళు గొప్ప మహాత్ములు. భగవంతుని అవతారాలు.

భక్తులు: ఈ నార్కే అవన్నీ నమ్మడం లేదు. మీరు దేవుడు కాదని కూడా అంటున్నాడు.

సాయిబాబా: అతను చెప్పింది నిజమే. కానీ నేను మీ తండ్రిని. మీరు అలా మాట్లాడకూడదు. మీరు మీ సకల శ్రేయస్సును నా నుండి పొందాల్సి ఉంది.

ఈవిధంగా బాబా తమ పరిమితులను అంగీకరించారు. అయినప్పటికీ భక్తుల అనుభవంలో ఆయన భగవంతుడే. అందులో సందేహమేమీ లేదు. భక్తులు భావించినంత మాత్రాన ఆయన తమని తాము భగవత్స్వరూపుడనని చెప్పుకోలేదు. తమ దైవత్వాన్ని స్వార్థప్రయోజనాలకు ఉపయోగించలేదు. చట్టాల నుండి మినహాయింపు కోరలేదు, సాంఘిక నైతిక ధర్మాలను అతిక్రమించలేదు.

బాబా ఆనందపారవశ్యంలో ఉన్నప్పుడు, "నేనే భగవంతుణ్ణి" అని చెప్పడం నేను విన్నాను. అందులో సందేహమేమీ లేదు. అయితే అలా ఎప్పుడో ఒక సందర్భంలో మాత్రమే జరిగేది. సాధారణంగా వారు భగవంతుడు ("ఫకీరు") ప్రసాదించిన శక్తుల ద్వారా తమకు అప్పగించిన కార్యాలను నెరవేరుస్తూ భగవంతుని భక్తునిగా మెలిగేవారు. అందులో ఎటువంటి మార్పూ ఉండేది కాదు. "భగవంతుడే యజమాని (అల్లాహ్ మాలిక్)", "భగవంతుడు మేలు చేస్తాడు (అల్లాహ్ భలా కరేగా)" అని బాబా తరచూ పలుకుతుండేవారు. "నేను భగవంతుని బానిసను", "నేనెప్పుడూ భగవంతుని స్మరిస్తుంటాను" అని కూడా చెబుతుండేవారు.

బాబా అస్ఖలిత బ్రహ్మచారులన్న విషయం వారి నేత్రాలలోని దివ్యతేజస్సు వ్యక్తపరిచేది. బాబా స్త్రీలను దూరంగా ఉంచేవారు, వారితో ముక్తసరిగా ఉండేవారు. పగటిపూట మాత్రమే చాలా కొద్దిమంది స్త్రీలను తమ పాదసేవ చేసుకోవడానికి అనుమతించేవారు, అది కూడా మోకాళ్ల వరకు మాత్రమే! బాబా వస్త్రధారణ, శరీర ప్రదర్శన ఎన్నడూ అసభ్యంగా ఉండేది కాదు. వారెప్పుడూ గౌరవప్రదమైన ప్రవర్తన కలిగి ఉండేవారు.

బాబా సద్గుణాలు (విశిష్ట స్వభావం)

బాబా నిష్పక్షపాతంగా వ్యవహరించేవారు. వారు రాజునూ, పేదనూ సమదృష్టితో చూసేవారు. ఎందరెందరో ధనవంతులు, ఉన్నతస్థానంలో ఉన్నవారు ఆయన దర్శనానికి వచ్చేవారు. వారి విషయంలో బాబా ఎటువంటి ప్రత్యేకతా కనబరిచేవారు కాదు. బాబా తమ దగ్గరకు వచ్చేవారి బాహ్యాన్నిగాక అంతరంగాలను, నిజతత్వాన్ని చూసేవారు. ఒకసారి తమ వద్దకు వచ్చిన ఒక పేదవాణ్ణి చూసి, "అతని వద్ద చాలా పైసలున్నాయ"ని గౌరవించడం నేను గమనించాను. అతడెంతో పుణ్యాత్ముడని బాబా భావం.

కఠిన న్యాయం

బాబా వంటి మహాత్ముల గొప్పతనాన్ని వారి చుట్టూ ఉన్న వ్యక్తుల గుణగణాలను బట్టి నిర్ధారించడం సరికాదు. బాబా వద్దకు ఎక్కువగా అత్యాశాపరులు, వేశ్యలు, దుర్మార్గులు, పలురకాల పాపాలు చేసినవారు ప్రాపంచిక ప్రయోజనాలను పొందాలనే ఉద్దేశ్యంతో వస్తుండేవారు. వారు తమని తాము ఉద్ధరించుకోవడంలో బాబా సన్నిధిని ఉపయోగించుకోలేక పాపాలలో కూరుకుపోయినప్పుడు, బాబా వారిని వారి కర్మకు విడిచిపెట్టేవారు. బాబా న్యాయం కఠినంగా ఉండేది. "గర్భంలో అడ్డం తిరిగితే, బిడ్డనైనా సరే, కోసి బయటకు తీయవలసిందే" అని అంటారు బాబా.

భయంకరమైన అంటువ్యాధుల బారినపడినవాళ్లతో, ఆ వ్యాధికారక శక్తులతో బాబా ఎంతో ధైర్యంగా మెలిగేవారు. ఆ వివరాలు మనకు తెలియవుగానీ బాబాకు బాగా తెలుసు. బాబా ఆరోగ్య విషయంలో తీసుకోవాల్సిన కనీస జాగ్రత్తలను కూడా లక్ష్యపెట్టక వ్యాధిగ్రస్తులపై ప్రేమ, ఆదరణ చూపి భక్తులలో విశ్వాసాన్ని నింపేవారు. బాబా చుట్టూ కుష్ఠురోగులు ఉండేవారు. వాళ్ళు ఆయన పాదాలు ఒత్తేవారు. వాళ్లలో ఒకరికి ఆ వ్యాధి నయమై ఆరోగ్యవంతుడయ్యాడు. బాబా ఒక కుష్ఠురోగిని ధుని నుండి ఊదీ తీసి భక్తులకు ప్రసాదంగా పంచమని, వ్యాధిగ్రస్తుల నోట్లో వేయమని చెప్పేవారు. అతడు వారి ఆదేశాన్ని పాటించేవాడు. నాకు తెలిసినంతవరకూ ఎవరికీ ఎటువంటి హానీ జరగలేదు.

చివరిగా  శ్రీ హరిసీతారాం దీక్షిత్ గారికి 4/3/1918 వ తారీఖున శ్రీ గణేష్ గోవింద్ నార్కే వ్రాసిన ఉత్తర సారాంశం.....

1918, మార్చి 2న 'నాథ షష్టి' (శ్రీ ఏకనాథ్ మహరాజ్ పుణ్యతిథి) జరిగింది. ఆరోజు మధ్యాహ్నం బాబా చాలామంది భక్తులను అజీబాయి అనే వృద్ధురాలు ఏకనాథ్ మహారాజ్ చరిత్రపై చేసే పురాణ పఠనానికి పంపారు. అక్కడ అజీబాయి తన మధురమైన స్వరంతో నాథ చరిత్రను చక్కగా వివరించింది. ఇక్కడ బాబా తమ భోజనానంతరం నామదేవ్, కబీర్ల గురించిన విషయాలు చెప్పారు. రాత్రి భోజన సమయంలో హఠాత్తుగా బాబా తీవ్రమైన కోపంతో విరుచుకుపడి తాత్యాతో గొడవపడ్డారు. భోజన పదార్థాలను తాకేముందు ఆయన ఉగ్రనరసింహావతారాన్ని దాల్చి దాదాతో, “అతనిని బయటకు నెట్టేయండి. లేదంటే నేనే క్రిందకు వెళతాను” అని అన్నారు. ఆవేశంలో తాత్యాను కొట్టడానికి రెండు రాళ్ళను తీసుకున్నారు. దాంతో తాత్యా క్రిందకు వచ్చాడు. కానీ, “కనీసం పండ్లైనా తీసుకోకుంటే బాబాను చావడికి వెళ్ళనివ్వన”ని మొండిపట్టు పట్టాడు. 

రాత్రి గం.8-45 నిమిషాలకి గంట మ్రోగింది. భక్తులందరూ ప్రోగయ్యారు. భజన ప్రారంభమైంది. కానీ తాత్యా అలిగి కూర్చున్నాడు. దాదా ద్వారా తాత్యాకు కబురు పంపారు బాబా. కానీ తాత్యా తాను పట్టిన పట్టు విడువలేదు, బాబా పండ్లు తినడానికి ఇష్టపడలేదు. 9.30 అయింది, 10.30 అయింది. మండపం అంతా స్త్రీ, పురుషులతో నిండిపోయి ఉంది. పల్లకీ సిద్ధంగా ఉంది. శ్యామకర్ణ మశీదు గేటు వద్ద నిలబడి ఉంది. భజన ఉచ్ఛస్వరాన్ని అందుకుని మంచి జోరుగా సాగుతోంది. బాబా తమ ఆసనం మీద నుండి లేచి అక్కడున్న ఒక చిన్న స్టూల్ వద్దకు వచ్చారు. ఒక్క మాటైనా మాట్లాడకుండా మౌనంగా స్తంభం వద్ద కూర్చున్నారు. “పైఠానులో పల్లకీ బయలుదేరేంతవరకు బాబా ఇలాగే ఆలస్యం చేస్తారు” అని కొందరన్నారు. అసలు వాళ్ళంతా పైఠానులోనే ఉన్నట్లు భక్తిపారవశ్యంతో భజన చేస్తూ నాట్యం కూడా చేయసాగారు. 11 గంటలయింది. ఇంటికి వెళ్ళడానికి దాదా అనుమతిని అడిగాడు. “ఎక్కడకు వెళతావు? కూర్చో!” అన్నారు బాబా. 'ఒకసారి బాబా అనారోగ్యంతో ఉన్నప్పుడు దర్బారు నిర్వహించారు, ఇప్పుడు కూడా అలాగే నిర్వహిస్తారా ఏమిటి?' అని అందరికీ అనిపించసాగింది. తేడా ఏమిటంటే ఆరోజు సభామండపం చాలా ప్రశాంతంగా ఉంది, ఈరోజు భజనతో ఎంతో ఉత్సాహంగా సర్వత్రా ఆనందమే ఆనందం! రెండూ కూడా చావడి ఉత్సవరోజులే! చివరకు తాత్యా తన మొండిపట్టు విడిచాడు. కానీ బాబా చావడికి "నేను వెళ్లన"ని పట్టుబట్టారు. తరువాత దాదాతో, “బాగా ప్రొద్దుపోయింది, ఇక వెళ్ళు” అని అన్నారు. భజన బృందాన్ని, అక్కడున్న వారిని తిట్టిపోసి భజన ఆపుచేశారు. మహల్సాపతితో, “పద, మనం తకియాకు వెళదాం” అని అన్నారు. తాత్యా పైకి వెళ్ళాడు. బాబా అతనితో, “అందరినీ బయటకు తరిమేయమ"ని చెప్పారు. కొంతసేపటి తరువాత తాత్యాను కూడా వెళ్ళమని చెప్పారు. అందరూ తమ తమ ఇళ్ళకి వెళ్ళిపోయారు. బాపూసాహెబ్ కూడా వెళ్ళాడు. బాబా తమ ఆసనం పైన కూర్చున్నారు. నేను, ఖడకే మొదలైనవారం మాత్రమే మశీదులో ఉన్నాము. బాబా మళ్ళీ కోపం తెచ్చుకుని విపరీతంగా తిట్టసాగారు. ఆయన తిట్టినవాళ్ళల్లో మా పేర్లు కూడా ఉన్నాయి. చివరకు రాత్రి 12 గంటల ప్రాంతంలో “పదండి” అని అన్నారు. హడావుడిగా గంటను మరలా మ్రోగించారు. తాత్యా, బాపూసాహెబ్ వచ్చారు. ఎప్పటిలాగానే చావడి ఉత్సవం ఎంతో ఆనందదాయకంగా జరిగింది. 'నాథ షష్టి లీల' అని అందరూ అనుకున్నారు.

మరుసటిరోజు ఉదయం దర్బారులో ఈ విషయంపైనే సుదీర్ఘంగా చర్చ జరిగి లేచేటప్పటికి 10:30 అయింది. తాత్యా గోడ వద్దకు వచ్చి, "ఏం బాబా, 'ఈరోజు నాథ షష్టి, రాత్రి రెండవఝాము (పన్నెండు గంటలు) వరకు భజన చేయండి' అని మాతో స్పష్టంగా చెపితే, మేము వినమా, ఆడమా?" అని బాబాను అడిగాడు. అందుకు బాబా, "నువ్వు, బాపూసాహెబ్, మీరంతా ఎప్పుడూ ఆడుతూనే ఉన్నారు" అని అన్నారు. లెండీ నుండి తిరిగి వచ్చేటప్పుడు భక్తులు బాబాను, "నిన్న ఎందుకు ఆలస్యం అయింది?" అని అడిగారు. ఏదేమైనా, ఇక్కడ చాలా ఆనందంగా ఉంది.

సమాప్తం...

Source: Devotees' Experiences of Sri Sai Baba by Sri.B.V.Narasimha Swamiji) 
http://bonjanrao.blogspot.com/2012/10/prof-g-g-narke.html
Shri Sai Leela Magazine, Shravan, Shaké 1845, Year I, Vol. VI

 


ముందు భాగం కోసం

బాబా పాదుకలు తాకండి.



నిర్ధిష్టమైన భాగం కోసం పైన నెంబర్లను తాకితే, ఆ నెంబరుకి సంబంధించిన భాగం ఓపెన్ అవుతుంది.

5 comments:

  1. 🙏🌷🙏 సూక్ష్మ జ్ఞాన సంపన్న..కాల కాలాంతాయ..
    నిర్వి కల్పాయ.. నిరంజనాయ.. షిరిడి నాధాయ.. సద్గురు సాయినాథ నమో నమామి🙏🌷🙏

    ReplyDelete
  2. Om Sai
    Sri Sai
    Jaya Jaya Sai
    🙏🙏🙏

    ReplyDelete
  3. Om Sai Ram 🙏🌹🙏🌹🙏
    ఓం శ్రీ సాయినాధయ నమః🙏🙏
    ఓం శ్రీసాయి ఆరోగ్య క్షేమదాయ నమః🙏🙏

    ReplyDelete
  4. ఓం సాయిరాం...🌹🙏🏻🌹

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo