సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 892వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. అక్కున చేర్చుకొని ఆదరిస్తున్న బాబా
2. బాబా నాపై చూపిన అనుగ్రహం
3. అనుకున్నది నెరవేర్చిన బాబా

అక్కున చేర్చుకొని ఆదరిస్తున్న బాబా


ఓం శ్రీసచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథాయ నమః. ముందుగా, ఈ బ్లాగును నిర్వహిస్తున్న సాయికి నా నమస్కారం. తోటి సాయిబంధువులందరికీ నా నమస్కారాలు. నా పేరు సాహిత్య. ఈరోజు నేను నా మూడవ అనుభవాన్ని మీ అందరితో పంచుకోబోతున్నాను. “ఈ అనుభవాన్ని ఇంత ఆలస్యంగా పంచుకుంటున్నందుకు నన్ను క్షమించండి బాబా”. ప్రస్తుతం నేను ఏడు నెలల గర్భవతిని. నా ప్రెగ్నెన్సీ 3వ నెలలో ఉన్నప్పుడు నాకు బ్లీడింగ్ సమస్య ఎదురైంది. దాంతో ఎంతో భయపడి హాస్పిటల్‌కి వెళితే, నన్ను పరీక్షించిన డాక్టర్ నాకు ‘లో లైయింగ్ ప్లాజెంటా’ సమస్య ఉందని చెప్పి ఇంజక్షన్స్, మందులు ఇచ్చి, నన్ను పూర్తి బెడ్ రెస్ట్‌లో ఉండాలని చెప్పారు. నేను 3, 4, 5 నెలల వరకు పూర్తిగా బెడ్ రెస్ట్‌లో ఉన్నాను. మావారు, మా అత్తగారు, మా మామగారు అందరూ నన్ను చాలా చాలా బాగా చూసుకున్నారు. నేను ఏం కావాలంటే అవి తెచ్చిపెట్టేవాళ్ళు. అయితే, ఇలా ఏ పనీ చేయకుండా ఊరికే ఉండేసరికి నాకు పిచ్చి పిచ్చి ఆలోచనలు వచ్చేవి. నాలో నేనే ఏడవటం, ఏదైనా ఆహారం బాగాలేకపోతే కోపం, ఏదోలా ఉండేది. ఒకరకంగా ఖాళీగా ఉండి నరకం అనుభవించాను. దీనివల్ల పాపం మావారికి కూడా ఇబ్బందిగా ఉండేది. ఈ సమయంలో దేవుడికి సంబంధించిన పుస్తకాలేమీ చదువుకోలేదు. ఒకరకంగా దేవుడిని మరిచాను. సరిగ్గా అప్పుడే 4వ నెల మధ్యలో సాయిబాబా నన్ను తమ దగ్గరకు చేర్చుకున్నారు. “నా భక్తులు ఎంత దూరాన ఉన్నా పిచ్చుక కాలికి దారం కట్టి లాగినట్లు వారిని నా దగ్గరకు చేర్చుకుంటాను” అని బాబా చెప్పినట్టు, నన్ను ఆయన స్మరణలో మునిగేట్టు చేశారు బాబా. ఒకరోజు యథాలాపంగా ‘సాయిబాబా’ అని ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తే ‘సాయి మహరాజ్ సన్నిధి’ బ్లాగ్ కనపడటం, ఆ తరువాత ఏదో లింక్ మీద క్లిక్ చేయగానే ‘వాట్సాప్ మహాపారాయణ గ్రూపు’లో యాడ్ అవడం జరిగాయి. ఇంక నిదానంగా బాబా పట్ల నా భక్తి హెచ్చింది. మహాపారాయణ-7712 గ్రూపు ద్వారా ప్రతి గురువారం రెండు అధ్యాయాలు పారాయణ చేసేదాన్ని. అలాగే ఈ బ్లాగులో ప్రచురించే సాయిభక్తుల అనుభవాలు కూడా చదివేదాన్ని. భక్తుల అనుభవాలు చదివి స్ఫూర్తి పొంది చిన్నగా శ్రీసాయిసచ్చరిత్ర సప్తాహపారాయణ చేయడం ప్రారంభించాను. అలా జూలై 7వ తేదీన పారాయణ ప్రారంభించి జులై 12 నాటికి మొదటి పారాయణ, తరువాత జులై 14న ప్రారంభించి జులై 20 నాటికి రెండవ పారాయణ, ఆ తరువాత జులై 21న ప్రారంభించి జులై 27 నాటికి మూడవ పారాయణ పూర్తిచేసుకున్నాను. ఇదంతా బాబా దయ. అలాగే, ‘ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః’ అని పఠించడం కూడా ప్రారంభించాను.


