1. మా డబ్బులు మాకొచ్చేలా చేసిన బాబా2. బాబా ప్రేమ
మా డబ్బులు మాకొచ్చేలా చేసిన బాబా
ఓం శ్రీ సాయినాథాయ నమః. సాయిమహరాజుకు, సాయిబంధువులకు, సాయి మహరాజ్ సన్నిధి బ్లాగును నిర్వహిస్తున్న సాయికి నా నమస్కారాలు. నేను గత 20 సంవత్సరాల నుండి మన సాయికి భక్తుడిని. ఈ ఐదేళ్లలో సాయి నాకు చాలా అనుభవాలు ప్రసాదించారు. అవి ఇంతకుముందు ఈ సాయి మహరాజ్ సన్నిధి ద్వారా మీతో పంచుకున్నాను. సాయి అనుగ్రహంతో ఇంకొక అనుభవం పంచుకునేందుకు నేనిప్పుడు మీ ముందుకు వచ్చాను. నేను ఎనిమిది సంవత్సరాల క్రితం మా తోడల్లుడి ఊరు ప్రక్కన ఉన్న ఒక ఊరిలో మూడు ఎకరాల 26 గుంటల పొలం కొన్నాను. దాన్ని అతనే నాకు ఇప్పించాడు. ఆ పొలం తీసుకున్న సమయంలో నేను అక్కడికి వెళ్లేసరికే పొలం సర్వే పూర్తిచేసి మా తోడల్లుడు నాతో, "భూమి సరిగానే ఉంది, పైగా నాలుగు ఎకరాలు ఉంది. అదంతా నీకే వస్తుంది" అన్నాడు. నేను అతనితో, "అన్నయ్యా, మూడు ఎకరాల 26 గుంటల భూమే నాకు చాలు. నాది కానిది నాకు ఎందుకు?" అని ఆ భూమి తీసుకున్నాను. అప్పటినుండి రెండు సంవత్సరాలపాటు మా తోడల్లుడే ఆ భూమిలో పంట పండించుకున్నాడు. నాకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. రెండు సంవత్సరాల తర్వాత నేను మా మామగారితో, "మీరు ఈ పొలం ఎవరిచేతనైనా పండించండి" అని చెప్పాను. అప్పుడు ఆ భూమిని ఒక రైతుకి అప్పగిస్తే, ఆ రైతు భూమిలో వేసే విత్తనాల ఆధారంగా, "ఈ భూమి మూడు ఎకరాల ఇరవైఆరు గుంటలు లేదు. తక్కువగా ఉంది" అని చెప్పాడు. ఆ మాట విన్న మేము నిర్ఘాంతపోయాము. దాంతో, "మళ్లీ సర్వే చేద్దాం" అని మా తోడల్లుడిని అడిగితే అతను ఇప్పుడు, అప్పుడు అంటూ మాట దాటేస్తూ ఆరు సంవత్సరాల పాటు మమ్మల్ని వేధించాడు. అడగ్గా, అడగ్గా చివరికి 8వ సంవత్సరంలో, "సర్వే చేయిద్దాం, రండి" అని పిలిచాడు. సరేనని, తీరా అక్కడికి వెళ్తే, మాకు ఇప్పించేటప్పుడు ఒకేచోట చూపిన మూడు ఎకరాల 26 గుంటల భూమిని కాస్తా ఇప్పుడు ముక్కలు ముక్కలుగా ఒక్కో భాగం ఒక్కో దగ్గర చూపిస్తూ, ‘హైటెన్షన్ విద్యుత్ తీగలకు సంబంధించిన స్తంభం ఉన్న చోటు కూడా నీకే చెందుతుంద’ని చెప్పాడు. "అన్నయ్యా, ఇలా అయితే నేను నష్టపోతాన"ని చెప్పినా అతను వినిపించుకోలేదు. అప్పుడుగానీ నాకు అర్థం కాలేదు, అతను అన్నాళ్ళూ మాతో ప్రేమను నటించి మమ్మల్ని మోసం చేశాడని. అంతేకాదు, ఇందులో తన స్వార్థానికి తోడు మాకు భూమి అమ్మిన రైతు స్వార్థం కూడా ఉందనీ, వాళ్ళు దళితులనీ, ఏమైనా అంటే కేసులు పెడతామని కూడా బెదిరించాడు. నేను ఇంటికి వచ్చి నా భార్యతో, "మీ బావ నమ్మించి మనల్ని మోసం చేశాడు" అని చెప్పాను. అది విని ఆమె చాలా బాధపడింది. మా తోడల్లుడు వాళ్లకు(దళితులు) మద్దతునివ్వటం, వాళ్ళు నన్ను భూమి దగ్గరకు రానివ్వకపోవడం అంతా ఒక్క నెలలోనే జరిగిపోయాయి. ఇక మాకు దిక్కు అయిన బాబా ముందు కన్నీళ్లతో మా బాధను చెప్పుకున్నాం. "ఒక వ్యక్తి ద్వారా మీ సమస్య పరిష్కారం అవుతుంది. మీకు విజయం సిద్ధిస్తుంది" అని బాబా మాకు ఒక సందేశం ఇచ్చారు.
బాబా చెప్పిన ఆ వ్యక్తి మరెవరో కాదు, మా పెద్ద తోడల్లుడి కొడుకు(మా బాబు). అతనొచ్చి, "బాబాయ్, ఈ భూమి సమస్య నేను చూసుకుంటాను. నేను ఎవరికైనా అమ్మిపిస్తాను" అని మాకు ధైర్యం చెప్పాడు. తరువాత మా బాబు ఆ భూమి కొనడానికి ముందుకొచ్చినవాళ్ళను తీసుకుని భూమి చూపించడానికి వెళ్తే, ఆ దళితులు కొట్లాటకు వచ్చారు. మా బాబు వాళ్ళకి భయపడలేదు. ఆ దళితులను రెచ్చగొడుతున్నది మా తోడల్లుడేనని తెలిసినా మేము ఏమీ అనక మౌనంగా ఉన్నాము. ఒకరోజు అతను మా ఇంటికి ఫోన్ చేసి, నన్ను, నా భార్యను చెప్పడానికి వీలుకాని విధంగా నానా మాటలు తిట్టాడు. అయినా ఆ మూర్ఖునితో వాదించటం ఎందుకని మేము ఊరుకున్నాము. ఒకరోజు మా బాబు నాకు ఫోన్ చేసి, "బాబాయ్, ఒక పార్టీ భూమి దగ్గరకు వస్తున్నారు. నువ్వు ఒకసారి అక్కడికి రా" అని చెప్పాడు. సరేనని నేను వెళ్తే, మా తోడల్లుడు ఆ దళితుల ముందు తనకిష్టమొచ్చినట్లు నన్ను బూతులు తిట్టాడు. నేను అతనితో, "అన్యాయం చేసింది నువ్వా, నేనా? 8 ఏళ్ళ క్రితం నాకు భూమిని ఇప్పించినప్పుడు ఏవిధంగా చూపించావు? ఇప్పుడెలా ఉంది?" అని ఒకేఒక్క మాట అడిగి, మనస్సు చిన్నబుచ్చుకుని, కళ్ళలో నీళ్లు నింపుకుని, 'నావాళ్ళే నన్ను మోసం చేశారు' అని అనుకుంటూ వచ్చేశాను.
ఇక మా బాబు ఎలాగైనా ఆ భూమిని అమ్మాలని పట్టుబట్టి ఒక పార్టీకి అమ్మడానికి దాదాపు నిర్ణయించాడు. వాళ్లు భూమి సర్వే చేసుకోడానికి వస్తే, రైతులు(దళితులు) భూమి కొనడానికి వచ్చినవాళ్లపై, సర్వే చేసేవాళ్లపై కొట్లాటకు దిగారు. వాళ్ళని సర్వే చేయనివ్వకుండా 4 నెలలు బాధపెట్టారు. మేము బాబాను ఒకటే వేడుకున్నాము, "బాబా! వాళ్లతో పోట్లాడే శక్తి మాకు లేదు. ఎందుకంటే, మా బంధువులే వాళ్ళవైపు ఉండి వాళ్ళని రెచ్చగొడుతున్నారు. మీరే ఎలాగైనా భూమి రిజిస్ట్రేషన్ అయి మా డబ్బులు మాకు వచ్చేలా చేయండి తండ్రీ" అని. సాయి అద్భుతం చేశారు. మేము ఇక వదిలేద్దామనుకున్న ఆ భూమిని రిజిస్ట్రేషన్ చేయించి, మా డబ్బులు మాకు వచ్చేలా చేశారు. సాయియే మా బాబు రూపంలో వచ్చి, మాకు సహాయం చేశారని మేము అనుకుంటున్నాము. అనుకోవడమేమిటి, సాయియే చేశారు. "సాయీ! ఎల్లవేళలా ఇలాగే మీరు నాకు తోడుగా ఉండి ముందుకు నడిపించండి".
సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు!
బాబా ప్రేమ
అందరికీ నమస్తే. నా పేరు అంజలి. ఈమధ్యకాలంలో బాబా నాపై చూపిన ప్రేమను మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. వాటిని పంచుకోవడంలో ఆలస్యమైనందుకు ఈ దీనురాలిని క్షమించమని ముందుగా బాబాను వేడుకుంటున్నాను. నాకు చాలా రోజుల నుంచి కంటిరెప్ప మీద చిన్న చిన్న గడ్డలు రెండు ఉన్నాయి. రోజులు గడుస్తున్నా అవి తగ్గకపోవడంతో ఇటీవల ఒకరోజు నేను బాబాకు నమస్కరించుకుని, "ఎలాగైనా వాటిని తగ్గించమ"ని చెప్పుకుని బాధపడ్డాను. బాబా కృప చూడండి! తెల్లవారేసరికి ఆ గడ్డలు చాలావరకు తగ్గాయి. చాలా స్వల్పంగా మాత్రమే మిగిలివున్నాయి. బాబా దయతో అవి కూడా తొందరలోనే పూర్తిగా తగ్గిపోతాయి. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".
ఈమధ్య నాకు వైట్ డిశ్చార్జ్ ఎక్కువగా అవుతుంటే భయమేసి, "బాబా! ఎలాగైనా నా సమస్యను తగ్గించండి. ఈ అనుభవాన్ని మీ బ్లాగులో పంచుకుంటాను బాబా" అని అనుకున్నాను. అంతే, బాబా దయవల్ల తెల్లవారేసరికి తగ్గిపోయింది. "ధన్యవాదాలు బాబా”.
ఒకరోజు మా ఆఫీసులో కంప్యూటర్ పనిచేయలేదు. అప్పుడు నేను బాబాను తలచుకుని, "ఎలాగైనా సిస్టమ్ ఆన్ అయ్యేలా చూడండి బాబా" అని అనుకున్నాను. అంతే, కొంతసేపటికి సిస్టమ్ ఆన్ అయి మామూలుగా పనిచేసింది. అంతా బాబా దయ.
2021, ఆగస్టు మూడవ వారంలో మా కుటుంబంలో అందరం కలిసి ఒక పనిమీద గుంటూరు వెళ్ళాము. అక్కడికి వెళ్లే ముందు బాబా గుడికి వెళ్లి, బాబాకు దణ్ణం పెట్టుకుని, "బాబా! వెళ్లే పని విజయవంతమయ్యేలా చూడండి. నాకు, మావారికి, పిల్లలకి ఎలాంటి సమస్యలు లేకుండా తిరిగి ఇంటికి క్షేమంగా వచ్చేలా చూడు తండ్రీ" అని చెప్పుకుని వెళ్ళాము. బాబా దయవల్ల వెళ్లిన పని సజావుగా జరిగి, అందరం క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చాము. అందరమూ ఆరోగ్యంగా ఉన్నాము. బాబా దయవుంటే ఎలాంటి సమస్యలు మన దరి చేరవు.
బాబా కృపతో నా జీవితంలో ఎప్పటినుండో ఎదురుచూస్తున్న ఒక ముఖ్యమైన విషయం జరగనుంది. తొందరలో బాబా దాన్ని నెరవేరుస్తారని అనుకుంటున్నాను. పూర్తయిన తర్వాత ఆ అనుభవాన్ని మీతో పంచుకుంటాను. ఈ బ్లాగులో చెప్పుకుంటే బాబాతో చెప్పుకున్నట్లే! "అన్నింటికీ ధన్యవాదాలు బాబా. మీకు తెలుసు బాబా, మీరు లేనిదే నేను కనీసం ఊపిరి కూడా పీల్చలేను. అంతలా మీరు దగ్గరుండి నన్ను నడిపిస్తున్నారు తండ్రీ. మరోసారి ధన్యవాదాలు బాబా".
అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!
Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������
ReplyDelete860 DAYS
ReplyDeleteSairam
Om Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🕉🙏❤😃🌺🥰🌹😀🌸😊
ReplyDeleteOm sai ram baba amma Arogyam bagundali thandri pleaseeee
ReplyDeleteBaba santosh life bagundali thandri
ReplyDeleteBaba pillalu healthy ga vundali thandri
ReplyDeleteSai nuvve mammalani rakshinchali thandri🙏🙏🙏
ReplyDelete