ఇక నా అనుభవానికి వస్తే.. నేను బాబా మహాపారాయణ గ్రూపులో చేరిన కొన్నిరోజులకి నా సమస్య మెల్లగా తగ్గడం మొదలుపెట్టింది. 5వ నెలలో చేసిన TIFFA స్కానింగులో (ప్రెగ్నెన్సీ మహిళలకి చేసే ప్రధానమైన స్కానింగ్) అంతకుముందు క్రిందికి ఉన్న ప్లాజెంటా పైకి వచ్చిందనీ, అంతా బాగానే ఉందనీ తెలిసింది. దాంతో ఇక నేను ఆనందంగా తిరగవచ్చనీ, పనులు చేసుకోవచ్చనీ డాక్టర్ చెప్పారు. ఇది నిజంగా బాబా దయ. “థాంక్యూ సో మచ్ బాబా. ఐ లవ్ యు బాబా”.


ఇక అప్పటినుండి నేను పనులు చేయడం ప్రారంభించాను. బాబా పారాయణ కూడా ఆపలేదు. చాలా ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు నాకు ఏడవనెల. నా కోపం, చిరాకు అన్నీ మటుమాయం అయ్యాయి. ఇదంతా నిజంగా బాబా లీల. “బాబా, నేను ఏదైనా తప్పుగా రాసివుంటే నన్ను క్షమించండి. మీరు నాకు ప్రసాదించిన అన్నిటికీ థాంక్యూ సో మచ్”. నిజానికి ఈ అనుభవాన్ని నాకు బిడ్డ పుట్టిన తరువాత మహాపారాయణ గ్రూపులో పంచుకోవాలని అనుకున్నాను. కానీ ఈలోపే మీతో పంచుకోవాలని అనిపించింది. నాకు నవంబరులో డెలివరీ తేదీ ఇచ్చారు. బాబా అనుగ్రహంతో నా బిడ్డ ఆరోగ్యంగా, ఎలాంటి ఆటంకం లేకుండా పుడుతుందని నాకు నా సాయిబాబాపై పూర్తి నమ్మకం ఉంది. అందుకే ముందుగానే మీతో పంచుకున్నాను.


ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః.


బాబా నాపై చూపిన అనుగ్రహం


ఓంసాయి శ్రీసాయి జయజయసాయి.

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!


నా పేరు స్నేహ. నేను సాయిభక్తురాలిని. 'సాయీ' అని స్మరించినంతనే బాబా ఎన్నోసార్లు నాకొచ్చిన కష్టం నుండి విముక్తి కలిగించారు. బాబా ప్రసాదించిన అలాంటి కొన్ని అనుభవాలను నేనిప్పుడు మీతో పంచుకుంటున్నాను. 2021, ఆగస్టు 8న నాకు తలనొప్పి వచ్చింది. మామూలుగానే నాకు తలనొప్పి సమస్య ఉంది. ఆ రాత్రి నేను పడుకునేముందు, "బాబా! తెల్లవారేసరికల్లా తలనొప్పి తగ్గితే నా అనుభవాన్ని మీ బ్లాగులో పంచుకుంటాన"ని బాబాతో చెప్పుకున్నాను. బాబా దయతో మరుసటిరోజు ఉదయం నిద్రలేచేసరికి తలనొప్పి తగ్గిపోయింది. అంతకుముందు కూడా ఒకసారి నాకు తలనొప్పి వచ్చినప్పుడు అందరూ డాక్టర్ దగ్గరకి వెళ్ళమని చెప్పారు. అయితే డాక్టరుని సంప్రదించినా నొప్పి తగ్గలేదు. నాకు చాలా భయం వేసింది. సరిగ్గా అప్పుడే సాయిభక్తుల అనుభవాల గ్రూపులో చేరే అవకాశం నాకు వచ్చింది. నేను చాలా సంతోషించాను. అప్పుడు నేను బాబాకు మ్రొక్కుకోగానే నా తలనొప్పి తగ్గిపోయింది. అంతేకాదు, భక్తుల అనుభవాల గ్రూపులో చేరినప్పటినుంచి నాకు చాలారోజుల నుండి ఉన్న మోకాళ్ళ నొప్పులు కూడా తగ్గడం మొదలుపెట్టాయి. నేను సంతోషంగా సాయిబాబా గుడికి వెళ్లి, "బాబా! మీరు నా బాధను అర్థం చేసుకున్నారు. ధన్యవాదాలు బాబా" అని మనసారా బాబాకు నమస్కరించుకున్నాను. 


ఇటీవల ఒకరోజు మా బండి చెడిపోయింది. మా ఊరికి దగ్గర్లో ఉన్న బండి రిపేర్ చేసే అతను వచ్చి బండి బాగుచేయడానికి చాలా ప్రయత్నించాడు. కానీ ప్రయోజనం లేకపోయింది. అప్పుడు నేను, “సాయీ! మా భారం నీ మీదే వేశాము తండ్రీ. బండి బాగైతే నా అనుభవాన్ని మీ బ్లాగులో పంచుకుంటాను" అని అనుకున్నాను. వెంటనే బండి బాగైంది. "థాంక్యూ సో మచ్ సాయిబాబా”. చివరిగా, అందరూ బాగుండాలనీ, మీరంతా కూడా సాయిబాబా ప్రసాదించే అనుభవాలను పంచుకోవాలనీ విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!


అనుకున్నది నెరవేర్చిన బాబా


సాయిబంధువులందరికీ నా నమస్కారం. నేనొక సాయిభక్తురాలిని. బాబా నాకు ప్రసాదించిన ఒక చిన్న అనుభవాన్ని సాయి పరివారంతో పంచుకోవాలని అనుకుంటున్నాను. 2021, ఆగస్టు 8న మావారు నాతో, 'ఉద్యోగరీత్యా తాను వేరే సైట్‌కి వెళ్లాలని తన ఆఫీసులో చెప్పార'ని అన్నారు. అమావాస్య రోజున క్రొత్త చోట బాధ్యతలు తీసుకోవటమేమిటని నా మనసుకి అనిపించి, "మేరే బాబా! ఓ కరుణామయా! అమావాస్య రోజున కాకుండా 9వ తేదీన అక్కడికి వెళ్లేలా చేయండి తండ్రీ" అని బాబాను వేడుకున్నాను. తరువాత మావారిని, "ఆదివారం వెళ్తున్నారా?" అని అడిగాను. అందుకాయన, "నాకింకా ఆఫీసు నుంచి కాల్ రాలేదు, ఎప్పుడు వెళ్ళాలో వాళ్ళు ఫోన్ చేసి చెప్తారు" అని అన్నారు. నేను సరేనని ఊరుకున్నాను. ఆదివారం, అమావాస్య రోజు సాయంత్రం మావారు నాతో, "ఇప్పుడే ఆఫీసు నుంచి ఫోన్ వచ్చింది. రేపు సోమవారం నుంచి క్రొత్త సైట్‌కి వెళ్ళాలి" అని చెప్పారు. అది వింటూనే నా కళ్ళలో నీళ్లు ఆగలేదు. "హే మేరే బాబా! నేను అనుకున్నది నెరవేర్చావయ్యా. నా దయామయ తండ్రీ, మీకు ధన్యవాదాలు" అని అనుకున్నాను. నాకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా మేరే సాయి, కరుణామయ తండ్రి నాతో ఉంటూ మమ్మల్ని కాపాడుతున్నారు. “ధన్యవాదాలు బాబా”.


6 comments:

  1. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������

    ReplyDelete
  2. Om Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🕉🙏❤🌺😊🌼🌸🌹🥰😃

    ReplyDelete
  3. Om sai ram baba amma arogyam bagundali thandri pleaseeee

    ReplyDelete
  4. Baba ee gadda ni karginchu thandri please

    ReplyDelete
  5. Baba karthik ki santosh ki health bagundali thandri

    ReplyDelete
  6. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo